అబద్ధాల వేట - నిజాల బాట/నిజాలు చెప్పి నమ్మించడం కష్టమా?

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
నిజాలు చెప్పి నమ్మించడం కష్టమా?

నిజం చెప్పడం అవసరం కాని నిజం చెప్పి ఒప్పించడం కష్టం. అబద్ధం చెప్పడం సులభం. అనుకోకుండా, అలవాటుగా, ఆనవాయితీగా అబద్ధాలు చెబుతుంటాం. కొన్నాళ్ళకు అబద్ధాన్నే నిజం అని నమ్ముతాం.

అబద్ధానికి రుజువులు, సాక్ష్యాధారాలు అక్కరలేదు. నమ్మకం,మూఢ విశ్వాసం వుంటే చాలు. అబద్ధాలె చెల్లుతాయి. అలా అదేపనిగా అబద్ధాలు చెబుతూ పోతుంటే కొన్నాళ్ళకు అవి స్థిరపడి పోతాయి.

నిజానికి రుజువులు కావాలి. ఆధారాలు చూపాలి. ముఖ్యంగా పిల్లలకు నిజం చెప్పాలి. వారికి తెలుసుకోవాలనే జిజ్ఞాస, ప్రశ్నించడం అలవాటు. కాని వాటిని ప్రోత్సహించం. కొన్నాళ్ళకు ప్రశ్నలకు సమాధానాలు చెప్పలేక, గద్ధించి నోరు మూసుకోమంటాం.

పిల్లలకు మూఢనమ్మకాలు నేర్పుతున్నాం. క్రమశిక్షణ పేరిట మనోవికాసాన్ని చంపేస్తున్నారు. ఇదంతా కావాలని చేయలేకపోయినా, సమాజం కోసం చేతగానితనాన్ని కప్పిపుచ్చుకోడానికి జరుగుతున్నపనే. అది పిల్లల పట్లద్రోహం. నమ్మకాలు వంశపారపర్యంగా సంక్రమిస్తున్నాయి. పూర్వికులు కార్యకారణ సంబంధం అంతగాపట్టించు కోనప్పుడు నమ్మకాలు పుట్టాయి. వర్షం రావడానికి, పిడుగుపడడానికి, ఉరుములు మెరుపులు చూసి వాటి వెనుక దేవుళ్ళను, శక్తులను వూహించి నమ్మారు.

మన ఇంద్రియాల ద్వారా మెదడుకు సమాచారం అందుతుంది. ఇది తాలమసే అనే భాగంమీదుగా కార్డెక్స్ కు అంది,అక్కడ విడమర్చి పరిశీలన జరుగుతుంది. ఆ తరువాత ఒక విత్తనం ఆకారంలో గల అమిగ్దల (AMYGDALA)కు రాగా అక్కడ తగిన ఉద్వేగాలు,భయాందోళనలు జత అవుతాయి. ఈ అమిగ్దలభాగానికి దెబ్బతగలిన వారికి భయం వుండదు! ఒక్కోసారి తాలమస్ నుండి సూటిగా అమిగ్దలకు చేరగా ఉద్వేగాలు, భయాలు, నమ్మకాలు స్థిరపడుతుంటాయి.

వ్యక్తిగతంగా అర్థంపర్థం లేని మూఢనమ్మకాలు పెద్ద ఆటగాళ్లలో,సైంటిస్టులలో, రాజకీయ నాయకులలో వుంటాయి. మెడలో దండవేసుకోవడం ఇందులో భాగమే. దాని వలనే గెలుస్తున్నామనుకుంటారు. ఆట మధ్యలో తాయెత్తును కళ్ళకు అద్దుకుంటారు. గెలిస్తే తాయెత్తు మహిమ అనుకుంటారే గాని, ఓడిపోతే అనుకోరు. ఇదే వ్యక్తిగత మూఢనమ్మకం.

మెదడులోని సెరిబ్రల్ కార్డెక్స్ విభాగం మనల్ని హెచ్చరిస్తున్నా సరే, పట్టించుకోకుండా కొన్నిసార్లు మూఢనమ్మకాలు పాటిస్తారు. యజ్ఞం చేయిస్తే వర్షాలు వస్తాయని ప్రభుత్వాలు సైతం ప్రజల్ని మభ్యపెట్టడం యిందులోభాగమే. సాంకేతిక విజ్ఞానం వలన మూఢనమ్మకాలు అతి వేగంగా ప్రపంచమంతటా వ్యాపించే అవకాశాన్ని దుర్వినియోగం చేస్తున్నారు. వినాయకుడి విగ్రహం పాలుతాగిందనే అంథవిశ్వాసం అతి త్వరలో అమెరికాకు పాకింది. మేరీమాత కళ్ళవెంట నీళ్ళు,రక్తం చిందినట్లు అమెరికాలో కలగిన భ్రమపూరిత మోసం ఇండియాకు వెంటనే వ్యాపించింది. కంప్యూటర్లను సైతం మూఢనమ్మకాల వ్యాప్తికే వాడి చెడగొడుతున్నారు.

పిల్లలు తొందరగా నమ్ముతారు. తల్లిదండ్రులు వారికి ప్రమాణం. తరువాత స్నేహితులు, ఆ పిమ్మట బడిలో ఉపాధ్యాయులు. పిల్లలకు నమ్మకాలు ఎంత త్వరగా వస్తాయో అంతతొందరగా పోతాయి కూడా. కాని వాటిని పోనివ్వకుండా పదేపదే పునశ్చరణ చేయడంతో మూఢనమ్మకాలు గట్టిగా నాటుకుపోతాయి. చిన్నప్పుడు చాలా స్థిరపడిన నమ్మకాలు ఒక పట్టాన వదలవు. సైంటిస్టుగా, సాంకేతిక నిపుణునిగా, ఉపాధ్యాయుడిగా, డాక్టర్ గా పెరిగిన పిల్లవాడిలో చిన్నప్పటి నమ్మకాలు అలాగే తిష్టవేస్తాయి. తన వృత్తివరకూ నైపుణ్యంగా చేసినా మిగిలిన విషయాలలో కార్యకారణ సంబంధాలు శాస్త్రీయపద్ధతి అమలు చేయకపోడానికి ఇదే కారణం.

పిల్లల పట్ల మనం చాలా అపచారం. తెలిసో తెలియక చేస్తున్నాం.మన నమ్మకాల్ని వారికి అందించడమే యీ అపచారం. మానసిక వికాసాన్ని చంపేయడం కంటే ఘోరమైన తప్పు మరొకటి లేదు.

పిల్లల్ని ఆస్తిగా భావించరాదని పిల్లల మనోవికాసాన్ని వ్యక్తిత్వాన్ని గుర్తించాలని ఇక్యరాజ్యసమితి 1989లో ఒక చట్ట ప్రకరణ రూపొందించింది. ఇది ఇంకా ప్రచారంలోకి రావాలి.

మనకు తెలియంది తెలియదు అనడానికి, పిల్లలముందు ఆ మాట అనడానికి మనో నిబ్బరం కావాలి. తెలుసుకొని చెబుతాం అనగలగాలి. గుడ్డిగా దండాలు పెట్టించరాదు,మొక్కించరాదు. పిల్లలకు దూరంగా వుంచాల్సిన విషయాలలో మూఢనమ్మకాలు, అంధవిశ్వాసాలు, ఆధారాలు లేని అయోమయ విషయాలు అనేది గుర్తించాలి.

ఆలోచనలకు పదునుపెట్టాలి గాని చంపేయరాదు.ఇది కష్టమే కాని సాధ్యం.

- వార్త, 30 డిసెంబరు,2001