అప్పులేని సంసారమైన పాటే చాలు

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search

అప్పులేని సంసారమైన పాటే చాలు

తప్పులేని జీతమొక్క తారమైనఁ జాలు


కంతలేని గుడిశొక్క గంపంతయినఁ జాలు

చింతలేని యంబలొక్క చారెఁడే చాలు

జంతగాని తరుణి యేజాతైన నదె చాలు

వింతలేని సంపదొక్క వీసమే చాలు


తిట్టులేని బ్రదుకొక్క దినమైన నదె చాలు

ముట్టులేని కూడొక్క ముద్దెఁడే చాలు

గుట్టుచెడి మనుకంటే కొంచెపు మేలైనఁ జాలు

వట్టి జాలిఁ బడకుంటే వచ్చినంతే చాలు


లంపటపడని మేలు లవలేశమే చాలు

రొంపి కంబమౌ కంటె రోయుటే చాలు

రంపపుఁ గోరిక కంటె రతి వేంకటపతి

పంపున నాతనిఁ జేరే భవమే చాలు 1-114