అనిరుద్ధచరిత్రము/తృతీయాశ్వాసము

వికీసోర్స్ నుండి

శ్రీరస్తు

అనిరుద్ధచరిత్రము

తృతీయాశ్వాసము




వత్సవైజయంతీ
శ్రీవనితాకౌస్తుభాదిశృంగారవిలా
సావహవక్షస్థలభువ
నావనసంభ్రమణమంగళాచలరమణా.

1


తే.

అవధరింపుము శౌనకుం డాదియైన, మునివరేణ్యులతోడ నిట్లనియె సూతుఁ
డాపరిక్షిన్మహారాజు నాదరమునఁ, జూచి విజ్ఞాననిధియైన శుకుఁడు పలికె.

2


వ.

అంత.

3


సీ.

వినతాతనూజకేతనకళాసంప్రాప్తజనితానురాగవిస్తార మనఁగ
నపరదిగ్జలధినాయకసమర్పితఫుల్లహల్లకమాల్యప్రభాంక మనఁగ
సమరసన్నాహరక్షశ్ఛటావిదళనకోపాగ్నికీలాకలాప మనఁగ
దత్కాలతాండవోద్ధతేమహాబిలకేశవరమణీమకుటరుగ్వ్యాప్తి యనఁగ
భాపరిగ్రహణార్థసమీపవర్త, గంధవహబంధుతేజఃప్రకాశ మనఁగ
నస్తశైలాగ్రమున భాస్వదరుణదీప్తి, మండలంబయ్యె మార్తాండమండలంబు.

4


చ.

ఇనుఁడు కరంబులం బొదివి యింపుగ సంగమ మాచరింపఁ బ
ద్మినివదనంబున న్నగవు మీఱ వికాసవిలాస మూని లో
నన ద్రవ ముబ్బిసొక్కి నయనంబులు మూయుచు నిద్రఁ జెందెనో
యన ముకుళీభవించె దివసాంతమునందుఁ బయోజషండముల్.

5


చ.

ఇనునకుఁ బద్మినీకువలయేక్షణపై మది నెంతమోహమో
తను నెడఁబాసి యెంతపరితాపము నొందునొ నాల్గుయామముల్
చనిన పునస్సమాగమము సంఘటనంబని తెల్పుమంచుఁ దాఁ
బనిచె సరస్యుపాంతతరుపఙ్క్తులనీడలపేరిదూతలన్.

6

క.

కమలినిపయిఁ గూరిమిచే, రమియించెంగా నన శుచిరాహిత్యముగా
నమరం దాన మొనర్చిన, క్రమమునఁ గమలాప్తుఁ డపరకంధిం గ్రుంకెన్.

7


తే.

అంబురుహసంభవాండగేహాంతరమున, దీపకంబైనభాస్కరదీపకళిక
యవలిదిక్కునఁ జేరినయంధకార, బంధురం బయ్యె దశదిశాభాగమునను.

8


చ.

అనయము జీవకోటికి భయంబుగ దారులు గట్టి కొల్లఁ గై
కొన సెలవిచ్చెఁనజోరులకుఁనగూర్మినపరాంగనలన్ రమింపఁగాఁ
బనిచె విటావలి న్భువనబంధుఁడు లేనియరాజకంబుచేఁ
దనరపమై చరి౦చె వసుధాస్థలి చీఁకటిపాలెగాఁ డొగిన్.

9


సీ.

ఆదట దీరంగ నంభోజగంధులబటువుగుబ్బలమీఁదఁ బ్రాఁకి ప్రాఁకి
కోరిక ఫలియింపఁ గుంభీంద్రయానల యధరపల్లవముల నాని యాని
ముచ్చట దీఱఁగ ముకురబింబాస్యల నిద్దంపుఁజెక్కిళ్లు నివిరి నివిరి
యభిలాష దనియంగ హరినీలవేణుల మవ్వంపుఁగొప్పులు దువ్వి దువ్వి
యంధకారాఖ్యకామాంధుఁ డన్యసతుల, నలముకొనుచుండెఁ గాని దోషానుభవము
తపనకరఘాతనెపమునఁ దాఁకుననుచు, నెఱుఁగలేఁడయ్యెఁ దామసుం డేమి యెఱుఁగు.

10


క.

జీవనమె జీవనంబై, యీవిధముననున్న మమ్ము నెడచేసె నయో
దైవమని భేద మొందెడు, కైవడి నమరెన్ రథాంగకరుణరవంబుల్.

11


సీ.

వరునిరాకకు నిశావాససజ్జిక మింటఁ బఱిచిన వెన్నెలపాను పనఁగ
గగనకేశునిమస్తకమున దిక్పాలురు పూజ చేసినయట్టి పువ్వు లనఁగ
దట్టమై తిరుగుచున్నట్టి ఖేచరకోటి ముత్యాలగొడుగులమొత్త మనఁగ
దమము గర్వ మడంప దండెత్తి రేరాజు ముందర నడపించుమూఁక యనఁగఁ
గెరలి మరుఁ డూర్ధ్వలోకము ల్గెలువ పింజ, పింజఁ గొన నేయు పుష్పాస్త్రవితతియనఁగఁ
గన్నులకుఁ బండుగై తోఁచె గగనభాగ, మండనంబైన తారకామండలంబు.

12


సీ.

అధిపలాలితలైన స్వాధీనపతికలు నలుక దీఱిన కలహాంతరితలు
వరునిరాకలు గోరు వాసకసజ్జిక ల్పతివంచకలు విప్రలబ్ధసతులు
పొరుగూర విభులున్న ప్రోషితభర్తృక ల్కలహించి విడనాడు ఖండితలును
ధవులు వేగంబ రాని విరహోత్కంఠిత ల్సంకేతగత లభిసారికలును
రమణసంభోగవిప్రలంభముల నొంది, రష్టవిధనాయికలు నిట్టు లతిశయముగఁ
గువలయానందభావానుగుణ్యకళల, విలసితంబైన యన్నిశావేళయందు.

13


శా.

మందాక్షాంచలము ల్గ్రమించి కులధర్మస్రోతసు ల్దాఁటి త
న్నిందాభీతి మహాటవు ల్గడచి పొందె న్బుంశ్చలీకోటి ని
స్సందేహస్ఫురణ న్భుజంగనిపసత్సాంకేతికస్థానముల్
కందర్పుం డనుమంత్రదేవత సమాకర్షింపఁగా నయ్యెడన్.

14

ఉ.

చీఁకటివేళ సంచరణ సేయుచు నిక్కువ లైనచోట్ల న
ఱ్ఱాఁకల నిల్చుచుం జనులయల్కుడు కొయ్యన లోగియుండుచుం
గాఁకలయూర్పు లుస్సురనఁగా విటకోటిభుజంగభావముల్
గైకొనియుండె నిందు ననె కావలె వారిభుజంగనామముల్.

15


సీ.

గళరవంబులు రద్దిగాఁ జెలంగింపక పలుమాఱు మెల్లనె పలుకుమనుచుఁ
దమికొద్ది నధరబింబము గంటువడనీక మొనపంట నొక్కింతమోపు మనుచు
గుబ్బచన్నులమీఁద గోరు లేర్పడనీక నేర్పుతో నొయ్యన నివురుమనుచు
రతిసుమాళమున నార్భటము గావింపక నిలుకడచల్లఁగాఁ గలయుమనుచుఁ
గాముకులయందుఁ గూర్ములు గలిగియుండి, యును రహస్యంబు బయలగు ననెడిభీతిఁ
గలసి రిబ్బంగి సాంకేతికములయందు, జారకాంతలు మోహితస్వాంత లగుచు.

16


ఉ.

ఆసమయంబునం గువలయప్రియమైన ప్రభుత్వరేఖ ను
ల్లాసరసంబు మోమునఁ దొలంగఁగఁ జల్లనిరా జటంచు ని
శ్వాసముతోడ లోకులు ప్రశంసలు సేయఁగఁ బూర్వశైలసిం
హాసన మెక్కెఁ జంద్రుఁడు నిజాభ్యుదయంబు జగత్పగత్ప్రసిద్ధిగన్.

17


సీ.

భూనభోంతరములఁ బూర్ణీభవించు తమంబుల నుచ్చాటనంబు చేసెఁ
వసతుల మెలఁగు జీవంజీవవిహగకదంబంబు నాకర్ష ణంబు చేసెఁ
గవగూడి చెలఁగు జక్కవలక్రీడావిలాసంబులు సంస్తంభనంబు చేసెఁ
సలిలమధ్యంబులఁ జెలువొందు కైరవారామంబుల వశీకరంబు చేసెఁ
నలినపఙ్క్తికి విద్వేషణంబు చేసెఁ, దమ్మిచేరాశకలమారణమ్ము చేసెఁ
బొసఁగ వెన్నెలమంత్రవిభూతిఁ జల్లి, మహిమఁ జూపి సుధాకరమాంత్రికుండు.

18


సీ.

జతనంబుతోఁ దేఁటిసంచిణీహసము భిన్నీదుముదారుగా నిగుడి నడువఁ
గలువలదొర చల్లగాలివజీరులు పూని రాస్తాను చపాను గొలువఁ
బెంపు మీఱ వసంతఫేషువా హుజురున నుండి చెలావణిహొనరు దెలుప
నెమ్మిఁగోవెల నిశానీదారుగములు కర్నాచీడమారము ల్నాదు సేయ
సరణి కావాలురంగుఝల్చౌపుటములు, రహిగ నటియించు చిలుకహిరాకి నెక్కి
కెంజిగురుసైపు కేల నంకించుకొనుచు, మదనుపాదుస హా దండు గదలె నపుడు.

19


వ.

అంత

20


మ.

చణబాహాబలశాలి మన్మథుఁడు చంచచ్చంచరీకచ్ఛటా
గుణటంకారరవప్రచండసుమనఃకోదండనిర్ముక్తదా
రుణచూతాంకురబాణము ల్బఱసె సక్రోధాత్ముఁడై మానినీ
మణి ధైర్యం బనుజోడు చించుచు మనోమర్మంబులనం దూఱఁగన్.

21

మత్తకోకిల.

మత్తకోకిలశారికాశుకమంజుమోహననాదసం
పత్తికి న్మలయాచలానిలపద్మశాత్రవచంద్రికో
ద్వృత్తికి న్సుమవాసనాపదవీభ్రమద్భ్రమరస్వనో
పత్తికి న్మది నోర్వఁజాలక తల్లడిల్లుచునుండఁగాన్.

22


క.

వగ నొందుచుఁ జెలికత్తెలు, మృగమదఘనసారగంధమృదుకుసుమాదుల్,
తగఁదెచ్చి శిశిరవిధు లా, మగువకుఁ గావించి రపుడు మఱియు న్మఱియున్.

23


సీ.

విభునికౌఁగిటికినై వెతఁ జెందుమేనికిఁ జందనపంకం బలంద నేల
చందనంబునఁ గసుఁగందెఁగదా యని గ్రక్కున బన్నీటఁ గడుగ నేల
పన్నీటివలనఁ దాపంబు మించుటఁ జూచి చంద్రరజంబు పైఁజల్ల నేల
చంద్రరజంబుచే జనియించె సెకలంచు వెసఁ దాళవృంతము ల్విసర నేల
తాళవృంతములను వడదాఁకె ననుచు, వగవఁగా నేల నేరనివైద్యుకరణిఁ
దనుగుణ మెఱుంగఁజాలక తమరు సేయు, మందులకె మందు లొనరించి రిందుముఖులు.

24


తే.

ఎన్ని యుపచారములఁ చేసి రిందువదన, లన్నియును జూడ మునుపటికన్న మిగుల
బాధకము లయ్యె దయ లేనిప్రభువుతోడ, మందలించిన మనవులచందమునను.

25


వ.

ఇక్కరణి నక్కువలయాక్షి విరహాతిశయంబున నోర్వంజాలక పరితపించుటకు సఖీ
జనంబులు విచారమగ్నాంతరంగలై కుసుమసాయకు నుద్దేశించి యిట్లనిరి.

26


ఉ.

తల్లి సమస్తభాగ్యనిధి తండ్రి దయాపరమూర్తి నీచెలుల్
చల్లనివారు నీవు కడుఁజక్కనివాఁడవు పొంక మైననీ
విల్లు సమాధురిం బరిఢవిల్లు మృదుత్వము నీదువర్తనం
బెల్ల నయో వధూవధకు నేటికి రోయవు మీనకేతనా.

27


చ.

పురహరదేవునిం జెనకఁబోయి తదుగ్రలలాటనేత్రభీ
కరదహనార్చులం గలసి కాలితి నంతటనుండియైననుం
బరులను బీడ పెట్టని కృపాగుణ మేటికి లేదు నీకుఁ గా
పురుషులు రాజదండనముఁ బొందియు నైజము మానరే కదా.

28


వ.

అని పలికి సుధాకరు నుద్దేశించి.

29


సీ.

కువలయంబులను గన్గొన్న చల్లనిచూపు కమలబృందములందుఁ గలుగదయ్యె
నలచకోరములపైఁ గలుగు దాక్షిణ్యంబు జక్కవగములందుఁ దక్కువయ్యె
సప్రాణవిభు లైనసతులపై కూర్మి యనాథకాంతలయందు నాస్తియయ్యె
నిందూపలములపై నెనయు సౌహార్దంబు రవికాంతములయందు రహితమయ్యె
బక్షపాతంబు మాన వేపక్షమునను, రాజదోషాకరుఁడవు గా రామ రామ
దానఁ జేసి సుమీ నీదు మేనియందు, నంకమై నిల్చియున్న దయ్యపయశంబు.

30

క.

పగలొప్పని సౌమ్యత నై, జగుణం బగు నీకు నింత చల మేటికయో
తగుపూర్ణకళానిధితో, మొగ మెఱుఁగనివాఁడవా కుముదినీరమణా.

31


వ.

అని మలయపవను నుద్దేశించి.

32


శా.

ఎంచం జల్లనివాఁడవై సరసులం దిష్టంబు వాటించుచుం
బంచప్రాణములై మెలంగుదువు మాపద్మాక్షియం దిట్లు బా
ధించంజొచ్చితి వియ్యెడ న్మరునిబుద్ధి న్నీస్వభావంబు వ
ర్జింపంజెల్లునె నీగుణంబుగద దాక్షిణ్యంబు మందానిలా.

33


వ.

అని పికశుకనికరంబుల నుద్దేశించి.

34


క.

ఒకకుతికై యుండెడు మీ, రకటా చెలియెడల నింత యతికూహక మా
పిక మాశుక మాయిక మా, నక మాసుకుమారగాత్రి నాయమె యేచన్.

35


వ.

అని పలుకుచున్న సమయంబునం జిత్రరేఖం గనుంగొని యుషాంగన తనమనోహరుండైన
యనిరుద్ధుని సరససౌందర్యసౌకుమార్యంబులు పలుమారుఁ బ్రస్తుతించుచు నిట్లనియె.

36


ఉ.

ఔనటవమ్మ వాని సరసాధరసారరసామృతంబు నే
నానక యింక తాళఁగలనా లలనా కలనాదకీరసం
తానము సేయు రంతు ముదితా మది తా నది తాప మయ్యె స
న్మానవిధంబు నీదె గద నాయెద నామదనాభుఁ జేర్చినన్.

37


వ.

అని పలికిన.

38


చ.

విరహము నొందకమ్మ విభు వేగమె తోడ్కొనివత్తు నంచు నా
సరసిజగంధి యోగబలసంపదచే గగనప్రచారయై
యరిగె ననేకపట్టణవనాచలశైవలినీచయంబు స
త్వరవిభవంబునం గడచి తా నట యేఁగుచుఁ గొంతదవ్వునన్.

39


శా.

కాంచెం గాంచనగాత్రి సౌధశిఖరాగ్రస్వర్ణపాంచాలికా
చంచన్నీలమణిప్రకల్పితకచస్రక్ఛ్రీభవత్తారకం
బంచోదంచితహృద్యవాద్యరవశుంభద్యామపూజాలస
త్క్రౌంచామిత్రగురుస్తమంటపసహస్రస్ఫారక న్ద్వారకన్.

40


వ.

కనుంగొని మనంబునఁ బెనంగొను ప్రమోదంబునఁ బ్రమాదంబగు విద్యావిశేషంబున
నన్నగరంబుఁ ప్రవేశించి సమంచితప్రాసాదరేఖాపురోభాగమహోన్నతస్తంభా
గ్రవిరచితదేదీప్యమానదీపికాకదంబకప్రతిబింబవిడంబితసాంద్రచంద్రశాలాస్థగిత
పద్మరాగమణిగణచరణారుణకిరణస్ఫురణవలన నిజాసమయం బయ్యును దివాభాగం
బునంబోలె దృగ్గోచరంబగు తదీయసౌభాగ్యంబునకు నాశ్చర్యంబు నొందుచుం
గలితకాంచనకనత్కవాటకమనీయచతుర్ద్వారచారుతరప్రాకారంబును, మహోగ్ర

సాధనసమగ్రజాగ్రద్వీరభటసమూహసమావృత్తంబును, రుక్మిణీసత్యభామాప్రము
ఖాష్టమహిషీషోడశసహస్రసుందరీసందోహమందిరామందసుందరంబును, బద్మరాగ
వజ్రవైడూర్యగోమేధికపుష్యరాజమరకతనీలముక్తాప్రవాళఖచితస్తంభకుడ్యవా
తాయనవితర్దిప్రదేశంబును, బ్రద్యుమ్నసాంబసంకర్షణసుధేష్టాదికుమారవిహారసౌధ
యూధాభిరామంబును, సకలసౌభాగ్యలక్ష్మీనివాసంబును నగు గోపికావల్లభుమం
దిరంబునందు శృంగాగంబునకు సారంబును, విలాసంబునకు వాసంబును, భోగంబునకు
యోగంబును, భాగ్యంబునకు యోగ్యంబును, స్తోత్రంబునకుఁ బాత్రంబునునై, సహస్ర
భానుప్రభాభాసమానంబగు ననిరుద్ధకేళీసౌధంబులోపలం బ్రవేశించి యందు.

41


క.

అలరుక్మలోచనాకువ, కలశయుగాన్వితనిరూఢగాఢాశ్లేషో
జ్జ్వలపులకాంకితదానవ, సలలితసురతప్రసంగజనితశ్రముఁడై.

42


సీ.

బంగారుదివియకంబములపై నిరువంక దీపికాకాంతులు తేజరిల్లు
నమలమాణిక్యపర్యంకభాగంబునఁ బరువంపుజాజిపూఁబాన్పుమీఁద
నొకకేలు తలక్రింద నునిచి రెండవకరం బూరువుపై జాచి యొత్తగిల్లి
పరుపుపై ముత్యాలసరులు కుప్పవడంగఁ దెలిదమ్మితళుకుకన్నులు మొగిడ్చి
పూఁతనెత్తావి గమ్మునఁ బొలయుచుండ, నూర్పు లొక్కింతముకురులై యుప్పతిల్ల
నిదురపరవశమున నున్న యదుకుమారుఁ, గాంచెఁ దనగొప్పకన్నులకఱవు దీఱ.

43


ఉ.

మీసముతీరుఁ జూచి జిగిమేనిపటుత్వముఁ జూచి మోములో
హాసముఁ జూచి చేతులయొయారముఁ జూచి మనోజ్ఞరూపరే
ఖాసమలీలఁ జూచి యహహా యనుచుం దల యూచి ముందు దా
వ్రాసినభావ మెంచి తలవంచుకొనెన్ జలజాక్షి సిగ్గునన్.

44


వ.

తదనంతరంబ.

45


మ.

తనసమ్మోహనవిద్యచే జనుల నిద్రామగ్నులం జేసి య
య్యనిరుద్ధుం గొని ఖేచరత్వమున నుద్యద్వేగయై యేగి బా
ణనిలింపాహితరాజధానియగు శోణాఖ్యం బ్రవేశించి య
వ్వనజాతాక్షి యుషాలతాంగి సుషమావత్సౌధముం జేరఁగన్.

46


వ.

వచ్చుచున్న సమయంబున.

47


ఉ.

ఎప్పుడు వచ్చునో కువలయేక్షణ యాతనిఁ దోడుకొంచు నే
నెప్పుడు చూతునో సదమలేందునిభంబగు వానిమోము నా
కెప్పుడు గల్గునో యతని నింపుగఁ గూడెడు భాగ్యమంచు నా
కప్పురగంధి తాపమునఁ గంటికి నిద్దుర లేక వేఁగుచున్.

48


ఉ.

నావెత చూడలేక కరుణాపరురాలగు చిత్రరేఖ దా
నావిభుఁ దెత్తునంచు నకటా పరభూమికి సాహసంబునం

బోవుచునుండె నాకొఱకుఁ బోయినకార్యమునిర్వహింప రో
దేవతలార నాదిగులు దీఱఁగ మీకు నమస్కరించెదన్.

49


వ.

అని తలంచుచు.

50


తే.

తరుణి యిబ్భంగిఁ గుసుమకోదండచండ, కాండనిర్భిన్నహృదయయై కరుగుచున్న
యవసరంబు రతీమనోహరకుమారుఁ దెచ్చి పానుపుపై నుంచె మచ్చెకంటి.

51


వ.

అప్పుడు.

52


చ.

హృదయము ఝల్లుఝల్లుమన నెంతయు విస్మయమంది చూచి పెం
పొదవినభ్రాంతిచేత నిదియుం గల గాదుగదా యటంచు నె
మ్మదిఁ దలపోయుఁ గ్రూరుఁడగు మారుఁడు చేసినయింద్రజాల మో
యిది యని యంచుఁ బర్వ రజనీందుకళానన మోహితాత్మయై.

53


వ.

అంత.

54


క.

తెలివొంది చిత్రరేఖా, కలవాణిం గౌఁగిలించి కన్నుల హర్షా
శ్రులు జడిగురియఁగఁ దనుపునఁ, బులుకాంకురము ల్జనింపఁ బొంగుచుఁ బలికెన్.

55


ఉ.

ఈసుకుమారమూర్తి నిపు డీడకుఁ దెచ్చితి ప్రాణదానముం
జేసితి నీకు మే ల్మరలఁ జేయఁగనేర నమస్కరించెదన్
నీసుగుణంబు నీనెనరు నీయుపకారము ముజ్జగంబులన్
వాసికి నెక్కి నీకథలు వర్ణితమయ్యెడుఁగాక కోమలీ.

56


క.

అని పలుకుచున్న బాలిక, వినయోక్తుల గారవించి వేడుకతోడం
జనియె నిజమందిరమునకు, వనజానన యుండె నిచటివాంఛలు మీఱన్.

57


ఉ.

లేచుట యెప్పుడో నిదుర లేచినపిమ్మట నన్నుఁ గన్నులం
జూచి మనోనురాగమున సొక్కి కవుంగిట గౌరవింపఁ గాఁ
జూచునె లేక నామమత సుద్ది యెఱుంగమిఁజేసి వింతయై
తోఁచుచునుండునో యితనితో నపు డేమని పల్కుదాననో.

58


మ.

అని చింతింపఁగ నిద్ర మేల్కని యతం డాకర్ణవిశ్రాంతమో
హననేత్రాంబుజము ల్కనీనికలు చాయ ల్దేరఁగా విచ్చిచూ
చినయాచూపు మనంబున న్గిదలెఁ గించిన్మధ్యకు న్భావభూ
ధనురుద్యత్కటకాముఖాంకకరసంధానప్రయోగాస్త్రమై.

59


ఉ.

నాథుసుదర్శనంబువలన న్మదనగ్రహమోక్ష మయ్యె బిం
బాధరకున్ సుదర్శనమహామహిమం బిటువంటిదేకదా
యీధరఁ దత్ప్రయోగమున నెట్లు గ్రహంబులు నిల్వ నేర్చుఁ ద
త్సాధకు లైనమాంత్రికులు సార మెఱుంగుదు రప్పుడిప్పుడున్.

60

గీ.

ఇవ్విధంబున మేల్కాంచి యవ్విభుండు, ద్వారకాపురకనకసౌధప్రదేశ
చారుతరరత్నపర్యంకశాయి గాఁగఁ, దను దలంచుచు లేచి కన్గొనెడు నపుడు.

61


సీ.

కాఁకలు దేరు బంగరుసలాక యనంగఁ గసటు వాసిన చంద్రకళ యనంగ
నదనుబు ల్కడిగినయట్టిముత్య మనంగ సానఁబట్టిన కాముశర మనంగ
మెలపుతో నిల్చిన మెఱుపుతీఁగె యనంగ నవకంబు వోని క్రొన్నన యనంగ
జీవకళ ల్గలచిత్రరూప మనంగఁ బరువంబు దప్పని విరి యనంగఁ
గరగునను బోసి మోహనాకారరేఖ, యెసఁగ దీర్చిన శృంగారరస మనంగఁ
దనసమీపంబునం దున్నతరుణిఁ జూచి, మన్మథకుమారుఁ డాశ్చర్యమగ్నుఁ డగుచు.

62


క.

మొదలను నే వసియించిన, యది ద్వారకలోనివజ్రహర్మ్యము గాదా
యిది యేమివింత యిపు డిది, సదమలమాణిక్యఖచితసౌధం బయ్యెన్.

63


వ.

అని విచారించుచు నవ్వరారోహ నాలోకించి.

64


సీ.

పొలఁతిమోమునకు సంపూర్ణేందుబింబంబు వెలయ నివాళి గావింపవచ్చు
శంపాంగిమేనికిఁ జాంపేయపుష్పము ల్వరసతో బడిసివైవంగవచ్చు
జలజాక్షికురులకు జాతినీలంబుల నొగిదృష్టిపేరుగా నునుపవచ్చుఁ
గలకంఠకంఠివీనులకు శ్రీకారముల్ రక్షయంత్రములుగా వ్రాయవచ్చు
నౌర యీరూపవతికి రంభాదివేల్పు, చెలుల నుడిగంపుబుడుతలఁ జేయవచ్చు
ననిన దోషంబు గలుగ దీయర్థమందుఁ, జూడ మెన్నఁడు నిటువంటిసుందరంబు.

65


గీ.

అని విచారించునెడఁ గించిదవసతాస్య, పద్మయై తనకై ప్రేమ బయలుపఱుచు
కలికి నిడువాలుతళుకుఁగన్నులను బెళుకు, చూపులను జూచుచున్న యాసుదతి కనియె.

66


ఉ.

ఎవ్వరిదానవే కువలయేక్షణ యెయ్యది నీదుపేరు నీ
వెవ్వనిమేలుదాన విపు డేమికతంబున నన్నుఁ దెచ్చి తీ
వివ్వరసౌధదేశమున కింతయు దాఁచక తెల్పు నావుడున్
నవ్వును సిగ్గుఁ గూడి వదనంబున దాఁగిలిమూఁత లాడఁగాన్.

67


గీ.

తళుకువజ్రంపుఱవలయందంబు గులుకు, పలుకుదురుతేటముకురబింబములవంటి
చెక్కుఁగవ నిండి కెంపులచెక్కడంపుఁ, గమ్మలను గ్రమ్మఁ బలికె నాకలికి యపుడు.

68


మ.

ఇది బాణాసురువీడు శోణపుర మాయింద్రారి మాతండ్రి పెం
పొదవె న్నాకు నుషాభిధాన మొగి నీయొయ్యారపున్ రూపు స్వ
ప్నదశం గాంచినదాననై విరహసంతాపంబునం జెంద స
మ్మదలీల న్నినుఁ దెచ్చెఁ బ్రాణసఖి శుంభద్యోగవిద్యోన్నతిన్.

69


ఉ.

కన్నియఁ గాని యన్యసతిఁ గాను శరీరము నీదుసొమ్ముగా
మన్నన చేసి యేలుకొనుమా వినుమా యనుమానబుద్ధివై

న న్నలయించెదేని రమణా యిక నేమనుదాన నిన్ను నా
కన్నులఁ జూడఁగల్గెఁగద కాఁగలయ ట్లగు దైవయోగముల్.

70


వ.

అని పలికి యక్కాంత చింతాసముద్రాంతర్మగ్నాంతరంగయై తలవంచుకొని యూర
కుండె నప్పుడు.

71


సీ.

తొలుత నాతనిరూపుఁ గలఁగన్నయాదిగా మగువకు దినములే యుగము లయ్యె
బటముపై నతనిరూపముఁ జూచినదిమొద ల్మగువకు జాములే యుగము లయ్యె
సఖి వాని తోడితేఁజనినయంతటనుండి యువిదకు గడియలే యుగము లయ్యె
దరువాత నతఁడు నిద్దుర లేచునంతకు యువతికి నిమిషముల్ యుగము లయ్యె
నతఁడు గౌఁగిటఁ గదియించునంతలోన, నుత్పలదళాయతాక్షి కొక్కొక్కక్షణమె
యుగసహస్రంబులై తోఁచుచుండె నపుడు, వనితతమకంబుఁ దెలుప నెవ్వరివశంబు.

72


చ.

పలుకులలోని ప్రార్థనయు భావములోఁ గలతెంపు మోములో
వెలవెల చూపులోఁ బొడము విన్నన యూర్పులలో వణంకు ని
మ్ములఁ బొడఁగాంచి యమ్మదనమోహనుఁ డెంతయు సంతసించెఁ దా
వలపులమర్మము ల్దెలియవచ్చుఁగదా ఘనులైనవారికిన్.

73


వ.

అప్పుడు.

74


సీ.

అకలంకచంద్రబింబాననయూరుదేశంబులవెంట సంచరణ చేసి
కోమలాంగినితంబభూమండలమునకుఁ గ్రమముతోడఁ బ్రదక్షిణము లొనర్చి
మృగనేత్రగంభీరమగునాభిసరసిలో నవగాహనక్రీడ లాచరించి
గంధసింధురయానకఠినకుచోత్తుంగశైలాగ్రమునఁ బునశ్చరణ సలిపి
పడఁతిమందస్మిత సుధానుభవత ననిమి, షత్వమును గాంచెఁ గాని పాంచశరిచూపు
ల పునరావృత్తిమోక్షంబు నందవయ్యెఁ, గాముకులపుణ్యములు భోగకారణములు.

75


సీ.

తనువుల దిగుపాఱుకనుదోయిబెళకుముత్యాలరాసులు తలఁబ్రాలు చేసి
తూరుదుండెములాడుతొడవులరుచిదీపకళికలు మంగళార్తులుగఁ జేసి
యలఁతఁజిప్పిలుఫాలములఘర్మజలముమొగ్గలగుంపు తగుబాసికములు చేసి
పొదివి మేనులఁ దోఁచు పులకాంకురంబు లతుకముజాజాలపాలికలు చేసి
సంప్రకాశించువిరహాగ్ని సాక్షి గాఁగ, బాణకన్యానిరుద్ధుల పరిణయంబు
నర్తి గావించె మకరమీనాధిపతుల, యదను దెలిసిన ననవింటియాజ్ఞికుండు.

76


క.

లలనామణి కప్పుడు గు, బ్బలపొంగున బిగిసి ఱవిక పక్కునఁ బగిలెన్
జిలుకరహదారురాహుతు, తలిరాకుపిరంగివిసరు దాఁకె ననంగన్.

77


మ.

రమణిఁ గొబ్బునఁ గౌఁగిలించి పయికిన్ రాఁదీయుచో గల్లనం
గమనీయాంగదహేమకాచరశనాఘంటారవంబు ల్నిషే

కముహూర్తం బిదియంచుఁ దెల్పుచు మహాకందర్పమౌహూర్తికా
సమహస్తాయసదండభిద్భవఘణాంచల్లోహయంత్రాకృతిన్.

78


ఉ.

కాంచనగాత్రిముద్దువగఁ గాంచి కవుంగిట గుబ్బ లంటఁ గీ
లించి సుధాధరంబుఁ గబళించి హసించి కపోలపాళిఁ జుం
బించి చమత్కరించి వలపించి కళ ల్గరఁగించి మించి సొ
క్కించి కడుస్సుఖించి కిలికించితకేళి రమించె వేడుకన్.

79


సీ.

సురుచిరాంబరబంధకరణంబు భేదించి వ్రీడాబలంబుల విఱుగఁదోలి
ఘనకుచశైలదుర్గముల లగ్గలు పట్టి జఘనవసుంధరాచక్ర మాఁగి
యూరూరుసంయుక్తతోరణంబులు గట్టి చతురుఁడై మధ్యదేశంబుఁ బొదివి
యంగాంగములు భుజాహంకృతిలోఁ గొని యౌవనభండార మాక్రమించి
సురతసంగతి జయలక్ష్మిసౌరిది గాంచి, తరుణికౌఁగిలి నిజరాజధాని గాఁగ
నెలమి మన్మథసామ్రాజ్య మేలుచుండె, సిద్ధసంకల్పుఁ డయ్యనిరుద్ధవిభుఁడు.

80


ఉ.

చంచలలోచన న్సురతసౌఖ్యమున న్గరఁగించె నంచు వ
ర్ణించఁగ నేటికి న్వలపుఁ బేరురు లొడ్డి జగంబువారి మొ
గ్గించెడివాని పెద్దకొడు కేయఁట రూపవిలాసవైఖరి
న్మించినయింతికి న్వలవనేరఁడొ తా వలపింపనేరఁడో.

81


సీ.

జలచరనేత్ర కన్నులవెరపింపుకే యెత్తినబిరుదాంక మేటఁ గలిపి
కార్ముకభ్రూయుగకనుబొమ్మవంపుకే పట్టినవిల్లు నిష్ఫలము చేసి
లలితశుకాలాపపలుకుజంకెనలకే మావుల నందంద పోవఁద్రోలి
చెలఁగు పల్లవపాణిచేగద్దికలకె కృపాణంబు లడవులపాలు చేసి
ప్రియుని సాహాయ్యమున విజృంభిచుచున్న, వెలఁదితో విగ్రహింపనవేళ యనుచు
సమరరంగప్రచారంబు సన్న్యసించి, యంగజుఁడు కార్య మెఱిఁగి సమాశ్రయించె.

82


చ.

వలచినపొందులై మనసు వచ్చిన చక్కఁదనంబులై భ్రమల్
కొలిపెడియౌవనంబు లయి కూరుము లద్దిన క్రొత్తలై కళల్
దెలిసిన నేర్పులై కొదవలేక రమింపఁగఁ గల్గినట్టి యా
చెలువుఁడు నింతియుం దొలుతఁ జేసిన పుణ్యఫలంబు లెట్టివో.

83


గీ.

అంత నానవోఢ యానందమునఁ దను, సురతమున జయింపఁ బరిభవంబు
నొందియున్నయట్టికందర్పువదనంబు, తెల్లవారినట్లు తెల్లవాఱె.

84


ఉ.

చిందఱవందఱై యసురసేనలు డెందమున న్భయాకులం
బంది పతంగపుంగవశతాంగరథాంగమహోగ్రధాటి నం
దంద యడంగినట్టు లుదయార్కునిరాక నడంగెఁ జీఁకటుల్
గొందులసందులన్ గుహలగుట్టలఁబుట్టలచాటుమాటులన్.

85

శా.

ప్రాతఃకాలమహాబలాఢ్యుఁడు నిశాప్రత్యర్థివీరుం బరా
భూతుం జేసి సమస్తదిగ్విజయుఁడై పూర్ణీభవత్ప్రభవ
ఖ్యాతిం గైకొనియున్నవేళ జయతూర్యంబు ల్చెలంగించిన
ట్లాతర్వాతఁ జెలంగెఁ గుక్కుటసముద్యత్కంఠనాదార్భటుల్.

86


వ.

మఱియు నాసమయంబునం బ్రణయకలహవ్యాపారంబులం బరాఙ్ముఖులై మౌనము
ద్రలు వహించి పరస్పరతనుస్పర్శనంబులు గాకయుండ నేకశయ్యం బవళించియుండి
యు మకరధ్వజుండు మండలీకృతకోదండుండై ప్రయోగించు కుసుమకాండంబు
లం బొడము హృదయవ్యధలం బొరలుచుండియు నాభిమానికంబులం దెచ్చుకోలు
ధైర్యంబుల నుండియు సూచితాహర్ముఖంబులైన తామ్రచూడకంఠనినాదంబులు కర్ణ
కఠోరంబులై వినఁబడిన నులికిపడి దిగులొందుచుఁ జలంబులు విడిచి మనంబులు గరంగి
కుహనానిద్రావసానపరివర్తితాభిముఖశరీరులై యొండొరులం గౌఁగిలించుకొని తమ
కపుఁగూటములం దమకు పునారతులకు నవకాశంబు లేనిప్రొద్దు విచారించి యొకరి
నొకరి దూఱిపలుకుచు నిట్టూర్పు నిగుడించి దంపతులవలనను నరవిందబృందంబులతోడ
వికసితంబులగు హృదయారవిందంబులం దమకు నామనియైన యవ్వేళ చుంబనపరిరం
భణనఖదంశక్షతాదివినోదంబులం బంకజాసనార్థపంకజాసనరతిబంధసౌఖ్యంబు
లం జొక్కు పద్మినీపాంచాలురవలనను శారికాకీరమయూరకలకంఠకలరవకపోత
కలహంసప్రముఖంబులైన విహంగమనివహంబుల కలకలంబుల మనోహరంబులై వెల
యు లవంగక్రముకచాంపేయపున్నాగనారికేళచందనమందారకదంబఖర్జూరాది
మహీరుహంబులం బ్రశస్తంబులగు నుద్యానవనంబులవలనను దేవభూపాలమందిరంబు
లయందు భగవత్కీర్తనంబులు సేయు వైణవికమార్దంగికాదిగాయకనికరంబులజంత్ర
గాత్రంబుల సుదీర్ఘంబులగు భూపాలదేవగాంధారిమలహరిదేశాక్షివసంతమంగ
ళకౌశికప్రముఖస్త్రీపురుషరాగస్వరగ్రామంబుల నభిరామంబులై ధ్రువరూపకాది
తాళంబుల హేరాళంబులగు సంగీతనాదంబులవలనను స్నానసంధ్యావందనాద్యను
స్థానంబుల నిష్ఠాగరిష్ఠులగు బ్రాహ్మణసమూహసంకీర్ణంబులైన జలాశయస్థానంబులవ
లనను గోపాలకులు నిజనామాంకంబు లంకించి పిలుచుచుఁ గ్రేపుల విడుచు సన్నా
హంబుల నంభానినాదంబులు సేయుచు హుంకారంబులతోడ వదనంబు లెత్తి కర్ణంబు
లు నిక్కించి తమతమవత్సంబుల కెదురుసూచు ధేనువితానంబులవలనను దీర్ఘికాతరం
గడోలాజాలంబుల నీఁదులాడుచు నినాదంబు లొనరించు మరాళబలాకచక్రవాక
జలకుక్కుటాదిపక్షికదంబంబులవలనను వర్ణనీయవైభవసమేతంబై ప్రభాంతంబు
వర్తించె నంత.

87


గీ.

గగనవీథిని వాహ్యాళిఁ గదలు పద్మ, బాంధవప్రభుముందరఁ బట్టు సూర్య
పుటము గొడుగులపడగలప్రో వనంగ, నమరెఁ గెంజాయ ప్రథమదిగంతరమున.

88

మ.

తమముం బాయఁగఁ జేసి రాగగుణముం దప్పించి సన్మార్గవ
ర్తిమతం బొప్పఁ దపంబుపెంపునను వర్ధిష్ణుత్వముం గాంచి లో
కము లెల్లం గనుగొంచు సజ్జననమస్కారార్ఘ్యదానంబులం
బ్రమదం బొంది వెలింగె యోగికరణిం బ్రద్యోతనుం డయ్యెడన్.

89


వ.

అప్పుడు.

90


శా.

గోరు ల్నాటినగుబ్బచన్నులను జిక్కు ల్వడ్డహారావళుల్
జారం జెమ్మట ముద్దుఁజెక్కులను స్రస్తంబైన ధమ్మిల్లముం
దీరై నిద్దుర దేరుకన్నులును నాతిం జూడ నవ్వేళ నొ
య్యూరంబు ల్విభు నాత్మఁ గైకొనియె మోహభ్రాంతి రెట్టింపగాన్.

91


సీ.

అకలంకరాజబింబాననంబులయందు నిదురతమంబులు ముదురుకొనఁగఁ
దాంబూలరాగసుందరమైన మోవులు మొనపంటినాటుల ముద్దు గులుక
వీడి చిక్కులువడ్డ వేణీభరంబులు జాతినీలంబులచాయ లీన
ఘర్మబిందువులచేఁ గరఁగిన మైపూఁత మృగనాభివాసన ల్బుగులుకొనఁగ
నొకరొకరిఁ జూచు నరసిగ్గుటోరచూపు, దగిలియున్నట్టి ప్రేమబంధములముళ్లు
బిగువు గొలుపంగఁ బ్రేయసీప్రియులు కేళి, శయ్యపై డిగ్గి సమ్మదస్వాంతు లగుచు.

92


క.

కాలోచితకృత్యంబులు, లీలం గావించి సరసలేపనసుమనో
మాలాంబరభూషణజా, లాలంకృతగాత్రు లగుచు నతిమోదమునన్.

93


వ.

ఇవ్విధంబున నవ్వధూవరులు ప్రాణంబులకంటె నతిశయంబగు విశ్వాసంబు గలుగు
చిత్రరేఖాముఖకతిపయపరిచారికాసహాయులై యితరజనంబుల కెవ్వరికిం జేరరాని ర
హస్యమందిరంబున నిగూఢప్రవర్తనంబుల నిచ్ఛానుగుణంబులైన సరససల్లాపంబులం
జెలంగుచు, శృంగారవనవాటికల మెలంగుచు, సరసాహారదుకూలచందనకుసుమాది
భోగంబులం బ్రమోదించుచుఁ, గంజకైరవకల్హారకమనీయకమలాకరంబులతో జలక్రీ
డావిహారంబుల వినోదించుచు, గ్రామ్యవేణుదారితఖల్లరీముఖేంద్రాణిజృంభితాదిక
రణంబుల స్త్రీపురుషరూపంబులఁ జిత్రించిన కేళిచిత్రపటంబు లవలోకించుటవలనఁ గూ
టములకుఁ గ్రొత్తఱికంబు సంపాదించుచు ముచ్చటలం గలయుచు, సురతజనితశ్రమం
బుల సొలయుచు, నిది రాత్రి యిది దినంబని తెలియనియ్యని మోహతిశయంబుల దేహం
బులు జీవంబులు నొక్కటిగాఁ దలంచుచు, దినంబులు క్షణంబులగతిం గ్రమించుచుఁ
నవాఙ్మనోగోచరంబైన యానందపారావారంబునం దేలుచుండి మఱియొక్కనాఁడు.

94


సీ.

అలఁతఁ బాపెడునవ్వు టమృతంపుఁదేటల చిలుకరింపులప్రేమ తొలకరింప
వీనుల నరసోఁకు వీడ్యంపుఁదావుల పలుకరింపుల మేను పులకరింప
సురతంపుటిరువుల సొంపు నింపుపిఱుందు చెంగలింపుల మేను దొంగలింప
విడిచియు విడఁజాల కెడతాఁకు సిగ్గు మోమోరసిం పులయింపు దారసింపఁ

గలికి తేలింపుఁజూపులఁ గరఁగి కరఁగి, సొలపునెయ్యంపుఁజిన్నెలఁ జొక్కి చొక్కి
యివ్విధంబున నాయకుఁ డిందువదన, యుపరిసురతసుఖాంబుధి నోలలాడె.

95


సీ.

కెమ్మోవిరుచు లాననిమ్మని విభు వేఁడుకొనినఁ గొమ్మనియాస కొలిపి యాన
వచ్చిన నియ్యక వదన మిట్టటుఁ ద్రిప్పి యలయింపఁగాఁ గోప మగ్గలించి
కరములఁ జెక్కిలిగవ యొత్తిపట్టి పంటను మోవిఁ గొని చుఱుక్కనఁగ నొక్కి
యిటువలెఁ జేయకు మెన్నటి కీఁక నని నట్టించి చెక్కిలి గొట్టునపుడు
కంకణంబులరావంబు గల్లుమనియెఁ, జేతియురవడితాఁకునఁ జెళ్లుమనియె
వల్లభునిమేనఁ బులకలు జల్లుమనియెఁ, గుసుమశరుమూఁక నవ్వులు గొల్లుమనియె.

96


మ.

సిచయాభావనటన్నితంబతటయోషిద్రత్నకించిచ్చల
త్కుచపాటీరరసాత్తఘర్మజలబిందుస్వచ్ఛముక్తాముణీ
ప్రచయాంచత్పతనాభిరామసుమహాబాహాంతరుం డై సుఖిం
పుచు మెచ్చెన్ రతిరాజనందనుడుత త్పుంభావసంభోగముల్.

97


సీ.

వి ల్లెక్కుడించక వేసినమదనుండు పలుమాఱు కుంటెనపనులు నడప
సెగలచే స్రుక్కఁజేసినమందపవనుండు చెలిమితో నెమ్మేనిచెమట లార్ప
నుదుటువెన్నెల కాఁక నుడుకఁజేసిన చంద్రుఁ డమరి శైత్యోపచారములు సేయఁ
జెవులుగా సిలరొద ల్చేసినచిలుకలు ముద్దుమాటలు పల్కి ప్రొద్దుఁ గడప
శుకకలాలాపప్రాణనాయకునిఁ గూడి, నిండువేడుక కుహరించుచుండె నపుడు
మేలు గలిగి సుఖించెడివేళయందు, భువిని బగవారలైన బంధువులు గారె.

98


క.

ఎక్కువలగు మక్కువలను, జక్కవలను బోలి యిట్లు సరసత నెల వా
ళ్లిక్కువలఁ గలిసియుండఁగ, నక్కువలయనేత్ర గర్భ మయ్యెడఁ దాల్చెన్.

99


గీ.

చక్రభావనచేఁ గాంచి శక్తి దనకుఁ, బ్రాపు గలుగుటనో లేమిఁ బాపుకొనియె
వెలఁదినడు మంతమాత్రనే విఱ్ఱవీఁగె, నహహ నడుమంతరపుఁగల్మి కది నిజంబు.

100


మ.

అసమాస్త్రుండను గారడీఁ డతివ గర్భాయాసనిశ్శ్వాసమం
త్రసముచ్చారణ సేయ నాభివివరాంతస్సీమయం దుండి సా
హసభావంబున నిర్గమించి సఫణంబై యాడు నీలాహిరీ
తిసరోజాననరోమరాజి చెలువొందెం జూడు విస్తీర్ణమై.

101


ఉ.

మెల్లనికౌఁగిలింపులును మెత్తనిమాటలు లేఁతముద్దులుం
జల్లనిచూపులుం గులుకుఁజల్లెడునవ్వులు నేర్పుగల్మియున్
జెల్లనిహామిక ల్తరువు సేయని కూటము లయ్యె భావముల్
వల్లభునందు వేఁకటియలంత నెలంతకు నాఁటినాఁటికిన్.

102


సీ.

ఉరువులై కొనల నల్పొప్పుచన్నులు కరగ్రహణత కొకవింతకాంక్షఁ జేయఁ
తెలిదమ్మిచాయలు దేరు చెక్కులు ముద్దుఁ గొనుటకు నొకవింతకోర్కె వొడమ

నలపుసొల్పులఁ బల్కు పలుకులు వీనుల వినుటకు నొకవింతవేడ్క యొదవఁ
గమ్మనివాససల్ గ్రమ్మువాతెరతేనె లానుట కొకవింతయాసఁ గొలుప
మెత్తనై మెఱుఁ గెక్కిన మేను కౌఁగి, లింత కొకవింతముచ్చట సంతరింప
గర్భిణీరతజనితసౌఖ్యమునఁ జొక్కు, చుండె నవ్వేళ యదువంశమండనుండు.

102


వ.

అంత.

103


ఉ.

మందిరపాలికాజనులు మానినిఁ గన్గొని గర్భభార
చందమున న్ఘటించెనని సంశయము న్భయము న్విచారమున్
డెందమునన్ జనింపఁగ వడిం బఱదెంచి రహస్యరీతి సం
క్రందనవైరితోడ వివరంబున నిట్లని పల్కి రత్తఱిన్.

104


చ.

చెలఁగి భవత్తనూభవ వసించుగృహాంతము పోతుటీఁగెయున్
బొలయక యుండఁ గాఁచుకొని పూనిక నుండఁగ నేమిమాయయో
తెలియఁగఁజాల మమ్మదవతీమణి గర్భభరంబుఁ దాల్చె ని
న్నెళవు గృహంబులోపలను నిక్కముగా వివరింపఁగాఁదగున్.

105


వ.

అని విన్నవించిన.

106


ఉ.

ఖేదము క్రోధము న్మదినిఁ గీల్కొన బాహుబలాఢ్యులైన క్ర
వ్యాదులఁ గొందఱ న్గని యుషాంగన కేళిశిరోగృహాంతరం
బాదిగ నంతటం గలయ నారసి యిక్కొఱగామి దుర్మదో
న్మాదతఁ జేసినట్టిఖలు నాకడకుం గొనిరండు తీవ్రతన్.

107


క.

అని పలికిన రోషానల, జనితస్ఫుటనిస్ఫులింగచయభాతిని లో
చనరక్తదీప్తు లడరఁగ, దనుజులు వడి నేగుదెంచి తత్సౌధమునన్.

108


మ.

అమలేందూపలవేదికాస్థలమునం దాసీనుఁడై యయ్యుషా
రమణీరత్నముతోడ నక్షనిపుణారంభంబునం ద్యూతసం
భ్రమకేళీరతి నున్న పంచశరసామ్రాజ్యాధిపత్యప్రసి
ద్ధమనోజ్ఞప్రతిభాసమృద్ధు ననిరుద్ధుం గాంచి క్రోధాత్ములై.

109


మ.

భయదాహంకృతిఁ జక్రముద్గరగదాప్రాసాదిహేతిచ్ఛటో
దయరుగ్జాలదగద్ధగ ల్నిగుడ నాదైత్యు ల్విజృంభింప ని
ర్భయుఁడై యాగ్రహవృత్తి నుగ్రపరిఘప్రాంచద్భుజాదండుఁ డై
లయకాలాంతకుభంగి వారలపయి న్లంఘించి ధట్టించుచున్.

110


చ.

తలలు పగిల్చి కంఠము లుదగ్రతఁ ద్రుంచి భుజప్రదేశముల్
నలినలి గాఁగ మోది నిటలంబులు వ్రక్కలు సేసి దంతముల్
డులిచి యురస్థలు ల్చదిపి డొక్కలు చించి భయంకరాకృతిన్
సలిపె రణంబు రక్కసులు చచ్చియు నొచ్చియు విచ్చి పాఱఁగన్.

111

క.

హతశేషులు భయవిహ్వల, మతులై యేతెంచి కదనమార్గముఁ దెలుపన్
వితతంబుగ నాజ్యాహుతి, నతిశయజాజ్జ్వల్యమానమగువహ్నిక్రియన్.

112


వ.

బాణుం డక్షుద్రరౌద్రముద్రాసమున్నిద్రనేత్రకోణుండును, నాహనాటోపధురీణుం
డునునై కదిసె నయ్యనిరుద్ధుండును, సమరసన్నద్ధుండును, భుజావష్టంభసమృద్ధుండు
నునై యతనితోడం దలపడియె న ట్లయ్యిరువురును గంఠీరవంబులచందంబున, బెబ్బు
లులతెఱంగున, మత్తమాతంగంబులకైవడి, శరభంబులవిధంబున, గండభేరుండంబుల
చాట్పున, రోషావేశంబులు రెట్టింప, జయకాంక్షలు ముప్పిరిగొన, తర్జనభర్జనంబుల
గర్జిల్లుచు, నన్యోన్యముష్టిఘాతంబులను, బరస్పరపాదపార్థిప్రహారంబులను, నితరేత
రమర్మభేదంబులను, బాహాబాహియుఁ గేశాకేశియుంగాఁ బెనంగ, నయ్యిరువురకున్
రణంబు దారుణంబై చెల్లుచుండె నప్పుఁ డాఋశ్యకేతు నుద్దేశించి యశరీరవాణి యి
ట్లనియె.

113


క.

యదువంశతిలక వీనికి, విధి జయకాలంబు పెనఁగ నేటికి హరిచే
నొదవు నపజయము వీనికిఁ, గదియు శుభము నీకు నచిరకాలమునందున్.

114


గీ.

అనియె నమ్మాట వీనులయందుఁ దగిలి, రిపుమహీరుహవిదళనోద్వృత్తిఁ గెరలు
యదుకులాగ్రణి యాగ్రహోదగ్రకరిని, నిష్ఠురాంకుశభూతమై నిలువరించె.

115


వ.

అప్పుడు.

116


ఉ.

బాహుబలోద్ధతిం బ్రళయభైరవుభంగిఁ బరాక్రమించి య
వ్యాహతలీల వాని బెగడం దఁగఁజేసియుఁ గార్య మెంచి దే
వాహితుచేతఁ బట్టువడె నాహనుమంతుఁడు శక్రజిత్తుచే
నాహవభూమిఁ బట్టువడినట్లు ప్రశాంతనిజోగ్రకోపుఁడై.

117


క.

వనితాసంపర్కంబున, ననిరుద్ధు నిరుద్ధుఁ జేసె నరివర్గంబున్
వనితాసంపర్కంబున, ననిరుద్ధు నిరుద్ధుఁ జేయు నరివర్గంబున్.

118


వ.

ఇవ్విధంబున.

119


గీ.

పట్టుకొని యాఁపు సేయించె బాణుఁ డతని, నపుడు తద్భంగజనితఖేదాంధకార
భిన్నహృదయారవిందయై కేవలంబు, నయ్యుషాంగన సంతాప మందుచుండ.

120


సీ.

వేకువఁ గాంతిదప్పినచంద్రబింబంబువిధమున నెమ్మోము వెల్లఁబోయెఁ
బగలింటిసెగలచే సొగటొందు పూఁదీఁగెవడువున నెమ్మేను వాడుదెంచె
మునిమాపుజిగిఁ దొలఁగిన తమ్మిఱేకులరీతిఁ గన్నుల దైన్యరేఖఁ దోఁచెఁ
దగురేయి హిమ మంటు తాంబూలదళముల చెలువున చెక్కిళ్లు చెమట దోఁగెఁ
జిన్నఁబోవుచుఁ జెక్కిటఁ జేయిఁ జేర్చి, యాటపాటలపై వేడ్క లన్ని మఱచి
విరహసంతాపవేదన నేఁగుచుండె, నేమి చెప్పుదు నయ్యుషాకోమలాంగి.

121

గీ.

వీడు ముఖకాంతి వసివాళ్లు వాడు మేను, నెండు కెమ్మోవి బాష్పము ల్నిండు కన్ను
లామనోవ్యధఁ గనుఁగొన్న రామరామ, జగతిఁ బగవారికైనను జాలి గాదె.

122


వ.

ఇ ట్లమ్మనోహరాంగి విరహానలసంతప్తమానహృదయయై యుండె నంత నిక్కడ.

123


మ.

అనిరుద్ధుండు పురంబులోపలను లేఁ డాశ్చర్య మేమో కదా
యనుకొంచు న్వసుదేవముఖ్యులు విచారాక్రాంతచేతస్కులై
యనుమానించుచు భృత్యకోటులను శోధ్యస్థానము ల్చూడఁ బం
చిన వా రెందును గానమంచు మరలం జేరంగ నిర్యత్నులై.

124


ఉ.

తల్లియుఁ దండ్రియు బహువిధంబుల ఖేదము నొందుచుండఁగాఁ
బల్లవకోమలాంగి యగుభార్య వియోగముచేఁ గృశింపఁగా
నెల్లప్రజ ల్తదీయవ్యధ లెంచి విచారము నొందు గోపికా
వల్లభుఁ డంతయు న్హృదయవారిజమందు నెఱింగియుండియున్.

125


క.

కానున్న కార్య మయ్యెడు, నే నిప్పుడు వీరితోడ నిజముగఁ దెలుపం
గా నేల యనుచు మాయా, మానుషవేషుండు కార్యమతిచే నుండెన్.

126


వ.

అని శుకుండు పలికె ననిన నటమీఁదటికథావృత్తాంతం బెఱింగింపు మనుటయు.

127


ఉ.

అండభవప్రకాండగమనాదరపండితపుండరీకమా
ర్తండదిశేభతుండభుజదండధృతాంబుజజాండభాండరు
ఙ్మండలమూర్తికుండలిపదుండనచండతరైకకాండమా
ర్కొండరమేశరత్నమయకుండలమండితగండమండలా.

128


క.

శ్రితరాజహంసయోగా, యతిదివ్యవిలోకనాక్షయాగమహితగా
శ్రితరాజహంసయోగా, యతదివ్యవిలోకనాక్షయాగమహితగా.

129


స్రగ్ధర.

ప్రతాపవద్రిపుద్రుమప్రభంజనప్రభంజనా
క్రతుక్రియాచరిష్టమౌనిరంజనానిరంజనా
యతిస్థిరత్రిలోకభోగదాకరాగదాకరా
ప్రతిష్ఠితాంబుధిభ్రమద్ధరాధరాధరాధరా.

130


గద్య.

ఇది శ్రీమంగళాచలనృసింహకృపాప్రసాదసంప్రాప్తవిద్యావైభవ కనుపర్తిరా
యనమంత్రితనూభవ సుజనహితకృత్య నిత్యాబ్బయామాత్య ప్రణీతంబైన యనిరుద్ధ
చరిత్రం బను మహాప్రబంధంబునందుఁ దృతీయాశ్వాసము.