అబద్ధాల వేట - నిజాల బాట/అపూర్వ అన్వేషణా కేంద్రం

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
అపూర్వ అన్వేషణా కేంద్రం

నయగరా వద్ద "సెంటర్ ఫర్ ఇంక్వయిరీ" అనే పేరిట యీ ప్రపంచ అన్వేషణా కేంద్రం నెలకొన్నది. ఇతర యాత్రాస్థలాల వంటిది కాదు. ఇక్కడ ప్రశ్నలకు సమాధానాలు వస్తాయి. కొత్త ప్రశ్నలు, సందేహాలు తలెత్తుతాయి.

ఇక్కడ ప్రపంచం మొత్తం మీద ఇంగ్లీషులో ప్రచురించిన హేతువాద, మానవవాద, సందేహవాద, నాస్తికవాద జిజ్ఞాస గ్రంథాలన్నీ కలిపి ఒక గ్రంథాలయంగా ఏర్పరచారు. ఇంకా సేకరణ సాగుతున్నది. క్రమేణా స్పానిస్, ఫ్రెంచి తదితర భాషలకు సైతం యీ సేకరణ విస్తరిస్తారు. పుస్తకాలేగాక, వివిధ పత్రికలు కూడా పాతవి ఇక్కడ భద్రపరుస్తున్నారు.

ప్రపంచవ్యాప్తంగా జనాన్ని రకరకాలుగా మోసం చేయడం,వారిని మాయచేసి డబ్బు రాబట్టడం, మూఢనమ్మకాలను స్థిరపరచడం, వ్యాధులను నయం చేస్తామనడం, అతీంద్రియ శక్తుల బూచి చూపడం తెలిసినదే. ఒక్కమాటలో అదంతా బూటకం అని కొట్టిపారెయ్యకుండా, అన్ని రంగాల నిపుణులతో సంఘాలు ఏర్పరచారు. ప్రపంచంలో ఏ మూల ఇందుకు సంబంధించిన సమాచారం లభించినా స్వీకరిస్తారు. నిజానిజాలు నిగ్గు తేలుస్తారు. ఇందులో మొదటి సంఘం జ్యోతిష్యానికి చెందింది. ఇ.డబ్ల్యు. కెల్లీ ఈ సంఘాధ్యక్షుడు. జ్యోతిష్యాన్ని శాస్త్రీయంగా పరిశీలించడం,వారు చెప్పేది ఎంతవరకు నిలబడుతుందో? ప్రపంచానికి చెప్పడం వీరి ఉద్దేశం. ఎక్కడ, ఎవరు సత్యమని చెప్పినా, అందుకు శాస్త్రీయాధారాలు చూస్తారు. పరీక్షకు నిలిస్తే ఒప్పుకున్నట్లు లోకానికి చాటి చెబుతారు. లేకుంటే లేదంటారు.

పత్రికలు,టి.వి.పై కన్ను

పత్రికలు, సమాచార కేంద్రాలు ప్రజల్ని విపరీతంగా ప్రభావితం చేస్తున్నాయి. రేడియో, టి.వి., పత్రికలు ఈ కోవకు చెందుతాయి. వీటిని నిత్యమూ ఒక కంట కనిపెడుతూ, అవి చెప్పేవాటిలో అబద్ధాలు వుంటే బయటకు చెప్పడం యీ సంఘం ప్రధాన ఉద్దేశం. అంతేగాక అసత్యాలు,అబద్ధాలు ప్రచారం చేయడానికి వెనుక గాధ ఏమిటో తెలుసుకుంటారు. సినీతారలు, మతప్రచారకులు, రాజకీయ నాయకులు వలన కొన్ని మూఢనమ్మకాలు ఎలా వ్యాపించాయో గ్రహిస్తున్నారు. ఇది కూడా నిరంతర కృషిగా సాగే కార్యక్రమం. ఈ సంఘానికి ఎటిన్ సి. రైయస్ అధ్యక్షులుగా వున్నారు.

ఆరోగ్యం-అతీంద్రియ శక్తులు

ఆరోగ్యం పేరిట అనేక చికిత్సా విధానాలు జనాన్ని ఆకర్షించి, సొమ్ము చేసుకుంటున్నాయి. ఆధునిక శాస్త్రీయ వైద్యానికి మార్గాంతరంగా వీరు గొప్పలు చెప్పుకుంటున్నారు. నిజంగా వీరి చికిత్సలో పసవుందా? ఎంతవరకు అది నిలుస్తుంది? ఏ మేరకు శాస్త్రీయం అని చూడడానికి మరొక సంఘాన్ని నియమించారు. విలియం జార్విస్ అధ్యక్షతన ఈ సంఘం పనిచేస్తున్నది.

అతీంద్రియ శక్తుల విషయమై కొన్ని యూనివర్శిటీలలో సైతం విపరీతంగా ఖర్చు చేస్తున్నారు. జనం ఈ మోజులో పడిపోతున్నారు. కనుక యీ రంగాన్ని శాస్త్రీయంగా అధ్యయనం చేయడానికి దేహైమన్ అధ్యక్షతన సంఘం ఏర్పరచారు. వీరు పేరాసైకాలజీ విషయాలన్నీ చూస్తారు.

ఇతర లోకాల నుండి ఎగిరే పళ్ళాలపై వింత మనుషులు రావడం, కొందరిని తీసుకెళ్ళడం, తిరిగి పంపడం, ఇలాంటి విషయాలు అర్థశతాబ్ధంగా వ్యాప్తిలో వున్నాయి. దీనిపై విపరీత రచనలు వచ్చాయి. దీని నిజానిజాలు తేల్చుకోవడానికి ఫిలిప్ జే.క్లాజ్ అధ్యక్షతన ఒక సంఘం ఏర్పరచారు.

మతాల అధ్యయనం

ప్రపంచంలో ఎన్నో మతాలు వున్నాయి. వాటిని గుడ్డిగా అనుసరించేవారు, మతాలు మార్చుకునేవారు. ఒక మతం కంటె మరొకటి మిన్న అనేవారు, కొత్తమతాల్ని స్థాపించేవారూ ఉన్నారు. మతాల్ని గుడ్డిగా వ్యతిరేకించేవారూ వున్నారు. అలాగాక మతాలన్నిటినీ శాస్త్రీయంగా పరిశీలించడానికి హెక్టర్ అవలోస్ అధ్యక్షతన ఒక సంఘం ఏర్పరచారు. మతం పేరిట జరిగే వాటిని వీరు పరిశీలిస్తారు. మత గ్రంథాలను చూస్తారు. హిందూ, క్రైస్తవ, యూదు, ఇస్లాం,బౌద్ధం వంటి వాటి మూలగ్రంథాలను, ఆచారాలను శాస్త్రీయంగా పరిశీలిస్తారు. ఇస్లాంను అధ్యయనం చేయడానికి ఇబ్నవారక్ ను ప్రత్యేకంగా యీ సంఘంలో చేర్చుకున్నారు. ఇస్లాంపై శాస్త్రీయ పరిశీలన అంతగా జరగనందున, ఆ లోపాన్ని పూరిస్తారు. అన్వేషణా కేంద్రం ప్రపంచ సంస్థ అనడానికి కారణం వుంది. అనేక దేశాలలో ఈ సంస్థకు శాఖలు, ప్రతినిధులు వున్నారు. మనదేశంలో ఢిల్లీ, బొంబాయి, మద్రాసులలో ఈ కేంద్ర ప్రతినిధులు వున్నారు. చైనా, రష్యా, జపాన్, ఇటలీ, ఈజిప్టు, హంగరీ, జర్మనీ, స్పెయిన్, దక్షిణాఫ్రికా, తైవాన్, ఫిన్లాండ్, కెనడా, బెల్జియం, జకొస్లావేకియా, మెక్సికో, నెదర్ లాండ్స్ తో సహా మరికొన్ని దేశాలలో ప్రతినిధులు వున్నారు. ఆయా రంగాలలో జరిగే విషయాలు కేంద్రానికి తెలియపరచడం, ఎక్కడికక్కడ అద్భుతాలను,అతీంద్రియ విషయాలను, అపురూప చికిత్సలను పరిశీలించి, ఏ మేరకు శాస్త్రీయమో చూడడం వీరి ప్రధాన లక్ష్యం. ఇదొక బృహత్తర పథకం. ఎవరైనా ఆయా రంగాలలో సమాచారాన్ని అందిస్తే స్వీకరిస్తారు.

రెండు పత్రికలు

అన్వేషణా కేంద్రం ఎప్పటికప్పుడు అధ్యయన శిబిరాలు, గోష్టులు. చర్చలు నిర్వహిస్తుంటుంది. ఈ కేంద్రం రెండు పత్రికలు ప్రచురిస్తున్నది. ఒకటి ఫ్రీ ఇంక్వైరీ. ఇందులో భావాల బలం తేల్చడం ప్రధానం. ఏ విషయమూ చర్చకు అనర్హం కాదు. ఏ భావమూ పవిత్రమైనది కాదు. ఏదీ అంటరానిది కాదు. అన్నిటినీ రాపాడించి, శాస్త్రీయ పరిశీలనకు, మానవ హక్కులకు సరిపడుతుందా అనే దృష్టికి కొలమానంగా గ్రహిస్తారు.

మరో పత్రిక స్కెప్టికల్ ఇంక్వైరర్.ఇందులో అన్నిటినీ సందేహించి, ప్రశ్నించి, ఆధారాలకు నిలబడితేనే సరైనదని చెబుతారు. వినాయకుడి విగ్రహం పాలు తాగుతుందంటే ఎంతవరకు నిజం. అసలు కథ ఏమిటి? అని చూస్తారు. మేరీమాత కంట తడిపెడుతుంటే విగ్రహం పరిశీలించి, లోన ఏర్పాట్లు చూస్తారు. ఉన్నది ఉన్నట్లు జనానికి చెబుతారు. స్వస్థత కూటములలో ప్రార్థనతో అద్భుతంగా రోగాలు నయమవుతున్నాయని అంటే ఆ విషయాలను గ్రహించి పరిశీలిస్తారు. లోగడ జేమ్స్ రాంఢీ యిలాంటివాటి వెనుక వున్న ఆసలు విషయాలను బయటపెట్టాడు. ఆయన కూడా యీ సంస్థకు చెందినవాడే. చూపుతోనే చెంచాలు వంచడం, భవిష్యత్తు చెప్పడం మొదలైనవన్నీ వీరి పరిశీలనలోకి వస్తాయి. అందుకే యీ కేంద్రం విశిష్టమైనది. దీనిని సందర్శించడం యాత్రలో భాగంగా పెట్టుకోవాలి.

పాల్ కడ్జ్ యీ అన్వేషణా కేంద్ర స్థాపకులలో మూలపురుషుడు. న్యూయార్క్, స్టేట్ యూనివర్సిటీలో ఫిలాసఫీ ప్రొఫెసర్ గా రిటైరై ఆయన యీ కృషి చేబట్టాడు. తన ధనాన్ని కేంద్రస్థాపనకు ఇచ్చి మిగిలినది వసూలుచేసి పెద్ద భవనం నిర్మించారు. ప్రపంచమంతటా పర్యటించారు.

పాల్ కడ్జ్ మనదేశంలో కూడా పర్యటించారు. ఇటీవల చైనా కూడా వెళ్ళారు. అరబ్బు దేశాలలో శాస్త్రీయ పరిశీలనా సంఘాలు పెట్టడానికి తిప్పలు పడుతున్నారు. అన్వేషణా కేంద్రంవారు ఇటీవల ఇంగర్ సాల్ మ్యూజియం ను కూడా ఏర్పరిచారు. క్రైస్తవమతాన్ని, బైబిల్ ను నిశిత విమర్శకు గురిచేసిన ఆర్.జి.ఇంగర్ సాల్ మ్యూజియం డ్రెస్డన్ లో ప్రారంభించారు. ఇది న్యూయార్క్ రాష్ట్రంలో రోచస్టర్ దగ్గర వుంది.

ప్రామిథియస్ ప్రచురణలు ఈ కేంద్రానికి జీవగర్ర. వివిధ రంగాలలో శాస్త్రీయ కృషిని వీరు ప్రచురణల ద్వారా వెలికితీస్తుంటారు. ప్రచురించడానికి ఇతరులు వెనుకాడినవాటిని, శాస్త్రీయమని ఆధారాలుంటే, ఈ సంస్థ అచ్చేస్తుంది. అందుకే ప్రామిథియస్ కు పేరు లభించింది.

ఏ భావాన్ని మతాన్ని అభిప్రాయాన్ని ముందుగా ఈ కేంద్రం తృణీకరించదు. శాస్త్రీయ పరిశీలనకు గురిచేయడం ఇందలి ప్రధానాంశం.

ఇకముందు అమెరికా సందర్శించేవారు సెంటర్ ఫర్ ఇంక్వయిరీని తప్పకుండా చూడలి. న్యూయార్క్ స్టేట్ యూనివర్శిటీ పక్కనే బఫెలో నగరంలో ఇది వుంది. అక్కడకు వెళ్ళలేనివారు అనుబంధ కేంద్రాలతో సంబంధం పెట్టుకుని విషయాలు తెలుసుకోవచ్చు. అమెరికా వెళ్ళినవారు ఈ కేంద్రానికి ఉచితంగా ఫోను చేయవచ్చు. 1-800 - 634-1610 వీరి నెంబరు. వెళ్ళదలచుకున్నవారు ఆం రెస్ట్, న్యూయార్క్ 14226-0703కు వెళ్ళవచ్చు. ("వార్త" సౌజన్యంతో)

- హేతువాది, ఆగస్టు, సెప్టెంబరు 1997