అబలా సచ్చరిత్ర రత్నమాల/నాచి

వికీసోర్స్ నుండి

నాచి

ఈ విద్వాంసురాలు ఏలేశ్వరోపాథ్యాయుల రెండవ కూతురు. ఏలేశ్వరోపాథ్యాయులు ఆంధ్ర బ్రాహ్మణుడు; మిక్కిలి విద్వాంసుడు; ఈయన నివాసస్థలము ఏలేశ్వరపురము. ఈ ఏలేశ్వరపురము శ్రీశైలమునకు బశ్చిమమున నుండును. ఈయన విద్యార్థులకు జెప్పు సంస్కృతము నిత్యమును విని ఈతని యింటివారందరును సంస్కృత మతి స్వచ్ఛముగా మాటాడుచుండిరట. ఈయనయే మన ఆంధ్రదేశమునందంతటను నాడుల భేద మేర్పరచి యాయా నాడులలోనే వివాహాదికము లగునటుల నిబంధన జేసెనని చెప్పెదరు. ఆ విభాగంబులు నేటివరకును మన దేశమున బ్రచారములో నున్నవి. ఈయనకు బుత్రసంతతిలేదు. ముగ్గురు బిడ్డలుమాత్ర ముండిరి.

ఏలేశ్వరోపాధ్యాయులు శా. శకము యొక్క 7 వ శతాబ్దమునందుండినట్లు తెలియుచున్నది కాన నాచి సహిత మా శతాబ్దములోనిదనియే యీహింపవలసియున్నది. ఈమె యాంధ్రబ్రాహ్మణ స్త్రీయైనను నీమె చరితమున కాంధ్ర దేశమునం దెచటను సాధనములు దొరకకపోవుట కెంతయు వ్యసనపడుచు మహారాష్ట్రమునందు దొరకిన యాధారము వలన నీమె యల్పచరితము వ్రాయవలసినదాననైతిని. ఈమె బాలవితంతువు కాన తండ్రి ఈమెకా దు:ఖము తెలియకుండుటకై ఈమెను విద్వాంసురాలినిగా జేయదలచెను. అటుల దలచి ఏలేశ్వరోపాధ్యాయులవా రామెకు విద్యనేర్ప మొదలు పెట్టిరి. కాని విద్య త్వరగా రాకుండినందుల కామె మిగుల చింతించి విద్యార్థులకు బుద్ధివైభవము కలుగుటకై తండ్రి చేసియుంచిన జ్యోతిష్మతియను తైలము నెవ్వరికిని జెప్పక త్రాగెను. అందుపై నామెకు దేహతాప మతిశయిల్ల నింటిలో నుండిన బావిలో దుమికెను. తదనంతరమున నింటిలోనివారామెను వెదకి యెందును గానక తుదకు బావిలో చూచిరి. అప్పటికామె తాపము కొంత చల్లారినందున నామెకు దెలివి వచ్చి వారికి దన వృత్తాంతము నంతను జెప్పెను. అదివిని తండ్రి యామె నా బావిలో మరికొన్ని గడియలుంచి బైటకి దీసెను. నాడు మొదలామెకు విశేషమైన తెలివియు జ్ఞాపక శక్తియు గలిగినందున నాచి తండ్రియొద్దగల సంస్కృత విద్యనంతను నేర్చెను.

విద్యావతి యైనపిదప నీమెకు తీర్థయాత్రలు చేయవలయునని బుద్ధి పొడమగా దండ్రి యందున కంగీకరించి యామెను యాత్రలకంపెను. నాచియు దీర్థాటనమున జక్కగా జేసికొని వచ్చుచుండెను. అప్పుడు కాశి మొదలగు స్థలముల యందీమెకు పండితులతో వాదముచేయుట సంభవించెను. అప్పుడా విద్యావతి వారి నోడించి మిగుల మెప్పుగాంచెను. ఇదిగాక యా పండిత డిల్లీ యాగ్రా మొదలగు స్థలములకరిగి రాజసభలయందు విద్వాంసులతో వాదముచేసి గెలిచి విశేష బహుమతులందెను. ఆమె యా కానుక లన్నియు దీసికొని వచ్చి తండ్రికి జూపి యతనికి దన యాత్రా వృత్తాంతమంతయు వినిపించెను. బ్రాహ్మణుడు కొమార్తెకుంగల వైధవ్యదు:ఖము నంతను మరచి తన కూతురు పుత్రునిగా నెంచి యామె యిట్టి విద్యాసంపన్న యగుటకు మిగుల సంతోషించెను. ఈమె తన చరితము ననుసరించి నాచి నాటకమను నొక నాటకమును సంస్కృతమున రచియించెను. ఈమె విద్యాసంపదలచే మిక్కిలి వైభవము గాంచినందున ఏలేశ్వరోపాధ్యాయులకు బుత్రులు లేని కొరత తెలియకుండెను.

_______