అనిరుద్ధచరిత్రము/పంచమాశ్వాసము

వికీసోర్స్ నుండి

శ్రీరస్తు

అనిరుద్ధచరిత్రము

పంచమాశ్వాసము




కల్యాణగుణోజ్జ్వల
పాకాహితముఖ్యవినుతపదపద్మశర
ద్రాకేందుచంద్రికావిభ
వాకరదరహాసమంగళాద్రినివాసా.

1


గీ.

అవధరింపుము శౌనకుం డాదియైన, మునివరేణ్యులతోడ నిట్లనియె సూతుఁ
డాపరీక్షిన్మహారాజు నాదరమునఁ, జూచి విజ్ఞాననిధియైన శుకుఁడు పలికె.

2


గీ.

అట్లు కరుణించి పలికిన యచ్యుతునకు, వందనముఁ జేసి చనియె శైవజ్వరంబు
బాణుఁ డపు డట్లు భీతితోఁ బఱచి తనదు, మందిరముఁ జొచ్చి చింతాబ్ధిమగ్నుఁ డగుచు.

3


వ.

ఇట్లని తలంచు.

4


మ.

అతిరౌద్రారుణనేత్రకోణములతో నాలీఢపాదద్వయో
న్నతితోఁ జంచలకుండలప్రభలతో నారాచభృన్మండలీ
కృతకోదండముతో జయార్భటముతోఁ గృష్ణుండు నాముందటన్
శతకోట్యాకృతులం గనంబడియెడు న్సర్వంబునుం దానయై.

5


చ.

గెలిచితి నిర్జరేంద్రు నుడికించితి వహ్ని గృతాంతుఁ గొట్టితిన్
జలమున నైఋతి న్విగతశౌర్యుని జేసితి వార్ధినాథునిం
గలఁచితిఁ దోలితిన్ బవను గర్వ మడంచితిఁ గిన్నరేంద్రునిన్
జెలఁగి మహేశ్వరు న్స్వవశుఁ జేసితి నప్రతిమానకీర్తినై.

6


ఉ.

ఇంతమహాద్భుతం బెఱుఁగ నెన్నఁడుఁ గృష్ణధనుర్విముక్తదు
ర్దాంతశరౌఘతీవ్రతరధాటికి డెందము దల్లడిల్లెడుం
బంతములెల్ల హాస్యములపాలుగ మద్భుజవిక్రమక్రమం
బింతకు వచ్చె దైవకృత మెవ్వరికైన హరింపవచ్చునే.

7


వ.

అమ్మహాపురుషుం డాదినారాయణుం డగుట తప్ప దతనితోడి సంగ్రామంబువలన
నెట్లైన లెస్స యని ధైర్యంబుఁ దెచ్చుకొని రోషభీషణాకారుండై.

8

ఉ.

హారకిరీటకుండలముఖాభరణోజ్జ్వలుఁడై సహస్రబా
హారుచిరాయుధప్రకరుఁడై బిరుదధ్వజఘంటికాస్వనో
దారరథస్తుఁడై తురగదంతిరథాదికచాతురంగసే
నారభటీకఠోరతరుఁడై పటహధ్వను లుల్లసిల్లఁగన్.

9


గీ.

శోణనగరంబు వెలువడి సురవిరోధి, ధరణి కంపింప నేతెంచి తాఁకుటయును
యాదవబలంబు విక్రమం బతిశయిల్ల, మాఱుకనిన రణం బతిఘోర మయ్యె.

10


సీ.

శరపరంపరలచే సైన్యంబు మగ్గంగ రథములు పఱపించు రథికవరులు
రథికులపైఁ గుంజరముల దీకొల్పి గర్వమునఁ దాఁకెడు గజవాహకులును
గజవాహకులమీఁదఁ గంఖాణములఁ దోలి కత్తుల నఱకు రాహుత్తగములు
రాహుత్తులను బరాక్రమలీల శోభిల్లఁ జేరి యీఁటెలఁ గ్రుమ్ము వీరభటులు
నగుచుఁ బోరాడె రోషంబు లతిశయిల్ల, నుభయచతురంగబలములు నుక్కు మిగిలి
పలలఖాదనభవకుతూహలపిశాచ, కంఠకోలాహలమున నాకసము వగుల.

11


వ.

అప్పుడు.

12


మ.

హరిపై బాణుఁ డహంకృతిం గదిసి బాహాపఙ్క్తి నొక్కుమ్మడిన్
శరము ల్తోమరము ల్గద ల్ముసలము ల్చక్రంబులు న్శూలముల్
పరిఘంబు ల్కరవాలము ల్పరశువు ల్ప్రాసాదనానాయుధో
త్కరము ల్శైలము గప్పుమంచుపగిదిం గన్పట్టఁగా నేసినన్.

13


చ.

భుజబలశాలి మాధవుఁడు పూని ధనుర్గుణటంకృతిన్ హరి
ద్గజములకర్ణము ల్పగులఁగా నిశితార్ధశశాంకసాయక
వ్రజములు పింజపింజఁ గరువం బరఁగించి తమం బడంచు నీ
రజహితులీల సాధనపరంపరలం దునుమాడి తీవ్రతన్.

14


మ.

విజయోత్సాహము మోమునం బొదలఁగా విశ్వంభరుం డార్చి య
క్కజమై తేజము దిక్కుల న్వెలుఁగ నాగర్వాంధదైత్యాబ్ధి ఘో
రజవస్పర్శనము న్హరామరపరబ్రహ్మాదికళ్యాణకృ
న్నిజసందర్శనమున్ సుదర్శరము నున్నిద్రప్రతాపంబునన్.

15


వ.

ప్రయోగించిన.

16


మ.

చటులంబై చలితక్షమావలయమై చంద్రార్కకోటిప్రభా
ఘటితాశాంతరమై చరాచరసమాక్రాంతాగ్నికీలాసము
త్కటమై చండతరాంశువై చకితరక్షశ్చక్రమై చక్ర మా
ర్భటితో వచ్చి వియచ్చరు ల్జయజయారావంబుతో మ్రొక్కఁగన్.

17


వ.

సముద్దండవేదండప్రకాండశుండాదండమండితంబును, గనత్కనకకంకణకేయూర
ముద్రికానిచయఖచితప్రచురమణిగణమరీచిమాలికాలంకృతంబును, ద్రైలోక్యభయం

కరకారణసౌభాగ్యరేఖావళీకలితారుణకరతలంబును, జంద్రశేఖరమనోరంజితతాళ
ప్రమాణలయాలయవ్యాప్తివిస్తారరంగన్మృదంగవాద్యఘాతకారిణ్యంగుళ్యాభిరామం
బును, నక్తంచరీకుచకుంభయుగళచర్చితతుహినజలమిళత్పరకర్దమసురభిఘుమ
ఘుమాయమానంబును నైన బాణాసురుని జాహుసహస్రంబునందుఁ జతుష్టయావశిష్టం
బుగా ఖండించి వైచిన జంఝాసమీరణవిక్షేపవిదళితశాఖాసహస్రంబై మోడ్పడి
యున్న మహామహీరుహంబుచాడ్పునఁ బురందరకరాంభోరుహశుంభద్దంభోళిధా
రాహతపక్షంబైయున్న కుంభినీధరంబువిధంబున నుండె నప్పుడు.

18


క.

సురుచిరసురనికరకరాం, బురుహవికీర్ణ ప్రసూన పుంజము లొఱపై
హరిపైఁ గురిసె న్మొరసెన్, వరుసన్ రంభాదినాట్యవాద్యరవంబుల్.

19


గీ.

అవ్విరోచనపౌత్రునియందుఁ జాల, కరుణ గల్గుటఁ జేసి గంగాధరుండు
పురుషసూక్తంబు చదువుచు హరిని జేరి, విజయవాక్యప్రయుక్తి నిట్లని నుతించె.

20


చ.

అనఘుఁడ వప్రవేయుఁడ వనంతుఁ డవాద్యుఁడ వక్షరుండ
వత్యనుపమచిన్మయుండవు చరాచరజాలసమేతమైన యి
వ్వనజభవాండపఙ్క్తులు భవజ్ఙఠంబున నీదుమాయచే
జననము వర్ధనంబు నవసానము నొందుచు నుండు నీశ్వరా.

21


సీ.

అఖిలాత్మ నీనాభియందు నాకాశంబు మునివంద్య నీపాదములను ధరణి
సర్వేశ నీమానసమునఁ జంద్రుండును జలజాక్ష నీనేత్రముల నినుండు
గాంభీర్యనిధి నీముఖంబున నింద్రుండు మురహర నీకర్ణములను దిశలు
నురగేంద్రశయన నీయూర్పుల ననిలంబు ఘనమూర్తి నీమస్తకమున దివము
ప్రబల మగుచుండు నుపనిషత్పంచకమయ, దివ్యమంగళవిగ్రహస్థితి వెలుంగు
నిన్ను భావించి సేవించి సన్నుతించి, కాంతు రనఘులు మోక్షంబుఁ గమలనాభ.

22


క.

అని మఱియు బహువిధంబుల, వినుతించు శశాంకధరుని వినయోక్తులకున్
జనితప్రమోదమానస, వనరుహుఁడై పలికె గరుడవాహనుఁ డెలమిన్.

23


నీదయ వీనిపైఁ గలిమి నిక్కువ మింతియె కాదు వీఁడు ప్ర
హ్లాదునకుం బ్రపౌత్త్రుఁడు తదన్వయజాతుల నే వధింపఁ గా
లే దటుగాన జీవ మెడలింపక కాచితి బాహువిక్రమో
న్మాద మడంపఁగావలసి మట్టున నుంచితిఁ జంద్రశేఖరా.

24


క.

ప్రమథగణంబులలో ను, త్తముఁడై భవదీయసన్నిధానంబున మో
దముతోడ నుండఁగలఁ డీ, యమరాహితుఁ డింక నోపురాసురమథనా.

25


గీ.

అనుచు నానతి యిచ్చె నయ్యవసరమున, బాహువులతోన యజ్ఞానబంధములను
వీడుకొని మాధవుని జేరి వినయఫణితిఁ, జాగి మ్రొక్కుచు బాణుండు సంభ్రమమున.

26

శా.

మాయామానుషమూర్తివై తనరుబ్రహ్మంబు న్శివాబ్జాసనా
ధ్యేయుం నిన్ను నెఱుంగలేక నవనీతి న్మాఱుకొన్నందుకుం
బ్రాయశ్చిత్తము గాఁగఁ జేసితిని నాపాపంబు లోపంబు గా
నాయజ్ఞానము వాసె నీకరుణఁ గృష్ణా గోపికావల్లభా.

27


వ.

అని మఱియుం బునఃపునఃప్రణామపూర్వకంబుగా బహుప్రకారంబులం బ్రస్తుతించి
యుషాకన్యానిరుద్ధకుమారులంగా చేసి తోడ్కొనిరమ్మని పరిచారకులం బంచిన వారును
దదీయశుద్ధాంతకాంతాజనంబులకుం దెల్పిన నవ్వధూవరుల నుచితోపచారంబులం
బ్రీతులంజేసి యలంకరించి రప్పుడు.

28


సీ.

కంకణఝణఝణత్కారానుగుణముగా హస్తపద్మములు నాట్యములు సలుప
హసప్తద్మములనాట్యములతో నుద్దియై గుత్తంపుగుబ్బలు కులికియాడ
గుత్తంపుగుబ్బలకులుకుతో నైక్యమై కంఠహారఁబులు గంతులిడఁగఁ
గంఠహారంబులగంతులజత గూడి పిడికెడునడుము దా బెళుకుఁ జూప
విమలహరినీలరుచులతో వియ్య మంద, మరుకుమారునినునుసోగకురులయందు
లలితచాంపేయసురభితైలంబు నించి, యెలమిఁ దల యంటె నొక్కపూర్ణేందువదన.

29


క.

నలుఁగిడియె నొక్కకోమలి, మలయజపంకంబు లంటె మఱియొక్కతె ని
ర్మలకనకకలశముల జల, కం బొనరించెఁ గుసుమశరపుత్రునకున్.

30


క.

తడియొత్తె నొకతె వలిపెపు, మడుఁగులు గట్టంగ నిచ్చె మఱియొక్కతె యిం
పడరంగ నగరుధూపం, బిడె నొక్కతె పరిమళంబు లెంతయు నెసఁగన్.

31


గీ.

అర్ధచంద్రోపమంబైన యతనినుదుట, దిద్దె నొక్కతె కస్తూరితిలక మదియుఁ
దనరెఁ గందర్పకుసుమకోదండదండ, ఘటితనీలోత్పలాస్త్రసంకాశ మగుచు.

32


ఉ.

ఒక్కలతాంగి మౌక్తికసముజ్జ్వలభారములందు వజ్రపుం
జెక్కలతాళిబిళ్ల విలసిల్లఁగఁ గూర్చి యలంకరింపఁ బెం
పెక్కి తదీయవక్షమున నెంతయుఁ జూడఁగ నొప్పె నయ్యెడన్
జుక్కలగుంపులో మిగులశోభిలుపూర్ణశశాంకుకైవడిన్.

33


చ.

శ్రవణపదావిలగ్నమకరప్రకటాభరణోజ్జ్వలాస్యకై
రవహితులీల నాఘనుఁడు రాజిలె నీలరుచిం దళత్తళల్
గవయఁ బ్రజానురాగకరకంకణము ల్ప్రవహింపఁజూచి గౌ
రవగుణసంప్రపూర్ణజలరాశి కదా యని తజ్జ్ఞు లెంచఁగన్.

34


గీ.

నిలువుటద్దంబు ముందర నిలిపె నొకతె, యందుఁ బ్రతిబింబితం బైనయతనిరూపు
జూచి భ్రమ నొంది యొక్కతె సురటి వీవఁ, జెలులు ఘల్లున నగి రది సిగ్గువడఁగ.

35


సీ.

సరసవృత్తస్తని గురులీల వరమహోత్పలమాల రచియింపఁ బ్రౌఢవమ్మ
వరమహోత్పలవైరివదన నీ వంబరాలంకృతి సేయవలంతివమ్మ

యంబరోపమమధ్యయందంబుగా ఘనసారం బలందంగ జాణవమ్మ
ఘనసారకచ నీవు కంకణాభరణంబు లందగింప వినోదురాలవమ్మ
యనుచుఁ బూర్ణేందువదనలవ్యంగ్యవచన, రచనఁ జిఱునవ్వు మోముల రహి వహింప
వినుతభూషణభూషితాంగునిగఁ జేసి, రపుడు యదువంశజలధితారాధిపతిని.

36


క.

కొందఱు చెలికత్తె లుషా, సుందరిఁ గైచేసి రపుడు సురుచిరభూషా
చందనకుసుమాదులచేఁ, గందర్పునిరాజ్యలక్ష్మిగతిఁ జెలువొందన్.

37


సీ.

గిలుకుటందియలఁ జెక్కినవజ్రములకుఁ బాదసరోజనఖకాంతి తళుకు లిడఁగఁ
బ్రతి లేనిముక్కర సైఁ గెంపులకు ముద్దుమోవి చెంగావిమేల్ముసుఁగు దిద్ద
నిగిడిచేర్చుక్కలో నీలంబులకుఁ గుంతలచ్ఛాయ శృంగాగలక్ష్మి నొసఁగఁ
దాటంకమౌక్తికతతికి మందస్మితరసము లావణ్యవిభ్రమము నించఁ
గటకకేయూరరశనాదికనకమునకు, నమరు మైజిగివన్నియ లతిశయింపఁ
దొడవులకునెల్లఁ దనమేను దొడవు గాఁగ, రహి వహింపుచునుండె నారాజవదన.

38


మ.

కమలాక్షు ల్తగ నవ్వధూవరుల శృంగారించి రత్న ప్రభా
విమలంబైనరథంబుమీఁద నిడి ఠీవి న్వల్లకీవేణుశం
ఖమృదంగాదికవాద్యసంజనితమాంగల్యధ్వను ల్లాస్యకా
సమమంజీరఝళంఝళధ్వనులు హెచ్చన్ రాజమార్గంబునన్.

39


మ.

చనుదేరంగఁ బురంధ్రు లున్నతమహాసౌధంబుల న్నిల్చి హ
స్తనటత్కంకణనిక్వణం బెసఁగ లాజ ల్చల్లి రాత్మావలో
కననీలోత్పలదామసంయుతములై కన్ఫట్టి కాంతిస్ఫుర
ద్ఘననీలోత్సలమాలికాకలితముక్తాజాలలీలం దగన్.

40


చ.

కలికి యొకర్తు వారలను గన్గొనఁబోవుచుఁ గంఠమాలికల్
గళమున వైచుకోకతమకంబున గుబ్బలమీఁదఁ జేర్చినన్
గులికెడు చూచుకంబులఁ దగుల్కొని చూడఁగ నొప్పె నెంతయుం
బొలుపగుతంత్రులం బొలుచు పుత్తడికాయలవీణెకైవడిన్.

41


చ.

అలికులవేణి యొక్కతె సహస్రదళంబు వినోదలీలఁ గో
మలకరపంకజాతమున మాటికిఁ ద్రిప్పుచు నేగుదెంచి యిం
పలరఁగ నవ్వధూవరుల నయ్యడఁ గన్గొనుచుండె వేయుగ
న్నులవలె వీరియందముఁ గనుంగొనఁగా నని తెల్పుకైవడిన్.

42


సీ.

ఈభానుతేజున కీకోకకుచకును జెలిమి సంఘటనంబు చేసినాఁడు
ఈచంద్రవదనున కీచకోరాక్షికి వెలయ నేస్తంబు గావించినాఁడు
ఈమేఘవర్ణున కీకేకిగమనకుఁ గోరి సాంగత్యంబుఁ గూర్చినాఁడు
ఈపద్మహస్తున కీభృంగవేణికిఁ బ్రియవిలాసంబుఁ గల్పించినాఁడు

ఎంత నేర్పరి శారదాకాంతుఁ డహహ, యిట్టియనుకూలదాంపత్య మెఱిఁగి చేసె
ననుచుఁ బురభామినులు ప్రమోదాత్మ లగుచుఁ, గూడి తమలోన ముచ్చటలాడి రపుడు.

43


వ.

ఇట్లు చనుదెంచిన కూఁతునల్లునిం జూచి ప్రమోదరసభరితస్వాంతుండై బాణుండు వార
ల కనేకరత్నాభరణవస్తువాహనధేనుదాసదాసీజనంబుల నుపాయనం బొసంగి, వాసు
దేవసన్నిధికిం దోడ్కొనిపోయి యప్పగించినం గృతప్రణాములై యున్నవారలం గనుం
గొని యతండు.

44


క.

కనికరపుముదంబునఁ జి, క్కనికరములఁ గౌఁగిలించి కాంతాయుతుఁడౌ
మనుమని సుఖాన్వితుఁడవై, మనుమని దీవించో సబహుమానము గాఁగన్.

45


మత్తకోకిల.

గారవంబున మ్రొక్కుఁ గైకొని కౌఁగిలించెడివారలున్
జేరి మ్రొక్కి తదాదరోక్తులచేఁ జెలంగెడువారలున్
గోరి కన్నులు చల్లఁగాఁ గనుఁగొంచునుండెడివారలున్
గూరిమిన్ బలముఖ్యులు న్హితకోటియుం బ్రమదంబునన్.

46


వ.

అంత.

47


ఉ.

బాణుని గారవించి పురభంజను వీడ్కొని శంఖనాదని
స్పాణధణంధణ ల్సెలఁగ సొమజఘోటక ముఖ్యవాహినుల్
శ్రేణులు గట్టి విక్రమవిజృంభణత న్వెనువెంట రాఁగ గీ
ర్వాణవిలాసినీమృదుకరస్రుతసూనరసప్లుతాంగుఁడై.

48


శా.

కాంతం దోడ్కొని బ్రహ్మసూసహితులైవకందర్పముఖ్యు ల్మహా
సంతోషంబున నేగుదేర యదువంశస్వామి కల్లోలినీ
కాంతారాచలపట్టణావళు లనేకంబు ల్డనుంగొంచుఁ ద
త్ప్రాంతక్షోణిపతుల్ సువస్తునికరం బర్పించి సేవింపఁగన్.

49


వ.

కతిపయదినంబులకుం జనిచని.

50


సీ.

గోత్రాధిపఖ్యాతిఁ గొమరారి యుండుట సురశైలరాజభూసురులఁ బోలి
మకరాంకసంవర్తి మహిమఁ చెన్నొందుట గగనకిన్నరవరాంగజులఁ బోలి
ఘనరసాలంకృతు ల్గనుపట్టియుండుట హరజటాసిద్ధకావ్యములఁ బోలి
హరిచరణప్రభూతాభిముఖ్యం బౌట బలిదానవననాకములను బోలి
రంగదుత్తుంగచటులతరంగనటన, భంగకల్లోలజాలసంభ్రమనినాద
పూరితాశాంతరాళమై పొలుచుచున్న, పశ్చిమాంబుధిఁ గనియె గోపప్రభుండు.

51


క.

కనుఁగొని మనమునఁ బెనఁగొను, ననురాగమువలన వికసితాననుఁడై యిం
పెనయఁగ నిష్టాలాపము, లొనరించుచు నరిగె యాదవోత్కరములతోన్.

52


ఉ.

వారిజలోచనుండు యదువల్లభుఁ డేగుచుఁ గాంచె ముందటన్
ద్వారకఁ జంచలాంచితలతాకలితాసితమేఘమాలికా

కారవిలాసకృత్సరసకంజముఖీనికరప్రచారవి
స్తారసురేంద్రనీలఖచితస్ఫుటహర్మ్యకదంబధారకన్.

53


ఉ.

అంతకుమున్న కృష్ణునిజయం బభియాతిపరాజయం బుషా
కాంతయు ఋశ్యకేతుఁడు సుఖస్థితి వచ్చుట యాదియైనవృ
త్తాంతము చారసూక్తిఁ దెలియ న్వసుదేవుఁడు పౌరకోటి శు
ద్ధాంతజనంబులు న్విని మహాప్రమదాంబుధి నోలలాడుచున్.

54


వ.

పట్టణంబు శృంగారంబు సేయించిన.

55


సీ.

ఘనసారకస్తూరికాజలాసారంబు చెలువంపువీథులఁ జిలుకరించి
గమకంబు లైనముక్తాఫలంబులతోడ లీలతో రంగవల్లికలు దీర్చి
నవరత్నభూషణాంబరసుగంధద్రవ్యపుంజంబు లంగళ్లఁ బొందుపఱిచి
కదళికాస్తంభముల న్ఘనచిత్రపటములు నుభయపార్శ్వములఁ బెంపొంద నునిచి
ద్వారములయందుఁ దోరణావళులు గట్టి, పరిమళము మించు నగురుధూపములు వైచి
నృత్తగీతవాద్యాదుల నెఱపఁజేసి, యమితశృంగార మొనరించి రప్పురంబు.

56


ఉ.

భూసురవేదనాదములఁ బుణ్యసతీజనమంజులోక్తులన్
భాసురనృత్తగీతరసబంధురరావములం బురీవనీ
వాసశుకానులాపముల వారణబృంహితవాజిహేషలన్
శ్రీసముదంచితం బగుచుఁ జెల్వువహించెఁ బురంబు నవ్యమై.

57


గీ.

అట్లు శృంగారితముఁ జేసి యఖిలజనులు, గంధపుష్పాక్షతాద్యలంకరణు లగుచు
నెదురుగా నేగుదెంచి రమేశుఁ గాంచి, మ్రొక్కి యనిరుద్ధుఁ గొల్చి ప్రమోదు లైరి.

58


క.

పురలక్ష్మీసరసతరనిజ, సరసీతామరసరసలసన్మృదులీలా
సురభిపరీభోగపవనాం, కురుమిషమున హరికి నెదురుకోలు వహించెన్.

59


ఉ.

గోపురశాతకుంభమయకుంభపయోధరకుంభజృంభణల్
చూపుచు సౌధయూథపరిశోభితహీరదరస్మితంబు లు
ద్దీపన సేయుచు న్జలదుదీర్ణపటాగ్రపతాకహస్తవి
క్షేపణ సన్న సేయుచు వశీకృతచిత్తుని జేసెఁ గృష్ణు న
ట్లాపురలక్ష్మికాంతుని బ్రియాంగన మోహితుఁ జేయుకైవడిన్.

60


వ.

ఇవ్విధంబునం బ్రకల్పితశృంగారతరంగరంగరంగవల్లీప్రయుక్తముక్తాఫలతారకా
లంకృతంబును, గుట్టిమరేఖాస్థగితప్రదీప్తహీరద్యుతివితతకౌముదీకమ్యంబును, సకల
జననయనకువలయవికాసహేతుకంబునునైన రాజమార్గంబున యదుకులపయఃపా
రావారచంద్రుండగు దేవకీనందనుఁ డరుగుచున్నసమయంబున.

61


ఉ.

బంగరుపళ్లెరంబులను బద్మముఖు ల్ఘనసారదీపికల్
రంగ మరంగ నించి మణిరాజితకంకణహస్తవల్లులున్

సంగతి నుంచి త్రిప్పుచును సారెకు మంగళకౌశిక న్జయం
మంగళ మంచుఁ బాడిరి సమంచితపంచమనాదవైఖరిన్.

62


గీ.

నందకాయుధునకు శోభనం బటంచు, నగరకాంతలు నీరాజనంబు లిడుట
కలపతాకహస్తంబుల నభినయించెఁ, బురరమాదేవి భరతవిస్ఫురణఁ దెలసి.

63


క.

నిరుపమవిమానపఙ్క్తులు, గురుతరమణిహర్మ్యములును గూడి వెలుంగన్
సురకాంతలుఁ బురకాంతలు, సరిచల్లెడువిరులవాన జడియై కురిసెన్.

64


వ.

అప్పుడు.

65


సీ.

తాళకేతనసముద్యత్కాంచనాస్యందనారూఢుఁ డైనవాఁ డతనిఁ జూడు
నాగాంతకధ్వజోన్నతహేహేమమయశతాంగారోహణుండైన యతనిఁ జూడు
మకరపతాకాసమానగాంగేయరథాసీనుఁడై యున్నయతనిఁ జూడు
వరఋశ్యకేతు సుందరమైనకనకంపుటరదంబుపై నొప్పునతనిఁ జూడు
మతఁడు బలరాముఁ డతఁడు మురాసురారి, యతఁడు కుసుమాయుధుం డతం డతనితనయుఁ
డనుచు నొండొరులకుఁ దెల్పుకొనుచునుండి, డప్పురంధ్రులు గగనగృహాంతరముల.

66


ఉ.

కైరవిణీప్రియేశువెనుకం జనురోహిణిలీల నింపుసొం
పారఁ బ్రసూనసాయకసుతాసుగతిం జనుదెంచునయ్యుషా
వారిజగంధి నంచితసువర్ణలతాసమమోహనాంగి శృం
గారరసంపుబొమ్మఁ బొడగాంచి పురంధ్రులు సమ్మదమ్మునన్.

67


వ.

తమలో నిట్లనిరి.

68


ఉ.

తేనియ లూరు కెంపుసుదతీమణివాతెర చంపకద్రవం
బానెడితేఁటిగుంపు విమలాంగికచంబు సదా వికాసముల్
బూనుసరోజము ల్చిగురుఁబోఁడికనుంగవ జోక యెప్పుడున్
మాననిచక్రవాకములు మానినిచన్నులు చూడుమా సఖీ.

69


చ.

కలువలపేరు పేరుకొనఁగాఁ గుముదమ్ములు మన్మథాంబకం
బులు గణుతింపఁగా విషమము ల్కమలంబులపుట్టుపూర్వముల్
దెలియఁగఁ బంకజాతములు తేరి కనుంగొనఁగా మెఱుంగుఁదీఁ
గెలు చపలంబులన్నియు సఖీమణికన్నులఁ బోల నేర్చునే.

70


క.

కల దనుచును లే వనుచును, బలుమఱువాదంబు లేల పని లే దింకన్
గల దనుటకు లే దనుటకుఁ, దలపంగా నడుము నడుము తరుణీమణికిన్.

71


మ.

చెలువంబై కళల న్వెలుంగు హురుమంజీదేశపున్ ముత్తియం
బులతోఁ గూర్చిన చేరుచుక్క నొసట న్బొల్పొ౦దు నెమ్మో మహా
చెలి కెంతందము చూడరమ్మ రుచిరాశ్లేషాసమాయుక్తని
ర్మలరాకాతుహినాంశుమండలము సామ్యంబై ప్రకాశించుటన్.

72

చ.

పురుషులలో నపూస్వరసపూర్ణశరీర మనంగ సూతికిం
దరుణులలో సమానరహితంబగురూపము బాణపుత్త్రికిన్
సరసముగా సృజించి యిటు సమ్మతి నిద్దఱఁ గూర్చినట్టియా
సరసిజగర్భుఁ డెంతగుణశాలి తలంపఁగఁ బాటలాధరా.

73


వ.

అని యనేకప్రకారంబులం గొనియాడుచు నదియె ముచ్చటగా నుండి రప్పుడు పురు
షోత్తముండు భేరీమృదంగాదివాద్యంబులును, శంఖకాహళవేణుప్రముఖతూర్యంబు
లును బోరుకలఁగ మహావైభవంబున నరిగి నిరంతరవిహార్యమాణేందిరంబగు మంది
రంబుఁ బ్రవేశించి, యమాత్యజ్ఞాతిసామంతబంధుమిత్రాదిపరివారంబుల దివ్యాంబరా
భరణతాంబూలాదివస్తుప్రదానంబులం బ్రహృష్టమానసులం జేసి, యుచితప్రకారంబులఁ
దత్తద్గృహంబులకు వీడు కొల్పి, యంతఃపురంబులకుం జని యిప్టోపభోగంబు లనుభవింపు
చుండె. నయ్యనిరుద్ధుకుమారుండు నుషాసమెతుండై దేవకీవసుదేవులకు రేవతికి రుక్మిణీ
సత్యభామ జాంబవతీ కాళిందీమిత్రవిందాసుదంతాభద్రాలక్షణాదులైన ముత్తైదు
వలకుఁ దన తల్లులైన రతీశుభాంగులకుఁ బ్రణామంబులు చేసిన వారును బరమానందర
సప్రవాహితాంతరంగులై యవ్వధూవరుల నాలింగనంబులు చేసి యనేకవిధంబుల దీవించి
రతండును నిజవియోగవేదనాభారంబునఁ గృశీభూతయైయున్న రుక్మలోచన
ననేకవిధంబుల గారవించి సంప్రీతహృదయం గావించి మజ్జనభోజనాదులఁ దృప్తుండై
బాణనందనాసురతసంభోగానందనిరతుండై యుండి.

74


సీ.

సారససంసారసరసరసాసారసౌరభాన్వితరసరశ్చారణముల
సాలలీలాలోలఖేలదేలాలతాజాలడోలాకేళిలోలగతులఁ
గింజల్కరంజితమంజీరపుంజమంజులవంజులనికుంజసుమనసములఁ
గుందబ్బందమరందబిందుపేదిందిరామందనాదశ్రుతానందములను
గౌరఘనసారనీహారనీరపూర, సారచారుపటీరచర్చాసుఖాప్తి
కోకకోకిలశారికానీకకేకి, శౌకలోకాకరవనావలోకనముల.

75


శా.

ప్రాంచత్కాంచననూత్నరత్నఖచితప్రాసాదదేశంబులం
బంచాస్త్రప్రియనందనుండు సురతప్రాపంచికవ్యాప్తిఁ గ్రూ
డించున్ దక్షిణనాయకత్వమునఁ బ్రౌఢిన్ రుక్మనేత్రామన
స్పంచారుండును బాణదైత్యతనయాసక్తాంతరంగుండునై.

76


సీ.

కుచకుంభయుగముఁ బైకొని కేల నంటుట నైరావతము నెక్కి యాడినట్లు
కదియించి నెమ్మేనుఁ గౌఁగిట నలముట హరిచందనము మేన నలఁదినట్లు
సునయోక్తి వీనులు సోకుట నప్సరోవీణానినాదంబు వినినయట్లు
బింబికాధరచూషణంబు సేయుటయు సుధాసారపానంబు చేసినట్లు

సౌఖ్య మొదవంగ నిచ్చనిచ్చలును బాణ, కన్యసంభోగ మింద్రభోగంబు గాఁగ
సతతవిభవానుభవతృణీకృతపురంద, రుం డగుచు నుండె నయ్యనిరుద్ధవిభుఁడు.

77


వ.

అంత.

78


గీ.

మందగతులకు నత్యంతమందగతియు, మంజులోక్తుల కతిశయమంజులంబు
మెఱుఁగుమేనికి మిక్కిలిమెఱుఁగు నగుచుఁ, బుష్పగంధికి నీళ్లాడఁ బ్రొద్దులయ్యె.

79


వ.

అంత.

80


శా.

స్వక్షేత్రంబుల నుచ్చరాసులహితస్థానంబులన్ దీప్తులై
యక్షీణుండగుచంద్రుఁ జూచుచు దినేశాదు ల్చరింప న్సమ
గ్రక్షేమంకరలగ్నవేళ శుభఋక్షంబందు రాజాంశఁ బ
ద్మాక్షీరత్నము పుత్రుఁ గాంచె హరిపూర్ణాంశావతీర్ణాంగునిన్.

81


క.

సురదుందుభినాదంబులు, సురకరనిర్ముక్తకల్పసుమవర్షంబుల్
సురరమణీనాట్యంబులు, సురగాయకగానములును శోభితమయ్యెన్.

82


ఉ.

యాదవవృష్ణిభోజకులులందఱు వేడుకలం జెలంగి ర
త్యాదరవృత్తి బాణతనయారమణుండు సువర్ణధేనుర
త్నాదిసమస్తవస్తువు లనంతముగాఁ జెలరేఁగి యిచ్చి పృ
థ్వీదివిజేంద్రకోటులను దృప్తులఁ జేసి కృతావగాహుఁడై.

83


క.

లౌకికవైదికరీతులఁ, గైకొని పుత్త్రోత్సవంబు గావించి యతం
డేకాదశదినమున విభ, వాకరముగ నామకరణయత్నముఁ జేసెన్.

84


క.

వజ్రాదిభూషణుండును, వజ్రాంగుఁడు వైరివీరవసుధాధరభి
ద్వజ్రుఁడునై మెలఁగెడునని, వజ్రుండని నామమిడిరి వరవిప్రోక్తిన్.

85


సీ.

చూడఁగా నేర్చె విస్ఫుటకృపామృతరసంబుఁ గటాక్షవీథులఁ బూనుకొఱకు
నడుగు చాఁపఁగ నేర్చె నఖిలరాజన్యకిరీటదీప్తు లలంకరించుకొఱకు
చేతు లాడింప నేర్చె నుపదాన్యక్షాత్రవిద్యాప్రవీణత వెలయుకొఱకు
తలయెత్త నేర్చె మధ్యమజగన్మండనైకాంతపత్రేచ్ఛాయ నమరుకొఱకు
పలుక నేర్చె సరస్వతీప్రకటనాట్య, రసమునకు రంగరక్తుల నొసఁగుకొఱకు
కడఁగి నడువంగ నేర్చెను గలియుగాది, మప్రభుత్వతధర్మంబు మలుపుకొఱకు.

86


వ.

మఱియు నబ్బాలకుండు ముక్తామణినిచయఖచితకలాపకాకపక్షాలంకృతవిశాలఫాల
ఫలకుండును, నంజనరేఖారంజితకర్ణాంతవిస్తీర్ణనేత్రుండును, దప్తచామీకరముకుళీకృ
తశార్దూలనఖాభరణకమనీయకంబుకంధరుండును, ననంబరనితంబబింబాలంబితకనక
కటిసూత్రకలితకింకిణీక్వణనాదాభిరాముండును, మణిమయమంజీరసింజాసముజ్జ్వల
చరణయుగళుండునునై ముద్దు చూపుచుఁ దల్లిదండ్రులు దాతముత్తవలుం బ్రపితామహ
ప్రపితామహీసమూహంబులు గారాబంబు సేయుచుండ ననుదినవర్ధమానుండై పెరుఁగు

చుండం దదీయసౌకుమార్యమందహాసమృదువచనసంచరణాదుల కానందంబు వహిం
చుచు నయ్యనిరుద్ధుండు సుఖోన్నతుండై యుండి.

87


మ.

గతగర్వంబునఁ భ్రాంతదేశధరణీకాంతు ల్భజింపంగ ద
ర్పితులై కొందఱుదూరభూవరులు నిర్భీతిం జరింపన్ మహో
న్నతి దండెత్తి జయించి లోఁబఱిచి యాజ్ఞాసిద్ధిఁ గావించెఁ దాఁ
జతురంభోనిధిమధ్యఖండనవకచ్ఛప్పన్నదేశంబులన్.

88


ఉ.

అన్యనృపాలకు ల్స్వవశులై కొనివచ్చి యొసంగువస్తువుల్
కన్నెలు రత్నము ల్హరులు గంధగజంబులు నాది గాఁగ సౌ
జన్యతఁ దెచ్చి తాత కనిశంబును గానుక లిచ్చియాజగ
న్మాన్యునిచేత దీవెనలు మన్నన లందుచునుండి వెండియున్.

89


సీ.

వసుదేవబలదేవవాసుదేవాదులయనుమతి వడసి యత్యంతనియతి
రాజసూయమ్ము తురంగమేధము నాది గాఁగ ననేకయాగములు చేసి
యందు నాహుతు లైనయలపురుహూతాదు లాత్మభాగహవిస్సు లాహరింప
నాజ్యప్లుతంబుగా నన్నభక్ష్యాదులు నవ్వారి గాఁగ సమస్తజనుల
కిడుచు నధ్వర్యముఖ్యుల కెలమి ధేను, భూహిరణ్యరత్నాదులు భూరి గాఁగ
దక్షిణ లొసంగి రాజులఁ దగువిధముల, నంపకము చేసి కీర్తుల నతిశయిల్లె.

90


సీ.

అసమానసాంప్రదాయకశుద్ధిఁ జెలువొందు తండ్రితాతలమహత్త్వంబుఁ జూచి
యష్టదిక్కులయందు నాక్రాంతమైన సత్కీర్తిప్రతాపవిస్ఫూర్తిఁ జూచి
కులరూపగుణములఁ గొనియాడఁగాఁ దగు దేవులయనుగుణస్థితులఁ జూచి
వర్ధిష్ణుఁడై శైశవంపుముద్దులు గుల్కు తనయునియందసందములు చూచి
దానభోగాదులైన సద్వ్రయములందుఁ, బాలుపడియున్న యర్థసంపదలు చూచి
భూప్రజలు వేయునోళ్లను బొగడుచుందు, రెంత ధన్యాత్ముఁ డీయుషాకాంతుఁ డనుచు.

91


వ.

ఆసమయంబున.

92


క.

నారదుఁడు సకలశాస్త్రవి, శారదుఁడు శరీరవిజితశారదవేళా
నీరదుఁడు ముఖనివేశిత, శారదుఁ డేతెంచె దనుజసంహరుకడకున్.

93


క.

వనజాతనయనుఁ బొడగని, వినుతులు గావించి యతని వినయంబులచే
ననుమోదమానసుండై, యనిరుద్ధుం డున్నయెడకు నరిగిన నతఁడున్.

94


గీ.

ఎదురుకొని వందనము చేసి హేమపీఠ, మునను గూర్చుండఁబెట్టిన మునివరేణ్యుఁ
డాదరంబున దీవించి యతనితోడ, నుచితసల్లాపములు సేయుచుండి యుండి.

95


గీ.

ముద్దు గుల్కెడు మరువంపుమొలక యనఁగ, శ్రీలఁ జెలువొందఁగల నెలబాలుఁ డనఁగఁ
గుదుర చక్కనిసింగంపుఁగూన యనఁగ, మీఱు మారుకుమారుఁ గుమారుఁ జూచి.

96

క.

రమ్మని డాయ౦ బిలిచిన, యమ్మున నమ్ముని నిజాంకమం దునిచి తదీ
యమ్మగు సాముద్రికచి, హ్నమ్ములు దెలియంగఁ జూచి యనిరుద్ధునితోన్.

97


సీ.

భుజనేత్రనాసికంబులు జానుహనువులు నైదుదీర్ఘములు గోప్యాంగకంఠ
జంఘలు మూడుహ్రస్వములు ఫాలము రొమ్ము కటి మూఁడు వెడఁదలు కంఠనినద
మును నాభికందంబు మూడు గంభీరముల్ ఫాలకటిస్కంధబాహుకుక్షి
ముఖములా రున్నతంబులు జత్రుగుల్బత్వగంగుళిచరణంబు లైదు సూక్ష్మ
ములు దృగంతజిహ్వాధరములును నఖక, తాలుకరరేఖ లాఱు రక్తములు నైన
యట్టిమానవుఁ డధికభాగ్యాన్వితుండు, గా నెఱుంగుము కుసుమమార్గణకుమార.

98


సీ.

వరలీల దక్షిణావర్తరేఖాయుతభ్రూమధ్యుఁడు సమస్తభూమి నేలు
నైదురేఖలు ఫాలమం దున్నవాఁడు దీర్ఘాయుస్సమన్వితుండైనవాఁడు
ఊర్ధ్వరేఖలు పాదయుగళంబునందుఁ బెంపొందుమానవుఁ డు త్తమోత్తముడు
తనరి ముప్పదిరెండుదంతము ల్గల్గినయట్టినరుండు భాగ్యాధికుండు
కంబుసన్నిభమైనట్టిగళమువాఁడు, విలసితంబగుకీర్తుల వెలయువాఁడు
కఠినమగుహస్తతలములంఁ గడుమృదుత్వ, చరణములు గల్గు మనుజుఁ డైశ్వర్యయుతుఁడు.

99


గీ.

చారుచరిత సాముద్రికశాస్త్రమందు, నిట్టిలక్షణములు చాల నెన్నఁబడియెఁ
గానఁ బురుషునిఁ గనుఁగొన్నఁ గానవచ్చుఁ, బండితులకు ననాగతభాగ్యగతుల.

100


వ.

శ్రీమన్నారాయణాంశోదయుండైన యివ్వజ్రకుమారుని శరీరంబున నిటువంటి శుభ
లక్షణంబు లనేకంబు లున్నయవి గావున నితండు మహాభాగ్యవంతుండును సకలదిగంత
విశ్రాంతకీర్తివంతుండును విద్యావినయసంపన్నుండును వంశవర్ధనుండునునై కలియు
గాదిమప్రభుత్వసింహాసనారూఢుండై సామంతభూపతులు తనపంపు సేయఁ గృత
యుగలక్షణంబున ధర్మంబు చతుష్పాదపూర్ణప్రవర్తనంబుగా వసుంధరాచక్రం బనే
కసంవత్సరంబు లశాత్రవంబుగాఁ బాలింపంగలవాడును భగవత్స్వరూపుండవు నాది
గర్భేశ్వరుండవు బ్రహ్మజ్ఞాననిధిని నగు నీవలన జన్మించి తనయుం డుత్తమపురుషుం
డగుట స్వాభావికంబ కదా యని పలికినఁ గందర్పనందనుండు మందహాసముఖుండై
మునిపుంగవున కిట్లనియె.

101


క.

మీయాశీర్వచనంబులు, మాయం దనుగతము లగుట మాకున్ సకల
శ్రేయోగుణసంపాద్యము, సేయుటకు నిదానమగుట సిద్ధమ కాదే.

102


క.

అని సాంత్వనవచనంబుల, ననురాగ మొనర్చుచున్న యనిరుద్ధవిభున్
సునయోక్తుల దీవించుచుఁ, జనియె న్నారదుఁడు దివికి జగతీనాథా.

103


సీ.

సరససంగీతంబు సంయుతాసంయుతాహస్తాభినయము భావాభిరామ
వీక్షణభ్రూలతావిభ్రమంబు సపాదతత్కాలకల్పితతాళమాన
మైనలాస్యంబు కాత్యాయనియొద్ద బాణాసురతనయ దా నభ్యసించె

నది గాన ద్వారకయందుఁ దద్విద్యాభిలాషఁ బ్రార్థించు విలాసినులకు
దృఢము గావించె సౌరాష్ట్రదేశచంద్ర, వదన లానీలవేణులవలన నేర్చి
రాలతాంగులు దెలుప నంతంత కఖిల, దేశముల సర్వజనవచస్థితిని వెలసె.

104


సీ.

తనకీర్తి చంద్రికాతతి నిండి కృష్ణపక్షంబులు శుక్లపక్షములు సేయఁ
దనదురాజత్వ మింపున సార్వకాలంబునందును గువలయానంద మొసఁగఁ
దనకరంబులు జడత్వమునను భువనప్రజానురాగంబులునై వెలుంగఁ
దనవర్తనంబు మిత్రసమాగమంబున సంపూర్ణకళలచేఁ బెంపు వడయఁ
దనవిలాసం బఖండసౌందర్యమహిమ, నిష్కళంకస్వభావమై నివ్వటిలఁగఁ
జంద్రునకుఁ జంద్రుఁ డనఁదగుసద్గుణముల, చేత ననిరుద్ధుఁడు జగత్ప్రసిద్ధుఁ డయ్యె.

105


వ.

ఇవ్విధంబున నమ్మహానుభావుండైన యనిరుద్ధుండు మహదైశ్యర్యసమృద్ధుండును సక
లభోగానుభవసిద్ధుండును వేదోక్తకర్మానుష్ఠానపరిశుద్ధుండునునై సంసారబద్ధుండు
నుం బోలియుండె నిర్గుణంబును నిశ్చలంబును నిరుపమానందంబును నైన పరబ్రహ్మం బ
ద్వితీయం బయ్యును బహునామరూపంబులఁ బోలుచుఁ జరాచరంబులయందు జీవా
హ్వయుండై పూసలలో దారంబుకైవడిఁ బ్రవర్తించుచుఁ దత్తత్కర్మానుగుణంబులై శరీ
రంబులకు ననుభవంబులగు సుఖాసుఖంబులం బొరయక జపాకుసుమసాంగత్యంబున స్ఫ
టికంబు స్వచ్ఛధవళం బయ్యును మిథ్యారక్తవర్ణం బైనతెఱంగున లిప్తుండునుంబోలె
నజ్ఞుల హృదయంబులకుఁ దోఁచుచుండుననియు జ్ఞానసిద్ధిలేమిం జేసి దేహి కర్మావృతుం
డై తనస్వరూపంబుఁ దాన తెలియనేరక తా నన్యుండని యహంకార మమకారంబు
లం బొంది బద్ధుం డగుననియును నిద్రాకాలంబున స్వప్నలబ్ధం బైనసంచారాదులు
నిద్ర మేల్కనినయప్పుడు మిథ్యలై తెలియంబడినయట్లు జ్ఞానవంతుఁడైన యప్పుడు
తనధావంతంబు నిస్సారంబని యాత్మయందు భేదబుద్ధిలేక సర్వసమత్వంబున సర్వం
బును బ్రహ్మమయంబు ప్రపచం బస్థిరంబని తలంచి బ్రహ్మైవాహంబను వేదాంతసార
వచనార్థంబు కేవలదృఢంబు గావించి యెఱుకగలిగిన పురుషుడు తానై సాయుజ్య
సిద్ధుం డగుననియు నిశ్చయించి యాత్మానుసంధానంబు సేయుచు జనకునికైవడి నాత్మ
జ్ఞానియై సుఖంబు లనుభవించుచుండె నని పలికి మఱియు ని ట్లనియె.

106


శా.

నీలాభంబును వర్తులాకృతియఁ జిహ్నీభూతరాజీవపు
ష్ఠాలంకారము పార్శ్వచక్రము త్రిరేఖాంచన్ముఖోపాంతమై
సాలగ్రామసమాకృతిం బొడమి పూజల్ గాంచి యిచ్చుం గృపా
శీలుండై యనిరుద్ధమూర్తి సకలశ్రీలుం బుధశ్రేణికిన్.

107


క.

ధారుణిలోపల శ్రీమ, న్నారాయణునంశఁ బొడమి నయగుణములఁ బెం
పార ననిరుద్ధనామము, సారంబని తలఁచునతఁడు సౌఖ్యముఁ గాంచున్.

108

వ.

అనియు నమ్మహాపురుషగుణంబులు గొనియాడి శుకయోగి పరిక్షిన్న్పపాలున కిట్ల
నియె.

109


క.

జననాథ యిట్లు నాచే, వినిపింపఁగఁబడిన రసవివేకవిధానం
బనిరుద్ధచరిత్రము వ్రా, సినఁ జదివిన వినిన నరునిఁ జెందు శుభంబుల్.

110


చ.

అని వివరించిన న్ముదితుఁ డయ్యె ధరావరుఁ డంచు సూతుఁ డిం
పొనరఁగ శౌనకాదులగు యోగివరేణ్యులతోడఁ దెల్పినన్
జనితఘనప్రమోదరససంభృతమానసులై ప్రియంబునన్
వినుతులు చేసి రక్కథకు వేమఱు మత్కృతిరాజ్యనాయకా.

111


క.

ఈయనిరుద్ధచరిత్రము, శ్రేయస్కర మగుచు సుజనజిహ్వాగ్రములన్
బాయక యాచంద్రార్క, స్థాయి యగుచు సుప్రసిద్ధిఁ దనరుం గాతన్.

112


మ.

శయనీభూతభుజంగసంగరజయశ్లాఘానిరాఘాటధై
ర్యయుతోత్తుంగవిహంగపుంగవతురంగారూఢదివ్యాంగపా
దయుగారాధకగోత్రభంగనిగమాంతజ్ఞానశుద్ధాంతరం
గయతివ్రాతముఖాబ్జనూతనపతంగామంగళాధీశ్వరా.

113


క.

క్రేంకారకింకిణీయుత, టంకారజ్యాలతానటచ్చాపజితో
ద్ధుంకారసముఖవీరా, హంకారా సకలభూషణాలంకారా.

114


తోటకవృత్తము.

మన్మథకోటిసమానవిలాసా, సన్ముఖనిర్జితచంద్రవికాసా
చిన్మయరూపవిశిష్టనివాసా, జన్మమయావహసద్గుణభాసా.

115


గద్య.

ఇది శ్రీమంగళాచలనృసింహకృపాప్రసాదసంప్రాప్తవిద్యావైభవ కనుపర్తిరా
యనమంత్రితనూభవ సుజనహితకృత్యని త్యాబ్బయామాత్యప్రణీతంబైన యనిరుద్ధ
చరిత్రం బను మహాప్రబంధఁబునందు సర్వంబును బంచమాశ్వాసము సమాప్తము.