అబద్ధాల వేట - నిజాల బాట/పునర్జన్మ - ఒక పరిశీలన

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
పునర్జన్మ - ఒక పరిశీలన

మనిషి ఒక్కసారే పుట్టి పోడనీ, ఎన్నో సార్లు జన్మ ఎత్తుతాడనీ, అందులో జంతువులు యితర జీవజాలం కూడా వుండొచ్చుననీ, ప్రతి జన్మకూ కొత్త దేహం వస్తుందనీ నమ్ముతారు. ఇది అద్యంత రహితంగా సాగుతుందని కొందరూ, నిర్వాణంతో జన్మ ముగుస్తుందని కొందరూ నమ్మారు.

కర్మ సిద్ధాంతానికి మంచి చెడ్డలను జత చేస్తారు. ప్రస్తుత జన్మకు కారణం లోగడ జన్మలలో చేసిన మంచి, చెడ్డలు కారణం అంటారు. వీటిలోనే శిక్షలు,బహుమతులు కూడా యిమిడి వున్నాయి.

ఈ పునర్జన్మ కర్మ సిద్ధాంతాలు నమ్మిన వారిలో సుప్రసిద్ధ వ్యక్తులున్నారు. కనుక సిద్ధాంతం సరైనదని చెబుతారు.

టి.హెచ్.హక్సలీ 1893లో పరిణామం నీతి గురించి చెబుతూ వంశపారంపర్యంగా శీలం రావడం కర్మ సిద్ధాంతం వంటిదన్నాడు. ఇంకేముంది? హక్సలీ సైతం పునర్జన్మను అంగీకరించాడన్నారు! ఆయన మనస్సు - శరీరం సమస్య చర్చించే సందర్భంగా ఆ ప్రస్తావన తెచ్చాడు. మరణానంతరం మానవుడు వుండడని కచ్చితంగా హక్సలీ పేర్కొన్నాడు.

పునర్జన్మవాదుల ప్రకారం తల్లిదండ్రులు నిమిత్తమాత్రులు. మానవుడిలోని అనేక గుణాలకు తల్లిదండ్రులు కారణం కాదన్నారు.

పునర్జన్మను నమ్మిన ఎఫ్.డబ్ల్యు.హెచ్.మైర్స్ (Myers) గురించి బెర్ట్రాండ్ రస్సెల్ చతురోక్తిగా చెబుతూ,ఒక విందులో చనిపోయిన తరువాత నీవు ఏ మౌతావని మైర్స్ ను ఒకరు అడిగారట. శాశ్వతానందం లభిస్తుందని మైర్స్ అంటూనే, తినేటప్పుడు అలాంటి అప్రియ ప్రస్తావన ఎందుకన్నాడట! అలాగే పునర్జన్మ నమ్మిన ఒక తండ్రి అత్యవసరంగా ఆపరేషన్ చేయాల్సిరాగా అతడు దిగాలుపడి వున్నాడట. అతడి కుమారుడు చూచి, నాన్నా, నీకు పునర్జన్మపై నమ్మకం వుందిగా, ఏం ఫరవాలేదన్నాడట. అందుకు తండ్రి మండిపడి, ఇలాంటి సందర్భంలో హాస్యంగా మాట్లాడొద్దన్నాడట! ప్రపంచంలో వున్న అన్యాయం, అక్రమం చూస్తుంటే, దేవుడున్నాడని, కనుక న్యాయాన్యాయాలు నిర్ణయించడానికి, పునర్జన్మలు కర్మలు వుండాలి అంటారు కొందరు. కార్యకారణవాదం కూడా యిందులోకి తెస్తుంటారు. కాని ఆ వాదం ప్రకారం అన్యాయాలకు, అక్రమాలకు కారణమైన చెడ్డ దేవుళ్ళు వుండాలి. మానవులు సంతోషంగా వుండడానికి హామీయిచ్చే నియమం ఏదీ లేదని రస్సెల్ చెప్పిన విషయాన్ని గుర్తుంచుకోవాలి.

"కర్మ సిద్ధాంతాన్ని పరిశీలిస్తే,ఇందులో భవిష్యత్తు. అంచనా వేసే రీతి లేదని గ్రహించవచ్చు". అనిబిసెంట్, బ్లావట్స్ రాసిన విషయాలు, ప్రొఫెసర్ జి.ఆర్.మల్కాని-ప్రొఫెసర్ వారెన్ స్టెయిన్ క్రాస్ మధ్య ఫిలసాఫికల్ క్వార్టర్లీ(1965)లో జరిగిన చర్చను ఇక్కడ ఉదహరించవచ్చు. కొన్ని మార్మిక విషయాలు మనకు తెలియవని, చర్చించరాదని మల్కాని అన్నారు. ఏ పాపానికి ఏ శిక్ష విధించాలి అనేది అలాంటిదే అన్నారు. ఈ లోకంలో యింత శిక్ష అన్యాయం ఎందుకున్నదో మనం వివరించలేమన్నాడు.

కొందరు దేవుడితో నిమిత్తం లేకుండా, కర్మ దానంతట అదే పనిచేస్తుందని నమ్ముతారు. కర్మ సహజ సిద్ధాంతం అని మల్కానీ వంటి వారు నమ్మారు.

ఏది మంచి, ఏది చెడ్ద అనేది ఎక్కడ ఎవరు నమోదుచెస్తారు? దానిని బట్టి ఫలితం నిర్ణయించే తీరు ఎలా వుంటుంది? నిర్ణయాలు ఎవరు తీసుకున్నా వాటిని అమలుపరచేదెలా? అంటే లోగడ చేసిన పనులకు వచ్చే జన్మలో ఫలానా మనిషిగా పుట్టాలని నిర్ణయిస్తే అదెలా అమలుజరుగుతుంది? భూకంపంలో వేలాది మంది చనిపోవడం కర్మ వలనా? టెర్రరిస్టులు కొందరిని చంపడం కర్మ సిద్ధాంతమా? కర్మను వెనుకేసుకొచ్చే మల్కాని వంటి వారు యిలాంటి వాటికి సమాధానం చెప్పజాలరు.

పునర్జన్మలు కర్మ ప్రకారం వస్తాయని అనిబిసెంట్ నమ్మినా, ఉత్తరోత్తరా జన్మలకు తగిన దేహాలను ఎలా వెతికి తెస్తారో చెప్పలేక పోయారు. మూకుమ్మడి హత్యలు, భూకంపాలు న్యాయంగా కర్మ ప్రకారం సంభవించాయని చెప్పగలరా? అలాగైతే కోట్లాది యూదులను నాజీలు హతమార్చడం కర్మ ప్రకారం న్యాయం కావాలి.

తార్కికంగా గాని, శాస్తీయంగా గాని, కర్మ నిలబడదు. ఈ విషయంలో ప్రాచ్యపాశ్చాత్య సిద్ధాంతకారులను పాల్ ఎడ్వర్డ్స్ పరిగణనలోకి తీసుకున్నారు. ఎ.జె.అయ్యర్ వంటి బ్రిటిష్ తాత్వికుల భావాలు కూడా ప్రస్తావించారు.

బెనర్జి హెచ్.ఎన్.: పూర్వజన్మల గురించి ఇండియాలో కొన్నేళ్ళ క్రితం సంచలనం స్ర్ష్టించిన హెచ్.ఎన్.బెనర్జి గురించి చూదాం. బెనర్జి అమెరికాలో కూడా కొంత ప్రచారం పొందాడు. ఒక కేంద్రం కూడా నెలకొల్పి, మూసేశాడు. ఏన్ మిల్లర్ అనే సినీతార పూర్వజన్మలో ఈజిప్టు రాణి హత్సెసుట్ అన్నాడు. అతడి పుస్తకాలు డబుల్ డే ప్రచురణకర్తలు వెలువరించారు. తరువాత బెనర్జిని ఇండియాలో అరెస్ట్ చేశారు. అతడివన్నీ కట్టుకథలని తేలింది. యు.జి.సి. వారు కూడా కొంత నిధిని సమకూర్చి తరువాత నాలుక కొరుక్కున్నారు. అమెరికాలో అతడు ఓక్లొహామా రాష్ట్రంలో షోఫెన్ బర్గ్ రీసెర్చి ఫౌండేషన్ పెట్టి మూసేశాడు.

పూర్వజన్మలే గాక, రానున్న జన్మలు కూడా చెప్పడం మామూలే. ప్యూచరాలజీ పేర వీరు చెప్పేవన్నీ కొన్ని వందల వేల ఏళ్ళ అనంతరం జరుగుతాయంటున్నారు. కనుక రుజువుకు నిలబడవు.

గత జన్మల విషయం సాధారణంగా గుర్తుండవంటారు. ఎక్కడో కొందరు గుర్తున్నాయన్నప్పుడు, సంచలనం జరిగింది. ఇండియాలో యిలాంటివి అప్పుడప్పుడు ప్రచారంలోకి వచ్చాయి.

కృష్ణుడికి గతజన్మలన్నీ గుర్తున్నాయట. బౌద్ధులకు గత జన్మలు తెలుస్తాయని టిబెట్ లో నమ్ముతారు. అనిబిసెంట్ తన గత జన్మల గురించి చెప్పింది. జన్మలలో తేడా వచ్చినప్పుడు ఏమీ సంజాయిషీ వుండదు. అయితే యివేవీ రుజువులకు నిలబడవు.

సాయిబాబా: సాయిబాబా అతీంద్రియ శక్తులు, నిర్ణయాలు అంగీకరించిన స్టీవెన్సన్ గురించి రాస్తూ పరిశోధనకు, రుజువుకు నిలబడక పోవడాన్ని ప్రస్తావించారు. గాలిలో నుండి చేయి చాపి వస్తువుల్ని సృష్టించగలిగితే, కొన్ని భౌతిక సూత్రాల్ని అధిగమించి పోయినట్లవుతుందన్నారు. అది conservation principleకు దాటిపోయినందున సైన్స్ లో గొప్ప విషయం అవుతుందనీ, ఆయన ప్రతిష్ట యినుమడిస్తుందనీ, కనుక రుజువుకు అంగీకరిస్తే బాగుంటుందన్నారు. సాయిబాబాను పరీక్షించడానికి శాస్త్రజ్ఞులు, మాంత్రికులు (Magicians) తగిన వారన్నారు.

మద్రాసు క్రిస్టియన్ కాలేజిలో రిటైర్ అయిన సి.టి.కె. చారి అతీంద్రియ శక్తులు గురించి చాలా రాశారు. చిన్న పిల్లల పునర్జన్మల గురించిన విషయాలు పచ్చి కట్టు కథలని ఆయన రాశారు.

దేవుడు నిర్వికారుడు, సర్వాంతర్యామి అనే వాదనను చూస్తే అలాంటి దేవుడికీ, మనుషులకూ, ప్రపంచానికి ఎలా సంబంధం వుంటుందో అడిగారు. మనుషుల ప్రార్థనలు అలాంటి దేవుడికి ఎలా వినిపిస్తాయని అడిగారు. ఒకవేళ వింటే,తన శక్తిని యీ ప్రపంచంలోకి ఎలా పంపిస్తాడని తెలుసుకోవాలన్నారు. కేవలం మనస్సు (Pure Mind) భౌతిక ప్రపంచంతో ఎలా సంబంధం పెట్టుకుంటుందనేది అవగాహన కానిది.

ఒకే ఆకారం లేదా శరీరం రెండు చోట్ల వుండడం, పరకాయ ప్రవేశం, రెండు జన్మల మధ్య ఆత్మ నిరాకారంగా తిరగడం, ముసలివాడుగా చనిపోయి, పిల్లల్లో పుట్టడం యిలాంటివన్నీ రచయిత చర్చించారు. మరోజన్మలో పునర్జన్మ సిద్ధాంతానికి విరుద్ధంగా 5 వాదనలు ఉన్నాయి. పరిణామ సిద్ధాంతం పునర్జన్మని తృణీకరిస్తుందని చూపారు. బిగ్ బాంగ్ తరువాత చాలాకాలం జీవం పరిణమించలేదు. అప్పుడు ఆత్మలు లేదా జన్మలు, ఎక్కడ వున్నాయి?

పునర్జన్మ సిద్ధాంతానికీ జనాభా పెరుగుదలకూ వున్న వైరుద్ధ్యం ఉంది. మానవశరీరంలోనే మానవుడి ఆత్మ వుండగలదంటే జనాభా సిద్ధాంతంలో యిమడదు. కొత్త ఆత్మలు పుట్టవనీ, ఆత్మలు అనాదిగా శాశ్వతమనీ అంటే, జనాభా సిద్ధాంతం దీనిని తిప్పికొడుతుంది.

అటు పాశ్చాత్యులు యిటు ప్రాచ్యవాదులు నమ్ముతున్న కర్మ, పునర్జన్మ సిద్ధాంతాలను విపులంగా పరిశీలించిన గ్రంథం పాల్ ఎడ్వర్డ్స్ రాసిన 'రెయిన్ కార్నేషన్'. పూర్వావరాలన్నీ ప్రస్తావించి, చివరకు శాస్త్రీయాధారాలకు నిలవబోవడం లేదని చాటారు.

ఇండియాలో జరిగినట్లు వింతగా నమోదైన అనేక పునర్జన్మ విషయాలను రచయిత ప్రస్తావించారు. తాను కొలంబియా యూనివర్శిటీలో చదువుతుండగా వేద ప్రకాశ్ మనగ్దలా అనే సహపాఠి ఎన్నో ఉదంతాలు చెప్పాడట. ఏమీ చదువుకోని ఒక రైతు ఒకనాడు పొద్దున్నే లేచి ధారాళంగా సంస్కృతం మాట్లాడాడట. అలాగే 1926 ఉత్తరాదిలో జరిగినట్లు ప్రచురితమైన జగదీష్ పునర్జన్మ విషయాలు పేర్కొన్నారు. వాటిలో పూర్వాపరాలు చూడకుండా శాస్తీయ పరిశీలన చేయకుండా ఎలా నమ్మారో చూపారు. ఈ విషయమై సి.టి.కె.చారి రాస్తూ మతపరంగా కొందరు అబద్ధాలు ఆడడం, కథలు అల్లడం, పవిత్రత పేరిట ఆనవాయితీగా వచ్చినట్లు స్పష్టంచేశారు. పునర్జన్మ కథలలో భాష్యకారులను, నిలబడి చూచేవారిని, తల్లిదండ్రులను నమ్మజాలమని, ప్రశ్నించాలని చారి రాశారు.

రాకేష్ గౌర్ పునర్జన్మ ఉదంతం ఇండియాలో జరిగినట్లు ప్రచారంలోకి వచ్చింది. ఇది పేరా సైకాలజి జర్నల్ లో ప్రచురితమైంది 1981లో. 1969లో పుట్టిన రాకేశ్ గౌర్ తోంక్ అనే నగరంలో విఠల్ దాస్ గా పుట్టి గిట్టినట్లు చెప్పిన కథయిది. రాకేష్ ప్రయాణం, వెంట తండ్రి వుండడాన్ని రాశారు.

పాశ్చాత్యులు రాసేసరికి నమ్మేస్తారు. పాశ్చాత్యులలో మనకంటె నమ్మకస్తులున్నారని మరవకూడదు. శాస్త్రీయ పరిశోధనా పద్ధతులు అన్వయించి పరిశీలించారా లేదా అనేదే ప్రధానంగా చూడాలి. రచయిత యీ దృష్టితో గమనించి, నమ్మకాలను నిరాకరిస్తున్నారు.

అబద్ధాలు కొన్నాళ్ళుకు నిజాలుగా ప్రచారం గావడం, ఒక్కొక్క వ్యక్తి తన అబద్ధాలను ఉత్తరోత్తరా, నిజమని తానే నమ్మడం చుస్తున్నాం. పునర్జన్మ, కర్మ నమ్మకాలలో యిలాంటివి వున్నాయి. ముందుగానే నమ్మి, వెళ్ళి చూస్తే అద్భుతాలు జరిగినట్లే వుంటాయి. వాటిని నిశితంగా పరిశీలించే శక్తి నమ్మకస్తులకు వుండదు. ఇది చదువుకున్న వారికి, కొన్ని సందర్భాలలో శాస్త్రజ్ఞులకూ వర్తిస్తుంది. శాస్త్రజ్ఞులను సైతం అద్భుత మాయాజాలంతో మోసగించవచ్చు. కనుక పరిశీలన బృందాలలో మంత్రజాలం తెలిసిన వారిని చేర్చితే చాల వాస్తవాలు బయటపడతాయి. కొందరికి అద్భుతశక్తులు వస్తాయి. అవి ఎలా వచ్చాయో పరిశీలించే బదులు, ఆ వ్యక్తి చుట్టూ కథలు అల్లడం, పునర్జన్మ శక్తులు అంటగట్టడం కూడా ఉండాలి. ఐరిష్ గణిత శాస్త్రజ్ఞుడు విలియం హామిల్లన్ (1805-1865) 13 భాషలతో పండితుడు. చిన్నతనంలోనే గణితంలో విశేష ప్రజ్ఞ కనబరిచాడు. ఇలాంటి కోవలో మొజార్ట్ వంటి వారున్నారు. ఇదంతా పూర్వజన్మ సుకృతం అని నమ్మేవారున్నారు. అది శాస్త్రీయ పద్ధతి కాదు. పరిశీలించి తెలుసుకోవడమే ఉత్తమం. అయితే మనకు తెలియని వాటి పట్ల, ఏదో ఒక కట్టుకథ అల్లే బదులు, రుజువులు దొరికే వరకూ వేచివుండడం, పరిశీలన కొనసాగించడం ఉత్తమ విధానం.

REINCARNATION - A Critical Examination : Paul Edwards

Prometheus Books,USA

- మిసిమి మాసపత్రిక,మే-1998