అక్షరశిల్పులు/నా మాట

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search

సయ్యద్‌ నశీర్‌ అహమ్మద్‌ శివప్రసాద్‌ వీధి, కొత్తపేట, వినుకొండ-522647, గుంటూరు జిల్లా, సంచారవాణి : 9440241727. 9396429700.

అక్షరశిల్పులు.pdf
నా మాట

భారతస్వాతంత్య్రోద్యమ చరిత్రలో ముస్లింల పాత్రను వివరిస్తూ రాసిన గ్రంథాల గురించి 'ఎండి.సౌజన్య'గా సుప్రసిద్ధులైన ప్రముఖ రచయిత ముహమ్మద్‌ నఫీజుద్దీన్‌ (తెనాలి) గారితో 2002 లో ప్రస్తావన వచ్చింది. అ సందర్భంగా రాష్ట్రంలోని ముస్లిం కవులు-రచయితలు-అనువాదకుల వివరాలతో కూడిన ఒక గ్రంథాన్ని వెలువరిస్తే బాగుంటుందని ఆయన సలహా ఇచ్చారు. ఆయా కవులు-రచయితల సాహిత్యం, శైలి, వస్తువు తీరుతెన్నుల గురించి బాగా పరిచయం ఉంటే తప్ప ఆ ప్రయత్నానికి న్యాయం చేయలేనని భావించిన నేను అప్పట్లో నిస్సహాయత వ్యక్తంచేశాను.

                                  పునరాలోచన :

ఆ తరువాత 2004 అక్టోబర్‌ 9న భారత స్వాతంత్య్రోద్యంలో పాల్గొన్నముస్లిం యోధుల చిత్రపటాల ప్రదర్శన కార్యక్రమంలో పాల్గొనేందుకు రాజమండ్రి వెళ్ళాను. తెలుగు సాహిత్యరంగంలో 'స్మైల్‌' గా విఖ్యాతులైన ప్రముఖ కవి ముహమ్మద్‌ ఇస్మాయిల్‌ గారి అతిథిగా ఆయన ఇంట రెండు రోజులున్నాను. ఆ సందర్భంగా తెలుగులో రాసిన, రాస్తున్న ముస్లిం కవులు-రచయితలు, అనువాదాకుల వివరాలను నమోదు చేసే ప్రాజెక్టును చేపట్టాల్సి అవసరాన్ని వివరిస్తూ ఆ ప్రయత్నం చేయమని ఆయన మరోమారు సూచించారు. భారత స్వాతంత్య్రోద్యమంలో పాల్గొన్న ఆంధ్రాప్రదేశ్‌ ముస్లింల చరిత్రను గ్రంథస్థం చేసేందుకు సమాచారాన్నిసేకరిస్తున్న సందర్భంగా నేను చాలా ఇబ్బందులను, చేదు అనుభవాలను ఎదుర్కొన్నాను. ఆ అనుభవంతో రానున్న రోజులలో ముస్లిం కవులు-రచయితల సమాచారం కోసం శోధిస్తున్న పరిశోధకులకు, సాహితీవేత్తలకు, సాహిత్య చరిత్రకారులకు ఎటువంటి ఇబ్బందులు ఎదురు కాకుండ చూడలన్పించింది. కవులు -రచయితలకు సంబంధించిన ప్రాథమిక సమాచారాన్ని ఒక్కచోట అందుబాటులో ఉంచితే తెలుగు సాహిత్య చరిత్రను అధ్యయనం చేస్తున్నపరిశోధాకులకు మాత్రమే కాకుండ ఆసక్తిగల ఇతరులకు కూడ ఎంతోకొంత వెసులుబాటు లభించగలదని అన్పించింది. చరిత్ర : తెలుగు భాషలో సాహిత్య సృష్టి చేస్తున్న కవులు, రచయితల వివరాలతో ప్రచురితం అవుతున్న గ్రంథాలు చూస్తే ముస్లిం కవులు-రచయితల పరిచయాల నమోదుకు నాకు తెలిసినంతో ప్రముఖ కవి ముహమ్మద్‌ జైనుల్‌ ఆబెదీన్‌ ప్రయత్నం చేశారు. ఆయన రాష్ట్ర ప్రభుత్వ వ్యవసాయశాఖలో 'జాయింటు డైరక్టర్‌' గా హైదారాబాద్‌లో బాధ్యాతలు నిర్వహించారు. ఆ తరువాత ఆయన 1972లో ఉద్యోగ విరమణ చేశారు. ఉద్యోగ విరమణ చేశాక ముస్లిం కవులు, రచయితలందర్ని ఒక చోట సమావేశపర్చాలన్న ప్రయత్నంలో భాగంగా రాష్ట్రరాజధానిలో 1972లో 'ముస్లిం తెలుగు రచయితల సభలు' నిర్వహించారు. ఆ తరువాత ముస్లిం కవులు రాస్తున్నగ్రంథాల ప్రచురణకు తొడ్పడాలన్నలక్ష్యంతో 'తెలుగు ఇస్లామిక్‌ ఎకాడమి' అను సంస్థను కూడ ఆయన స్థాపించారు. ఈ సందార్భానికి సంబంధించిన వివరాలను, విశేషాలను వెల్లడిచేయగల పత్రాలు ప్రస్తుతం అందుబాటులో లేవు.

1982లో హైదారాబాద్‌లో 'ఆంధ్రప్రదేశ్‌ ముస్లిం తెలుగు రచయితల సమ్మేళనం' జరిగింది. ఈ సమ్మేళనం నిర్వహణకు షేక్‌ జవాద్‌ హుసేన్‌, యస్‌.ఏ.సమద్‌, యూసుఫ్‌ ఘోరి తదితరులు నడుంకట్టి విజయవంతంగా నిర్వహించారు. ఈ కార్యక్రమం నిర్వహణకు ముహమ్మద్‌ జైనుల్‌ అబెదీన్‌, ఎం.సైఫుల్లా బేగ్ ఎం.ఏ అజీజ్‌, డాక్టర్‌ సి.నారాయణ రెడ్డి, ఎం.బాగా రెడ్డి, అల్లాడి పెంటయ్య లాంటి పెద్దలు మార్గదర్వకత్వం వహించారు. ఈసందర్భంగా 'తెలుగు దివ్వెలు' అను ప్రత్యేక సంచికను తెచ్చారు. ఈ సంచికలో 36 మంది కవులు, రచయితల వ్యాసాలు, కవితలు, పద్యాలు, గేయాలు ఉన్నాయి. ఈ ప్రత్యేక సంచికలో ప్రచురణకు తమ రచనలు అందించిన కవులు, రచయితల వివరాలను చాలా క్లుప్తంగా పొందుపర్చారు.

1984లో ఆచార్య తూమాటి దోణప్ప (నాగార్జున విశ్వవిద్యాలయం, గుంటూరు) ప్రోత్సాహంతో తెలుగు సాహిత్యానికి ముస్లింలు అందచేసిన సేవల మీద డాక్టర్‌ షేక్‌మస్తాన్‌ పరిశోధన జరిపారు. ఆ సిద్ధాంత వ్యాసానికి నాగార్జున విశ్వవిద్యాలయం నుండి ఆయన 'పి.హెచ్.డి' పట్టాను పొందారు. ఈ సిద్ధాంత వ్యాసాన్ని 1991లో 'తెలుగుసాహిత్యం: ముస్లింల సేవ' పేరుతో గ్రంథంగా వెలువరించారు. ఈ గ్రంథంలో 1984 వరకు తెలుగులో రాసిన ముస్లిం కవులు, రచయితల వివరాలను సంక్షిప్తంగా పొందుపర్చారు.

డాక్టర్‌ ఎస్‌ షమీవుల్లా 'మైనారిటీ కవిత్వం తాత్విక నేపద్యం' అను గ్రంథాన్ని వెలువరించినా, అది తాత్విక నేపధ్యం మీదా చర్చ వరకే పరిమితమయ్యింది. ప్రముఖ కవి ఎండి. ఖాజా 'ముస్లిం వాదా తాత్విక సిద్ధాంతం-సాహిత్యం' అను గ్రంథాన్ని తెచ్చారు. ఈగ్రంథంలో కూడ ముస్లింవాద తాత్విక సిద్ధాంతం తదితర విషయాల మీద చర్చించారు. అటు తరువాత గత దాశాబ్ది కాలంలో పలు కవితా, కథా సంకలనాలు వెలువడ్డాయి. ఈ సంకలనాలను వెలువరించిన సంకలనకర్తలు, సంపాదాకులలో కొందరు తమకు రచనలు అందచేసిన కవులు, రచయితల చిరునామాలను మాత్రమే పొందుపర్చారు.

                           అవసరమన్పించింది :

ఆ కారణంగా ముస్లిం కవులు రచయితల వ్యక్తిగత, సాహిత్య వివరాలతో కూడిన గ్రంథం తీసుకరావాల్సిన అవసరం ఎంతో ఉందన్పించింది. తెలుగు వాఙ్మయ చరిత్రను వెల్లడిస్తున్న చాలా గ్రంథాలలో ముస్లిం కవులు, రచయితల, అనువాదాకుల వివరాలు చాలా అరుదుగా ఉంటున్నాయి. ఆ కారణంగా ముస్లిం కవులు, రచయితల వ్యక్తిగత, సాహిత్య పరమైన వివరాలతో గ్రంథం తీసుకరావాలన్పించింది. ఈ ప్రయత్మం చాలాశ్రమతో కూడినది, పరిమితులు నాకు తెలుసు. ఆ కారణంగా ముస్లిం కవులు-రచయితలు సృజించిన సాహిత్యం, తీరుతెన్నుల జోలికి వెళ్ళకుండ కవులు-రచయితలు, అనువాదాకుల వ్యక్తిగత-సాహిత్య పరిచయాన్ని సంక్షిప్తంగా నమోదు చేయాలని నిర్ణయించుకుని 'అక్షరశిల్పులు' రూపకల్పనకు సిద్ధపడ్డాను.

                               ప్రోత్సాహం:

అక్షరశిల్పులు గ్రంథాన్ని తీసుకురావాలన్న ఆలోచన బాగుందంటూ ప్రొఫెసర్‌ షేక్‌ మస్తాన్‌ (అలీఘర్‌ ముస్లిం విశ్వవిద్యాలయం, అలీఘర్‌),డాక్టర్‌ యాకూబ్‌ (పరీకక్షల నియంత్రణాధికారి, ద్రావిడ విశ్వవిద్యాలయం, కుప్పం), మహబూబ్‌ బాషా (చరిత్ర శాఖాధిపతి, బాబా సాహెబ్‌ భీంరావ్‌ అంబేద్కర్‌ కేంద్రీయ విద్యాలయం, లక్నో), ఆంధ్రాప్రదేశ్‌ ముస్లింసంక్షేమ సంఘాల సమాఖ్య అధ్యక్షులు డాక్టర్‌ ఎం.ఎ.రహమాన్‌ (విజయవాడ), ప్రముఖకవులు డాక్టర్‌ ఇక్బాల్‌చంద్‌ (బెంగుళారు), డాక్టర్‌ షేక్‌ ముహమ్మద్‌ ముస్తఫా, ఎసి దస్తగిరి (ప్రొద్దుటూరు), సత్యాగ్నిహుసేన్‌ (కడప), ప్రముఖ రచయిత ఇనగంటి దావూద్‌(హైదారాబాద్‌), పాత్రికేయ మిత్రులు అబ్దుల్‌ వాహెద్‌ (గీటురాయి, వారపత్రిక, హైదారాబాద్‌),ఎం.డి షఫీ అహమ్మద్‌ (వార్త, దినపత్రిక, విజయవాడ), కవి మిత్రులు సయ్యద్‌ ఖుర్షీద్‌ (మహబూబాబాద్‌), షేక్‌ కరీముల్లా (వినుకొండ), షేక్‌ లతీఫ్‌ క్టుీ (నెల్లూరు) తదితరులు ప్రోత్సహించారు.

ఆహ్వానం :

ఈ మేరకు రాష్ట్రంలోని ముస్లిం కవులు, రచయితలు, అనువాదాకుల వివరాలను ఆహ్వానిస్తూ 2008 మార్చిలో ప్రకటన విడుదల చేశారు. ఈ ప్రకటన రాష్ట్రంలోని అన్నితెలుగు, ఉర్దూ పత్రికలలో ప్రచురితమైంది. జిల్లా కేంద్రాలలో ఉన్న మిత్రుల సహకారంతో వివిధ దినపత్రికల జిల్లా ఎడిషన్‌లలో కూడ ప్రకటన విడుదల చేయించాను. ఈ ప్రకటన రాష్ట్రంలోని 13 జిల్లాలలోని అన్ని దినపత్రికల జిల్లా ఎడిషన్లలో ప్రచురితం కావడమే కాకుండ ఆయా ప్రాంతాల నుండి వెలువడుతున్నప్రాంతీయ పత్రికలలో కూడ ప్రచురితమై నా ప్రయత్నానికి బహుళ ప్రచారం కల్పించింది. ఆ ప్రయత్నానికి అంతటితో ఆపకుండ నాకు తెలిసిన ప్రతి ఒక్కరికి స్వయంగా తెలియజేశాను, లేఖలు రాశాను. దూరవాణి, సంచారవాణి ద్వారా విషయం తెలుపుతూ వివరాలను కోరాను. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలలో ఉన్న మిత్రుల ద్వారా కూడ ఈ విషయాన్ని కవులు, రచయితలకు తెలియపర్చే ప్రయత్నం చేశాను.

ప్రతిస్పందన

ఈ ప్రయత్నంలో భాగంగా, మార్చి 2008లో ఆరంభించిన సమాచార సేకరణ కార్యక్రమాన్ని 2010 మార్చి చివరి వరకు సాగించాను. ఈ ప్రయత్నంలో భాగంగా కవులు, రచయితలను తమ వివరాలు పంపాల్సిందిగా పలుమార్లు కోరాను. 'అక్షరశిల్పులు' గ్రంథాన్ని వెలువరిస్తున్న విషయం 'ఇండియా' మాసపత్రికలో వరుసగా 2010 ఫిబ్రవరి వరకు ప్రతి మాసం ప్రకటిస్తూ రావడం వలన విషయం తెలుసుకున్నచాలా మంది 'ప్రొఫార్మా' లో నిర్దేశించిన విధంగా తమ సమాచారాన్ని, ఫొటోలను, తమ రచనలను, గ్రంథాలను పంపించారు. ఈ విధంగా 2010 ఏప్రిల్‌ చివరి వారం వరకు కూడ పంపుతూ వచ్చారు. అతి కొద్దిమంది మాత్రం వారి సమాచారం కోరిన ప్రతిసారి పంపుతామని చెబుతూ వచ్చినా, చివరికి పంపలేదు. ఈ విధంగా కొందరు పంపకపోయినా అత్యధికులు సానుకూలంగా ప్రతిస్పందిస్తూ సహకరించడం వలన 'అక్షరశిల్పులు' 2010 ఏప్రిల్‌ మాసాంతానికి పూర్తి చేయగలిగాను.

రూపకల్పనకు అనునసరించిన విధానం

అక్షరశిల్పులు రూపకల్పన విధివిధానాల గురించి పలువురు సాహిత్యవేత్తలను సంప్రదించాను, మిత్రులతో చర్చించాను. ఈ విషయమై చాలా మందితో తర్జనభర్జనలు చేశాను. పర్యవసానంగా వెల్లడైన అభిప్రాయాలు పెద్దలు చేసిన సూచనలు, సలహాలను పాటిస్తూ ఒక నిర్ణయానికి వచ్చాను. ఆ నిర్ణయం ప్రకారంగా, వివిధాంశాల మీద గ్రంథాలు ప్రచురించిన కవులు, రచయితలు, అనువాదాకులతో పాటుగా రాష్ట్రంలో వెలువడుతున్న తెలుగు పత్రికల్లో, కవితా సంకలనాలో కనీసం ఐదు (కవితలు, కథానికలు, కథాలు, వ్యాసాలు) రచనలు ప్రచురితమైఉన్న వారి వివరాలను మాత్రమే పొందుపర్చాలని నిర్ణయించడమైనది. ఆ తరువాత పాటలు, నాటికలు, నాటకాలు రాసిన రచయితలను కూడ పరిగణలోకి తీసుకుని వారి రచనలు ఆకాశవాణి, టీవీ ఛానెల్స్‌లో ప్రసారమైఉన్నా, ప్రజా బాహుళ్యం సమక్షంలో పలుమార్లు ప్రదర్శించి ఉన్నా అటువంటి సాహిత్య ప్రక్రియలను రూపొందించిన రచయితలు, కవులను కూడ 'అక్షరశిల్పులు' లో స్థానం కల్పించాలన్న విధానాన్ని రూపొందించుకుని, పాించాను.

పుస్తకం గురించి :

ఈ పుస్తకంలో మొత్తం మీద 333 కవులు, రచయితలు, అనువాదకుల వివరాలను పొందుపర్చగలిగాను. అక్షరశిల్పులు కోసం 2008 మార్చిలో ప్రకటన విడుదల చేసినప్పటి నుండి చివరి వరకు సుమారు 242 మంది నేరుగా వివరాలు పంపారు. ఈ విధంగా నేరుగా నాకు అందిన, నేను ఇతర గ్రంథాల నుండి సేకరించిన వారి పూర్తి వివరాలను 'ఇందులోని కవులు, రచయితల జాబితా' లో పేర్కొన్నాను. ఈ కవులు, రచయితలు, అనువాదాకులను సాధారణంగా ఏ పేరుతోనైతే పిలుస్తుంటారో ఆ పేర్లను పరిగణలోకి తీసుకుని ఆంగ్ల భాషలోని అక్షర క్రమం ప్రకారం వరుసగా పొందుపర్చాను. ఈ వివరాలు కాకుండ నాకు అందని, నాకు లభించని మరికొందరి కవులు, రచయితల రచనలు వివిధ గ్రంథాలలో ప్రచురితమై ఉన్నదున అటువంటి వారి వివరాలను కూడ ఆయా గ్రంథాలనుండి సేకరించాను. ఆ వివరాలను రచయిత పేరు, రాసిన కవిత/వ్యాసం శీర్షిక, అది ప్రచురితమైన గ్రంథం, ఆ గ్రంథంసంకలనకర్త/ ప్రచురణకర్త తదితర వివరాలను 'అనుబంధం-1' క్రిందపపట్టిక రూపంలో ఇచ్చాను. అక్షరశిల్పులు కోసం సమాచారం కోరుతూ విడుదల చేసిన ప్రకటనను 'అనుబంధం -2' గా, సమాచారం కోసం ప్రత్యేకంగా తయారు చేసిన 'ప్రొఫార్మా' 'అనుబంధం-3' గా పాఠకుల సమాచారం నిమిత్తం పేర్కొన్నాను.

ధన్యవాదాలు :

నా ప్రయత్నాలకు చేయూతనిస్తూ నేను విడుదల చేసిన ప్రకటనను తమ జిల్లాలలోని వివిధా దినపత్రికల్లో ప్రచురితమయ్యేట్టు శ్రద్ధ తీసుకోవడం మాత్రమే కాకుండ, ఆయా జిల్లాల నుండి వెలువడుతున్న ప్రాంతీయ పత్రికలలో కూడ ఈ ప్రకటన ప్రచురితం అయ్యేట్టు మిత్రులు సయ్యద్‌ అబ్దుల్‌ సమద్‌ (నంద్యాల, కర్నూలు), షేక్‌ మహబూబ్‌ జాన్‌ (ఒంగోలు, ప్రకాశం), హబీబుర్‌ రెహమాన్‌ (విజయవాడ, కృష్ణా), ఎం.ఎ అఫ్జల్‌ (చాగల్లు, గోదావరిజిల్లాలు), సయ్యద్‌ మక్సూద్‌ (జహీరాబాద్‌, మెదక్‌), ఎం.డి ఫశీవుద్దీన్‌ (విశాఖపట్నం), ఎం.డి నజీరుద్దీన్‌ (నల్గొండ), షేక్‌ అబ్దుల్లా (శ్రీకాకుళం), వై.ఫక్రుద్దీన్‌ (అనంతపురం),శ్రీమతి సాజిదా సికిందర్‌ (మహబూబ్‌నగర్‌), సికిందర్‌ అలీఖాన్‌ (మదనపల్లి, చిత్తూరు),షేక్‌ అబ్దుల్‌ షుకూర్‌ (నెల్లూరు), షేక్‌ మగ్బూల్‌ బాషా (కడప), షేక్‌ అబ్దుల్‌ అజీద్‌ (హైదారాబాద్‌), ఎం.ఏ సాలార్‌ (వినుకొండ, గుంటూరు), అబుల్‌ ఫౌజాన్‌ (కరీంనగర్‌) సహకరించారు.

నాకు ఉపయుక్తమని భావించిన వివిధ గ్రంథాలను, సమాచారాన్ని,డాక్టర్‌ బద్దేలి ఖాశిం సాహెబ్‌ (ప్రొద్దటూరు, కడప),డాక్టర్‌ యన్‌.రామచంద్ర (పొద్దటూరు), 'సాహిత్యనేత్రం' త్రైమాస పత్రిక సంపాదకులు షేక్‌ బేపారి రహమతుల్లా (శశిశ్రీ) లు అందించారు. ఆ తరువాత విశ్రాంత తెలుగు అధ్యాపకులు, షేక్‌ అలీ (కావూరు లింగంగుంట్ల, గుంటూరు జిల్లా) తన ఇంటికి ఆహ్వానించి తన గ్రంథాలయంలోని గ్రంథాలను, ప్రత్యేక సాహిత్య సంచికలను అందచేయడం మాత్రమే కాకుండ చాలా వివరాలు సేకరించి నాకు పంపారు. రాష్ట్రంలోని పలు ప్రాంతాలలో ఉన్న కవులు-రచయితల సమాచారం రాబట్టడంలో ఆయా ప్రాంతాలలోని షేక్‌ అబ్దుల్‌ హకీం జాని (తెనాలి), సయ్యద్‌ ఖుర్షీద్‌ (మహబూబాబాద్‌),ఎం.ఎ. సాలార్‌ (వినుకొండ), ఎండి. ఉస్మాన్‌ ఖాన్‌ (ఎన్‌. జగన్నాధాపురం), ఎస్‌.పి గఫార్‌(పోరుమామిళ్ళ) లాంటి మిత్రులు సహకరించారు. నా ప్రకటన వివిధ ఉర్దూ పత్రికల్లోకూడ ప్రచురితం అయ్యేట్టుగా రచయిత అబుల్‌ ఫ్ధజాన్‌ (కరీంనగర్‌) శ్రద్ద తీసుకున్నారు. ఈ విధాంగా నాకు సహాయపడిన పత్రి ఒక్కరికి నా ప్రత్యేక ధన్యవాదాలు.

నా వినతి మేరకు అక్షరశిల్పులు గ్రంథానికి 'ముందుమాట' రాసిచ్చిన డాక్టర్‌ షేక్‌ మస్తాన్‌ (అలీఘర్‌), 'శుభాభినందనలు' తెలిపిన గురుతుల్యులు, ప్రముఖ పాత్రికేయులు డక్టర్‌ పొత్తూరి వెంకటేశ్వరరావు (హైదారాబాద్‌) లకు, నా ప్రతి పుస్తకాన్ని ఎంతో ఓపికతో చదివి విలువైన సలహాలు-సూచనలు అందచేస్తూ సహకరిస్తున్నమిత్రులు, సద్విమర్శకులు, ప్రముఖ రచయిత, నా ఆప్తమిత్రులు పెద్ది సాంబశివరావు (గుంటూరు), ఈ గ్రంథానికి చక్కని ముఖపత్రాలంకరణ గావించిన ప్రముఖ చిత్రకారులు వజ్రగిరి జెస్టిస్‌ (వినుకొండ),ఈ పుస్తకం గెటప్‌కు సంబంధించి పలు సూచనలు చేసిన ప్రముఖ చిత్రకారులు అబ్దుల్లా (విజయవాడ), గ్రంథ ప్రచురణకు సాంకేతిక సహాయం అందించిన మిత్రులు ఎన్‌. జయరాజ్‌(శ్రీజయదీప్తి గ్రాఫిక్స్‌, వినుకొండ) గార్లకు నా కృతజ్ఞతలు.

ఈ గ్రంధం రూపుదిద్దుకోడానికి అవసరమైన సమాచారాన్ని పంపించి నా ప్రయత్నం సఫలమయ్యేందుకు సహకరించిన కవులు-రచయితలు-అనువాదకులు, నా ప్రతిప్రయత్నానికి చేదోడు-వాదోడుగా నిలిచే నా భార్య శ్రీమతి షేక్‌ రమిజా బాను, అక్షరశిల్పులు ప్రచురణ బాధ్యత స్వేకరించిన 'ఆజాద్‌ హౌస్‌ ఆఫ్‌ పబ్లికేషన్స్‌' ఛైర్మన్‌ హాజీ షేక్‌ పీర్‌ అహమ్మద్‌ (హైదారాబాద్‌) గార్లకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను.