అధ్యాత్మ రామాయణ కీర్తనలు - బాలకాండము

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search

1

ధన్యాసి -- ఆది తాళము

పల్లవి ---


మశ్శివాయ తే నమోభవాయ I


I


అనుపల్లవి ---

సమానాధిక రహితాయ శాన్తాయ స్వప్రకాశాయ
ప్రమోద పూర్ణాయ , భక్తౌఘ పాలణాయ IIనమII


గర్వితదానవలోక , ఖణ్డనాయ శ్రీరజత --
పర్వతాగ్ర నిలయాయ పావనాయ --
సర్వలోక పాపపుంజ , నిర్వాపణాయ శర్వాయ -
దర్వీకరభూషణాయ , సర్వోత్తమాయ IIనమII 1


అణ్డజాధిపవాహన కాణ్డాయ మేరుశైలకో --
దణ్డాయ శితి కంఠాయ పండితాయ -
మండిత త్రిపురజయోద్దండతాండవాయ బ్ర
హ్మాండ నిలయాయ మహా , మాయాతీతాయ IIనమII 2


మందహాసవదనార , వింద సుందరాయయోగి --
బృందానందదాయ శత్రుభీకరాయ --
ఇందుసూర్యాగ్ని నేత్రాయ , వందిత ప్రమథగణాయ --
నందివాహనాయ పోషిత , బృందారకాయ IIనమII 3


నిరుపమానందఘన , నిశ్చితాయ శాశ్వతాయ --
వరదా భయంరణాయ , గిరిశాయ --
తరుణేన్దు శేఖరాయ , పరమపురుషాయ భవ --
కారణాయ శ్రీకాళ, హస్తీశ్వరాయ IIనమII 4


గంగాభంగతరంగ సంగతజటాజూటాయ --
సంగీతలోలాయ శుభ , సంగతాయ --
అంగజాస్తరంగమద , భంగాయ స్ఫటికోప --
మాంగాయ శేషశైలాధీశమిత్రాయ IIనమII 5

.


2.

రేగుప్తి రాగము - ఆటతాళము

పల్లవి ---

ఈ సంశయము వారింపవే, పర, మేశ నన్ను మన్నింపవే


అనుపల్లవి ---

శ్రీ సదాశివ ప్రశ్న , జేసెద వివరింపు
వాసుదేవతత్త్వము, మహత్త్వము
భాసమానవిలాస నే నిదె
నీ సత్కృపావలోకనమున
నీ సమయమున దెలియవలసిన
దే సమస్త మిదే ప్రశస్తము IIఈ సంశ II


జ్ఞాన విజ్ఞాననిశ్చల భక్తివైరా
గ్యానందములకు నిధానమైవిన్న
శ్రీనిలయమై వెన్నవలె మృదువై యస
మానమై నుతిగన్న, మార్గము మిన్న
యైన బహుగోప్యతరమైనయ
నూనముగ సెలవిమ్ము చంచల
లే నితంబినులను నే నీదాన
దానవవైరి మ్రొక్కద IIఈ సంశII 1


వారిజాక్ష జగదాధారమూ ర్తియై
శ్రీరామునియందు సారసద్భక్తి
కారూఢమై ముక్తి కారణమై యల
రారు నొక్కయుక్తి నాదిశక్తి
మీరరసి ధీరరసికాళిక
సారకళలూర బలుకుముభవ
నీరధికి తారకము భక్తిమీర
సుజనులను వేఱె లేరని IIఈ సంశII 2


దేవ శ్రీరాముని దేవదేవునిగా ష
డ్భావాతీతునిగా సుధీవరులెల్ల
భావము రంజిల్ల బల్కుదురతని
భావింతు రదియెల్ల గల్ల గాదె
గావునను శ్రీవిభు ముక్తికి
కేవలము తావలమటైనను
శ్రీ వెలయు భూవలయమున తను
భావుడై జీవుడైన దేమి IIఈ సంశII 3


మాయావృతుడై రామస్వామి సన్ముక్తి
దాయకుని గనుతన దాం దె
లియలేడు వేయేల నతడు జూడు
ఆత్మను తత్త్వవేత్తకేనేడు దెలిపినాడు
మాయికుడటంచు రొకకొందఱ
దేయదార్థము సేయసుజన
ధ్యేయండెటులగునైన జానకి
కాయెడల దా నడల నేటికి IIఈ సంశII4


ఈ వాక్యముల కర్థమీవుగా కితరులు
భావించి పలుక నేర్పరులెవరులేరు
దేవుడవై చెలువుమీరు నిన్ను జేరు
ధీరాత్ములు గోరు కోర్కె లీడేరు
ఈ వసుధ శేష శైలాధిపు
డై వెలుగు రాఘవు చరితము సు
ధావర్షమై చెవులుపండునుగావించు
సేవించు జనులకు IIఈ సంశయII 5


3.

భైరవి - ఆటతాళము

పల్లవి -

వినవే సత్యవాణీ శర్వాణీ అలి , వేణీ నీరజపాణీ II


అను పల్లవి -

ననుగోరి భజియించి నను మదిలోనుంచి నను వరదుడు నౌదు, సందియము లేదు
మునుపు ఇటు లిది యడుగరెవ్వరును మహాయోగి వర సంభా
వనము జీవన మమృత సేవనము , జన్మ పావనము .II వినవే II


శ్రీరామునికి నమస్కారము జేసి యని
వారణ నాత్మత్వము నీకు వివరింతు
నా రాఘవుడు శౌరి , యజ్ఞానహారి జి
తారి శ్రీ విహారి , మాయాధారి
తారక కీర్తి, సత్యజ్ఞానస్ఫూర్తివి
దారి తార్తి దేవ . తా చక్రవర్తి చిదానందమూర్తి
యై రాజిలు శ్రీహరి మాయకెల్ల నా
ధారమైననందువల్ల మోహము కల్ల
శౌరి ప్రకృతికి నాది నిజమా,
యారూఢి జగములు సృజియించి య
నారతము నభముగతి వెలిలోను , పూర్ణితను బూను . IIవినవేII 1


వితతమాయచే, నిర్మితమైన జగము విస్మృసూచీచుం
బిత, శిలచే బరిమణించు
గతియె కర్తృత్వము, అతనికిలేదు దు
ర్మతులెరుగరీదారి, కోర్కులుమీరి
మతిహీనులైరి యే, మనవచ్చు వారిసం
స్మృతియె కోరి యందు, చే బద్ధులైరి యామధుకైటభారి
అతిశుద్ధ చిద్ఘనుడని తెలియక జ్ఞాన
మతనికి గల దందురు, భువిలో గొందఱు
తతవసుద్యుతి లసన్మాలిక, సుతగళా
న్విత మయ్యు మఱచిన
గతి మనస్థితుడౌ జగద్గురుని , ఖలులెఱుగఁరని II వినవేII 2


అకటా సూర్యునియందు, నప్రకాశత్వము
యొకనాటి కైనను యున్నదే యటువలెనే
ప్రకటమై జ్యోతిస్వ-భావమాత్ముని యందు పనిలేదు మాయవాదు నీవికమీద
అకలంక గనవే నిత్యము నమ్మిమనవే ర
క్షకు డనవే శేష - శైలేశు గనవే భక్తియు చేకొనవే
అకుటిలునకు చాంచల్యము చెప్పుటలు చలదృ
ష్టికి చూడ నునికిపట్లు భ్రాంతమైనట్లు
సకల కాలములను ప్రభమా, లికి పగల్రాత్రి లేనటు నా
త్మకును జ్ఞానాజ్ఞానములు రెండు లేనివై యుండు IIవినవేII 3


4.

కేదారగౌళ - ఆదితాళము

పల్లవి --

సీతారామ మారుతి సంవాదము, చేరి వినవే శ్రీదము II

అనుపల్లవి ---

శీతాంశుముఖీ యీ, చరితమునందలి
చాతుర్యము చూడు, సంశయము వీడు
ఖ్యాతిగ మును దశ, కంఠుని రవికుల
జాతుడైన రఘురాముడు సబల
వ్రాతముగను జంపి, సాప్తుడై సా
కేతపురికి జేరియున్నతఱిని నడచిన IIసీతాII


హాటక సింహాసనమున రాముడు
కోటిసూర్య సమకాంతిని వెలుగుచు
పాటలాధరి ధరాసుతతోడను
పరగ వసిష్ఠాది గురు బుధ మిత్ర
కోటి సేవింప నాదినారాయణుడౌ
మేటి భక్తానుమోది, కమలా వినోది
దీటు లేక కొలువుండి హనుమంతు మనసు
దెలిసి సీతను బలుకుమన ముద్దుగులుక
మాటి భక్తజనాగ్రణి కృతమతి
సాటి లేని శౌర్యధైర్యఘనుడును
మేటియైన యనిల సూను గనుగొని
తేట పడగ లోకవిమోహిని బలికెను. IIసీతాII 1


రాముడు పరమానందమయుడుసర్వచరాచర పరిపూర్ణు డవ్యయుడు
సామగానలోలు డచలు డాద్యుడు సర్వసాక్షి సుమ్ము వినిర్ముక్త
కాము డిది నమ్ము, పరమాత్ముడనుచు వేమారు దెలిసికొమ్ము భక్తుల సొమ్ము
సామీరి సంశయమెల్లను పోనిమ్మునా మాట మది నమ్ము, ధీనిధివి గమ్ము
యేమనవలెనే మూలప్రకృతిని యీ మహాత్ము సన్నిధానమాత్రను
ఈ మహాద్భుతము లొనర్చు. మూఢులు స్వామియందు నారోపణ సేయుదురనె IIసీతాII 2


ఈ కోసలపురిలో రాముడై దశరథునకు నితడు బుట్టుటయును విశ్వామిత్రు యాగము
సాకల్యము సేయుటయు నహల్యకు శాపము కావుటయు, విలువిఱచి నన్ను
చేకొని చెలగుటయు, పరశురాముని ఢాక యడంచుటయు, బురిజేరుటయు
కైక పనుప దండకాటవి కేగుట ప్రాకట మాయాసీతాహృతి యందుచేత
శ్రీకరు రవిసుతు జేరి వాలినటు జీరి వారధిగట్టి రావణుని
భీకరాజి దునిమి నన్ను గై కొని సాకేతము జేరుటెల్ల మత్కృతియనె IIసీతాII 3


ఆ రాఘవునియం దీవిధ మజ్ఞాను లారోపణ సేయుదురు. మధుకైట
భారి నిర్వికారుం డఖిలాత్మకుడు, పరిణామరహితుడు బ్రహ్మ యితడు
సూరిబృంద సుతుడు ఆనందయుతుడు భూరిభువనహితుడు, సకలసమ్మతుడు
కారుణ్యనైర్ఘృణ్య, హేయోపాధేయ సుఖదుఃఖ గమనాగమనాది ద్వంద్వములు లేవీ
శ్రీరమణీయున కీవిభు నెరిగిన వారిజేర వెఱచిమాయ పరువిడు
దారితారి శేషశైలశిఖర విహారిజేరి కడతేరు దారియిది IIసీతాII 4


5.

సావేరి -- ఆది తాళము

పల్లవి -

వినుమని శ్రీరాముడు తా బలికెను, విశదముఁ దను జేరి IIవినుII


అనుపల్లవి -

జనకజ చే విన్న యనిలజనికి జ్ఞాన
జనక మౌనట్లుగాను మోదము తోను IIవినుII


సమతను ఆత్మనాత్మపరాత్మల జాడలు త్రివిధములు పవనజ
మమతాహంకారకర్తృత్వములన, మరినయది యాత్మ
రమణ ననృతజడదుఃఖములను నీ, రసమయినది యనాత్మ, నిత్యము
విమలము సత్యజ్ఞానానందా, త్మక మిదియె పరాత్మ, మహాత్మా IIవినుII 1


ఆకాశము త్రివిధం బయినట్లు ప, రాత్మ త్రివిధమాయె, దెలియగ
నైకముగాను పరాకారము జ, లాసయ బింబితమైన
చేకొని తదవచ్చిన్నాకాశము, చెలగి భిత్తియందు, నెంతయు
ప్రాకటముగ నిటు ప్రతిబింబితమై, ప్రబలినదీచాయ, శ్రీ యాంజనేయ IIవినుII 2


చాతురిమీరి నఖండాద్వితీయ, చైతన్యము వలన, బింబ
భూతుడై త్రివిధాహంకార విరా, ట్పురుషుడు జూపట్టె
అతనియం దాభాసరూపమయి, భూతేంద్రియ మనో, వృతమయి
ఖ్యాతి గాంచి జీవాత్మయన దనరె, గనుగొను మీజాడ, క్రమముతోడ IIవినుII 3


గుణమయ మాయ కర్తృత్వము పొసంగి, న జీవత్వాది మలినములు
గణుతింప నవిచ్ఛినమైనయ వి కార పరాత్మ, యందు
అనయము నను నారోపణ సేయుదు, ర జ్ఞానులు భువిలో నెఱుగక
అనిశము శక్తి రజతమని భ్రమయుటే, యాభాసమనదగుచు, దెలియనగును IIవినుII 4


చెలగు నవిచ్ఛిన్నత బ్రహ్మము, విచ్ఛేదము కల్పితము, గావున
నలభిన్నులకు పూరణాత్మకు నైక్యము, వలనను జనులచే,
అలఘు తత్్వమస్యాది మహా వా, క్యములచే బ్రకటమై, యలరెడు
వెలయగ నైక్య జ్ఞానము గల్గిన, విద్య మాయమౌను, గుణములతోను IIవినుII 5


పావనులై యీ క్రమ మెఱిగిన మ, ద్భక్తులు మత్సరము జెందుదు
రీ వసుధను భక్తివిహీనులుగ, గర్హితులై దుర్మతులై
కేవలమును శాస్త్రగర్తములబడి, కెరలిభవశతములు, నొందుచు
భావము చెడి సుజ్ఞానదూరులయి, పోవుట నిశ్చయము , నీకేమి భయము IIవినుII 6


పరమ మైన యీ యుపదేశము గో, ప్యమిది భక్తి లేని వారి
కరయు నింద్ర రా, జ్యమొసంగిన నియ్యకు మిది, భవహరము
గరిమ నఖిల వేదాంతసార సం, గ్రహము శుభావహము, కనుకొను
సురుచిర శేషాచలఖర నివా, సుండవై భువిలోను, వెలసినాను IIవినుII 7


6.

కాంభోజి -- ఆదితాళము

పల్లవి -

నే ధన్యనైతి నే జగత్ప్రభో , సాధులోకవిభో II

అనుపల్లవి -

మాధవ చరణారవింద, మకరందముఁగ్రోల గల్గెనే IIధన్యII


మునుమిడి సంశయమనే ముడి వీడె నీ యనుగ్రహ
మున రామతత్త్వము సంక్షేప, ముగ వింటి కడదేరగంటి
మనసు తనివి తీరదాయె - మన్నింపవే దైవరాయ,
అనువుంద నినుజేర మాయ యతిదూరమై తొలగిపోయెనే IIధన్యII 1


అద్వితీయాఖండ పరిపూర్ణానంద వారిధిలోన
చిద్విలా సోల్లాసి వై రం, జిల్ల జేసి నన్ను డాసి
హృద్వికాస మొనరించి, హిత వాక్యము లుపదేశించుటచే
విద్వన్నుత శంకర వి, శ్వేశ శంభో మహదేవన్నే IIధన్యII 2


స్వామీ నే నీచే విన్న యీ చరితము రసభరితము,
వేమాఱు దీని వినఁ బల్కుఁ వీను లమృతము జిల్కు
శ్రీమహిళాభి రాముడై శేషాద్రి ధాముడైన శ్రీ
రాముని దేవతాసార్వభౌముని నీ వలన దెలిసినే IIధన్యII 3

7.

గౌళిపంతు -- ఆదితాళము

పల్లవి --

వినుము ధరాధర వరతనయాధృత, వినయా సరస గుణాభినయా IIవినుII

అనుపల్లవి --

చనువుమీర నన్నడిగిన యీ శుభ, చరితము హతదురితము యిది నిర్గతము IIవినుII


రావణాది దుష్టాసుర కోటుల
మోవలేక భర పీడితయై భూ
దేవి విమల గోరూపము గైకొని
శ్రీవిలసిలు బ్రహ్మలోకమునకు
ఠీవిగ నేగి విరించి చరణ రా
జీవము లశ్రుకణమ్ముల దడుపుచు
సావధానముగ మ్రొక్కి వినతయై
తా వచ్చుట వినిపించె విశదముగ IIవినుII 1


వనజభవుం డొక ముహుర్తమాత్రము
మనమున నంతయు నూహ జేసి క్రొ
న్నన విల్తుని తండ్రిని గనుగొనుటకు
ముని సుర పరివృతుడై భూసహితము
గను చని క్షీర సముద్ర తీరమున
ననుపమ, భక్తి వినమ్రుడై హరిని
వినుతించెను వేదాంత వాక్యముల
ఘన వినయానందములు పురిగొన IIవినుII 2


కోటి సహస్రాంశు సమప్రభచే,
మాటికి దిక్కులు తేజము, సేయుచు
హాటకాంబరము కటిపై వెలుగఁ గి
రీటహార కేయూర కాంతులు ల
లాట కంఠ బాహువులను దనరగ
మేటి కౌస్తుభ శ్రీవత్సములకు
నాటపట్టయి చతుర్భుజు డగుచు ని
శాటవైరి గనుపట్టె మోదమున. IIవినుII 3


గరుడ వాహనారూఢుడు కమలా
ధరణీ యువతీ యుగళ యుతుడు శం
ఖ రథాంగ గదా పద్మ విరాజితు
డురుతర వనమాలికా భిరాముడు
ధర నీరేజ విశాల లోచనుడు
పరమామృత కరుణా లోకనుడగు
హరి చరణ ద్వయి శిరము సోకగను
సరసిజగర్భుడు మ్రొక్కి పలికెనిదె. IIవినుII 4


తనువు మనసు ప్రాణము, లింద్రియములు
వినుత నిశ్చయాత్మక మగు మతితో
నొనగూర్చి భవత్పద వినతుడ నై
తినని సుహృత్పుండరీకమునకు
గొని నిరతానందానుభవంబున
నెనయువారు భవరహితుల భవ త్రిభు
వనముపుట్టి పెరిగిగెడయు, టిది నీ
ఘన మాయ గదాయనె పితామహుడు IIవినుII 5


సూరిజనులు వేదాంతమునందలి
సారవిచారము చేసి ఘోర సం
సారర్పుక్సీడితుల కౌషదం బు
దారభక్తి యని పల్కిరి గానయ
నారత మతి దయజేయు మనిన విని
శౌరి యజుని కరుణార్ద్ర దృష్టిచే
నారసి నీ యభిమతము లొసంగుదు
గోరుమనిన నుత్సుకుడై పలికెనుIIవినుII6


శ్రీలలనాధిప చిత్తగింపుమీ
భూలోకమునను రావణుడనగా
పౌలస్త్యుని సుతుఁ డొకడు గలడు సువి
శాలమై తగు మదీయ వరంబున
మేలుజెంది సురకంటకుడై కడు
చాలియున్న వాడతనికి మర్త్యుని
చే లయంబు విధియించితి దనుజుని
నీ వా మనుజుడవై వధింపుమనె IIవినుII 7


వనజోదరు డిట్లనియెను కశ్యప
ముని మును నను తనయుని గమ్మని వే
డిన నే సమ్మతి పడితి నిపు డతం
డిన కులమున దశరథు డైనాడా
ఘనునకు కౌసల్యకు పుత్రుడనై
జనియించెను జనియోగ మాయయె
జనకుని యింట సీత యగును పొ
మ్మని చక్రి తిరోభాసము నొందెను IIవినుII 8


సురలకు నిట్లనియెను చతురాస్యుడు
హరివాక్యము లెల్ల వింటిరే వా
నరుల సృజింపుడు మీ యంశములను
పరమేశునకు సహాయము సేయుడు
పరమ సమ్మతం బగు ననుచు వసుం
ధర నూరడించి నిజ వాసమున
కరిగె నలువ శేషాచలవాసున
శరణాగత వత్సలు డని పొగడుచుIIవినుముII 9

8.

కన్నడ -- ఆదితాళము

పల్లవి --

అందముగ నీ కథ వినవే రజ, తాచలనదనా, పరిహసిత వి
నిందితారవింద చంద్రవదనా, కుందబృందసుందర రదనా IIఅందII

అనుపల్లవి --

మందయాన దశరథవధేశుడు, మాన్యయశుఁ డయోధ్యా, కాంతుడు
పొందుగ దనయులు లేనందుకు వగఁ జెంది వసిష్ఠుని జేరి పల్కె సా IIనందII


మనవి వినుము స్వామీ నా కిక శ్రీ, మంతులైన సుతులు, ఏ వెర
వున జనియించెద రాత్మదహీనునకు ధ,నంబు సుఖరంబు గాదు గదా
అనిన రాజు కనియె నా వసిష్ఠుడు, జననాయక నీకు కొడుకులు
ఘను లమల యశోధనులు నల్వురిక గల్గెద రందు కుపాయము గలదనె IIనందII 1


శాంతుడైన ఋష్యశృంగ మౌనీ, శ్వరుని బిలువనంపు మీవు
పుత్రకామేష్టి నిరంతర, సంతోషస్వాంతుడవై యొనరింపు
మంతయు ద్వరగా ననుడును శాంతా, కాంతుని రావించి రిపుదు
ర్దాంతుడు ముని పరివృతుడై సరయువు, చెంత యజ్ఞదీక్షకొని నిలిచె IIనందII 2


వేదమంత్రములు బలుకుచు శుచియై వేల్వగ హుతవహుడు హవ్యము
సాదరమున గై కొని తగం బ్రదక్షిణార్చు లలర జ్వలియించెను వసుప్రభుడై
ఖేదహరుడు యజ్ఞేశుడు దశరథ, మేదినీశ్వరునకు, శుభశం
పాదకమగు పాయస పాత్ర మొసగి, పరమాత్ముడు సుతుడగు నీ కని చనే IIనందII 3


లల నలరిరి- మౌనులు లబ్ధమనో, రధుడై దశరథుడు, ముదమున
జెలగుచు ఋష్యశృంగ వసిష్ఠుల చే ననుజ్ఞ గొని హవిస్సు వేడుకను
కలిత గుణుడు కౌసల్యకు సగమును, కైకకు సగ మొసగ, వారలు
దెలిసి సుమిత్రకు దమ యంశంములం, దెలమి సగము సగమొసగిరి విరతా IIనందII 4


పరమాన్నము భుజించిన మువ్వురు, తరుణులు గర్భిణులై, వెలిగిరి
నిరతము సురకాంతలుగ దొమ్మిది నెలలునిండ కౌసల్య గనెను సుతుని
పరగ జైత్ర శుద్ధ నవమిని పునర్వసు నక్షత్రమున, సుమనో
హర కర్కాటక లగ్నమునను శేషాచలేశుడగు హరి జనియించినా IIనందII 5

9. శంకరాభరణము -- ఆట తాళము

పల్లవి --

శ్రీరాముని గాంచెను
పార్వతీ వినవే మన కౌసల్య యా
త్మా రాముని గాంచెనుIIశ్రీరామునిII

అను పల్లవి --

తోరమై హర్షాశ్రు
పూరమై కన్నుల
జార భయ సంభ్ర మా
శ్చర్యము ల్బెనగొనగా IIశ్రీరామునిII


అలనల్ల కలువ ఱే
కుల చాయ మేనితో
జెలగువాని పసిడి
చేల గట్టినవాని
వెలయు నాల్గు భు
జములవాని కనుగొ
ల్కుల నరుణ రేఖలు
కలవాని స్వర్ణకుం
డల లసిత గండమం
డలములవాని య
స్ఖలిత రవికోటి ప్రకాశుని రత్నో
జ్వల కిరీటమువాని
నళినూల కుటిల కుం
తలములచే ముద్దు
గులుకు చుండెడివాని IIశ్రీరామునిII 1


ఘనతర శంఖ చక్ర గదాబ్జములవాని
వనమాలికా యరుత దనరు వాని చిరున
వ్వను వెన్నెలలా నవచంద్రుడు దిక్కు
లను వెదచల్ల జెల్వ ల రారెడు వాని
యనుమాన కరుణామృత పూర్ణ నే
త్రుని మంజీరాంగదుని శ్రీవత్సకటకం
కణహార కేయూర కౌస్తుభాది భూ
షణ భూషితుని జూచి తనివి తీరక తిరుగ IIశ్రీరామునిII 2


శరణా గతులను కరుణ రక్షించు శ్రీ
ధర నీకు బహు వందనము లొనర్చెద
శరణు గర్విత దనుజ చయ విరామరామ
శరణు దేవతా సార్వభౌమ నీవే
పరమాత్ముడవు జగత్పతి వీశుడవు హరివి
పరయోగి బృంద ద్వనజ కర్ణికాం
తరమున సురుచిర రాకాజ్యోతివై
మెఱయు నిన్నెన్న నాతరముగాదని తిరుగIIశ్రీరామునిII 3

ఈశ నీవు నిఖిలేంద్రియ సాక్షివి
శ్రీశుడి వీ విశ్వ సృష్టి సంరక్షణ
నాశము లొకటను జేసి సేయకున్న
వాశిచే బోయి పోవని వాడవై ప్రకృతి
డాసి డాయనివాడ వై శాశ్వతుడ వై యా
కాశాది భూత సంఘములకెల్ల నవ
కాశమై నీవు ప్రకాశింతు విది మాయా
పాశాది బద్ధుల కెఱుగ వశముగాదని తిరుగ IIశ్రీరామునిII 4


నీ జఠరము నందనేక బ్రహ్మాండము లీ
యోజ బరమాణువులై యున్నవిపుడు నీవు
రంజిల్లు నా యుదరమున బుట్టుట కల్ప
భూజము ముంగిట మొలచినట్లయ్యె నం
భోజాక్ష పతి ధన పుత్రాది సక్తనై
నే జెల్ల సంసార నీరధి బడనొల్ల
శ్రీజాని నీ శరణు జెందితి నామదిని
దేజరిల్లుచును సుస్థిరుడవు గమ్మని IIశ్రీరామునిII 5


ఈ యఖిలమును మోహింప జేయు నీదు
మాయకు నగుపట జేయకు నను శేష
శాయి యీ రూప ముపసంహరింప గదోయి
కాయజ జనక చక్కని ముద్దుపట్టివై నన్నలర
జేయు మమితా నంద
దాయివని నిను మదిని దలతురు ఘనులెల్ల
మాయురే యనుచు వే మారును వినుతించి
శ్రీయుత మూర్తి యా శేషాచలేశుడౌ IIశ్రీరామునిII 6


10.

ముఖారి - ఆదితాళము

పల్లవి -

రాముని సకల గుణాభి
రాముని నిఖిల రాక్షస వి
రాముని వర్ణింప వశమా IIరామునిII

అనుపల్లవి -

వేమాఱు కౌసల్య నీ వే
మేమి గోరినా వది యెల్ల
శ్రీ మీఱ నొసగితి ననుచు
ప్రేమచే జననితో బలికిన IIరామునిII


మున్ను బ్రహ్మ నన్ను వేడు
కొన్న భూభారము దీర్ప
వన్నె మీరగను నేడు, నీ గర్భమున
జెన్నలర బుట్టితి చూడు, రావణాసురు
డన్నిట గర్వించినాడు, వాని వధియించి
సన్నుతి గాంచు నీ రేడు, జగములలోన
మున్నలర దశరథుడు నీవు
నన్ను దపమున మెప్పించి
కన్నారు నీ వదితి వతడు, కశ్యపుడని కౌసల్యకు దెలిపిన IIరామునిII 1


అనుచు దల్లితో బలికి, హరి ముద్దుబాలుడై కలికి
తనమున హరి నీలగాత్రుడై, వికసిత నవ్య
వనజదళ విశాల నేత్రుడై, చక్కని వా
డనుచు నుతియింప పాత్రుడై, అమల ప్రకాశ
మునకు జూడ దరుణ మిత్రుడై, విలసిల్లె నంత
ఘనుడైన తనయుడు గల్గె
నని విని దశరథు డానంద
మునను గురునితోడ గూడీ,
చనుదెంచి కన్గొనెను శ్రీ రఘు IIరామునిII 2


విరులవాన లపుడు గురిసె, వేడ్క జయదుందుభులు మొరసె
సురసుందరు లెలమి నాడిరి, గంధర్వ వరులు
సరసులై రాగములు బాడిరి, మౌనులు దోషా
చరుల వలని భయము వీడిరి, పౌరులానంద
కరుని జూడ గుమిగూడిరి దశదిశల యందు
పరిమళ మిలితములైన తెమ్మెరలు విసరె దివిని సురలు
వర విమానారూఢులై శ్రీ, హరి హరీ యని మ్రొక్కిరాత్మాIIరామునిII 3


ఘనవిభుడైన కొమరుని, గనెను కైక చంద్రబింబా
ననులను సుమిత్ర గనెను, సుతుల నిర్వురను
మొనసిన సంతోషమునను దశరథుడు సకల
ధనముల విప్రుల దనిపెను, వసిష్ఠ మహా
ముని యా బాలురకు క్రమమునను రామ భరత ల
క్ష్మణ శత్రుఘ్నులనుచు నామ, కరణము
లొనరించెను భరతుండును శత్రుఘ్నుడు జోడై, లక్ష్మ
ణుడు ననుసరించెను దశరథ IIరామునిII 4


చెలగి సౌమిత్రు తో గూడి మెలగుచుం దేనియ లొలుక
బలుకు సుతుని నృపుడు గాంచి, భూషణ జాల
ముల తోడ నలంకరించి శిస్తు గస్తూరి
తిలకము నుదుట నుంచి గళమున రత్న
కలిత హారములు గీలించి, ముద్దాడు నపుడు
కల కల నవ్వుచు మద్ది, కాయ లల్లాడ నందియలు
ఘల్లు ఘల్లు మనుచు మ్రోయ
లలిత గతుల నటియించు శ్రీ IIరామునిII 5


చిన్నారి బొజ్జలో నన్ను గన్నవాడా నా పాలిటి
పెన్నిధానము రారా, యోరి నా చిన్ని
యన్న బూచి వచ్చేరారా, పరుగెత్త వల
దన్న నాతో నలుగ మేరా, పాటపాడుచు
నిన్ను లాలి యూచే రారా లాల బోసేను
మన్ను చేత నంటవద్దు వెన్న బెట్టే ననుచు చాలా
మన్నించి పలుకు కౌసల్యకు, మరులు రెట్టింప జేయు IIశ్రీరామునిII 6


ధరణి విభుడు, భుజియించు, తఱిని కౌసల్య తనయుని
మురిపెమున రమ్మని జీర, పరమయోగి హృదయాం
తరమునందు జెల్వు మీర, వసియించు దేవుడు
చిరుత వాడయి ముద్దు గార, వచ్చిన జూచి
తరుణి తనదు కోర్కెలు మీర, కౌగిటనుంచి
కరుణించి భుజియించు మనిన, కబళము చేనందుకొని
తిరుగా నాటలాడు పరుగెత్తిన మాయా బాలకుడౌ శ్రీ IIరామునిII 7


వితత యశుడు దశరథ భూ, విభు డంతట కౌమారాన్వితుల
సుతుల దిలకించి, యుపనయనములు
పతులముగ నొనరించి, వశిష్ఠు నొద్ద
శృతుల నెల్ల చదివించి, చతురంగముల
గతుల దెలియ నేర్పరించి, చౌ షష్ఠి విద్య
చతురులను గావించి, హర్షించ వారు
సతతము గురు బంధుమిత్ర, జనులకెల్ల
హితులై ధైర్యోన్నతులై పరగిరందులో శ్రీ,
యుతుడయి సత్యవ్రతుడైన శ్రీ IIరామునిII 8


తల్లి దండ్రులకు ప్రియము, దనరగ నశ్వము నెక్కి
విల్లునమ్ములు చేపట్టి, వేటలాడుచు
మొల్లమున నడవినున్నట్టి, మృగముల గుండెలు
ఝల్లు ఝల్లున జుట్టి ముట్టి , పోనీక వాని
నెల్ల చలపట్టి పడగొట్టి సౌమిత్రి గూడి
బల్లిదుడై యన్ని యయోథ్యా వల్లభునకు కాన్క జేసి
సల్లలితుడై సకల జనుల, సవినయముగ బాలించు శ్రీIIరామునిII 9


శైల రాజ కన్యకా యీ, చందమున మనుజావతార
లీలమై వర్తించెడు శౌరి, గనుగొను మింద్ర
జాలికుడు చక్రధారి, సమస్త వేద
మూలమై విలసిల్లు దారి, యజ్ఞులు దెలియ
జాల రతడు నిర్వికారి, విమత సంహారి
శ్రీలచే జెలువందు శేష, శైలశిఖరాగ్ర విహరణ
శీలుడై సద్భక్తలోక, పాలుడై దనరు నిత్యాత్మా IIరామునిII 10

11.

నాదనామక్రియ - ఆట తాళము

పల్లవి --

ఇందు వదనా వినవే యీ చరితము
కుందరదనా IIఇందుII


అనుపల్లవి --

డెందము శ్రీ మన్ము
కుందుని పాదారా
విందములం దా
నందింప జేసి రా IIకేందుII


ధీరుడు విశ్వామి, త్రుడు తా నయోధ్యకు
శ్రీరాముని జూడ వచ్చెను అని
వారుడై సౌధము జొచ్చెను, ఎదురు
గా రాజు చని తోడి తెచ్చెను, మునికి
చారు సింహాసన మిచ్చెను, మహో
దారుడై పూజ యొనర్చెను. కరము
లారూఢి నౌదల జేర్చెను, స్వామి
మీరు వచ్చుట కేమి, కారణ మది దెల్పు
డీ రాజ్యమైన మీ , కిచ్చెద ననెను రా IIకేందుII 1

కౌశికు డా పూజ, గై కొని పల్కె, భూ
మీశ మారీచ సుబాహులు, మాం
సాశను లద్భుత దేహులు, ఘోర
పైశాచిక ప్రేత వాహులు, కాల
పాశ విడంబిత బాహులు, దివి
జేశాది సుర ముని ద్రోహులు , యజ్ఞ
నాశకు లధిక దుర్మోహులు, గా
డాసి వారల పొగ ర,డంచన లక్ష్మణుని
జేసి రాముని బంపు, మీకు శుభమౌ ననె IIఇందుII 2


భూమీశు డే కాంత, మున వసిష్టుతో బల్కె
నేమి సేయుదు నేమందును నెట్లు
రాముని నెడబాసి యుందును, సుగుణ
ధాము నెన్నడు గనుగొందును, గురు
స్వామి యెవ్విధి సుఖము జెందును, ఈ వి
శ్వామిత్రు నుడి యెటు విందును, ఇతని
కేమి మనవి జేసికొందును, నేను
యీ మాట వినకున్న నిపుడే శాప మిచ్చు
నీ మౌని యనిన గురు డిట్లని యనెను రా IIకేందుII 3


నరవర వినుమిది పరమ రహస్యము
నరుడా శ్రీ రఘురాముడు, ఘోర
దురితాంధకార విరాముడు, హరి
పరమాత్ముడు కమలా కాముడు, భక్త
వరదుడు ప్రణత సుత్రాముడు, దిన
కర వంశ జలనిధి సోముడు, మౌని
వరదేవతా సార్వఙౌముడు, ఇతడు
పరమేష్ఠిచే తొల్లి ప్రార్థితు డయి భూమి
భరము మాన్ప నీ, వరతనయుఁ డాయె ననె IIనిందుII 4


రాజా నీవు కశ్యప బ్రహ్మవు కౌసల్య
జేజేల కెల్లను తల్లి, అదితి
నా జను తరుణీమ తల్లి, మీరు
శ్రీ జాని భజియించి తొల్లి, చాలా
పూజింప నత డుల్లసిల్లి, సుతుడు
నై జనియించెద మీకు నెల్లి, నని య
వ్యాజ కరుణా రసము జల్లి, నేడు
రాజీవాక్షుడు రాముఁడై జూపట్టె శేషు
డే జుమి లక్ష్మణు డిది నిజ మనెను రా IIకేందుII 5


వర శంఖ చక్రము, ల్భరత శతృఘ్నులై
ర రుదార హరి యాజ్ఞ చేత, సురు
చిరు యోగ మాయయె సీత, యనగ
మెఱసి జనక వంశ జాత, యై
పరగు చున్నది ధీసమేత, వినుత
సరస సద్గుణ మణి వ్రాత, యిది
పరమ గోప్యము స లక్ష్మణుని రాముని మౌని
వరు వెంట బంపుమని బల్కె వసిష్టు IIడిందుII 6


రామ లక్ష్మణులను రాజు పిలువ బంచి
ప్రేమతో గౌగిట నుంచెను, తనను
హా మహిమ నుతియించెను, తన
దే మహద్భాగ్యమని యెంచెను వి
శ్వామిత్రు జాల పూజించెను. ఘన
శ్యాముని నతని కర్పించెను. శుభ
మౌ మీకని దీవించెను, శ్రీ
రాము లంతట ధనుర్బాణ తూణీర ధరు
లై మించి ముని వెంట, నతిమోదమున జని IIరిందుII 7


లలిని బలా తిబలలను రెండు వి
ద్యలు రామునకు మౌని యిచ్చెను. రాము
డలరి గంగా నదిని మెచ్చెను, ఆ
వల బోవ దాటకి వచ్చెను, దాని
బొలియింప మని ముని సెల విచ్చెను. ఆ
వెలది యాబిడ రూపు విడి యక్ష సతియై
చెలగి రాముని బొగడి, శ్రీ మీఱ జనెను రా IIకేందుII 8


కౌగిట రాముని, గదియించి జడదారి,
వేగమే శిరము ముద్దాడెను, అంత
బాగాయెనని కొనియాడెను . మహా
యోగి ధ్యేయుడ వనుచు వేడెను, వీత
రాగుడై భయమెల్ల వీడెను, నిగ
మాగమ మంత్ర రహస్యములను దాల్చె
నీ గతి శేషగిరీశు డై హరికి రా IIకేందుII 9

12.

సౌరాష్ట్ర -- ఆదితాళము

పల్లవి -- వినవే సుగుణాన్వితా, గిరిరాజ సుతా IIవినII

అనుపల్లవి --

మునియుతులై రాఘవులు కామా శ్రమ
మునను నాడు నిలిచి వేకువ
ఘనులు సిద్ధాశ్రమ గతులై రచటి
మునులా రాఘవులను పూజించిరి IIవినII


శ్రీరఘురాముని, చే ననుజ్ఞ గొని
సారయశుడు విశ్వామిత్రుడు క్రతు
వారంభించే, మహా జన వృతుడై
సారెకు మారీ,చ సుబాహు లసృ
గ్థారలు గురిసి రహో
ధీరుడు దాశర,థి మహోద్ధతుడై
మారీచు ననిల, మార్గణమున
వారధిలో బడ, వైచి సుబాహు ని
దారితు జేసెను, దహనాస్త్రమునకు IIవినII 1


సునిశిత బాణము, లను సౌమిత్రి త
గ ననుచరులను జంపెను పువ్వుల జడి
నెనసి సురలు గురి,యించిరి సంభ్రమ
మునను గుశిక సుతు డిన కులకుని
తన తోడ నిడికొని
నెనరున కౌగిట నునిచి లక్ష్మణుని,
మునువిడి కొనియా,డి ఫలములు
అనఘులకును భోజనము లొనర్చెను.
దినములు మూడిటు, జనెను సరసముగ IIవినII 2


మునిపతి శ్రీరా,మునితో బలికెను
జనకుని యాగము, గనుగొన జనియెద
ననువుగ మీరు వచ్చిన శుభమౌనన
వినతు డగుచు నను,జుని గూడి తపో
ధనువెంట ముదముతో
జని చని యెదుటను వన మొకటి ఫల సు
మన స్తరు లతా లం,కృతమై
జన విరహితమై గనుపట్టినది,
వన మేమన రా, మునితో ముని బలికె IIవినవేII3


గౌతము డను ముని , గలడు లోక వి
ఖ్యాతు డాతని కహల్య యను సతిని
ధాత యొసంగెనా, దంపతు లిచ్చట
బ్రీతి నుండ నింద్రుడు నొకనాడా
గౌతమ వేషమున
నాతి నెనసి చను, నాతరి స్నాతుడై
గౌతమ ముని వచ్చి , భస్మీ
భూతు జేతు నాతో బొంకకు మన బురూ
హుతు దుర్మతి నైతిఁ గావు మనెను IIవినవేII4


శాప మొసంగెను, సహస్ర భగుడ
వై పొమ్మని వృత్రారి నహల్యను కోపమున శిలా
రూపము గమ్మనెనే వర జంతు ర,
హితముగ జేసెను యీ వనమా మోని
బాపురే యెన్నడు నీపై రఘుపతి
శ్రీ పాదము వెట్టు నాటికి
శాపము చెడునని, జనె సతీమణికి
పాపము బాపవె, పరమ పురుషా యనెను IIవినవేII5


రాముని కరము క,రమ్మున బట్టి మ
హా ముని యప్పుడ, హల్యను జూపిన
భామ పైని దన, పాదము నుంచి మ
హా మతి యగుచు నహల్య తనర గని
రాముడు తా మ్రొక్కె రామా మణియు స
లక్ష్మణుని ధను ర్బాణ ధరుని కనకాం, బరుని
శ్రీ మన్మందస్మిత వదనుని శ్రీ రాముని శేషాద్రి
ధాముని జూచెను IIవినవేII 6

13.

బిలహరి -- ఆటతాళము

పల్లవి --

శరణు శరణని రామచంద్రుని యహల్య -- సన్నుతించెను వినవే

IIశరణుII

అను పల్లవి --

సరణిపరమ పురుషు డనుచు గౌతమ వాక్య మదిలో నెన్నుచు శౌరికి మ్రొక్కి యరుదార నర్ఘ్య పాద్యము లిచ్చి హర్ష విస్ఫురి తాక్షియై మించి పులకించి నీ చరణ రజ పరాగమునను దురిత గరిమతోను గృతార్థనైతి మెల్లను తొలగె నహహా జగత్ప్రభో కమలా విభో హరి IIశరణుII

ఏ విభు పాద రాజీవ రేణువులచే
పావనమైనది భాగీరథి, మహాదేవ బ్రహ్మాది సు
రావళి నే మహానుభావుడు గావించె,
నే వరదు పద రజము
వేవేల విధముల వెదక బడును శ్రుతుల
చే, వనజ భవుడెవని శ్రీనాభి పద్మమం
దా విర్భవించె, నవ్యయుడైన పురవైరి
యే విశ్వ గురు నామ మే ప్రొద్దు భజియించు,
నే వీర వరు పాద మీ
భువన జాలముల నెల్ల నాక్రమించెను,
శ్రీ వనితామణికి నెవ్వని యురము చెల
గి విహరింప నునికి పట్టయ్యె, నే
దేవుని పద మనిందిత రాజయోగి హృధ్యేయమై త
న వారి చెలువు మీఱె,
నా విభుండా వరదుడా గురుడా పరుండా దేవుడిదె నను
బ్రోవుటకు ప్రత్యక్ష మయ్యెన
హో ! విచిత్ర మటంచు నెంచుచు IIశరణుII 1


శ్రీరఘువర నీ లీల లత్యద్భుతము
లే, రికి తరము గాదవి తెలియ, మర్త్యావ
తారమునను జగత్త్రయము మాయా మోహ
పారవశ్యము నొంద భ్రమియించితివి, నిర్వి
కారుడ వీవు, చలనాది రహితుడవు,
కర చరణా దులు గలవారి వలె నుందు
వా, రయ పూర్ణుడ వానంద మయుడ, వ
క్రూరుడ వతిమాయికుడవు ,సంవిస్మయో
దార విశుద్ధుడ వా,త్మ ప్రజ్ఞాఖండ బోధ
స్వరూపుడ వజుడవు,
పారమార్ధికుడ వీ, భూతముల కా
ధారభూతము నీవే, యీ జగము నీవే
సారెకు జగదాశ్రయుడ వీవే, కర్తృ
కారణ కార్యములు నీ విలాసములు,
చేరి గన్గొనగ నేరక తనుధారి వం
దురు గాని నిన్నువిదారి తాఖిల కలుషమగు
పరతత్త్వ మన ఖలులచే నగునా IIశరణుII 2


జలజలోచన నీ వలఘు మాయా గుణ
ములచే బింబితుడవై విలసిల్లి జగ దుదయ
విలయములకు బ్రహ్మ విష్ణీశ్వరనామ
ముల బూని యున్నావు,
తెలియక నొకడవై వలను మీఱగాను వాచ్య వాచక భేద
ముల జగన్మయుడవై యలరు చుందువు, నీ వ
స్ఖలిత తేజుడ వోం,కార వాచ్యుడవు, వా
క్కుల కగోచరుడవు, గూఢ వర్తనుడవు,
భళి భళి శ్రీరామభద్ర గుణోన్నిద్ర ప్రధనాంగణ రుద్ర
కలిత కౌస్తుభహార శ్రీ శేషా
చల శిఖర విహార మోహనాకార,
చెలిని చంచల సునిశ్చల జ్ఞానమార్గము
దెలియ నెంతటి దానను ? నీ దానను,
కలుగ జేయుము నాకు నీ పద
నలిన భక్తి నిరంతరమ్ముగ
జెలగి, వందన శతము లొనరిం చెదను, దాశరథీ దయానిథీ IIశరణుII 3

14.

బేగడ-- ఆటతాళము పల్లవి --

వినీల వేణి వినుత గుణ శ్రేణి, వినవే శర్వాణి

--IIవినీలII

అనుపల్లవి -- రా మునిచే ననుజ్ఞగొని గౌతమ ముని యొఘనాఘనాంగుడౌ ద్దకు జనె నహల్య మునీంద్రు డా రాముని జూచి పలికె ఘనంబుగను మిధిలాపురంబు నను, క్రతువరంబు మహేశ్వర చాపము కనుంగొని యనంతరం బయోధ్యకు జనెద మనన్ వినమ్రు డయ్యెను హరి హరి. IIవినీలII


రంగ దభంగ తరంగ గంగ ను
ప్పొంగుచు దాటి విదేహ రాజపురి
చెంగట రాగ నెఱింగి జనకుడు చె
లంగుచు నెదురుగను
రంగుగ జని గాధేయునకును సా
ష్టాంగ మెఱగి పూజించి, దిశలు వెలు
గంగ జేయు చంద్ర సూర్యులో సుర
పుంగవులగు నరనారాయణులో
శృంగార కళల బంగారు తళుకు ల
నంగాను దగిన వీర లెవ్వ రె
ఱుంగ వలయు నన, దశథరాత్మజులు
మంగళ కరు లీ రామలక్ష్మణులు మహా భుజుల్ ఘను లని, ముని దెల్పెను IIవినీలII 1


ఠీవిగ మత్క్రతు సంరక్షణమున
కై వీరల నే దోడి తెచ్చునెడ
పావను డీ రాఘవుఁ డొక శరమున
జావనేసెఁ దాటకను
భూవర మదీయ యాగ విఘాతకు
లై వరలు సుబాహు ప్రముఖ నిశచ
రావళి దృంచియు మారీచు జలధి
లో వైచె బదాంబుజ రజమునను
యీ వీరు డహల్యను వేవేగ బవిత్రను
గావించి నేడు నీ గృహంబున గరళకం
ఠు విల్గనుగొన వచ్చెను
నావుడు నగరికి దోడ్కొని చని యా నరేంద్రు డారాముని బూజించెను. IIవినీలII 2


అంతట జనకుడు మంత్రుల బిలిచి పు
రాంతకు విలు దెమ్మనిన భటుల న
త్యంత బలుల నైదువేల బంపిన
బంతము మీద జని
సంతతమును మణి వస్త్రాదులచే
నెంతయు భూషితమై ఘంటా శత
కాంతమైన విలు దెచ్చిన ధరణీ
కాంతుడు కౌశికు గనుగొని యా
వింత నృపవరు లంతా జూడగ
సంతోషమున రఘూద్వహుం డీ చాప మెక్కిడిన జాలును సీతా
కాంత నిత్తు నన విని శ్రీరాముని కనుంగొనె ముని దరహాసమునను IIవినీలII 3


శ్రీరాముడు వామాకరంబున వి
ల్లా రూఢిగ గొని యెక్కడి నృపతులు
చేరి చూడ దక్షిణ కరమున నరు
దారి దిగిచి నపుడే
సారము చెడి ఫెళ ఫెళ మని విరిగెను
వైరి వరుల ధైర్యముతో గూడ ద
దారవము దిశల్నిండె దివి నిమా
నా రూఢు లగుచు గనుగొను దేవత
లా రాముని శ్రీ మీఱ బొగడిరి
తోరంబుగా బ్రసూన వర్షము దుందుభి ధ్వను
ల్సుర వనితా జన చారు నాట్యములు చెల
గ రాఘవుని జనేశు డర్మిలి గౌగిట నుంచెను. IIవినీలII 4


ఫుల్లాంబుజ పత్రాక్షుడు రాముడు
విల్లు విఱచుటలు విని యంతఃపుర
పల్లవాధరలు మన సీతకు శ్రీ
వల్లభు డనం దగిన
వల్లభు డిదె వచ్చెను చల్లనివా
డెల్ల జగములను నేల జాలు వాఁ
వల్ల మరునైన, జక్కదనమున
నుల్లసంబు లాడునటె యమ్మక
చెల్లా రాముని వల్లా కోరిక
లెల్ల ఫలించు వంశపావను, డీ మహాత్ముడంచని పలికి సరస
సల్లాపము లాడుచు సీతకు మణి, సరు ల్వి
రుల్ హరువుగఁ గై సేసిరి IIవినీలII 5


పట్టుచీరె గటికట్టి రవికె చను
కట్టుదిట్టముగ గట్టి మృగమదము
బొట్టు నుదుట నునిచి కనుల కాటుక
బెట్టి కురులు దువ్వి
దట్టముగ కీల్ముడి వైచి మఱిన్
మట్టుమీఱ వేడుక చే సరములు
జుట్టి సర్వ భూషణములు మేనను
దట్టముగా బూని యుక్క చెలి కేల్
బట్టి, జనకుని పట్టి శౌరికి
పట్టంపురాణి నౌదు నేనని, బాళితోడ గుందనపు బొమ్మవలె
నెట్టన రాజమురాళ కరిగతుల, నెరాకరింపుచు నడిచెను IIవినీలII 6


తాటంక ద్యుతి దిక్కుల నెల్లను
దీటుకొనగ బాపబొట్టును సరి
పాటిలేని చంద్ర సూర్యులును స
య్యాటమునకు మెఱయ
తేటగు ముత్యపు సరులు పతకములు
మేటి చిలుక తాళితోడ బెనగొన
మాటికి నందెలు ఘల్లని మ్రోయగ
దీటులేని వైఖరి సీతా
వధూటి గుణముల పేటీ, హారి కి
రీటాది భూషణాఢ్యు శేషగిరీశు రామ భూవిభుని చేరి మణి
హాటకమయామాలిక గళమున నిడి, హరిన్ వరించితి నని చనె ముదమున IIవినీలII 7