అంబటి వెంకన్న పాటలు/తుంగు, తెలంగాణ పాటలు

వికీసోర్స్ నుండి

అసలైన తెలుగక్షరం



సాకి: నింగిలోన సింగిడిగా నిలిసినవ కాళోజీ
       వెలుగునిచ్చె ధృవతారై వెలిసినావ కాళోజీ
నల్లని ఆకాశంలో తెల తెల్లని గడ్డంతో ఆ బోసి నవ్వులతో
వొదిగున్న కాళన్న ఓనమాలె నువ్వన్నా ॥నల్లని॥

నిజామోల్ల నెదిరించి భూస్వాముల జడిపించే
కథలెన్నో జెప్పితివి కదనానికి నడిపితివి
అక్షరాన్ని సందించి లక్ష్యాన్ని సాధించే
సత్యాగ్రహ సమరంలో సయ్యంటూ సాగితివి
నియతంటే నీదన్నా నిజమంటే నువ్వన్నా
జనమంటే ప్రాణంగా బతికిన ఓ కాళన్నా. ॥నల్లని॥

చెలిమికేమి కాదంటూ చెలిమలెండి పోవంటూ
గొడవజేసి గొంతెత్తి గోస దీర్చ కదిలితివి
తెలంగాణ ఊపిరివి తెగబడి నినదించితివి
ప్రత్యేక రాష్ట్రముకై ప్రజాపోరు నడిపితివి
నియతంటే నీదన్నా నిజమంటే నువ్వన్నా
జనమంటే ప్రాణంగా బతికిన ఓ కాళన్నా. ॥నల్లని॥

గలగలగల సెలయేరే గమనాన్ని మార్చింది
నీ గమ్యం చేరంగా పాదాలను తాకింది
గగనంలో నెలవంక నీ వంకే చూసింది
నీకై అడుగేసింది నీ పదమే పాడింది
నియతంటే నీదన్నా నిజమంటే నువ్వన్నా
జనమంటే ప్రాణంగా బతికిన ఓ కాళన్నా
నిను మరువా లేమన్న నీ బాటే మాదన్నా...


నాగలి బట్టిన రైతు



నాగలి బట్టిన రైతు ఓయన్నా
మా దారినొస్తవా చెప్పు మాయన్నా
పొట్ట చేతబట్టి ఎట్టి బతుకు బతికే
ఎకరమైనా లేని వ్యవసాయ దారుడా ॥నాగలి॥

పట్నంల బతుకేందో పగవాడి తీరేందో నీకు దెల్వదాయే..
పచ్చడ మెతుకులు పాలోల్ల పంచాది నీకు సొంతమాయే
చేతగాని భూములాయే
నీ చేత రాశి గాదాయే
అప్పు సప్పున బెరిగి పాయే
సావు ముప్పు నీకు దప్పదాయే ॥నాగలి॥

స్వాతంత్రమొచ్చిందీ సాన్నాళ్ళు గడిచింది సంగతేందో దెల్వదాయే
నీళ్ళెట్ల బోతున్నయ్ నిదులెట్ల బోతున్నయ్ కరువు గానవాయె
కష్టపడి నువ్వు చెమట సుక్కలు బిండి
నేలదడిపి ఎండిపోతవాయే నీవు
కన్నీరు బెడితేనే పారేటి కాల్వల్లో
బతుకు బాధనెట్ల ఈదుతవ్ ॥నాగలి॥

కులం కులము ఒక్కటంటా మతం మాట వింటరంటా
ప్రాంతమంతా ఒక్కటాయే మన బాధలన్ని ఒక్కటాయే
అందుకోసం దండు గట్టి అందరొక్కటయ్యి కదిలీ
కష్టాలు దీరేటి బాట నడుద్దాం....


పల్లే ఓయమ్మా...



పల్లే ఓయమ్మా తెలంగాణ మాయమ్మా
తల్లీ ఓయమ్మా మా ప్రాణం నువ్వమ్మా ॥పల్లే ఓయమ్మా॥

బుసిబోసే కంకులల్లో నువ్వూ
పసిపోరల మనసులల్లో నువ్వూ
మోట బాయి పాల నువ్వు
బాయిలోని ఊట నువ్వు
ఆటకోయిల పాట నువ్వు
అందమైన పూలతోటా నువ్వేనోయమ్మా
ఓ బంగరు మాయమ్మా ॥పల్లే ఓయమ్మా॥

పరిగేరిన వరి గొలుసులల్ల నువ్వూ
గోసి బోసిన పడ్సులల్లో నువ్వూ
లేగ దూడల అరుపు నువ్వు
పాల ధారల పాట నువ్వు
కోడెదూడల సెండు నువ్వ
పసులకాడి పోరగాళ్ళ పలుకే నువ్వమ్మా
మా పాటే నువ్వమ్మా ॥పల్లే ఓయమ్మా॥

మోటోని ఆశలల్లో నువ్వూ
విరబూసిన తోటమళ్ళీ నువ్వు
బతుకమ్మా పాట నువ్వు
నల్లకుండలో మెతుకు నువ్వు
అంటరాని ఆశ నువ్వు
మా బరువు మోసే సుట్ట కుదురు నువ్వేనోయమ్మా
ఆ నవ్వే మాయమ్మా ॥పల్లే ఓయమ్మా॥

ఆకుపచ్చని గడ్డిచీర ఎర్రజెక్క రంగు రైక
జిల్లేళ్ళు తంగెళ్ళు నీ చెవుల కమ్మలు
కొప్పున ముడ్సిన మోదుగు పూలు
నిప్పులు చెరిగే పలుగురాళ్ళ
వైనం ఏదమ్మా. . ఏ బోనం బెట్టమ్మా ॥పల్లే ఓయమ్మా॥

ఏనెగుండ్లు ఎత్తుక పోయిరి
నల్లతుమ్మలు గొట్టుక పోయిరి
పలుగు రాళ్ళ పాపుక పోయిరి
పాల పిట్టెల జోపుక పోయిరి
అందమైన ఆందెసాల్లను ఆగం జేసిండ్రే..
పత్తిపువ్వుల గత్తరలేపి గంతులు వేసిండ్రే..
బానిస బతుకులు జేసిండ్రే.....

పల్లే ఓయమ్మా తెలంగాణ మాయమ్మా
తల్లీ మాయమ్మా తండ్లాటే నీదమ్మా...


వాడు దొరికెనా



వాడు దొరికెనా మోసగాడు దొరికెనా
తెలంగాణ దోసెటోడు వాడు దొరికెనా
అల్లో దొరికెనా పిల్లో దొరికెనా
ఎన్నుపోటు బొడిసెటోడు వాడు దొరికెనా ॥వాడు॥

అల్లో దొరికెనా పిల్లో దొరికెనా
ఉర్కమని కొంకులుగొట్టు వాడు దొరికెనా
అల్లో దొరికెనా పిల్లో దొరికెనా
ప్రైవేటని పాడెటోడు వాడు దొరికెనా
అల్లో దొరికెనా పిల్లో దొరికెనా
ఏకపక్ష నాయకుడు వాడు దొరికెనా ॥వాడు॥

అల్లో దొరికెనా పిల్లో దొరికెనా
చెవుల పువ్వు బెట్టెటోడు వాడు దొరికెనా
అల్లో దొరికెనా పిల్లో దొరికెనా
మంది కొంపలు ముంచెటోడు వాడు దొరికెనా
అల్లో దొరికెనా పిల్లో దొరికెనా
అప్పుజేసి కొప్పుబెట్టు వాడు దొరికెనా ॥వాడు॥

అల్లో దొరికెనా పిల్లో దొరికెనా
అమెరికాకు జీతగాడు వాడు దొరికెనా
అల్లో దొరికెనా పిల్లో దొరికెనా
ఉద్యమాలనురేస్తోడు వాడు దొరికెనా
అల్లో దొరికెనా పిల్లో దొరికెనా
ముస్సోలినసంటోడు వాడు దొరికెనా ॥వాడు॥
అల్లో దొరికెనా పిల్లో దొరికెనా
హిట్లర్ గానసంటోడు వాడు దొరికెనా

అల్లో దొరికెనా పిల్లో దొరికెనా
పాయదెర్లు జూపెటోడు వాడు దొరికెనా
అల్లో దొరికెనా పిల్లో దొరికెనా
దిక్కులనెడ బాపెటోడు వాడు దొరికెనా ॥వాడు॥

అల్లో దొరికెనా పిల్లో దొరికెనా
హైటెక్కు మోసగాడు వాడు దొరికెనా
అల్లో దొరికెనా పిల్లో దొరికెనా
అడ్డమైన గడ్డమోడు వాడు దొరికెనా
అల్లో దొరికెనా పిల్లో దొరికెనా
మచ్చలున్న చంద్రుడమ్మ వాడు దొరికెనా ॥వాడు॥

అల్లో దొరికెనే పిల్లో దొరికెనే
మాధాపూరు సంటర్లో వాడు దొరికెనే
అల్లో దొరికెనే పిల్లో దొరికెనే
భాగ్యనగరు సైపరయ్యి వాడు దొరికెనే
అల్లో దొరికెనే పిల్లో దొరికెనే
కాకినాడ పోర్టుకాడ వాడు దొరికెనే
అల్లో దొరికెనే పిల్లో దొరికెనే
తెలుగుతల్లి నగల దొంగ వాడు దొరికెనే
వాళ్ళు దొరికెనా మోసగాళ్ళు దొరికెనా
తెలంగాణ ద్రోహులెవరో ఇపుడు దెలిసెనా
అల్లో దొరికెనే పిల్లో తెలిసెనే
తెరసాటు దొంగలంత బైటికొచ్చెనే
తెలంగాణ ద్రోహులెవరొ ఇపుడు దెలిసెనే ॥వాళ్ళు॥


దగాపడ్డ తమ్ములారా...



దగాపడ్డ తమ్ములారా అణచబడ్డ వీరులారా
బీళ్ళకు ఆసాములారా రాళ్ళకు భూసాములారా
పోరుదాము రండి మనం తెలంగాణకై
ఈ మట్టి బిడ్డలుగా పుట్టినందుకూ
తెలంగాణ తల్లి పేగు తెంచి నందుకూ
లెండిరా కదలండి దండిగా సాగండి ॥దగాపడ్డ॥

బుక్కముచ్చు మాటలతో
గంజిబోసి మెతుకు గుంజె రజాకారు ఆంద్రోడు
రంకెలేస్తు ఉన్నాడు అంకె బెడుతు ఉన్నాడు
తెలంగాణ బాధలకు
జనగనమన ఘనఘనమని పాడుతున్నడు
జన్మభూమి ప్రతిజ్ఞలు చేస్తున్నడే
లెండిరా కదలండి దండిగా సాగండి ॥దగాపడ్డ॥

కోట్లలో అప్పుదెచ్చి
దీపమని చీకటిచ్చి వెలుగు మింగే ఆంద్రోడు
విర్రవీగు తున్నాడు నిన్రనీల్లు తున్నాడు
తెలంగాణ సైనికుల
పదపదమని పదపదమని తరుముతున్నడే
చెద పురుగుల సంపినట్టు సంపుతున్నడే
లెండిరా కదలండి దండిగా సాగండి ॥దగాపడ్డ॥

పలుగు పార చేతబట్టి నాగండ్లు అంటగట్టి
తెలంగాణ జెండ బట్టి తెగబడి కొట్లాడుదాం


కునుకుబట్టని



కునుకుబట్టని అప్పుల బాధలొ పల్లే
తెలంగాణ అద్రగానం అయ్యింది
పత్తి రైతుల నురగను జూసిన పల్లే
తెలంగాణ శోకం బెట్టింది
పురుగు మందే తాగింది ॥కునుకు॥

పథకాలేసి పాపంజేసి
పాలనకంతా పసుపును బూసి
ఆడపడుచులని గ్యాసులు బెట్టి
విసుగు మొకంతో బొల్లి నాయుడు
అధిక ధరలనే గంపల నింపిండే ఓయమ్మా
మన అందరి వొళ్ళో మట్టే బోసిండే చంద్రన్న ॥కునుకు॥

కరెంటు దీసి దీపంబెట్టి
పట్టణాలలో పవరును బెంచి
మోటర్లన్ని పక్కకు బెట్టి
తోలు తొండమనే పథకం బెట్టి
మోట బావులకు గిరకలు వేస్తాడే ఓయమ్మా
కన్నీళ్ళనే తోడామంటాడే చంద్రన్న ॥కునుకు॥

కరువును జూసి కర్మని జెప్పి
దేవుని మీద బారం బెట్టి
దూడ పెయ్యలను కోతకు బెట్టి
దున్నుడు లేని ఎవసం బెట్టి

దున్నపోతులై బతకా మంటాడే ఓయమ్మా
రైతుల కంట్లో కారం గొడతాడే చంద్రన్న ॥కునుకు॥

నెర్రెలు దెర్సిన నేల కండ్లలో
మెతుకు జాడకై వెతికిన బతుకులు
నెత్తురోడి అల్లాడుతున్నయన్న ఓయన్నా
నేల రుణమునే దీర్చుకుంటరన్న మాయన్న
వలస పాలకుల అంతు జూస్తరన్నా మాయన్న
వడిసెల రాళ్ళయ్ తరిమికొడతరన్నా చంద్రన్న


తానాన తనా తనాన.



ఆ..... తానాన తనా తనాన
లాలాల లలా లలాల
బుడ్డగోశి బుడ్డాన్నోయమ్మా
అడ్డమైనా సాకిరిజేసె
పాలబుగ్గల పోరగాన్ని
నోరులేనిఆ గోడ్లకు నేనే పటేలునోయమ్మా
మంచి పనోడినోయమ్మా. ॥బుడ్డగోశి॥

చేతి బొగ్గల్లోనే తాళ్ళుబేనితీ
దుమ్ము గుంటుకతోని భూమి నున్నగజేసి
పెంటబండి దోలె పురుగునైతిని
సినుకు రాలగానే దుక్కినైతిని
సాలు సాలుకు నేను సావనైతిని
పట్టాలల్లే... రైలు పట్టాలల్లే
ఇత్తన సాల్లు దోలితిని
అప్పుకింద నన్ను అమ్మేసుకుండ్రు
తీరుగంత కింద తీసేసుకుండ్రు
తీరికలేని బతుకే నాదమ్మా
రింగన్న పురుగై ఎగిరే దేడమ్మా
తానాన తనా తనాన లాలాల లలా లలాల ॥బుడ్డగోశి॥

బుడదమల్లో నేను అరకనైతినీ
చలితో చలి కాపుకుంటిని
పొట్టలు బగిలి చితికిన ఏళ్ళకు
ఎడ్లపెండతోని ఆవిరి బడ్తిని
మొగోని లెక్క... ఆలు మొగోని లెక్క
వరిలుగంల కావడి మోసితిని
నాకడుపుల పేగులు కరిబెట్టిండ్రు
పాలసేర్లనే పలగొట్టినారమ్మా
చిత్రహింసలే బెట్టినారమ్మా
తానాన తనా తనాన లాలాల లలా లలాల ॥బుడ్డగోశి॥


బక్కచిక్కిన డొక్కల్లో..



బక్కచిక్కిన డొక్కల్లో లెక్కల్లో చుక్కల్లా
తెలంగాణ వీదుల్లో...
అందరమొకటై కలవాలె
అవతలి వాన్ని గెలవాలే ॥బక్కచిక్కిన॥

అన్నల్లో తమ్ముల్లో పోరు జేసే వీరుల్లో
సిచ్చులు బెట్టిండ్రోయన్నో కుంపటి వేసిండ్రోయన్నో

చిన్నక్కో పెద్దక్కో సిగాలు ఊగే ఎల్లక్కో
కేకలు బెట్టకు నా తల్లో రక్తం గక్కి సస్తారు
ఏమీ దెలువని ఎడ్డిజీవులని ఎంతో మోసం జేసిండ్రు ॥బక్కచిక్కిన॥

మాయ శక్తి వచ్చింది మాఫియ నైజం చూపింది
పథకాలెన్నో వేస్తుంది పేదలకుచ్చు బెడుతుంది

మశ్శక్కో పోశక్కో కొలుపూజెప్పే గంగక్కో
గుడ్లు ఉరుమకు నా తల్లో గుండెలు బగిలి చస్తారు
విశ్వవిజేతలు వీరుల గెలిసే శక్తే నీదనుకుంటుండ్రు ॥బక్కచిక్కిన॥

డేగ రెక్కల ప్రపంచ బ్యాంకు సెరువారెంట వాలింది
పాటి మీద గూకుంది శవాల బీక్క తింటుంది

చిన్నక్కో పెద్దక్కో చిందులు దొక్కే మా తల్లో
మశ్శక్కో పోశక్కో నిలువున జీరే గంగక్కో
మాయశక్తిని పట్టాలె పెడ రెక్కలు విరిచి కట్టాలె
జుట్టుబట్టి కొట్టాలె పొలిమెర దాకా తరుమాలె ॥బక్కచిక్కిన॥


జీడికంటి మూల



జీడికంటి మూల ఇగ మబ్బు బట్టినాది
కుండపోత వాన భలె గుమ్మరించుతాది
ఎగిరి దునుకుతుంది ఆ ఎత్తి పోతలమ్మా
అరె కదలకుండ బాయే మన పక్కనే క్రిష్ణమ్మ
సెలయేటి హొయలన్నీ పొలిమే దాటుతుంటే
సల్లదనం సమమంటూ ప్రకాశించే సందమామ
మనమేమి జేద్దామురో ఈదన్న
మనమెక్కడ బోదామురో యాదన్న ॥జీడికంటి॥

జల్లు జల్లు జల్లు అరె జలదరించె వల్లు
గల్లు గల్లు గల్లు భలె గంతులేసే మల్లు
తెల్లారి జూడబోతే తెగిపాయే సెరువుకుంట
మనమేమి జేద్దామురో ఈదన్న
మనమెక్కడ బోదామురో యాదన్న ॥జీడికంటి॥

టప్పు టప్పు టప్పు అరె చినుకుల పందిళ్ళు
టక్కు టక్కు టక్కు భలె కోలల సప్పుళ్ళు
కోలాటం ఆడుకుంట కోనసీమ జేరె నీళ్ళు
మనమేమి జేద్దామురో ఈదన్న
మనమెక్కడ బోదామురో యాదన్న ॥జీడికంటి॥

కణ్ణ కణ్ణ కణ్ణ అరె డప్పుల మోతల్లు
బోనాల జాతర్లో పడుచుల ముచ్చట్లు
మన నీళ్ళు మలుపుకునే మాయగాళ్ళ తరుముదాము
బతుకమ్మ ఆడనోళ్ళురో ఈదన్న
చెడి బతికిన తీరపోళ్ళురో యాదన్న
మన మీదే పెత్తనమంటో మాయన్న
మనల దోసె నాయకులంటో ఓయన్నా


వేదాలలో



వేదాలలో ఏముందంట
మత గ్రంధాలలో మాయుందంట
శ్లోకాలలో ఏముందంట
పద్య పాదాలలో పచ్చి అబద్దాలేనంట
బ్రహ్మ పేరున రాసిన పచ్చి పిచ్చి గీతలంట
స్వార్ధ బ్రాహ్మల చేతిలో చండ్రకోలలాయెనంట ॥వేదాలలో॥

రాతి నాతి బొమ్మలకు పట్టుబట్ట సుడతారు
ప్రతి రోజు పెండ్లిజేసి అక్షింతలు వేస్తారు
శోభనాలెట్లా... ఆ ముద్దూ ముచ్చటలెట్లా
ఆర్యుడా.. ఓ బాపడా...
పెళ్ళి కొడుకువై నువ్వు తాళి బొట్టు గడతావు
తలంబ్రాలు బోస్తావు ఊరంతా దిప్పుతావు
శోభనం పని కాడ పాటేస్తావా
సోమరసం తాగి నువ్వు చిందేస్తావా
ఆ తియ్యటి ఊహల్లో జందెం తెంపేస్తావా
అయ్యో మా దేవుడని చెంపలేసుకుంటావా
వెంకటేశా నీ పని గోవిందా...
తిరుమలేశా నీ పని గోవిందా.... ॥వేదాలలో॥

బర్రె కుడితి దాగినట్టు సురపానం తాగేందుకు
పందికొక్కులా నువ్వు పచ్చి కూర తింటందుకు
యజ్ఞాలు యాగాలు జరిపిస్తివి
రంభతో సంభోగం జరుగునంటివి
ఆర్యుడా.. ఓ బాపడా

మంది సొమ్ము దిని నువ్వు తెగబలిసిన దున్నవై
ఉట్టి కెగర లేని నువ్వు స్వర్గమొకటి ఉందంటివి
సొల్లు మంత్రాలెన్నో మా నోట పలికిస్తివి
స్వర్గమెళ్ళి వచ్చిన బాపడెవడు ఉన్నడూ
ఆర్యుడా... ఓ బాపడా...
నా మాట వేదమన్న నాలుక తెగ్గొయ్యాలె
పురాణాలు నిజమంటే పుర్రె బగలగొట్టాలె
హిందు ముస్లీం క్రీస్తు సిక్కు పార్శీ జైనం
మతాలన్ని మనుషులను మాయజేసి ఆడినయే
మర్మమేదో చెప్పకుంట దోసుక తిన మరిగినయే
తెలుసుకో... మాయన్నా
మనిషిగా.. నువ్వన్నా....

వేదాలలో ఏముందంట
సూదరోల్ల ననగదొక్కె మంత్రాలంట
శ్లోకాలలో ఏముందంట
మత గ్రంధాలలో మాయుందంట


అడుగేసిన దిక్కుల్లో



అడుగేసిన దిక్కుల్లో గంపలు గదిలిన తోవల్లో
నక్కలు గలిసిన జాడేలేదు డొక్కలు మాడని రోజే లేదు
ఏమిజేదు గంగా... ఎందుబోదునమ్మా
అడుగేసిన దిక్కుల్లో ఆటేసిన కుంటల్లో
నక్కలు గలిసిన జాడేలేదు డొక్కలు మాడని రోజే లేదు
ఏమిజేదు గంగా... ఎందుబోదునమ్మా ॥అడుగేసిన॥

వల ఇసిరీ ఏరిస్తే ఈత పురుగులే రాలినయి
ఏసారి ఏసిన ఆటుకు కంపకొర్రులే జిక్కినయి
ఈతాకు ఎలుమై ఈగిన కన్నీటి పొలకలాగవు
ఏమిజేదు గంగా... ఎందుబోదునమ్మా
ఒండుల ఇరికి వాగులు దిరిగి గండాలు దాటెదమా
సోకం శేది బాధలు ఈది ఎన్నాళ్ళు బతికెదమూ
ఏమిజేదు గంగా... ఎందుబోదునమ్మా ॥అడుగేసిన॥

ఎసరు మసిలే పొద్దెక్కే నిప్పురాజెయ్యనె లేదు
బండలు బగిలే పొద్దంతా నడినెత్తిన కుదురై తిరిగే
సుట్టున్నా గూడాలన్నీ కాళ్ళల్లో కలె దిరిగినయి
ఏమిజేదు గంగా... ఎందుబోదునమ్మా
రోజులు దిరిగిన కుందెన కందక ముప్పొద్దులు గడిసేనా
అర్కతి బర్కతి ఏదీలేని సంసారం ఎదిగేనా
ఏమిజేదు గంగా... ఎందుబోదునమ్మా ॥అడుగేసిన॥


కార్గిల్ కదనంలో...



కార్గిల్ కదనంలో కనుమూసిన కాగడాలు
దేశానికి వెలుగునిచ్చి తను మిగిలెను శూన్యంలో
తాను తనవాళ్ళను మిగిల్చెను చీకటిలో ॥కార్గిల్॥

వెలుగు లేని తన గుడిసే వెలవెల బోతుంది చూడు
నీడ లేని ఆ తోడు విలపించే గోడు చూడు
ఆ గుడిసెలో అమాయకపు చిరుదీపపం వెలుగుతుంది
చిరునవ్వులు చిందించే సమయం కాదనుకుంది
చితి మంటలె చిరకాలం కళ్ళల్లో కదలంగ
కథలు చెప్పినారు కన్నీరు తుడిచినారు
చేతిలో పతాకముంచి చేరదీసినారు ॥కార్గిల్॥

మువ్వన్నెల రెపరెపలే భరతజాతి వెలుగులై
మురిపించే ఈ నేలను ముద్దుముద్దు మాటలతో
ఈ విషాద దృశ్యాలు ఎన్నుండెనో భారతంలో
ఈ పవిత్ర త్యాగాలు ఎన్నుండెనో మన భూమిలో
ప్రాణాలను బలిచేసి పవిత్రంగ మిగిలిపోయే
వీరయోధులు ఎదిరించే ధీరులు
బార్డర్‌లో భారతమ్మ కన్నబిడ్డలు ॥కార్గిల్॥


భరతమాత బిడ్డలం



భరతమాత బిడ్డలం - భావితరం దూతలం
ఆటపాటలా నడుమ సదువులెన్నో సదువుతాం ॥భరత॥

తల్లి దండ్రి గురువులను తప్పక పూజిస్తాము
తోటివారితోడ మేము స్నేహంగా మెలుగుతాము ॥భరత॥

గాంధి నెహ్రు భగత్‌సింగు - వల్లభాయి పటేలు
మనజాతి నాయకులకు జేజేలు పలుకుతా ॥భరత॥

స్వాతంత్ర దినోత్సవం - సంభరంగ జరుపుతాం
అమరవీర త్యాగాలతో స్ఫూర్తి మేము పొందుతాం ॥భరత॥

ఘనతంత్ర దినోత్సవం - ఘనంగానే జరుపుతాం
అంబేధ్కర్ ఆశయాల బాటలోనే సాగుతాం ॥భరత॥

జన గన మన ఘనఘన మని-జాతిగీతి పాడుతాం
మువ్వన్నెల పతాకాన్ని మురిపెంగా ఎగరేస్తాం ॥భరత॥


ఏదిరా స్వేఛ్చ



ఏదిరా స్వేఛ్చా ఏది స్వాతంత్ర్యం
ఎక్కడా సమానత్వం
మచ్చుకైనా మిగిలి ఉందా
మానవత్వం ఇపుడు ఉందా
ఓ పతాకమా... భారత పతాకమా
కులాలన్ని వీడిపోయి మతాలన్ని రెచ్చిపోయి
పిచ్చిలేసి సంపుకొనుటా.... ॥ఏదిరా॥

ఈ చితికిన బతుకుల మీద నీ రెపరెపలేనా స్వేచ్ఛ
ఈ అధర్మ రాజ్యంలోన నీ ధర్మచక్రమా రక్ష
కలో గంజో తాగి మేము కడుపు చేత బట్టుకుంటే
కాయ కష్టం జేసి మేము కన్న బాధలు పడుతుంటే
కడుపు గొట్టుటా స్వేఛ్చా
మా వెతలు పేర్చుటా స్వేఛ్చా
ఓ పతాకమా మువ్వన్నెల విహంగమా ॥ఏదిరా॥

శిశు హత్యలు వరకట్న చావులు
అనునిత్యం చూస్తూనే కన్నీరు పెడుతూనే
స్వేఛ్చ స్వేచ్చని ఎగిరేవు నీ శ్వాస నేనని చాటేవు
స్వేధం చిందే బతుకుల జూసి కన్నీరు కార్చేవు
మనుషులంతా ఒక్కటైతే మానవత్వం మిగిలి ఉంటే
ఊచకోతలు గోయుటా స్వేఛ్చా
దళిత వాడను కక్ష్యగట్టుటా స్వేఛ్చా
ఓ పతాకమా మువ్వన్నెల విహంగమా ॥ఏదిరా॥


ఊకెనె తెల్లారుతుంది



ఊకెనే తెల్లారుతుంది బడిలో పొద్దూకుతుంది
మా బతుకులో పొద్దూకుతుంది
ఎపుడు నిద్రబోతామో ఎపుడు మేలుకుంటామో
కలలూ కలవరింతలు అన్నీ విద్యాలయమే.... ॥ఊకెనే॥

మత చాంధస బావాలు మేలుకొలుపు గీతాలై
సిలబస్ పాఠాల ముందు నమస్తే చిత్రాలమై
యతి ప్రాసల తీరం మీద ప్రవహించే శ్లోకాలు
ఒట్టుగట్టిన బతుకుల మీద విరిగిన పేంబెత్తాలు
అఆలు నేర్పే ఆలయాలు ॥ఊకెనే॥

అ ఆ లు గుణింతాలు రాయడమే మాకిష్టం
తలకట్టు దీర్ఘాలు పాటలోలె పాడినపుడు
ఒకటి రెండు అంటూ మేము అంకెలెన్నో రాస్తామూ
గుణకారం భాగహారం ఆటలోలె ఆడేస్తాం
ఆకాశమే హద్దంటాము ॥ఊకెనే॥

అమ్మేగా సర్వం మాకు అడగంగనే చేసిపెడతది
కొడుతూనో తిడుతూనో బాయంటూ బడికిదోల్తది
నాన్నసలే మటాడడు నడిజాముకు ఎప్పుడొస్తడో
ప్రతిరోజు గుడ్‌మార్నింగ్ అపుడపుడు గుడ్‌నైటు


ఓ హృదయమా



ఓ హృదయమా నను వీడి పోకుమా
చేజారు జీవితం కాసేపు ఆపుమా
ఓ కాలమా నీ పయన మెటమ్మా
నా ఊహని ఉరివేయ బోకుమా ॥ఓ..॥

మేఘాలు నీ మల్లె మౌనాలు పలికితే
నా గుండె రాగాలు శోకాలు పలికెనే
మెరుపల్లె నీ రూపం మదిలోన మెదిలితే
నా నిండు కలలన్ని కన్నీరై కరిగెనే
ఏమి జీవితం మనసు తోచదు
మబ్బు లేనిదే ఈ ఆకాశం ఉండదు ॥ఓ..॥

ఈ ప్రేమ శ్లోకాలు వేదనలే పలికితే
కనుపాప నా కోసం నీ చిత్రమేసెనే
కడసారి కనిపించి చిరునవ్వు చిందితే
ఊహల్లో నా ప్రాణం ఊపిరే వదిలెనే
ప్రేమ జీవితం మనసు మారదు
ప్రేమ లేనిదే ఈ త్యాగం ఉండదు ॥ఓ..॥


కూరాట బువ్వాట



కూరాట బువ్వాట పిల్లో
కూడాడుకుందామ పిల్లా
ఎడ్లబండీ గడుత ఏడూర్లు దిప్పుత
ఏ బాధ లేకుంట నీతోడు నేనుంట ॥కూరాట॥

మొల్లకున్న తెలివి నీకు ఉందంట
నల్లోలె ఉంటావు నా కండ్ల ముందు
అల్లనేరేడి పండ్ల అందమంత
నీ కండ్లల్ల ఉన్నాదే కంగాలి పిల్ల
గయ్యాలి గంగమ్మా సయ్యాటే ఆడమ్మా ॥కూరాట॥

బుర్కాయ సిప్పల్లో నీ ముక్కు పచ్చంట
కంపాకు పూతోలె నా కాళ్ళ ముందు
రేల పూతంటి సింగారమంత
సిగమెత్తి ఊగంగా సినాలి పిల్ల
సుక్కోలె జూడాలె పిల్లో
మనం రిక్కలే బెటాలె పిల్లా
ఆకలే దీరాలె పిల్లో తొలి కేకలే వెయ్యాలె పిల్ల
గయ్యాలి గంగమ్మా సయ్యాటే ఆడమ్మా ॥కూరాట॥

మయ్యూరిలా నువ్వు నాట్యమాడావంట
నడక నేర్వనట్టు నా కండ్ల ముందు
అలక పానుపు మీది అందమంతా
నీ పెదవుల్ల ఉన్నాదే ఓ ముద్దు పిల్ల
గయ్యాలి గంగమ్మా సయ్యాటే ఆడమ్మా ॥కూరాట॥

పొద్దుగూకులు మనము కశిబిశి అంటాము
తెల్లవార్లు మల్ల జాగారముంటాము
శివరాతిరెందుకే పిల్లో
మన శీకు సింతా దీర పిల్ల
మొగుడు పెండ్లాలోలె పిల్లో
పగటేశమెయ్యాలె పిల్ల
గయ్యాలి గంగమ్మా సయ్యాటే ఆడమ్మా ॥కూరాట॥


అంబాడిరో



అంబాడీరో ఇది లంబాడీరో
అదిరిందీరో జత కుదిరిందిరో
జింకల్లే ఉన్నాది జుంకాల పోరీ ॥అంబాడీరో॥

అడవి మల్లెపూవోలే అందమైనదీ పోరీ
కొండమల్లెపూవ్వోలె కొంటెతనం శానిదీ
బొండుమల్లెలా నువ్వు గప్పుగప్పు మంటుంటే..
మనసే మత్తెక్కి నాకు మైకమేదో కమ్మిందే ॥అంబాడీరో॥

సిగ్గుమొగ్గలేసేనే నీ చిట్టి అందాలు
కళ్ళలోన దాగుండే కాటుకంటి గారాలు
గదుమమీది పచ్చబొట్లు నన్నుగాబరా జేసేనే..
గడికీ నీ నడుంవొంపులు నన్ను గల్తి జేసేవే.... ॥అంబాడీరో॥

ముంజేతి గాజులు నీ మోచేయి దాకేసి
మురిపెంగా నీ చూపు నావైపు పారేసి
ఇప్పుడేమి పట్టనట్టు ఇసురుకుంట బోతుంటే..
నిల్వున నాప్రాణమంతా జివ్వుమంటూ లాగేసేనే ॥అంబాడీరో॥

బిళ్ళగొలుసులెన్నో నీ మెడ మీద హారాలు
వొదులుకుంట నీకోసం నిద్ర ఆహారాలు
జట్టుగట్టి నాయింట జత గూడి ఉంటానంటే...
జుంటు తేనె తాగుటకు పోతుటీగనై పోతానే ॥అంబాడీరో॥

బంగారు మేనిరంగు ఒలికే సింగారాలు
గల్లు గల్లునొస్తుంటే కులికే వయ్యారాలు
అద్దాల పూలతోట ముద్దుగ నడిసెల్లిపోతే...
నీ అడుగుల్లో నా పానం అల్లాడీ పోయేనే ॥అంబాడీరో॥


గల్లుగల్లు గజ్జెలగుర్రం



గల్లు గల్లు గల్లు గల్లు గజ్జెల గుర్రం
గడపదాటెనంటె సాలు గందరగోళం. ॥గల్లు॥

బ్యూటీపార్లరుకెల్లి పూటకొక్క ఏశమేసి
అంతెత్తు చెప్పులతో అందం ఊయలలూపి
తనవంటి ఇంటిమీద కిటికిలెన్నో దీసేసి
గుండెతలుపు మూసేసి గూటికెవని రానియ్యదు
అందమంత అదిమిపెట్టి కొసపెదవి కొరికేటి
సుప్పనాతినీ భలే నంగనాచినీ... పెట్టాను లైనులో పోరినీ..
పట్టాను మొత్తానికి దానినీ... కన్నే గుర్రాన్ని ॥గల్లు॥

పార్కుల్లో సిన్మాహాల్లో గబ్బుగొట్టే పబ్బుల్లో
తైతక్కల ఉర్రూతలు ఊరంతా దిప్పించి
సెల్‌ఫోను నెంబరిచ్చి రిచార్జి వసులు జేసి
నిత్యం వెంటాడెటట్టు నిద్రబట్టకుంట జేసి
పొద్దుగూకులు జనులా మొద్దులెన్నో మోపించిన
అందగత్తెని భలేపోట్లగిత్తనీ.... పెట్టాను లైనులో పోరినీ..
పట్టాను మొత్తానికి దానినీ... కన్నే గుర్రాన్ని ॥గల్లు॥

కోటీ సెంటరులోన పోటీ ముద్దులనిచ్చీ
పోరగాళ్ళనెందరినో పిచ్చికుక్కలను జేసీ
పిజ్జాలు బర్గర్లని బిల్లులెన్నొ గట్టించి
బేకారిగాళ్ళ జేసి అదిరిపోయే షాకిచ్చిన
టక్కులాడి టిక్కులాడి హైటెక్కు టెక్కులాడి
ఆటలాడి ఓడించిన గిన్నెకోడినీ.... పెట్టాను లైనులో పోరినీ..
పట్టాను మొత్తానికి దానినీ... కన్నే గుర్రాన్ని ॥గల్లు॥


చుక్కల్లో చేరావే....



చుక్కల్లో చేరావే చక్కనమ్మ
నే రమ్మంటే రానంటావెందుకమ్మ
వెన్నల్లే చల్లనైన వెన్నెలమ్మ
నను లాలించే మాయమ్మ ఓ మామ ॥చుక్కల్లో॥

శివరాతిరో నవరాతిరో
ఈ చలి రాత్రి జత కావా రతి దేవత
నీ అరచేతిలో నా అందము
అల్లాడుతుంటే ఆపేదెవరు
నా కొంపంటుకుంటే చూసే దెవరు
ఓశి నా శింగారి బంగారి వయ్యారి రావే...
మబ్బులతో మసకలుగా పల్లకి తెచ్చేశా ॥చుక్కల్లో॥

కలికాలమో చలికాలమో
కావ్యాలు రాసేశా నీ కళ్ళపై
నడువొంపులో నీ చూపులు
సుడి తిరుగుతుంటే ఒడి దిరిగితీ
నా మనసప్పాగించి వెను దిరిగితీ
ఓశి నా గోదారి రాదారి పూదారి మరదలా
అలలపై తెప్పలుగా తేలుతు వచ్చేశా ॥చుక్కల్లో॥


ఎక్కడ ఉన్నావే...



ఎక్కడ ఉన్నావే నవ్వుల నారాణి
ఏమని చెప్పేదే గువ్వా నీతోని
నా కన్నుల్లొ నిండుగ వెలిగే
పున్నమి జాబిలి నువ్వంటా
నా కలలో తీయని భావం ఒలికే
బంధం నువ్వంటా ॥ఎక్కడ॥

కోనమీది సూరీడల్లె నుదిటి మీదా సుక్కబొట్టు
కొండ కోన దిరిగినట్టు కొంటె మోము అలిసినట్టు
కొమ్మ చాటున పాలపిందెవై
నక్కి నక్కి చూసేవు నన్ను
పూసిన మందార పువ్వేనువ్వు
పువ్వల్లె నవ్వే దేవత నువ్వు ॥ఎక్కడ॥

నెలవంక లాంటి నీ మోములోన
హరివిల్లు విరిసే ఆ బుగ్గ మీన
పున్నమంటి వెన్నెల నువ్వని
కన్నుగుట్టెనా ఎవ్వనికైనా
పూసిన మందార పువ్వేనువ్వు
పువ్వల్లె నవ్వే దేవత నువ్వు ॥ఎక్కడ॥

నీ గలగల నవ్వుల్లో పొంగిపోతిని
మెరిసే ముత్యాలు దోసుకుంటిని
నీ బుంగమూతిలో ముడుసుకుంటినీ
నీ చూపుల దారం సుట్టుకుంటినీ
నీ బంగారు వన్నెను ముట్టుకుంటినీ ॥ఎక్కడ॥


బంగరు వన్నెకాడ



బంగరు వన్నేకాడ సింగుని తోటా కాడా
ముచ్చెట బెట్టుర పిలగో సందమామను ఎక్కీ
ముద్దులు బెట్టుర పిలగో లేత పెదవికీ జిక్కీ ॥బంగరు॥

ముద్దూ మొకమూదాన ముత్యం లాంటిదాన
మూతి ముడువకె పిల్లో నీకు ముద్దుల పిచ్చీ
పొద్దూ బాయెనె పిల్లో నీకు నాకు కచ్చీ ॥ముద్దూ॥

భూమి దున్నిన కాడ బుగ్గా గిచ్చిన కాడ
నాటు ఏసిన కాడ కోతా గోసిన కాడ
నడుములెత్తర పిలగో నీ ముక్కుల లిక్కీ
నాగా లోకంబాయె నా పానం జిక్కీ ॥బంగరు॥

భూమి దున్నే మిషినీ బుగ్గాబాయికి మిషినీ
వరి కోతకు మిషినీ వంగే నాటుకు మిషినీ
నడుమూ లొంచిన దేడా నీ బుగ్గలు గిచ్చీ
నాట్యమాడిన దేడ నా పానం జొచ్చీ ॥ముద్దూ॥

మెదా జుట్టిన కాడ ఎదా తాకిన కాడ
మోపు ఎత్తిన కాడ కుప్పా గొట్టిన కాడ
రాగమెత్తర పిలగో మలిసీ కొట్టేటోడ
రాశి నీదే పిలగో పోలు దిరిగేటోడా ॥బంగరు॥

కుప్పా నూర్చే మిషినీ ఎల్లాగాసే నుషినీ
రయ్యు రయ్యున వీసే సల్లాగాలికి మిషినీ
నువ్వూ నేను మిషినే నా కూలొల పిల్లా
దాని ధాటికి తాలే నా మరదలు పిల్లా ॥ముద్దూ॥

సాటా గొట్టిన కాడ ముచ్చెట బెట్టీనట్టు
కల్లామూకిన కాడ మనం కలిసున్నట్టు
కళాలొచ్చెను పిలగో నీ మొకముల కట్టె
కౌగీలియ్యర పిలగో వొల్లు ఆవిరి బట్టే ॥బంగరు॥

సాటా గొట్టిన దేడా ముచ్చెట బెట్టిన దేడా
కల్లామూకిన దేడా మనం కలిసిన దేడా
పాడు కలలే పిల్లో నీ పాపిట ముల్లు
పడుసు పిల్లవు నువ్వు పారేయకు వొల్లు ॥ముద్దూ॥

వెన్నెల కాసిన వేళ-వొన్నెలు మెరిసిన వేళ
కన్నులు చెదిరిన వేళ-కౌగిలి అడిగిన వేళ
నీ పున్నమి నేనో మనసూ మెచ్చిన పిలగా
పండు వెన్నెల నీదే వొడిసి పట్టర పిలగా ॥బంగరు॥

వెన్నెల కాసిన వేళ-వొన్నెలు మెరిసిన వేళ
కన్నులు చెదిరిన వేళ-కౌగిలి అడిగిన వేళ
ఆ పున్నమి తోడె నా తంగెడు పువ్వా
తెగిన సుక్కల తీరే నా గోగూ పువ్వా ॥ముద్దూ॥

మబ్బు ముసిరిన వేళ-మెరుపు మెరిసిన వేళ
ఉరుము ఉరిమిన వేళ-సినుకు తరిమిన వేళ
భమిషి వస్తిని బావో నన్ను దోసిన వాడ
బాధ పడతవు బావో ఏడుకొండల వాడ ॥బంగరు॥

మబ్బు ముసిరిన వేళ-మెరుపు మెరిసిన వేళ
ఉరుము ఉరిమిన వేళ-సినుకు తరిమిన వేళ
చీపు లిక్కరు నువ్వే నా తంగెడు పువ్వా
చికెను ముక్కవు నువ్వే నా గోగూ పువ్వా ॥ముద్దూ॥

వైనూ షాపు ముందు లైనూ గట్టి నువ్వూ
దిక్కులు జూసీ నువ్వు దిక్కుమాలిన మందు
సప్పున సప్పున మింగీ సెప్పకుంటనె బోతవ్
పడుసూ పిల్లను ఇడిసి పక్కకు దిరిగీ పంతవ్ ॥బంగరు॥

నువ్వూజెప్పిన మాట అక్షర సత్యమె పిల్లో
వైనూ షాపొడు నన్ను వంకర టింకరజూసే
పైసలు బెట్టి నేను పలుసనైతినే పిల్లో
పదీమందిల నాది పరువు బాయెనె పిల్లో ॥ముద్దూ॥

ఎంతా సల్లని మాట నువ్వంటివి బావో
ఇజ్జతిగల్లా నువ్వూ ఈనమైతివి బావో
ఇప్పటికైనా నువ్వూ సక్కిడికొస్తివి బావో
పండూ ఎన్నెల పరుపూ పక్కాదెస్తిని లేవో ॥బంగరు॥


ఓరోరి ముసలోడ



ఓరోరి ముసలోడ దోసొరుగు తోలోడ
పడుసు పోరిని బట్టి పర్గాశమాడ్తావు
హెయ్... పడుసు పోరిని బట్టి పర్గాశమాడ్తావు
నీకేమి రోగమురో నీ నోరెట్ట నొవ్వదురో... ॥ఓరోరి॥

మిడిగుడ్లు బెట్టి మీసాలు మెలిబెట్టి
తొడగొట్టి బిగబట్టి తోపుల్లో నిలబెట్టి
గుడ్డిచూపులు విసురుతావు
ఆ దోర నవ్వులు రువ్వుతావు ॥ఓరోరి॥

వరిగొయ్య నను బిలిసి వరమెక్కి చూసేవు
నాటెయ్య నను బిలిసి నా ఎనక నిలిసేవు
గుడ్డిచూపులు విసురుతావు
ఆ దోర నవ్వులు రువ్వుతావు ॥ఓరోరి॥

యహెయ్....
మనసంత సుట్టజుట్టి మదిలోకి గుంజాను
వయసంత వడిజుట్టి రూమాలు గట్టాను
నాకేమి తక్కువనే ఓ పిల్ల
నువ్వంటే ఆశెక్కులే నా జెల్ల ॥ఓరోరి॥

ముసలోని వంటావు ముక్కిడ్సుకుంటావు
ముతకోని వంటావు జాడిచ్చుకుంటావు
నాకేమి తక్కువనే ఓ పిల్ల
నువ్వంటే ఆశెక్కులే నా జెల్ల ॥ఓరోరి॥


ఓశోశి వయ్యారి నా శాసి బంగారి
ఏలెడంతాలేని ఎయిగాళ్ళ నాజెర్రి
గంజిదాగిన బలమే నాది గట్కదిన్న బలమే నాది


ఓ తాటిచెట్టు..



వందనాలు తల్లీ నీకు ఓ తాటి చెట్టు
నీ కన్నబిడ్డలైనట్టి గౌడన్నల గనిపెట్టు
బతుకుదెరువు నీవంటూ... నీ పంచన జేరినం
కంటమయ్య సాక్షిగ నీ పండుగ జేసినం ॥వందనాలు॥

సుక్కనీరు బోయకున్న పచ్చగ మొగి బుట్టంగ
కల్పవృక్షమై ఎదిగి మమ్ముల గాపాడినవ్
మండూటెండల్లో మాడి
సొరగొన్న గొంతులకు
కల్లుధారబోసి నీవు ముంజలు దినిపించినవ్
పడుపువృత్తి మనదంటూ పరాశికాలాడినా
కోపమంత దిగమింగి నవ్వే బలమిచ్చినవ్ ॥వందనాలు॥

మోకు ముస్తాదు గట్టి వస్తాదుగ బయలెల్ల
మువ్వల సప్పుళ్ళ గల్లు అడివంతా జల్లు
తాడుమీద మోకేసి
ఎత్తుకు నువ్వెగబాక
అడవినే జయించినా వీరునిలా గనిపిస్తవ్
గౌడవృత్తి దారుడ నీ గుండె ధైర్యము
సర్వాయి పాపన్న శౌర్యమే నీదన్నవ్ ॥వందనాలు॥

ప్రభుత్వాలు మనమీదపగబట్టి పన్నుబెంచ
కల్లుగీత కార్మికుల సంఘమెదురు నిలిచెనే
కమ్మకట్టు కులమంటూ
ఎగతాలి జెయ్యంగ
కాదు కాదు కాదంటూ కలిసి ఒకటిగుండాలే
మనహక్కుల సాధనకై ఉద్యమాలు జెయ్యంగ
గౌడవృత్తిదారుడ నీ గీసకత్తి పదును బెట్టు ॥వందనాలు॥


తాతా ఓ ఈదయ



తాతా ఓ ఈదయా
నీతోని ఆడుకున్న ఆ రోజు రాదయా
యక్షగానము పాడి పోరగాళ్ళనాడిస్తివి
ఏవేవో కథలు జెప్పి మా కావలి గాస్తుంటివి ॥తాతా॥

వాగు బొర్లితే సాలు వలసేతా బడతావు
బుట్టెడు సాపలు దెచ్చి బడదమడి జేస్తావు
బొడ్డు గిన్నెడు బువ్వ... సందమామల పులుసు
బుక్క బుక్క మలువంగా స్వర్గమొద్దనంటావు
కండ్లు లొట్టల్లున్నా... కాళ్ళు దగ్గరికైనా
సూపుతోని సుర్కబెట్టి సుక్కలు జూపించేవు ॥తాతా॥

పసుల గాసె పోరగాళ్ళ మెసలకుంట దిడుతావు
వరం సుట్టు దిరిగి సూసి మాటలు జాడిస్తావు
తుంగును జేసియ్యమంటే కమ్మాకును జుడుతావు
కంపముల్లు గుచ్చి దాన్ని శంఖమూదమంటావు
కండ్లు లొట్టల్లున్నా... కాళ్ళు దగ్గరికైనా
సూపుతోని సుర్కబెట్టి సుక్కలు జూపించేవు ॥తాతా॥

తెలంగాణ మట్టిబిడ్డ గోస జూడమంటావు
ముచ్చటెత్తితే సాలు నైజాము కెల్తావు
ఫిరంగులు ఎత్తినోల్లు తుటాలను బేల్చినోల్లు
ఏనెగుండ్లు పలుగురాళ్ళు వడిసెల రాళ్ళిసిరిననీ
కండ్లు లొట్టల్లున్నా... కాళ్ళు దగ్గరికైనా
సూపుతోని సుర్కబెట్టి సుక్కలు జూపించేవు ॥తాతా॥


ఎయ్‌మామ



ఎయ్‌మామ ఆటు ఎట్లేస్తవో
ఏసి మల్ల గుంజి సూడు ఏముంటదో ॥ఎయ్॥

సాపజెల్లపిల్ల నీకు సిక్కకుండ బాయేనా
సామిరంగ కంపమండ వలను సిక్కు జేసేనా
బంతిపువ్వు నీ వల బరువు శాన బెరిగేనా ॥ఎయ్॥

అరికాలు నీళ్ళల్ల ఆరెంట ఉరికింది
ఆకాశమార్గాన రాకిటానుకుంటుంది
అందమైన రవ్వపిల్ల మూతి ముద్దుగున్నాది ॥ఎయ్॥

ఆవొడ్డు కురికింది ఈ వొడ్డుకొచ్చింది
నడుములోతు నీళ్ళల్ల నకరాలు జేస్తుంది
ఎనబెట్టీ తిరుగుతుంటే ఎలుకోలె దిప్పుతుంది ॥ఎయ్॥


నేనెక్కడబోదునమ్మా...



నేనెక్కడ బోదూనమ్మా కరువూ గంపెత్తుకోనీ
ఏ దిక్కున బోదూనమ్మ దిక్కులేనీ పచ్చీనైతీ
కనరాని దేశంబోయి ఏ కష్టం జేదూనమ్మా ॥నేనెక్కడ॥

మోటాబాయెండిపాయే ఊరబాయూటలేదు
ఊసురుగల్లోడు లేడు పెసరి శేనడ్డం రాదు
కలిగంజిలేని బతుకు కడదేరి పోతుందమ్మా
ఆగమ్మ పచ్చులమయ్యి అల్లాడి పోతీవమ్మా
గిర్కాబాయ్ సప్పుడాగి శెత్త కుండైయ్యిపాయే
అక్కాశెల్మెండిపాయే నలగొండా గుండె బగిలే
కన్నీల్లు పాకెట్లయ్యి మా గొంతు దడుపూతుండే

అయ్యో..... నల్లగొండా
సేతివృత్తులకు దూరమైతివే వలస పచ్చివై ఆగమైతివే
కూలిలేకనువ్ కుమిలిపోతివే ఆడపిల్లలను అమ్ముకుంటివే

ఉత్తర కార్తెల్లి పాయే గంపెత్తే కాలం వొచ్చే
వినపడని అరుపూమాది కనపడని కరువూమాది
ఎట్టికి దిగజారి మేము ఉట్టిగనే బతుకూతున్నం
ఆంద్రోళ్ళ పాలనతోని అణిచేయ బడుతూ ఉన్నం
మాధాపూరందము జూడు ఫ్లయ్యోవరు బ్రిడ్జిని జూడు
కంప్యూటరు కథలు జూడు హైటెక్కు టెక్కులు జూడు
ఊళ్లకు ఊళ్లన్నీ బొయ్యి పట్నాలు పెరిగేనమ్మా
పనికోసం పట్నంబొయ్యి పండ్లిరగా పడితీమమ్మా

అయ్యో..... నల్లగొండా
సేతివృత్తులకు దూరమైతివే వలస పచ్చివై ఆగమైతివే
కూలి లేక నువ్ కుమిలిపోతివే ఆడపిల్లలను అమ్ముకుంటివే

తుంగు

తెలంగాణ పాటలు

-అంబటి వెంకన్న

పల్లె ఓయమ్మా
తెలంగాణ మాయమ్మా
జాడలేదమ్మా
నేనేడ చూడమ్మా
★ ★ ★
నాగలి బట్టిన రైతుఓయన్న
మాదారి వస్తవా చెప్పుమాయన్న
పొట్టచేతబట్టి ఎట్టిబ్రతుకు బతికే
ఎకరమైన లేని వ్యవసాయదారుడా
  ★ ★ ★
కురాట బువ్వాట పిల్లో
కూడాడు కుందామ పిల్ల
  ★ ★ ★
బక్కచిక్కినడొక్కలతో
లెక్కల్లో చుక్కల్లా
తెలంగాణ వీదుల్లో అందరమొకటై కలవాలె
అవతలివాన్ని గెలవాలె
డేగ రెక్కల ప్రపంచ బ్యాంకు
సెరువారెంట వాలింది
పాటమీద గూకుంది
శవాల బీక్క తింటుంది

గోసంగి నీలిసాహితి

నల్లగొండ


బతుకమ్మ పాట



బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో
బంగారి గౌరమ్మ ఉయ్యాలా..
ఉయ్యాల ఉయ్యాల ఉయ్యాలో
ఉయ్యాల ఊగంగ ఇయ్యాలా... ॥బతుకమ్మ॥

సినుకు రాలిన తడవ ఉయ్యాలో
మనసు విరిసేనమ్మ ఉయ్యాల
రంగుల రంగులపూలు ఉయ్యాలో
రంగవల్లులాయే ఉయ్యాల
భూతల్లి కొప్పున ఉయ్యాలో
పొన్నగంటి పూలు ఉయ్యాల ॥బతుకమ్మ॥

బంగారు వన్నెల ఉయ్యాలో
తంగేడు పువ్వు దెచ్చి ఉయ్యాలా
శివుడు మెచ్చిన పువ్వు ఉయ్యాలో
జిల్లేడు పువుదెచ్చి ఉయ్యాలా
బతుకమ్మనే జేసి ఉయ్యాలో
సూడసక్కధనము ఉయ్యాలా ॥బతుకమ్మ॥

బాయిబొందలు దిరిగి ఉయ్యాలో
ఎర్రదుబ్బలు దిరిగి ఉయ్యాలా
ముద్దుముద్దు పూలు ఉయ్యాలో
పొద్దుగూకులేరి ఉయ్యాలా
ఇల్లు నిండిన పూలు ఉయ్యాలో
సాపసుట్టు బేర్చి ఉయ్యాలా ॥బతుకమ్మ॥

ఇరగబూసిన గునువు ఉయ్యాలో
గుణముగల్లాదమ్మ ఉయ్యాలా
గోరెంక పువ్వుల్లో ఉయ్యాలో
తేనెటీగల పాట ఉయ్యాలా
ఆటపాటల పల్లె ఉయ్యాలో
తిర్ణాల రథమాయె ఉయ్యాలా ॥బతుకమ్మ॥

ఆరంపది రోజులు ఉయ్యాలో
సేను సెలకలు దిరిగి ఉయ్యాలా
సోంపు ఏరుకొచ్చి ఉయ్యాలో
ఇల్లంత పువ్వేసి ఉయ్యాలా
తీరొక్క రంగద్ది ఉయ్యాలో
బతుకమ్మనే జేయ ఉయ్యాలా ॥బతుకమ్మ॥

పసుపుముద్దన గౌరి ఉయ్యాలో
పంచవన్నెల తల్లి ఉయ్యాలా
పత్తిహారమేసి ఉయ్యాలో
పైటకొంగుజుట్టి ఉయ్యాలా
సింగుడుడ్డిన కొండ ఉయ్యాలో
నేలమీదా నిండె ఉయ్యాలా ॥బతుకమ్మ॥

ఉష్కలబుట్టింది ఉయ్యాలో
ఉష్కల బెరిగింది ఉయ్యాలా
పొన్నగంటి తాల్లు ఉయ్యాలో
పోకలున్న వనము ఉయ్యాలా
తీరొక్క పువ్వులో ఉయ్యాలో
కొటొక్క అందము ఉయ్యాలా ॥బతుకమ్మ॥

గౌరమ్మ గాంభీరం ఉయ్యాలో
తాంబాలము నిండె ఉయ్యాల
పట్టుబట్టలుగట్టి ఉయ్యాలో
పడుసుపిల్లలు మురిసె ఉయ్యాలా
గౌరినీ జూడంగ ఉయ్యాలో
నీలిమబ్బురాదా ఉయ్యాలా ॥బతుకమ్మ॥

గంధాలుబుయ్యంగ ఉయ్యాలో
గంతులేసే పిల్లలు ఉయ్యాలా
రింగన్న పురుగోలె ఉయ్యాలో
రివ్వున రివ్వున దిరిగె ఉయ్యాలా
అమాస సీకట్లో ఉయ్యాలో
మినుగురు పూలయ్యె ఉయ్యాలా ॥బతుకమ్మ॥

మొగపిల్లలా కొరకు ఉయ్యాలో
పచ్చిపసరు దాగే ఉయ్యాలా
పట్నాలలో జూడ ఉయ్యాలో
కన్నఏశమాయె ఉయ్యాలా
కట్నమియ్యలేక ఉయ్యాలో
కడుపులోనె బొంద ఉయ్యాలా ॥బతుకమ్మ॥

ఆడజన్మలు గౌరి ఉయ్యాలో
సృష్టికే మూలంబు ఉయ్యాలా
గౌరమ్మనెత్తంగ ఉయ్యాలో
ఆడబిల్లలు లేక ఉయ్యాలా
నిన్నుమోసే తల్లి ఉయ్యాలో
నిమిషమన్న దలిసెఉయ్యాలా ॥బతుకమ్మ॥

తల్లిగౌరిని జూడ ఉయ్యాలో
రెండుకండ్లు జాలవు ఉయ్యాలా
తల్లిగారింటికి ఉయ్యాలో
ఎల్లిపోతమంటు ఉయ్యాలా
అత్తమామల మీద ఉయ్యాలో
ఆడపిల్లలు అలిగె ఉయ్యాలా ॥బతుకమ్మ॥

మలీద ముద్దలు ఉయ్యాలో
సద్దిగట్టి మనమూ ఉయ్యాలా
సద్దబూరెలు బెట్టి ఉయ్యాలో
గౌరి రథము జేయ ఉయ్యాలా
అయ్యగారిని బిలువ ఉయ్యాలో
అరిగిపోయిన మంత్రము ఉయ్యాలా ॥బతుకమ్మ॥

గాజు మెట్టెలు గౌరి ఉయ్యాలో
ముత్తయిదు భాగ్యము ఉయ్యాలా
లోకానికందించి ఉయ్యాలో
సోకాలు బాపేవు ఉయ్యాలా
మహిమ గల్ల గౌరి ఉయ్యాలో
మదినిండ నిలిసేవు ఉయ్యాలా ॥బతుకమ్మ॥

మముగన్న మాతల్లి ఉయ్యాలో
ఆదిశక్తివి తల్లి ఉయ్యాలా
లోకమాతవు తల్లి ఉయ్యాలో
ఎంత ఓపిక తల్లి ఉయ్యాలా
పసుపు కుంకుమ లిచ్చిఉయ్యాలో
పచ్చంగ జూసేవు ఉయ్యాలా ॥బతుకమ్మ॥

శివపార్వతుల జంటఉయ్యాలో
సూడసక్కనిదమ్మ ఉయ్యాలా
శివునెంట గదిలింది ఉయ్యాలో
భూలోకమేగింది ఉయ్యాలా
ఎదిక్కు జూసినా ఉయ్యాలో
దిక్కులేని జనము ఉయ్యాలా ॥బతుకమ్మ॥

కష్టజీవుల జూసి ఉయ్యాలో
కన్నీరు బెట్టింది ఉయ్యాలా
సిరిగల్ల గౌరమ్మ ఉయ్యాలో
ఈతిబాధలు దీర్చ ఉయ్యాలా
పతిదేవు ఒడిలోన ఉయ్యాలో
అలకబూని అడిగె ఉయ్యాలా ॥బతుకమ్మ॥

కోపగొంటి శివుడుఉయ్యాలో
కోడెనాగు శివుడు ఉయ్యాలా
వనమెల్లా దిరిగిండు ఉయ్యాలో
జనమల్ల గలిసిండుఉయ్యాలా
జంజకిడిసిన వాడు ఉయ్యాలో
ఎట్ట ఏగుతవమ్మ ఉయ్యాలా ॥బతుకమ్మ॥

భోళాశంకరుడమ్మ ఉయ్యాలో
మాయలోడు తల్లి ఉయ్యాలా
గంగకోసమమ్మా ఉయ్యాలో
జంగమేశమేసి ఉయ్యాలా
వాగువంకలు దిరిగిఉయ్యాలో
జగమంత గాలించె ఉయ్యాలా ॥బతుకమ్మ॥

గంగనే దెచ్చిండు ఉయ్యాలో
జడలోన జుట్టిండు ఉయ్యాలా
ముద్దు ముద్దుగ జూసి ఉయ్యాలో
పొద్దునే మరిసిండు ఉయ్యాలా
గారంగ జూసిండు ఉయ్యాలో
గంగలో మునిడిండు ఉయ్యాలా ॥బతుకమ్మ॥

గంగమ్మనే జూడ ఉయ్యాలో
ఆకలి దూప బాసే ఉయ్యాలా
సెయ్యెత్తి మొక్కంగ ఉయ్యాలో
సెలిమల్లో ఊటాయె ఉయ్యాలా
కొండల్లో గుట్టల్లో గంగమ్మనీ
తొంగిచూసే ధైర్యమేడున్నది ॥బతుకమ్మ॥

పొద్దుమాపు లేక ఉయ్యాలో
హద్దుపద్దు లేక ఉయ్యాలా
ఆటలాడే సూడు ఉయ్యాలో
తీటకొయ్యలాకు ఉయ్యాలా
పూటగడుపుకుంట ఉయ్యాలో
గౌరమ్మనే మరిసె ఉయ్యాలా ॥బతుకమ్మ॥

జాడదెలిసిన గౌరి ఉయ్యాలో
అగ్గి గుగ్గిలమయ్యి ఉయ్యాలా
పొయిలోని నిప్పుల్లో ఉయ్యాలో
ఉప్పుగల్లయ్యింది ఉయ్యాలా
చిటపట పట మంటు ఉయ్యాలో
పండ్లు గొరికీనాది ఉయ్యాలా ॥బతుకమ్మ॥

ఉగ్రరూపము దాల్చి ఉయ్యాలో
మీదికురికెను గౌరి ఉయ్యాలా
ఏడబుట్టినావే ఉయ్యాలో
ఈడకొచ్చినావు ఉయ్యాలా
శివమెత్తి గౌరమ్మ ఉయ్యాలో
జుట్టుబట్టినదమ్మ ఉయ్యాలా ॥బతుకమ్మ॥

ముక్కంటి శివుడినే ఉయ్యాలో
ముప్పు తిప్పలు బెట్టి ఉయ్యాలా
ఏడేడు లోకాలు ఉయ్యాలో
సప్తసంద్రాలల్ల ఉయ్యాలా
బుడుగు బుడుగున ముంచి ఉయ్యాలో
నెత్తినెక్కిన గంగ ఉయ్యాలా ॥బతుకమ్మ॥

ఎగిరి దునికి గంగ ఉయ్యాలో
ఎదురు దిరిగెను గంగ ఉయ్యాలా
సిగురంత అమ్మంగ ఉయ్యాలో
ఇండ్లు దిరిగిన దానివి ఉయ్యాలా
పచ్చ గూరలు అమ్మి ఉయ్యాలో
పతివత వైనావే ఉయ్యాలా ॥బతుకమ్మ॥

మాటమాట బెరిగి ఉయ్యాలో
శాపనార్ధాలాయె ఉయ్యాలా
బతుకమ్మ పండుగ ఉయ్యాలో
ఎట్లజేస్తరో జూస్త ఉయ్యాలా
సుక్కనీరు లేక ఉయ్యాలో
భూమి బగ్గున మండు ఉయ్యాలా ॥బతుకమ్మ॥

ఎంత దిరిగిన గాని ఉయ్యాలో
పువ్వు దొరకదు సూడు ఉయ్యాలా
ఎంగిలి పువ్వుతోనే ఉయ్యాలో
ఎండిపోతవు నువ్వు ఉయ్యాలా
ఆడి ఆడి నిన్ను ఉయ్యాలో
గుడిమీద బారేస్తరుయ్యాలా ॥బతుకమ్మ॥

గంగమ్మ గౌరమ్మ ఉయ్యాలో
ఈరంగ మాడిండ్రు ఉయ్యాలా
ఈరబోసుకోని ఉయ్యాలో
జగడాలు జేయంగ ఉయ్యాలా
ఎడేడు లోకాలు ఉయ్యాలో
గడగడ లాడేను ఉయ్యాలా ॥బతుకమ్మ॥

మాట కోటలు దాటి ఉయ్యాలో
సవితి పోరు జరిగే ఉయ్యాలా
సాపెండ్లు బెట్టంగ ఉయ్యాలో
దుమ్మెత్తి పోసిండ్రు ఉయ్యాలా
సంద్రాలు హోరె ఉయ్యాలో
భూమి నెర్రెలిచ్చే ఉయ్యాలా ॥బతుకమ్మ॥

ఆ పోరు జూసిన సామి ఉయ్యాలో
నోట మాట రాలె ఉయ్యాలా
కైలాటమే జూసి ఉయ్యాలో
కైలాసమె నవ్వె ఉయ్యాలా
ఇల్లు ఇడిసి సామి ఉయ్యాలో
దేశ సంచారయ్యే ఉయ్యాలా ॥బతుకమ్మ॥

ఒక్కటంటివి తల్లి ఉయ్యాలో
వందమాటలు బడితివి ఉయ్యాలా
వద్దు వద్దు తల్లి ఉయ్యాలో
పార్వతీ మాతల్లి ఉయ్యాలా
గయ్యాలి గంగతో ఉయ్యాలో
ఎగలేవు తల్లి ఉయ్యాలా ॥బతుకమ్మ॥

పసుపు వన్నె తల్లి ఉయ్యాలో
పసిడి కాంతుల తల్లి ఉయ్యాలా
బతుకు బాటలోన ఉయ్యాలో
బంధాలు తెగకుంట ఉయ్యాలా
శాపాలు దొలగించి ఉయ్యాలో
సల్లంగ జూసేవు ఉయ్యాలా ॥బతుకమ్మ॥

మనసున్న మాతల్లి ఉయ్యాలో
మాటబడనీదమ్మ ఉయ్యాలా
ఇంటోడు దిగిరాక ఉయ్యాలో
ఇన్ని మాటలాయె ఉయ్యాలా
మబ్బుగమ్మిన మనసు ఉయ్యాలో
మారు బలకాలేదు ఉయ్యాలా ॥బతుకమ్మ॥

అంతలోనే గంగ ఉయ్యాలో
ఆగమాగం జేసి ఉయ్యాలా
కోపంతో రగిలింది ఉయ్యాలో
కొరివోలె లేసింది ఉయ్యాలా
పొర్లిపొర్లి గంగ ఉయ్యాలో
తెర్లు తెర్లు జేసే ఉయ్యాలా ॥బతుకమ్మ॥