అండపిండ బ్రహ్మాండ విచారణ

వికీసోర్స్ నుండి

రచన: యడ్ల రామదాసు

అండపిండ బ్రహ్మాండ విచారణ పండితులకు ఎరుక
తిండిపోతులై తిరిగెడు శుద్ధ బండలకే మెరుక


ఎవరి తలంపు ఎలాగున నున్నదో ఈశ్వరునకు ఎరుక
గౌరవమెరుగని గార్ధబంబులకు గణ్యత లేమెరుక


భాగవతుల జాడలు ఈ జగతిని యోగ్యులకే ఎరుక
రాగద్వేషములు నణచక తిరుగు అయోగ్యులకే మెరుక


సుమరస మాధురి క్రమముగ గ్రోలుట భ్రమరములకు ఎరుక
పామరముగ రక్తపానము చేసెడి దోమలకే మెరుక


ధర్మాధర్మము లెరిగి చరించుట నిర్మలులకు ఎరుక
మర్మము లాడుచు మాని తిరుగు దుష్కర్ముల కేమెరుక


మతములన్ని సమ్మతమ్మని మెలగుట యతీశ్వరులకెరుక
ఈతకాయలకు చేతులు చాచే కోతుల కేమెరుక


బాగుగ సద్గురు బోధ వినోదము సాధులకే ఎరుక
బేధము లాడుచు గాధలు చెన్నే వాదులకే మెరుక


కన్నుల మధ్యను యున్న ప్రకాశము పుణ్యాత్ముల కెరుక
పిన్న పెద్దతన మెన్నగలేని దున్నలకే మెరుక


అద్దములో ప్రతిబింబము పోలిక సిద్ధులకే ఎరుక
పెద్దల వాక్యము రద్దులు చేసే మొద్దులకే మెరుక


పాశురముగ యడ్ల రామదాసు కవి భగవంతునికెరుక
ఆశల పాలై హరిని తలంచని అధములమే మెరుక