అంబటి వెంకన్న పాటలు/జిల్లెడుపూలు

వికీసోర్స్ నుండి

నల్లగొండ



ననుగన్న పల్లేతల్లి నా జిల్లా నల్లాగొండ
వెలసినావు వైభోగంగా నిలిచినావు గుండెల నిండ ॥ననుగన్న॥

సింగభూపాల రాజు రాజధాని రాసాకొండ
యాదవర్షి తపసూ ఫలితం తెలంగాణ తిరుపతికొండ
యాదగిరి లక్ష్మీ నరసింహ్మ....నీ.... గర్భాన వెలసీ నాడమ్మా
పానగల్లు నిలయామైన పచ్చలసోమేశ్వరుడు
చాళుక్య చోళులనాటి దట్టమైన శిల్పాలెన్నో
త్రికూటాలయములో ఉన్నా... ఈ.... నీడల గమ్మత్తు నీవేలే ॥ననుగన్న॥

సోగుబడ్డ కొండలు నిండ బోనగిరి వేములకొండ
కొండమీద పేర్చిన గుండ్లు చెరువుగట్టు మూడురాళ్ళు
సెరికెల్లో దాగిన శివుడమ్మో... ఈ... జడగట్టి ఎత్తుకున్నాడా
నీలగిరి కొండలు రెండు నింగినెప్పుడు వంచుతునుండు
ఆమెడలో బంగారు హారం మెరిసేటి దేవరకొండ
కులమత భేధము లేకుండా...ఈ.. కూడుండే సంపద నిచ్చినవే ॥ననుగన్న॥

ఎద్దోలే కష్టం జేసే పానగల్లు వొద్ది రాజులు
వరిసేను కోత గోసి అడిగినారు తూంఏడొడ్లు
సిత్పగొడ్డలి తూము నింపిండే ...నీ కన్న బిడ్డల కష్టం మింగిండే
సీతమ్మా శరలోయమ్మా ఓబిడ్డ బాల నాగమ్మా
నీ గాథ విన్న జనము ఏడ్చేడ్చి తూములు నిండే
బాలవద్దీ రాజుల గన్నావే.....మాయల పక్కీరుల జంప ॥ననుగన్న॥

సీతమ్మ చీరలు ఎన్నో రామయ్య పాదాలెన్నో
బదరీకా వనమూ నిండా పాలరాయి పరుపు బండ
నాపరాళ్ళ సాపలు బరిశావే.....శ్రీ నాదుడాగస్థ్యులకు
ఎర్రబెల్లి బంగారు గుట్టలు అంతులేని యురేనియాలు

వాడపెల్లి సల్లగుండా సిమిటి దుమ్ము వంటి నిండా
కిష్ట, మూసీ గల్సి వచ్చేనే.....నీ వంటి దుమ్ము తేటగ జెయ్యంగ

వెల్లటూరు గ్రామంలోన ఉత్తరంగా ఉరికే కిష్టల
దాగి ఉన్న బంగారు గుడిని జాడ జెప్పిన బెస్తవాన్ని
కడుసూపు జూసుకున్నావా.... కడుపులోనే దాసుకున్నావా
పామోలే మెలికలు దిరిగి పడిగోలే ఫనిగిరి ప్రాంతం
పరమేశు మూడో కన్నై పౌరుషాల పురిటి బిడ్డయ్
కాకతీయ రాజుల పాలనలో....వీరత్వం నిలుపుకున్నావే ॥ననుగన్న॥

నటనకే నడకలు నేర్పి వెండితెరకు రంగూలద్ది
సాహిత్య సాగర మధనం చేసినట్టి కలములు పుట్టి
తెలుగుకే నుడికారమైనావే... ఈ... జానపద రాగమైనావే
హిందూమత శుద్దీకోసం వెలసినట్టి జైనం బౌద్ధం
ఆచార్య నాగార్జునుని అడుగులే విజయాగర్వం
బుద్దుడే తిరుగాడినట్టుందా... ఆ... వీరులే ఊరేగినట్టుందా

ననుగన్న పల్లేతల్లి నా జిల్లా నల్లాగొండ
ఉద్యమాల పురిటి గడ్డ పౌరుషాన పెద్దబిడ్డా

నైజాము పాలనలోన రగిలినట్టి రజాకార్లు
మానపానాలెన్నో దీసి దోసుకున్న దొంగల గుంపు
గుర్రాల సకిలింపిటేనే...... నీ గుండే సప్పుడాగిపోయిందా
ఖాసీము రజ్వీగాడు కండ్లెర్ర జేసిననాడు
నీ కన్నా బిడ్డలంతా ఎదురునిల్చి పోరాడిండ్రు
ఏమిరాత రాసుకున్నావే...ఈ...నెత్తురంటని జాగేలేదాయె ॥ననుగన్న॥

గెరిల్లా పోరుబిడ్డలు బందగీ ఐలమ్మాలు
తెలంగాణ సాయుధపోరు అమరులాకు వందనాలు
పోరాడే వీరుల గన్నావే....ఆ... విప్లవాల ఉగ్గుదాపినవే

ఎదిగేటి బిడ్డలాను పోడిసేటి పొద్దున జూసి
వొరిగేటి వీరుల మోము ఆ నింగి సుక్కల జూసి
పొద్దంతా భుజాన మోస్తావే.... పొద్దూక జోకొడుతుంటావే

ననుగన్న పల్లేతల్లి నా జిల్లా నల్లాగొండ
తిరగంగా ఊరూవాడా కనరాదు నీటిజాడా

కాళ్ళుజూసి సెప్పొచ్చయ్యో కంకణాల పెళ్ళోడాని
తాటికల్లు పాలూ నీల్లూ మొత్తమంతా ఫ్లోరిన్ మయమూ
కాలు జెయ్యి మెలికలు దిరిగేనే.... ఆ... శివ రామా ధనుస్సులాయేనే
నింగి తొంగి చూసినట్టు వంగి, వంగి నడిసే మాకు
రెండు కాళ్ళు ఈడ్చి, ఈడ్చి మోకాళ్ళ సిప్పలు అరిగే
కాళ్ళీడ్చే గాడిద బతుకాయె...యే.....మము జూసే దిక్కేలేదాయె ॥ననుగన్న॥

గలగలా గోదారమ్మ పొలిమేరా దాకకుంట
పరిగెత్తీ పరుగులెత్తీ పొంగి పొర్లి సంద్రంజేరే
మనమేమీ పాపం జేసినమో... ఈ... సుక్కనీటికి ఎక్కిళ్ళు బెడ్తీమి
బిరబిరా వచ్చీన క్రిష్ణా నల్లగొండ నడుమా జేరి
సంద్రమంటి సాగరులోన చెంగనాలు దోలుతుందీ
ఎన్నిరాల్లు ఏరుకొచ్చేనూ.... ఈ.. గుక్కెడన్నా గొంతుజేరంగా ॥ననుగన్న॥

ఈగ ముసిరి గడ్డల్లాంటి చక్రాల బండ్లను డొలిపి
ఉన్నొక్క చెయ్యి గూడ కాయగాసి కంతిదేలే
కనికరించే దేవుడు లేడయ్యో...మా.. ఉసురు దగిలి వొరిగి పోతారే
మూతి మీసం వచ్చినగాని అమ్మసంక దిగరాదాయె
వచ్చినోనికి పబ్బతి బట్ట ఒక్కసెయ్యి గదలక పాయె
పొగరు బోతు గడ్డను కుంటారే.... పోర్లు దండాలెన్ని బెడ్తున్నా


ఏటి ఊయల పాట



ఏటి ఊయల పాట గోదారీ
ఏడు పాయల తల్లి గోదారీ
ఎగిరి దూకుతుంటె గోదారీ
ఎద పులకించి పోతుంది భూదేవి ॥ఏటీ॥

వానమ్మ కడుపులా బడకా ముందు
ముబ్బు తెప్పల ముసుగేసుకుంటది
చక్కూన మెరిసి ఉరుములురుమంగ
ఊపిరంత బిగదీసుకుంటది
మేఘాలు దీసిన పురిటి నొప్పులతోని
చినుకయ్యి రాలింది భూతల్లిని జేరింది ॥ఏటీ॥

నింగి కొంగు నిండ గప్పుకోనీ
మారాటలో పురుడు బోసుకుంది
మంజీర శబరి మానేరుతో గలిసి
వంపు సొంపుల వయ్యారవొంపింది
పెనుగంగ వేగంగ తనవొడిని జేరంగ
చెంగనాలేసింది మనలనిడ్సే పోయింది ॥ఏటీ॥

దొరకా కుంట ఉరికి తల్లి గోదారీ
భద్రాచలము కాడ ఓలలాడింది
దిక్కుమొక్కులేని ధీనజనులంతా
ముక్కుమూసుకోని మూడుసార్లు మునిగీ
తానాలెన్నో జేసి బోనాలు బెట్టంగ
ఉప్పునీరయ్యింది బతుకు బైరూపుజేసింది ॥ఏటీ॥

నీటిబొట్టు మీద మన పాలకులంతా
నేతిబీరతీగ నీతులల్లుతుండ్రు
కేంద్రంలో, రాష్ట్రంలో రాజకీయాలల్లో
గొంతుజింపుకోని మైకులిరగొడ్తుండ్రు
ఉప్పుదిని గోదారీ ఊపిరిడ్సుతుంటే
సుడిదిరుగు తుంటారు వాళ్ళు మడిగట్టుకుంటారు

ఏటి ఊయల పాట గోదారీ
ఏడు పాయల తల్లి గోదారీ
పొంగి పొర్లిపాయె గోదారీ
మాకు ఏడుపాయె తల్లి గోదారీ


తెలుగునేల-తెలంగాణ



తెలుగు నేల - తెలంగాణ తల్లడిల్లుతుందిరో
ఆంధ్రోని సేతలకు అల్లాడుతుందిరో ॥తెలుగునేల॥

ఈ మట్టి మీద కుంపటేసి బతుకులన్నీ బుగ్గిజేసి
భాగ్యనగరును తీర్చిదిద్ది మాదాపూరును సోకుజేసి
కూడులేక మనము జస్తే అభివృద్దని జెప్పుతుండు
ఇకనైనా దెల్సుకోరా ఓయన్నా
ఇప్పుడేమి జేద్దామో చెప్పురన్నా ॥తెలుగునేల॥

పప్పుకూడుకు మరిగినోడు గొప్పలెన్నో జూపేటోడు
పాయదార్లు జూపినాడు వచ్చె సంపద దోసినాడు
కష్టమో, నిష్ఠూరమో ఆ సోపతింకా జాలురా
వానింట్ల సొమ్ము వొద్దురా ఓయన్నా
మన నీరు ఇక వేరు కావాలన్నా ॥తెలుగునేల॥

స్వర్ణాంధ్రని చెప్పినారు అప్పులెన్నో దెచ్చినారు
ఆగమాగం జేసినారు బతుకు రోడ్డుకీడ్చినారు
ఇన్ని ఏశాలేసినంక కల్సిఎట్ట బతికేది
వాడు మనమూ వేరేరా ఓయన్నా
ఇకనైనా విడిపోదాం మాయన్నా ॥తెలుగునేల॥

నేల సాంతిమి నోరుదెరిసి బోళ్ళు బెరిగి బీళ్ళువారే
ఎటుజూడు మంగ గుదుమలు ఎండిపోయిన బల్సుపొదలు
ఎందుకిట్ల ఉన్నదంటే అన్నలే ఆటంకమంటరు
మన ఏలే కంట్ల బొడిసే ఓయన్నా
దీనంతు మనము దేల్సాలే మాయన్నా ॥తెలుగునేల॥

ఆంధ్రోల్ల తిండిజూడు ఆడుగట్టే బట్టజూడు
మాట్లాడే భాషజూడు ఆని మదిలో మనల జూడు
మన వంటి సెమట, కన్నీరు దొర్లిపోయె ఆంధ్రప్రాంతం
తిరిగి సూద్దాం వస్తవారా ఓయన్నా
ఆ పచ్చదనము కండ్ల సలువ మాయన్నా ॥తెలుగునేల॥

నీరులేక పోరుజేస్తే పొగరుబోతు లంటిరి
కూడులేక గోడు జేస్తే సిన్నసూపు జూస్తిరి
ఇంక మేము నిన్ను నమ్మి ఎట్ట ఊరుకొందుము
మన చేతిలో ఓటుందిరా ఓయన్నా
అది ఓ ఆయుధమే మాయన్నా ॥తెలుగునేల॥

రెక్కలొచ్చిన పిట్టెల్ల తల్లిగూడును వీడినట్టు
పిల్లఏరు పారినట్లు అన్నదమ్ములు వీడినట్టు
ఇన్నినాళ్ళ కన్నీళ్ళకు న్యాయమైతే జరగాలే
ఇది తెల్సుకొని ఉరికిరార ఓయన్నా
ఇక మన పాలు అడుగుదాము మాయన్న ॥తెలుగునేల॥

మన నీరు మనది గాదు మన ఏరు మనది గాదు
ప్రాజెక్టులు మనయి గావు పరిపాలన మనది గాదు
అన్ని వానివయ్యివంక పొత్తు ఎట్ట గుదురుతుంది
ఆ ఏలేటోన్ని సాగనంపుదామోయన్నా
ఉద్యమాల జెండబట్టు మాయన్నా...


జీతగాడు



జీతగాడు జీతగాడమ్మో మా రాజిగాడు
పుడమి కడుపున వొదిగినాడమ్మో
తలిదండ్రిలేని పోరగాడమ్మో మా రాజిగాని
రాతరాసిన దేవుడెవడమ్మో ॥జీతగాడు॥

లేపలేని సెప్పుదొడిగి నడవలేక ఈడ్చి ఈడ్చి
నెత్తురోడిన కాళ్ళతోని గాయపడిన లేడిపిల్లయ్
బుడదమడిలో అడుగుబెట్టేను
మెత్తబడి ఆ దుక్కిమడిలో సొక్కిపోయేను
పసరుదోస పెసరు పిందెలు పాలుగారే సద్దకంకులు
రంగు రంగుల పాలపిట్టెలు పాటబాడే కోయిలమ్మలు
అన్ని నీకై అవతరించేనా
అంబటాల దాటినా సద్దిబువ్వ రాకపొయ్యెనా ॥జీతగాడు॥

దొడ్డెడు పసులెనుక నువ్వు పొద్దుగూకులు దిరిగి తిరిగి
కొట్టంల గట్టెయ్య బోతే కొమ్ముదగలి కంతబగిలే
దాపటెద్దు కాలుదొక్కిందా
తమ్ముడా నిను ఆవుపెయ్య ఎగిరితన్నిందా
పక్షులన్ని గూడుజేరే సూరిడే తల్లొడిన జేరే
ఎవరు దిక్కు లేని నువ్వు ముద్దదిని బాయ్‌బాట బడితే
ముద్దులిచ్చే తల్లి ఏడుందో
ఓరయ్య నీకు బుద్ధి జెప్పే తండ్రి ఏడుండో ॥జీతగాడు॥

భుజం మీద నల్లగొంగడి చేతిలేమో ముల్లుగర్ర
జడుసుకున్న జేరుగొడ్డయ్ డొంకజాగిన తీరుజూసి
చెట్టుచేమ పలకరించేనా
నీ గోసజూసి మినుగుపూలు తొవ్వజూపేనా
రాతికట్నం బాయిలోన గంపజలతో ఘల్లుజూసి

సుట్టుశిమ్మ శీకటున్న ఊట నీటి పాటలింటూ
బాయిమోటర సాటరొత్తేవు
పంటసేలకు నీళ్ళుదాపి పరవశించేవు ॥జీతగాడు॥

పొలందిరిగి సూసెటందుకు వొరం మీద ఉరికి ఉరికి
బొక్కబోర్ల జారిపడితే అమ్మ అయ్యను దల్సుకుంటు
నీరుబారిన జాడ జూస్తావు
దేవుండ్ల దిడ్తూ ఎలుకరాజుల గండ్లు మూస్తావు
సుట్టుఎవరు తోడులేక కంటినిండా కునుకు రాక
పురుగు బూషి దాగి ఉండే తలములోనే ముడ్సుకొని
ముతకదుప్పటి గప్పుకుంటావు
పడుగుమీద కుక్కపిల్లయ్ ఒదిగిపంతావు ॥జీతగాడు॥

మోటకింది పౌడుకంటి స్థంబమెక్కి కూతబెడితే
అదునుజూసి శెనిగశేలనక్కబావ ఊల బెడితే
బీడిముక్కే ధైర్యమిచ్చేనా
అగ్గిజూసి కొరివిదయ్యం బారిపొయ్యెనా
ఆరోజులన్ని మాయమాయె మాయమాటల గారడాయె
కూలీరేటు బెరిగిపోయిన కూటికీ గతిలేకపాయె
బావులన్నీ ఎండిపోయేనా
తమ్ముడా ఈ బోరుబావులు అధికమయ్యేనా ॥ జీతగాడు॥

కారెంటు తిప్పలాయె ఎప్పుడొస్తదో తెలువదాయె
కల్లబొల్లి మాటలాయె కనికరించని సర్కరాయే
ఆ పంటసేలే మాయమయ్యేనా
ఇయ్యాల నీకు పత్తి మందుల పాలబువ్వేనా
గొడ్డుగొదా అంతరించే అన్ని పనులకు యంత్రమొచ్చె
నీతి దప్పిన రాజ్యమయ్య నిలువ నీడా లేకపాయే
తెలంగాణ తెచ్చుకుంటేనే ఒరి తప్పుడా నీ తిప్పలన్నీ తీరిపోతయిరా
పొడిసేటి పొద్దు నువ్వేరో మా తమ్ముడా నువ్ పోరుజెండాలెత్తుకోవేరో


రావాలె రావాలె ఓయమ్మా



రావాలె రావాలె ఓయమ్మా తెలంగాణమ్మా
నువ్వు కావాలె కావాలె మాయమ్మా
వస్తున్న పోతున్న ఓరామ చిలుకానీ
రాజేడంటే ఎనుక ఉండానీ
ఆశబెట్టి అగ్గిపాలు జేసేటి ఆంధ్రపాలనొద్దు మాయమ్మా
మా బతుకులాగమాయె సూడమ్మా. ॥రావాలె॥

సుక్కబొడవకముందు లేసినా ఎదోలే కష్టం జేసినా
ఎన్ని పంటలు ఏసినా నేనెంత సాకిరీ జేసినా
పస్తులుండక తప్పలేదు పుస్తె మెట్టెలమ్మక దప్పలేదు ॥రావాలె॥

పోరగాళ్ళ సదివిచ్చినా పలక బలపమిచ్చి మురిసినా
సెమట బిండి ఫీజు గట్టినా ఎంత సదువు జదివిచ్చినా
కూలీ జెయ్యక దప్పలేదు కులవృత్తి జేయక దప్పలేదు ॥రావాలె॥

మా గోస జూసేగా నేలంతా గుండె బగిలి నెర్రెలిచ్చింది
మా ఒంటిలోని సెమట బొట్టేగా మీ ఇంటిలోన కూలరయ్యింది
గుడిసెలుండక దప్పలేదు మాకు గుడ్డి బతుకు దప్పలేదు ॥ రావాలె॥

కారేటి కన్నీరు సాక్షిగా ఆ పారేటి నదులన్ని మాయేగా
ఏలేటి మారాజు జెప్పగా మా బతుకంతా పువ్వుల బాటంటా
ఈ మాయమాటలింకా ఆపాలే మా నేల మీరు కాలీ జెయ్యాలే
ఈ మాయమాటలింకా ఆపాలే మా నేల మీరు కాలీ జెయ్యాలే


ఓయన్నా...ఓటరన్న



ఈరన్న :- ఓయన్న ఓటరన్న ఓటెయ్యా రెంకన్న
               నాటేమైనా గానియ్యి నీ నాటేమైనా గానియ్యి
               నాటేసి ఓటెయ్యరో
              “నాటు” ఏసేసి ఓటెయ్యరో ॥ఓయన్న॥
               కోతేమైనా గానియ్యి వరి కోతేమైనా గానియ్యి
               కోసేసి ఓటెయ్యరో
               'కోత'లు గోసేసి ఓటెయ్యరో ॥ఓయన్న॥

ఎంకన్న :- నీపాట సల్లగుండ నువ్వుండన్నా గట్నించి ఏమో వస్తుంది సూడు
              రాజొచ్చే రధమును జూడు
              రెప రెపమనే జెండను జూడు
              చెక చెక్కా చెమ్మ చెక్క
              టిక టిక్కా నిన్ను మొక్క
              టక టక్క కొంగరెక్క
              రాలిందే ఇపుడిటు పక్క
              ఢిక్కీ ఢిక్కీ, ఢిక్కీ ఢిక్కీ, డిక్కీ ......య్
              ఢీ..ఢీ.. డిక్కీ బండొచ్చే
              రోషిన, మాషిన పాటలతో
              ఢీ, ఢీ డిక్కీ బండొచ్చే
              కుళ్ళిన, పాశిన కూతలతో
              ఢీ, ఢీ డిక్కీ బండొచ్చే

గంగన్న :- యహే! మీరాగుర్రా గాళ్ళేమో సెప్తుండ్రు ఇందాం!

నాయకులు: ఓయన్న ఓటరన్న ఓటెయ్య రారన్న
                నోటిస్తం, మాటిస్తం
                మాటలతో కోటలు గడుతం

             ప్రసంగాల ప్రాజెక్టులు గడుతం
             గెల్సినంక మిము మర్సే పోతం
             ఉన్నదంత ఊడ్చేసుక తింటం ॥ఓయన్న॥
ఈరన్న :- అగో ఇన్నరుగా ఆ రాజకీయ నాయకులు ॥ఏంజెప్పిండ్రో॥
             గట్టుంటదాళ్ళ కత
             ఓయన్న ఓటరన్న
             సెప్పేది ఇనుకోరన్న
             ఎనక ముందు నువు జూడుకుంట మరి
             ఎలగడ ఎద్దయ్ సాగిపోతవు
             బుక్కెడు కూడు సక్కగదినక
             ఎండి, పండి నువు కోతకైతవు
             ఐదేండ్లు దుంతర్రో
             అంకెబెడితే నిను తంతర్రో ॥ఓయన్న॥
             యహే! నేంజెప్పేదేంది గాని ఆళ్ళేమో సెప్తుండ్రు ఇండ్రి
ఒకపార్టీ నాయకుడు :- ఓయన్న ఓటరన్న ఓటెయ్య రారన్న
             మా పార్టీ మొన గాంది
             పైసలెన్నో పంచింది
             పంచాదు లెన్నొ బెట్టింది
             కాకుల కావలి బెట్టింది
             ప్రజాస్వామ్యాన్ని సంపింది
             లిక్కరు సీసలు పంచింది
             అక్కెర బడితే తన్నింది
             బజారు కుక్కల జేసింది
             బెజారెత్తగ జూసింది
             బెదిరిచ్చి లొంగదీసింది.
ఇంకోపార్టీ నాయకుడు :- ఓషి ఇంతేనా
            మా పార్టీ మొన గాంది

              ఆడపడుచులను బట్టింది
              చీరలు సానా జుట్టింది
              రైక ముక్కలు బెట్టింది
              సారె బోసి వడి నింపింది
              రైతు కూలీల బట్టింది
              గుడుంబ కుండలు దింపింది
              ముసలి వాళ్ళను జూసింది
              వంగి, వంగి మరి నడ్సింది
              కాశీ బాటను జూపింది ॥ఓయన్న॥

ఎంకన్న :- ఛ! సెండాలం సేసినయన్ని జెప్పకుర్రా
             జనం ఓట్లేస్తరు. పిచ్చి జనం
గంగన్న :- ఎస్తమంటవానే?
ఈరన్న :- ఆఁ ఎందుకెయ్యం నాయినా!
             సిగ్గులేదు మనకు.........ఓటెయ్యడానికి
             లజ్జ లేదు మనకూ
             శరం లేదు మనకు ఎంత జేసిన
             బుద్ది రాదు మనకూ
మాటలు :-జనం ఓట్లయితే గుద్దిండ్రు ఐతే
             ఏంజరిగిందో గానారి ఎంకా
             ఇగజెప్త ఇను
             జనం ఏమో తెల్విదక్కువోలనుకున్నావురా!

            నక్కను జూసి ముక్కను వదిలే
            కాకులమింకా మేము గామని
            “నాటు” నోటుకు అమ్ముడు బొయ్యి
            ఓటును ఏసే తెలివిదక్కువ
            కాకులమింకా మేముకాదని

ఇచ్చిందల్లా గుంజిండ్రే
ఓటు మాత్రం దాసిండ్రే
సలాములైతే పెట్టిండ్రే
సంకనసేతులు గట్టిండ్రే
అది ఇది గాదని సెప్పిండ్రే
అందర్నీ నమ్మించిండ్రే
ఉడ్డీలైతే గట్టిండ్రే
కోలాటం బానే ఆడిండ్రే
ఏసిండ్రే ఓటేసిండ్రే
కాముని కాష్టం గాల్చిండ్రే
ఏసిండ్రే ఓటేసిండ్రే
నియంత తోకను గోసిండ్రే
ఓటరంటే ఆ కోటరు గాదని
బల్లగుద్ది మరి సెప్పిండ్రే

ఓయన్న ఓటరన్న
నిను మించినోడెవడన్న
ఎవడైనా గానియ్యి, వాడెవడైనా గానియ్యి
నిలదీసే హక్కుందిరో, ఆన్ని పడదోసే దమ్ముందిరో
ఎవడైతే మనకేందిరో ఆన్ని ఎదిరించే బలముందిరో


గారంగ ఆడుదమో...



గారంగ ఆడుదమో ఈ సోట
గొంతెత్తి పాడుదమో మనపాట
అన్నలారా తమ్ముల్లారా అక్కలారా చెల్లెల్లారా
తెలంగాణ పొత్తిళ్ళల్లో పుట్టినట్టి బిడ్డలారా ॥గారంగ॥

తప్పూల తడకాలున్న చరిత్రంతా జెప్పాలేను
అగ్రకుల పెత్తందార్లు ఆడుతున్న రాజకీయం
మన నోరు గొడుతుందో ఓయన్నా
ఇగ దెలుసుకోవాలె మాయన్నా ॥గారంగ॥

స్వాతంత్రం వచ్చిన సంది మన జాతి నాయకులెంత
నాటి నుండి నేటి వరకు ఎవని మాట సాగుతుంది
ఒకసారి ఆగన్నా ఓయన్నా
ఎనుదిరిగి సూడన్నా మాయన్నా ॥గారంగ॥

ఎన్నడో ఎనకటి నుంచి యాబయ్యెళ్ళ కాలం నుంచి
తాత తండ్రీ బతికినట్టే మట్టి బతుకు బతికినాము
ఆంగ్లేయుల మించిండ్రే ఆందోళ్ళు
బాంచోల్ల జేసిండ్రే పాలోళ్ళు ॥గారంగ॥

వొద్దు వొద్దు కొట్లాటొద్దు ఇంక మనకు పంచాదొద్దు
కల్సి ఉన్న కాలమంతా కన్నీటి బతుకేనాయె
మనగుడ్డి బతుకుల్లో తెలంగాణ
వెలుగుల్ని నింపేనే మాయన్న ॥గారంగా॥

ఎవ్వరెన్ని జెప్పిన గాని మత్తులో ముంచిన గాని
పైసలెన్ని ఇచ్చినగాని పవరు ఎంత జూపిన గాని
నువ్ మోసపోకన్న ఓయన్నా
తెగనమ్ముకోకన్నా మాయన్నా ॥గారంగ॥

బీజేపి, కాంగ్రెసాని ఇంకేదో పార్టీయాని
వచ్చిన అవకాశాన్ని వదులుకొని కుమిలిపోకు
ఎడ్డోళ్ళ జేస్తుండ్రే ఆంద్రోళ్ళు
మనసొమ్ము దింటుండ్రే ఆంద్రోళ్ళు ॥గారంగ॥

ప్రాంతీయ బేధాలొచ్చి పానాల మీదికొచ్చే
ఇంక వేరే పార్టీయంటే సిగ్గులజ్జ లేనట్టే......
మన గోసదీరాను ఓయన్నా
తెలంగాణ గావాలె మాయన్నా ॥గారంగ॥


అన్నన్న ఓయన్న...



అన్నన్న ఓయన్న రైతుకూలన్న
దేశప్రగతికి నువ్వు జీవ గర్రన్నా
సుక్కబొడవక ముందే పైరు పంటల్లోనా
సూర్యుడయ్యి పొడ్సినావ మాయన్నా
ఎక్కెక్కి ఏడ్చేటి పంటసేలను జూసి
గుండె సెరువయ్యిందా రైతన్న
నీ గుండె సెరువయ్యింద రైతన్నా...
నువులేక రాజ్యానికి ఓరన్న
నిండుదన మేడుందిరా మాయన్నా
నువుబోతే దేశానికి ఓరన్న
కూడేసే దిక్కేదిరా మాయన్న ॥అన్నన్న ఓయన్న॥

అడుగూ అడుగున జూసి నేలతల్లిని బీల్చి
పాలు లేవని తెల్సి తల్లిరొమ్మును కొరికే
పసి పిల్లల పాట్లాయెనా ఓరన్నా
సాప్పిల్లల గోసాయెనా మాయన్నా
నీరింకి నిలబడితిరా ఓరన్న
కన్నీటి కాల్వయితిరా మాయన్న
కన్నీటి కాల్వయితిరా... ॥అన్నన్న ఓయన్న॥

బోరు బోరుకు నీ గుండె బగిలినగాని
నారుబోసినోడె నీరు బోస్తాడని
ఎవడు జెప్పి పాయెరా ఓరన్న
కడసూపు పాలైతిరా మాయన్న
దారిద్ర బతుకుల్లోన ఓరన్న
వడగండ్ల వానెట్టరా మాయన్నా
వడగండ్ల వానెట్టరా... ॥అన్నన్న ఓయన్న॥

రిక్కబెట్టిన సాలు చెంగు చెంగున పసులు
ఎకరాల కెకరాలు అలుపులేక సాగి
అంకెబెట్టక నడ్సురా ఓరన్న
అనుకమైన ఎడ్లురా మాయన్న
పొంటెకష్టం జేసురా ఓరన్న
ఒంటరోని వెట్టరా మాయన్న
ఒంటరోని వెట్టరా.... ॥అన్నన్న ఓయన్న॥

దుక్కిదున్నిన సాలు పచ్చపచ్చని సేలు
పూతబూసిన నేల కాతగాసిన సేను
నీ కోసమే సూసురా ఓరన్న
నీమీద గోలాడురా మాయన్న
నీ పాదాలు ముద్దాడురా ఓరన్న
పానాలు నిలిపేనురా మాయన్నా
పానాలు నిలిపేనురా.... ॥అన్నన్న ఓయన్న॥

తొమ్మిదేండ్ల శెని పోనే పోయిందని
తోకలెత్తి మనము చెంగల్లో పిట్టంటే
మళ్ళీ మొదటి కొచ్చెరా ఓరన్నా
మార్పు లేక పాయెరా మాయన్నా
ఎదిరించి నిలువంగా ఓరన్న
పోరాటమే దిక్కురా మాయన్నా
పోరాటమే దిక్కురా.... ॥అన్నన్న ఓయన్న॥


రాజు మారెనే



వాడు దొరికెనా మోసగాడు దొరికెనా
తెలంగాణ దోసేటోడు వాడు దొరికెనా
అల్లో దొరికెనే పిల్లో దొరికెనే
తెలంగాణ దోసెటోడు వాడు దొరికెనే
అల్లో దొరికెనే పిల్లో దొరికెనే
మాధాపూరు సెంటర్లో వాడుదొరికెనే
అల్లోదొరికెనే పిల్లో దొరికెనే
అదునుజూసి అంగుబెట్టువాడు దొరికెనే
అల్లోదొరికెనే పిల్లోదొరికెనే ॥వాడు॥

గాలి మేడలు గట్టెటోడు వాడు దొరికెనే
అల్లో దొరికెనే పిల్లో దొరికెనే
మన కొలువులు మింగినోడు వాడు దొరికెనే
అల్లోదొరికెనే పిల్లోదొరికెనే
స్టాంపు కుంభకోణంలో వణుక బట్టెనే ॥వాడు॥
అల్లోదొరికెనే పిల్లోదొరికెనే
మననీల్లు గుంజుకున్న దొంగ దొరికెనే
అల్లోదొరికెనే పిల్లో దొరికెనే
అధికార స్వార్థపరుడు వాడు దొరికెనే
అల్లోదొరికెనే పిల్లో దొరికెనే
ముందస్తు ఎలక్షన్లో ముసుగుదీసెనే ॥వాడు॥
అల్లోదొరికెనే పిల్లో దొరికెనే
'అలిపిరి'నే ఊపిరిగా జేసుకొచ్చెనే
అల్లోదొరికెనే పిల్లోదొరికెనే
సావుదప్పి లొట్టబొయ్యినోడు దొరికెనే
అల్లోదొరికెనే పిల్లోదొరికెనే
అచ్చమైన పనులుజేసి ఓట్లకొచ్చెనే
వాడు దొరికెనే మోసగాడు దొరికెనే

తెలంగాణ దొసెటోడు వాడుదొరికెనే
అల్లో దొరికెనే పిల్లో దొరికెనే
దగాకోరు దగుల్భాజి వాడు దొరికెనే
అల్లో జూసెనే జనం వాన్ని మూసెనే
సాటర్లు బీకినోనికి మీటరేసెనే

రాజుమారెనే అయ్యో మంత్రి మారెనే
రాజురాని ఆట మల్లా మొదలు అయ్యెనే
అల్లోమారెనే పిల్లో మారెనే
అనుకున్నట్టధికారం 'సేతి'కొచ్చెనే
అల్లోమారెనే పిల్లో మారెనే
ఆ పాపపు కాలమింక తొలగిపోయెనే ॥రాజు॥
అల్లోమారెనే పిల్లోమారెనే
సెర్వుకుంటలల్ల కేమో నీళ్ళు జేరేనే
అల్లోమారెనే పిల్లో మారెనే
సాగరు శ్రీశైలాన లైట్లు ఎలిగెనే
అల్లోమారెనే పిల్లోమారెనే
రైతుకూలి బతుకులల్ల పున్నమాయెనే ॥రాజు॥
అల్లోమారెనే పిల్లో మారెనే
అల్లోమారెనే పిల్లోమారెనే
నిరుద్యోగులల్ల ఆశ చిగురు దొడిగెనే
అల్లోమారెనే పిల్లోమారెనే
పత్తిరైతు బతుకుల్లో పూలు బూసెనే
అల్లోమారెనే పిల్లో మారెనే
ఆత్మహత్యల పర్వమింక ఆగిపోయెనే ॥రాజు॥
అల్లోమారెనే పిల్లోమారెనే
'గొడవ' జేసి కాళోజి కన్నుమూసెనే
అల్లా మారెనె పిల్లో మారెనే
పిడుగులాంటి మనుసులంత గూలిపోయెనే

అల్లోమారెనే పిల్లోమారెనే
కష్టానికి సేతగాని బతుకులాయెనే
అల్లోమారెనే పిల్లోమారెనే
పూటకొక్కమాట మార్చెరోజులొచ్చెనే
రోజు మారెనే కోటబురుజు మారెనే
లోకంలో స్వార్థబుద్ది బెరిగిపోయెనే ॥రాజు॥
అల్లోమారెనే పిల్లో మారెనే
ఆశగొంటి తనం గూడ ఎక్కువాయెనే
అల్లోమారెనే పిల్లోమారెనే
మనిషిబుద్ది మనలనింక వదలదాయెనే
అల్లోమారెనే పిల్లోమారెనే
మెత్తటోన్ని జూసి జనం వత్తసాగెనే ॥రాజు॥
అల్లోజూడవే పిల్లోజూడవే
క్వాలిఫైడ్ టీచర్ల కథలు జూడవే
అల్లోజూడవే పిల్లో జూడవే
సస్తనని బెదిరించి సంకనెక్కెనే
అల్లోజూడవే పిల్లోజూడవే
కరిసె కుక్క జోలి కెవడు బోకపాయెనే ॥ రాజు॥
అల్లోజూడవే పిల్లోజూడవే
నాడు ఉన్నయూడబీకుతుంటే అడగరాయెనే
అల్లోజూడవే పిల్లో జూడవే
నాడు ఎవని బాదలాడుబడ్తు అడ్కతిన్నరే
అల్లోతెల్సుకో పిల్లో తెల్సుకో
పెన్షనంటే ఎవనికైన ఆశబుట్టునే
అల్లోతెల్సుకో పిల్లో తెల్సుకో
కొడ్తనంటే ఎవనికైన భయంబుట్టునే
రాజు మారినా అయ్యో మంత్రి మారినా
తెలంగాణ బతుకు గింత మారదాయెనా
అల్లోజూడవే పిల్లో జూడవే

ఊరూరా సారాయి బారుతుండెనే
అల్లోజూడవే పిల్లో జూడవే
గజానికొక్క వైన్‌షాపు పుట్టుకొచ్చెనే
అల్లోజూడవే పిల్లో జూడవే
ఆగమయ్యె బతుకెపుడు బహుజనులాదే
అల్లోజూడవే పిల్లో జూడవే
ఏడ జూడు అగ్రకులం తేటగుంటదే
అల్లోజూడవే పిల్లో జూడవే
పంట భూములన్ని వాడు కబ్జా జేసెనే
అల్లోజూడవే పిల్లో జూడవే
రింగురోడ్డు ప్రాజెక్టుల పదం బాడెనే
అల్లోజూడవే పిల్లో జూడవే
స్కాములెన్నో జేసి వాడు బయట దిరుగునే
అల్లోజూడవే పిల్లో జూడవే
ఏడ ఉన్న ఈడు మనకు పెద్ద మనిషిలే
అల్లోజూడవే పిల్లో జూడవే
ఆగమయ్యె బతుకెపుడు బహుజనులాదే
అల్లో తెల్సకో పిల్లో తెల్సుకో
తెలుగంటేనే మన తెలంగాణరో
అల్లో తెల్సకో పిల్లో తెల్సుకో
సక్కనైన తెలుగు బాష ఇక్కడుందిరో
అల్లో తెలిసెనా పిల్లో తెలిసెనా
తెలంగాణను దోసుకునే దొంగ దెలిసెనా
అల్లో తెల్సుకో పిల్లో తెల్సుకో
వాళ్ళనొక కంటనువ్వు గని పెట్టుకో
అల్లోతెల్సుకో పిల్లో తెల్సుకో
ఎవని నమ్మె యాళ్ళ లేదు బద్రం జేసుకో
అల్లో తెల్సుకో పిల్లో తెల్సుకో
తెలంగాణ సాధించే ఒడుపు నేర్సుకో


ఎవడు జేసిన మోసమో..



ఎవడు జేసిన మోసమో
మనమెపుడు జేసిన పాపమో
సుక్కనీరు లేక ఒక్క పని దొరకకా
తల్లి తెలంగాణ తల్లడిల్లుతుంది ఓరన్నా
కరువు కోరల్లోన అల్లాడుతుంది మాయన్నా... ॥ఎవడు॥

నల్లోలిగొచ్చిండ్రు భూముల్ని బట్టిండ్రు
వరిపంట శేండ్లన్ని వడగాల్లో ముంచిండ్రు
ఇటిక బట్టిలు బెట్టి భూసారం మింగిండ్రు
పురుగు మందుల బెంచి పానాలు దీసిండ్రు
ఉన్న ఊరిడిసేసి గొడ్లు జీవాలమ్మి
వలసెళ్ళిపోయేటి కాలాన్ని దెచ్చిండ్రు ॥ఎవడు॥

కాల్మీద కాలేసి కంపెండ్లు బెట్టిండ్రు
తెలంగాణ నిండా పాగబెట్టి కూసుండ్రు
పత్తి పంటలు బెట్టి పండ్ల తోటలు బట్టి
తెలంగాణ జనుల పండ్లోలిగమ్మిండ్రు
మాయ మాటలతోని మన కొంపలు ముంచి
శెట్టెర్క పామోలె సెట్టు కొమ్మెక్కిండ్రు ॥ఎవడు॥

ఆంధ్ర ప్రాంతంలోన కూలినాలి జేసి
ఏమి లేకా ఈడ బతుకొచ్చె బహుజనులు
అన్ని దెలిసి మనమూ ఆడీడ పడగల్లో
బెదిరి పనులు జేసే పాలేర్ల మైతున్నం
ఇకనైన మనమంత కండ్లు దెరిసి ఇపుడు
ఎట్లయిన బహుజనులు ఏకంగ నడువాలె ॥ఎవడు॥

సాతంత్రమొచ్చింది సాన్నాళ్ళు గడిసింది
తాత తండ్రుల నాటి గోసా దీరకపాయె
ఆంధ్రోళ్ళ మోసాలు జూస్తూనే మనమంత
గుడ్లప్పగించేసి గుడ్డోళ్ళ మైతున్నం
ఇంక మనము ఎవని బతిలాడేదేముంది
పెద్ద మనుషుల నడుమ జెప్పేది ఏముంది
ఆంధ్ర నాయకుల కుట్రలే ఇది పాలక వర్గాల పాపమే..


జోతిబాపూలే



జోతిబాపూలే... జోతిబాపూలే....
జోతి బాపూలే.... జోతి బాపూలే
మహాత్ముడంటే నువ్వే మా బాపూజీ నువ్వే
గుణాత్ముడంటే నువ్వే పరమాత్ముడంటే నువ్వే ॥జోతిబా॥

వేదాలు, పురాణాలు విదిలించిన జూలులోన
కట్టుబానిసత్వంలో గంజిలోన ఈగోలే
అట్టడుగుకు తొక్కబడి నిమ్నజాతిగా మారి
హరిజనులు గిరిజనులు సూదరోల్ల మైపోతిమి ॥జోతిబా॥

కుల బలము గలిగినోల్ల సేతికింద బానిసలై
ఎట్టిపనిల మగ్గుతున్న ఒట్టిమట్టి బతుకులోన
పౌరుషమై వచ్చినువ్వు పడిగెత్తి నిలిసినవ్
బుసగొట్టుడు నేర్పించి మెసలకుంట జేసినవ్ ॥జోతిబా॥

కమ్మనైన పాటలోన తియ్యని పదమోలే
రాగాన్ని మూటగట్టి తిరిగే రాజ్యంలోన
అక్షరమై వచ్చి నువ్వు లక్ష్యమేదో చూపించి
చక్కని క్రమశిక్షణతో సదువులెన్నో జెప్పినవ్ ॥జోతిబా॥

అంధకార మలుముకున్న చీకటి రాజ్యంలోన
దట్టమైన అడవిలోన మోదుగు పువ్వోలే
జ్యోతిలా వెలిగి నువ్వు జాతిని మేల్కొల్పినవ్
అజ్ఞానం తొలగించి ప్రగతి బాట నడిపినవ్ ॥జోతిబా॥


వీరతెలంగాణ ధీరులు



వీర తెలంగాణ ధీరులు మీకు వందనాలు
విప్లవాల వెలుగు సూర్యులు మీకు వందనాలు
వేలకొలది అమరవీరులు మీకు వందనాలు
వెన్నుచూపని సమరయోధులు మీకు వందనాలు ॥వీర తెలంగాణ॥

బాంచబతుకుల చేరదీసి బందూకులే ఎత్తినారు
ఉద్యమాల ఉగ్గుదాగి ఉగ్రరూపం దాల్చినారు
ఉప్పెనల్లే ఎగిసి మీరు ఊరు వాడల్ని కదిలించినారు ॥వీర తెలంగాణ॥

దేశముఖుల మెడలు వంచీ దేశాన్నె శాసించినారు
రజాకార్లకెదురు నిలిసీ రణరంగమే జేసినారు
రాజ్యహింసను జూసి మీరు రక్తాన్ని చిందించినారు ॥వీర తెలంగాణ॥

ఎవ్వరున్నా లేకున్నా మీ వెంట ఎవరు రాకున్నా
అలుపులేని పోరులోన ఆయుధాలై మెరిసినారు
సైన్యమయ్యి కదిలినారు వడిసెల రాళ్ళతో ఉరికించినారు ॥వీర తెలంగాణ॥

అలుపులేని పోరులోన ఆయుధాలై మెరిసినారు
పొలికేకలే వేసి మీరు పోరాటమే జేసినారు
పొడిసేటి పొద్దయ్యి మీరు మా చీకట్లు తొలగించినారు ॥వీర తెలంగాణ॥


కదలాలె-కదలాలె



కదలాలె కదలాలె ఎనకా బడ్డోళ్ళమే
ఏడెన్కల నించెళ్ళాలె అణచ బడ్డోళ్ళమే
మొత్తమంత కదలాలె దండుగట్టి నిలవాలె
పూలె పాటల బాటల్లోన తొలి అడుగులు వెయ్యాలి ॥కదలాలె॥

ధరణిలోని ఆ దగాకోర్లతో రాయబడెను మనుధర్మ శాస్త్రము
బాపనోల్ల ఆ బందికానలో బాధలెన్నో పడ్డవాళ్ళము
జీవితాన వెలుగే లేకా
అనిగి మనిగి మసిలే మనమూ ॥కదలాలె॥

చతుర్వర్ణ పరిపాలనతో సొమ్మసిల్లి పోయిన వాళ్ళం
చరితలోని అబద్దాలనీ కర్మా అని మోసిన వాళ్ళం
అగ్రవర్ణ అధికారంలో
అట్టడుగున జేరిన మనమూ ॥కదలాలె॥

నవాబుల రాజ్యంలోన భికారులై బతికిన వాళ్ళం
తెల్లదొరల కాలంలోన అటీటుగా అందరమొకటై
దొరలు భూస్వాముల నాటి
శెర నేటికి దీరని మనమూ ॥కదలాలె॥

మును ముందుకు బోలేక మూతి ముడుసు కుంటున్నం
ఎనకడుగు వెయలేక నీరుగారి పోతున్నం
అటీటు గాని బతుకుల్లోన
తొలిపొద్దుకు తెరలు దీయగా ॥కదలాలె॥


కదిలిపోయావా..



కదిలిపోయావా నేస్తమా
మమ్మొదిలి పోయావా మిత్రమా
మాతోనే నడుస్తుంటివి
అనునిత్యం కలుస్తుంటివి
చిరునువ్వలె మాటలుగా అందరినీ పలకరిస్తివి
అటు ఇటు నే తిరిగి చూడగా
ఇంతలోనె ఎటు వెళ్ళిపోతివి
కలయో నిజయో తెలియక మేము
కలవరపడుతున్నం
ఎపుడు వెళ్ళావు నేస్తమా...
ఎక్కడున్నావు మిత్రమా....

(శారదా విద్యామందిర్ నాగేందర్ సార్ కోసం)


బోయులో మా బెస్తలు



బోయులో మా బెస్తలు
యాడున్నరో మాయయ్యలు
హైలెస్సో..... హైలెస్సా.....

నిండు పున్నమి మిమ్ము బిలువంగా
సుక్కపొడుపుకు నిద్రలేసిండ్రా
ఆటు పోటుల కెదురు నిలిసి
పాటులో బోటెక్కి పోయిండ్రా
ఉగ్రరూపం దాల్చినట్టి
సంద్రుడెంత పాపకారయ్యో
ఏడు దాళ్ళ ఎత్తు లేసిండో
నోటి మాటే మూగబోయిందో...
హైలెస్సో..... హైలెస్సా.....

బోయులో మా బెస్తలు
'పాటు' లో మీరు ఏట కెళ్ళిండ్రా
బోయులో మా బెస్తలు
నీళ్ళపోటు మీకు ఎక్కువయ్యిందా
బోయులో మాబెస్తలు
సగము నిద్ర సావు కయ్యిందా
బోయులో మా బెస్తలు
నీళ్ళుమింగి నోళ్ళు దెర్సిండ్రా
బోయులో మా బెస్తలు
సముద్రుడెంత రాక్షసూడయ్యో
బోయులో మా బెస్తలు
అని ఉగ్రరూపం నిన్న జూసినమో
బోయులో మా బెస్తలు

ఏడుదాళ్ళ ఎత్తు లేసిండో
బోయులో మా బెస్తలు
అని మాయ రూపు జూసినంతల్నే
బోయులో మా బెస్తలు
మా నోటి మాట మూగబోయిందో
బోయులో మా బెస్తలు
మన 'అంకలయ్య' ధైర్యమేడుందో
బోయులో మా బెస్తలు
అదురుతోనే అరిసి సెప్పిండో
బోయులో మా బెస్తలు
నెత్తి నోరు కొట్టుకుంటీమో
బోయులో మా బెస్తలు
గుండెబగిలి సొమ్ముసిల్లితిమో
బోయులో మా బెస్తలు
ఏ పొద్దుమిమ్ముల లేపలేదయ్యో
బోయులో మా బెస్తలు
మన బతుకులోనే పొద్దు బొడ్సిందో
బోయులో మా బెస్తలు
నిండు పున్నమి మిమ్ము బిలవంగా
బోయులో మా బెస్తలు
సందమామ సంకనెక్కిండ్రా
బోయులో మా బెస్తలు
సుక్కలల్లో జేరిపోయిండ్రా
బోయులో మా బెస్తలు
కట్టుకున్నది కూడు దెచ్చిందో
బోయులో మా బెస్తలు
నీ కన్న బిడ్డలు ఎదురు సూస్తూండ్రో
బోయులో మా బెస్తలు
వాళ్ళ ఏడుపెవడిని ఎత్కపోతాదో

బోయులో మా బెస్తలు
వొన్నె కుండను పచ్చి ముట్టిందో
బోయులో మా బెస్తలు
పసికూనలంతా వుష్క బుక్కిండ్రో
బోయులో మా బెస్తలు
ఏ తడలు మిమ్ముల మోసుకొస్తాయో
బోయులో మా బెస్తలు
బువ్వ, నీళ్ళకెడబాసి కూసున్నం
బోయులో మా బెస్తలు
మీ బోట్లు బొక్కబోర్ల బడ్డాయో
బోయులో మా బెస్తలు
ఒక్కటొక్కటి వొడ్డుకొచ్చినయో
బోయులో మా బెస్తలు
మీ తెడ్డు తెప్ప తేలిపోతుందో
బోయులో మా బెస్తలు
మీ వలలు బెండ్లుగ దేలిపోతున్నయ్
బోయులో మా బెస్తలు
ఎవని మాయవలలో జిక్కుకున్నారో
బోయులో మా బెస్తలు
మీరు పిండకూడుకు నోసుకోలేదో
బోయులో మా బెస్తలు
తండ్రీ శివుని ఆజ్ఞ జారి అయ్యిందో
బోయులో మా బెస్తలు
తల్లీ గంగ ఋణము దీర్చుకున్నారో
బోయులో మా బెస్తలు
సచ్చిన సాపలోలే గొట్టుకొస్తుండ్రో
బోయులో మా బెస్తలు
తీరం ఎంట తిర్నాల జరిగిందో
బోయులో మా బెస్తలు

ఉప్పునీళ్ళు మట్టి గప్పినయో
బోయులో మా బెస్తలు
పెద్ద పిట్టల గుంపు వాలిందో
బోయులో మా బెస్తలు
మన కౌసు బతుకులనెవడు జూస్తాడో
బోయులో మా బెస్తలు
ఎవడు మనల జేరనియ్యడురో
బోయులో మా బెస్తలు
మనకు బతుకు పోరుదప్పదాయెనురో
బోయులో మా బెస్తలు
ఎన్ని లారిల సాయమందుతదో
బోయులో మా బెస్తలు
ఎట్ట మనము బతికి సావాల్నో
బోయులో మా బెస్తలు
పాడె కర్సులు గూడ లేవాయె
బోయులో మా బెస్తలు
ఆలి తాలి బొట్టును దీస్కపోతిరిరో
బోయులో మా బెస్తలు
దాని పసుపు కుంకుమ గాలి పాలాయె
బోయులో మా బెస్తలు
గాజు మెట్టెలు గంగపాలాయె
బోయులో మా బెస్తలు
అలలు అలిసి వొడ్డుజేరినయో
బోయులో మా బెస్తలు
కలల అద్దం పగిలిపోయిందో


మద్దూరి కోసం



పచ్చోలె దిరిగి నేను వాడవాడకు
ఇప్పుడే చేరుకుంటి వెలివాడకు
ఎక్కడున్నడో మిత్రుడు
ఎదురు చూసి రచ్చబండనిడ్సిపోయెనో
మము వీడి పోయెనో ॥పచ్చోలె॥

నివురు గప్పినా నిప్పు దొంగ వేద సారమని
అదును జూసి పడగవిప్పే హైందవ సిద్ధాంతమని
రగిలి రగిలి కొరకాసై కమిలిపోయినట్టుంటడు
నల్లగా ఇంతెత్తు రావనా 'సూరూ'నోలె
పట పట మని పండ్లుగొరికి గుడ్లురిమీనట్టుంటడు
కనిపించిండా, కసిరిచ్చిండా
ఇంతలోనే తిట్టుకుంట ఇటుబొయ్యిండా ॥పచ్చోలె॥

కాళ్ళుండి నడవలేని వికలాంగులెందుకని
కవికులానికసలు మనకు కాళ్ళతో పని ఏందని
నవ్వినవ్వి నరకాన్ని అరచేతిలో జూపిస్తడు
అంతలోనే దరిజేరి అందరికీ అన్నోలే
బుద్దిజెప్పి సుద్దిజేసే బుద్దునోలె గనిపిస్తడు
కనిపించిండా కరిగించిండా
ఇంతలోనే నడ్సుకుంట ఇటు బొయ్యిండా


మొక్కితే...



మొక్కితే నేను మొక్కితే ఏడు కొండలు ఎక్కితే
నమ్మితే నేన్నమ్మితే దేవుండ్లను వేడితే
ఎవడెన్ని యజ్ఞాలు యాగాలు జేసినా
ఏడుకొండలెంకన్నా అవతారమెత్తినా
ఏముంది పుణ్యము మా కిచ్చినా వరము ॥మొక్కితే॥

పొట్టకొచ్చి పంటసేను ఈనలేక నీళ్ళుమింగే
నువ్వే దిక్కు అంటూ నీ మీద భారమేస్తే
సేతికొచ్చినా బువ్వ నోటి దాక రాకపాయె
అదేమి సిత్రమో - ఇదేమి పాపమో
అడుగన్న బడదాయె - అన్నీ అడ్డంకులాయె ॥మొక్కితే॥

ఒక్కొక్క రాయిదెచ్చి కాకోలె పోగుజేసి
నీ మీద భక్తితోని నిలువున ననుదోసిస్తే
పిల్లపెండ్లి ఆగిపోయె కాళ్ళు జేతులాడవాయె
నేనేమి జేద్దునో బాదెట్ట జేద్దునో
ఇగనన్న దిగిరావు - జరనన్న గనరావు ॥మొక్కితే॥

నల్లరాయి, నాపరాయి కొండమీద బండరాయి
మెట్టు మెట్టు బొట్టుబెట్టి సొక్కిసోలి నేనొస్తే
కష్టాలు దీరవాయె కన్నీరు ఆరదాయే
ఎన్నేండ్లు మొక్కినా, ఎక్కెక్కి ఏడ్చినా
కనికరించి నువ్వు మమ్ము కాచింది లేదుగా
దండుగే అది దండుగే ఓరారి దండుగే
గుండుకే ఆ కొండకే నువు బోక ఉండవే...


కన్నుల్లో పండు వెన్నెల్లో...



కన్నుల్లో పండు వెన్నెల్లో - దోర బుగ్గల్లో దొంగసిగ్గుల్లో
పూల పక్కల్లో పులకరింతల్లో - సెలక పంటల్లో సెట్టు సేమల్లో
రేల పూతల్లే రేగు తున్నావే పిల్లో........
అల్లల్ల అల్లో.......అల్లో -రాముల మల్లో....మల్లో ॥2 సా॥
వగరు లేకుంట శిగురు బెడ్తాను
సీమ సింతల్లో బొంతలేస్తాను
కోడె దూడోలె సిందులేస్తాను
ఓ ముద్దు గుమ్మో... బొమ్మో-నా ముద్దు గుమ్మో...రెమ్మో ॥2 సా॥
ముద్దులిస్తావా - మురిపాలిస్తావా
మూగ భాషల్లో - ముందుకొస్తావా పిల్లో
అల్లల్ల అల్లో.......అల్లో -రాముల మల్లో....మల్లో ॥2 సా॥

వెన్నెల్లో వన్నె చిన్నెల్లో - జొన్న సేలల్లో దొంగ సూపుల్లో
తీగ రాగంతో తీపి గుర్తుల్లో - తనువు మునుముల్లో అనువు అనువుల్లో
బోగి మంటల్లే అంటుకున్నావే పిలగో ....
అల్లల్ల అల్లో... అల్లో -రాముల మల్లో...మల్లో ॥2 సా॥
కరుకు లేకుంట సురుకు బెడ్తావు
తీటమాటల్తో పూట జేస్తావు
మంది కండ్లల్లో మాయమైతావు
ఓ మామ లేరో...పోరో-నా మామ రారో ...తేరో ॥2 సా॥
ముద్దులిస్తాను - మురిపాలిస్తాను
మూగభాషల్లో - ముంగిట్లుంటాను పిలగో
అల్లల్ల అల్లో........అల్లో -రాముల మల్లో....మల్లో ॥2 సా॥

కన్నుల్లో పండు వెన్నెల్లో దోర బుగ్గల్లో మొలక సిగ్గుల్లో
తీగ రాగంతో తీపి గుర్తుల్లో తనువు మునుముల్లో అనువు అనువుల్లో
బోగి మంటల్లే అంటుకున్నావే పిలగో ....

కరిమబ్బులోన - దాగున్నదాన కట్నాలు ఏమియ్యనే
ఓ ముద్దు గుమ్మో...బొమ్మో-నా ముద్దు గుమ్మో...రెమ్మో
ఆ నీలిమేఘం- నీ రూపు రేకే అదనంగ ఇంకెందుకే
ఓ మామ లేరో... పోరో-నా మామ రారో... తేరో
ఎదురొచ్చె వాన - ఏడూళ్ళునాన ఇంకేడ దాగున్నవో
ఓ ముద్దు గుమ్మో...బొమ్మో-నా ముద్దు గుమ్మో...రెమ్మో
నడిసొచ్చెదేవా - నీ గుండెలోన నేగూడు బెట్టానురో
ఓ మామ లేరో... పోరో-నా మామ రారో... తేరో ॥కన్నుల్లో॥

తంగేడు పూల బతుకమ్మ నువ్వే తానాలు ఆడించనా
ఓ ముద్దు గుమ్మో...బొమ్మో-నా ముద్దు గుమ్మో...రెమ్మో
బతుకమ్మ ఇంట్లో బంగారు నోము నీకోసమే నోసెనే
ఓ మామ లేరో... పోరో-నా మామ రారో... తేరో
నాఇంటి దీపం నడిరేయి తాపం నువ్వేగ చిలకమ్మో
ఓ ముద్దు గుమ్మో...బొమ్మో-నా ముద్దు గుమ్మో...రెమ్మో
నా ప్రేమ రూపం ఆతీపి మైకం నీకన్న ఇంకెవరురో
ఓ మామ లేరో... పోరో-నా మామ రారో... తేరో ॥కన్నుల్లో॥

సింతాకు పులుపు సీతమ్మకెరుకా వేవిళ్ళు తెప్పియ్యనా
ఓ ముద్దు గుమ్మో... బొమ్మో-నా ముద్దు గుమ్మో...రెమ్మో
అందాక వద్దు రామయ్య ఆగు నా వలపు నీదేనురో
ఓ మామ లేరో... పోరో-నా మామ రారో... తేరో
అ ఆ లు నేర్పే ఆనందవేళ ఉ ఊ లు ఏందమ్మో
ఓ ముద్దు గుమ్మో...బొమ్మో-నా ముద్దు గుమ్మో...రెమ్మో
ఒ ఓ లు దాటి వచ్చేసినాక ఇంకేమి మిగిలిందిరో
ఓ మామ లేరో... పోరో-నా మామ రారో... తేరో ॥కన్నుల్లో॥


ఏగలేను మామ



ఏగలేను మామ గయ్యాలి గంపతో
నేనేగలేను మామ నీ బిడ్డ గంగతో
అడ్డెడు బియ్యం పూటకు మాయం
బుడ్డెడు పాలు పిల్లే నయ్యం
                                                                 ॥ఏగలేను॥
పచ్చి పులుసుకేమో పైసల్లేవాయె
వొట్టి కారం ఏసుకున్నా భలె కమ్మగ ఉందంటే
దాని బలగ మొస్తే మరి కూరలేదని
ఈర బోసుకొని ఇడుపున జేరెను
                                                                ॥ఏగలేను॥
ఎంతలావు మాటగాని యమ పెడుగ్గునంటది
కర్రె కాకోలర్సీ తెగ పంచాజ్జేస్తది
కొపమొచ్చి నేనొక్కటి గొడ్తే
సాటుకు బొయ్యి ముడ్సుక పంతది
                                                                 ॥ఏగలెను॥
తెలవార్లు జూడు తెగ సిందులు ఏస్తది
పొద్దుగూకులేమో మొద్దోలిగ బంతది
అన్నీ ఉన్న అల్లం లేదని
కొర, కొర, కొరమని కొరకాసైతది
                                                               ॥ఏగలేను॥
పట్టుచీర దెస్తే గుట్టు సప్పుడు గాదాయె
పట్టా గొలుసులేస్తే దాని పెగ్గె లెక్కువాయె
తులాల కొద్ది కడియాలేసి
చెంగు చెంగున దూకుతుంటది
                                                              ॥ఏగలేను॥

సెంప శెరాలేసుకోని ఇగ శరాన్ని జూపించి
ముద్దు ముక్కెర బెట్టుకోని యమ బింకంజూపించి
రోజుల సగము అవుసలింటికి
తిప్పి, తిప్పి నను సంపు తుంటది
                                                           ॥ఏగలేను॥
నెత్తి నెత్తుకోనూ నే శివుడను గాను
కాళ్ళు బట్టుకోను శ్రీ కృష్ణుడ గాను
అడవికి దోలి అయ్యోధ్య నేలే
రాముడి నసలే కానే కాను
                                              ॥ఏగలేను॥


ఎండలో ఎండివాన



ఎండలో ఎండివాన ఏమిటే చిన్నదానా
గువ్వలా ఎగిరిరాన గుండెలో ఒదిగిపోనా
చినుకులే ముత్యమల్లే తడిపెనా చిన్నవాడా
చింతలే తీరిపాయే చిందులే ఆపలేవా
నా ఆపతి సోపతి నువ్వేగా సిన్నోడా కోరుకున్నోడ ॥ఎండలో॥

మనసున బుట్టిన ఆశకు నే కనుగొన్నాలే భాషను
కన్నుల కందని మాటలే నాచేతులు చేసే సైగలు
మీసాన్ని మెలిబెట్టి రోషాన్ని పెంచేసి
ఏదేదొ గిలిగింత ఎదలోన పులకింత
ఏమి లేదంటూనే తొంగి చూస్తుంటావు
సిన్నోడ కన్నెగిజిగాడ ॥ఎండలో॥

రివ్వున వీచిన గాలికి నే పువ్వులా నిన్ను చేరితే
చెంగున దూకే లేడిలా నా కొంగును నీకై పంపితే
కను బొమ్మ లెగరేసి, కండ్లెర్రజేసేసి
కారాలు మిరియాలు కౌగిట్లో దంచేసి
కాదు కాదంటూనే కసిరిచ్చి పోతావు
సిన్నోడ వెన్న దొంగోడ ॥ఎండలో॥

తళుకున మెరిసిన మెరుపుకు నే సుట్టుకుంటే నిన్ను తీగలా
ఒడ్సిపట్టె ఒడుపు నీకున్న సూడవైతివి నన్ను కడగంట
మబ్బల్లె నీ వెంట మైమరచి వస్తున్నా
మదిలోని కోపాన్ని పారేసి వస్తున్నా
మాపటేలా నిన్ను వెన్నంటి నేనుంటా
సిన్నోడ దోసుకున్నోడ
రే రాజులా కొండపైన నీ గుండెలో చేరిపోనా..


సన్నజాజిపువ్వు



సన్నజాజి పువ్వు లాంటి కన్నేపిల్లా ........నా
ముందుకొచ్చి చెమ్మ చెక్కలాడుతుంటే
సూసుకుంట ఎట్లా ఉండా సందమామ ...... నేను
తాళిగట్టి ఏలుకుంటా సందమామ
దాని...... ఇంటి పేరు మార్సకుంటా సందమామ

ఎట్నన్న గానియ్యి సందమామ.... .నేను
ఏమన్న గానియ్యి సందమామ
దాన్ని ఇడిసి ఉండాలేను సందమామ.... నేను
దాసుడయ్యిపోయినాను సందమామ ॥సన్నజాజి॥

నడకలోని కుదుపు జూస్తే సందమామా... నీకు
నోట మాట రానే రాదు సందామామా
నడుము వొంపు జూస్తే నువ్వ సందమామా...నీ
నెలవంక చిన్నబోతది సందామామా
ఆటల్లో, పాటల్లో అందాల కోటల్లో
ముద్దూల మూటల్లో మునిమాపు వేటల్లో
పొద్దు గడిసిపోయినాది సందామామ... నాకు
ముద్దు మొకము గానరాలే సందామామ..
ఎట్నన్న గానియ్యి సందమామ.........నేను
ఏమన్న గానియ్యి సందమామ
దాన్ని ఇడిసి ఉండాలేను సందమామ..... నేను
దాసుడయ్యిపోయినాను సందమామ ॥సన్నజాజి॥

వన్నె చిన్నేలన్ని జూస్తే సందమామా....నీకు
దిమ్మ దిరిగి పోతాదయ్యా సందమామా

వగలమారి కులుకు జూస్తే సందమామా... నీకు
వల్లు తడిసి ముద్దయితాది సందామామ
గుట్టల్లో, చెట్లల్లో, రాళ్ళల్లో, బీళ్ళల్లో
నడిరాత్రి ఏలల్లో రాకాసి కోనల్లో
పొద్దు గడిసిపోయినాది సందామామ... నాకు
ముద్దు మొకము గానారాలే సందామామ..
ఎట్నన్న గానియ్యి సందమామ..... నేను
ఏమన్న గానియ్యి సందమామ
దాన్ని ఇడిసి ఉండాలేను సందమామ. నేను
దాసుడయ్యిపోయినాను సందమామ ॥సన్నజాజి॥


జాతీయ జెండా



ఉద్యమ వీరుడు కొమరంభీముడు విప్లవాగ్ని రగిలించిన నేలా......
పోరాట యోధుడు మన నేతాజీ ఎదురు నిలిచి హోరెత్తిన నేలా......
ఎందరెందరో త్యాగమూర్తుల
ఆశల ప్రతిరూపం ఈ స్వేఛ్ఛా స్వాతంత్ర్యం

జెండమ్మా
ఓ మూడు రంగుల భారత జెండమ్మా
నువ్వుగన్న నీ స్వాతంత్ర్యం ఎక్కడ ఉందమ్మా ॥జెండమ్మా॥

కాషాయంలో నీ కన్నవాళ్ళ త్యాగం ఉందంటే
కరుడుగట్టిన రాక్షసత్వంలో అంతమైతుందే

రెప రెప లడె శాంతి కపోతాల రెక్కలు విరిగేనా
ఎక్కడ జూడు రక్తపాతము సజీవ దహనాలే

పైరు పంటల సాక్షిగ జూడు పచ్చని నీదేశం
పగలు సెగలతోని రగిలిపోతుంది ఇదేమి పాపం ॥జెండమ్మా॥

చేతిలో నీ స్వేచ్ఛాయుధం ఎవ్వరికిచ్చితివో
బడుగు జీవులను బాంచోలె జేసి భాధిస్తున్నారే

ఎవరు సంపిండ్రో నీ ముద్దుబిడ్డ ప్రజాస్వామ్యాన్ని
ఎవడు దోసిండో చక్రాన్ని విసిరి నీలోని ధర్మాన్ని

ఎవడు గూల్చిండో బాబరు తాత ఆశల సౌధాన్ని
ఎవరు జేసిండ్రో గుజరాతు గుండెల్లో మాననిగాయన్ని ॥జెండమ్మా॥

భారతమాత సాక్షిగ జూడు ఉన్మాది లోకాన్ని
శిక్షలేమి లేక తప్పించుకునే మార్గం వెతికేనే

పాపాలు బెరిగి లోకాలు మునిగే కాలం వచ్చిందే
కలత చెందకు తల్లి కన్నీరు బెట్టకు కలికాలమే లేవే

నీ మచ్చెట గుంపున బంగారు బంతి జెండా వందనము
ఈ ఒక్కనాడన్నా పాపం, పుణ్యం నేమరేసుకోనియ్యె ॥జెండమ్మా॥


వాన దూకుడు



వాన దూకుడు జూడు వైనంగా
దిక్కులేనీ నన్ను జూడంగా
గుండె జెదిరి నేను అదురంగా
భిక్కు భిక్కు మంటూ నడువంగా
చిట పట చినుకులు బండపై నేల గుండెపై
చెంగు చెంగున ఎగిరే మినుగురై
నేల పువ్వులై నింగి జాడలై ॥వానదూకుడు॥

చంద్రుడేమై పాయెనో సుక్కలే సూరు జేరెనో
సుట్టు దిరిగి నేను జూడంగా ఎవ్వరుండ్రు నన్ను జేరంగా
ఉరికినాను నీటి బుడగనై....
చితికినాను పసి గుడ్డునై..... ॥వానదూకుడు॥

తల్లి దాపు లేక పాయెనో తండ్రి ఎవడొ తెల్వదాయెనో
కోయిలోలె నేనుంటెనో జనం కాకులయ్యి నన్ను బొడ్సెనో
మొక్కినాను గొంతు జీరబోయ్
నన్ను కన్నోళ్ల కడుపు కాలనియ్ ॥వానదూకుడు॥

తల్లి పక్షి గూడు జేరంగా పిట్టెపిల్ల నోరుదెర్వంగా
అంతలోనే దూప దీరంగా ఆటలాడే సూడు గారంగా
ఎవ్వరుండ్రు నన్ను జేరంగా
నా గుండెలోని బెంగ దీర్చంగా... ॥వానదూకుడు॥

దిక్కులన్నీ మబ్బు గమ్మంగా ఉరుములో ఊరు బెదరంగా
చీకట్లో డొంక సాగంగా మెరుపులే దారి సూపంగా
కదిలినాను నేను చినుకునై
కుండపోత వాన ధారనై ॥వానదూకుడు॥


మేం వచ్చే ఈ వాగునా



మేం వచ్చే ఈ వాగునా ఓ........గంగమ్మ
మా కెదురై దీవిస్తావా మా.....గంగమ్మ

బుస బుస పొంగుతు వొర్రెలల్ల
నువ్వొంపులు దిరుగుతూ వాగుల్లల్ల
పాయలు పాయలు మర్రి ఊడలు
శివుని జడలుగా ఊగుతూ ఆడుతూ ॥మేంవచ్చే॥

ఎగిరి దూకెటి 'పరకా' పిల్లల్లో ఓ......గంగమ్మ
ముద్దోచ్చే 'సందామామ'ల్లో మా..... గంగమ్మ
నీటిని జీల్చుక ఒడ్డెంటురికే
'బొచ్చె' 'రవ్వ'ల అలికిడి జూసి
మునుగుతు తేలుతు 'బుడుబుంగ'లమై
సల్లని వొండున బుడ్డమట్టలను
కనిపెట్టే వొడుపులు నేర్పినవే ఓ.........గంగమ్మ
జడలిప్పి దీవెన లిచ్చినవే మా.....గంగమ్మ

వల పూసల సప్పుడు లేదాయె ఓ.....గంగమ్మ
తోపెళ్ళు ఆడుత లేవాయె మా...... గంగమ్మ
శివుని భయంతో పరుగులు దీసి
బతకలేక పాతాళం జేరి
ఉరుములు ఉరుముతూ కొంగు గప్పుతూ
మబ్బు సాటున కుములుతుంటివి
మా బుట్టి మట్టీ పాలాయే ఓ......గంగమ్మ
ఎంతజేసిన బర్కతి లేదాయే మా.....గంగమ్మ

అలుపెరగని అలలను జూసినమే...... ఓ గంగమ్మ
నిదురెరుగని రాత్రుల మోసినమే....... మా గంగమ్మ
పాల నురగతో పరుగున వచ్చి
తీరంజేరే తడలను జూసి
ఈదుతూ ఈదుతూ నీ వొడిజేరిన
బెస్తబోయులం నీ కన్న బిడ్డలం
కనుమూసే కాలం వచ్చిందే ఓ....గంగమ్మ
కడసూపుకు నోసుకోలేదా మా....గంగమ్మ

నిండు జెరువును సూసిన కాలంలో ఓ......గంగమ్మ
నిన్ను ఆకాశ గంగనుకున్నామే మా.....గంగమ్మ
నీ వొడిలో మోపిన మోటుకాళ్ళను
తడబడు అడుగుల పసిపోరలను
కదులుతు, మెదులుతు వొళ్ళు రుద్దుతూ
సంబరంగ నువ్ జోల పాడినవ్
నువులేక పచ్చుల మైనామే ఓ.....గంగమ్మ
నినుజూడ బయలెలుతున్నామే మా....గంగమ్మ

ఈ ఎండిన సెరువును జూస్తేనే ఓ.....గంగమ్మ
మా గుండె సెరువయ్యిందమ్మో మా.....గంగమ్మ
కదలేక మా కొస ఊపిరితో
ఉగ్గబట్టి మేం నడుస్తున్నము
కాలు గదిపితే ఎండిన వొండు
శూలమయ్యి మరి గుచ్చుతున్నది
మా శోకం నీకిన పడదాయె...... ఓ గంగమ్మ
కన్నీటి అలుగులు గనవాయె....మా గంగమ్మ ॥మాకెదురు॥
మదినిండా నిలిపినమే తల్లీ ఓ........గంగమ్మ
మా ఇంటి దేవతవే తల్లీ ఓ........గంగమ్మ
నీ పండుగ జేసినమే తల్లీ మా.....గంగమ్మ


కులసంఖ్య పెద్దది



కులసంఖ్య పెద్దది-జనసంఖ్య పెద్దది
ఎనకబడ్డజాతోల్లది మరి ఎందుకెదగ లేకున్నది
గుట్టు విప్పనార తమ్ముడా నువ్వొప్పుకుంటే ఒక్కమాట
జెప్పనారా తమ్ముడా అది గోగునార తీరురా....
అదునుమీద జీర్తె నారైతది అది ఎక్కువ నానేస్తే పాడైతది
నార దాల్చితె మంచి తాడైతది పురిబెడ్తె కట్టేసి మోకైతది
అది తెలుసుకోరా తమ్ముడా నువ్వు కలిసిరారా తమ్ముడా ॥కులసంఖ్య॥

కులానికొక్కడు వీడిపోతడు మతానికొక్కడు మారిపోతడు
పాంతానికొక్కడు జీలిపోతడు పాటేండ్లకే పాన మిస్తడొక్కడు
తనకులమె గొప్పది అనుకుంటడు బాపనోల్ల పిలక బెడ్తుంటడు
తనతోటి బీసీలనే దేఖడు అగ్రవర్ణం కాళ్ల కాడుంటడు
అది తెలుసుకోరా తమ్ముడా నువ్వు కలిసిరారా తమ్ముడా ॥కులసంఖ్య॥

పార్టీల పేరుతో విడిపోతరు పానాన్ని తెగించి పోరాడ్తరు
అభిమాన హీరోల జట్టంటరు తనతోటి తమ్ముల్ల గొడుతుంటరు
విధ్యార్థి సంఘంలో జేరుతరు పగలు బెంచుకోని కొట్లాడ్తరు
పైసకోసం పియ్యి దీంటుంటరు తనవాళ్ళ పానాలు దీస్తుంటరు
కులమంటె హీనంగ జూస్తుంటరు మార్క్స్ మావొ అన్ని మేమంటరు
అది తెలుసుకోరా తమ్ముడా నువ్వు కలిసిరారా తమ్ముడా ॥కులసంఖ్య॥


ఎవరు చేరదీస్తారు...



ఎవరు చేర దీస్తారు మమ్మెవరు ఆదుకుంటారు
కాళ్ళు జేతుల కేళ్ళులేవు కన్నవాళ్ళకు ఊళ్ళులేవు
ముక్కు మూతి మూడు దెర్లు
ముఖం జూడ కోతిరూపు
డోలు గజ్జెలు వీధులల్లో మోగుతున్న గుండెడప్పులు
                                                                       ॥ఎవరు॥
మనుషులల్లో ఉన్న మేము ఎన్నడట్ల ఉండమైతిమి
మాటలాడ జూస్తే మేము ఒక్కరన్న పలకరైతిరి
మనసులోతును జూడకుంట
కుష్ఠువ్యాధని ఈసడిస్తిరి
కరుణలేని ఈ సంఘం మనదా
దేవుడా నువ్ జూడవా
                                                                 ॥ఎవరు॥
మేంజేసిన పాపము లేదు ఎవడు బెట్టిన శాపము
మేం మొక్కని గుళ్ళేలేవు ఎటు బోయెను దైవము
మా మొరను ఆలకించని మీరు
ఎన్ని జన్మలు ఎత్తితె నేమి
గ్రహణ మింక మము వీడిందా
దేవుడా ఓ దేవుడా

ధరిజేర మీకు భయమూ
అది అంటదు ఇంకా నయమూ
మము ఓదార్చిన మా అమ్మా ఏ లోకం జేరిందో
మము కనికరించినా ప్రభువు శిలువనే మోస్తుండో

(కుష్టు వాళ్ళను ఎంతో ఆప్యాయంగా చేరదీసిన 'అమ్మ', 'మదర్‌థెరీసా'కు)


కాదు మేము నవాబులం



కాదు మేము నవాబులం
గంజికి లేనీ గరీబులం
జంబూదేశపు వీధుల వెంట
గంటగొట్టి ఇల్లిల్లు దిరిగెటి
గంట పక్కీరోల్లం ॥కాదు॥

కటిక నేలపై దేశం కందిన కాలంలో
దుమ్ము, ధూళిని ఊపిరి జేసి
ఏకిన దూదిని పరుపులు గుట్టి
దగ్గి దగ్గి బతుకూ దబ్బున సావు దగ్గరయ్యీ
భోగ భాగ్యముల నిచ్చిన వాళ్ళం
దూదేకులోల్లం మేమీ జంబూ దేశపోల్లం
అల్లా ..... ఆ ..... ఆ ......ఆ ......
అల్లాకే నామ్ మాకే మాలుమ్ ॥కాదు॥

బంగరు వన్నెల గాజుల గలగలలో
పిల్ల గాజులని, తల్లి గాజులని
ప్రేమ గాజులని, పెళ్ళి గాజులని
పల్లెటూళ్ళ వెంట సుట్టూ గుడాలన్ని దిరిగీ
పల్లెకు పచ్చని కాంతులు దెచ్చిన
సాయబులోల్లం మేమే సౌభాగ్యము నిచ్చెది మేమే
అల్లా ..... ఆ ..... ఆ ...... ఆ .......
అల్లాకే నామ్ మాకే మాలుమ్ ॥కాదు॥

జంబూ దేశపు సుందర నామములో
భరతుడేలిన భారతమంటూ
చరిత్ర నదులు వంకర దిరగగా
ఆక్రమించి నోళ్ళు నేలను అదిమి పట్టినోళ్ళు
ఆర్యరాజలై అవతరించగా బానిసలయ్యి
బతికిన వాళ్ళం మనమే బలిపశువుల మైనది మేమే
అల్లా ...... ఆ ..... ఆ ....... ఆ .....
అల్లాకే నామ్ మాకే మాలుమ్ ॥కాదు॥

కణ కణ మండే ఎర్రటెండలో
పిల్లర్లసోంటి 'ఖడీ'లు దీసి
పచ్చి బండపై పెలుసు లేపక
ముక్కు మొఖము జేసి సక్కని సైజు రాళ్ళదీసి
బతుకు బండలై గుండెలు బగిలిన
కాశోల్లు మేమే అయ్యో పత్తర్ పోళ్ళు మేమే
అల్లా ..... ఆ ..... ఆ ...... ఆ .....
అల్లాకే నామ్ మాకే మాలుమ్ ॥కాదు॥

రోడ్డు మీద ఆ తోపుడు బండ్లలో
అరటి పండ్లని, హరేకు మాలని
పేగులు అరవగ కూతలు బెట్టి
భిక్క మొఖముతోని సిన్నగ ఇంటి బాటదీసి
ఎగబడె పిల్లల ఆకలి దీర్చక
పస్తులుండె మేము ఏమి లేని వాళ్ళమేనూ
అల్లా .... ఆ ...... ఆ ...... ఆ .....
అల్లాకే నామ్ మాకే మాలుమ్ ॥కాదు॥


ఎట్టాజెప్పేదే...



ఏంది బావ ఇంకెంత కాలం ఈ బాధలు
మనం కలలుగనే తెలంగాణ రాదంటవా?
మన బతుకు మారదంటవా?
ఎందుకు రాదు? కానీ ....

ఎట్టాజెప్పేదే
నేను నీకు ఎట్టా జెప్పేదే
తెలంగాణ మీద పూటకోమాట
తెలంగాణ మీద మనిషకో మాట
మనోడు అంతకే, ఆంధ్రోడు అంతకే
గంతకు దగ్గ బొంతయ్యి పోతుంటే ॥ఎట్టా॥

తెలంగాణ బండి గదిలిందో
అయ్యో ఉరుకొచ్చి ముంగల నడ్సిండ్రో
అస్సోయి దూలా ఆడిండ్రో
అయ్యో నిప్పుల గుండం దొక్కిండ్రో
హెయ్! రెక్కల గుఱ్ఱం ఎక్కిండ్రో ॥కో॥
మబ్బులన్ని మాలోకంగ గమ్మీన
తేలిపోనూ వొచ్చూ.....సినుకు రాలవొచ్చు
ఈ సంగతి నీకు ॥ఎట్టా॥

ఏడేడ గోతులు దీస్తుండో
ఆడు ఎవన్నెట్ట అంతం జేస్తుండో
ఏమేమి ఆశలు బెడ్తుండో
ఆడు ఎవన్నెట్ట లోతుల ఏస్తుండో
హెయ్ : ఎట్టమనకు ఉచ్చులేస్తుండో ॥కో॥

ఎంత బిర్రుగ నువ్వు ఉద్యమంజేసిన
నీరు గారవొచ్చూ ... నిగ్గు దేలవొచ్చు
ఈ సంగతి నీకు ॥ఎట్టా॥

ఎవడెన్ని కుట్రలు బంతుండో
ఈడు ఏమేమి తాకట్టు బెడ్తుండో
ఎవడెట్ల అమ్ముడు బోతుండో
ఈడు ఏడేడ జాగలు గొంటుండో
హేయ్! భూములెట్ల కబ్జా జేస్తుండో ॥కో॥
చంద్రబోసు లాంటి నాయకుడైన
బలియయ్యి పోవొచ్చూ ... బతికిరానూ వొచ్చు
ఈ సంగతి నీకు ॥ఎట్టా॥

ఇంకా మోసం మనకు జరిగిందో
అయ్యో సూసుకుంట ఎవరూ ఉండొద్దు
ఎవడు నిలువున ముంచ జూసిండో
ఆన్ని ఎంటబడి మనమూ తరమాలే
హెయ్! ఎగిరెగిరి గుండెల్లోదన్నాలే ॥కో॥
ఇంతకాలం మనం ఎదురు సూసిన తల్లి
సల్లంగ రావొచ్చూ ... నెత్తురే చిందొచ్చు
ఈ సంగంతీ నీకు....

ఆ సంగతి నాకు
తెలిసినాది బావా నీది తెలంగాణ తోవ
ఇగ మరిసిపోను బావ అది మరువలేని గాథ


జాడ లేదమ్మా....



పల్లే ఓయమ్మా నను గన్నా మాయమ్మా
జాడా లేదమ్మా నేనేడా జూడమ్మా ॥పల్లే ఓయమ్మా॥

పసుపు కుంకుమా బొట్లూబెట్టి ఎడ్లా బండ్లకూ
రంగు చీరలుజుట్టి రథము అయ్యను జేస్తే
కొంగుజాపిన బంగరు నేల చెంగు చెంగున దుంకిన పల్లే
జొన్నకంకులు బోనం పట్వలు
ఎక్కడ గనరావు ఇప్పుడు ఏమి సిత్రమో
మన సంభరాలు అంగడిబాయే ఎవని పుణ్యమో ॥పల్లే ఓయమ్మా॥

ఎదుగుదలకు ఆయువైన చక్రమాగెను
ఖనిజాలకు మూలమైన కంచుబాయెను
కొలిమి మంటలు ఆరిపాయెను నాగలిమొద్దులు లేకపాయెను
పార పలుగు శిలుమెక్కి పాయెను
వొడ్ల కమ్మరి సేతులకెవడు తొల్లిగొట్టెనో
పూటపూటకా ఇండ్లల్ల లొల్లి బుట్టెను ॥పల్లే ఓయమ్మా॥

మంచి సెడ్డకు దగ్గెరుండు మనసున్నోళ్ళు
కట్టడి గింజలకే చేసే పుట్టెడు పనులూ
సాకలి మంగలి పొత్తు ఇంటికిరాదు ఇత్తు
అని ఎవడు ఏసిన ఎత్తు
హీనమయ్యెను కులాలిట్ల ఎవని పుణ్యమో
మనజాతి ఒకటి గాదు ఏమి పాపమో ॥పల్లే ఓయమ్మా॥

సావు బతకూ ఏదీ జూడు సప్పుడుండును
డప్పు కొమ్ములు లేక ఇక్కడ ఏమి జరుగును
ఏనెగుండ్లు పలగొట్టిండ్రు తంగెళ్ళు నరికేసిండ్రు
బొక్కెండ్లు బోర్లిచ్చిండ్రు
లందగోళెం కానరాదు ఎవని పుణ్యమో
డప్పు దరువుల తీరు మారె ఏమి చిత్రమో ॥పల్లే ఓయమ్మా॥

వలపూసల గలగలలా బెస్తాబోయులా
బతుకు దెరువు ఆగమాయె సెరువూ కుంటలా
పిడులిప్పని మనసూతోని బతుకుబుట్టి సేత బట్టి
పాసి పనితో పొట్టనింపి
కన్నఊరిని మర్సేపోతిమి ఏమి సిత్రమో
కుల వృత్తులు గూలిపాయే ఎవని పుణ్యమో ॥పల్లే ఓయమ్మా॥

ముస్తాదుకు మువ్వలు గట్టి ఘల్లు ఘల్లునా
అడవితల్లికి పెద్దాబిడ్డ అడుగులెయ్యగ
పరువుమీద వున్నా తాళ్ళు కరువుదీర కల్లును వుట్టే
బొట్లు లొట్లయ్ పట్వలు నిండే
బుస బుసమని తెల్లని పొంగుల పల్లేచిందులు
ఇప్పుడెక్కడ గనరావు ఏమి సిత్రమో ॥పల్లే ఓయమ్మా॥

సింగుడుడ్డిన కొండా రంగులు కండెకు బోసినా
పల్లెలందము సాంచకు బోసి మగ్గం నేసినా
ముతక గుడ్డకు నోసరాయే మూడుపూటలు కరువాయే
బతకలేక సావులాయే
బహుళజాతి కంపెనీలు ఎవని పుణ్యమో
కులవృత్తులు గూలిపాయే ఏమి చిత్రమో ॥పల్లే ఓయమ్మా॥


చెంగుచెంగున దునికె



చెంగు చెంగున దుంకె జింక పిల్లా చెంగనాలు దోలె కన్నెపిల్ల
అప్పుడే నన్నిడిసీ ఎల్లిపోతున్నావా
ఏలే లక్ష్మను బొమ్మ నాముద్దు గంగమ్మ
కలువల్లో ఏముంది పోవే నీ కండ్లల్లో శానుంది రావే
కోయిల పాటల్లో ఏముంది పోవే
నీ మాటల్లో మాయుంది లేవే ॥చెంగు॥

నీపాల బుగ్గల్లో మురిపాల ముగ్గుల్లో
సిందులేసిన సిగ్గు కలిమ పండోలాయే
నీ కాలి గజ్జెల్లో ఆ నెమలి నడకల్లో
నా పాటలే పలికే నీ ఎంటనే దిరిగే
ఏటి గట్టుకు జేరి ఆటలాడిననాడు
జాబిల్లి మనతోడు సందమామల జూడు
సీకటే ఇల్లాయెనే గంగమ్మ నువు లేక ఎటుబోదునే ॥చెంగు॥

నడిరాత్రి ఏలల్లో పున్నమి ఎన్నెల్లో
మనలజూసి మెరిసే పలుగురాల్ల దుబ్బ
తంగెడు చెట్లల్ల సర్కారు తుమ్మల్ల
ముద్దు ముచ్చెటలిన్న కీసురాళ్ళ గుంపు
మనల జూసి ఉరికె నిండూ సందమామ
మబ్బుపాటున జేరి తొంగి సూడగ మరిగే
నువులేక ఎటుబోదునే గంగమ్మ ఎవరడిగితేంజెప్పనే. ॥చెంగు॥
ఆడి ఓడి మనమూ ఆలిసిపోయిన పొద్దు
ఆనంద తీరంలో ఆద మరిసిన పొద్దు

తొలిరేకా వెలుగుల్లో వేకువిచ్చిన ముద్దు
పక్షులొచ్చి పిలిసే సూరుడొచ్చిన పొద్దు
మనల జూసి ముసుగు మసకేసే సీకటీ
పట్టపగలే వచ్చి పక్కుపక్కున నవ్వే
ఇగనన్న బదులీయనే గంగమ్మ నువు లేక నేనుండనే ॥చెంగు॥


ద్రోహమేందిరో..



ద్రోహమేందిరో దొంగ సోపతేందిరో
దోసుకున్నదింక జాలు ఎల్లరేందిరో
తెలంగాణ పేరుతోని ఓట్లు సీట్లు బెంచుకోని
తెలివిదక్కువోల్ల జేసి తెనాలిదేనని చెప్పే ॥ద్రోహ॥

అటెండరు మొదలుకొని ఐఏఎస్ దాక మీరు
ఆయమన్న కొలువులన్ని మింగుతున్నరు
హైద్రబాదు ఫ్రీజోనని హైటెక్కుతున్నరు
ఆంధ్ర నించి వచ్చేటోల్లా అడ్డా జేసుకున్నరు
అంతే గదరా ఓ సీమాంధ్ర నాయకా...
నిజానికి నువ్వు నాకు చేసిన అన్యాయమేందో
నీకుమాత్రమెర్కలేద నిజాయితీ లేని కొడుకా ॥ద్రోహ॥

తెలంగాణ సాయుధులై అలుపెరుగని యోధులు
సమైఖ్యాంధ్ర సంకలోన పాలుదాగె పిల్లులు
తెలుగు పేరుజెప్పుకోని తేట దేశమనెటోల్లు
తీటకొయ్యలాకులోలే తిమ్మిరెక్కి ఉన్నరు
అంతే గదరా ఓ సమైఖ్యాంధ్ర నాయకా...
తెలంగాణకెప్పుడైన మద్దతు మాదుంటదని
తేల్చి చెప్పినా మాటల కోటమీది బాబులు ॥ద్రోహ॥

మనల ముంచిపోయెటోడు మన సుట్టే ఉంటడు
మాటమాటకొచ్చి వాడు జైజై గొడుతుంటడు
తన పబ్బం గడుపుకోను సావాసం జేస్తడు
అవతలి కెల్లంగనే దెశపో అనుకుంటడు

అంతేగదరా దగుల్భాజి నాయకా...
తెలంగాణ పేరు జెప్పి ఢిల్లీ గల్లీల జేరి
లొల్లిలొల్లి జేసి మల్ల లల్లాయి పాటబాడే ॥ద్రోహ॥

ఓటు కొరకు తెలంగాణ సీటు కొరకు తెలంగాణ
పదవి కొరకు తెలంగాణ పలుకు బడికి తెలంగాణ
మందినవ్వె తెలంగాణ మరుపురాని తెలంగాణ
అవసరానికాయుధమై అవతరించు తెలంగాణ
అంతేగదరా ఓ రాజకీయ నాయకా...
విద్యార్థి మేధావి కవిగాయక తెలంగాణ
ఎవడు జూడు తెలంగాణ యాడ జూడు తెలంగాణ ॥ద్రోహ॥

అటు ఇటు నుసులంగ మీరు అమవాస వస్తది
ఆయింత మా బతుకుల సీకటే నింతది
ఎటు జూసిన మన గొప్ప ఎవనికాడే అంటది
ఏకమయ్యి పోరుజేసె బాటే లేదంటది
ఇంతే గదరా ఈ ఉద్యమాల జాతరా...
అంతుజూడ బయలుదేరి ఎంతో కొంత ముట్టగనే
అన్ని మరిసి మా సేతికి సిప్పదెచ్చి ఇచ్చెటోడా ॥ద్రోహ॥


తెలంగాణ కోసం



ఈ నేల తెలంగాణ కోసమూ
పోరుజేయ బోదమురారా తమ్ముడా
ఏరుబోయమందం రారా తమ్ముడా ॥ఈనేల॥

బాటెంట బోతోల్లు గుర్తుదెల్వకున్నను
ఆకిట్లకొచ్చిరో దూపైనదంటెరా
సల్లబోసి నీడనిచ్చిన పల్లెరా...
బతుకలేక గోసదీసెనేందనీ
సింత జేసుడెందుకురా తమ్ముడా
సిన్నబోవుడెందుకురా తమ్ముడా ॥ఈ నేల॥

ఏ పార్టి జెండాలు భుజాన మోసినా
ముప్పొద్దులా బతుకు ఉపాసమయ్యెనా
పొద్దుబోని మాటల పార్టీలలో..
సిద్దాంత రాద్దాంతం ఏందని
ఉద్యమాల జెండా బట్టు తమ్ముడా
ఉప్పెనోలె ఉరికీరారా తమ్ముడా..
కే. సి. ఆరు అడుగుల్లో తమ్ముడా
పొలి కేకలేద్దం లేర తమ్ముడా ॥ఈ నేల॥

(నల్లగొండలో 'తెలంగాణ పొలికేక సభ' సందర్భంగ)


గోదారమ్మ



గలగలా పారేటి గోదారమ్మా
గండాలు నిన్నిడ్సి పోలేదమ్మా
శ్రీరాముసాగరు వరదా కాల్వతోని
సేతులెత్తినోళ్ళు కూతేసేనమ్మా
చెట్టుపేరుజెప్పి కాయలమ్ముకుంటూ
కట్టు కథలతోని కాలమెల్ల దీసి
ఇందిరమ్మ రాజ్యమంటరు రాజీవు పాలనంటరు ॥గల గలా॥

ఆదారి ఈదారి ఏదారినోగాని
గోదారి మళ్ళించే పథకమేసిండ్రు
అవినీతి యజ్ఞంలో అదికార్లు కాంట్రాక్టులు
శాస్త్రీయ సర్వేని నీటముంచిండ్రు
ఇన్నేండ్ల కాలంలో ఎన్నడు లేనంత
ఇగురంగ ఎగిరెగిరి చిందేసి ఆడంగ
ఇందిరమ్మ రాజ్యమంటరు రాజీవు పాలనంటరు ॥గల గలా॥

దేవులాట లేనోల్లు దేవాదులన్నరు
ప్రాజెక్టు పనులన్ని పక్కకే బెట్టిండ్రు
ఎల్లంపెల్లి గాక ఎక్కిళ్ళు బెట్టింది
చేవెళ్ళ చెల్లెమ్మ చెంగనాలాపింది
చెర్లు కుంటలు నింపి నీరు పొదుపు జేసే
పథకాల పేరుతో పని పాతరెయ్యంగ
ఇందిరమ్మ రాజ్యమంటరు రాజీవు పాలనంటరు ॥గల గలా॥


కదిలింది - కదిలింది



కదిలింది కదిలింది ఇది తెలంగాణం
రగిలింది రగిలింది ఇది రైతు రాజ్యం
అవినీతి పాలనను అంతమొందించగ
ఊరువాడలు రగిలి ఉప్పెనోలె ఎగిసి ॥కదిలింది॥

అన్నదాతంటూనే రైతన్న నడ్డిరిసీ
ఎరువు లిచ్చేకాడ కన్నతిప్పలు బెట్టే
కల్లమిడ్సిన పంట కన్నీరు బెట్టిచ్చె
అంగట్ల దాళార్ల కన్నిట్ల గలిసొచ్చె
మెదినీల్ల బోరాయె మడినీల్లు బారంగ
ఉరిబెట్టుకొని సచ్చె కాలమేందని అడిగి
ఉగ్రరూపము దాల్చి ఉరుకొచ్చె జనమంతా ॥కదిలింది॥

సింగుడుడ్డిన కొండ కుంచె రంగులనద్ది
నేసిండ్రు బంగారు పట్టు చీరలు ఎన్నో
రాట్నమొడికేటోల్ల రాగమాగిపాయె
రాజ్యమేలేటోల్ల కంటికానకపాయె
కూడుబెట్టని విద్య కులవృత్తులే గదర
ఆదునీకరనంటు అందరొస్తుండ్రేందీ
అవమాన పడ్డాల్ల అనిచేసుడేందటు ॥కదిలింది॥

తెలంగాణ పల్లెల్లో భూములమ్ముతుండ్రు
కోస్తాంధ్రతీరాన్ని కుదువబెట్టేస్తుండ్రు
రాయలసీమంతా అగ్గి రాజేస్తుండ్రు
రాజకీయ కుట్రలెన్నో జేసేస్తుండ్రు

తీరొక్క పథకంతొ తిర్నాల జెయ్యంగ
తిమ్మిరొదలగ ధరలు పెంచికూసుండ్రని
స్వర్ణాంద్రో హరితాంధ్రో మా బతుకు ఏందంటు ॥కదిలింది॥

లిఫ్ట్‌కాల్వలు దొవ్వె కాంటాక్టు షిఫ్టాయె
ప్రాజెక్టులా పేర ప్రజల సొమ్మును మింగె
శంకు స్థాపన జేసి చేయి దులుపుకుంటూ
పని సాంతిమయినట్టు ప్రకటనలు జేస్తుండ్రు
కల్తిసారా విస్కి ఏరయ్యి పారంగ
పట్టుదప్పిన పల్లె కళ దప్పి పోతుంది
ఇదియేనా ఇందిరా రాజీవు రాజ్యమనీ ॥కదిలింది॥


ఇష్టం - ఇష్టం



ఇష్టం ఇష్టం ఇష్టం నువ్వంటే నాకిష్టం
చిరు సిగ్గులతో మందారంలా
ఎరుపెక్కిన నీ బుగ్గలు ఇష్టం
చిలిపిగా నువు చూసె చూపులు ఇంకెంతో

ఇష్టం ఇష్టం ఇష్టం నేనంటె నీకిష్టం
చిరుసిగ్గులతో మందారంలా
ఎరుపెక్కిన నా బుగ్గలు ఇష్టం
చిలిపిగా నే చూసె చూపులు
నీకెంతో ఇష్టం ॥ఇష్టం॥

కొస పెదవిని కొరుకుతూ నువ్వు
కసిగా నను దాచిన వైనం ఇష్టం ఇష్టం
నిన్ను నన్ను ఒక్కటి చేసిన చీకటంటే ఇష్టం
చల్లగా ఒడి చేర్చుకున్న ఈ పిల్లగాలి ఇష్టం
జలపాతాల హోరు మనలా కట్టేసే చూడు
అదే కదా మనకిష్టం అదే కదా మనకిష్టం
ఆకాశంలో ఒక్కటిగా ఎగిరిపోయె గువ్వలజంట
ఇద్దరికీ ఇష్టం మన ఇద్దరికీ ఇష్టం ॥ఇష్టం॥

నిష రాత్రిని కోరుతు నువ్వూ
రుషిగా నను చేరిన వైనం ఇష్టం ఇష్టం
నిలువెల్లా నను చుట్టేసె నీ కొండ చిలువలా భిగువిష్టం
మైకంతో కరిగిపోతు ఎగిరే జలపాతాలిష్టం
ప్రియరాగాల జోరు మనలా చుట్టేసె చూడు

అదే కదా మనకిష్టం అదే కదా మనకిష్టం
ప్రేమగాలి చెంగున ఎగిరి కొండను తాకిన సంగీతం
ఇద్దరికీ ఇష్టం మన ఇద్దరికీ ఇష్టం ॥ఇష్టం॥

ఆ చక్కని చుక్కల రాత్రి
ప్రకృతితో మనకీ మైత్రి
ఎంతో ఎంతో ఎంతో ఎంతో..
ఎంతో ఇష్టం మనకెంతో ఇష్టం ॥ఇష్టం॥


జాబిలమ్మ



జాబిలమ్మ జాలరోడు ఏడి
వెన్నెలమ్మ వన్నెకాడు ఏడీ
పడవే ఎక్కిండనీ పైకే వస్తుండనీ
నిండూపున్నమి నీడల్లోన నిదురగాసినానే ॥జాబిలమ్మా॥

మూడుపొద్దులమ్మా గంగ వొడినా ఉంటడే
గంగపుత్రుడమ్మ వీడు బెస్తబోయుడే
సూర్యునికే ఏదురేగునే నిండు ఆకాశం తలదించగా ॥జాబిలమ్మా॥

కెరటాన్నే కిరటమోలే పెట్టుకుంటడే
కేరింతలేసి అలల జూలు బడతడే
బోటు తెడ్డేసి వస్తుంటే నీలిసంద్రమంత ఊయలూగునే ॥జాబిలమ్మా॥

తెరసాపనెత్తిపట్టి సాగుతుంటడే
సొరచేపలెక్క వాడు దునుకుతుంటడే
కన్నెబంగారు తీగమ్మో నా కొరమేను వాడమ్మా ॥జాబిలమ్మా॥

సందమామ సాపదెచ్చి వండమంటడే
సన్నసాపలా పులుసు పెట్టమంటడే
ముద్దెన్క ముద్దబెట్టి అగుడు ఆకలంత దీర్చుకుంటడే ॥జాబిలమ్మా॥

తెల్లారి సుక్కబొడిసె తేటగాయెనే
సల్లారిపోయె ఆశ సచ్చిపాయెనే
ఆడు యాడున్నడోయమ్మా పాడు సూనామి పాలయ్యెనా ॥జాబిలమ్మా॥