అబలా సచ్చరిత్ర రత్నమాల/పద్మిని
పద్మిని
పత్యనుకూలా చతురా ప్రియంవదయా సురూపసంపూర్ణా
సహజస్నేహరసాల కులవనితా కేన తుల్యాస్యాత్ *
ఈ పతివ్రతాతిలకము పండ్రెండవ శతాబ్దారంభమునందు జన్మించెను. ఈమె తండ్రి సింహళద్వీప వాసియగు హమీరసింహ చవ్హాణుడు. ఈ సతీరత్న మసమాన రూపవతి యగుటచే జననీజనకు లామెకు పద్మిని యని పేరిడిరి. పద్మిని వివాహయోగ్యయైన పిదప , రజపుతస్థానములోనిదైన మేవాడ్ అను సంస్థానమున కధీశ్వరుడగు భీమసింహ రాణాగారికి నామె నిచ్చి వివాహము జేసిరి. వివాహానంతరము పద్మిని తనరూపమునకుదోడు, సుగుణములు సహాయపడగా భర్తకు బ్రాణతుల్యురాలాయెను.
ఆ కాలమునం దా రాజ్యము రాణాలక్ష్మణసింహుడను బాలరాజు పరిపాలనలో నుండెను. కాని, ఆతడు బాలుడగుటవలన, నాతని పినతండ్రియగు భీమసింహుడే రాజ్యతంత్రములను నడుపుచుండెను. భీమసింహుడు మిగుల శూరుడును, చతురుడును నగుటవలన నాతని రాజ్యమున కంతగా శత్రులభయము లేక, ప్రజలు సుఖముగా నుండిరి. కాని వారి దురదృష్టమువలన స్వల్పకాలములోనే డిల్లీ బాదుషాయగు అల్లాఉద్దీను మేవాడు
- పతికి ననుకూలయైనట్టియు, ప్రియభాషిణియు, సురూపవతియు నైన కులవనితతో నెవ్వరును సమానులు కారు. రాజధానియగు చితురుపై దండువెడలెను. ఈ బాదుషా పద్మిని యొక్క యసమాన సౌందర్యము విని యామె యం దధికాభిలాషి యయ్యెను. అసహాయశూరులగు రజపూతులతో బోరి గెలుచుట దుస్తరమని తలచి యా బాదుషా పద్మినిని వశపరుచుకొన జూచెను. కాన ప్రథమమునం దాయన తన సైనికులతో జతురుసంస్థాన ప్రాంతభూమిని వసియించి, గుప్తముగా ననేక దాసీజనులకు ద్రవ్యాశజూపి వారు తనరూపము, ఐశ్వర్యము మొదలగునవి పద్మినికి దెలిపి, యామె తనకు వశవర్తిని యగుట కనేక యుక్తులను బన్నునటుల జేసెను. కాని సతీమణి యగు పద్మినియొద్ద మ్లేచ్ఛప్రభువుయొక్క తుచ్ఛయుక్తు లెంత మాత్రమును బనికిరాక నిష్ఫలములయ్యెను. అందుకు బాదుషా మిగుల చింతించి తనకు పద్మిని పైని గలిగిన దురుద్దేశ్యమును మరల్చుకొనజాలక, రజపూతులతో యుద్ధముజేసి పద్మినిని చెరబట్ట నిశ్చయించెను. అల్లాఉద్దీను ఆ సమయమునందు "పద్మినిని చేసికొనుట యొండె, ఈ రాజపుత్రస్థానమునందే యుద్ధము చేసి ప్రాణములు విడుచుట యొండె" అని ప్రతిన పట్టెను. తదనంతర మాతడు తన సైన్యములతో నారాజధానిని ముట్టడించెను.
అల్లాఉద్దీను తమ నగరమును ముట్టడించుట విని యసమానశౌర్యధుర్యులగు రజపూతలు యుద్ధసన్నద్ధులయిరి. అంత వారందరు భీమసింహుని యాజ్ఞప్రకారము బైలువెడలి ప్రతిపక్షులతో ఘోరముగా బోరదొడగిరి. ఇట్లా యుభయ సైన్యములంగల వీరులు కొన్ని మాసములవరకును యుద్ధముచేసిరి. కాని యా రెండు తెగలవారిలో నెవ్వరును వెనుకదీయరైరి. రజపూతు సర్దార్లనేకులు రణరంగమునందు హతులయిరి. రజపూతులెంత దృడనిశ్చయముతో బోరినను తురక సైన్యములు బీరువోకుండుటయు, నానాటికి రజపూతుసైన్యములు పలుచ బడుటయు గని భీమసింహుడు మిగుల చింతాక్రాంతుడయ్యెను. తుదకాతడు ప్రజాక్షయమున కోర్వజాలక డిల్లీశ్వరునితో సంధిసేయనెంచి యందుకై గొందరు మంత్రుల నంపెను. కాని యదిపొసగినదికాదు. సంధి దెల్పవచ్చినవారితో అల్లాఉద్దీను తనకు పద్మిని దొరికినం గాని రణమాగదని స్పష్టముగా దెలిపెను, ఈ వార్త వినగానే శూర రజపూతులందరు పడగ ద్రొక్కిన సర్పముల భంగి అదిరిపడి, తమ యందరి ప్రాణములు పోవు వరకును యుద్ధముజేసెదమని విజృంభించిరి. అందుపై నాయిరు వాగు సైన్యంబులుం దలపడి యుద్ధము చేయుచుండిరి.
ఇట్లు పదునెనిమిది మాసములు యుద్ధము జరుగుచుండెను. కాని శూరులగు రజపూతులు బాదుషా సైనికులను బట్టణములోనికి భొవ నియ్యకుండిరి. అల్లాఉద్దీను వారి నిశ్చయముగని రజపూతుల యుద్ధమునం దోడించి పద్మినిని బట్టు ప్రయత్నము మానుకొనవలసినవాడాయెను. యుద్ధము మానుకొన్నను పద్మినియం దతనికి గల వ్యామోహ మతని నాపొలిమేరదాటి పోనియ్యకుండెను. అందువలన నతడు భీమసింహున కిట్లు వర్తమాన మంపెను. "నాకు పద్మిని దొరుకునన్న యాసలేదు. కాని యామె రూప మొకసారియయినను మీరు నా కగుపరచినయెడల నేను సైన్యసహితముగా డిల్లీకి మరలి వెళ్ళుదును." ఈ వర్తమానము విని కొంతరోషము గలగినను పోరునకు విసుగు కలిగిన రజపూతు లందున కొప్పుకొనిరి. తదనంతర మా సంగతి భీమసింహుడు పద్మినికి దెలుపగా నానె తాను ప్రత్యక్షముగా నామ్లేచ్చునికంట బడనని స్పష్టముగా దెల్పెను. అందుపయి భీమసింహు డామెకు నామె డిల్లీశ్వరునకు గనిపించని పక్షమున రజపూతులకు గలుగు బాధల నెరిగింపగా, నామె యద్ధమునందు దన ప్రతిబింబమును బాదుషాకు జూప నొప్పుకొనెను. అప్పుడు "పద్మిని నీ కగు పడజాలదు; గాన నామె ప్రతిబింబమును జూపెద" మని చిత్తూరునుండి అల్లాఉద్దీనుకు జెప్పి పంపిరి.
అందుపయి యుద్ధము నాపి నియమితదివసంబున నొకరిద్దరు సేవకులతో అల్లాఉద్దీను పద్మినిని జూచుటకయి చితురు కోటలోనికి వచ్చెను. అచట భీమసింహుగా రాయనకు దగుమర్యాదలుచేసి యాతనికి దర్పణంబున పద్మినిరూపమును జూపెను. తాను విన్నదానికంటెను పద్మిని విశేషరూపవతి యగుట గనినందున, బాదుషాయొక్క చిత్తచాంచల్య మినుమడించెను. దానిని మనమునం దడచుకొని యామ్లేచ్ఛప్రభువు మరలిపోవునపుడు తనకృత్యమునకు బశ్చాత్తాపపరుడయి నటుల భీమసింహునితో నిట్టులనియె. "భీమసింగుగారూ! నేను చేసిన నేరమును మన్నించవలయును. నే డాదిగా చిత్తూరు సంస్థానీకులతో నేను సఖ్యము చేయదలచితిని. ఇంతవరకు మీ యోగ్యత తెలియకపోవుటవలన నే వైరము తల పెట్టితిని. కాని నేడు మీ యోగ్యత నా కన్నులార చూడగా మీవంటి మిత్రులు దొరకుట నాకు మిగుల శ్రేయస్కరమని తోచు చున్నది. కాన, నీ ప్రధమదివసంబున తమరు నావిడిదికి దయచేసి నే చేయుపూజల నంగీకరింతురని నమ్ముచున్నాను. ఈ నా చిన్నవిన్నపము మీ రంగీకరింపక తప్పదు. "బాదుషా యొక్క నమ్రత్వమును కని యాతని మాటలనునమ్మి భీమసింహుడు మితపరివారముతో నాతని శిబిరంబునకు బ్రయాణమయ్యెను.
అల్లాఉద్దీను మిగుల దుర్మార్గుడగుటవలన రాజుగారిని నమ్మించి తనతో దోడుకొనివచ్చి, తనశిబిరసమీపమునం దాయనను సైన్యము ముట్టడించి కైదుచేయునట్లు చేసెను. రాజు పట్టుపడుటవలన మిగుల నుప్పొంగి అల్లాఉద్దీన్ చితురున కిట్లు వర్తమాన మంపెను. "పద్మిని నావద్దకు రానియెడల భీమసింహుని ప్రాణములగొని మరల రజపూతులను సంహరించెదను." ఈ సంగతి విని రజపూతులందరు నేమిచేయుటకును దోచక మిగుల విచారముగా నుండిరి.. రాజగు లక్ష్మణసింహుడు బాలుడగుటవలనను, భీమసింహునిపుత్రులు పండ్రెండుగురును అల్పవయస్కు లగుటవలనను, ఇట్టిసమయమునం దగిన యుపాయము యోచించువారు కాన రారయిరి. కాని పద్మినిమాత్ర మప్పుడితర స్త్రీలవలె దు:ఖింపుచు గూర్చుండక మిగుల ధైర్యము వహించి భర్తను విడిపించు నుపాయము యోచింపుచుండెను. ఆసమయమునం దేదోపనిమీద నామె సోదరుడగు గోరాసింహుడును, నాతని పుత్రుడగు బాదలుడను వీరుడును అచటికి వచ్చిరి. ఆమె వారితో యోచించి మిగుల చిత్రమగు యుక్తిని బన్నెను. పద్మిని అల్లా ఉద్దీనున కిట్లు వర్తమానము చేసెను "మీరు భీమసింహునివిడిచిడిల్లీబయలుదేరిన యెడల నేను తగుదాసీలతోడంగూడి యచటికి వచ్చెదను. కాని నా దాసీల పరువునకును, రాణివాసమునకును మీ సైనికులు భంగము సేయకుండునటుల కట్టుదిట్టములు చేయవలయును." పద్మిని తెలిపిన వార్త విని అల్లా ఉద్దీను పరమానందభరితు డయ్యెను. అంత నాత డామె యన్నప్రకార మొప్పుకొని యామెకు ద్వరలో రమ్మని కబురు పంపెను. బాదుషాయొద్దనుండి తన పలుకుల కంగీకారము వచ్చుట విని, పద్మిని తాను ప్రయాణ మాయెను. ఆమెతోడ వచ్చుటకు నేడువందల మేనాలను సిద్ధపరచెను. ఒక్కొకమేనాలో ముగ్గురేసి శూరులు ఆయుధహస్తులయి కూర్చుండిరి. ప్రతిమేనాకును నారుగురువంతున గుప్తాయుధులగువీరు లాయందలములను మోయుచుండిరి. పద్మిని తన సైన్యమునకును, తనకును దోడుగా గోరాసింహుని, నాతని పుత్రుడగు బాదలుని సహితము తనతో దీసికొని పోయెను. ఇట్లు వీరందరు తురకలశిబిరమును సమీపించి బాదుషాయాజ్ఞవలన నామేనాల నన్నిటిని శిబిరములోనికి నిరాటంకముగా గొనిపోయిరి. తదనంతరము పద్మిని భీమసింహునినొకసారి చూచెదనని బాదుషాకు తెల్పి, భీమసింహుని కైదుచేసిన స్థలమునకు దన మేనాను బట్టించుకొని చనెను. అంత స్త్రీలవలెనున్న యా గుప్తసైన్యమంతయు తమ నిజస్వరూపమును గనబరచి మ్లేచ్ఛసైన్యముల దైన్యము నొందింపసాగెను. భీమసింహు డదియంతయు నేమని యడుగుచుండగా పద్మిని యాతనిని త్వరపెట్టి సిద్ధపరచి తెచ్చిన అశ్వములపై తానును, భర్తయు నెక్కి యా సంగ్రామపు సందడిలోనుండి తప్పించుకొని క్షణములో చితురు ప్రవేశించెను. ఇచట జోరాసింహుడు సైన్యాధిపత్యము స్వీకరించి యా తురకల నోడించెను. కాని యర్జున తుల్యుడగు గోరాసింహుడును, నాతని పుత్రుడగు బాదలుడును ఆ యుద్ధమునందు మృతులగుటవలన రజపూతులకు విజయానందమంతగా రుచింప దయ్యెను. అల్లా ఉద్దీను పరాజయమునకు బిసిబిల్లాయనుచు దనసైనికులతో డిల్లీమార్గమునకు దరలిపోయెను.
ఆ యుద్ధానంతరము మరికొంతకాలమునకు డిల్లీపతి విశేషసైన్యముతో మరల చితురుపై దండువెడలెను. ఈ తడవ చితురునందు శూరులు లేనందున రజపూతులకు విజయాశ యంతగా లేకయుండెను. కాని, యావీరు లంతటితో నిరాశ నొందియుండక ప్రాణములకు దెగించి శత్రువులతో బోరాడా దొడగిరి. అట్టి సమయమునందొక కారణమువలన నారజపూతులకు జయము దొరకదని నిశ్చయముగా దోచెను. అది యేదియనగా నా యుద్ధము జరుగునపు డొకదినమురాత్రి గ్రామదేవత భీమసింహుని స్వప్నమునందగుపడి "నా కతి దాహముగా నున్నది. ఈ దాహము పండ్రెండుగురు రాజుల రక్తము త్రాగినగాని తీరద"ని చెప్పెనట. అదేప్రకారము భీమసింహుని పుత్రులు పదునొకండుగురు శత్రువులతోడ బోరిహతులయిరి. అంతటితోనైనను రజపూతులు ధైర్యమును విడువక పురమునంగల పురుషులందరును వైరులతోడంబోరి స్వర్గసుఖమంద నిశ్చయించిరి. అంత వారందరు సిసోదియా వంశము నాశమొందుటకు వగచి భీమసింహుని కనిష్ఠపుత్రుని నొక దాదిచేతికిచ్చి సమీపారణ్యమునకు బంపిరి. పిదప వారందరు రాజవంశమున కంకురముగలదని నిశ్చయించుకొని సమరరంగమున కరిగిరి. ఆదిన మా రజపూతుల శౌర్యాగ్ని మరింత ప్రజ్వలింప వారు శత్రువులకు మిగుల దుస్సాధ్యులని తోచిరి. కాని విస్తీర్ణమగు మ్లేచ్ఛసైన్యము ముందల్పమగు రజపూత సైన్యమున కెట్లు జయముదొరుకును? ఆ సాయంకాలము వరకు క్షత్రియ వీరులందరు వీరస్వర్గమున కరుగగా జయలక్ష్మి అల్లాఉద్దీనునే పొందెను.
భీమసింహునితోడ సకల రాజపుత్రులును యుద్ధమున మడియుట నగరమునందుండిన స్త్రీలకు దెలియగా, పద్మినియు సకల రజపూతుల భార్యలును, పాతివ్రత్య రక్షణమునకై అగ్ని ప్రవేశముచేయ నిశ్చయించుకొనిరి. ఇట్లువారు కృతనిశ్చయురాండ్రై యొక గొప్పచితి బేర్చి దాని కగ్ని ముట్టించిరి. అందుపై పద్మిని తాను ముందాయగ్నియందు దుముకగా నందరు స్త్రీలును దుమికిరి. (ఈ యగ్ని ప్రవేశమునే రజపూతులు జోహారు, లేక జహరవ్రతమనియెదరు) బాదుషా విజయానందముతో పురప్రవేశము చేయగా నా గ్రామమంతయు చితామయమయి యుండెను. అందు తానింత ప్రయత్నము జేసి చేకొనదలచిన పద్మిని దేహము భస్మమయి యుండగా జూచి, అల్లాఉద్దీను మిగుల వగచెను. యుద్ధమునకు బ్రయాణమైనపుడు భీమసింహుడే స్త్ర్రిల నందర నొక గుహలోనికి దోలి యా గుహను మూసి గుహద్వారమున కగ్ని యంటించెనని కొందరు చరిత్రకారులు వ్రాసియున్నారు.