అబద్ధాల వేట - నిజాల బాట/విశ్వాన్వేషణల్లో ఎక్కడున్నాం ?

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
విశ్వాన్వేషణల్లో ఎక్కడున్నాం?

రావిపూడి వెంకటాద్రి "విశ్వాన్వేషణ"కు అర్ధశతాబ్దం వయస్సు వచ్చింది. అప్పటినుండి ఖగోళశాస్త్రం నిరంతర పరిశోధనలు జరుపుచూనే వున్నది. యుగయుగాలు మానవుడు చూపుతున్న జిజ్ఞాసకు ఖగోళశాస్త్రం క్రమేణా సమాధానాలు చెబుతూ, పురోగమిస్తున్నది. వెంకటాద్రి విశ్వాన్వేషణ రచన అనంతరం జరిగిన పరిశోధనలు పరిశీలించడం మానవవాదుల, హేతువాదుల అన్వేషణలో భాగమే. ఆంధ్రప్రదేశ్ లో అధునాతన సైన్సును అందించడంలో అత్యంత సులభమార్గాన్ని వెంకటాద్రి చూపారు. ఎందరో హేతువాదులు ఈ జ్ఞానార్జన చేస్తున్నారు.

ఇటీవల జరుగుతున్న విశ్వాన్వేషణలో బిగ్ బాంగ్ తో మనం చూస్తున్న విశ్వం ఆరంభమయ్యిందని తెలిసింది. ప్రపంచంలోని సైంటిస్టులు దాదాపు ఈ అభిప్రాయానికి వచ్చారు. ఖగోళశాస్త్రంలో బిగ్ బాంగ్ తరువాత పరిణామక్రమాన్ని క్రైస్తవులలో సనాతనులైన కేథలిక్కులు సైతం అంగీకరిస్తున్నారు. స్టీఫెన్ హాకింగ్ రోంలో సెమినార్ లో మాట్లాడిన అనంతరం ఆయన్ను క్రైస్తవాధిపతి పోప్ దగ్గరకు తీసుకెళ్ళారు. బిగ్ బాంగ్ నుండి ప్రారంభమై జరిగిన పరిణామాన్ని తాము అంగీకరిస్తున్నామనీ, అయితే బిగ్ బాంగ్ సృష్టికార్యం గనుక అదెలా జరిగిందని ప్రశ్నించవద్దని పోప్ సలహా యిచ్చాడు.

హవాయ్ దీవులలో మానాకీ కొండపై వంద మిలియన్ డాలర్ల వ్యయంతో "కెక్ టెలిస్కోప్" యిటీవలే ఏర్పరచి విశ్వాన్వేషణ యింకా కొనసాగించారు. కాలిఫోర్నియాలో ఒక దాత ఈ టెలిస్కోప్ నిర్మాణ ఖర్చులు భరించడం పెద్ద విశేషం. ఈ టెలిస్కోప్ పరిశీలించే తీరును బాక్ గ్రౌండ్ ఎక్స్ ప్లోరర్(కోబ్) అంటున్నారు.

15 బిలియన్ సంవత్సరాల క్రితం బిగ్ బాంగ్ తో నేటి ప్రకృతికి ప్రారంభదశ పట్టింది. అప్పుడు ఆకాశం, కాలం, శక్తి, పదార్ధం అనే తేడాలు లేవని గుర్తుంచుకోవాలి. స్టీఫెన్ హాకింగ్ ప్రభృతులు ఈ విషయాన్ని స్పష్టంగా వ్రాశారు. హేతువాదులు వాటిని ఎప్పటికప్పుడు చదువుతుండాలి.

ఏకత్వం నుండి భిన్నత్వం ఏర్పడడంలో ప్లాంక్(Plank) అనే సైంటిస్టు సూచించిన కాలమానాన్ని స్వీకరించి చూస్తే బిగ్ బాంగ్ జరిగి, ప్రకృతిసృష్టి 10-43 సెకండ్లలో మొదలయ్యింది. ఖగోళంలో సెకండ్ కు 186000 మైళ్ళ వేగంతో కాంతి పయనిస్తుందని గుర్తుంచుకోవాలి.

మొట్టమొదట విశ్వశక్తులలో గురుత్వాకర్షణశక్తి బొడ్డు తెంచుకొని వేరయ్యింది.

రెండోదశలో స్ట్రాంగ్ ఫోర్స్ వచ్చింది. అప్పటికి అణువులు యింకా ఏర్పడలేదు.

అణుకేంద్రాలను కలిపివుంచే శక్తి ప్రకృతిలో సిద్ధమయిందన్న మాట. స్ట్రాంగ్ ఫోర్స్ వేరుకావడంలో విశ్వ విస్తరణ వేగం పెరిగింది. అప్పటినుండీ పరస్పరం విశ్వంలో ఈ విస్తరణ సాగుతూనే వుంది. తరువాత దశలో క్వార్క్ లు, వ్యతిరేక క్వార్క్ లు బయలుదేరి పరస్పరం తారసిల్లి హరించిపోయాయి. పదార్ధానికి తొలిదశ ఈ క్వార్క్ మాత్రమే. అలా తారసిల్లగా అదనంగా వున్న క్వార్క్ ల వలన విశ్వపదార్ధం రూపొందింది. ఇందులోనే ఎలక్ట్రానులు, పార్టికల్స్ వున్నాయి. బిలియన్ క్వార్క్ లు ఢీకొంటే అదనంగా ఒక్క క్వార్క్ మిగిలి అలాంటివన్నీ కలసి పదార్ధంగా వచ్చాయి.

తరువాత దశలో విద్యుదయస్కాంతశక్తి ఆకర్షణ గలది విడిపోయి బయటపడింది. ఈ లక్షణం ఫొటాన్లలో వుంది.

చివరగా రేడియో యాక్టివ్ ఒకే చూపే వీక్ ఫోర్స్(అణుధార్మికశక్తి)విడివడింది. దీనివల్లనే సూర్యరశ్మి మనకు వస్తున్నది.

విశ్వం చల్లబడేకొద్దీ క్వార్క్ ల నుండి ప్రోటానులు, న్యూట్రాన్లు వచ్చాయి. ఇంకా చల్లబడగా అణువులు రూపొందాయి. అలావున్న విశ్వపరిణామంలో ఎక్కడబట్టినా శక్తి(ఎనర్జీ) ప్రాధాన్యతే వుండేది. పదార్ధ విజృంభణ ఆ తరువాతే వచ్చింది. చల్లదనం ఎక్కువ అవుతుంటే గురుత్వాకర్షణశక్తికి మూలంగా పదార్ధం ఆసరా యిచ్చింది. పదార్ధం ఘనీభవించి వివిధ రూపాలు దాల్చింది. పదార్ధంలో 99 శాతం అంధకారమయం అని మరచిపోరాదు.

విశ్వం విస్తరణ చల్లారుతుండడం సాగిపోగా పదార్ధంకు విద్యుదయస్కాంతశక్తి భిన్నమార్గాలు అవలంబించాయి. హైడ్రోజన్, హీలియం, లిథియం అణువులు ఏర్పడేటందుకు వీలుగా ఎలక్ట్రాన్లను నూక్లి వశపరచుకుంది. అప్పటినుండే విశ్వం కనిపించసాగింది. వెలుగు(ప్రోటాన్లు) యధేచ్ఛగా విహరించింది. విశ్వంలో వుండే ఈ ప్రోటాన్లనే మైక్రోవేవ్ రేడియేషన్ అంటున్నాం.

కోబ్ టెలిస్కోపు ద్వారా విశ్వంలో మైక్రోవేవ్ రేడియేషన్ అలల్ని పదార్ధం తొలుత ఏర్పడిననాటి స్థితిని చూడగలుగుతున్నారు.

పాలపుంతలు ఏర్పడడం, గురుత్వాకర్షణ వలన ఈ పరిస్థితి కొనసాగడం దీని వలన క్వాసార్లు, నక్షత్ర సముదాయాలు తలెత్తడం విశ్వపరిణామంగా పేర్కొన్నారు. విశ్వవిస్తరణ మాత్రం సాగిపోతూనే వుంది.

(ఖగోళశాస్త్రంలో ఈ పరిశోధనల వెనుక చాలా కృషి వుంది. హేతువాదులకు అర్ధం కావడానికి వీలుగా, సాధ్యమయినంత సులభంగా చెప్పే ప్రయత్నంలో ఆధునాతన విషయాల్ని యిలా అందిస్తుంటాం. అందులో ప్రతి చిన్న విషయానికి పెద్ద వివరణ కావాలి.)

- హేతువాది, ఏప్రిల్,మే,జూన్ 1994