అబలా సచ్చరిత్ర రత్నమాల/ఖనా

వికీసోర్స్ నుండి

ఖనా

'విద్యచే శాశ్వతంబుగ వినుతి కెక్కు'

పూర్వకాలమునందు ఖనా యనుస్త్రీ జ్యోతిశ్శాస్త్రము నందధిక ప్రవీణురాలై యుండెను. ఆమె చేసిన కవిత్వ మా బాల వృద్ధుల కధిక ప్రియముగా నుండెననియు ఖ్యాతి గలదు. కాని మన దేశమునందు చరిత్రములు వ్రాయు వాడుక లేనందున నామె చరిత్రము సవిస్తరముగా నెచ్చటను దొరకలేదు. ఇందున కెంతయుం జింతిల్లవలసి యున్నది. ఈమె తల్లిదండ్రు లెవ్వరో తెలియదు. కాని యీమె జననిజనకులు బాల్యమునందే మృతి నొందినందువలన నీమె నెవడో యనార్యుడు పెంచుకొని యతడే యామెకు జ్యోతిషవిద్య నేర్పెనని యొక వింతకథ జెప్పెదరు. ప్రాచీనకాలమునం దార్యులకంటె ననార్యులే జ్యోతిషము నందు విశేష పాండిత్యము గలిగియుండిరని యందురు. ఖనా కుశాగ్రబుద్ధిగలదైనందున నితర బాలికలవలె నాటలతో గాలము గడపక తన పెంపుడుతండ్రియొద్ద స్వల్పకాలములోనే సంపూర్ణ జ్యోతిశ్శాస్త్రము నభ్యసించెనట! ఆ పెంపుడుతండ్రి ఈమె బుద్ధి కెంతయు మెచ్చి తనకు వచ్చినవిద్యయంతయు నామెకు సాంగోపాంగముగా నేర్పెను. ఇట్లు పురుషులకు సహితము దుర్లభమైన గణిత జ్యోతిషము లీమెకు గరతలామలకము లయ్యెను.

ఖనా వసియించెడి గ్రామము నందే మిహిరుడను బ్రాహ్మణ చిన్నవా డొక డనార్యులచే బెంపబడెను. పెంపుడు తండ్రియైన యనార్యుడు మిహిరుని బుత్రవాత్సల్యముతోబెంచి పెద్దవానిజేసి జ్యోతిషమునం దపార పండితునిగా జేసెనట. తదనంతరమునందు ఖనా మిహిరు లిరువురును యుక్తవయస్కులై తమ పెంపుడుతండ్రుల యనుమతి వడసి వివాహము జేసికొని సంసారభారమును మోయుచుండిరి.

ఖనాయొక్క తల్లిదండ్రులెవ్వరైనది తెలియక పోయినను మిహిరునివంశము మన మెరుగవచ్చును. లోకప్రసిద్ధుడగు విక్రమాదిత్యుని సభయందుండు నవరత్నములలో నొకడగు వరాహున కీమిహిరుడు పుత్రుడట. వరాహుడు జ్యోతిషమునందధిక ప్రవీణుడయి జ్యోతిషగ్రంథములు కొన్ని రచించెను. ఆయనకు మిహిరుడు పుట్టగానే జాతకము వేసిచూచి యందులోసంఖ్యలు తప్పుటవలన, నూరేండ్ల ఆయుర్దాయ మున్నను తండ్రి లెక్కకు బది సంవత్సరములే జీవితమని వచ్చెనట. అందుకు వరాహుడు మిక్కిలి చింతిల్లి పిల్లవాడు పది సంవత్సరములు పెరిగి మృతి నొందిన విశేషదు:ఖమగు గాన, నిప్పుడే వీని నెక్కడనైన విడిచిన బాగుండునని యోచించి, కర్రదోనెలో బాలుని నునిచి నీట ప్రవాహములో విడిచెనట. తదనంతర మాబాలు డొక యనార్యునకు దొరకగా, వాడు సాకి విద్యనేర్పిన సంగతి యిదివరకే వ్రాసినాను.

వివాహానంతరము ఖనా మిహిరులు కిరువురకు ఆర్యులలోనికి వెళ్ళవలయును వాంఛగలిగి, తమపాలనకర్తల యనుజ్ఞ నడిగిరి. అందుకు వారు సమ్మతించి వారినంపి వచ్చుటకయి వెంటనొక యనార్యదాసిని బంపి దానిచేతికి గొన్ని జ్యోతిష గ్రంథముల నిచ్చిరి. ఆర్యులుండు ప్రాంతముయొక్క పొలిమేరదాటి వారి దేశమునకు వెళ్ళునపుడు, ఆస్త్రీ జ్యోతిషమునందు ఖనాకును మిహిరునకుగల ప్రజ్ఞను బరీక్షింపదొడగెను. వారు జ్యోతిషమునందు పండితులని తెలిసిన నా పుస్తకముల మరల స్వదేశమునకు దీసికొని రమ్మనియు, లేనియెడల పుస్తకములు వారికినిచ్చి రమ్మనియు ననార్యులు చెప్పిరట. కాన వారిని బరీక్షించుటకయి యాదాసి యచట నీనుటకు సిద్ధముగానున్న యొక గోవును మిహిరునకు జూపి 'ఈ యావునకు నెర్రదూడ పుట్టునా, తెల్ల దూడ పుట్టునా' యని యడిగెను. మిహిరుడు 'తెల్లదూడ పుట్టు' నని ప్రత్యుత్తరమిచ్చెను. అంతట నాయావీనగా నెర్రదూడ పుట్టెను. అందుపై నాదాసి మిహిరునకు జ్యోతిషజ్ఞానము పూర్ణముగా లేదని యెంచి, యా పుస్తకముల నాతనికిచ్చి తన స్వదేశమునకు మరలి పోయెనట. అంత మిహిరుడు తా నిన్ని దినములనుండి శ్రమపడి యభ్యసించిన విద్యయందు తాను ప్రవీణుడు కానందుకు నెంతయు జింతిల్లి, యింత కష్టపడిన రానివిద్య యిక నీ పుస్తకమువలన నేమి రాగలదని కోపముతో నా పుస్తకములను యేటిలో బారవేసెను. అప్పుడు ఖనా సమీపముననే యున్నదిగాన, పరుగెత్తుకొని వెళ్ళి యా పుస్తకములలో రెంటినిమాత్రము నదీ ప్రవాహములోనుండి యీవలికి దీసెను. కడమ పుస్తకము లామెకు దొరకక ప్రవాహములలో కొట్టుకొనిపోయెను. తదనంతరమా దంపతులు తిన్నగా విక్రమాదిత్యుడు వేటకు వచ్చియున్న స్థలమునకు సమీపగ్రామము జేరిరి. అచట విక్రమా దిత్యుడు విద్వాంసులను మన్నించునని విని మిహిరుడు రాజు సందర్శనము జేసి తన విద్యావిశేషమును గొంత కనుపరపగా రాజు సంతోషించి యాయనను దన యాస్థానపండితునిగా నేర్పరచి తన గ్రామమునకు దోడుకొనిపోయి వరాహుని బిలిపించి యీదంపతుల నతనికి జూపి 'వీరిని నీ యింటను నుంచుమని' చెప్పెను. అందుపై వరాహుడు వారిని దనయింట నుంచుకొనెను. అంత గొంతకాలమునకు వరాహునకు దాను పారవేసిన తన కొమారుడీ మిహిరుడే యని తెలిసి పితాపుత్రు లిరువురకును అపరిమితానందము కలిగెను. తదనంతర మెప్పుడును వరాహుడు, మిహిరుడు, ఖనా తమలో దాము జోతిషమును గురించి అనేక ప్రసంగములు చేయుచు జ్యోతిశ్శాస్త్రములోని క్రొత్తక్రొత్త సంగతులను గనిపెట్టసాగిరి. మిహిరుడు తండ్రితో సమాన విద్యావిశేషములు గలవాడుగాన, విక్రమార్కుని సభయందును, దేశమునందంతటను ఆయనకీర్తిని గొనియాడనివారు లేక యుండిరి. ఖనా యింటియొద్దనే యుండి రాజసభ కెన్నడును పోకపోయినను, ఆమె యందుండు సుగుణ సంపదయు, విద్యాపరిమళమును దిగంతములయం దంతటను వ్యాపించెను. వరాహుని కోడలును, మిహిరుని భార్యయు నగు ఖనా ఖగోళవిద్యయం దధిక ప్రవీణురాలని యందరును జెప్పుకొను చుండిరి.

ఇట్లుండ నొకనాడు విక్రముడు వరాహుని బిలిచి ఆకాశమునందుగల నక్షత్రసంఖ్య చెప్పుమనె నట! అందున కాయన గ్రంథములను శోధించియు నక్షత్రసంఖ్య కనుగొనజాలక, ఆకా శమునందు గల నక్షత్రములను లెక్కించుటకు వీలు లేనందున మిక్కిలి చింతనొంది యా సంగతి కొమారునకు దెలిపెను. కొమారుడును దన శక్తి యంత వినియోగపరచి చూచెనుగాని, యా యుక్తులేవియు నక్షత్రసంఖ్య దెల్పుట కెంత మాత్రమును పనిపడినవి కావు! ఇట్లు పితాపుత్రు లిరువురును నిరుపాయులై రాజసభలో దమకు నవమానము గలుగునని చింతాక్రాంతులై యుండ, వారిని జూచి ఖనా విచారహేతు వడిగెను. ఆమె యందుకు గారణము తెలిసికొని దీని కింత విచారమేల యని వారికి గొంత ధైర్యము జెప్పి తానొక గడియసేపు గణితము చేసి నక్షత్రసంఖ్య గనిపెట్టి వారికి జూపెను. అందుపై వారు ప్రముదితులై భోజనములు చేసి, రాజసభకుబోయి యానక్షత్రసంఖ్యను దాని గనుగొనిన రీతియు జూపగా సభికు లందరును అధికాశ్చర్యమగ్న మానసులైరి, అంత వరాహు డా మహాకార్యము తనప్రజ్ఞవలనదెలియలేదనియు, తనకోడలే విద్యాధికురాలైనందున నీ సంఖ్య సులభముగా గనిపెట్టెననియు జెప్పెను. ఆ మాటవిని యచట నున్న వారందరును ఆ విదుషిని వేనోళ్ళ గొనియాడిరి. విక్రమాదిత్యుడు మిగుల సంతసించి "నా సభ యందు నవరత్నములలో రేపటినుండి ఆమె దశమరత్నముగా నుండును. కాన రేపటినుండి యామెను అవశ్యముగా సభకు దోడ్కొని రమ్మని యానతిచ్చెను! రాజాజ్ఞ వినినతోడనే వరాహున కత్యంత భీతికలిగెను. ఎందుకన, స్త్రీలను రాజసభలలోనికి దీసికొనిపోవుట యెంతయు నవమానకరమనియు, లోకనిందాస్పదమనియు వరాహుని యభిప్రాయమట! కోడలిని రాజసభకు దీసికొని పోకుండిన రా జత్యంతాగ్రహపడునని తలచి వరాహుడు ఇందుకు మూలకారణురా లయిన ఖనాను చంపివేసిన బాగుండునని నిశ్చయించెనట! వరాహు డా సంగతి గొమారునకు దెల్పి నీ భార్య నాలుక కోయుమని యాజ్ఞాపించెనట! కాని సద్గుణమణియగు ప్రియభార్య నంత క్రూరతవహించి చంపుటకు మిహిరున కెంతమాత్రమును మన సొప్పకుండెనట! ఈ సంగతి యంతయు ఖనాకు దెలిసి, మామగారి యాజ్ఞను ఉల్లంఘించక శిరసావహించి తన నాలుకను జూపి ఖండింపుమని భర్తను భక్తితో వేడుకొనెనట! అందుపై నాతడు మనసు దృడపరచుకొని ప్రియభార్య యొక్క జిహ్వను ఖడ్గముతో గోసెనట! అందుపై నామె త్వరలోనే యిహలోకము విడిచెనట! కొందరీ కథనే యిట్లు చెప్పుదురు:- విక్రమార్కుని యాజ్ఞప్రకారము ఖనా యాతని సభలోని పదియవ రత్నమయ్యెను. తరువాత గొన్నిరోజులకు గాలధర్మము నొందెను. ఇట్లు చెప్పువారీమె స్వాభావికముగా మానవులందురు. మృతిజెందునట్లుగానే మృతిజెందినదనియు, బరులచే జంపబడలేదనియు జెప్పెదరు. మొదటి కథకంటె నీ రెండవకథయే విశేష సంభవనీయముగా నున్నది. విక్రముని కాలమునందు స్త్రీలకు రాణివాసము లేక యుండెనని యనేక ప్రమాణములవలన గానబడుచున్నది ఇదియుంగాక యంతరాణివాస ముండినయెడల రాజు ఖనాను రాజసభకు దీసికొనిరమ్మని యేల చెప్పియుండును? తన ప్రియభార్యను నిష్కారణముగా మిహిరుడు చంపెనన్న క్రూరపుమాట నమ్మతగినదికాదు. కనుక రెండవకధయే యుక్తియుక్తముగా నున్నది ఈ చరితమునం దనేకాసంభవములైన సంగతు లచ్చటచ్చట గానుపించుచున్నవి. వానిని విడిచినను పూర్వకాలము నందొక స్త్రీ, పురుషులకుగూడ నసాధ్యమగు జ్యోతిర్విద్యనభ్యసించి ప్రవీణత నొందియుండెననియు, ఆమెకు జ్యోతిషము యొక్క యంగములైన జాతక స్కంధమునందును గణిత స్కంధమునందును, అసమానప్రజ్ఞ గలిగియుండినదనియు స్పష్టముగా దెలియుచున్నది. ఖనాయొక్కబుద్ధి యిట్టి గహనవిషయమునందింత సులభముగా బ్రవేశించుట జూడగా, స్త్రీలబుద్ధి పురుషులబుద్ధి కంటె మందమనియు, నాడువారి మెదడు (మస్తిష్కము) మగవారి మెదడున కంటె బలహీనమనియు దక్కువ తూగుననియు నందువలన పురుషులకు దెలిసినంతటిజ్ఞాన మతివలకు దెలియుటసంభవింపదనియు జెప్పువారిమాట లన్నియు బక్షపాత వచనములని నిర్వివాదముగా జెప్పవచ్చును. స్త్రీలు నైసర్గికమూర్ఖురాండ్రని చెప్పుటకంటె నేటివరకు స్త్రీలకు బాల్యమునుండియు విద్యాగంధము నించుక సోకనియ్యనందున వారు మూర్ఖురాండ్రుగా గానుపించెదరని చెప్పవచ్చును. బాల్యమునందు బాలురును బాలికలును సమానబుద్ధివైభవములు గలిగియె యుందురని మనకందరకును దెలిసినమాటయే. బాలురకంటె బాలిక లెప్పుడును బుద్ధిహీనలుగా నుండరు. బాల్యమునం దాడుపిల్ల యెట్టి బుద్ధివైభవము గలదైనను తలిదండ్రులుదాని కెంతమాత్రనుము విద్యనేర్పక జ్ఞానాభివృద్ధికిం దగిన యుపాయములేవియు జేయనందున నది వివేక హీనురాలగుచున్నది. బాలుడు చిన్న తనమునందెంతమందబుద్ధియైనను