అబద్ధాల వేట - నిజాల బాట/ముందు మాట అంతవసరమా ?

వికీసోర్స్ నుండి

ముందు మాట అంతవసరమా?

అబద్దాల వేట-నిజాల బాట లాంటి పుస్తకాన్ని పరిష్కరించే అవకాశం నాకు దక్కటం చాల సంతోషకరమైన విషయం. అసలు పరిష్కరించటమంటే ఏమిటి? పరిష్కరించటం = సేకరించడం. వరసలో పెట్టటం, ప్రూఫ్ లు చూడటం, ఒక పుస్తక రూపం యివ్వటం అన్నమాట. ఇన్నయ్యగారు వివిధ పత్రికలకు రాసిన అనేకానేక వ్యాసాల్లోంచి ఏర్చి కూర్చిన సంకలనం ఇది. ఈ వ్యాసాలు అనేక సంఘటనల్ని, అనేక విషయాల్ని నిశితంగా స్పృశిస్తాయి. దొంగల్ని పట్టిస్తాయి. దగా కోరుల్ని, నిలదీస్తాయి. శాస్త్రీయతనీ, అశాస్త్రీయతనీ వేరు చేసి చూపెడతాయి. మంచికీ చెడుకూ మధ్యన గోడలు కడతాయి. పాఠకుడు సమగ్ర మానవ వాదిగా మారే అవకాశాన్ని కలిగిస్తాయి.

అబద్దాల వేట - నిజాల బాట పరిష్కరించటంలో నాకు ఎదురైన రెండు విషయాలు మీ ముందుంచుతున్నా. ఒకటి సమకాలీనత. ఈ వ్యాసాలు రాసే సమయం వ్యాసం చివరన ప్రచురణయిన పత్రికతో సహా యిచ్చాను. ఆ సంఘటనలు, అందులో వ్యక్తులు ఆ సమయంలో ప్రవర్తించిన తీరు తెన్నులు, వాటి చారిత్రాత్మక ప్రాముఖ్యత మనం గుర్తించాలి. రెండవది. ఈ వ్యాసాల్లో కొన్ని విషయాలు, సంఘటనలు అక్కడక్కడా రెండు మూడు సార్లుగా తటస్తిస్తాయి. అవి వేర్వేరు పత్రికల్లో వేర్వేరు సమయాల్లో ప్రచురిత మయ్యాయి. అలాంటివి వీలైనంత తక్కువగా వచ్చేటట్లు ప్రయత్నించాను.

ఇన్నయ్యగారు రాసిన రాస్తున్న ఎన్నో విషయ ప్రాముఖ్యతా వ్వాసాల్లో ఇవి కొన్ని మాత్రమే. ఇన్నయ్యగారికి, వారి కలానికి రిటైర్‌మెంట్ లేదు. భవిష్యత్తులో ఇలాంటి సంకలనాలు మరెన్నో రావాలని అశిస్తున్నా. ఈ పుస్తకం మీ ముందుంచటంలో ఇన్నయ్యగారి సతీ మణి శ్రీమతి వెనిగళ్ళ కోమల సహాయం ఎనలేనిది. వారికి నా కృతజ్ఞతలు. పరిష్కరించటంలో ఏవేని తప్పులు దొర్లి వుంటే మన్నించమని పాఠకుల్ని, రచయితను వేడుకుంటున్నా. అందుకు ఇది రాయటం అవసరమే.

- ఇసనాక మురళీధర్