Jump to content

అంటరానివారు ఎవరు?

వికీసోర్స్ నుండి

రచన . వడ్డూరి అచ్యుతరామ కవి స్వాతంత్ర్య సమరయోధులు రచనా కాలం 1954 కృతికర్త విజ్ఞప్తి ! మహాశయులారా ! భగవంతుని ప్రేరణచే అంటరానివారు ఎవరు ? అను ఈ చిన్న ఖండకావ్యమును వ్రాసితిని. వ్రాసి చాలా కాలమైనను పుస్తక రూపంలో వెలుగులోకి రాలేదు. ఇప్పుడు కొయ్యలగూడెం పంచాయితీ ప్రెసిడెంట్ గారు శ్రీ శ్రీ A .S జాన్ గారు దీని ముద్రణా వ్యయం భరించి ముద్రణ చేయించి వెలుగులోకి తెచ్చి లోకానికి అందించి చరితార్దు లైనారు. స్వాతంత్రోద్యమ సమయంలో ఆంధ్రరత్న కీర్తి శేషులు దుగ్గిరాల గోపాలకృష్ణయ్య గారును మరియు అప్పటి పెద్దలును అంటరాని వారంటే మా వెంటరాని వారె అని పాడేవారు. పుట్టుక చేత నెవరైననూ అంటరాని వారనుటకు ఆధారములు కానరావు గదా! కనుకనే యుగపురుషుడన బడిన గాంధీ మహాత్ముడు ఈ విషయములో చొరవ తీసికొని కలకత్తాలో పండిత మహాసభను జరిపి శాస్త్రరీత్యా అస్పుశ్ర్యులని ఏజాతి వారినైనా అనుటకు తగిన శాస్త్రీయమైన ఆధారములు చూపించమనిరి. కానీ ఎవరూ గాంధీజీని ఒప్పించలేక పోయారు. ఆ విషయాలను నేను జ్ఞాపకమున్నంత వరకు తెలిసినంత వరకు ఈ ఖండకావ్యము ద్వారా పండిత ప్రపంచమునకు అందించు చున్నాను. విజ్ఞులెల్లరు ఇచ్చే సలహాలను సూచనలను సంతోషముతో స్వీకరింప సిద్ధముగా నున్నాను.

                                                                                                                                                                                                                       ఇట్లు  రచయిత 
                                                                                                                                                                                                    వడ్డూరి అచ్యుతరామ కవి  

కన్నాపురం 25.03.1983

అభినందనలు

అంటరానివారు ఎవరు అను కావ్యమును వ్రాసిన వారు ఒక ప్రజా సేవలో కాకలు తీరిన ప్రముఖ సమరయోధుడు. గిరిజన,హరిజనాది పేదవర్గాల అభివృద్ధికి కృషి చేసిన ప్రముఖ కవి కవిత్వ రంగంలో కృషి చేసిన వారికి రాజకీయానుభవాలు ఉండడం అరుదు. నా చిన్నతనం నుండి ఈ ప్రాంతంలో అభివృద్ధికి ఎన్నో కార్యక్రమాలు నిర్వహించిన గాంధేయవాది బందకట్టు వంటి నీటి వనరులు సాధించి ప్రాంతీయాభి వృద్ధికి కృషి చేయడమే గాక అనేక రైతు ఉద్యమాలలో రైతులకు ప్రతినిధిగా పనిచేసిన కార్యకర్త,మంచి వక్త యిటువంటి విప్లవాత్మక కావ్య రచన చేయడం అలాగే ఒక కళాభిమాని ,కళాపోషకుడు ,నిగర్వి ,ప్రజాసేవకుడు ,ఉదార ధైర్య సాహసాలుగల వ్యక్తీ ఈ విప్లవాత్మక మైన గ్రంధమును ముద్రించి లోకానికి అందించడం మరొక విశేషం ఇది ఉభయ తారకంగా చెప్పదగిన విశేషము .శ్రీ వడ్డూరి అచ్యుతరామ కవి గారు కవిగా, రాజకీయవాదిగా,ఆధ్యాత్మిక,రాజకీయ రంగాలలో ప్రముఖ ఉపన్యాసకులుగా ఆంద్ర ప్రాంతానికి సుపరిచితులు ,గిరిజనా భివృద్ధికి కృషి చేసినవారు . చేస్తున్నవారు ,వీరు సుమారు 25 గ్రంధములు ,స్థలపురాణములు,శతకములు,భక్తీ రస పూరితములు,మరికొన్ని గణనీయమైన రాజకీయ గ్రంధములు వీరి రచనలన్నీ మణిపూసలే ,అసలు అంటరాని వారే లేరు, ఇటువంటి వారు అంటరానివారు అని సహేతుకంగా వారు పద్యాలలో వ్రాసి పూర్వపు ఉదాహరణలతో నిరూపించి ఋజువు చేసారు . వారు వ్రాసినదంతా నిజము అందుకే నేనంటాను. అంటరాని వారంటే ,మంచికి వెంటరానివారే. కవి తన హృదయంలో భావాలను అక్షర రూపంలో పొందుపరచి వినిపిస్తే వినడమే కాదు ఆదరించే రస హృదయులు కావాలి. అలాంటి రస హృదయం గల వాడు కనుకనే శ్రీ A.S. జాన్ గారు గ్రంధమును ముద్రించి లోకానికి అందించారు .ఈ గ్రంధం రచించి 30 సంవత్సరాలు దాటినట్లు రచయిత ఉవాచ.ఓ ముఖ్య విషయమేమంటే పేజీలు తిరగ వేయడం గాకుండా ఆసాంతం చదివితే రచయిత తపన తెలుస్తుంది.

                    
అజ్ఞేభ్యో గ్రంధినః శ్రేష్టః గ్రంధిభ్యో దారినో వరాః
ధారి భోజ్ఞానినః శ్రేష్టా జ్ఞానిధ్యో వ్యవసాయినః

అని ఆర్యులన్నది నిజం కదా !కుల,మాట రాజకీయ కల్లోలాలతో కలిమి లేముల సంఘర్షణతో నిరంతరం,పరస్పరం,కొట్టు మిట్టాడుచున్న నేటి ప్రజానీకానికి ప్రభోదాత్మకమైన ఈ ఖండకావ్యము వెలుగుబాట చూపగలదని ఆశిస్తున్నాను. నా ఈ భావాలను వెల్లడించుతాకు అవకాశమిచ్చిన శ్రీ వడ్డూరి అచ్యుతరామ కవి గారికి , శ్రీ ఎ .యస్ . జాన్ గారికి నా కృతజ్ఞతలు . శ్రేయోభిలాషి కనుపర్తి లక్ష్మి వీర్రాజు తిరుమలాపురం ఆవుల సాంబశివరావు SWATHI,JUDGES COLONY MALAKPET HYDERABAD మహారాజశ్రీ అచ్యుటరామ కవి గార్కి నమస్కారములు మే 22 తేదీ గల మీ ఉత్తరం ,అంటరానివారు ఎవరు ? అనే మీ కావ్యం అందాయి మీ కావ్యంలో మీరు చెప్పిన భావాలు విలువైనవి. అంటరానివారు కొన్ని కులాలలో పుట్టినవారు కారు. నిజమైన అంటరానివారు మోసగాళ్ళు,కుటిలకోరులు ,అవినీతిపరులు,సమాజద్రోహులు, మీ భావాలకు తగు ప్రచారం రాగలదని ఆశిస్తున్నాను . ఇట్లు (Sd) ఆవుల సాంబశివరావు 29 .05 .84 పరకాల శేషావతారం రవాణా శాఖామంత్రి హైదరాబాద్ శ్రీ వడ్డూరి అచ్యుతరామ కవి గారు వ్రాసిన అంటరానివారు ఎవరు అను వ్రాత ప్రతి చదివాను.సంఘ సంస్కరణకు ఉపయోగపడే రచన భావాలు చక్కగా ఉన్నాయి. ఉదాహరణలు మూలసూత్రములు సమర్ధ నీయముగా ఉన్నాయి వీరి కావ్యములు అందలి రచనలు మహాపండితులే అభినందించారు వీరు మా కంటే ముందుగానే స్వాతంత్ర్య సమారా యుద్ధములో పాలు పంచుకొని పెద్దల మన్ననలు పొందారు. ఈయన మంచి కవి వక్త వీరి స్వరాజ్య రధము 1937లో పిఠాపురం రాజావారికి పోటీగా పళ్ళం రాజు గారు కాంగ్రెస్ తరపున పోటీ చేసినపుడు మంచి ఆదరణ పొందారు అల్లూరి సత్యనారాయణరాజు,మాగంటి బాపినీడు,కళా వెంకటరావు గార్లు బులుసు సాంబమూర్తి గారు వీరిని బాగా ఆదరించే వారు మద్రాసులో ఆంధ్రరాష్ట్రం గురించి వ్రాసిన బుర్రకథ లోని కొన్ని ఘట్టాలు మేలుకొలుపు ఇంకా పద్యాలు ఉద్రేకాన్ని కలిగించేలా ఉండేవి.చెన్నపురి ఆంధ్ర మహాసభలలో ఎన్నోసార్లు ఆంధ్రరాష్ట్రం గురించి పద్యాలు,మేలుకొలుపు వంటి ఘట్టాలు జన్నాన్ని ఆకర్షించాయి.వీరి భక్తీ రసాన్ని బాగా విన్పించగలిగిన కవి.దేశ భక్తీ గీతాలు,పద్యాలు,ఉపన్యాసాలు కూడా జనరంజకంగా ఉండేవి. అంటరానివారుఎవరో వీరు నిర్ణయించిన వారికి అందరూ కాకపోయినా నిజంగా అందరూ ఒప్పుకుంటారా,సంఘ విద్రోహులే అంటరాని వారు అనే నిజం ఈ గ్రంధం బహుళ ప్రచారంలోకి తేవడానికి అంతా ప్రత్నించేదము గాక! ఇట్లు పరకాల శేషావతారం రవాణా శాఖామంత్రి,10.01.81 అంటరానివారు ఎవరు? అను గ్రంధమును ముద్రించుటకు ఆర్ధికసహాయమోనర్చి చరిత్ర సృష్టించు కొన్న ఉదార స్వభావుడు శ్రీ A.S.జాన్ గారు ఈ కావ్యము వ్రాసి 30 ఏండ్లు దాటినా ఎందరో ప్రముఖులు దీనిని అచ్చు వేయించాలని అనుకొన్నప్పటికీ వారికి ఈ అవకాశం లభించలేదు.డబ్బు అనేకమంది అనేక విధముల ఖర్చు చేయుచుందురు.పరోపకారమునకు పుణ్య ఫలప్రాప్తికి కీర్తి లోకమున చిరస్తాయిగా ఉండుటకు వినియోగింపబడిన ద్రవ్యము సత్పాత్రదానమగును కృతి చిరస్తాయిగా నుండునది. చరిత్ర కెక్కిన ఉత్తములే ఈ నాటికి లోకమున కీర్తింపబడుచున్నారు.అందును ఈ అంటరానివారు ఎవరు?అను గ్రంధము చారిత్రక,రాజకీయ,సాంఘిక ప్రాధాన్యతగల విశిష్ట కావ్యమని పెద్దల మన్ననలందినది.అట్టి ఉత్తమ కావ్యమును ముద్రించుటకు ముందుకు వచ్చి చిరకాలమునుండి మరుగున ఉన్న దీనిని లోకానికి అందించి శ్రీ A.S.జాన్ గారు చిరకీర్తినార్జించుకొన్నారు.!కింజన్మ కీర్తింవినా!లోకమున పేరు నిల్పుకోలేని జన్మ ఎందుకు అంటారు.భర్తృహరి. మహాకవి కృతి వ్రాసిన కవి చిరంజీవియే వారిని పోషించిన కృతులు ముద్రించిన త్యాగధనులు కూడా చిరంజీవులే.ఉపాధ్యాయ వృత్తినుండి సమితి అధ్యక్షులుగా ప్రజలచే ఎన్నుకోబడికాంగ్రెస్ నాయకుల మన్ననలందుటేగాక భారత ప్రధాని శ్రీమతి ఇందిరాగాంధీకి కృతి సమర్పింపబడిన ఈ గ్రంధ ముద్రణకు తోడ్పడి దేశానికి ఉత్తమ కావ్యమును అందించి కృతార్ధులైనారు.శ్రీ A.S.జాన్ గారు...రచయిత నంబూరి దుర్వాస మహర్షి తామ్రపత్ర గ్రహీత .ఏలూరు 02.10.1974 ఈ పవిత్ర గాంధీజయంతి రోజున పూజ్యులు మిత్రులు శ్రీ వడ్డూరి అచ్యుతరామకవి గారు వ్రాసిన అంటరానివారు ఎవరు? అను పుస్తకము వ్రాతప్రతి చదివాను చాలా ఆనందించాను.1942 నుండి రాజకీయ రంగములోను,కవితా రంగములోను నాకు బాగా సన్నిహితులు.జాతీయకవి.ప్రముఖ స్వాతంత్య్ర సమరయోధుడు.రజితభారతి అను చిన్నకృతి శ్రీమతి ఇందిరాగాంధీకి కృతి ఇచ్చుట,మహా ఘనత వహించిన రాష్ట్రపతి శ్రీ V.V.గిరి గారు హైదరాబాదు రాజభవనంలో స్వయంగా కృతి స్వీకరించి సత్కరించుట.మా స్వాతంత్య్ర సమరయోదులందరికి గౌరవమే గాక గర్వకారణము.

 
          గుండుదెబ్బల కేడురేగి గుండెలిచ్చి
           రక్షక భాటాలి లాఠీల రాటుదేలి
           భారతమాత విముక్తికి పాటుబడిన
           తొల్లిటి స్వతంత్ర్య వీరయోధులము మేము

అని వ్రాసిన సీసపద్యము లోని ఈ గీతము మరువరానిది నిత్యసత్యమైనది. 1942 వ సంవత్సరము ఆగస్టు క్విట్ఇండియా తీర్మానం అనుసరించి బాపట్ల తాలూకా చీరాల వాస్తవ్యులు శ్రీ నాళం రామచంద్రరావు B.A.L.L.Bగారు చేసిన విప్లవ చర్యకు ఆయనను పట్టి ఒప్పగించిన వారికి 1000 రూపాయలు బహుమతి ఆనాటి బ్రిటిష్ ప్రభుత్వం 1942 లో ప్రకటించగా 36 రోజులు తన నివాసంలో రక్షణ ఇచ్చిన విప్లవవీరుడు అచ్యుతరామకవి. ఆ తరువాత 1944 లో ఆయనను పట్టుకున్నారు సరే.కాని రామచంద్రరావు గారికి Hourber ఇవ్వడానికి ఎవరూ ముందుకు రాలేదు.మిత్రుడు అచ్యుతరామారావు గారు ధైర్యంగా యిచ్చి ధైర్యాన్ని ప్రదర్శించారు. యీ కావ్యము పుట్టుకచేత అంటరానివారు ఎవరూ లేరని నడవడికవల్ల అంటరానివారు అవుతారని అవినీతిపరులే అంతరానివారని శాస్త్రమునందలి ఉదాహరణలతో తేలికభాషలో ఋజువు చేసిన మహామనీషి.రాజకీయ కవితా రంగాలలో రెండింటా కాకలుదీరిన స్వార్దమెరుగని వీరయోధుడు. పోలవరం తాలూకాలో బందకట్టు అను రిజర్వాయరు తగాయిదాగురించి కోయ రైతుల తరపున లక్కవరం జమీందారులు దిప్పకాయలపాడు భూస్వాములతో పోరాడి సత్యాగ్రహాలు చేసి,నిరాహారదీక్షలు సాగించి విజం సాధించి గిరిజనుల గిరిజనేతరుల వేలాది ఎకరాల భూమికి నీటి హక్కు కలిగించిన అన్నదాత శ్రీ వడ్డూరి అచ్యుతం గారు. నిరాహారదీక్ష నోటీసుతో పూజ్య బాపూజీ అప్పటి చీఫ్ మినిస్టర్ ప్రకాశం పంతులు గారికి లేఖ వ్రాశారు. కొవ్వూరు R.D.O.శ్రీ గంగాళం భీమశంకరం గారు ప్రభుత్వం తరపున కొప్పుల సత్యనారాయణ వారి సమస్యలంగీకరించుట గౌ!శ్రీ కళా వెంకటరావు గారు అప్పటి రెవిన్యూమంత్రి G O M S 1902\8\8\1947 ఉత్తర్వుల ద్వారా గిరిజనులకు బందకట్టు నీటిహక్కు కల్పించుట నాకు మరపురాని వీరగాధ. ఒక మహాకవి స్వార్ధరహితుడైన సేవానిరతుడైన స్వాతంత్ర్యమరయోధుడుగా నాకు ప్రాణ స్నేహితునిగా కలిగియున్నందుకు నేనెంతో సంతసించుచున్నాను. వీరిచే రచింపబడిన శ్రీ వేంకటేశ్వర భక్తిమాల నెన్నడు మరువలేను శ్రీ అల్లూరి బాపినీడు గారు ఆ శతకం గురించి నేను చెప్పి చదవగా తిరుపతి శ్రీ వేంకటేశ్వరుని ఎదుట చదవాలయ్యా నాతొ రండి అని తిరుపతి వేంకటేశ్వరుని ముందర చదివించి ఆనందింప జేశారు. ఇవన్నీ మరువలేను. భక్తకవి స్వార్ధరహిత సేవాపరాయణుడు మిత్రుడు శ్రీ అచ్యుతరామకవి చిరకాలము వర్ధిల్లి జాతిసేవ, భక్తిప్రచారం చేయాలని పరమ్మత్ముని ప్రార్ధించు చున్నాను. నంబూరి దుర్వాస మహర్షి. ఎవరు అంటరానివారు? ఈ ప్రశ్న కొంచెము ఆలోచించే శక్తి ఉన్న ప్రతివారిలోను ఉద్భవిస్తుంది. నిజమే? భగవంతుని సృష్టిలో సర్వ మానవకోటి సమానమే! అయినప్పుడు జాతులేందుకు వచ్చాయి?సృష్ట్యాదిలో ఈ జాతులు ఉన్నవా? పరిశోధనలపై లేవు అన్న జవాబు వస్తుంది. అందుకే జన్మనా జాయతే సూద్రః అన్నారు. పుట్టుకచే అందరూ సమానమే! గీతను బోధసేయునెడ కృష్ణుడు క్రీడికి చెప్పలేదె? నా చేతనే నాల్గు జాతులు విభాజిమ్పబదేన్ గుణకర్మ విభేదముచేత,అట్టు యెడ భాతిగా తెల్పరయ్య పంచమ జీటి యదెట్లు వచ్చెనో?భగవత్ సృష్టిలో మానవులంతా ఒకటే అయినా వారి వారి వృత్తులవల్ల నాల్గు జాతులుగా విభజింప బడినట్లు గీతలో గీతాచార్యులు వారే చెప్పారు. బాగానే ఉంది మరి మాదిగ,మాల అయి జాతులు ఎట్లా ఉద్భవించాయి.ఇదొక ప్రశ్న దీనికి నేను ఎక్కడో విన్న ఒక కధ గుర్తుకు వస్తుంది.ద్వాపరయుగం అంతమై కలియుగం ప్రవేశించు కాలంలో ఎక్కువగా చిన్న చిన్న రాజ్యాలుగాను,ఆ రాజ్యాల లోనే ఎక్కువభాగం పల్లెలు గాను ఉండేవి.జనపదానికంటే అడవులే ఎక్కువగా ఉంటూ ఎక్కువ వ్యవసాయం, వేట మొదలగు వృత్తులతోనే కాలం గడుపుతూ ఉండేవారు ఆరోజులలో ఒక కొండ అనగా చిన్న గుట్ట మీద ఒక పల్లె ఉండేది. ఆ పల్లెలో ప్రజలంతా కలసి మెలసి కాపురాలు చేసుకుంటూ ఉన్నారు. వాళ్ళలో నాలుగైదు కుటుంబాల వారు అప్పటి కులాచారం ప్రకారం నడవకుండా ఏదో తప్పు చేసారు. మిగతా వాళ్ళంతా వాళ్ళను వెలివేసి కొండకిందకు పోయి ఇళ్లు కట్టుకోమని శాసించారు. వాళ్ళు కూడా అట్లాగే కొండదిగి ఇళ్లు కట్టుకున్నారు. అట్లా కొంతకాలం జరిగిన తరువాత ఇంకో పల్లెనుంచి యీ కొండమీద నున్న పల్లెను చూచుటకు కొంతమంది వచ్చారు.మాటల సందర్భములో క్రింది ఇళ్లు కట్టుకున్న వారు ఎవరు? అని అడిగారు అందుకు ఈ కొండమీద ఉన్నవాళ్ళు అక్కసుగా వాళ్ళంతా మాదిగువ వాళ్ళు అని చెప్పారు అనగా వాళ్ళకంటే వీళ్ళు దిగువనున్నట్లు చెప్పారు. కాలక్రమీణా అదే మాట !మాదిగువవాళ్ళు!!మాదిగవాళ్ళు!అయ్యారు. తరువాత అందులో కొంతమంది మళ్ళీ విడిపోయారు.వాళ్ళు ఎవరయ్యా అంటే వాళ్ళూ !మాలోవాళ్ళే! అన్నారు అదే మాట మాలోవాళ్లే మాలవాళ్ళు అన్నా మానవుని అంటరాదనటం హాస్యాస్పదం గాదా హాస్యాస్పదమే? అసలు అంటరానివారు ఎవరు? కృతఘ్నులు, మిత్రద్రోహులు, పరదారా ధనాపహారులు మాత్రమే అంటరానివారు.అందుకే !

 
శ్లో! మిత్రద్రోహీ కృతఘ్నశ్చ నృశం సశ్చనరాధమః
   క్రవ్యాదై.క్రిమిభిశ్చా స్తర్ణభుజ్యంతే హతా వ్రుకాః!

   కం! విను మిత్రద్రోహు గృత
   ఘ్నని ఘాతకు మేని మాంస కోశంబులహా
   దినవట క్రవ్యాదములై
   చను కీటక కాక శునక జంబుకము లిలన్!

అనే నానుడి ప్రకారం అట్టివారు మాత్రమే అంటరానివారు మరి మాల,మాదిగలను ఎందుకు అస్పృశ్యులుగా చూస్తున్నారు? వారిలో ఉండే అపరి శుభ్రత వాళ్ళు అచ్చరా వ్యవహారములవల్లే!వాళ్ళను అంటరానివారుగా చూస్తున్నారు. వాళ్ళు కూడా పరిశుభ్ర ముగా ఉన్నవాళ్ళను ఎవరు అంటరాని వారిగా చూడబడుతలేదే! సంఘముకంటే ప్రభుత్వమే వాళ్ళను అంటరానివాళ్ళుగా చేస్తూఉంది.కారణమేమంటే వాళ్లకు ప్రత్యేకముగా వాడలు నిర్మించడం హరిజనవాడ ఊరికి దూరముగానే నిర్మించడం అట్లా కాకుండా గృహములు నిర్మించునపుడు హరిజనులకు హరిజనేతరులకు కలిపి గృహములు ఎందుకు నిర్మించకూడదు ప్రభుత్వం ఆపనిమాత్రం చేయదు. హరిజనులకు ప్రత్యేకంగా ఇళ్లు కట్టి హరిజనవాడ ప్రత్యేకంగానే ఉంచినపుడు ఈ వేరు భావము ప్రజలలో పోయే అవకాశం ఉండదు. అంతా ఒకే వాడలో కలిసి ఉండాలి.ప్రభుత్వము ఇకనైనా కాలనీలలో అందరికీ ఇల్లునిర్మించాలి. ఈ పుస్తకం ముద్రణ చేయించిన శ్రీ A.S.జాన్ గారు స్తవనీయులు,ఇటువంటి గ్రంధప్రచారముల వలననే సంఘులో పేరుకుపోయిన ఈ అమానుశాచారములు నశించుతాయి.శ్రీ జాన్ గారి మానవతా భావం జాతి సమైక్యతా దృష్టితో సాంఘిక దురాచార నిర్మూలనకై అచ్యుత రామకవి గారు వ్రాసిన ఈ కావ్యాన్ని ముద్రించి వెలుగులోకి తెచ్చుట సంతోషం ఈ గ్రంధ రచయిత శ్రీ వడ్డూరి అచ్యుతరామ కవి గారిని గురించి వ్రాయాలంటే అవి ఇంతకన్నా ఎక్కువే అవుతుంది ఒక సారి చదివితే రెండవసారి చూడక్కరలేని పుస్తకాలు వెలువడే ఈ రోజులలో ఈ కవి గారు ఎప్పుడూ చదవదగిన గ్రంధాలు 25 పైగా వ్రాసి పండితుల విమర్శకుల విజ్ఞానవేత్తల మన్ననలందారు.వీరు కవిగారే కాక వృద్ధ జాతీయ నాయకుల కోవకు చెందినా ప్రముఖ స్వాతంత్య్రసమరయోధులు, మా పోలవరం తాలూకాలో వీరు ఎన్నో ప్రజోపకార్యక్రమాలు ప్రభుత్వ దృష్టికి తెచ్చి రైతులకు ముఖ్యంగా గిరిజనులకు ఎంతో మేలు చేశారు.బందకట్టు అనే నీటి పారుదల తగాయిదా జమీందారీ రైతులకు గిరిజనులకు మద్య వున్నా చిరకాలపు తగవు సాధించి గిరిజనులకు పేద రైతులకు వేల ఎకరాల సాగుకు నీరు ఇప్పించిన కార్యకర్త వారు ఇంకా ఇలాంటి ఎన్నో పనులు రైతుల తరపున చేసి రైతులకు ఉపకారం చేశారు. ఈ సాంఘిక దురాచారాన్ని నిర్మూలించడానికి వీరు వ్రాసిన ఈ కావ్యం మంచి ప్రచారంలోకి వచ్చి ప్రజాదరణ పొందగలదనే పెద్దల అభిప్రాయంతో నేను ఏకీభవిస్తున్నాను. శ్రేయోభిలాషి మద్దు చలపతిరావు నిమ్మలగూడెం 05.04.84

కాలాత్మక పరమేశ్వర స్తుతి

   
శా!శ్రీమద్భక్త మనోజ్ఞబంధుమమలం సింధూర వర్ణాంచితం

 సోమర్కాగ్ని మయైక కాంతి వపుషం!శుభ్రద్యుతిం సుందరం
 కామారాతి విరించి మాధవల సత్కాంత్యుజ్వలో ద్భాసితం
 కామక్రోధ మదాది దుర్గుణహరం!కాలస్వరూపం భజే !
 ఓ ప్రత్యక్ష దైవమా!కర్మసాక్షి!జగచ్చక్షూ!

 అమరుల్ మౌనులు మూడుకాలముల సంధ్యావందనల్ సేయుచున్
 శ్రమమున్ బాపగనేక చక్రరధ సంచారుండవై నిత్యమున్
 నిమిషార్ధంబున రెండువేల మరియున్నిన్నూరులౌ యోజనాల్
 గమనంబొప్పగ గర్మ సాక్షీ వనలోక జ్యోతివై వేల్గునీ
 కమరేంద్రార్చిత భక్తీ మ్రొక్కెదను దేవా!సూర్యనారాయణా!

చ. పురుషుడు గాక స్రీయును నపుంసక మూర్తియుగాక మూడునై
  సురనర తిర్యగాడులని చొప్పడ జెప్పగరాక నన్నియై
  సురుచిర కాంతి నన్నిటాను జ్యోతియనన్ వెలిగించి వెల్గుచున్
  ధర సకలంబునైన పరతత్వము బ్రహ్మము నాశ్రయించెదన్!

చ. కనులకు కానవచ్చుచు జగంబుల సృష్టి వినాశ సంస్టితుల్
   బనికొని సేయుచున్ శశి దివాకరుడై దినరాత్రి భేదముల్
   జనులకు గల్గజేయుచు నిజాశ్రితులన్ గృపజూచి బ్రోచునా
   ఘనుని బరాత్పరున్ గొలుతు గాలనియామకు లోకదీపకున్!

మ. దినరాత్రంబుల సూర్య చంద్రులనగా దేదీప్యమానుండవై
     ఘనసృష్టి స్తితి నాశనంబులు కృతఘ్నఘ్నా!ధరన్ జేయుచున్
     కనువిందై కనుపట్టు దేవుడవు లోకైకధ్యుతీ !నిన్ను నే
     వినితింతున్ బరమాత్మ వంచు సకలోర్వీ ధూర్వహా !భాస్కరా !

ఉ . తల్లిని దండ్రినిన్ కడు ముదంబున బ్రార్ధన జేసి సద్గురున్
     ఉల్లమునందు నిల్పి సు మనోజ్వల దివ్య పదార్ద దాత్రి సం
     ఫుల్లసరోజనేత్ర కవి భూషిత గాత్రిని వేడి లక్ష్మి భా
    సిల్లెడు స్త్రీ గణేశ్వరుని చిత్తమునన్ తలపోసి భక్తితోన్ !!

చ . అజగజ వక్త్ర, వాణి ,గురు లార్య మునీంద్ర కవీంద్ర పండిత
     వ్రజముల తల్లిదండ్రులను వ్యాసుని వాల్మికి కాలిదాసులన్
     సుజనుల పొతనామరుల సూరిమయూరిని నన్నయాదులన్
     ద్విజులను తెల్గుతల్లిని నుతించుచు జేసెద దివ్యబొధమున్ !

గీ. పూర్వ కవితల్లజులనెల్ల బూజసేసి
     వర్తమాన కవీంద్రుల వరుస మ్రొక్కి
     ముందు రాబోవు కవులకు ముడుపు గట్టి
     యాంధ్ర వీరుల కిడెద బొధామృతంబు !

భరతమాత స్తుతి

సీ . భూరి సస్యఫల ప్రపూర్ణ సంపూర్ణ సౌ
                      భాగ్య భాగ్యోపేత భారతమాత
     భరతాది సుగుణ సంభరిత పాలిత నిత్య
                     ఫలిత పుణ్య వ్రాత భారతమాత
    హతపాతక వ్రాత నుతలోక సంఘాత
                     బహు విధాఖ్యాత మా భరతమాత
    పూర్వసంచిత భాగ్య భోగ్య సంధాత దు
                    ర్భర దుఃఖనాశ శ్రీ భరతమాత !
తే .గీ . మహిత విష్ణు పదీపూత భరతమాత
            వర మహావీర మాత మా భరతమాత
           భవ్య రత్నప్రసూతి మా భరతమాత.
           మాతలకుమాత భారతమాత తలతు !!
                   తెలుగు తల్లికి వందనం
సీ.కలుములొసంగెడి కనకదుర్గా దేవి
      ఇలవేల్పుగాగల్గు తెలుగుతల్లి!
  పతితపావన తుంగభద్ర గోదావరీ
       యమృత వాహినులొప్పు నమరసీమ !
   అమరావతి యజంతా కళాక్షేత్రంబు
       లలరారు నందనోద్యానవనము !
  సంగీత సాహిత్య సరస కవిత్వ స
         ద్గోష్తినుండెడి మపరమెష్తి నెలవు!
గీ. అతి సుస్వరంబున శృతి గానమొనరించు
   వేదగాయకులొప్పు వేదభూమి
   పాడిపంటలు పుష్పఫల భాగ్యములొసంగి
   కామితార్ధములిచ్చు కల్పతరువు !!
గీ.ఆడితప్పని నిత్య సత్యవ్రతులకు
  అతిధి సేవాభిరతులైన యాస్తికులకు
  పేదసాదల సేవించు పెద్దలకును
  నిలయమౌచును విలసిల్లు తెలుగుతల్లి !
  కెల్లవేళల మ్రొక్కెద నుల్లమందు !!

మాతృభాషాభి వందనము

గీ.సూరిజనలోక సంతొష శుభ్రవేష
  మహిత శబ్దార్ధవేత్తల మంజుఘోష !
  యురుభవాంధుల పాలిట యుదయపూష
  అర్ధబంధుర భాష మా యాంధ్రభాష !!

గీ.అఖిలభాషల దివ్యమౌ నమలభాష
  అభినవామర భాష సంయమ విశేష
  భాషలకునెల్ల సద్భూష పాపశోష
  అర్ధబంధుర భాష మా యాంధ్రభాష !!

గీ.మాన్యకర్మిష్టులకు నెల్ల మాతృభాష
  ధర్మ వీరులు పల్కెడు తల్లి భాష
  దేశభాషల లెస్సయౌ దివ్యభాష
  అట్టి మా యాంధ్రభాషనే నభినుతింతు!!

సీ. కలదానిలోన బీదలకీయ దలపోయు
                       ధర్మసంయుక్త వద్దన్యులార!
           ఒరుల కష్టములకై యోర్వ లేమినిజూపు
                        కరుణాభిరమ్య సంకల్పులార!
            జ్ఞానప్రదీప్తి నజ్ఞానాంధమును బాపి
                       దీనాంధులను బ్రోచు దివ్యులార!
            జన్మభూమి రక్షకై జన్మమర్పింపంగ
                       వెరపెరుంగని మహావీరులార!

తే.గీ.మానధనులార భాషాభిమానులార
    తప్పులెరుంగని యొప్పులకుప్పలార
    నాగరిక మోహమగ్న వినాక పరిస
    రాంధ జనదీపతుల్యులౌ ఆర్యులార !

 ఉ.ఆదరమొప్ప నొక్కపరమార్ధము దెల్పెదమీకు సోదరీ
   సోదరులార ! రండు పరిశుద్ధ మనస్కులరై వినుండు మీ
   ఖేదము బాపు దాని నతిభీకర భూరి భవోగ్ర శ్రుంఖల
   చ్చేధము సేయు దాని బుధసేవ్యమునై తనరారు దానినేన్!

వ. మహశయులారా!

 ఉ.పాలను నీరముంట పరిపాతియె గావున మీరలెల్లరున్
   పాలును నీరమున్ గలియ పాలను గ్రోలెడి రాజహంసలన్
   బోలి రసంబు గ్రోలుచును పోలని నీరసమున్ ద్యజించుచున్
   గ్రోలగడంగుడీ ! మధువు కోవిదులార ! రసాభిమానులై !

సీ.శ్రీ వివేకానంద శ్రీ రామకృష్ణుల
            యధ్యాత్మ తత్వ బోధామృతంబు
  అరవింద రమణ మహర్ష్యాది మహితాత్ము
            లవని వర్షించు జ్ఞానామృతంబు
  గాంధీ తిలక్ దేశబంధులొసంగిన
            యకలంక దేశసేవామృతంబు
  శ్రీ హరనాధుడు శ్రీ సాయిబాబాల
            ధ్యానగాన ప్రబోధామృతంబు !

 గీ.ఇంకిపోసాగె జగతిలో నీర్ష్యప్రబలి
   ప్రేమనసియించి స్వార్ధంబు పెచ్చుపెరిగి
   శాస్త్రవివిజ్ఞానమున నణుశక్తి ప్రబలి
   ప్రకృతి మానవఘర్షణ ప్రబలిపోయె !!

మహాశయులారా !

పరమేశ్వరునిచే సృజింపబడిన మానవులెల్లరొక్కతటే యని, దేవుడొక్కడేయనియు ఎవరు ఏ పేరున ఏ భాషలో పిలచినా ఒకనికే చెందునని ఎందరో మహానుభావులు బోధించినను మనలో మతబేధములు ,జాతిబేధములు,కులబేధములు, అంటరాని భావములు పెరుగుచున్నవే గాని తగ్గుటలేదు.

శ్లో.అత్యంత మలినోదేహః దేహీచా త్యంత నిర్మలః
   ఉభయోదంతరం జ్ఞాత్వాసశ్యశౌచం విధీయతే!!

ఈ శరీరము మలిన భూయిష్టమైనదే గదా! ఈ శరీరమును నడిపించు దేహి అనగా జీవాత్మ ఎల్లప్పుడు పవిత్రమైనదేగదా! దేహి దేహాల వివరము నిజస్టితి గ్రహించిన దేనికి శుచిత్వము? దేనికి అశుచిత్వము నిర్ణయింపవలయును ?

దేశమున "అంటరానివారు" అనువారెవరని నిర్ణయించి పుట్టుకచే,జాతిచే,కులముచే అంటరానివారెవరునూ లేరని గుణము,నడతచేతనే అంటరానివారుగా భావించవలెనని వెల్లడించుటకే యీ గ్రంధమఉద్దేశింపబడినదిగా పరమాత్మ విశదీకరించుగాక!

   
  జాతులనెల్ల నొక్కటని చాటుటకేగద వెంకటేశ యీ
  నాతిని బీబిదేవిని జనంబులు మెచ్చ గ్రహించినాడ వీ
  నీతి గ్రహింపలేక యవనిన్ తగవాడుచునున్నవారలీ
  భూతల ముద్దరింపవె ప్రభూ!వసుధైక కుటుంబ భర్తవై !
 
  శ్రీ మద్వేంకటశైల
  స్వామికి గణనాధునకు,శారదకు.గురు
  స్వామికి, తలిదండ్రులకును
  గామితము లొసంగ మొక్కి గావింతు కృతిన్
 
  శ్రీకరంబు వేదసిద్దాంతయుతమైన
  భరతఖండమందు ప్రజలలోన
  అంటరానివారలనువారు గలరంట
  యెవరో?వారి నిర్ణయింపవలయు.

శ్రీ మంతము సకల సౌభాగ్య సంపన్నము వేదభూమి యనబడు నీ భారతదేశములో “అంటరానివారు “ అస్ప్రుశ్యు లు మానవజాతికి చెందినా వారిలోనే కొందరున్నారట . ఆ అంటరానివారెవరు ? అట్టి వారిని నిర్ణయింప వలసిన సమయము ఇప్పుడాసన్నమైనది .

వేదములు అపౌరుషేయములు అనగా ఏ పురుషునిచేత అనగా ఏ మానవులచేత చెప్పబడినవి కావు అట్టి వేదశాస్త్ర పురాణేతిహాసాలసములు ఆధారముగాగల సిద్ధాంతముల చేతనే పూర్వ ప్రముఖుల అభిప్రాయములతోడీరణతో నే యీ అంటరానివారెవరో నిర్ణయించెదము గాక .

 
గీ. అవనిన్స్ప్రుశ్యు లని మానవాళి లోన
   కొంతమందిని ముట్టరు వింతగాదే !
   మనుజులందరు నొకటని మనువు ,మునులు
   వేద శాస్త్రాలు చెప్పగా వినగాలేదే !

తమవలనే జన్మించి జీవించు మానవులను కొంతమంది ముట్టరాడందురు గదా ! ఆశ్చర్యమే అయితే తోటిమానవులకు ద్రోహము చేసి మానవ సాంప్రదాయ ములకు విరుద్ధముగా ధర్మ వ్యతిరేకముగా నడచచు ప్రజాకంట కులైనవారిని వారెంర వారైనాను పుట్టుక ఎట్టిదైనను అట్టి నీచకర్ములను వేలివేయుట సహజమే ధర్మసమ్మతమే కాని పుట్టుకచేతనే అంటరానివారని ఎవరినైనా నిర్ణయించుట ఎట్టి న్యాయము ? పుట్టుకచేత అందరు ఒకటే . స్మ్రుతి నిర్మాత యైన మనువు అట్లే నిర్ణయించి యున్నాడు .

శ్లో.ఎకవర్ణ మిదం పూర్వం ! విశ్వ మాసీ ద్యుధి స్టిర !
   కర్మ క్రియావిశేషేణ చాతుర్వర్ణ్యం ప్రతిష్టితమ్ !!

వ . ధర్మరాజా ! సృష్టాదిలో ఈ ప్రపంచమున ఒకే మానవ జాతి యుండెను కాలాంతరమున ఆయా మానవులోనర్చు వృత్తి ,ఉపాధి,కర్మ ధర్మాదుల వలన కర్మ క్రియా విశేషముల చేత నాలుగు వర్ణము లేర్పడినవి సుమా ! అని భీష్ముడు ధర్మ రాజునకు చెప్పెను .

ఆ.వె. జన్మచేత సకల జనులినోక్కటే
     వర్ణమనుచు కర్మవలన గలిగె
    అన్నివిధములైన యా కర్మలన్నియు
    జీవయాత్ర కొఱకు జేయవలసె .
ఆ.వె.పాంచ భౌతిక ములు ప్రజల దేహంబులు
    తెలియ నందరొకటే దేహసృష్టి
    గుణము,నడత,బుద్ధి కోరికలనుబట్టి
    వర్గవిభాజనంబు వసుధగలిగె

దేహనిర్మాణములో మానవులందరూ ఒకటే. యీ దహ్యమానమగు దేహము పంచ్ భూతాత్మకముగదా!ఇక వారి నడవడిక తీరుతెన్నులు గుణగణాదులను బట్టి వర్గ విభజన ఏర్పడినది .

   
  ఆత్మయొక్కటి వేరు లేదందులోన
  నాత్మ దృష్టిని జూచిన నందరొకటే
  సాత్విక రజస్తమోగుణ తత్వముల ను
  పాధి భేదములుండును ప్రజలలోన

సర్వ జీవులలో ఉండే ఆత్మస్వరూపమొకటే. అలాగున ఆత్మదృష్టితో చూచినచో అందరు నొకటియేగదా! ఇక బ్రతుకు దెరువుల తేడాలను బట్టి కొంత వ్యత్యాసముండును. అది సహజమే సాత్విక గుణము,రజోగుణము,తామసగుణము,వాటిలో మరల నోకదానితో నొకటి మిశ్రమ మైనప్పుడు కలుగు లక్షణములను బట్టి ఆయామానవుల నడవడిక మారుచుండును. నడతను బట్టి న్యూనతాదికృతలు సంఘములో చూపబడు చుండుట మానవ నైజము అయినను

    
  అన్ని యవయవంబు లవసరంబగు దేహి
  కవని హెచ్చుతగ్గులనగరాదు
  అట్లె యన్ని జాతులవసరంబగు జనుల్
  సంఘ జీవులగుట జగతియందు

శరీరములో అవయవములున్నవి. వానిలో వాటి ఉపయోగముల ననుసరించి కొన్ని కొన్ని తేడాలుగా ఎవరికి వారే చూచుట కాదనలేము కాళ్ళు చేతులు శిరస్సు పాదములు అట్లే అవయవములు వేరు వేరు ఉపయోగములుండును. వానిని బట్టి మార్దవ కాఠీన్యములు న్యూనతాధిక్యతా భావములు ఎవరికివారు నైసర్గికము గానే పరిశీలించెదరు. అయితే అన్నియు దేహమునకవసరమే ఏది లేకపోయినా శరీర యాత్రకు ప్రతిబంధకమే.దేనికి అపచారము కలిగినను బాధాకరమే కాని భావనలో తేడాలున్నవి . కాళ్ళకు చేతులకు తేడాగా ఎవరికి వారే చూచెదరు ఎదమచేతికి కుడి చేతిని తేడాగా చూచెదరు గదా ! శరీర భావములో ఒకటేగదా ! అంతమాత్రమున అవి వేరగునా !అట్లే వృత్తి బేధములచే వేరు వేరుగా ప్రవర్తించు వారు సంఘపరముగా అందరొక్కటే కాగలరు. అంత మాత్రము చేతనే దేహమంతయు ఒకటి కాదనరాదు గదా!

పెద్దలైనవారు,శాస్త్రములు ఏమిచెప్పినవనగా

ఆ.వె. కులముగాదు వాని గుణము ప్రధానంబు
       గుణవిహీనుడెట్టి కులజుడైన
      కులము లేనివాడే గుణవంతుడేవడైన
      ఉత్తమ ద్విజుండే ఉర్వియందు .

అనగా ఎవరిని ఎవరని నిర్ణయించుటకైనను వానికులము పుట్ట్టిన తీరు ప్రధానము గాదు. వాని గుణము,నడత ప్రయత్నము ప్రధానములని చెప్పినవారు దీనినే

 అపవిత్రుడైన వ్యాసవసిష్టుల
 జన్మ విధము లెరిగి చర్చ సేయ
 పుట్టుతీరుబట్టి చెట్ట తలంచుట
 తగదటంచు తెలియదగును ధరణి .

 శ్లో.గణికాగర్భ సంభూతో వశిష్టశ్చమహాముని
    తపసా బ్రాహ్మణో జూతస్సంస్కారాస్తత్ర కారణమ్!

సూర్యుడు,వరుణుడు కలసి వెళ్ళుచుండగా మార్గ మధ్యమున ఊర్వశి కనబడెను.ఆమె అందమును చూడగా వారి మనస్సులు చలించి రేతఃపతన మయ్యెను. వారి వీర్యమును ఊర్వశి ఒక కుండలో భద్రపరచెను. ఆ కుంభము నుండి వశిష్టుడు ,అగస్త్యుడు జన్మించిరి. వారు తపస్సు చేసి మహా మహులిరి. అందుచేత జన్మ విధానము మానవుల హెచ్చుతగ్గులకు కారణము కాదు. కాలేదు కారాదు.

ఆ. వేశ్యసుతుడు వశిష్టుడు విప్రుడయ్యె
   తపముచే సంస్కృతియే యెందు ధర్మమగును
   జాలరికి వ్యాసుడును,బరాశరుడు మాలె
   తకు సుతులై ద్విజులైరి లెక్కకిది మించె
   అని పెద్దలని యున్నారు .అందుచేతనే
   కులముచేత నెవని గొప్ప కొద్దియటంచు
   పలుకరాదటంచు ప్రాజ్ఞులండ్రు
   పంకమందు బుట్టు పద్మము నీచమా
   పుట్టుచోటు పలుక బూతులనరె .

కులమును బట్టి గాని,జన్మ స్థలమును విధానమును బట్టి గాని హెచ్చుతగ్గులు పలుకరాదు గదా! బురదలో పుట్టిన పద్మమెంతగా నాదరింప బడుచున్నది . దేవుని శిరమునే యలంకరించు చున్నది గదా! అంతేకాదు . మనము పుట్టిన చోటు నోట పులరాదు గదా ! పలికిన బూతు మాట అందురు గదా ! చూచిన వెగటు కలుగును గదా ! కావున ఎవరిని గాని వారి వారి గుణకర్మ విశేషములచే మంచి చెడ్డలు నిర్ణయించ వలెను. కాని జన్మచేత కాదు. కారాదు. ఇది అందరికీ తెలిసిన విషయమే! అయినను కొందరిని పుట్టుక చేతనే అంటరాని వారని వెలిగా చూచు చున్నారు గదా ! అది శాస్త్ర సమ్మతము గాదు. వెలివేయ దగినవారు వేరుగా నున్నారు. వారిని గురించి తెలుసుకొనెదముగాక నిర్ణయించుటకు ప్రయత్నింతము గాక .

 మాల మాదిగాలనుచును , మానవులలో
 జాతిభేదాలలో జగడాలు సాగుచుండు
 అన్ని యవయవముల్ గల్గ మన్న గల్గు
 నన్ని జాతులు నున్ననే యన్నమమరు .

మాలలని ,మాదిగలని ,చండాలురని కొన్ని జాతుల వారిని అంటరానివారని దూరముగా నుంచు చున్నారు. అది సమర్ధనీయము గాదు. శరీరములో కొన్ని అవయవములున్నవి. వాటిలో తేడాలున్నవి. కొన్నిటిని ఎల్లవేళలా ముట్ట రాదు చూడ రాదు. కాని అవి శరీరమునకు అవసరమే. అవన్నియు కలిసియే శరీరము. ఏ అవయము లోపించినను శరీర యాత్ర జరుగదు . కొన్ని గౌరవముగా చూడబడి మనోహరముగా అలంకరింప బడును. కొన్ని సామాన్యముగా చూడబడును. మరికొన్ని నీచముగా పరిగణింప బడును. యీ తేడా ఇతరుల విషయములో కాదు. తనకు తానే అట్లు చూచుచుందురు. అర చేయిని,అరికాలును ఒకలాగ చూడడు మానవుడు అలాగే ముఖమును, అధోముఖమును ఒక భావముతో చూడడు. ఎడమ చేతిని,కుడి చేతిని తేడాగానే చూస్తాడు. కానీ అంతా తన శరీరములోని భాగములే అన్ని తనకు అవసరమే ఏది లేకపోయినా సాగదు. దేనికి బాధకలిగినను తను అనుభవించ గలడు. ఎందు చేత తేడాగా చూచు చున్నాడు ? నైసర్గికము స్వభావమన్న మాట అది ఎవరు చెప్పినది, చేయమని ఆజ్ఞాపించినది కాదు . అలాగునే మానవజాతి సృష్టిలో ఒకటే! అమ్మకడుపునుండి పుట్టినప్పుడు ఒకటే ! అంతా సమానమే . బుద్ధి,నడవడిక ,కృషి ఫలితముగా సంఘములో పరిగణన లభించు చున్నది. ఏ మానవుడు మరొక మానవుని నీవీ విధముగా నడచుకోనుమని గానీ నీవిలాగే బ్రతుకుమని గాని నీవు శుచిగా ఉండవద్దు, నీవు చదువుకోవద్దు అని యిలా ఎవరూ ఎవరినీ శాసించ లేదు.అలా శాసించే అధికారము ఎవరికీ లేదు. మానవుడు తన ఇస్టానుసారముగా తన జీవయాత్రను కొనసాగించు కొనవచ్చును, చదువ వచ్చు , సంపాదించుకొ వచ్చు . అభివృద్ధి సాధించుకోవచ్చు . మన రాజ్యాంగము, మన ధర్మ శాస్త్రాదులు మానవునకు ఆ స్వాతంత్ర్యమును ఎప్పుడునూ ఇచ్చియున్నవి. అందుచేతనే ఆరవ ఇంద్రియమైన మనస్సు మనకు భగవంతుడిచ్చి , స్వేచ్ఛాధికారాలను ప్రసాదించికర్మలనే కొలబద్దను యెర్పాటు చెసి యున్నరు ఆ మీటరు మన బాగోగులు,వృద్ది క్షయాదులు, ఉత్తమాధమస్తితి గతులు నిర్ణయించు చున్నది దీనిని యెవరు అతిక్రమించలేరు. దేవుడు కూడా దానిని బట్టియె కర్మఫలమని అనుచవించమని చెప్పినట్లు పురాణాలు చెప్పుచున్నవి. దానికితరులు కర్తలు కారు అధికారులు కారు,కాలేరు."కర్మణ్యేవాధికారస్తే" కర్మ మాచరించుటకు నీ కధికారము గలదు. నీ యిచ్చననుసరించి కర్మ చేయవచ్చు ఆ ఫలమును కాదనకయే అనుచభవించవలెను.

శ్లో!.విశ్హేషొస్తి వర్ణానాం !సర్వం బ్రహ్మ మయం జగత్
   బ్రహ్మణాపూర్వ స్రుస్తంహి ! కర్మ భిర్వర్ణ తాంగతం !(భారతం - అనుశాసన పర్వం)

వ.ధర్మరాజా ! ఆయావర్ణ వ్యవస్త యందు పెద్ద విశేషమేమియు లేదు. వీరందరు ఒకే బ్రాహ్మణ జాతిగా మాత్రమే పూర్వమందు బ్రహ్మ చే స్రుస్తించబడిరి వారి వారి నడవడి,గుణములు,కర్మ ప్రవుర్త్తులు కారణముగా వర్ణవ్యవస్త యెర్పడినది.పక్షులు మొదటగ్రుద్లు పెట్టును గదా!తరువాత అవి పొదిగి పిల్లలను చేయును. మొదటి జన్మ గ్రుడ్డు తరువాత జన్మ పక్షి. అందుచేత పక్షులకు ద్విజములనే పేరు వాడబడుచున్నది.

అట్లె

శ్లో.జన్మనా జాయతేషూద్రః-కర్మణా జాయతే ద్విజః
   వేదపాథంతు విప్రాణాం -బ్రహ్మజ్నానంతు బ్రాహ్మణఃః

పుట్టుకచే అందరూ శూద్రులనబడతారు సత్కర్మ చేయుటచేత ద్విజులగుచున్నారు. వేదపారయణ చేయుటచేతనే విప్రులనబదుచున్నారు . అత్లే బ్రహ్మజ్నానము చేతనే బ్రాహ్మణులనబడు చున్నారు .

  జన్మ చేత సకల జనులిల శూద్రులే
  జ్ణానవిద్యచె ద్విజత్వమబ్బు
  వేదపాథమునను విప్రుందు నాబడు
  బ్రహ్మ విద్యనేర్వ బ్రాహ్మణుండు.

అంతియె గాని బ్రాహ్మణుడు పుట్టఉక చే కాలేడు, కాడు జాతినిర్ణయించుటకు జన్మ ప్రధానము కాదు. బుద్ధభగవానుని ధర్మపధముతో

శ్లో.నజడేహి నగోత్తేన నజాచ్చాఅ హోతి బ్రాహ్మణో
  యహ్మి సచ్చ్మద ధర్మోచ సోసుచీ సౌచ బ్రాహ్మణో!

జదలచేత, జాతి చేత జన్మ చేత బ్రాహ్మణుడు కానేరడు సత్య ధర్మములు తెలిసినవాడు పవిత్రుడగువాడు బ్రాహ్మణుడు. అయితే యేవ్యక్తినీ గాని నీవు అసలైన బ్రాహ్మణుడవు గావు, యతివి గావు సన్యాసివి గావు అని యితరులు అనడానికి వీలు లేదు. యేమో అతడెట్టి వాడో. యెపుట్టలో నేపామున్నదో యెవరికెరుక ?

శ్లో.కాషాయదండ మత్రేణ యతి పూజ్యోన సంశ యః

కాషాయ వస్త్రములు ధరించి దండ కమండలాలతో వచ్చిన యతీశ్వరుని మనము గౌరవించ వలెను,పూజించ వలెను. అతనిలో లోపాలున్నాయని గాని,ఉంటాయని గాని మనము అగౌరవముగా చూడరాదు.అలాగే బ్రాహ్మణుని గూడా మనం నిందించ రాదు. అతనిలో ఏమి విశేషమున్నదో మన చూపుల కందక పోవచ్చును.అట్టి లోపాదులెంచి మనము తిరస్కరించుట వలన మనకు పాపం తప్పదు.గ్రామాధికారి యున్నాడు అలాగే ప్రభుత్వ ఉద్యోగి యున్నాడు.అతడెలాటి వాడైనను అతని అధికారాన్ని మనం శంకించి తిరస్కరించ రాదుగదా!గ్రామాధి కారికి పన్ను చెల్లించి రశీదు తీసుకొన వలెను.గాని అతడు జూదరియై సొమ్ము పోగొట్టినచో దానికి ప్రభుత్వము చర్య తీసుకుంటుంది. కాని అతడు జూదరి అని మనమా పన్ను కట్టక తిరస్కరించ రాదుగదా!అలాగే పెద్దలు,యతీశ్వరులు,బ్రాహ్మణులు మొదలగు వారి విషయములో మన కర్తవ్యం మనం నిర్వహించవలెను.వారిలో లోపాలుంటే దానికి భగవంతుడు తగిన శిక్ష విధించ గలడు కాని,మనముకాదు.

శ్లో.యధా జలం ధరాప్రుష్టాత్కనన్నాప్నోతి మానవః
  తధాత్వాం పూజయా నిత్యం మోక్షమాప్నోత్యసంశయః

పైకి కనబడక పోయినను భూమిని త్రవ్వి మానవుడు జలమును పొందుచున్నాడు.ఒకచోట దగ్గరలో లభించును.మరొకనికి ఎక్కువ ప్రయాసపై లభించును.కాని త్రవ్వినచో మాత్రము జలము లభించుట తధ్యము గదా!అలాగుననే ఈశ్వరుడున్నాడని నమ్మికతో ధ్యానించి సేవించి పూజించి భగవానుని పొందవచ్చును.అన్నిటిని అందరిని అనుమానించు వాడు ఏమీ చేయలేడు,దేనిని నమ్మలేడు.ఏదీ పొందలేడు.అసలు అన్ని జీవులలో ఆత్మ రూపియై భాగావానుడున్నాడు.మనమెవరిని చూచినను ఆ శరీరములోని ఆత్మస్వరూపమునే చూడవలెను.అలా చూడగలిగినవాడు ధన్యుడు.వానికి ఈ భేద భావములు లేవు ఉండవు.

శ్లో. సర్వ భూతస్తితం యేమాం భాజత్యే కత్వ మాస్థితః
   సర్వదా వర్తమానోపి సయోగీ మయివర్తతే !

అన్ని భూతములు జీవుల యందు నేనున్నానను జ్ఞానము కలిగి నన్ను భజించు వాడు ఎట్లు ప్రవర్తించినను నాయందున్నవాడే.ఏకలవ్యుడు ద్రోణాచార్యుని బొమ్మను పెట్టుకొని గురువనే భక్తితో కొలుచుచు విద్య నేర్చుకొని అర్జునుని కంటే గూడా గొప్ప విలుకాడైనాడు. కొందరు విగ్రహాన్ని దేవుడనే భావముతో నమ్మి సేవించి కృతార్ధు లైనారు.మరికొందరు ఒకరకమైన వస్తువును,మరొకరు మరొక నమ్మికతో సేవించి తృప్తి చెందుచున్నారు.అలాగే యే వ్యక్తీయైనా తానూ ఒక నమ్మికతో చివరివరకు కృషి చేసినచో సఫలమనోరధుడు కాగలడు జన్మతోనే అందరును గొప్పవారు కాలేరు.వాల్మీకి పుట్టుకచే కిరాతుడు.స్వయంకృషితో మహాఋషియై ఆదికవియైనాడు.నారదుడు సూద్రకులములో పుట్టి దైవభక్తీచే దేవర్షియై,త్రిలోక సంచారియై జగత్పూజ్యుడైనాడు.వారి వారి మనో నిగ్రహమును బట్టి స్వయంకృషి చేత గోప్పవారైనారు అనేకులు.గొప్పకులంలో పుట్టి కూడా నీచక్రుత్యాలు చేసి హీనాతి హీనముగా బ్రతికి అగౌరవముతో జన్మ చాలించిన వారున్నారు.దేనికినీ తన మనస్సే,తన కృషియే ప్రధానము. శ్లో.మనయేవ మనుష్యాణాం కారణం బంధ మోక్షయో:

అన్నారు పెద్దలు.ఎవరికి వారు ఉద్ధరించుకోవాలి గాని ఒకరిని మరొకరుద్ధరించలేరు.దిగజార్చ లేరు.అలాటివి ఒకవేళ జరిగిన అవి నిమిత్తమాత్రములే కాని ప్రధాన కారణములు కావు.

శ్లో.ఉద్ధరేదాత్మనా ఆత్మాన మాత్మాన మనసాదాయేట్
  ఆత్మైనహ్య త్మనో బంధురాత్మైవ రిపురాత్మనః !

ఆత్మానం -తన్ను ,ఆత్మనా-తనచేతనే,ఉద్ధరేత్ -ఉద్ధరించు కొనవలెను ,ఆత్మానం-తనను ,నవసాదయేట్ -అధోగతిపాలు చేసుకోకూడదు.ఆత్మనః-తనకు ,ఆత్మైవ -తనమనస్సే,బంధు:-బంధువు(చుట్టము)ఆత్మైన -తనమనస్సే,రిపుహి -శత్రువు గదా! అనగా తన అభివృద్ధికి తానే కారణము అలాగే పతనానికి తానే కారణము కావున శ్రద్ధ తో తానే తన అభివృద్ధికి ప్రయత్నించుకొని సాధించు కోవలెను.తన మనస్సే తనకు చుట్టము తన మనస్సే తన విరోధి తన మనస్సు వల్లనే తాను బంధితుడగుచున్నాడు.తనమనస్సు చేతనే తనన్ని కర్మ బంధముల నుండి,దుఃఖములనుండి విముక్తి పొందగలుగుచున్నాడు.ఇతరులు తన పతనోద్ధరణములకు కారకులు కారు కాలేరు.అందుచే తనస్థితి కి ఇతరులను నిందించరాదు.అందుచే సంఘములో తానూ గౌరవముగా,ఉత్తముడుగా,ఆదర్శ జీవిగా బ్రతకవలెనన్నను,హీనులుగా బ్రతక వలెనన్ననుకీర్తి వకీర్తులు,పాపపున్యాదులు,మంచి చెడ్డలు తాత్కాలిక,దీర్ఘకాలిక ప్రయోజనములు గుర్తించి వ్యవహరించుట ద్వారా ఆ వ్యక్తీ ఇచ్చ,నడవడిక మీదనే ఆధారపడి యున్నది గాని ఇతరులు దానికి కారణం కాదు.అందుచేత ఎవరో తనకేదో చేసారని కాని,ఎదోచేసేదరనిగాని,చేయలేదని గాని తన దుస్తితికి ఎవరో కారణమని గాని భావించుట,బాధపడుట,నెపము వేయుట చెల్లదగిన విషయములు కావు.కొన్నిటికి కొందరు నిమిత్తమాత్రులు కావచ్చు.తాము గోప్పవారగుటకు ఆత్మౌన్నత్యం పొందుటకు జన్మ,వర్ణ,వర్గ,లింగ మతభేదములు అడ్డురావు.స్వయంకృషి వలన ఎవరైనా గొప్పవారు కావచ్చును.నారదుడు స్వయంకృషితో దేవర్షి కాగలిగెను.భ్రుగు,వశిష్ట అగస్త్యాదులు బ్రహ్మర్షులైనారు. జనకుడు ,విశ్వామిత్రుడు,రాజర్షులైనారు.వైశ్యుడైన తులాధారుడు పరమర్షి కాగలిగెను. శూద్రజాతికి చెందిన సూతులవారు మహర్షి యై మహా పురాణికులై సమస్త శాస్త్ర పురాణాదులు లోకులకు బోధించెను.స్త్రీలలో మైత్రేయి ,సులభ, శాగార్గి ,శాండిల్య,తపశ్విని,విశ్వవర,కాత్యాయని,చూడాల,మదాలస మున్నగువారు ఆత్మను మధించి జ్ఞానామృ తము తామనుభవించి ఇతరుల కొసంగి అజరామరులై అప్పుడు,ఇప్పుడు,ఎప్పుడు కొనియాడదగిన స్థానాలనుపొంది చిరకీర్తిని సంపాదించుకున్నారు. కులవృత్తి చేసుకునుచునే ధర్మ వ్యాధుడు అనే పంచముడు మహా జ్ఞానియై కౌశికుడనే బ్రాహ్మణునకు జ్ఞానోపదేశం చేసిన కధ భారతములో చదివియే యుందురు.అయినను ఉదాహరణగా పేర్కొండురుగాక.

కౌశికుడను ఒక బ్రాహ్మణుడు తపస్సు చేసుకుందామని అరణ్యాలకు బయలుదేరినాడు అతనికి వ్రుద్దులై ఈ కొడుకు తప్ప మరెవరు దిక్కులేని తల్లిదండ్రులున్నారు.వారు కుమారుని తమ అనంతరం తపస్సుకు వెళ్ళమని చెప్పి బ్రతిమాలుకున్నారు.కౌశికుడు వినలేదు.ఆ ముసలి తల్లిదండ్రులను అలా దిక్కుమాలిన స్థితిలో దిగవిడచి తపస్సునకు వెళ్లి ఒక నిర్జన ప్రదేశంలో ఉరుకు దూరంగా ఒక చెట్టు క్రింద తపస్సు చేయుట ప్రారంభించాడు.రోజూ నిత్యకృత్యాలు తీర్చి మధ్యాహ్నందాకా తపస్సు చేసుకుంటూ మధ్యాహ్న వేళ భిక్షాటనకు గ్రామంలోనికి వెళ్లి "భవతి భిక్షాందేహి "అని ఏవో కొన్ని ఇండ్ల వద్ద అడిగి కర్తల భిక్షతో పొట్టనింపు కుంటూ తపస్సు చేస్తూండేవాడు.ఒకరోజు మధ్యాహ్నం తపస్సు చాలించి భిక్షాటనకై వెళ్ళుటకుద్యమించి యుండగా తాను కూర్చున్న చెట్టుపై నున్న కొంగ రెట్టవేయగా అది ఈ కౌశికుని నెత్తిపై బడెను .అంత మహాకోపముతో కన్నులెర్రజేసి చెట్టుపైనున్న కొంగవైపు చూడగా ఆ కోపాగ్నికి ఆ కొంగ రెక్కలు కొట్టుకొనుచు నేలగూలెను.అంత నాతపస్వి తపము ఫలోన్ముఖము కానున్నదని కొంత సంతోషము కొంత గర్వముతో లేచి భిక్షాటనకై ప్రక్క గ్రామమునకేగెను ఒక బ్రాహ్మణ వాడకేగి "భవతి భిక్షాందేహి"యని ఒక ఇంటి గుమ్మముకడ నిలబడి కేకపెట్టెను ఆ గృహిణి అప్పుడే వచ్చిన తన భర్తకు వలసిన పరిచర్యాదులు యొనర్చి భిక్షగొనివచ్చుటలో కొంత ఆలశ్యమయ్యెను.అంత భిక్షువు తీవ్ర స్వరముతో ఏమమ్మా!మావంటి తపస్వులనింత నిర్లక్ష్యము చేయతగునా?నేను వచ్చి చాల సేపైనది గదా!యని కఠోరముగా పలికెను.అంత నాబ్రాహ్మణి!అయ్యా నాభర్త పరిచర్య సేయుటలో కొంత ఆలష్యమైనది స్రీ లకు పతిసేవ తరువాతనే గదా!వేరొండు పనిసేయుట మీరంత తీవ్రముగా చూచుచున్నారు గాని నేను కొంగను కాదులెండి మీవంటి తపస్వులకు శాంతము అత్యంత ఆవశ్యకము గదా!అనెను.అడవిలో ఎవరును చూడనిచోట జరిగిన ఒకవ్రుత్తాంతమీమెకెట్లు తెలిసేనా!యని కౌశికుడాశ్చర్యపడి అమ్మా!మన్నించుము ఆకలిచే ఆలశ్యమైనందుకు తొందరపడితిని.అది సరేగాని కొంగ సంగతి నీకెట్లు తెలిసెను.అని అడిగెను.తాపసా!నీతో మాట్లాడుటకు నాకు వ్యవధి లేదు అదిగో చూడు మాయూరిచివర ధర్మ వ్యాధుడను చర్మకారుడున్నాడు పోయి నేచేప్పితినని వానినడుగుము.అతడు నీకన్నియు చెప్పగలడనెను.కౌశికుడు మరింత ఆశ్చర్యముతో భోజనాసక్తి వీడి యా ధర్మవ్యాధుని ఇల్లడుగుచు మాదిగపల్లి చేరెను.వికృతము,విలక్షణము అసహ్యముగానున్న ఈ వాడలో వీధి చివరనున్న ఈ ధర్మవ్యాధుని ఇంటికేగి లోపలనున్న యాతనికి కబురంపెను.ధర్మవ్యాధుడు తానూ రావీలులేదని బ్రాహ్మణునే లోనికి రమ్మనెను.కౌశికుడు లోనికేగి తూగుటుయ్యాలలో వృద్ధులైన తలిదండ్రులను పరుండబెట్టి ఊపుచూ సేవచేయుచున్న యా ధర్మవ్యాధుని చూచెను.ధర్మవ్యాధుడు బ్రాహ్మణ కుమారా!తలిదండ్రుల సేవ విడనాడి అడవిలో తపమోనర్చుట నీకుతగదు.వృద్ధులై వేరుదిక్కులేక నీకై పరితపించుచున్న నీతలిదండ్రుల సేవచేయుచు వారి యనంతరము తపమాచరింపుము.నీకుసిద్ధించును కొంగ చచ్చినంత మాత్రాన నీ తపస్సు ఫలించినట్లు తలంపకుము.తలిదండ్రుల తరువాతనే దైవము,భర్త సేవ తరువాతనే స్త్రీకి దైవ సేవ,ఆయమ్మ నాపరిస్ష్టితి నీవు చూచి తెలిసికొనగాలవనియే నాకడకు పంపినది.నేను తపస్సేరుగను దానధర్మములు చేయలేదు నాతలిదండ్రుల సేవ తప్ప నాకితరము తెలియదు.నా వృత్తి ధర్మము ననుసరించి చర్మకారుడనై చెప్పులుకుట్టి యమ్ముకొని జీవించుచున్నాను.నా తలిదండ్రుల యాశీస్సులవే నీ వృత్తాంతము అమ్మ వాక్యములు నాకు తెలిసినవి.నీ తలిదండ్రులు నీ రాకకై ఎదురు చూచుచున్నారు పొమ్ము వారిసేవ చేసి వారి ఆశీస్సులందుము నీ కోరికలు సిద్ధించును అని చెప్పెను.కౌశికుడాశ్చర్యముతో నుక్కిరిబిక్కిరియై త తప్పిదమునకు పశ్చాత్తాపపడి ఇంటికేగి తనకై పరితపించుచున్న తలిదండ్రుల నూరడించి వారి పరిచర్యలొనర్చి వారి అనంతరము తపోవనమునకేగి తపమాచరించి సిద్దించెను.ధర్మవ్యాధుడు చండాలుడైనంత మాత్రాన అతని ఋజువర్తన ఫలించక పోలేదు.కర్మ క్రియాఫలములచే నెవరైనను ఫలమునందుట తప్పదు.పుట్టుక,జాతి ప్రధానము గాదు.నడవడికయే ప్రధానము.అందుచేత ఎక్కడ ఏవిధంగా ఏ జాతిలో పుట్టినను ఔన్నత్యం పొందుటకు,పతితుడగుటకు జాతి,పుట్టుక కారణంకాదు ఆచరణయే.భారత అనుశాశన పర్వమందే

శ్లో.నవిషేషోస్టివర్ణానాం!సర్వం బ్రహ్మమయం జగత్
  బ్రహ్మణా పూర్వ సృష్టంహి కర్మభిర్వర్నతాంగతామ్

ధర్మరాజా!ఆయావర్ణ వ్యవస్థ యందు పెద్ద విశేషమేమియు లేదు.వీరందరూ ఒకే బ్రాహ్మణ జాతిగా మాత్రమే పూర్వమందు బ్రహ్మచే సృస్టించ బడిరి.వారివారి నడవడి,గుణములు,కర్మ ప్రవృత్తులచేతనే వర్ణ వ్యవస్థ ఏర్పడెను.

శ్లో.విస్తృత్వ ధర్మశాష్రేహి తేషాం కర్మ సమీరితమ్
  ఏకస్మిన్నేక వర్నేతు చాతుర్వర్ణం గుణాత్మికమ్

ఈ నాలుగు వర్ణములవారు జన్మచేత,స్వభావము,కర్మములు ధర్మశాస్త్రమునందు ప్రసిద్ధమే.మరల ఒక్కొక్క జాతియందు వారివారి గుణాత్మకము ననుసరించి మరియు నాలుగు వర్ణము లేర్పడినవి.

శ్లో.ప్రవర్తయతి తతోకర్మ పరిపాకక్రమంవిదన్
  ఋజువశ్సుద్ధ వర్ణాభాః క్షమావంతో దయాళువః
సర్వధర్మ నిరతాయేస్సు స్తేద్విజేషుద్విజాయతః

బ్రాహ్మణులే యనబడు బడువారిలోవారివారి కర్మ పరిపాకము ననుసరించి ఒక్కొక్కరు ప్రవర్తించెదరు.మనసా కర్మణా వాచా ఏకరీతిగా ప్రవర్తించి ఋజువర్తనులు,సాత్విక గుణసంపన్నులు,శమదమాదులు దయా దాక్షిన్యాది సద్గుణములు గల వారు బ్రాహ్మణ ధర్మములని చెప్పబడిన వేదాధ్య యనము తపస్వాధ్యాయాది బ్రహ్మ విద్యలయందు ప్రవర్తించు ఉత్తములు బ్రాహ్మణ జాతిలో బ్రాహ్మణులు గా పరిగణింపబడుచున్నారు.

అట్లే నాలుగు వర్ణములవారు ఉందురు.

శ్లో.బ్రాహ్మణః క్షత్రియో వైశ్యో శూద్రో చండాల ఏవచ
  ద్రుడాభ్యాస కరోనిత్యం పునర్జన్మ నవిందతి!

బ్రాహ్మణ, క్షత్రియ,వైశ్య,శూద్ర,చండాలురలో ఎవరైనను దృఢముగా యీ బ్రాహ్మణ విద్యా భ్యాసము నిత్యమూ చేసేదరేని మతము,కులము,వర్ణ,వర్గ వివక్షత లేని అతడు జన్మ రాహిత్యము పొంది ముక్తుడగును.కులము అడ్డురాదు.

శ్లో.శూద్రో బ్రాహ్మణతా మేతి !బ్రాహ్మణా శ్చైతి సూద్రతామ్ !
  క్షత్రియా జ్ఞాత మేవంతు!విద్యా ద్వైశ్యా త్త దైవచ !

బ్రహ్మ విద్యాను స్టానముచే శూద్రుడు బ్రాహ్మణత్వము పొందగలుగుచున్నాడు.అట్టి బ్రహ్మవిద్యానుస్టానము లేమిచే బ్రాహ్మణ కులములో పుట్టినను శూద్రత్వమును పొందుచున్నాడు.ఆలాగున క్షత్రియ వైశ్య కులములలో పుట్టినను ఆవిధముగానే జరుగును. అని మనువు చెప్పెను.

శ్లో .శమో దమస్తపశ్సౌచం క్షాంతిరార్జవ మేవచ
   జ్ఞానం విజ్ఞాన మాస్తిక్యం బ్రాహ్మం కర్మం స్వభావజం !

అంతరింద్రియ నిగ్రహము,బహిరింద్రియ నిగ్రహము,తపస్సు,లోపల బయట శుచి,ఓర్పు,ఋజుమార్గ ప్రవృత్తి,శాస్త్ర జన్యజ్ఞానము,అనుభవ జ్ఞానము,భగవంతుడు కలడను విశ్వాసము,బ్రాహ్మణ సంబంధమగు స్వభావమున బుట్టినది కర్మలై యున్నవి.అంతియే గాని బ్రాహ్మణుని ఇంట బుట్టిన బ్రాహ్మణుడు కాజాలడు. ఎవరి విద్యుక్త ధర్మములు వారాచరించుచు ఆత్మౌన్నత్యము పొందవచ్చును.వృత్తి ధర్మములు జీవనోపాధికి సంబంధించినవి సంఘ జీవితములో ఏ మానవుడు తనకు చేతనైన విధ్యుక్తధర్మము నిర్వహించక పోయినా తానేగాక తనతో పాటు సంఘ జీవనము స్తంభించు ప్రమాదము కల్గించు వాడగును.మానవులు సంఘజీవులు ఒక్కడెంతటి వాడైనను తనకు తానోక్కడుగా జీవించ జాలడు.ఆహార నిద్రాభయ మైధునములు సమస్త ప్రాణికోటికి సామాన్యధర్మము,అవసరము,అలవాటుగానఉన్నవి.పశుపక్ష్యాదులు ప్రక్రుతిలొ తమకు లభ్యమైన సహజమైన ఆహారమును తమకు తాముగా భుజించి యెచటనో నిద్రించి ఆ ౠతుకాలములో రమించి అంతటితో సంబంధం వదులుకొని యధేచ్చగా జీవించును. అయితే కొన్నింటిలో అనగా పక్షులు గూళ్ళు కట్టుకొని భార్యా భర్తలుగా పిల్లలొతో కలిసి జీవించునవైయున్నవి.వాటికి కుటుంబము పరిమితమే.రెక్కలు వచ్చిన పిల్లలతో గూడా సంబంధముడనవసరములేదు.మానవులట్లు కాదు.పరస్పర సహకారంతో సహజీవనం చేయుటకు అలవడినారు. అందుకు బద్ధులైనారు విడిగా ఒంటరిగా జీవించలేరు.