అంబటి వెంకన్న పాటలు/మబ్బులు, బతుకమ్మ పాట

వికీసోర్స్ నుండి

బతుకమ్మ పాట



బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో
బంగారి గౌరమ్మ ఉయ్యాలా..
ఉయ్యాల ఉయ్యాల ఉయ్యాలో
ఉయ్యాల ఊగంగ ఇయ్యాలా... ॥బతుకమ్మ॥

సినుకు రాలిన తడవ ఉయ్యాలో
మనసు విరిసేనమ్మ ఉయ్యాల
రంగుల రంగులపూలు ఉయ్యాలో
రంగవల్లులాయే ఉయ్యాల
భూతల్లి కొప్పున ఉయ్యాలో
పొన్నగంటి పూలు ఉయ్యాల ॥బతుకమ్మ॥

బంగారు వన్నెల ఉయ్యాలో
తంగేడు పువ్వు దెచ్చి ఉయ్యాలా
శివుడు మెచ్చిన పువ్వు ఉయ్యాలో
జిల్లేడు పువుదెచ్చి ఉయ్యాలా
బతుకమ్మనే జేసి ఉయ్యాలో
సూడసక్కధనము ఉయ్యాలా ॥బతుకమ్మ॥

బాయిబొందలు దిరిగి ఉయ్యాలో
ఎర్రదుబ్బలు దిరిగి ఉయ్యాలా
ముద్దుముద్దు పూలు ఉయ్యాలో
పొద్దుగూకులేరి ఉయ్యాలా
ఇల్లు నిండిన పూలు ఉయ్యాలో
సాపసుట్టు బేర్చి ఉయ్యాలా ॥బతుకమ్మ॥

ఇరగబూసిన గునువు ఉయ్యాలో
గుణముగల్లాదమ్మ ఉయ్యాలా
గోరెంక పువ్వుల్లో ఉయ్యాలో
తేనెటీగల పాట ఉయ్యాలా
ఆటపాటల పల్లె ఉయ్యాలో
తిర్ణాల రథమాయె ఉయ్యాలా ॥బతుకమ్మ॥

ఆరంపది రోజులు ఉయ్యాలో
సేను సెలకలు దిరిగి ఉయ్యాలా
సోంపు ఏరుకొచ్చి ఉయ్యాలో
ఇల్లంత పువ్వేసి ఉయ్యాలా
తీరొక్క రంగద్ది ఉయ్యాలో
బతుకమ్మనే జేయ ఉయ్యాలా ॥బతుకమ్మ॥

పసుపుముద్దన గౌరి ఉయ్యాలో
పంచవన్నెల తల్లి ఉయ్యాలా
పత్తిహారమేసి ఉయ్యాలో
పైటకొంగుజుట్టి ఉయ్యాలా
సింగుడుడ్డిన కొండ ఉయ్యాలో
నేలమీదా నిండె ఉయ్యాలా ॥బతుకమ్మ॥

ఉష్కలబుట్టింది ఉయ్యాలో
ఉష్కల బెరిగింది ఉయ్యాలా
పొన్నగంటి తాల్లు ఉయ్యాలో
పోకలున్న వనము ఉయ్యాలా
తీరొక్క పువ్వులో ఉయ్యాలో
కొటొక్క అందము ఉయ్యాలా ॥బతుకమ్మ॥

గౌరమ్మ గాంభీరం ఉయ్యాలో
తాంబాలము నిండె ఉయ్యాల
పట్టుబట్టలుగట్టి ఉయ్యాలో
పడుసుపిల్లలు మురిసె ఉయ్యాలా
గౌరినీ జూడంగ ఉయ్యాలో
నీలిమబ్బురాదా ఉయ్యాలా ॥బతుకమ్మ॥

గంధాలుబుయ్యంగ ఉయ్యాలో
గంతులేసే పిల్లలు ఉయ్యాలా
రింగన్న పురుగోలె ఉయ్యాలో
రివ్వున రివ్వున దిరిగె ఉయ్యాలా
అమాస సీకట్లో ఉయ్యాలో
మినుగురు పూలయ్యె ఉయ్యాలా ॥బతుకమ్మ॥

మొగపిల్లలా కొరకు ఉయ్యాలో
పచ్చిపసరు దాగే ఉయ్యాలా
పట్నాలలో జూడ ఉయ్యాలో
కన్నఏశమాయె ఉయ్యాలా
కట్నమియ్యలేక ఉయ్యాలో
కడుపులోనె బొంద ఉయ్యాలా ॥బతుకమ్మ॥

ఆడజన్మలు గౌరి ఉయ్యాలో
సృష్టికే మూలంబు ఉయ్యాలా
గౌరమ్మనెత్తంగ ఉయ్యాలో
ఆడబిల్లలు లేక ఉయ్యాలా
నిన్నుమోసే తల్లి ఉయ్యాలో
నిమిషమన్న దలిసెఉయ్యాలా ॥బతుకమ్మ॥

తల్లిగౌరిని జూడ ఉయ్యాలో
రెండుకండ్లు జాలవు ఉయ్యాలా
తల్లిగారింటికి ఉయ్యాలో
ఎల్లిపోతమంటు ఉయ్యాలా
అత్తమామల మీద ఉయ్యాలో
ఆడపిల్లలు అలిగె ఉయ్యాలా ॥బతుకమ్మ॥

మలీద ముద్దలు ఉయ్యాలో
సద్దిగట్టి మనమూ ఉయ్యాలా
సద్దబూరెలు బెట్టి ఉయ్యాలో
గౌరి రథము జేయ ఉయ్యాలా
అయ్యగారిని బిలువ ఉయ్యాలో
అరిగిపోయిన మంత్రము ఉయ్యాలా ॥బతుకమ్మ॥

గాజు మెట్టెలు గౌరి ఉయ్యాలో
ముత్తయిదు భాగ్యము ఉయ్యాలా
లోకానికందించి ఉయ్యాలో
సోకాలు బాపేవు ఉయ్యాలా
మహిమ గల్ల గౌరి ఉయ్యాలో
మదినిండ నిలిసేవు ఉయ్యాలా ॥బతుకమ్మ॥

మముగన్న మాతల్లి ఉయ్యాలో
ఆదిశక్తివి తల్లి ఉయ్యాలా
లోకమాతవు తల్లి ఉయ్యాలో
ఎంత ఓపిక తల్లి ఉయ్యాలా
పసుపు కుంకుమ లిచ్చిఉయ్యాలో
పచ్చంగ జూసేవు ఉయ్యాలా ॥బతుకమ్మ॥

శివపార్వతుల జంటఉయ్యాలో
సూడసక్కనిదమ్మ ఉయ్యాలా
శివునెంట గదిలింది ఉయ్యాలో
భూలోకమేగింది ఉయ్యాలా
ఎదిక్కు జూసినా ఉయ్యాలో
దిక్కులేని జనము ఉయ్యాలా ॥బతుకమ్మ॥

కష్టజీవుల జూసి ఉయ్యాలో
కన్నీరు బెట్టింది ఉయ్యాలా
సిరిగల్ల గౌరమ్మ ఉయ్యాలో
ఈతిబాధలు దీర్చ ఉయ్యాలా
పతిదేవు ఒడిలోన ఉయ్యాలో
అలకబూని అడిగె ఉయ్యాలా ॥బతుకమ్మ॥

కోపగొంటి శివుడుఉయ్యాలో
కోడెనాగు శివుడు ఉయ్యాలా
వనమెల్లా దిరిగిండు ఉయ్యాలో
జనమల్ల గలిసిండుఉయ్యాలా
జంజకిడిసిన వాడు ఉయ్యాలో
ఎట్ట ఏగుతవమ్మ ఉయ్యాలా ॥బతుకమ్మ॥

భోళాశంకరుడమ్మ ఉయ్యాలో
మాయలోడు తల్లి ఉయ్యాలా
గంగకోసమమ్మా ఉయ్యాలో
జంగమేశమేసి ఉయ్యాలా
వాగువంకలు దిరిగిఉయ్యాలో
జగమంత గాలించె ఉయ్యాలా ॥బతుకమ్మ॥

గంగనే దెచ్చిండు ఉయ్యాలో
జడలోన జుట్టిండు ఉయ్యాలా
ముద్దు ముద్దుగ జూసి ఉయ్యాలో
పొద్దునే మరిసిండు ఉయ్యాలా
గారంగ జూసిండు ఉయ్యాలో
గంగలో మునిడిండు ఉయ్యాలా ॥బతుకమ్మ॥

గంగమ్మనే జూడ ఉయ్యాలో
ఆకలి దూప బాసే ఉయ్యాలా
సెయ్యెత్తి మొక్కంగ ఉయ్యాలో
సెలిమల్లో ఊటాయె ఉయ్యాలా
కొండల్లో గుట్టల్లో గంగమ్మనీ
తొంగిచూసే ధైర్యమేడున్నది ॥బతుకమ్మ॥

పొద్దుమాపు లేక ఉయ్యాలో
హద్దుపద్దు లేక ఉయ్యాలా
ఆటలాడే సూడు ఉయ్యాలో
తీటకొయ్యలాకు ఉయ్యాలా
పూటగడుపుకుంట ఉయ్యాలో
గౌరమ్మనే మరిసె ఉయ్యాలా ॥బతుకమ్మ॥

జాడదెలిసిన గౌరి ఉయ్యాలో
అగ్గి గుగ్గిలమయ్యి ఉయ్యాలా
పొయిలోని నిప్పుల్లో ఉయ్యాలో
ఉప్పుగల్లయ్యింది ఉయ్యాలా
చిటపట పట మంటు ఉయ్యాలో
పండ్లు గొరికీనాది ఉయ్యాలా ॥బతుకమ్మ॥

ఉగ్రరూపము దాల్చి ఉయ్యాలో
మీదికురికెను గౌరి ఉయ్యాలా
ఏడబుట్టినావే ఉయ్యాలో
ఈడకొచ్చినావు ఉయ్యాలా
శివమెత్తి గౌరమ్మ ఉయ్యాలో
జుట్టుబట్టినదమ్మ ఉయ్యాలా ॥బతుకమ్మ॥

ముక్కంటి శివుడినే ఉయ్యాలో
ముప్పు తిప్పలు బెట్టి ఉయ్యాలా
ఏడేడు లోకాలు ఉయ్యాలో
సప్తసంద్రాలల్ల ఉయ్యాలా
బుడుగు బుడుగున ముంచి ఉయ్యాలో
నెత్తినెక్కిన గంగ ఉయ్యాలా ॥బతుకమ్మ॥

ఎగిరి దునికి గంగ ఉయ్యాలో
ఎదురు దిరిగెను గంగ ఉయ్యాలా
సిగురంత అమ్మంగ ఉయ్యాలో
ఇండ్లు దిరిగిన దానివి ఉయ్యాలా
పచ్చ గూరలు అమ్మి ఉయ్యాలో
పతివత వైనావే ఉయ్యాలా ॥బతుకమ్మ॥

మాటమాట బెరిగి ఉయ్యాలో
శాపనార్ధాలాయె ఉయ్యాలా
బతుకమ్మ పండుగ ఉయ్యాలో
ఎట్లజేస్తరో జూస్త ఉయ్యాలా
సుక్కనీరు లేక ఉయ్యాలో
భూమి బగ్గున మండు ఉయ్యాలా ॥బతుకమ్మ॥

ఎంత దిరిగిన గాని ఉయ్యాలో
పువ్వు దొరకదు సూడు ఉయ్యాలా
ఎంగిలి పువ్వుతోనే ఉయ్యాలో
ఎండిపోతవు నువ్వు ఉయ్యాలా
ఆడి ఆడి నిన్ను ఉయ్యాలో
గుడిమీద బారేస్తరుయ్యాలా ॥బతుకమ్మ॥

గంగమ్మ గౌరమ్మ ఉయ్యాలో
ఈరంగ మాడిండ్రు ఉయ్యాలా
ఈరబోసుకోని ఉయ్యాలో
జగడాలు జేయంగ ఉయ్యాలా
ఎడేడు లోకాలు ఉయ్యాలో
గడగడ లాడేను ఉయ్యాలా ॥బతుకమ్మ॥

మాట కోటలు దాటి ఉయ్యాలో
సవితి పోరు జరిగే ఉయ్యాలా
సాపెండ్లు బెట్టంగ ఉయ్యాలో
దుమ్మెత్తి పోసిండ్రు ఉయ్యాలా
సంద్రాలు హోరె ఉయ్యాలో
భూమి నెర్రెలిచ్చే ఉయ్యాలా ॥బతుకమ్మ॥

ఆ పోరు జూసిన సామి ఉయ్యాలో
నోట మాట రాలె ఉయ్యాలా
కైలాటమే జూసి ఉయ్యాలో
కైలాసమె నవ్వె ఉయ్యాలా
ఇల్లు ఇడిసి సామి ఉయ్యాలో
దేశ సంచారయ్యే ఉయ్యాలా ॥బతుకమ్మ॥

ఒక్కటంటివి తల్లి ఉయ్యాలో
వందమాటలు బడితివి ఉయ్యాలా
వద్దు వద్దు తల్లి ఉయ్యాలో
పార్వతీ మాతల్లి ఉయ్యాలా
గయ్యాలి గంగతో ఉయ్యాలో
ఎగలేవు తల్లి ఉయ్యాలా ॥బతుకమ్మ॥

పసుపు వన్నె తల్లి ఉయ్యాలో
పసిడి కాంతుల తల్లి ఉయ్యాలా
బతుకు బాటలోన ఉయ్యాలో
బంధాలు తెగకుంట ఉయ్యాలా
శాపాలు దొలగించి ఉయ్యాలో
సల్లంగ జూసేవు ఉయ్యాలా ॥బతుకమ్మ॥

మనసున్న మాతల్లి ఉయ్యాలో
మాటబడనీదమ్మ ఉయ్యాలా
ఇంటోడు దిగిరాక ఉయ్యాలో
ఇన్ని మాటలాయె ఉయ్యాలా
మబ్బుగమ్మిన మనసు ఉయ్యాలో
మారు బలకాలేదు ఉయ్యాలా ॥బతుకమ్మ॥

అంతలోనే గంగ ఉయ్యాలో
ఆగమాగం జేసి ఉయ్యాలా
కోపంతో రగిలింది ఉయ్యాలో
కొరివోలె లేసింది ఉయ్యాలా
పొర్లిపొర్లి గంగ ఉయ్యాలో
తెర్లు తెర్లు జేసే ఉయ్యాలా ॥బతుకమ్మ॥

కను సూపు మేరల్లో ఉయ్యాలో
కానరాదు గంగ ఉయ్యాలా
దిక్కులన్నీ దిరుగ ఉయ్యాలో
సుక్కనీరు లేదు ఉయ్యాలా
కచ్చెకైనా గంగ ఉయ్యాలో
కాలు దువ్వి కదిలే ఉయ్యాలా ॥బతుకమ్మ॥

ఏడ దాసుకుందో ఉయ్యాలో
ఏ రూపు గట్టిందో ఉయ్యాలా
మల్లి సూడక గంగ ఉయ్యాలో
మాయమయ్యెను ఉయ్యాలా
పౌరుషాల గంగ ఉయ్యాలో
పాతాళమే జేరే ఉయ్యాలా ॥బతుకమ్మ॥

పెత్తరమాసనే ఉయ్యాలో
ఎల్లిపోయినంక ఉయ్యాలా
తంగెళ్ళు జిల్లెళ్ళు ఉయ్యాలో
ఇరగ బూసినయమ్మ ఉయ్యాలా
ఇదిఏమి సిత్రంబు ఉయ్యాలో
ఎందుకిట్ల జరిగే ఉయ్యాలా ॥బతుకమ్మ॥

గౌరమ్మ తల్లిని ఉయ్యాలో
సాగదొలుదమంటే ఉయ్యాలా
సెరువు కుంటలల్ల ఉయ్యాలో
సుక్కనీరు లేదు ఉయ్యాలా
గంగబెట్టిన శాపముయ్యాలో
గతిలేని బతుకాయె ఉయ్యాలా ॥బతుకమ్మ॥

పాలు దాగి గౌరి ఉయ్యాలో
పవ్వలించినాది ఉయ్యాలా
కొబ్బరి తీర్థముతో ఉయ్యాలో
దూప దీర్చుకుంది ఉయ్యాలా
రోజులు గడువంగ ఉయ్యాలో
దిక్కుదోచదాయె ఉయ్యాలా ॥బతుకమ్మ॥

ఆడబతుకు తల్లి ఉయ్యాలో
నెలదిరిగి వచ్చింది ఉయ్యాలా
తానాలు జెయ్యంగ ఉయ్యాలో
తేనే నూనెలు గౌరి ఉయ్యాలా
నెయ్యి తోని గౌరి ఉయ్యాలో
జలకమాడినాది ఉయ్యాలా ॥బతుకమ్మ॥

గౌరమ్మ ఒళ్ళంత ఉయ్యాలో
జిబ్బుమంటున్నాది ఉయ్యాలా
ఈగల గుంపేమో ఉయ్యాలో
మోతలే మోసేను ఉయ్యాలా
ఎర్రజీమలు తల్లి ఉయ్యాలో
బార్లుదీరినాయి ఉయ్యాలా ॥బతుకమ్మ॥

గబ్బు లేసిన వల్లు ఉయ్యాలో
గండు జీమలు పాలు ఉయ్యాలా
నీరు లేక గొంతు ఉయ్యాలో
పిడ్సగట్టుక పాయె ఉయ్యాలా
కచ్చెబట్టిన గంగ ఉయ్యాలో
కానరాకపాయె ఉయ్యాలా ॥బతుకమ్మ॥

దిక్కులన్నీ గదుల ఉయ్యాలో
కూతలే బెట్టింది ఉయ్యాలా
గంగనే బిలువంగ ఉయ్యాలో
కేకలే ఏసింది ఉయ్యాలా
రావె రావె గంగ ఉయ్యాలో
రాతిపొరలు దాటి ఉయ్యాలా ॥బతుకమ్మ॥

దిక్కుతోచని గౌరి ఉయ్యాలో
పరుగు దీసినాది ఉయ్యాలా
అలసిపోయిన గౌరి ఉయ్యాలో
అడుగు కదలక పాయె ఉయ్యాలా
ఎక్కడున్నవు గంగ ఉయ్యాలో
ఒక్కసారి రావె ఉయ్యాలా ॥బతుకమ్మ॥

బంగారు నా చెల్లె ఉయ్యాలో
బతిమలాడుతున్న ఉయ్యాలా
రావె రావె గంగ ఉయ్యాలో
నా ముద్దు చెల్లెలా ఉయ్యాలా
ఎక్కడున్నవు గంగ ఉయ్యాలో
అక్కకోసం రావె ఉయ్యాలా ॥బతుకమ్మ॥

సుక్కనీరు లేక ఉయ్యాలో
సొక్కిపోతిని గంగ ఉయ్యాలా
తప్పు నాదే చెల్లె ఉయ్యాలో
అక్క గోసను జూడే ఉయ్యాలా
తరలి రావె గంగ ఉయ్యాలో
తప్పొప్పుకుంటున్న ఉయ్యాలా ॥బతుకమ్మ॥

హొయలు ఒంపుల తోని ఉయ్యాలో
వయ్యారి గంగమ్మ ఉయ్యాలా
ఏడు పాయలతోని ఉయ్యాలో
ఎగిరి దునుకుతుంటే ఉయ్యాలా
జల్లుమన్నది నేల ఉయ్యాలో
జలదరించే నేల ఉయ్యాలా ॥బతుకమ్మ॥

గలగల పారంగ ఉయ్యాలో
గంతులేసి గంగ ఉయ్యాలా
ముక్కంటి శివుడినే ఉయ్యాలో
మప్పుతిప్పలు బెట్టి ఉయ్యాలా
గారాల గంగమ్మ ఉయ్యాలో
గౌరినే సాధించే ఉయ్యాలా ॥బతుకమ్మ॥