అక్కన్న మాదన్నల చరిత్ర/ప్రకరణము 21

వికీసోర్స్ నుండి

ప్రకరణము ౨౧ - మరల ముట్టడి ప్రయత్నములు

మేనెల 16-వ తారీఖున కోటలోని కావలిసైన్యము తటాలున వెలికివచ్చి వెలుపలనున్నవారిని కొట్టుటకు ఆరంభించెనని పాదుషాకు సమాచారము వచ్చెను. వెంటనే ఇజత్‌ఖా నను వాఁడు వారిమీఁదికి పోయెనుగాని ఈ యుద్ధములో మొగలాయీలు డెబ్బదిమంది చనిపోయిరి. దాక్షిణాత్యులు ఎందఱు చనిపోయిరో తెలియదు. తర్వాత కోటలోపలివారు పెద్ద ఫిరంగీ నొకదానిని కోటగోడమీఁదికి తెచ్చి దానిని సరిగా పాదుషా యొక్క శిబిరమునకు గుఱిచేసి కొన్నిగుండ్లు కాల్చిరి. అందు కొన్ని పాదుషా నిద్రించు గుడారమునుకూడ ప్రవేశించినవి; కొన్ని చుట్టును తాఁకుచుపోయినవి. పాదుషా భయపడి తత్క్షణమే తనగుడారమునకుముందు రక్షకముగా పందిళ్లను కట్టుట కేర్పాటు చేయించెను. ఎత్తుగోడలవంటి వానినికట్టి వానిమీఁద ఫిరంగుల నెక్కించి కోటగోడమీఁది వారిని కూల్పుమనెను. కావలిసైన్యము విడిసియున్నచోటి కెదటిభూమి పల్లమైనందున పాదుషాకోరిక సాధించుటకు కుదరలేదు. అంతట పాదుషా రెండువందల తోలుకవచములను చేయించి సాహసికులకు పంచి పెట్టించెను. గట్టినిచ్చెన నొకదానిని తెప్పించి దానిని కోటగోడలను సాధించు కట్టడముల కానించి తానే ఎక్కుటకు ప్రయత్నించుచు కాలుజారి పడఁబోయి తప్పించుకొనెను. ఈపని పాదుషా కావలయుననియే చేసెను. ఆతఁ డంతగట్టి పట్టుదల చూపనిచో ఇతరులు సాహసములు చూపరని యాతనినమ్మకము.

పాదుషాయొక్క ప్రయత్నములనుచూచి ఖాజీలందఱకు పెద్దయైన ఖాజీఅబ్దుల్లా పాదుషాకడకువచ్చి, శరణాగతుఁడైన ముసల్మానును కొట్టుట మహమ్మదీయాచారమునకును, ఖొరాను ధర్మమునకును విరుద్ధమని పాదుషాతో మనవిచేయఁగా నాతఁడు ఆ ఖాజీని స్కంధావారమునుండి దూరముగా తఱిమివేసెను. ఇట్లే అవమానితులైన ఖాజీలు కొందఱు మక్కాకుపోయిరి.

ఇట్లుండఁగా జూనునెల 16-వ తారీఖున రాత్రి గొప్ప తుపాను కొట్టెను. మొగలాయీవారి స్కంధావార మంతయు నానావిధముల బీభత్సమాయెను, డేరాలును గుడిసెలును చపారములును చిందరవందరగా నెగిరిపోయినవి. కొన్ని తడిసి ముద్దయైనవి. సర్వత్ర బురదరేఁగి పడినగుర్తులు కనఁబడుచుండినవి. పాదుషా వారి కార్ఖానాలలోని సామానులన్నియు వెల్లువలో కొట్టుకొని పోయినవి. సొరంగములందును పల్లములలోను దాఁగియుండినవారందఱును మునిఁగిపోయిరి, గాలిని వానను లక్ష్యముచేయక కోటమీఁదికి లగ్గలెక్కుటకు ప్రయత్నించి ముందునకు సాగినవారందఱును ప్రవాహములో కొట్టు కొనిపోయిరి. వారెంతమొత్తుకొనినను వారిని కాపాడుట అసాధ్యమాయెను. కొండమీఁదను కోటగోడలమీఁదను దిబ్బల మీఁదను ఉండినవారుమాత్రమే ప్రాణములను దక్కించుకొనిరి. ఫిరంగికొఱకు కట్టినదిబ్బ కరఁగి నేలమట్టమై పోయెను.

సూర్యోదయమాయెను. గోలకొండ కోటలోపలి సిబ్బంది ఆవులించుచు మేల్కొనెను. తత్క్షణమే ఈ యవకాశమును పూర్తిగా నుపయోగించుకొనుటకు శత్రువులమీఁద కుఱికెను. పాదుషాయెుక్క స్కంధావారములో మిగిలినదానినంతయు ధ్వంసముచేసెను. మొగలాయీ సిఫాయీలనేకులు చంపఁబడిరి. అనేకులు పట్టుబడిరి. మిగిలినవారు తమ ప్రాణములను కాపాడుకొనుటకు పాఱిపోయిరి. ఈ విషయమంతయు తెలియఁగానే పాదుషా ఫిరోజుజంగు ఏమాయెనని యడిగెను. పాదుషా శిబిరమునకును కోటకును నడుమనున్న యొకమసీదులో కొందఱు యోధులతో నాతఁడు తలదాఁచుకొని యున్నాఁడనియు, మూసీనది వెల్లువలు పాఱుచుండినందున శత్రువుల మీఁదికి పోవుట కాతనికి అవకాశము లేకుండెననియు చెంత నున్నవారు చెప్పిరి. సిఫాయీలను దాఁటించుట కుపయోగపడు చుండిన పడవ ఎచ్చటను కానరాకుండెను. పాదుషా హయత్ ఖానను వానిని ఎనుబదిడెబ్బదియేనుఁగులతోపోయి మూసీనదిని దాఁటి వానివీపున నాసర్దారులను తెమ్మని యాజ్ఞాపించెను. వాఁడట్లే బయలుదేరెనుగాని ప్రవాహము చాలవేగముగా నుండినందున ఏనుఁగులకు దాఁటుటకు అదనుచిక్కక ఆ దినము ఆర్థరాత్రము వఱకును, ఆతఁడు ప్రయత్నించి వెనుకకుపోయెను. అబ్దుల్‌రజాక్‌లారీ తాను ఖైదు పట్టుకొనిపోయిన యా మొగలాయీ సర్దారులను తానాషాకడకు కొనిపోయెను. గోలకొండసుల్తాను వెంటనే వారికి సేదదేర్చుకొను సదుపాయములు చేయించి మూఁడుదినములు తనకడ నుంచుకొని చక్కని భోజనాదికము లొడఁగూర్చి మర్యాదచేసి వారి చిత్తవిశ్రాంతి తీర్చెను. గొప్పదుస్తులిచ్చి తాను నిలువయుంచుకొనియుండిన ధాన్యమును, తనకడనుండిన తుపాకిమందును యుద్ధపరికరములనుచూపి, తనకు కావలసినదానికన్నను హెచ్చుగా వస్తు సంచయము కలదనియు కోటవదలననియు నొకజాబువ్రాసి దానిని పాదుషా కిమ్మని ప్రమాణపూర్వకముగా కోరి గౌరవముగా వీడ్కొలిపెను.

వీరందఱును పాదుషాకడకుపోయిరి. తానాషాసుల్తాను మర్యాదచేయఁగా పాదుషావారిని అవమానపఱచెను. తానాషాకడ బహుమతు లందినందులకు చాలగర్హించెను. వారి బిరుదములను తీసివేసి పదవులను తగ్గించెను. రాత్రి మూఁడవ జాములో తానాషాజాబును స్వయముగానే చదువుకొనెను. జాబులో పాదుషాహృదయము కరఁగునట్లు తానాషాప్రార్థించి యుండెను. మనసు కరఁగినవానివలెనై సార్‌బరాఖాౝ అనువానితో ‘మాయాజ్ఞలను తిరస్కరించునభిప్రాయము అబుల్ హసనుకు లేనియెడల అతఁడు చేతులుజోడించుకొని మాకడకు వచ్చిన మాయౌదార్యమునకు తగినట్లు మేము చేయఁగలము.’ అని పాదుషా అనెను. ఇట్లొకవైపు చెప్పుచునే ఏబదివేల గోనెసంచులకు ఆజ్ఞాపించెను. క్రీ. శ. 1687 సం. జూౝ నెల 20-వ తారీఖునాటికి గోలకొండ కోటగోడల క్రిందికి మూఁడు సొరంగములు త్రవ్వఁబడినవి. వాని నిండుగ తుపాకిమందు నిండింపఁబడినది. తుపాకి మందుకు నిప్పంటించుటకు కొంతముందు మోర్జాలవారు గొప్ప శబ్దము చేయుచు వీరావేశముతో యుద్ధమునకు వచ్చుచున్నట్లు ఉండినయెడల కోటలోపలి రస్తుసిబ్బంది ఇది యేవెూ యని గుంపుగా గోడలమీఁదికి వత్తురనియు తుపాకిమందు పేలినవెంటనే మొత్తముగా చత్తురనియు పాదుషా ఆలోచించి అట్లు చేయుమని ఆజ్ఞాపించెను.

కాని మొగలాయీల యీప్రయత్నమంతయు అబ్దుల్ రజాక్ ఎట్లో గ్రహించెను. ఆతఁడును ఆతని యనుచరులును ఎట్లో ప్రయత్నించి ఆ ప్రదేశమును కనుఁగొనిరి; గోలకొండ కోటలోపలినుండి త్రవ్వి ఆ తుపాకిమందును పూర్తిగా రెండు సొరంగములనుండి తీసివేసి ఆ ప్రదేశమంతయు నీరుపాఱించి మట్టితో కప్పివేసిరి. మిగిలినదానినంతయు నీటితో తడిపిరి. ఇంతలో బయట మొగలాయీలు కోటపట్టునట్టి హాహాకారములు చేయఁగా కొందఱు కోటగోడలమీఁదికిపోయి చూడసాగిరి. పాదుషా ఏర్పాటుప్రకారము సర్దారులు ఈల వేయఁగానే మందులవారు మొదటి సొరంగముకడ నిప్పంటించిరి కొంత మందు పోయినందుచేతను కొంత తడిసినందుచేతను మొగలాయీలకు చేర్పుగానున్న భాగమందు మందు బాగుగా నుండినందున వారివైపే పేలినది. మొగలాయీలే ఎక్కువ మంది కాలిచిచ్చిరి. గోడలో కొంతభాగము కూలినందున అగడితకును దానికి నడుమ చాలమంది సమాధినందిరి. కోటమీఁదివారికి అపాయము తక్కువ. మొగలాయీలు చచ్చిన వారిసంఖ్య 1098 అని లెక్క తేలినది.

తా వెుదురుచూడనివిధమున అందఱు చనిపోయినందులకు మొగలాయీవారికి మతి పోయిన ట్లాయెను. తుపాకి మందువలని పొగయు దుమ్మును స్కంధావార మంతటిని ఆక్రమించి అంధకార బంధురముగా చేసెను. గోలకొండవారు మొగలాయీలగోడును చూచి తత్క్షణమే సన్నాహముతో పాదుషావారి సైన్యము మీఁదపడి వారిమోర్జాలను కొన్నిటిని పట్టుకొనిరి. పాదుషా కీ విషయము తెలియఁగానే గోలకొండవారిని దండింప నాజ్ఞాపించెను. ఘోరయుద్ధమై చాల జననాశమైన తర్వాత మోర్జాలను మరల మొగలాయీవారు నిలుపుకొనఁగలిగిరి. ఇంతలో పాదుషా రెండవ సొరంగమునకు నిప్పంటింప నాజ్ఞాపించెను. వెంటనే కోటలోపలనుండి కొన్ని వేల రాళ్లు బండలు పక్షులవలె రివ్వురివ్వున వచ్చి లెక్కలేని మొగలాయీల తలలనుకొట్టగా వారి ఏడ్పులును రొదలును మిన్నుముట్టుచుండినవి. ఈమాఱు మొగలాయీలు రెండువేలయేడుగురు మరణించిరి. మరల కోటలోని పౌజు బయలు దేరివచ్చి మోర్జాలను పట్టుకొన యత్నించినవి. ఫిరోజుజంగు స్వయముగా వచ్చి ఘోరయుద్ధము చేసినను గోలకొండవారు తగ్గలేదు. ఆఱుగురు మొగలాయీవీరులు మరణించిరి. ఈ రెండవ దురంతవార్త పాదుషా చెవిని పడఁగానే ఆతనికోపాగ్ని ప్రజ్వరిల్లసాగెను. తత్క్షణమే పల్లకియెక్కి రణరంగమునకు వచ్చెను. మహాశూరులను యోధాగ్రేసరులను ఒక చోట చేరవలసినదని పాదుషా ఆజ్ఞాపించెను. అందఱును ఆయత్తపడుచుండిరి. పాదుషా పల్లకి వచ్చుచుండఁగా నొకఁడు కోటగోడనుండి పేల్చిన తుపాకి దెబ్బకు పల్లకి మోయువారిలో నొకనిచేయి విరిగిపోయినది. పాదుషామాత్రము చలింపక పల్లకిని పొమ్మనెను. ఫిరోజుజంగు మొదలైనవారు పాదుషాయొక్క దృఢ సంకల్పమునుచూచి తమపరాక్రమములను చూపసాగిరి.

ఇంతలో దైవాధీనముగా మరల నొక తుపాను చెలరేఁగినది. మొగలాయీలు త్రవ్వుకొనిన సొరంగములే వారికి నదులవలె అడ్డుతగిలినవి. ఫిరంగులుంచు దిబ్బలన్నియు కరఁగి పోయినవి. ప్రవాహము క్షణక్షణమునకు ఎదురెక్కుచుండెను. మరల గోలకొండ ఫౌజులవారు కోట వెలువడి మోర్జాల వారిమీఁదికి వచ్చిపడిరి. మొగలాయీల చిన్న ఫిరంగుల నన్నిటిని లాగుకొని పోయిరి. బరువైన వానిని మేకులు కొట్టి నిరుపయోగము చేసిరి. అగడితలో మొగలాయీలు వేసిన మట్టి మూటలనుతీసి కోటగోడలో పడిపోయిన చోటులలో పెట్టించిరి. ఇంతలో నొకఁడు పాదుషాగారి పల్లకిముందు నడచుచుండిన గొప్ప యేనుఁగును, నలువదివేల రూపాయల వెలగలదానిని, ఫిరంగితో కొట్టి చంపెను. ఎందుచేతనో వారెవ్వరును పాదుషామీఁదికి ఫిరంగులను కాల్పలేదు. అది తానాషా ఆజ్ఞ గానుండును. ఇంతలో సాయంకాల మాయెను. మొగలాయీలు చేయునది లేక నాఁటి యుద్ధమును మానుకొని తమ గుడారముల నాశ్రయించిరి.

మఱునాఁడు తెల్లవారఁగానే పాదుషా దిగ్విజయము బయలుదేరెను. మూఁడవ సొరంగమునకు నిప్పంటించునప్పడు తానే సమీపమున నుండవలయునని ఢిల్లీశ్వరుని సంకల్పము సముద్రమువలె మొగలాయీసైన్యము ఘోషతో బయలుదేఱెను. కవచములు ధరించిన యోధులు తిమింగిలములవలె నుండిరి. ధూళిధూసరితమైన యాప్రపంచమున యోధుల శిరస్త్రాణములు నీటిమీఁది బుడగలవలె మినమిన లాడుచుండినవి. పాదుషా నల్లని గుఱ్ఱముమీఁద నెక్కి యమధర్మరాజువలె వచ్చుచుండెను. సర్దారులందఱును పాదుషా వెనుక వారివారి తరగతుల ప్రకారము వచ్చుచు తానాషాను పట్టు యమకింకరులవలె నుండిరి. కొందఱు సిఫాయీల దుస్తులు ఎఱుపుగానే యుండెనుగాని మొగములు మాత్రము దుఃఖావృతమై వెలవెల పాఱియుండెను. కొన్ని గుఱ్ఱములు వాని యస్థిపంజరములవలెను వానిమీఁది కవచములు చర్మముల వలెను వానికి కాఁబోవు దుర్దశను సూచించునట్లుండెను.

కోటగోడలను సమీపించినంతట పాదుషా మూఁడవ సొరంగమునకు నిప్పంటించుటకు ఉత్తరువిచ్చెను. అది ఎంత మాత్రము మండలేదు. ఒక నిప్పురవ యైనను రాలేదు. గోలకొండవారు మందును పూర్తిగా తీసివేసి వత్తిని సైతము కత్తి రించివేసి యుండిరి. మొగలాయీ సిబ్బంది యంతయు మొగము వ్రేలవేసికొని వెనుదిరిగి పోయెను. ఫిరోజుజంగునకు రెండు బాణములుతగిలి మంచి గాయమాయెను. ఇంక ననేకులకు దెబ్బలు తగిలినవి. కోట పట్టుపనిని పాదుషా తనకుమారుఁడు ఆజంషాకు ఒప్పగించెను.

తర్వాత కొన్ని దినములవఱకు తానాషాసైన్యములు మొగలాయీలను డీకొనలేదు. వారును కోటను పట్టుటకు రాలేదు. కొందఱు సర్దారులు పాదుషా కడకుపోయి హైదరాబాదు మొదలైన ప్రధాన నగరములను పట్టుకొని దేశమును స్వాధీనము చేసికొనినయెడల తానాషా కొన్నాళ్లు కోటలోనుండి పోరాడి తుదకు ఆహారములేనందున వశపడునని మనవి చేసిరి. వెంటనే పాదుషా కొందఱు అధికారులను ప్రధాన ప్రదేశములకుపంపి తనజాబులలోను కచేరీ కాగితములమీఁదను ఫర్మానాలలోను దరఖాస్తులయందును హైదరాబాదనుపేరు వ్యవహరింపక దానికి దార్-ఉల్-జిహాద్ అని క్రొత్తపేరు వ్రాయవలయునని యాజ్ఞాపించెను. అబ్దుల్‌రహీం ఖానను వానినిపన్నులు మొదలైన వసూలుపనులయందు నియమించి మహమ్మదీయేతరుల యాచారవ్యవహారములను వేటిని సాగనీయక దేవాలయములను కూల్పించి మసీదులు కట్టుట కేర్పాటుచేసెను.