అబద్ధాల వేట - నిజాల బాట/టంగుటూరి ప్రకాశం

వికీసోర్స్ నుండి
టంగుటూరి ప్రకాశం

మన సంప్రదాయం ప్రకారం కీర్తిశేషులైన వ్యక్తిని మితిమీరి శ్లాఘిస్తుంటాం. దీనివలన ఆ వ్యక్తిలోని మంచిచెడులను శాస్త్రీయంగా అంచనా వెయడానికి వీల్లేకపోతునంది. రాజకీయాలలోనూ, మతరంగంలోనూ ఈ విధమైన వీరారాధన బాగా పాతుకుపోయింది. ముఖ్యంగా చనిపోయినవారి పేరు చెప్పుకుని బతికేవారికి నిశితపరిశీలన అంటే బొత్తిగా గిట్టదు. టంగుటూరి ప్రకాశం గారి విషయంలో ఇదే జరుగుతోంది.

1872లో నేటి ప్రకాశం జిల్లా కనపర్తి గ్రామంలో సనాతన కుటుంబానికి చెందిన నియోగి బ్రాహ్మణ కుటుంబంలో జన్మించాడు ప్రకాశం. ఒక విధంగా వీరిది "బతికిచెడిన" కుటుంబం. తాతతండ్రులు బాగా ఆస్తిపాస్తులు అనుభవించినా ప్రకాశం మాత్రం చిన్ననాటినుండీ పేదరికం చవిచూచాడు. నాయుడుపేట, ఒంగోలులలో ప్రకాశం మాత్రం చిన్ననాటినుండీ పేదరికం చవిచూచాడు. నాయుడుపేట, ఒంగోలులలో ప్రకాశం చదువుకుంటున్న రోజుల్లో రౌడీల స్నేహంతో దొంగతనం చేసే వరకూ సాహసించాడు కాసూరి రంగడు, నవులూరి రమణయ్య మొదలైన రౌడీలే ఆనాడు ప్రకాశానికి స్నేహితులు. బజార్లో అమ్ముకునేవాళ్ళ దగ్గరా, పంటపొలాలమీదా దొంగతనాలు చేసేవారు. దీని వలన ప్రకాశానికి ఆ వయసులోనే సాహసం, నిర్భీతి అనే లక్షణాలు వచ్చాయి. డబ్బుకు ఎప్పుడూ ఎవరో ఒకరిని కొట్టితెచ్చుకుంటే సరిపోతుందనే భావం చిన్ననాడే ఏర్పడింది.

గాంధీజీకి హైస్కూలు చదువు రోజుల్లో ముస్లీం రౌడీ స్నేహితుడు తగిలినట్లే, ప్రకాశం గారికి నాటక వేషాల సందర్భంగా ఉండదల్లీ సాహేబుతో సహా అనేక మంది ముస్లిం మిత్రుల సాంగత్యం అబ్బింది. అనేక నాటకాలలో ఆడ పాత్రలు కూడా ధరించిన ప్రకాశం ఆ అలవాట్లను రాజమండ్రిలో కూడా కొనసాగించాడు. ఆ కారణంగా 15వ ఏట మెట్రిక్ తప్పాడు. ప్రైవేటుగా మెట్రిక్ పాస్ అయినా చెడిపోతున్నాడనే భయంతో 18వ ఏట హనుమాయమ్మతో అద్దంకిలో పెళ్ళి చేశారు. కాని "స్త్రీ చాపల్యంవల్ల సంసారజీవితంలో సౌఖ్యంలేద"ని ప్రకాశం నిజం ఒప్పేసుకున్నాడు. (నా జీవితయాత్ర పేజీ 126) ప్రకాశం 19వ ఏట ఎఫ్.ఎ.పాసై మద్రాసు వెళ్ళి 'లా' చదివాడు. 1894లో రాజమండ్రి లో ప్రాక్టీసు మొదలుపెట్టి, మూడుసార్లు ప్రయత్నించి ఓడిపోయి,1899లో తొలిసారిగా నెగ్గాడు. మునిసిపాలిటీ రాజకీయాలు నాడూనేడూ ఒకేరీతిలో వున్నాయి. 30ఏళ్ళకు రాజమండ్రి మునిసిపల్ ఛైర్మన్ అయిన ప్రకాశం, ప్లీడర్ వృత్తి సాగిస్తూ క్రిమినల్ కేసులలో రాణిస్తుండేవాడు.

రాజమండ్రిలో కందుకూరి వీరేశలింగం అప్పటికే సంస్కరణోద్యమంలో, సమాజ ఛాందసాలకు ఎదురీదుతూ అష్టకష్టాలు పడుతుండేవాడు. ప్రకాశం అక్కడేవున్నా, వీరేశలింగంపై గౌరవం వుందని వ్రాసుకున్నా, ఆచరణలో అందు కనుగుణమైన పనులు చేసినట్లు ఎక్కడా గోచరించదు. పైగా తమ్ముడు శ్రీరాములు కోసం వీరేశలింగంపై కేసులో వాదించి, వృత్తిధర్మం అని చెప్పుకున్నాడు,ప్రకాశం.

మునిసిపల్ రాజకీయాలకూ, సంస్కరణవాదానికీ పొత్తు కుదరలేదు. కాని ఇంగ్లండ్ లో బారిస్టర్ చదివి తిరిగివచ్చినప్పుడు మాత్రం అందరిలా ప్రాయశ్చిత్తం చేసుకోడానికి నిరాకరించిన ప్రకాశం, మొండిధైర్యం ప్రదర్శించాడు. ఇంగ్లండు లో బారిస్టర్ చదువు సందర్భంగా ప్రకాశానికి రాజకీయాల వాసన తగిలింది. దాంతోపాటే మాంసాహారం, సిగరెట్టు కూడా అలవాటయ్యాయి. కాంగ్రెస్ లో అతివాది అయిన లాలాలజపతిరాయ్ తో పరిచయమయింది. కాంగ్రెసు రాజకీయాలలో తిలక్ కూడా అతివాదే. వీరి అతివాదం అంటే మతవాదమే. ఇది ప్రకాశానికి వచ్చింది. గోఖలే వంటి మితవాదులు ప్రకాశానికిష్టంలేదు.

1893లో మద్రాసులో వివేకానంద వలన కొంత ప్రేరేపణ పొందానని ప్రకాశం చెప్పుకున్నాడు. 1907ఓ సూరత్ కాంగ్రెసు మహాసభలలో అతివాదులు-మితవాదులు చెప్పులతో కొట్టుకున్న సందర్భంగా, ప్రకాశం అతివాదుల పక్షాన్నే వున్నాడు. ఆ తరువాత "ఎప్పుడైనా కులాసాగా కాంగ్రెస్ కి వెడుతూ వుండేవాణ్ణి. అంతకంటె ఎక్కువగా కాంగ్రెస్ ఎప్పుడూ నన్ను ఆకర్షించలేకపోయింది" అని ప్రకాశం స్పష్టీకరించాడు.

1907 నుంచి మద్రాస్ లో బారిస్టర్ గా ప్రాక్టీస్ చేశాడు. 14 సంవత్సరాల పాటు నిర్విరామంగా జరిపిన ఈ ప్రాక్టీస్ లో మొదటి ఏడు సంవత్సరాలు అప్పులు తీర్చి సంసారాన్ని పోషిస్తూ తరువాత ఏడు సంవత్సరాలలో బాగా సంపన్నుడయ్యాడు. భూములు, బంగళాలు కొని స్థిరాస్తి పరుడయ్యాడు. మధ్యలో అనిబిసెంట్ రాజకీయాల పట్ల ఆకర్షితుడయ్యాడు.

గాంధీజీ 1921లో ఇచ్చిన సహాయ నిరాకరణోద్యమ పిలుపును అందుకొని కోర్టు ప్రాక్టీసు వదలుకొని రాజకీయాలలోకి పూర్తిగా ప్రవేశించినవారిలో ప్రకాశం ఒకరు. కాని గాంధీశిష్యుడుగా లేదా అనుచరుడుగా ప్రకాశం ఎప్పుడూ రాణించలేదు. మనస్సు అతివాదంపై నిమగ్నమై వుండటంవలన, అప్పటికి తిలక్ పోవడం వలన సి.ఆర్.దాసుకు, మోతీలాల్ కు చేరువగా మెలిగాడు. ఈ వైరుధ్యమే ఆయనకు చిక్కులు తెచ్చిపెట్టింది.

స్వరాజ్య పత్రికను 1921 అక్టోబరులో మద్రాసునుంచి ప్రకాశం ప్రారంభించాడు. అప్పుడే గాంధీజీతోనూ, రాజగోపాలాచారితోనూ ప్రకాశానికి పరిచయం ఏర్పడింది. కాని ఆ పరిచయ స్నేహం అట్టేకాలం నిలవలేదు. స్వరాజ్యపత్రికను మూసేయమని గాంధీజీ పదేపదే సలహా ఇవ్వడం ప్రకాశం మొండికేయడం జరిగింది. గాంధీజీ తన కుమారుడు దేవదాస్ గాంధీకి రాజీజీ కుమార్తె లక్ష్మితో పెళ్ళిచేశాడు. ఆ విధంగా వియ్యంకులుగా సన్నిహితులైవారు ప్రకాశాన్ని జీవితాంతమూ వ్యతిరేకించారు. గాంధీతో ఢీకొనడమంటే ఆనాడు మాటలు కాదు అలాగే "గుంటనక్క"గా పేరు తెచ్చుకున్న రాజాజీ ఎత్తుగడలను గమనించడం, ఎదుర్కోవటం సామాన్యం కాదు.

గాంధేయులకు స్వరాజ్యవాదులకూ మధ్య నిలబడి "సెంట్రల్ పార్టీ" పెట్టిన ప్రకాశం సఫలం కాలేదు.

1921లో ప్లీడరీ వృత్తి వదలడం, స్వరాజ్యపత్రిక ప్రారంభించడంతో ప్రకాశం జీవితంలో పెద్ద మలుపు తిరిగింది. రాజకీయాలలో ఉంటూ వృత్తిని సాగిస్తే అదొక తీరు. కాని మరొక యావ లేకుండా రాజకీయమే వృత్తిగా పెట్టుకున్నప్పుడు, తాను బతకడం ఎలా, కుటుంబాన్ని పోషించడం ఎలా అనే సమస్య వస్తుంది. మనదేశంలో రాజకీయమే వృత్తిగా గలవారు ప్రజలపైనే ఆధారపడుతున్నారు. ప్రకాశం కూడా ఆ కోవలో చేరాడు. "నేను సంపాదించినదంతా ఖర్చుపెట్టాను. కాబట్టి దేశం మీదబడి ఎంత వసూలు చేసినా ఫరవాలేదు" అనే ధోరణి అవలంబించిన ప్రకాశం చాలా బాధ్యతారహితంగా రాజకీయాలలో నీతి, అవినీతి అనే గీటురాయి లేకుండా చేశాడు. ఇటువంటి ధోరణిని ఎవరు అవలంబించినాసరే మంచిదికాదని డాక్టర్ లోహియా ఖండించాడు.

మద్రాసుకు సైమన్ కమిషన్ రాక సందర్భంగా ప్రకాశం పాత్ర గురించి చాలా మంది రాశారు.

కాని ప్రకాశంగారు 'నా జీవితయాత్ర'లో రాసిన విషయాలు గమనించాలి. మొదటిసారి సైమన్ కమీషన్ బొంబాయిలో 1928 ఫిబ్రవరిలో అడుగిడినప్పుడు మద్రాసులో నిరసన ఊరేగింపులు జరిపారు. ఆనాడు శ్రీనివాస అయ్యంగారు, వెనుక ప్రకాశంగారూ అనుచరులతో పోతుంటే మెరీనాబీచ్ లో పోలీసులు అటకాయించారు. "ముందడుగు వేయవలసిందనే ఆదేశం కాంగ్రెస్ ఇచ్చి ఉండలేదు. అందుకని కాస్త తటపటాయించా" అని ప్రకాశం రాశారు. (పేజీ 372) ఆ తరువాత సైమన్ కమీషన్ మద్రాసు వస్తున్న సందర్భంగా పూర్తి హర్తాళ్ పిలుపు యిచ్చారు. ప్రకాశం ఆనాడు కారులో బయలుదేరితే బీచ్ లో, మౌంట్ రోడ్ లో, ఫ్లవర్ బజారులో పోలీసులు అడ్డగించారు. ప్రకాశం వెనక్కు వెళ్ళాడేగానీ తుపాకీకి గుండె చూపలేదు. ఆ తరువాత పారిస్ కార్నర్ లో ఒక వ్యక్తి చనిపోయిపడివున్నాడు. అతన్ని చూడటానికి వెళ్ళనివ్వమని ప్రకాశం కోరాడు. "ఒక సిపాయి నా గుండెకు బారుచేసి తుపాకి పట్టుకున్నాడు నాకుదారి యివ్వవలసిందని వానిని నేను కోరాను. మీరు బలవంతంగా వెళ్ళదలిస్తే మేము కాల్చవలసి వస్తుందన్నాడు వాడు. నాపక్కన గుంపులోవున్న ఒక మహమ్మదీయ యువకుడు, ధైర్యం వుంటే కాల్చు. మేమంతా సిద్ధంగా వున్నాం ఆయనెవరో నీకు తెలియదల్లేవుంది" అని అరిచాడు.

"కొద్ది క్షణాల తర్వాత వాడు తప్పుకుని దారియిస్తూ దయయుంచి ఏ గడబిడా చేయవద్దని గుంపును కోరవలసిందని ప్రాధేయపడ్డాడు. నేను వచ్చే వరకూ శాంతంగానే వుండవలసిందని గుంపును కోరి ముందుకు సాగి గుండు దెబ్బలతో పడి వున్న, ఆ మృతదేహాన్ని చూసి, ఆ రోడ్డుకు ఎదురురోడ్డున హైకోర్టు వెనుకభాగాన వున్న ఒక భవనంలో ఆశీనుడయివున్న చీఫ్ ప్రెసిడెన్సీ మేజిస్ట్రేట్ చూడగోరాను.

ఇది ఆనాడు జరిగింది. టంగుటూరి ప్రకాశం కేంద్ర శాసనసభలో వుండగా మాలవ్యాపార్టీలో చేరాడు. కాంగ్రెసులో ఇమడలేకపోయాడు. అయితే గాంధీజీ పిలుపు ఇచ్చినప్పుడు ఉప్పు సత్యాగ్రహంలోనూ, క్విట్ ఇండియా ఉద్యమంలోనూ జైలుకు వెళ్ళాడు.

గాంధీజీతోసహా ఎవరినిగురించీ ప్రకాశం మర్యాదగా మాట్లాడేవాడు కాదు. బహిరంగ సభలలో వాడు, వీడు అనే పదప్రయోగాలు బాగా చేసేవాడు. శ్రీనివాసయ్యంగార్, రాజగోపాలాచారి గురించి "ఏదో విధంగా బినామీ మంత్రిపదవులనైనా స్వీకరించి తమ వాంఛలను తీర్చుకోవాలనే కోరిక ఆ యిరువురి నాయకులకూ మిక్కుటంగా ఉంది" అని ప్రకాశం రాశాడు. 1927లో సుబ్బరాయన్ మద్రాసులో ఏర్పరచిన మంత్రివర్గ సందర్భంగా ప్రకాశం చేసిన వ్యాఖ్య అది.

గాంధీ రెండో రౌండ్ టేబుల్ సమావేశానికి వెళ్ళడం అవివేకం అనీ, బెల్గాం కాంగ్రెస్ అధ్యక్ష పదవికి గాంధీ ఒప్పుకోవడం, మనోదౌర్భల్యం అనీ ప్రకాశం రాశాడు. అంధ్ర కాంగ్రెస్ వ్యవహారాలను చూస్తే, ముఠా రాజకీయాల పితామహుడు ప్రకాశం అనవచ్చు. ఆయనకు,ఇతర నాయకులకూ తరచు తగాదాలు వచ్చాయి. పట్టాభికి ఈయనకూ శాశ్వత కలహం వుండేది. అలాగే బులుసుసాంబమూర్తి, కొండా వెంకటప్పయ్య మొదలైనవారితో పేచీలు పడ్డాడు. 1937లో మద్రాసు ప్రధాని కావాలని ప్రకాశం ప్రయత్నించినా, ఆంధ్రులే బలపరచలేదని తెన్నేటి విశ్వనాధం వాపోయాడు.

ఆ ముఠా తగాదాల్ని చివరకు జైళ్ళలో కూడా కొనసాగించారు. మళ్ళీ పదవిని వదల్లేక 1937లో ప్రజాపార్టీ అని పెట్టారు. అక్కడకు వెళ్ళిన ప్రకాశం, రంగాలు అందులో చేరారు. తర్వాత రంగా చీలి వేరే పార్టీ పెట్టారు. 1952 తొలి సాధారణ ఎన్నికలలో ప్రకాశం ప్రతిచోటకూ తిరిగి కాంగ్రెస్ మంత్రుల అవినీతిని బయటపెట్టాడు. వాళ్ళంతా ఓడిపోయారు. మద్రాసు బీచ్ నియోజకవర్గంలో నిలబడి తానూ ఓడిపోయాడు. అప్పట్లో సోషలిస్టులు కలిసి రాగా ప్రజా సోషలిస్టు పార్టీ ఏర్పడింది.

మద్రాసులో మంత్రిమండలి ఏర్పాటు సమస్య వచ్చింది. కాంగ్రెసువారు రాజాజీ కోసం ప్రయత్నించారు. రంగా పార్టీ అందుకు అండగా నిలిచింది. తన రాజకీయ జీవితమంతటా కమ్యూనిస్టులను తిట్టిన టంగుటూరి ప్రకాశం, ముఖ్యమంత్రి పదవి కోసం, ఒక ఫ్రంటు నాయకుడుగా వారితోనే కలిసి మంత్రిమండలి ఏర్పరచాలని విఫలప్రయత్నం చేశాడు. కుటిలనీతి రాజకీయాలలో కాంగ్రెస్ వారే నెగ్గారు. దానితో అప్పటికే 80 సంవత్సరాలు వచ్చిన ప్రకాశం కొత్తగా ఏర్పడనున్న ఆంధ్రరాష్ట్ర ముఖ్యమంత్రి అయ్యేందుకు ప్రజాసోషలిస్టు పార్టీని తన్నేసి అంతవరకూ కుళ్ళిపోయిందని విమర్శించిన కాంగ్రెసుతోనూ, అవినీతిపరులని తిట్టిన సంజీవరెడ్డి వంటివారితోనూ చేతులు కలిపాడు. అయినా ప్రకాశం ముఖ్యమంత్రి పదవి కర్నూలులో కూడా అట్టేకాలం వుండలేదు.

రాజకీయాలలో నీతి చాలా అవసరం. మానవ విలువలు కావాలి. అవి రెండూ లేనప్పుడు సమాజాన్ని పరిపాలించడానికి అర్హత కోల్పోతారు. ఆంధ్ర రాజకీయాలలో ప్రకాశం ఎటువంటి నైతిక విలువల్ని కూడా చూపలేకపోయాడు. ఇంకా లోతుకు పోతే చాలా విషయాలున్నాయి. అందులో కొన్నిటిని "నా జీవితచరిత్ర"లో ప్రకాశం రాసినప్పటికీ క్రొవ్విడి లింగరాజు, తెన్నేటి విశ్వనాథం కొట్టి వేయించారని తెలిసింది. మున్సిపాలిటీ రౌడీ రాజకీయాలను రాష్ట్రస్థాయికి తెచ్చిన ప్రకాశం - ముఠా నాయకుడుగా తప్ప ఎదగలేకపోయాడు. కృష్ణాపత్రిక సంపాదకుడు ముట్నూరి కృష్ణారావు సరదాగా ఏటా కొందరికి బిరుదులు తన పత్రిక ద్వారా ప్రకటిస్తుండేవాడు. అలా ఒక ఏడు ప్రకాశానికి "ఆంధ్రకేసరి" అని ఇచ్చారు. ఈ సంగతి తెలిసినవారు తక్కువ.

ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రావతరణ సమస్య 1913లో మొదలై, చాలామంది త్యాగాలను కోరింది. కాని తీరా రాష్ట్రం రాబోయే సమయానికి ప్రకాశం, పట్టాభిల ముఠాతగాదాల వలన యీ సమస్య కొంత సాగదీయవలసి వచ్చింది. జవహర్ లాల్, వల్లభాయ్, పట్టాభిల నివేదికను అంగీకరిస్తే 1950 నాటికే ఆంధ్రరాష్త్రం ఏర్పడి వుండేది. కాని ఆ కీర్తి పట్టాభికి దక్కుతుందని ప్రకాశం అడ్డుపడి మద్రాసు మాకే కావాలన్నాడు. తెన్నేటి విశ్వనాధం ఏమి రాశారో గమనించండి. "చివరకు, 1952లో సోషలిస్టు, కమ్యూనిస్టు పార్టీలలోని ఆంధ్రసభ్యులు చెన్నపట్నం మీద ఆశవదులుకోవడం వల్ల, ఆంధ్ర కాంగ్రెసుపార్టీ వారు చెన్నపట్నం తమిళ రాష్ట్రంతో కలిపివేయాలన్ని నివేదికలో సంతకం చేయడం వల్ల - ప్రకాశంగారు, ఆయన అనుయాయులు కూడా చెన్నపట్నం లేకుండా ఉన్న ఆంధ్రరాష్ట్రం ఏర్పడడానికి అంగీకరించవలసి వచ్చింది" (నా జీవితయాత్ర - అనుబంధ సంపుటి చతుర్ధఖండము పేజి 772 ఎమెస్కో ప్రచురణ) అంతవరకూ బాగానే వుంది. తరువాత పొట్టి శ్రీరాములు 52 అక్టోబరు 19న ఆమరణనిరాహారదీక్ష పూని, మద్రాసుతో కూడిన ఆంధ్ర కావాలంటే, ప్రకాశం అందుకు మద్ధతు ప్రకటించాడు. అప్పుడు జరిగిన హింసలో ఆస్తుల మాటెలావున్నా, ప్రాణనష్టం ఎంతో జరిగింది. నాయకుల చెలగాటంలో ప్రజలు చితికిపోవడం పరిపాటే. అందుకు ప్రకాశం మినహాయింపుకాదు. జీవితాంతమూ మద్రాసు నగరం కోసం ప్రకాశం పట్టుబట్టి పోరాడివుంటే, ఆయన పట్టుదల గలవాడని మెచ్చవచ్చు. కాని పదవి ఎరచూపేసరికి అన్నీ మరచిపోతూ వచ్చాడు.

ప్రకాశం చేసిన త్యాగాలను, సేవలను, దోషాలను అంచనావేసి చూస్తే, మొత్తం మీద తప్పటడుగులే ఎక్కువ. వ్యక్తిగతంగా ఆయన నుండి మనం నేర్చుకునేవి ఏమీలేవు. జమిందారీ వ్యతిరేక పోరాటం, గాంధీ వంటి నాయకులతో ఢీకొనడం వంటి విశేషాలే చెప్పుకోదగినవి.

- ఈనాడు, ఆగస్టు 1982