అభినయ దర్పణము/కింకిణీ లక్షణమ్

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search

కిజ్కిణీ లక్షణమ్‌.

కిజ్కిణ్యః కాంస్యరచితాః తామ్రేణ రజతేన వా. 31

సుస్వరాశ్చ సురూపాశ్చ సూక్ష్మా నక్షత్ర దేవతాః,
బన్ధయే న్నీలసూత్రేణ గ్రంథిభిశ్చ సమన్వితమ్‌. 32

శతద్వయం శతం వాపి పాదయోర్నాట్యకర్మణి,
శతంవా దక్షిణే పాదే ద్విశతం వామపాదకే. 33

తా. గజ్జెలు కంచువిగానైనను, రాగివిగానైనను, వెండివిగానైనను ఉండవలయును. అవి మంచిస్వరము గలవిగాను, అందమయినవిగాను, చిన్నవిగాను ఉండవలెను. నక్షత్రాధిదేవతగల అట్టి గజ్జెలను నల్లదారమునఁ గ్రుచ్చి గజ్జెగజ్జెకు ముడివేయవలయును. నాట్యమాడెడి కాలములయందు పాత్రము కాళ్ళలో ఇన్నూరిన్నూరుగాని నూరునూరుగాని గజ్జెలుండవలయును. లేనిచో కుడికాలియందు నూరును, ఎడమకాలియం దిన్నూరునైన నుండవలయును.

నట లక్షణమ్‌.

రూపవాన్ మధురాభాషీ కృతీ వాగ్మీ పటుస్తథా,
కులాంగనాసుతశ్చైవ శాస్త్రజ్ఞఓ మధురస్వరః. 34

గీతవాద్యాదినృత్యజ్ఞఓ సిద్ధకః ప్రతిభానవాన్,
ఏతాదృశగుణైర్యుక్తో నట ఇత్యుచ్యతే బుధైః. 35

తా. చక్కనివాఁడును, ఇంపుగ మాటలాడువాఁడును, పండితుఁడును, మాటకారియు, సమర్ధుఁడును, కులాంగనా సుతుఁడును, భరతశాస్త్ర పరిజ్ఞానము గలవాఁడును, మంచిశారీరము గలవాఁడును, గానవాద్యనృత్యాదులలో పూర్ణజ్ఞానము గలవాఁడును, పట్టుగలిగినవాఁడును, కల్పనాశక్తి గలవాఁడునగు వాఁడు నటుఁడని పెద్దలు చెప్పుదురు.

పాత్ర బహిఃప్రాణాః

మృదంగశ్చ సుతాళౌచ వేణుర్గీతి స్తతశ్శ్రుతిః,
ఏకవీణా కిజ్కిణీ చ గాయకశ్చ సువిశ్రుతః. 36

ఇత్యేవ మన్వయజ్ఞైశ్చ పాత్రప్రాణా బహిస్స్మృతాః,

తా. మృదంగము, మంచినాదముగల తాళములు, పిల్లనగ్రోవి, పాట, శ్రుతి, వీణ, గజ్జెలు, ప్రఖ్యాతుఁడైన గాయకుడు అనునవి నాట్యము చేసెడు పాత్రమునకు బహిఃప్రాణములని చెప్పఁబడును.

పాత్రాన్తఃప్రాణాః

జవస్థిరత్వ రేఖా చ భ్రమరీ దృష్టిరశ్రమః. 37

మేధా శ్రద్ధావచోగీతిస్త్వన్తః ప్రాణా దశస్మృతాః,

తా. వడి, నిలుకడ, సమత్వము, చపలత్వము, చూపు, శ్రమము లేమి, బుద్ధి, శ్రద్ధ, మంచిమాటలు, పాట ఈపదియును అంతఃప్రాణము లనఁబడును.

నీచ నాట్య లక్షణమ్‌.

అకృత్వా ప్రార్థనం పాత్రమాచ రేద్యది నాట్యకమ్‌. 38

తన్నాట్యం నీచ మిత్యాహుర్నాట్యశాస్త్ర విచక్షణాః,

తా. నటించెడి పాత్రము ఇష్టదేవతా ప్రార్ధనము మొదలగువానిని చేయకయే చేయు నాట్యము నీచనాట్యమని నాట్యశాస్త్రజ్ఞలు చెప్పుదురు.

నీచ నాట్య దర్శనఫలమ్‌.

నీచపాత్రకృతం నాట్యం యది పశ్యంతి మానవాః. 39

పుత్త్రహీనా భవిష్యంతి జాయంతే పశుయోనిషు,