అబద్ధాల వేట - నిజాల బాట/పిల్లల్ని మతాలకు దూరంగా వుంచండి

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
పిల్లల్ని మతాలకు దూరంగా వుంచండి

తండ్రి తెలుగుదేశం పార్టీలో వుంటే కుమారుడు (మైనర్)కూడా తెలుగుదేశం పార్టీకి చెండుతాడా? తల్లి కాంగ్రెస్ అయితే బిడ్డ (మైనర్) కూడా కాంగ్రెస్ పార్టీలో వుండాలా? రాజకీయాలు వంశపారంపర్యం కాదు. పెద్దవాళ్ళకు, అవవగాహనతో, 18ఏళ్ళ తరువాత విచక్షణతో వోటువేసే హక్కు యిచ్చారు. ఎందుకని? చిన్నపిల్లలకు ఓటుహక్కు ఎందుకు లేదు? వారి పరిధి కాదు గనుక! యుక్తవయస్సు వచ్చిన తరువాత, రాజకీయాల్లో వారిష్టమోచ్చిన పార్టీలో చేరవచ్చు, చేరకపొవచ్చు. కనుక పుట్టగానే రిజిస్టర్ లో ఏ పార్టీ అనే కాలంలో ఫలానా పార్టీ అని రాయరు.

చిన్నపిల్లల్ని అశ్లీల సాహిత్యానికి, బూతు సినిమాలకు, అసభ్యశృంగారానికి దూరంగా వుంచాలంటారు. ఎందుకని?

అలాగే, మతం. నమ్మకాలు కూడా చిన్నపిల్లల పరిధిలోనివి కావు. అవి అవగాహన వున్నా పెద్దవారికి పరిమితం.

కాని తల్లితండ్రులు తమ మతాన్ని పుట్టగానే పిల్లలపై రుద్దుతున్నారు. నమ్మకాలు నూరిపోస్తున్నారు. ఇది పిల్లల పట్ల గొప్ప నేరం, ఘోరకృత్యం. మతంలో వుండే అసహనం, గుడ్డినమ్మకాలు, పరమతద్వేషం, అన్నీ పిల్లలకు వస్తున్నాయి. అలాగే దురాచారాలు, కూడా అలవాట్లుగా, జీవితంలోభాగంగా మారుతున్నాయి. మతం పెద్దల పరిధి. కనుక రాజకీయాలు, సెక్స్ వలె, మతాన్ని కూడా పిల్లలకు దూరంగా వుంచాలి. మతం పేరిట చిన్నపిల్లల్ని హిందువులు గుడికి తీసుకెళ్ళి గుండు చేయిస్తున్నారు. మొక్కమంటున్నారు. రాళ్ళురప్పల్ని కళ్ళకు అద్దుకోమంటున్నారు. మతం పేరిట బాల్యవివాహాలు చేశారు. ఇంకా అక్కడక్కడా చేయిస్తున్నారు. వాటిని ప్రభుత్వం నిషేధించింది. చిన్నపిల్లలకు పెళ్ళిచేసి, భర్త చనిపోతే, విధవలుగా బ్రతుకులు అగచాట్ల పాలైన ఉదంతాలు, మతాచారాల వలననే. అంతేగాదు సతీసహగమనం పేరిట భర్త చితిపై కాల్చేసిన ఘట్టాలూ చిన్నపిల్లల చరిత్రలో వున్నాయి. చిన్నప్పుడే గురువుల్ని ఎంపిక చేసి శంకరమఠాల్లో ఆచారాలు నూరిపోస్తున్నారు. క్రైస్తవులు చిన్నప్పుడే అమ్మాయిలను అమ్మగార్లగానూ (నన్స్) అబ్బాయిలను మతగురువులుగానూ (ఫాదరీ) "అంకితం" యిస్తున్నారు. పైగా అది దైవసేవగా పేర్కొంటున్నారు. చిన్నపిల్లలచే మంత్రాలు వల్లె వేయిస్తున్నారు. గుడులలో సేవలు చేయించుకొంటున్నారు. బైబిల్ పారాయణం చేయిస్తున్నారు.

ముస్లింలు పిల్లల్ని మసీదులకు తీసుకెళ్ళి కొరాన్ బట్టీపెట్టిస్తున్నారు. సుమారు 6 వేల చరణాలు అర్ధం తెలియకుండానే పిల్లలు విధిగా, అరబ్బీలో కంఠస్తం చేయవలసి వస్తున్నది. పైగా పరమతద్వేషం, నూరిపోస్తున్నారు. చిన్నపిల్లలతో ముస్లిం దురాచారం ఘోరంగా పరిణమించినది. అబ్బాయిలతో పాటు అమ్మాయిలకి కూడా "సుంతీ" చేయిస్తారు. 28 దేశాలలో ముస్లింలు యీ దురాచారాన్ని పాటిస్తున్నారు. అదంతా మతం పేరిటే వున్నది. అనేకచోట్ల అమ్మాయిలు ప్రమాదాలకు గురౌతున్నారు. ఐక్యరాజ్యసమితి కూడా యీ విషయం గుర్తించి, హెచ్చరించింది.

ఈ విధంగా పిల్లల్ని, మతంపేరిట హింసించడం అమానుషం. ఐక్యరాజ్యసమితి పిల్లల విభాగం యునిసెఫ్ యిటీవల పిల్లల హక్కులపై ప్రపంచసభ జరిపింది. దీనిని 187 దేశాలు ఆమోదించాయి. దీనిప్రకారం పిల్లలు తల్లితండ్రుల ఆస్తికాదు. వారికి వ్యక్తిత్వం వుంది. హక్కులు వున్నాయి. వాటిని పాటించాలి.

సంతకాలు చేసిన దేశాలు మతం జోలికి పోవడం లేదు.

కనుక యీ విషయమై ప్రపంచ మానవసంఘం ఒక తీర్మానం చేసి, ఐక్యరాజ్యసమితికి పంపాలని భారత హేతువాదసంఘం పక్షాన యిటీవల కోరాం. ఈ విషయంపై చర్చ జరగాలి. పిల్లలపట్ల మతం పేరిట జరిపే దారుణాలు ఆపాలి.

మతాన్ని గురించి పరిశీలించేటట్లు, ఆలోచించేటట్లు మాట చరిత్రలు పాఠాలుగా చెప్పాలి. చిన్నప్పుడే నమ్మకాలతో కూడిన మతాల్ని వల్లెవేయిస్తే పిల్లల్లో వున్న విశిత పరిశీలనాదృష్టి మోద్దుబారుతుంది. నీతి, విలువలు అనేవి మానవహక్కులు. వాటిని చెప్పాలి. మతం కేవలం దైవహక్కులు చెబుతూ మనిషిని సేవకుడుగా, ఎందుకూ పనికిరానిబానిసగా చూస్తున్నది.

- హేతువాది, మార్చి 1997