Jump to content

అబద్ధాల వేట - నిజాల బాట/బాబా ఏమైనా చేయగలడు!

వికీసోర్స్ నుండి
బాబా ఏమైనా చేయగలడు!

సంసార స్త్రీలు తమ ఇళ్ళలో యిబ్బందుల్ని బాబాలకు, మాతలకు, సోది చెప్పేవారికి విన్నవించుకుంటారు. స్త్రీల చేతనే అన్నీ ఏదో విధంగా రాబడతారు. పరిష్కారం చెప్పినట్టు నటిస్తారు. ఈలోగా దక్షిణలు, కానుకలు, ఎన్నో స్వాములకు చేరిపోతాయి, కొన్ని సందర్భాలలో స్త్రీలను భయకంపితుల్ని చేసి, వారి నుండి లబ్ధిపొందే స్వాములూ వున్నారు. స్త్రీలలో నమ్మకాలు క్రమంగా వారి సంతానానికి సంక్రమిస్తాయి. గుడికి పోవడం, మొక్కుబడులు, తాయెత్తులు, ఒకటేమిటి? అన్ని లక్షణాలు చిన్నప్పటినుండే వస్తాయి. అవి పెద్ద అయినా పోవు.

హేతువాది ప్రేమానంద్ కు బొంబాయిలో యిలాంటి ఘట్టం ఒకటి తటస్తపడింది. ఒక బాబాచే బాధితురాలైన స్త్రీని విమోచన చేయమని ఆమె కుమారుడే వచ్చి కోరాడు. బాబా చేసిన కొన్ని మంత్రతంత్రాలు, మహత్తులు ప్రేమానంద్ చేసి చూపగా, ఆమెకు మబ్బు విడిపోయి, యథాస్థితికి వచ్చింది.

మట్టితెచ్చి, పొట్లంలో చుట్టి నోటిదగ్గరగా తీసుకెళ్ళి ప్రేమానంద్, ఏవో మంత్రాలు చదివాడు. అలా మంత్రాలు చదువుతూనే మట్టి పొట్లాన్ని చేతివేళ్ళమధ్యదాచి, అంతకుముందా వేళ్ళమధ్యదాచిన పసుపు పొట్లం అరచేతిలోకి తెచ్చాడు. చుట్టూ గుమిగూడినవారు మట్టికాస్తా పసుపుగా మారడంపట్ల ఆశ్చర్యపోతుండగా ప్రేమానంద్ తన జేబులో చేయి పెట్టి అంతకుముందే పెట్టిన నిమ్మబద్దను చూపుడువేలితో రాశాడు. తరువాత చూపుడువేలును పసుపుతో రాస్తాడు. అది కాస్తా ఎర్రకుంకుమ రంగులోకి మారుతుంది. మట్టి ముందుగా పసుపుగా మారి తరువాత కుంకుమగా ఎలా మారిందీ ప్రేమానంద్ వివరించేసరికి, భక్తులకు మాయ కాస్తా పొర తొలగినట్లు తొలగింది.

టెంకాయ భక్తి

భక్తికీ కొబ్బరికాయలకూ చిరకాలంగా సన్నిహిత సంబంధం వుంది. కొబ్బరిబొండాలతో, టెంకాయలతో చిత్రవిచిత్ర చర్యలుచూపి భక్తులను ఆకట్టుకోవడం, భయపెట్టడం కూడా చూస్తున్నాం. కేరళలో యిది మరీ ఎక్కువ.

కొబ్బరికాయలు తలకు వేసి కొట్టుకొని అది భక్తిగా కొందరు ప్రదర్శిస్తారు. కొబ్బరికాయ పగులగొట్టినప్పుడు రెండు సమాన భాగాలైతే మంచిదనీ, ఒకే దెబ్బతో పగిలితే శుభమనీ, అలాంటి నమ్మకాలెన్నో వున్నాయి. కొబ్బరికాయ పగులగొట్టినప్పుడు లోన పుష్పాలు, రంగునీళ్ళు, ఎరుపు కనిపిస్తే దానిపై వ్యాపారం చేసి, చిత్రవిచిత్ర వ్యాఖ్యానాలు చేసే గ్రామ వైద్యులున్నారు, భూతవైద్యులున్నారు. ఇలాంటి కొమ్మరికాయ మహత్తులను హేతువాదులు, ప్రేమానంద్ ఆధ్వర్యాన ఎన్నో పర్యాయాలు బట్టబయలు చేశారు. అందులో కొన్ని చూద్దాం. లేత కొబ్బరికాయలు మూడు కన్నులచోట తలకేసి కొడితే వూరికే పగులుతాయి. అలాంటివి కేరళలో, శ్రీలంకలో 101 తలకు కొట్టుకొని అదే మహత్తుగా చూపిన బాబాలున్నారు. అలాంటి కొబ్బరికాయలలో ముదురుకాయల్ని హేతువాదులు చాటుమాటుగా పెట్టినప్పుడు బాబాలకు నొసట రక్తం కారింది. కాని, కొబ్బరికాయ పగలలేదు!

గట్టి టెంకాయ పగులగొట్టాలంటే తలకు దెబ్బ తగులుతుంది. కొబ్బరిపీచు తీసేసి కత్తితో మెల్లగా కొట్టి, చిట్లే వరకూ చూడాలి. తరువాత మూడు రోజులు ఎండబెట్టి,చిట్లినచోట కుంకుమ గంధంరాసి, మంత్రాలు చదువుతూ,భక్తుల ఎదుట, తలకు, కొట్టుకుంటే వూరికే పగులుతుంది. చిట్లిన విషయం వారికి తెలియదుగదా.

కొబ్బరికాయ పీచు తీసేసి నిమ్మరసం వున్న పాత్రలో పెట్టి తరువాత మూత తీయాలి. అప్పుడు కొబ్బరికాయపై మంత్రాలు చదువుతూ నీళ్ళు చల్లితే, పగులుతుంది. కొబ్బరికాయ పీచుతీసి, కన్నులవద్ద పట్టుకోడానికి వీలుగా పీచు అట్టిపెట్టాలి. ఇంజక్షన్ తో నీళ్ళు కలిపిన పొటాషియం పర్మాంగనేటు ద్రావణాన్ని మెత్తని కన్ను ద్వారా పంపాలి. తరువాత మైనం పెట్టాలి. పట్టుకొనే పీచులో సోడియం మెటల్ ముక్క పెట్టాలి. భక్తుణ్ణి పట్టుకోమని, మంత్రాలు చదువుతూ, కొబ్బరికాయపై నీళ్ళు చల్లాలి. హఠాత్తుగా నిప్పు రగులుతుంది. కొబ్బరికాయ పగిలి, ఎర్రని రక్తం వంటి ద్రవం కారుతుంది. నీటితో కలిసిన సోడియం రసాయనిక మార్పు అది. మహత్తుగా దీనిచుట్టూ ఎన్నో కథలు అల్లవచ్చు.

బాబా దర్శనం

షిర్డి సాయిబాబా భక్తి యిటీవల ఎక్కువగా ప్రవహిస్తున్నది. "నేను షిర్డీసాయి అవతారమని" సత్యసాయి లోగడ చెప్పాడు. చెన్నారెడ్డి మొదలు ఎన్.టి. రామారావు వరకూ షిర్డిసాయి భక్తులే. రాజకీయవాదులు కొత్తగా భక్తి పెంచుకుంటే, మూలపురుషుణ్ణి కూడా సందేహించాలి.

షిర్డీసాయి గురించి సినిమాలు వచ్చాయి. చిత్రవిచిత్ర కథలు ప్రచారంలో వున్నాయి. భక్తులు కొందరు ఆయన ఫోటో,చిత్రపటం తమ ఇళ్ళలో కనిపిస్తున్నట్లు చూపుతున్నారు. ఇదెలా సాధ్యం?

గ్లాస్ ప్లేటు శుభ్రంగా కడిగి, ఆరబెట్టాలి. హైడ్రోఫ్లోరిక్ ఆమ్లం(యాసిడ్)లో ముంచిన స్టీల్ పెన్ తో షిర్డిసాయి బొమ్మ వేయండి. 10 నిమిషాల తరువాత మంచినీటితో కడగండి. గ్లాస్ ఎండబెట్టి లేదా ఆరబెట్టి వస్త్రంతో తుడిస్తే ఏమీ కనిపించదు. గ్లాస్ పై గాలి వదలండి. షిర్డిసాయి బొమ్మ వస్తుంది. గాలిలో తేమ ఆరగానే బొమ్మ అదృశ్యమవుతుంది. దేనిపై భక్తుల్ని ఎంతైనా మోసగించవచ్చు.

మీరు సత్యసాయి భక్తులైతే ఇంకో విచిత్రం చేసి మహత్తుగా చలామణి చేయవచ్చు. ఫోటోపేపర్ పై సత్యసాయి బొమ్మవేసి, మంచినీటితో కడగండి. మెర్క్యురిక్ క్లోరైడ్ ద్రావణంలో ఫోటోపేపరు వుంచి, బయటకు తీసి ఆరబెట్టండి.

భక్తుల్ని కూడగట్టండి. సత్యసాయి నిజమైన భక్తులకు కనిపిస్తాడని కథలు అల్లండి. ప్రార్థనలు చేయించండి. హైపో సొల్యూషన్ లో ఫోటో పేపరు వుంచితే, సత్యసాయి ఫోటో కనిపిస్తుంది. దీనిపై ఎంత గిట్టుబాటు అయితే అంత చేసుకోవచ్చు.

బట్టలు తగులబడుతున్నాయ్!

మన గ్రామాలలో బాణామతి, చేతబడి,దయ్యాలు, భూతాలు, పిశాచాలు, హస్తలాఘవాలు ఇంకా ఎన్నో జనాన్ని పట్టి పీడిస్తున్నాయి. వీటి ఆధారంగా ప్రజలను ఏడిపించే మంత్రగాళ్లు, భూతవైద్యులు, గ్రామవైద్యులు ఉండనేవున్నారు. అలాంటివారికి విపరీతమైన గౌరవం యిస్తూ, వారంటే భయపడుతూ వుండడంతో, వారు యింకా వ్యాపారం చేస్తున్నారు. ఉన్నట్లుండి యింట్లో బట్టలనుండి నిప్పు వస్తుంది. ఆరుబయట ఆరవేసిన వస్త్రాలు అంటుకొని నిప్పు రాజుతుంది. ఇంకేముంది? ఆ సంఘటన చుట్టూ కథలు అల్లుతారు. శాంతి చేయించమంటారు. కొన్నాళ్లు యిల్లు పాడుబెట్టమంటారు. ఎవరో చేతబడి చేయించారంటారు. దోషం పోవడానికి ఏమేమి చెయ్యాలో చెబుతారు.

ఇంటి బయట బట్టలు ఆరేయండి. పచ్చ ఫాస్ఫరస్ ఒక పాలు, కార్బన్ డైసల్ఫైడు ఆరు పాళ్లు కలపండి. కొద్దిగా బట్టలపై చల్లండి అలా చల్లింది ఆరగానే కాసేపట్లో నిప్పు అంటుకొంటుంది. ఇంట్లో అలమరలో పెట్టిన దుస్తులలోనూ యీ ద్రావకం చల్లవచ్చు. యింటిలోని వారిని ఏడిపించడానికి ఇలాంటి పనులు రహస్యంగా చేస్తుంటారు. జాగ్రత్తగా కనిపెడితే ఎవరు చేస్తున్నదీ అర్థమవుతుంది.

సాధారణంగా ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు, మూలకారణం పరిశీలించకుండా, మతపరమైన మూఢనమ్మకాల వలన భూతవైద్యుల్ని,సోది చెప్పేవారిని పిలుస్తుంటారు.

ఏసుక్రీస్తు మహిమలు

మహత్తుల పేరిట జనాన్ని ఆకర్షించడం హిందువుల సొత్తు మాత్రమే కాదు. అన్ని మతాల్లోనూ యివి కొద్దో గొప్పో వున్నాయి. క్రైస్తవులలో కొన్ని శాఖలు మహిమలను ఖండిస్తాయి. మరికొన్ని తటస్థ వైఖరితో వున్నాయి. కేథలిక్ లు, ఎవాంజలిక్ లు,మరికొందరు మహత్తులున్నాయంటారు. బైబిల్ మహిమల ప్రస్తావన వుంది.

ప్రపంచంలో క్రైస్తవ మహిమలు జరగడం, వాటిని పోప్ గుర్తించడం ఒక చరిత్రగా కొన్ని వందల సంవత్సరాల నుండీ జరుగుతున్నది. మేరీమాత విగ్రహం కన్నీళ్ళు పెట్టడం, క్రీస్తు సమాధిపై కప్పిన బట్టపై క్రీస్తుముద్ర పడిందనడం, ఆఫ్రికాలో ఎడారి ఇసుకలో క్రీస్తు పాదాల ఆనవాళ్ళు వున్నాయనడం వింతగా చెబుతారు.

క్రైస్తవ మఠాధిపతులు, ఫాదరీలు అప్పుడప్పుడు కొన్ని మహిమలు చేసి ప్రచారంలోకి తెస్తుంటారు. హేతువాదులు జేమ్స్ రాండి, ప్రేమానంద్ యిలాంటివి బయటపెట్టారు. క్రైస్తవమత ప్రచారకులు అత్యంత ఆధునాతన టి.వి.రేడియో మొదలైన ప్రసార సాధనాలు వాడుతున్నారు.

దేవాలయంలో కొవ్వొత్తిని ఫాస్ఫరస్ ద్రావణంలో ముంచి నిలబెడతారు. ద్రావకం తడి వున్నంతసేపూ ప్రార్థనలు చేస్తారు. ఆ తరువాత తడి ఆరగానే కొవ్వొత్తి అంటుకుంటుంది. అదొక గొప్ప క్రీస్తుమహిమగా చూపుతారు.

మరో కొవ్వొత్తి స్టాండులో కొవ్వొత్తి ప్రక్కన క్రోమిక్ యాసిడ్ స్ఫటికాలు వేయాలి. ఇంకో కొవ్వొత్తిని ఆల్కహాలులో ముంచాలి. ఆల్కహాలులో ముంచిన కొవ్వొత్తిలో క్రోమిక్ యాసిడ్ స్ఫటికాలున్న కొవ్వొత్తిని తాకిస్తే రెండూ వెలుగుతాయి. అప్పుడు కూడా ప్రార్థనలు చేసి ఏసు మహిమగా చెబితే పరీక్ష చేయకుండా నమ్మే భక్తులు నమ్ముతారు.

జ్వాలాముఖి మహత్తు

ఉత్తరాదిలో గోరక్ నాథ్ దిబ్బ జ్వాలాముఖి గుడిలో వుంది. భక్తులు యీ గుడిని సందర్శించినప్పుడు బుడగలతో వుడికిపోతున్న నూనె కనిపిస్తుంది. భక్తులు ఆ దృశ్యం తిలకించి, కానుకలు సమర్పిస్తారు అద్భుత దృశ్యంగా చూచి మహత్తుగా భావిస్తారు. భక్తుల తలలపై మండే నూనెను పురోహితుడు చల్లినప్పుడు, అది మంచువలె చల్లగా మారుతుంది. కొందరు శాస్త్రజ్ఞులు సైతం ఈ దృశ్యం చూచి, తమ కళ్ళను తామే నమ్మలేకపోయారు.

జ్వాలాముఖి గుడి నూనె బావిలో బుడగలు వస్తున్నమాట వాస్తవం. పురోహితుడు ఒక కాగితాన్ని వెలిగించి, నూనెపై వుంచితే గాస్ తగులబడుతుంది. అలాంటి నూనె పురోహితుడు భక్తులపై చల్లితే మంచు నీరుగా ఎలా మారుతుంది? హేతువాది ప్రేమానంద్ ఈ గుడి సందర్శించి, జరుగుతున్నదంతా గమనించాడు. సహజవాయువు బయటకు వచ్చేచోట జ్వాలాముఖి గుడిని నిర్మించారు. ఒక గొట్టం ద్వారా వచ్చే గాస్ నిరంతరం వెలుగునిస్తుంటుంది. గాస్ బావి ప్రక్కగా ప్రవహించే నీటిబుడగల్ని చూచి, గాస్ ప్రవాహం వలన అవి ఏర్పడుతున్నాయని భక్తులు భావిస్తున్నారు, నీటిబుడగలు సహజవాయువుతో కలిసినప్పుడు తుకతుక వుడుకుతున్న నూనె వలె కనిపిస్తున్నది. నీటిలో గాస్ కలుస్తున్నందున, అది కలుషితమై క్రూడ్ ఆయిల్ వలె మడ్డిగా వుంటున్నది. అందులో చేయి పెడితే చల్లగా వుంటుంది. అదే పురోహితుడు చేసే మహత్తు.

సంతాన ప్రాప్తి

గొడ్రాలు అంటే పాపిష్టిదానిగా చూచే సమాజం కనుక, పెళ్ళి అయిన ప్రతి స్త్రీ సంతానం కోరుకుంటుంది. ఎన్నాళ్ళకూ సంతానం కలుగకపోతే వైద్యపరీక్షలు చేయించుకొనే బదులు బాబాల దగ్గరకు పోతారు. మూఢనమ్మకాలకు ఇదొక పెద్ద నిదర్శనం బాబా చెప్పినట్లు చేస్తారు. లింగాలకు మొక్కుతారు.

కాలభైరవ రాయికి మొక్కితే పిల్లలు పుడతారని ఆంధ్రలో నమ్మకం వుంది. ఇలాంటివి ఇతర రాష్ట్రాల్లో వున్నాయి కూడా. చాలా మంది ఇది నిజం అని నమ్ముతారు. కొంతకాలంగా సంతానం లేనివారికి గర్భగుడిలో అర్ధరాత్రి పూజలు చేస్తే పిల్లలు పుట్టినట్లు చెబుతారు.

ఒక పూజారి కాలభైరవ గుడిని అంటిపెట్టుకొని, సంతానప్రాప్తి కలిగిస్తున్నాడనే వార్త విని హేతువాది ప్రేమానంద్ వెళ్ళాడు. డబ్బు సమర్పించుకొని, తనకు సంతానప్రాప్తి కలిగించమని వేడుకున్నాడు. వెంట స్నేహితుడి భార్యను తీసుకెళ్ళాడు. వీరు చెప్పినదంతా విన్న అనంతరం పూజారి పంచలోహపాత్రలో బియ్యం పోసి, కత్తి మధ్యలో పెట్టి, మంత్ర పఠనం చేసి,పాత్రను కత్తితో పైకిలేపాడు. అంతకు ముందు ప్రాయశ్చిత్త క్రతువు చేశాడు. తరువాత గర్భగుడిలో ఆమెను లింగపూజ చేయమని అందరినీ వెళ్ళిపొమ్మన్నాడు. చీకట్లో ఏదో మెదులుతుండగా ఆమె ఒక పీటతో గట్టిగా మోదింది. పూజారి తల పగిలింది. లింగం కూడా పగిలింది. తలుపు కొట్టగా బయట వేచివున్న ఆమె భర్త, హేతువాది ప్రేమానంద్ తలుపు తెరిచారు. లోగడ స్త్రీలకు సంతానప్రాప్తి ఎలా కలిగిందో దీనివలన అర్థమైంది.

మహారాష్ట్రలోని సతారాలో యిలాంటి బాబాను అంధశ్రద్ధ నిర్మూలన సమతి బట్టబయలు చేసింది.

దేవుడికి ఎన్ని రూపాలో!

దేవుడి పేరిట జరుగుతున్న ఆధ్యాత్మిక వ్యాపారం నిరంతరం కొనసాగుతున్నది. జనాకర్షణలో యిదొక వింతగా వుంటున్నది. గ్రామాలలో తరచు సాధువులు, యోగులు, బాబాలు, మాతలు ఎక్కడినుంచో వచ్చి చిన్న ప్రయోగాలు చేస్తారు. అది వింతగా చూచి, అద్భుతంగా భావించి కానుకలు సమర్పిస్తారు. గిట్టుబాటు కాగానే స్వామీజి మరో గ్రామానికి తరలివెడతాడు. ఇదంతా దైవం పేరిట జరిగే పెట్టుబడిలేని వ్యాపారమే. అలాంటి సంపాదనకు పాల్పడేవాణ్ని-డబ్బు, ఆస్తి ఎలా వచ్చిందని అడిగేవారు లేరు. మతం యొక్క గొప్పతనం అలాంటిది.

ఇంద్రియాతీత శక్తులున్నాయనే యోగి బొటనవేలి గోటిలో సోడియం దాచి, ఒక వేడినీటి పాత్రపై చేయి తిప్పినట్లు చూపి, సోడియం అందులోకి జారవిడుస్తాడు. మంత్రాలు చదువుతుంటాడు. నీటి నుండి మంటలు రావడంతో అది ఒక దైవశక్తిగా జనం భ్రమిస్తారు.

మరొక యోగిపుంగవుడు తన దివ్యమహిమ చూపడానికి నోటి నిండా నీరు నింపి సిపి ఈధర్, పొటాషియం లోహముక్కగల నీటిపాత్రలో పూస్తాడు. పొటాషియం లోహపుముక్క తగులుకొని ఈధర్ కు అంటుకోగా నీటిపై మంటలు కనిపిస్తాయి. స్వామీజీ నోటి నీటికి అంత శక్తి వున్నదన్నమాట.

ఇంకొక పవిత్ర స్వామీజీ వంటినిండా దైవం పేరు కనిపిస్తుంటుంది. ఆయన యజ్ఞం చేస్తుండగా,యిలా దైవం పేరు కనిపించడం వలన భక్తులు సాష్టాంగపడతారు. ఏదైనా పాలు కారే కొమ్మ విరిచి, దానితో దేహంపై యిష్టదైవం పేరు రాయాలి. దీని బదులు సబ్బు వాడొచ్చు. అలా రాసిన తరువాత ఆరనివ్వాలి. యజ్ఞగుండం వద్ద వేడికి స్వామీజీకి చెమట పట్టినప్పుడు స్వామీజీపై భక్తులు విభూది చల్లుతారు. అప్పుడు లోగడ రాసిన దైవనామం కనిపిస్తుంది.

ఇంకా కొందరు యోగులు కుంచెను పొటాషియం ఫెర్రొసైనైడ్ ద్రావణంలో ముంచి చేతిమీద దైవనామం రాసి ఆరబెడతారు. ఐరన్ క్లోరైడ్ ద్రావకంలో దూదిగాని,వస్త్రంగాని ముంచి లోగడ దైవనామం రాసినచోట తుడిస్తే నీలం రంగులో ప్రత్యక్షమై, భక్తుల్ని ఆశ్చర్యపరుస్తుంది. ఇలాంటి చిత్రవిచిత్రాలతో అమాయకులైన, అజ్ఞానులైన భక్తుల్ని మోసగించి, భ్రమింపజేసి తాత్కాలికంగా లబ్ధిపొందవచ్చు.

చిట్కాలతో సంతానం

పిల్లలు పుట్టని వారికి మానసిక బలహీనత వుంటుంది. ఎలాగైనా సరే సంతానం పొందాలి. ఆ బలహీనతను ఆసరాగా తీసుకొని ఇరుగుపొరుగువారు సలహాలు చెబుతుంటారు. మొక్కుబడులు చేయిస్తుంటారు. గుడులకు పంపిస్తుంటారు, అంతటితో ఆగక,బాబాలకు, మాతలకు పరిచయం చేస్తుంటారు. సంతానం కలిగిస్తామని చెప్పే బాబాలు అనేక చిట్కాలు చేయిస్తారు. ధనాన్ని వివిధ రూకాలుగా రాబడతారు. కొందరు ఇళ్ళలో తిష్టవేసి ఏవేవో పూజలు, వ్రతాలు, యజ్ఞాలు, క్రతువులు చేయిస్తారు. ఆ విధంగా ఖర్చుపెట్టి ఆరిపోయిన వారున్నారు. అయితే సంతాన ఆశ వారిచేత ఏ పనైనా చేయిస్తుంది. ఎంతకూ తమ ఖర్మ అనుకుంటారే గాని, చేస్తున్న పనులకూ, సంతాన ప్రాప్తికీ సంబంధం లేదని గ్రహించరు.

ఒక స్వామి సంతానప్రాప్తి పరీక్షగా పాత్రలో బియ్యం పోసి, కత్తి అందులో దింపి, కత్తితో పైకెత్తినప్పుడు పాత్ర పైకిలేస్తే, సంతానప్రాప్తి కలుగుతుందనీ, లేకుంటే లేదనీ చెబుతాడు. హేతువాది ప్రేమానంద్ కొన్ని వేల పర్యాయాలు ఈ చిట్కా వేసి చూపెట్టాడు. దీనికి సంతానానికి ఎలాంటి కార్యకారణ సంబంధం లేదని స్పష్టం చేశాడు.

అడుగుభాగం వెడల్పుగానూ, మూతివద్ద సన్నంగానూ వుండే పాత్ర తీసుకోండి. అందులో బియ్యం నింపి, ఒక నిడువైన కత్తితో పొడుస్తూ వుండండి. బియ్యం పాత్ర అడుగున బాగా బిగుసుక పోయినప్పుడు కత్తిని అడుగువరకూ దింపి, పిడి పట్టుకొని పైకి ఎత్తితే బియ్యం పాత్ర పైకి లేస్తుంది. బియ్యం బాగా బిగుసుకు పోవడం యిక్కడ ముఖ్యం. అలా జరిగిన తరువాత కత్తిని దింపితే, గట్టిగా పట్టుకుంటుంది. దీనికీ సంతానానికీ ముడిపెట్టడం హేతుబద్ధం కాదు. అయినా ఇదొక గొప్ప విషయంగా నమ్మేవారున్నారు.

రక్తంతో కైంకర్యం

గ్రామాలలో అప్పుడప్పుడు భీభత్స దృశ్యాలు చూస్తాం. జుట్టు విరబూసుకొని, చొక్కాలేకుండా, పూసలు, రుద్రాక్షలు ధరించిన భక్తుడు,మాంత్రికుడు, ఫకీరు యింకా యిలాంటివారు తమ శరీరాన్ని కొరడాతో కొట్టుకుంటారు. కొందరు కత్తితో చేతుల్ని, కాళ్ళని కోసుకొని రక్తమయం చేస్తారు. అది చూచి భక్తులు కానుకలు సమర్పిస్తారు.

శరీరం మీద గాని లేదా చేతులపై గానీ ఫెర్రోక్లోరైట్ ద్రావకం పూయాలి. సోడియం సల్ఫోసనైడ్ ద్రావకంలో కత్తిని ముంచాలి. ఎక్కడ ఫెర్రిక్లోరైడ్ పూసారో, అక్కడ కత్తితో నరికినట్లు నటిస్తే రక్తపు చారలు వచ్చినట్లు కనిపిస్తుంది. జనం వెళ్ళిపోయిన తరువాత తడిబట్టతో తుడిచేయవచ్చు. మరొక తీరులో చేతిమీద లేదా శరీరంపైన ఫెర్రిక్ అమోనియం సల్ఫేట్ ద్రావకం రాయాలి. సోడియం సాలిసిటేట్ లో కత్తిని ముంచి శరీరంపైనా,చేతిమీదా తాకిస్తే ఎర్రని మరకలు వస్తాయి. భక్తులు చందాలిచ్చి వెళ్ళిన తరువాత తడిగుడ్డతో తుడిచేయాలి. కాళీమాతను లేదా అమ్మవార్లను సంతృప్తిపరచే వంకతో కొరడాతో బాదుకొనడం మరో భక్తి నిదర్శన సంఘటనే. కొరడా చివరి వరకూ జాగ్రత్తగా మెలికలు తిప్పితే చప్పుడు వస్తుందే కాని దెబ్బ తగలదు. కొరడా చివర ముడివేస్తే అది తగిలిన చోట చర్మం చిట్లుతుంది. ఇది ప్రాక్టీసు చేసిన పూనకభక్తులు చూచేవారిని దడిపించేటట్లు మంత్రాలు ఉచ్ఛరిస్తూ, భయంకర శబ్దాలు చేస్తుంటారు.

తాంత్రికుల అగ్నిపరీక్ష

తాంత్రికవిద్య వింతగా, భయానకంగా వుంటుంది. తాంత్రిక యోగంలో స్త్రీవుండాలనేది నిషేధానికి గురైంది. తాంత్రిక విద్య బహుళ ప్రచారం పొందకపోయినా, అక్కడక్కడా ఆచరణలో వుంది,తాంత్రికులు అనేక విచిత్రచర్యలు చేస్తుంటారు. వారి భీభత్సభక్తికి నిదర్శనగా చాలా ప్రయోగాలు పేర్కొనవచ్చు.

ఒక లోహపాత్రలో రంపపుపొడి వుంచి అందులో సోడియం పెరాక్సైడ్ పొడి కలుపుతారు. భక్తులలో ఒకరిని పిలిచి నీళ్ళు తెమ్మంటారు. నీళ్ళు గుక్కెడు తాగి, రంపపు పొట్టుపై వదులుతారు. నీరు తగలగానే సోడియం పెరాక్సైడ్ వలన మంటలు లేస్తాయి. అప్పుడు తాంత్రికుడు ఏవో మంత్రాలు ఉచ్చరిస్తాడు. భక్తులు అదంతా మహిమగా స్వీకరిస్తారు.

పూనకం వచ్చినట్లు నటించే తాంత్రికుడు ఏవో సోది భవిష్యత్తు కబుర్లు చెబుతాడు. పొటాషియం నైట్రేట్ ద్రావకంలో నాలుగు పర్యాయాలు నారను ముంచి ఎండనిస్తారు. ఒకవైపు నారతాడు వెలిగించి మిగిలిన తాడు దూదితో వుండగా చుడతాడు. ఆ వుండను నోటిలో పెట్టుకుంటాడు. నోటితో గాలి వదులుతుంటే మంటలు వస్తుంటాయి. నోటిలో బాగా లాలాజలం వూరిన తర్వాత ఇలా చేస్తాడు. నోటిలో వుండ వున్నంతసేపు గాలి వదలడం తప్ప, పీల్చడు. తరువాత ఒక వస్త్రంతో నోటిలోని వుండ తీస్తాడు. అలా చేసినప్పుడు భక్తులు మంత్రాలు చదువుతుండగా శిష్యులు హావభావాలు చేస్తూ, కానుకలు వసూలుచేసి పెడతారు.

పక్షితీర్థంలో దైవం

తమిళనాడులో చాలాకాలంగా యాత్రికులు సందర్శనంచేసే స్థలం ఒకటి వుంది. తిరుపుర కుండ్రం అనే ఈ స్థలం దగ్గర యాత్రికులు ఆగుతారు. మధ్యాహ్నం సరిగా 12 గంటలకు రెండుగద్దలు వచ్చివాలతాయి. అక్కడ పురోహితుడు యిచ్చే ప్రసాదం స్వీకరించడానికి పక్షిరూపంలో సాక్షాత్తు గరుడపక్షులు వస్తాయని కథ ప్రచారంలో వుంది. విష్ణు వాహనంగా గరుడపక్షి వుండడం పురాణకథనం కాగా, ఆ దేవాలయం విష్ణు దేవాలయం కావడం ఒక కారణంగా పేర్కొంటారు. ఏమైనా రెండు పక్షులు వేళ తప్పకుండా నిత్యమూ రావడం వాస్తవం. ఏమిటి విచిత్రం? హేతువాది ప్రేమానంద్ ను భక్తులు అడిగారు. హేతువాదులు కార్యకారణ అణ్వేషణ సాగించారు. ప్రేమానంద్ నిశిత పరిసీలనలో తేలిన అంశం. రెండు గద్దలను పట్టుకొని వాటికి యిచ్చే ఆహారంలో నల్లమందు కలిపారు. అలా నల్లమందుకు(ఓపియం) అలవాటుపడిన రెండు పక్షులు రోజూ రావడం ఆరంభించి, అలవాటు చేసుకున్నాయి. అలవాటు అయిన తరువాత పక్షుల్ని వదిలేసినా తప్పనిసరిగా వస్తున్నాయి.

పురాణకథలు ఎన్ని చెప్పినా అసలు రహస్యం యిది. భక్తులు ఎన్ని కానుకలు సమర్పించినా వాస్తవం యిదే.

తాయెత్తులు,తాంత్రికుల చిత్రాలు:

మన జనాల్లో, చదువుకున్నవాళ్ళతో సహా తాయెత్తులపై నమ్మకాలు ఎక్కువ. ఈ తాయెత్తులు అనేక రూపాలలో వుంటాయి. రుద్రాక్షలు, వెండి,రాగి బొమ్మలు, ఉంగరాలు,మాలలు ఇంకా ఎన్నో వున్నాయి. కొందరు చిన్న కడియాలు చేతికి, కాలికి ధరిస్తారు. రాగి కడియాల వలన శరీరంపై ప్రభావం వుంటుందని నమ్ముతారు. అప్పుడప్పుడూ ఇళ్ళకు వచ్చే బాబాలు, తాంత్రికులు తాయెత్తులు యిస్తుంటారు. అవి ధరిస్తే అశుభాలు పోతాయని, మంచి జరుగుతుందని నమ్ముతారు. ఇంట్లో కాళీమాత వంటి దేవతల ఆగ్రహం పోగొట్టడానికి తాయెత్తులు ధరించడమేగాక, రక్తాన్ని అర్పించే క్రతువులు చేస్తుంటారు.

తాంత్రికులు తాయెత్తు మహిమ చూపే తీరులు ఎన్నో వున్నాయి. రాగి బొమ్మను ఎమిరి పేపర్ తో శుభ్రంచేసి మెర్క్యురస్ నైట్రేట్ ద్రావణంలో ముంచుతారు. మెత్తని వస్త్రంతో బాగా రుద్దితే, వెండివలె కనిపిస్తుంది. అల్యూమినియం ఫాయిల్ గట్టిగాచుట్టి భక్తుడికి ఇస్తారు. దానిపై ఏకాగ్రతతో ధ్యానం చేయమంటారు. పిడికిలి గట్టిగా బిగించి తాయెత్తు పట్టుకోమంటారు. కాసేపట్లో రసాయనిక మార్పువలన వేడెక్కి వెండి ఫాయిల్ తొలగించి చూస్తే, విభూతి వంటి పౌడర్ కనిపిస్తుంది. అది కళ్ళకు అద్దుకుంటారు.

ఇంట్లో శాంతి జరపడానికి తాంత్రికులు,మాంత్రికులు గమ్మత్తు పనులు చేసి తమ ముడుపులు వసూలు చేసుకుంటారు. యజ్ఞగుండం ఏర్పరచి కట్టెలలో నెయ్యి వేస్తారు. ఒక ప్లేటులో పొటాషియం పర్మాంగనేటు బొట్లు వేసి అందులో నీళ్లుపోస్తారు. రక్తంవలె కనిపించే ఆ నీటిప్లేటులో దీపం వెలిగించి, మధ్యలో పెట్టి, దానిపై ఒక మూత వేస్తారు. పాత్రలోని ఆక్సిజన్ అయిపోగానే దీపం ఆరిపోతుంది. నీటిలో కార్బన్ డయాక్సైడ్ కలిసి, శూన్యప్రదేశం ఏర్పడగానే పాత్రలోకి నీరు పీల్చుకుంటుంది. ప్లేటులోని నీరు(రక్తం వలె కనిపించేది) పాత్రలోనికి పోగానే, దేవత శాంతించినట్లు వ్యాఖ్యానించి, డబ్బు వసూలు చేసుకొని మాంత్రికుడు నిష్క్రమిస్తాడు. గృహస్థులు తృప్తిపడతాడు. మాంత్రికుడు ఏంచేసాడో హేతువాది ప్రేమానంద్ వివరిస్తాడు. అప్పుడు అందరికీ నిజం తెలుస్తుంది. సర్వరోగ నివారిణి ఆయిల్ పుల్లింగ్:

ఇటీవల చదువుకున్న వారినీ, సామాన్య అమాయకుల్నీ ఆవరించిన వైద్యం ఆయిల్ పుల్లింగ్. నూనె నోట్లో పోసుకొని కొంచెంసేపు పుక్కిలించి తరువాత వూసేయడం యిందులో ప్రధానం. మస్టర్డ్, సన్ ఫ్లవర్ ఆయిల్ వాడుతున్నారు. ఆయిల్ రంగు మొదట్లో ఎలా వున్నా నోట్లో పోసుకుని కాసేపు పుక్కిలించేసరికి, నోట్లో లాలాజలంతో కలసిపోతుంది. అలా కలవడం వలన నూనె రంగు మారుతుంది. రంగు మారటాన్ని చికిత్సగా భావిస్తున్నారు. అంతేగాక అన్ని రోగాలకు యిది మందు అని ప్రచారం చేస్తున్నారు. ఇలా నూనె పుక్కిలిస్తున్న వారు కొందరు తమకు ఏదో రిలీఫ్ యిచ్చినట్లున్నదని భావిస్తున్నారు. శరీరంలో సహజంగా వున్న రోగనిరోధకశక్తి వలన తగ్గిపోయే లక్షణాలుంటాయని వీరు గమనించడం లేదు.

తాంత్రికులు, మాంత్రికులు లోగడ కామెర్ల(జాన్ డిస్) రోగులకు ఆయిల్ యిచ్చి బాగా పుక్కిలించమనేవారు. కాసేపటికి వూసేస్తే అది లాలాజలంతో కలిసినందున పసుపుపచ్చగా మారేది. అది చూపించి, జబ్బు తగ్గిందని, పథ్యం చెప్పేవారు. కాలేయం, లివర్ కు విశ్రాంతి యిస్తే తగ్గే రోగాలకు అలా చెప్పి జనాన్ని భ్రమింపజేయడం చిరకాలంగా వస్తున్నదే.

ఒకవేళ లివర్(కాలేయం),కిడ్నీ జబ్బులు, ముఖ్యంగా కామెర్లు, తగ్గకపోతే, తాంత్రికులు, మాంత్రికులు బాధ్యత వహించరు. అప్పుడు రోగి కర్మగా చెబుతారు.

సమాధిలో యోగులు:

కారేశ్వరి బాబా సజీవ సమాధి అవుతారని ఢిల్లీలో వార్త ప్రాకింది. ఇంకేముంది? భక్తులు ఆఫీసులకు సెలవు పెట్టి వచ్చేశారు. బాబా గుడ్డి,చెవిటి,మూగవాడు. ఆ విషయం తెలిసి ఆయనపై యింకా ఆసక్తి పెరిగింది.

10 అడుగుల లోతు 2.5 అడుగుల చతురస్రపు సమాధి తయారుచేశారు. సిమెంటు చేసిన సమాధిలో కారేశ్వరి బాబా ప్రవేశించారు. అది 1980 అక్టోబరు మాసం.

సమాధిలో ప్రవేశించడం కళ్ళారా చూచిన భక్తులు, చుట్టూచేరి భజనలు చేశారు. 24 గంటల అనంతరం సమాధి తెరిచి చూచారు.

ఆశ్చర్యపోవాల్సిన భక్తులు నోరు నొక్కుకున్నారు. కారేశ్వరి బాబాను పురుగులు తింటున్నాయి. ఆయన చనిపోయాడు.

ఏం జరిగింది? మహత్తు ఏమైంది?

హేతువాది ప్రేమానంద్ భక్తులకు వివరించారు. సిమెంట్ చేయని సమాధి అయితే నేలలోని రంధ్రాల ద్వారా ప్రాణవాయువు వస్తుంటుంది. అందువలన 24 గంటలు వుండగలరు. సిమెంట్ చేసిన కారేశ్వరి బాబా నిమిత్తం ప్రత్యేకంగా ఆక్సిజన్ వచ్చేట్లు ఏర్పాటు చేశారు. అయినా ఎందుకు చనిపోయాడు? గాలి బయటకు పోవడానికి ఏర్పాట్లు చేయలేదు. వత్తిడి పెరిగినందున కారేశ్వరి బాబా చనిపోయాడు.

పైలట్ బాబా అనే అతడు కూడా జీవసమాధి అవుతానని చాలాసార్లు ప్రకటించాడు. కాని సాహసించలేకపోయాడు.

నిప్పులపై నడక:

ఇసుక వేస్తే రాలనంత జనం. బాబా నిప్పులపైన నడుస్తారని ఆనోటా ఆనోటా ప్రచారం అయింది. వూరి వెలుపల చింత నిప్పుల గుండం ఏర్పరచారు. చుట్టూ జనం వున్నారు. ఇంతలో ఎక్కడినుండో బాబా ఆ స్థలానికి చేరుకున్నారు. చింత నిప్పుల కణాలు గుండంలో వున్నాయి. ఆత్రుతగా జనం చూస్తున్నారు. పూర్వం సీతమ్మవారు యిలాగే రాములవారి కోరికపై నిప్పుల మీద నడచి పాతిప్రత్యం నిరూపించారని అనుకున్నారు. అంటే శీలపరీక్ష కూడా చింతనిప్పులు తేల్చి పారేస్తాయన్నమాట.

బాబా గబగబా కొన్ని సెకండ్లలో చెప్పులు లేకుండా అగ్నిగుండంలో 8 అడుగులు నిడివిని నడచి వెళ్ళారు. కళ్ళు మూసి తెరిచేలోపు జరిగిపోయింది. అద్భుతం అనుకున్నారు.

ఎక్కడి నుండో "ఆగండి" అంటూ కేక వినిపించింది. ప్రేమానంద్, మరికొందరు హేతువాదులు వచ్చారు. మేమూ నడుస్తాం అన్నారు. అంటూనే ముందుగా ప్రేమానంద్ నిప్పులపై నడవగా, ఆయన్ను అనుసరించి కొందరు హేతువాదులు నడిచారు.

బాబాగారంటే మహత్తు వలన నడిచారన్నారు. మరి వీరెలా నడవగలిగారు? ప్రేమానంద్ వివరించారు:

నిప్పు కణాలపై బూడిద వుంటుంది. అది వేడిని వెంటనే రానివ్వకుండా ఆపగల్గుతుంది. అలాంటి నిప్పులపై ఏడెనిమిది క్షణాలు నడిచినా కాలుకాలదు. ఎక్కువసేపు వుంటే కాలుతుంది. నిప్పుల్లో మేకులు, సీసపు పెంకులు, లోహాలు లేకుండా జాగ్రత్త పడాలి. వేడి పాత్రలో నీరు కాస్తే వేడి ఆవిరి వస్తుంది. అందులో చేయి పెడితే వెంటనే కాలదు. అయితే పాత్రకు చేయి తగలకుండా ఛూచుకోవాలి. ఏ బాబా కూడా కాలే లోహపుపాత్రల మీద, ఇనుపకడ్డీల మీద నడవలేడు.

హేతువాదుల వివరణతో బాబా పస తేలిపోయింది.

బాబా నిప్పు మింగాడు:

టక్కర్ బాబా విడిదిచేసి నెలరోజులైంది. పక్క గ్రామాలనుండి కూడా తండోపతండాలుగా జనం వస్తున్నారు. క్రమబద్ధం చేయడానికి పోలీస్ కూడా వచ్చింది. బాబా ఆదాయం పెరిగిపోతున్నది. పత్రికలవాళ్ళు,టి.వి. వాళ్ళు పోటీపడి బాబా మహిమల్ని చూపుతున్నారు. ఈ రోజు ఏం జరుగుతుందోనని జనం ఎదురుచూస్తున్నారు. వేచివున్న జనాన్ని ఆదుకోడానికి కొందరు మంచినీళ్ళు అందిస్తున్నారు.

చివరకు స్వామీజీ రానే వచ్చారు. చిన్నప్రసంగం చేశారు. బాబాకు తెలుగు రాదు గనుక ఆయన ప్రవచనాల్ని శిష్యుడు తెలుగులో చెప్పారు.

మాటల అనంతరం బాబా అరచేతిలో కర్పూరం పెట్టుకొని, మంత్రాలు చదువుతూ వెలిగించారు. చూస్తుండగానే మండుతున్న కర్పూరాన్ని నోట్లో వేసుకున్నారు.

భక్తులంతా ఆశ్చర్యపోయారు. బాబా మామూలుగానే మాట్లాడారు. ఆయనకు నోరుకాలదా?

ఇంతలో హేతువాది ప్రేమానంద్ వచ్చాడు. నేనూ బాబావలె చేయగలనని చేతిలో కర్పూరపు ముద్ద వెలిగించి, నోట్లో వేసుకున్నాడు.

నిప్పు రావాలంటే ఆక్సిజన్ అవసరం. కర్పూరం వెలుగుతుండగా నోట్లో వేసుకొని, నోరు మూసుకుంటే ఆక్సిజన్ లేక ఆరిపోతుంది. నోట్లో కర్పూరపుముద్ద వేసుకొని నోరు మూసి గాలి బయటకు వదలాలి. మనం వదిలేది కార్బన్ డైయాక్సైడ్(బొగ్గుపులుసువాయువు). అది మంటను వెంటనే ఆర్పేస్తుంది. కాకుంటే నోట్లో వెలిగే కర్పూరపుముద్ద వున్నప్పుడు గాలి పీల్చకూడదు. పీల్చేది ఆక్సిజన్(ప్రాణవాయువు) గనుక,అది మంటను ఆర్పదు.

ప్రేమానంద్ వివరణతో బాబా ట్రిక్కు అందరికీ బట్టబయలు అయింది. అయినా భక్తులు కొత్త మహత్తులకు ఎదురుచూస్తున్నారు.

క్రీస్తుమహిమలు:

సువార్త కూటములు జరుగుతాయనే ప్రచారం విపరీతంగా సాగింది. మారుమూల గ్రామాల నుండి క్రైస్తవులు సందేశం వినడానికి చేరుకున్నారు.

అమెరికానుండి చాలా గొప్ప క్రైస్తవ ప్రచార బోధకుడు వచ్చాడట. ఆయన క్రీస్తు మహిమలు వివరిస్తాడట. అందువలన సువార్త కూటములకు ప్రత్యేకత సంతరిల్లింది.

ప్రార్థనలు చేసిన అనంతరం ఇంగ్లీషులో ఉపన్యాసం సాగింది. తెలుగులో అనువదించి ఒక పాస్టరు చెబుతున్నాడు. బైబిల్ చేతుల్లో పట్టుకొని మోకాళ్ళపై కూర్చున్న భక్తులు శ్రద్ధతో ఆలకిస్తున్నారు.

ఏసుక్రీస్తు ఒక పెళ్ళి సందర్భంగా వచ్చిన వారందరికీ చాలినంత ద్రాక్ష సారాయి(వైన్)ని నీళ్ళద్వారా అందించాడట. నీరు కాస్తా ద్రాక్ష సారాయిగా మార్చడానికి ఆరు రాతి కూజాలను వాడారట. అలాగే మరో సందర్భంలో 5 రొట్టెముక్కల్ని వేలదిమందికి క్రీస్తు పంచి అద్భుతాన్ని చూపాడట. బైబిల్ ఆధారంగా యీ విషయాల్ని ఆయన వివరించాడు. అమెరికా మాంత్రికుడు జేమ్స్ రాండి యీ విషయాలను లోగడ వివరించాడు. హేతువాది ప్రేమానంద్ సువార్త కూటాలవద్దకురాగా, భక్తులు కొందరు ఆటంకపరిచారు. బయట సభపెట్టి క్రీస్తు మహిమల రహస్యాన్ని ఆయన వివరించాడు.

ఒక బావిలో నీటిని ద్రాక్ష సారాయిగా మార్చవచ్చుగదా. అలాగాక, కేవలం రాతి కూజాలు అమర్చి వాటిలో పోయించి ద్రాక్షసారాయిగా ఎందుకు మార్చినట్లు? అదే రహస్యం. క్రీస్తుకు బావిలోనీటిని మార్చగల శక్తి లేదు. ఆయన తాను నేర్చిన మాంత్రికవిద్యతో ట్రిక్కు ప్రదర్శించి, ఆకర్షించాడు. ఎలాగ?

పెద్ద రాతి కూజాలలో చిన్న రాతి కూజాలు అమర్చాడు. చిన్న కూజా అంచు పెద్ద కూజా పైకి వుండేటట్లు ఏర్పరుస్తారు. చిన్న కూజా జనానికి కనిపించదు. పెద్దకూజాలో ద్రాక్షసారాయి పోస్తారు. తరువాత చిన్నకూజా లోనపెట్టి, తలక్రిందులు చేస్తే చిన్న కూజా పెద్ద కూజాలో అతుక్కుపోతుంది. తరువాత చిన్నకూజాపై మూతపెట్టి పెద్దకూజా మూతతీసి,అందులో ముందుగానే పోసిన ద్రాక్షరసాన్ని పంచుతారు. ఈ ట్రిక్కు తెలియక, భక్తులు అద్భుతంగా దాన్ని భావిస్తారు.

బాబా పూనకం

ప్రతిరోజువలె నేడు కూడా బాబా 12 గంటలకు దర్శనం యిస్తారని భక్తులు చెప్పారు. దర్శనార్థం వచ్చినవారు కానుకలు సమర్పించి, ప్రార్థనలు చేస్తున్నారు.

రోజూ రావలసిన సమయానికి బాబా రాలేదు. ఒక శిష్యుడు వచ్చి నేడు బాబాకు పూనకం వచ్చింది. అమ్మవారి దర్శనం ఆయనతోపాటు యితరులకు సైతం చూచే భాగ్యం కల్పిస్తారని ప్రకటించారు.

బాబా రానున్న సందర్భంగా ఒక తెల్లని వస్త్రం పరచారు. బాబా కాళ్ళను కడిగిన భక్తుడు, ఆ నీళ్ళను కళ్ళకు అద్దుకున్నారు. అప్పుడు ప్రవేశించిన బాబా ఆ తెల్లని వస్త్రం పై పాదాలు పెట్టగానే, అమ్మవారి పాదాలవలె ముద్రలు పడ్డాయి. బాబా, పూనకం వచ్చినట్లు ఏవేవో మంత్రాలు చదివారు. గ్రామస్తులు ఏం చేయాల్సిందీ చెప్పారు. తెల్లని వస్త్రం పై ఎర్రని పాదముద్రలు అక్కడి భక్తులంతా కళ్ళారా చూచారు.

భక్తులలోని ఒక సందేహవాది యీ విషయాన్ని హేతువాది ప్రేమానంద్ కు చెప్పారు. ఆయన విషయ వివరణ చేశారు.

బాబా వచ్చేముందు పరచిన తెల్లని వస్త్రం అంతకుముందే పసుపు ద్రావంలో తడిపారు.ఎండబెట్టారు. వస్త్రం పై అంటిన పసుపు పౌడర్ ను దులిపారు. వస్త్రం మళ్ళీ తెల్లగా కనిపించింది. బాబా ఆ వస్త్రం పై నడవబోయే ముందు భక్తుడు కాళ్ళు కడిగాడు గదా. ఆ నీళ్ళు నిమ్మరసం కలిపిన నీళ్ళు, ఆ కాళ్ళతో బాబా తెల్లని వస్త్రంపై నడిచారు. అంతకు ముందే పసుపు ద్రవంలో తడిపినవస్త్రం గనుక నిమ్మరసం తగలగానే కాలిముద్రలు ఎర్రగా పడ్డాయి. పసుపు, నిమ్మ కలిసినందున ఎర్రగా మారిందనేది అసలు రహస్యం. దీనిని పూనకంగా చూపి బాబా భ్రమింపచేశారు, ప్రేమానంద్ వివరణతో గుట్టు బట్టబయలైంది.

నాడి కొట్టుకోకుండా ఆపగలరా?

బ్రతికినంత కాలం నాడి కొట్టుకుంటుంది. నాడి ఆగడం అంటే చనిపోవడమే. కాని సిద్ధులు తమ తపస్సు వలన, శక్తిని సాధించి, నాడి ఆపగలరని ప్రచారంలో వుంది. భక్తులు యిది కళ్ళారా చూచినపుడు నమ్మక చేసేదేముంటుంది.

వూళ్ళోకి వచ్చిన స్వాములవారు ఇంకోరోజు డాక్టరును పిలుచుక రమ్మన్నారు. ఆవేళ ఏమి అద్భుతం జరుగుతుందోనని భక్తులు ఎదురుచూస్తుండగా, నాడి చూడమని స్వామివారు చెయ్యిచాచారు. డాక్టరు పరీక్షించి, సాధారణంగా నాడి ఆడుతున్నట్లు ప్రకటించారు.

స్వామీజీ యీ లోగా ఏవో మంత్రాలు చదివారు. సంస్కృతంలో వున్న ఆ మంత్రాలకు అర్థం తెలియక భక్తులు దండాలు పెట్టుకుంటున్నారు. మళ్ళీ నాడిచూడమని డాక్టర్ కు సైగ చేశారు. ఈసారి చూచిన డాక్టర్ నాడికొట్టుకోవడంలేదని చెప్పాడు. మళ్ళీ చూచారు. సెతస్కోప్ కు నాడీ శబ్దం అందలేదు.

భక్తులు సాష్టాంగపడ్డారు. ఇంకా కొందరు విరాళాలు గుప్పించారు.

హేతువాది ప్రేమానంద్ వచ్చి తానూ నాడి చూస్తానన్నారు. స్వామీజీ చేయి అందించారు. స్వామీజీ రెండుచేతుల్నీ పైకి ఎత్తిన ప్రేమానంద్, చూస్తుండగానే, స్వామీజీ రెండు చంకల నుండి రెండు నిమ్మకాయలు కిందపడడం భక్తులు చూచారు. చంకతో నిమ్మకాయలుగాని చేతిరుమాలు వుండగా చుట్టిగాని పెట్టి గట్టిగా నొక్కితే రక్తప్రవాహం ఆగి నాడి ఆగినట్లు అవుతుంది. హేతువాది వలన స్వామీజీ గుట్టు బయటపడిందిగాని లేకుంటే గిట్టుబాటు వ్యాపారమే!

శరీరంలో ఉష్ణోగ్రత మహత్తు:

వూళ్ళోకి స్వాములవారు వేంచేశారు. భక్తులు యధాశక్తి కానుకలు అర్పిస్తున్నారు. రోజూ ఆయన చెప్పినట్లు పూజలు చేస్తున్నారు. స్వామి ఆకర్షణీయంగా చెప్పే మాటలకు పారవశ్యం చెందుతున్నారు. కొత్తగా వచ్చిన స్వామి, రోజుకో మహత్తు చూపి భక్తులను ఆశ్చర్యంలో ముంచెత్తుతున్నారు.

ఆ రోజూ స్వామికోసం భక్తులు ఎదురుచూసి విసిగిపోతున్నారు. ఎంతవరకూ వేదికపైకి ఆయన రాలేదు. చివరకు శిష్యుడువచ్చి స్వామి రాకను ప్రకటించారు. స్వామివారు రాగానే, వూళ్ళో డాక్టరును పిలిపించమన్నారు. డాక్టర్ రాగానే థర్మామీటరుతో ఉష్ణోగ్రత చూడమన్నారు. మామూలుగా వున్నది. కాసేపువున్న తరువాత మళ్ళీ చూడమన్నారు. ఈసారి 104 డిగ్రీలతో ఒడలు మండిపోతున్నది. అయినా స్వామి చలించలేదు. ఇంతలో ఏంజరిగిందో తెలియని భక్తులు స్వామి మహత్తుకు అబ్బురపడి దండాలుపెట్టి నోరు మూసుకున్నారు.

డాక్టరు వస్తున్నప్పుడే సబ్బుముక్క చప్పరించి మింగిన స్వామి, కొద్దిగా తేనీరు సేవించారు. ఆ విషయం భక్తులకు తెలియదు. తీర్థం పుచ్చుకుంటున్నాడని భ్రమించారు.

కడుపులో సబ్బునందుగల క్షారం(ఆల్కలీ)తో తేనీటిలోని ఆమ్లం(యాసిడ్) మిళితం కాగా,రసాయనికమార్పు జరిగి వేడి పుడుతుంది. ఇది కృత్రిమంగా సృష్టించిన ఉష్ణోగ్రత. భక్తులు ఆశ్చర్యపడుతుండగా స్వామి ఏమీ పుచ్చుకోకుండా కేవలం చల్లనినీరు మాత్రమే తాగుతూ డాక్టరు ఇస్తామన్న మందులు, ఇంజక్షన్ పుచ్చుకోరు. చల్లని నీరు వలన కడుపులో మంట, ఉష్ణం తగ్గిపోతుంది. అదంతా దివ్యశక్తిగా భక్తులు భావిస్తారు.

గుడిశెలు తగులబడుతున్నాయి!

తెలంగాణా మారుమూల గ్రామం సింగారంలో ఒకనాడు మిట్టమధ్యాహ్నం వున్నట్లుండి ఒక గుడిశపై మంటలు చెలరేగాయి. మగవాళ్ళంతా కూలీకి పోయారు. మంటలు చూచిన ఆడవాళ్ళు గుండెలు బాదుకున్నారు. కష్టపడి నీళ్ళుపోసి ఆర్పేశారు.

మరునాడు ఇంకోగుడిసెపై అలాగే మంటలు లేచాయి. ఈ వార్త ప్రాకిపోయి, ఆ వూరికేదో శాపం తగిలిందన్నారు. జనం పొరుగూళ్ళనుండి వచ్చిచూచి, వింతకథలు అల్లారు. స్థానికపత్రికలలో కూడా వార్త వచ్చింది.

హేతువాదులకు యీ విషయం తెలిసి,వెళ్ళి పరిశీలించదలచారు. ప్రేమానంద్ అనే మాంత్రిక హేతువాదిని వెంటబెట్టుకొని ఆ వూరు చేరారు. జనం చెప్పిన కథలు ఆలకించారు.

ప్రేమానంద్ తగులబడిన గుడిసెలు పరిశీలించాడు. పిడకలు ఎండబెట్టిన గుడెశెలే తగులబడ్డాయి. పిడకలు లేని ఇళ్ళకు మంటలురాలేదు.

ఏం జరిగింది? పరిశీలించగా తేలిన సారాంశం

పిడకలు చేసేటప్పుడే పచ్చఫాస్ఫరస్ కలిపిపెట్టారు. పిడకలలో తడి ఆరగానే, పచ్చఫాస్ఫరస్ నుండి వేడివచ్చి, క్రమేణా గుడిసెపై పొగరావడం, తగులబడడం జరిగింది. కావాలని పచ్చఫాస్ఫరస్ కలిపి పెట్టారన్నమాట. ఎవరు పిడకలు చేశారో తెలుసుకుంటే దొంగ దొరికిపోతాడు. ఎందుకు అలా చేసిందీ ఆరా తీయవచ్చు.ఇది చేయకుండా నమ్మకాలతో వుంటే, ఇంకా జనాన్ని భయకంపితుల్ని గావించి, వ్యాపారం చేసుకునే వారుంటారు. విగ్రహం కన్నీరు పెడుతోంది:

"లోకంలో పాపం పెరిగిపోయింది. అది చూడలేక మేరీమాత విగ్రహం కన్నీరు పెట్టుకుంటున్నది. ప్రభువు ఆగ్రహిస్తాడు. పాపం పోగొట్టుకోవాలి" అని క్రైస్తవ ఫాదర్ బోధిస్తున్నాడు. మేరీమాత విగ్రహం కన్నీళ్ళు పెడుతుందనే వార్త పత్రికలలో వచ్చింది. భక్తజనం తండోపతండాలుగా వచ్చి అద్భుతాన్ని తిలకించి, కానుకలు సమర్పించారు. ప్రార్థనలు చేశారు. క్షమించమని వేడుకున్నారు. ఒకరోజు కన్నీరు పెట్టుకున్న విగ్రహం మరునాడు ఆపేసింది. ఈలోగా వచ్చిన కానుకల్ని దైవకార్యం నిమిత్తం ఫాదర్ స్వీకరించాడు.

మాంత్రికుడు జేమ్స్ రాండి(అమెరికా)కి వార్త తెలిసివచ్చాడు. విగ్రహాన్ని పరిశీలిస్తానన్నాడు. వీల్లేదన్నారు. నిజంగా కన్నీరు కారుస్తుంటే, పరిశీలనకు ఆటంకం ఏమిటన్నారు. అయినాసరే ఒప్పుకోలేదు. భక్తుల విశ్వాసాన్ని ప్రశ్నించకూడదన్నారు. హేతువాదులు జేంస్ రాండిని వివరం అడిగారు. విగ్రహాన్ని తరువాత పరిశీలించిన రాండి విపులీకరించి, ఏం జరిగిందో తెలియపరిచాడు.

మేరీమాత విగ్రహం మెడ లోపలిభాగం ఖాళీగావుంది. తలపై చిన్న రంధ్రం పెట్టి నీళ్ళు పోశారు. తలపైముసుగు కప్పారు. విగ్రహం రెండు కళ్ళకూ మైనం పెట్టి, నీళ్ళు పోసినప్పుడు మైనం తొలగించారు. లోన పోసిననీరు బొట్టుబొట్టుగా బయటకు వచ్చింది. మేరీమాత ఏడుస్తున్నట్లు ప్రచారం చేసి,భక్తుల వద్ద కానుకలు స్వీకరించారు.

మైసూరులో చాముండేశ్వరి విగ్రహం యిలాగే ఏడుస్తున్నట్లు లోగడ ఒకసారి ప్రచారం చేశారు. మాంత్రికుడు యీ గుట్టు బయటపెట్టాడు. ప్లాస్టర్ ఆఫ్ పారిస్ విగ్రహమైతే, లోన ఉప్పునీరుపోస్తే, సన్నని రంధ్రాలనుండి చెమ్మ వస్తుంది. అది కూడా భక్తుల్ని నమ్మించడానికి ప్రచారం చేసేవారు.

విగ్రహాలను తయారుచేసేది మనుషులే. వాటిని పూజించేది మనుషులే. విగ్రహాలను రాళ్ళుగా, బొమ్మలుగా ఆడుకునేది పురోహితవర్గమే.

నీవు బాబా కావచ్చు!(మాతకూడా!)

ఎటుచూచినా జనం భక్తులు పారవశ్యంతో చెంపలు వేసుకుంటూ టక్కర్ బాబాను చూస్తున్నారు. కొందరు పాదాలపై పడుతున్నారు. కాషాయ వస్త్రాలతో మెడలో రుద్రాక్షలతో, కర్ర చెప్పులతో బాబా ఏవో మంత్రాలు చెబుతూ భక్తులకు విభూది యిస్తున్నాడు. అది కళ్ళకు అద్దుకొని, నొసటన బొట్టుగా పెట్టుకుంటున్నారు. అంతమంది భక్తులకు హఠాత్తుగా బాబా విభూది ఎలా యివ్వగలిగాడు? చేతులు అటూఇటూ తిప్పి, తరువాత భక్తులకు విభూది యిచ్చిన బాబా మహత్తును కొనియాడుతున్నారు.

ఒక సందేహవాదికి అనుమానం కలిగింది. ప్రేమానంద్ అనే మాంత్రిక హేతువాదిని అడిగారు. ఆయన వెంటనే చేతులు అటూఇటూతిప్పి విభేది యిచ్చాడు. సందేహవాది ఆశ్చర్యపోయి, ఎలా సాధ్యమైంది అని అడిగాడు. ప్రేమానంద్ వివరించాడు. విభూది వుండను చూపుడువేలు బొటనవేలు మధ్య పెట్టుకోవాలి. అలా వుంచి కూడా, నమస్కారం పెట్టవచ్చు. కరచాలనం చేయడం అలవాటు చేసుకోవచ్చు. తరువాత చేతిని అటూఇటూ తిప్పాలి. వేళ్ళ మధ్యవున్న విభూది వుండను అరచేతిలోకి తెచ్చి పొడిచేసి, కొంచెంగా భక్తులకు పంచాలి. బాబాలు చేసే పని యిదే పదార్థం లేకుండా, సృష్టి కాదు. బాబా దగ్గరకు వచ్చే భక్తులు అనుమానంతో ప్రశ్నించడానికి రారుగా? అందువలన బాబాచేసే ట్రిక్కులు, మాజిక్ లు భక్తులకు అద్భుతాలుగా కనిపిస్తాయి.

సువాసనవచ్చే విభూదిని గంజినీళ్ళలో కలిపి వుండలుచేసి అట్టిపెట్టుకుంటే యీ పని చేయవచ్చు. సాయిబాబా మొదలు శివానంద వరకూ ఏ బాబా చేసినా యింతే. లోగడ అబ్రహాం కోవూరు కూడా చంకలో నుండి ఒక గొట్టాన్ని లాల్చీలో అమర్చి,అందులో నుండి విభూది కావలసినంత తెప్పించేవాడు.

- హేతువాది, మార్చి, ఏప్రిల్,మే,జూన్ 1996