Jump to content

అబలా సచ్చరిత్ర రత్నమాల, ద్వితీయ సంపుటము/రాణీసాహేబ్‌ కువరు

వికీసోర్స్ నుండి

రాణీసాహేబ్‌ కువరు

ఈమె పంజాబుదేశములోని పటియాలాసంస్థా నాధీశ్వరుఁడగు రాజా సాహేబ్ సింహుని సహోదరి. బారీదు వాబులోని నధికభాగము కధీశ్వరుఁ డగుసరదార్ జయమల్ సింహునిపత్ని. ఈమె తనసహోదరుని రాజ్యమును చక్కఁగా నేలి రెండుమూడుసార్లు యుద్ధములలో జయముఁ గాంచి మిగుల శూర యనియును రాజకార్యనిపుణ యనియును బేర్కొనంబడియె.

1793 వ సంవత్సరము మంత్రులును, ఉద్యోగస్థులును దనకు వైరు లైనందున రాజ్యముఁ దాను జక్కఁబఱుపఁజాలనని రాజాసాహెబు సింహుఁడు దెలిసికొనియెను. అంత నతఁడు తనయనుజను దనవద్దకిఁ బిలిపించుకొని యామెకు ముఖ్యప్రధానిత్వమునిచ్చెను. తదనంతరమామె కొందఱువిశ్వాసార్హులులగు నుద్యోగస్థుల సహాయమువలన రాజ్యమునం దంతటను గలుగుచున్న యన్యాయముల నుడిపి న్యాయముగాఁ బాలింపుచుఁ బ్రజలకు మిగుల హితురా లాయెను. అంతలో నామెభర్తపై నతని పాలివాఁడగు ఫతేసింహుఁడు వైరముఁ బూని యతనిని జాల తొందర పెట్టుచున్నట్టు లామెకుఁ దెలిసెను. అప్పు డామె తనసహోదరున కామాట నెఱిగించి యచటినుండి కొంత సైన్యమును దీసికొని దాని యాధిపత్యమును దానే స్వీకరించి ఫత్తేపురమున కరిగెను. అచట నీమెకును ఫతేసింహునకు గొప్పయుద్ధము జరిగినపిదప రాణిజయముఁగాంచి యచటఁజెఱలో నుండిన భర్తను విడిపించి మరల జయ ఘోషములతో పటియాలఁబ్రవేశించెను.

1794 వ సంవత్సరమున ఆనందరావు, లక్ష్మణరావులను మరాఠాసైన్యాధిపతులు విపుల సైన్యసహితులయి యమునానది నుత్తరించి పటియాలసంస్థానమును గెలుచుటకై వచ్చుచుండిరి. వారువచ్చునపుడు వారిశౌర్యమునకు వెఱచి కొందఱు సామంతరాజులు వారికి ధనము నిచ్చిరి. మఱికొందఱు వారి కనుకూల వచనములఁ బలుకుచు ననేకవస్తువాహనములను వారి కర్పించిరి. కాని యసమర్థుఁ డగు రాజునకుమంత్రిగానుండిన యింతిమాత్రము వారికివెఱచి లోఁబడునట్టిది కాక పోయెను. ఆమెమరాఠివారిరాకనువిని మిగులనాగ్రహించివారిని గెలుచుటకయి యత్నింపసాగెను. ఆమెశౌర్యధైర్యములం గని చుట్టుపట్ల నుండు రాజులును జమీదారులు గొంతసేనలతో నామెకుఁ దోడుపడిరి. ఇది యంతయు గలిసి 7 వేలసైన్య మయ్యెను. దాని కంతకును దానే యాధిపత్యము వహించి రాణీసాహెబు కువరు అంబాలయనుపట్టణ సమీపమునం దున్న మర్దనపుర సమీపమున శత్రువుల నెదిరించి నిలిచి వారిత్రోవ నరికట్టెను. అచ్చట నారెండు సైన్యములవారికిని ఘోరసంగ్రామము జరిగెను. రాణిసైన్య మల్పమగుటవలనను యుద్ధవిద్యాభ్యాసము వారి కంతగా లేనందునను గొంతసేపు యుద్ధము జరిగిన పిదప వారు శత్రువుల దెబ్బలకు నాఁగియుండ నేరక నలువైపులకుఁ జెదరునట్లగుపడిరి. అప్పుడు ధైర్యవతియగు నారాణి రధమునుండి దిగి ఖడ్గము నొఱలో నుండి తీసి ఝళిపించుచు శౌర్యోత్పాదకము లగువచ నముల నాసైనికులతో నిట్లనియె. "సైనికులారా! నేను నా ప్రాణములు పోవునంతకు నిచటనే యుండి పోరాడెదను. నేను మీ రాజునకు సహోదరిని; స్త్రీని; నన్ను విడిచిపోవుట శూరులగు మీకు ధర్మము కాదు. యుద్ధమును విడిచిపోయినను మీకొకనాఁటికి మృత్యువు సిద్ధమయియే యున్నది. మీరిదివఱకు సంపాదించిన కీర్తి నేల మాపెదరు? ధైర్య మవలంబింపుఁడు. శత్రువులతోఁ బోరుఁడు." ఇట్లాడిన యామెవాక్యములవలన సైనికులకు శౌర్యస్ఫురణము కలిగి యాదినమంతయు యుద్ధము చేసిరి. నాఁ డుభయపక్షములయందును జాల ప్రజానాశము కలిగెను. ఆదిన మెవరికిని గెలుపు దొరకెనని నిశ్చయించుటకు శక్యము కాక యుండెను. నాఁటి రాత్రి రాణీసాహెబుకువరు సైనికు లామెతో 'మన కిఁక జయము కలుగదనియు నీరాత్రి మన మెచటికైనను బాఱిపోయి ప్రాణములను రక్షించుకొంద మనియుఁ జెప్పిరి. కాని యా శూరనారి కావచనములు రుచింపక యారాత్రి శత్రువులపై నకస్మాత్తుగాఁ బడి వారిని వెళ్ళఁగొట్టుదమని తనసైనికులను బురికొల్పెను. అంత వారందఱును వేకువజామున సన్నద్ధులై నిర్భయముగా నుండిన మరాఠావారి శిబిరముపైకిఁ బోయిరి. ఈసైనికు లచటి కరిగి వారికేమి యపాయము చేయకున్నను వారిసైన్యముల జాగ్రతగా నుండినందున వీరినిఁ జూచినంత మాత్రముననే మిగుల వెఱచి మరాఠావారిసైన్యము పాఱఁదొడఁగెను. అప్పుడు రాణి తనకుఁ దోడుగా గొప్ప సైన్యము వెనుకనుండి వచ్చుచున్నదనిన వదంతి నొకదానిని మరాఠా వారి సైనికులకుఁ దెలియునట్లుచేసెను. అందువలన వారు తమకు గెలుపు దొరకుట దుస్తరమని యనుకొని తెల్లవారిన తోడనే తమసైన్యమును వచ్చినత్రోవనేమరలఁ గొనిపోయిరి. రాణీసాహెబుకువరు జయము గాంచి విశేషవైభవముతో మరలి పటియాలకు వచ్చి మహావైభవముతో రాజ్యపరిపాలనము చేయుచుండెను. కొన్నిదినములు నడచినపిదప నారాజ్యమునందు కొందఱు రాజద్రోహులై రాజ్యమునందంతట ననేక యుపద్రవములను జేయుచుండిరి. అప్పుడు రాణీసాహేబుకువరు తానుగొంతసైన్య సహితమయి నహనను పట్టణమున కరిగి యచట మూడు నెలలు వసియించి యా రాజద్రోహుల నందఱిని రూపడంగించి రాజ్యమును సుఖప్రదముగాఁ జేసి మరలి పటియాలకు వచ్చి యెప్పటివలె రాజ్యపాలనము చేయుచుండెను.

ఈమె రాజ్యము నేలుటవలన రాజునకు, సహచరులగు దుష్టులకుతంత్రము లేమియు సాగవయ్యె అందువలన వా రామెకు శత్రువులయిరి. చట్టా సంస్థానాధీశ్వరుఁడగు సరదార్ గురుదాసు సింహునిబిడ్డయు, రాజునకుఁ బత్నియునైన ఔస్కువరు రాజ్యము నేల సమర్థురాలును యువరాజునకుఁ దల్లియు నైనందువలన నామెయు నాఁడుబిడ్డ రాజ్య మేలుటకు సమ్మతింపదయ్యె. రాజ్యమునందంతటను రాణీసాహేబు కువరుకు విరోధులు బహుజను లగుటవలన వా రామెపై ననేకదోషములను మోపసాగిరి. వారామెయందు ముఖ్యముగాఁ గనిపెట్టిన గొప్ప నేర మేదనఁగా నహనుపట్టణములో జరిగిన మహాయుద్ధమునందు జయము గాంచినందుకై యచటిసామంత రా జామె కిచ్చిన మత్తగజము నామెరాజున కియ్యక తానే యుంచుకొనుట ఆమె శౌర్యమహిమవలన దొరకిన బహుమతి నామె యుంచుకొనఁదగదఁట. ఆమె సహోదరుని యాజ్ఞను బొందకయే తనజహగిరిలో నొకకోటను గట్టెను. అదిరాజునకుఁ గోపము వచ్చుటకుఁ గారణమయ్యెను. రాజల్పబుద్ధి గలవాఁడు గాన తనకామె చేసినమేలును మఱచి యామె నామెభర్తకడ కరుగుమని చెప్పెను. అందువలన నామె రాజధానిని విడిచి తనజహగిరిలోనున్న కోటలోనికిఁ బోయి యచటనే వసియించెను. యామె యచటనుండి తన కేమి యపాయము చేయునో యని భయపడి రాజు కొంతసైన్యము తీసికొని యామెతో యుద్ధమున కరిగెను. కాని బుద్ధిమంతులు కొంద ఱతనితో స్త్రీతోడి కలహమున కరుగుట యుచితము గాదని చెప్పి యతని ప్రయత్నమును మాన్పి వారిరువురకును సంధిచేయ నెంచి రాణిని పటియాలకుఁ బిలువనంపిరి. కాని యామె పటియాలకు వచ్చుచుండఁగా రాజు తనను పిలిపించి చంపునని యామెకుఁ దెలిసినందున నామె మరలి తనకోటలోనికిఁ బోయెను. కాని రాజు మరల నామెను నమ్మించి తననగరమునకుఁ బిలిపించి కారాగృహమునం దుంచెను. ఆమె యచటఁ గొన్ని దినములుండి యొకదినము తనబట్టలను దనదాసికి నిచ్చి దానిబట్టలను దాను గట్టుకొని యుపాయముగానందుండి బయలుదేరి తనకోటలోనికి వచ్చిచేరెను. తదనంతర మామె 1799 వ సంవత్సరమునందు పరలోకమున కేఁగెను.


కమలా దేవి

ఈమె సత్యవతి కాలము (సత్యవతి చరిత్ర చూచునది) నందే యుండెనని యూహింపఁబడుచున్నది. ఈమె భర్త ముర్షీదాబాదు సమీపమునం దొకగ్రామవాసియగు బ్రాహ్మణుఁడు; ఆయనపేరు జగన్నాధభట్టాచార్యుఁడు. ఈదంపతులకు ముగ్గురుపుత్రులుండిరి. మానసింహుఁడనెడివాఁడువీరికిఁ గొంత భూమి ధర్మార్ధముగా నిచ్చినందున వారు దానివలననే సుఖ జీవనము చేయుచుండిరి. కమలాదేవి శాంతసుశీలాది గుణములు గలదైనందున నాయూరివారంద ఱామెను మిగుల మన్నింపు చుండిరి. అప్పుడాదేశపు ప్రభుత్వము కంపెనీవారిచేతికిఁ గ్రొత్తఁగా వచ్చెను. ఆసమయమున నొకగొప్పక్షామము సంభవించినందువలన పంటలు పండక జనులు మిగుల హీనస్థితికి వచ్చిరి. ఇదే సమయమని తలఁచి దొరతనమువారి యుద్యోగస్థులు కొందఱు క్షామమువలనఁ బీడింపఁబడిన జనులను దాము విశేషముగాఁ బీడించి, మిగుల బాధ పెట్టుచుండిరి. అప్పటి దొరతనమువారికి నింకను మనదేశభాష తెలియనందున వారు ప్రజలకుఁ గలుగుబాధలను తెలిసికొనఁజాల కుండిరి. ఇట్టిసమయమున మర్షీదాబాదున గంగాగోవిందసింహుఁ డనుదుష్టుని యధికారము చెల్లుచుండెను. వాఁడుసుఖముగాఁగాలము గడపుచున్న జగన్నాధుని కుటుంబము నొక్కసారిగా దు:ఖసముద్రములోనికిఁద్రోచెను. అదెట్లనిన, వారి కాసంవత్సరము పంట