Jump to content

''తెలుగుబాల!'' శతకం

వికీసోర్స్ నుండి

తెలుగుబాల శతకమును"కరుణశ్రీ" జంధ్యాల పాపయ్యశాస్త్రిగారు రచించారు.

తెలుగుదనమువంటి తీయందనము లేదు
తెనుగు కవులవంటి ఘనులు లేరు
తెనుగు తల్లి సాధుజన కల్పవల్లిరా
లలితసుగుణజాల! తెలుగుబాల!! 1

కష్టపెట్టబోకు కన్నతల్లి మనస్సు
నష్టపెట్టబోకు నాన్నపనులు
తల్లిదండ్రులన్న దైవసన్నిభులురా
లలితసుగుణజాల! తెలుగుబాల!! 2

దేశసేవకంటె దేవతార్చన లేదు
స్వార్థపరతకంటె చావులేదు
సానుభూతికంటె స్వర్గంబు లేదురా
లలితసుగుణజాల! తెలుగుబాల!! 3

అందమైన సూక్తి అరుణోదయంబట్లు
బాలమానసముల మేలుకొల్పు
సూక్తిలేని మాట శ్రుతిలేని పాటరా
లలితసుగుణజాల! తెలుగుబాల!! 4

రక్తిలేనియాట రాత్రి నిద్దుర చేటు
భక్తిలేని పూజ పత్రి చేటు
నీతిలేని చదువు జీతాల చేటురా
లలితసుగుణజాల! తెలుగుబాల!! 5

వినయ, మార్జవంబు, వీరత్వ, మనుకంప
దీక్ష, సత్యసూక్తి , దేశభక్తి
మండనమ్ములివ్వి మంచి విద్యార్థికి
లలితసుగుణజాల! తెలుగుబాల!! 6

మదము, దొంగతనము, మంకుబుద్ధి, అసూయ
విసుగు, పిరికితనము, విరగబాటు
సహజ గుణము లివ్వి చవట విద్యార్థికి
లలితసుగుణజాల! తెలుగుబాల!! 7

మొరటువానితోడ సరసమాడుట రోత
పిరికిపంద వెంట నరుగ రోత
నీతిలేని వాని నేస్తంబురోతరా
లలితసుగుణజాల! తెలుగుబాల!! 8

ఎద్దునెక్కె శివుడు, గ్రద్దనెక్కె విష్ణు
హంసనెక్కె బ్రహ్మ అందముగను
బద్దకంపు మొద్దు బల్లపై నెక్కెరా
లలితసుగుణజాల! తెలుగుబాల!! 9

బడికి నడువలేడు, పాఠాలు వినలేడు
చిన్న పద్యమప్ప జెప్పలేడు
రాజురాజు బిడ్డరా నేటి విద్యార్థి
లలితసుగుణజాల! తెలుగుబాల!! 10

పరమ సుందరంబు ఫలములు, సంసార
విషమహీజమునకు వెలయు రెండు
సాధుసంగమంబు, సత్కావ్యపఠనంబు
లలితసుగుణజాల! తెలుగుబాల!! 11

అతిథిజనుల వీడి అభ్యాగతుల వీడి
దేవతలకు నిడక తినెడివాని
చెప్పనగు ధరిత్ర జీవన్మృతుం డని
లలితసుగుణజాల! తెలుగుబాల!! 12

జనులకొరకు ధర్మశాలలు గట్టించి
బీదసాద నెంతొ యాదరించి
పేరుగన్న కర్మవీరుడే మృతజీవి
లలితసుగుణజాల! తెలుగుబాల!! 13

హంసలందు బకము హాస్యాస్పదంబగు
మణుల గాజుపూస గణుతి గనదు
చదువురాని మొద్దు సభల రాణింపదు
లలితసుగుణజాల! తెలుగుబాల!! 14

జవ్వనంబు గలిగి, సౌందర్యమును గల్లి,
కలిమి గలిగి, విద్య గనని జనులు
గంధరహిత కింశుక ప్రసూనంబులు
లలితసుగుణజాల! తెలుగుబాల!! 15

బ్రతికినన్నినాళ్ళు ఫలము లిచ్చుట గాదు
చచ్చి కూడ చీల్చి యిచ్చు తనువు
త్యాగభావమునకు తరువులే గురువులు
లలితసుగుణజాల! తెలుగుబాల!! 16

జూలు చుట్టుకొన్న వాల మల్లార్పిన
కొండకొమ్ము మీద కూరుచున్న
కరుల గుండె లదర గర్జించునా నక్క
లలితసుగుణజాల! తెలుగుబాల!! 17

తగిలినంత మేర దహియించుకొని పోవు
చెడ్డవాని చెలిమి చిచ్చువోలె
మంచి వాని మైత్రి మలయమారుత వీచి
లలితసుగుణజాల! తెలుగుబాల!! 18

అది పయోధి దోషమడుగున మణులిడి
తృణగణమ్ము తల ధరించుటనిన
మణుల విలువ పోదు తృణముల కది రాదు
లలితసుగుణజాల! తెలుగుబాల!! 19

ఫణిని మట్టుబెట్టి బాలు గాపాడిన
ముంగి జంపె నొక్క మూర్ఖురాలు
మందమతులకెపుడు ముందుచూపుండదు
లలితసుగుణజాల! తెలుగుబాల!! 20

సాధు సంగమమున సామాన్యుడును గూడ
మంచి గుణములను గ్రహించుచుండు
పుష్పసౌరభంబు పొందదా దారంబు
లలితసుగుణజాల! తెలుగుబాల!! 21

అడవి గాల్చు వేళ నగ్నికి సాయమై
నట్టి గాలి దీపమార్పి వేయు
బీదపడిన వేళలేదురా స్నేహంబు
లలితసుగుణజాల! తెలుగుబాల!! 22

మధుకరంబు వచ్చి మకరందమును ద్రావు
సరసిజంబు క్రింద తిరుగు కప్ప
కాంచలేరు జడులు కావ్య సౌందర్యంబు
లలితసుగుణజాల! తెలుగుబాల!! 23

విరుల జేరి హరుని శిరసు నెక్కిన చీమ
చందమామతోడ సరసమాడె
ఉత్తమాశ్రయమున నున్నతస్థితి గల్గు
లలితసుగుణజాల! తెలుగుబాల!! 24

నీట కుంజరమును నిలబెట్టు మొసలిని
బైట పిచ్చి కుక్క పరిభవించు
స్థానబలమఖండ శక్తి ప్రదమ్మురా
లలితసుగుణజాల! తెలుగుబాల!! 25

రావణుండు జనకరాట్పుత్రి గొనిపోవ
సింధువునకు గలిగె బంధనమ్ము
ఖలుని తప్పుచెంత గలవారలకు ముప్పు
లలితసుగుణజాల! తెలుగుబాల!! 26

మద్యమునకు భ్రాంతి, మార్తాండునకు కాంతి,
క్షితికి క్షాంతి మందమతికి క్లాంతి,
సజ్జనులకు శాంతి సహజధర్మంబులు
లలితసుగుణజాల! తెలుగుబాల!! 27

కొంపగాలు వేళ, గునపంబు చేబూని
బావి త్రవ్వ నేమి ఫలము గలుగు
ముందుచూపు లేని మూర్ఖుండు చెడిపోవు
లలితసుగుణజాల! తెలుగుబాల!! 28

ప్రాతదైన మాత్ర ప్రతిది సాధువుగాదు
క్రొత్తదనుచు విసరికొట్టరాదు
అరసి మంచిచెడ్డ సరసుండు గ్రహియించు
లలితసుగుణజాల! తెలుగుబాల!! 29

పాలకడలిలోన ప్రభవించు మాత్రాన
హాలహలము మధురమగుట గలదె
కులము ననుసరించి గుణములు రావురా
లలితసుగుణజాల! తెలుగుబాల!! 30

రాజహంస వికచ రాజీవవని చేర
కాకి గూడు, గ్రద్ద కాడు చేరు
ఎట్టి గుణమువారి కట్టి యాశ్రయమబ్బు
లలితసుగుణజాల! తెలుగుబాల!! 31

కోకిలమ్మ చేసికొన్న పుణ్యంబేమి
కాకి చేసుకొన్న కర్మమేమి
మధురభాషణమున మర్యాద ప్రాప్తించు
లలితసుగుణజాల! తెలుగుబాల!! 32

కాకికోకిలమ్మలేక వర్ణమ్ములే
సుంత తెలియదయ్యె నంతరంబు
గుట్టు బైటపడియె గొంతెత్తినంతనే
లలితసుగుణజాల! తెలుగుబాల!! 33

పైడి గద్దెమీద పట్టంబు కట్టిన
సిగ్గులేని కోతి మొగ్గలేసె
అల్పమతికి పదవి హస్యాస్పదంబురా
లలితసుగుణజాల! తెలుగుబాల!! 34

కొలిమినిడిన, సాగగొట్టిన నరికిన
కంచన మ్మొకింత కష్టపడదు
కుందనంబు కుందు గురిగింజతో తూయ
లలితసుగుణజాల! తెలుగుబాల!! 35

మూడు దశలు విత్తమునకు _ దానమ్ము, భో
గమ్ము మరియు నాశనమ్మనంగ
మొదటి రెండు లేమి మూడవ దశ వచ్చు
లలితసుగుణజాల! తెలుగుబాల!! 36

పెట్టెనిండ కూడబెట్టిన సిరులకు
తగిన రక్షణమ్ము త్యాగ గుణము
అలుగు పారి చెరువు జలముల కాపాడు
లలితసుగుణజాల! తెలుగుబాల!! 37

ముందువెనుక గనుము, తొందరపడకుము
ఆపదలకు మౌఢ్యమాస్పదమ్బు
అరసి చేయువాని వరియించు సంపదల్
లలితసుగుణజాల! తెలుగుబాల!! 38

అరుగుకొలది సురభియగును చందనయష్టి
తరుగుకొలది రసము గురియు చెరకు
ఘనులు ప్రకృతి విడరు కష్టాలలో గూడ
లలితసుగుణజాల! తెలుగుబాల!! 39

ఇనుడు వెలుగునిచ్చు ఘనుడు వర్షమునిచ్చు
గాలి వీచు చెట్లు పూలుపూచు
సాధుపుంగవులకు సహజలక్షణమిది
లలితసుగుణజాల! తెలుగుబాల!! 40

చిన్ననాటి చెలిమిచే నారికేళంబు
మధురజలము లొసగు మానవులకు
నరులమేలు ఘనుల మరువరు బ్రతుకెల్ల
లలితసుగుణజాల! తెలుగుబాల!! 41

మదము గురియుచున్న మత్తేభములపైన
సింహశిశువు దుమికి చీల్చివైచు
వరపరాక్రములకు వయసుతో పనిలేదు
లలితసుగుణజాల! తెలుగుబాల!! 42

హస్తిరాజ మెంత హరికిశోరం బెంత
గహనమెంత అగ్ని కణమదెంత
దేహయష్టి కాదు తెజస్సు ముఖ్యంబు
లలితసుగుణజాల! తెలుగుబాల!! 43

వీడు పరులవాడు వాడు నావాడని
అల్పబుద్ధి తలచు నాత్మయందు
సాధుపుంగవులకు జగమే కుటుంబంబు
లలితసుగుణజాల! తెలుగుబాల!! 44

నరుడు మెచ్చెనేని నారాయణుడు మెచ్చు
దీనులందు దేవదేవుడుండు
మానవార్చనంబె మాధవార్చనమురా
లలితసుగుణజాల! తెలుగుబాల!! 45

క్రౌంచపక్షి బాధ గన్న వాల్మీకిలో
కరుణరసము పొంగి పొరలిపోయె
రసము పొంగి పొంగి రామాయణంబయ్యె
లలితసుగుణజాల! తెలుగుబాల!! 46

బాదరాయణుండు భారతమ్మునుజెప్ప
గంటమూని వ్రాసె గజముఖుండు
ఘనతగన్న కవికి గట్టి వ్రాయసకాడు
లలితసుగుణజాల! తెలుగుబాల!! 47

గౌతమీ తరంగణీ తరంగములకు
తెలుగు భంగిమములు తెలిపినాడు
ఆంధ్రకవులకెల్ల అన్నయ్య నన్నయ్య
లలితసుగుణజాల! తెలుగుబాల!! 48

హోమవేది ముందు సోమయాజియెగాని
చేయి దిరిగినట్టి శిలిపి యతడు
తిక్కనార్యు పల్కు తియ్యదేనెలు చిల్కు
లలితసుగుణజాల! తెలుగుబాల!! 49

స్నిగ్ధ కావ్యరసము సీసాలలో నింపి
రసిక శేఖరులకు నొసగినాడు
సిద్ధహస్తుడోయి శ్రీనాథకవిరాజు
లలితసుగుణజాల! తెలుగుబాల!! 50

భాగవతము వ్రాసె బమ్మెర పోతన్న
సహజపాండితీ విశారదుండు
పలుకుపలుకులోన నొలికెరా ముత్యాలు
లలితసుగుణజాల! తెలుగుబాల!! 51

కలము చేతపట్టి కావ్యమ్ము రచింయిచె
హలము చేతబట్టి పొలము దున్నె
కలము హలములందు ఘనుండురా పోతన్న
లలితసుగుణజాల! తెలుగుబాల!! 52

ఖడ్గమూని శతృకంఠాలు ఖండించె
'గంట' మూని వ్రాసె కావ్యములను
తెలుగుసవ్యసాచి మన కృష్ణరాయుడు
లలితసుగుణజాల! తెలుగుబాల!! 53

అష్టదిగ్గజముల నాస్థానమున నిల్పి
రాజ్యమేలె కృష్ణరాయ విభుడు
తుంగభద్ర నాడు పొంగులెత్తినదిరా
లలితసుగుణజాల! తెలుగుబాల!! 54

పల్లె పైరుగాలి పరిరంభణమ్ములు
స్నిగ్ధమధుర వాగ్విజృంభణములు
పాండురంగ విజయు పదగుంభనమ్ము
లలితసుగుణజాల! తెలుగుబాల!! 55

రామలింగడంచు రామకృష్ణుం డంచు
జుట్టు జుట్టు పట్టి కొట్టుకొనిరి
లింగ కృష్ణులందు లేదురా భేదంబు
లలితసుగుణజాల! తెలుగుబాల!! 56

ఐనవారినెల్ల అవహేళనము చేసి
కానివారితోడ కలియరాదు
కాకి, కేకులందు కలిసి కష్టములందె
లలితసుగుణజాల! తెలుగుబాల!! 57

పొంచి, బుజ్జగించి, పొగడి టక్కరిమూక
మంచివారి మోసగించుచుండు
కాకి జున్ను ముక్క కాజేసెరా నక్క
లలితసుగుణజాల! తెలుగుబాల!! 58

సాటివానితోడ జగడమాడగరాదు
తీరువులకు పరుల జేరరాదు
కొంటెకోతి గడ్డకొట్టె పిల్లుల నోట
లలితసుగుణజాల! తెలుగుబాల!! 59

ఆశపోతువాని కానంద మది కల్ల
ఆపదలకు లోభమాకరమ్ము
పసిడి కంకణమ్ము బ్రాహ్మణు వంచించె
లలితసుగుణజాల! తెలుగుబాల!! 60

బావి నీటిలోన ప్రతిబింబమును చూపి
సింహమును శశంబు సంహరించె
తగు నుపాయమున్న తప్పు నపాయంబు
లలితసుగుణజాల! తెలుగుబాల!! 61

రత్నమాల పుట్ట రంధ్రాన పడవైచి
కాకి త్రాచుపాము గర్వ మడచె
పరుల నిట్లు యుక్తిపరులు సాధింతురు
లలితసుగుణజాల! తెలుగుబాల!! 62

మదగజమ్ము వీడి, మనుజుని పోనాడి,
నక్క చచ్చె వింటినారి కొరికి
హాని సంభవించు నతిసంచయేచ్చచే
లలితసుగుణజాల! తెలుగుబాల!! 63

తనకు తగని పిచ్చి పనులకు పోనేల
అడుసు త్రొక్కి కాలు కడుగుటేల
కోతి మేకు పీకి కోల్పోయె ప్రాణాలు
లలితసుగుణజాల! తెలుగుబాల!! 64

కష్టసాధ్యమైన కార్యమ్ము నెరవేర్ప
నైకమత్యమే మహాబలమ్ము
పావురములు వలను పైకెత్తుకొని పోవె
లలితసుగుణజాల! తెలుగుబాల!! 65

'కందుకూరి' 'పానుగంటి' కొమర్రాజు'
'చిలకమర్తి' 'గిడుగు' 'చెళ్ళపిళ్ళ'
తెలుగు దిగ్గజములు 'చిలుకూరి' 'వేదము'
లలితసుగుణజాల! తెలుగుబాల!! 66

కలిమి గలుగ నేస్తకాండ్రు వేలకు వేలు
కలిమి లేక చెలిమికాండ్రు లేరు
లేమివేళ మిత్రులే ప్రాణమిత్రులు
లలితసుగుణజాల! తెలుగుబాల!! 67

భారతం బనంగ పంచమ వేదంబు
దాతయనగ తొమ్మిదవ గజంబు
ధరణి నల్లుడన్న దశమ గ్రహంబురా
లలితసుగుణజాల! తెలుగుబాల!! 68

ఆటలాడబోకు మల్లరి జట్టుతో
వేటలాడ ఓకు వెర్రి ప్రజల
మాటలాడబోకు మర్యాద విడనాడి
లలితసుగుణజాల! తెలుగుబాల!! 69

వెతకి వెతకి వారి వీరి కావ్యాలలో
గతికి గతికి కడుపు కక్కురితికి
అతుకులతుకు కుకవి బ్రతుకేమి బ్రతుకురా
లలితసుగుణజాల! తెలుగుబాల!! 70

కలము పట్టగానె కవిశేఖరుడు గాడు
గద్దె నెక్కగానె పెద్ద గాడు
శాటి గట్టగానె సన్యాసిగాడురా
లలితసుగుణజాల! తెలుగుబాల!! 71

కట్టుకొన్న సతిని నట్టేటిలో ముంచి
కన్నవారి నోట గడ్డకొట్టి
సభలకెక్కు వాడు చచ్చు పెద్దమ్మరా
లలితసుగుణజాల! తెలుగుబాల!! 72

బోసితాత శాంతి, బోసు వీరుని క్రాంతి
త్యాగధనుల శోణిత స్రవంతి
భరతమాత దాస్యబంధాలు బాపెరా
లలితసుగుణజాల! తెలుగుబాల!! 73

నదులయందు గంగ, ననలందు సంపెంగ
సతుల సీత, గ్రంథతతుల గీత,
కవులయందు గొప్ప కాళిదాసుండురా
లలితసుగుణజాల! తెలుగుబాల!! 74

ధనము గలుగుచోట ధర్మంబు కనరాదు
ధర్మమున్న చోట ధనము లేదు
ధనము ధర్మమున్న మనుజుండె ఘనుడురా
లలితసుగుణజాల! తెలుగుబాల!! 75

ధనము గలిగి దానధర్మాలు చేయని
నరుడు ధరనకెంతొ బరువు చేటు
సాగరములు గావు, శైలంబులును గావు
లలితసుగుణజాల! తెలుగుబాల!! 76

ప్రాకి ప్రాకి చీమ బహుయోజనములేగు
ఎగురకున్న గ్రద్ద యెచటికేగు?
సాధనమున కార్యసాఫల్య మొనగూడు
లలితసుగుణజాల! తెలుగుబాల!! 77

మంచిచెడ్డ లేదు, మర్యాద కనరాదు,
దేవులాట కడుపు తిండికొరకు,
పశువు, పురుష పశువు ప్రాణబంధువులుగా
లలితసుగుణజాల! తెలుగుబాల!! 78

విశ్వమందు గలుగు విషరాజములయందు
అతిభయంకరంబు హాలహలము
ఘోరమంతకంటె క్రూరుని చిత్తమ్ము
లలితసుగుణజాల! తెలుగుబాల!! 79

మెదడు పాడుచేయు, మేనెల్ల చెడగొట్టు,
కీర్తి నపహరించు, నార్తి పెంచు,
క్రూరజనుల మైత్రి కుష్ఠురోగమ్మురా
లలితసుగుణజాల! తెలుగుబాల!! 80

తక్షకునకు విషము దంష్ట్రాగ్రమున నుండు
మక్షికమున కుండు మస్తకమున
నీచునకు విషంబు నిలువెల్ల నుండురా
లలితసుగుణజాల! తెలుగుబాల!! 81

సత్ప్రవర్తనంబు, సౌఖ్యంబు, మర్యాద,
మంచివారి పొందు మనకు నిచ్చు
కలుషమతుల పొందు కలహాలు గొనితెచ్చు
లలితసుగుణజాల! తెలుగుబాల!! 82

తరువులకు తుపాను, గిరులకు వజ్రమ్ము
పద్మములకు హిమము భయము గొల్పు
సజ్జనులకు దుష్టసంగంబు భయమురా
లలితసుగుణజాల! తెలుగుబాల!! 83

సమయమెపుడు గడచు సన్మార్గులకు శాస్త్ర
చర్చలందు బుధసమర్చలందు
ఖలుల కాలమేగు కలహాల జూదాల
లలితసుగుణజాల! తెలుగుబాల!! 84

మనసు, మాట, క్రియ సమైక్యమ్ములగు శిష్ట
మానవులకు, దుష్టమానవులకు
తలపు వేరు, భాషితము వేరు, క్రియవేరు
లలితసుగుణజాల! తెలుగుబాల!! 85

మాంద్యమెల్ల దీర్చు, మంచి పేరు వెలార్చు
మనసు కలక దేర్చు, ఘనత కూర్చు
సాధుమైత్రి సకల సౌభాగ్య సంధాత్రి
లలితసుగుణజాల! తెలుగుబాల!! 86

నష్టమధికమైన, కష్టాలు కలిగిన,
సిరి తొలంగి చనిన, మరణమైన,
ధర్మపథ మొకింత తప్ప రుత్తమజనుల్
లలితసుగుణజాల! తెలుగుబాల!! 87

మదముచేత వెలుగు మత్తేభరాజంబు
జవముచేత వెలుగు సైంధవంబు
వినయగుణముచేత విద్యార్థి వెలుగురా
లలితసుగుణజాల! తెలుగుబాల!! 88

అంతరిక్షమునకు అర్కుండు రత్నంబు
భవమునకు ముద్దు బాలకుండు
చదువుకొన్న వాడు సభకు రత్నంబురా
లలితసుగుణజాల! తెలుగుబాల!! 89

ప్రభువు పూజలందు పట్టణమ్మందున
రాజు పూజలందు రాజ్యమందు
చదువుకొన్న వాని జగమెల్ల పూజించు
లలితసుగుణజాల! తెలుగుబాల!! 90

దొరలు దోచలేరు, దొంగలెత్తుకపోరు
భ్రాతృజనము వచ్చి పంచుకోరు
విశ్వవర్ధనంబు విద్యాధనంబురా
లలితసుగుణజాల! తెలుగుబాల!! 91

తల్లివోలె పెంచు, తండ్రి కైవడి గాంచు,
కాంత కరణి మిగుల గారవించు
ఖ్యాతి మించు విద్య కల్పవృక్షంబురా
లలితసుగుణజాల! తెలుగుబాల!! 92

నలున కాగ్రహంబు గలిగిన వెలివేయు
హంస నబ్జవ విహారమునకు
క్షీరనీరభేద శేముషిం జెరచునా
లలితసుగుణజాల! తెలుగుబాల!! 93

పరులకొరకె నదులు ప్రవహించు, గోవులు
పాలుపిండు, చెట్లు పూలుపూచు,
పరహితమ్ముకంటె పరమార్థ మున్నదా
లలితసుగుణజాల! తెలుగుబాల!! 94

కోరబోకు మెపుడు మేరమీరిన కోర్కె
చేరబోకు మెపుడు కౄరజనుల
మీరబోకు పెద్దవారు చెప్పినమాట
లలితసుగుణజాల! తెలుగుబాల!! 95

ప్రార్థనముల, పుణ్యతీర్థంబులందున,
గురులయందు, వైద్య వరులయందు,
భావమెట్టి దట్టి ఫలితంబు ప్రాప్తించు,
లలితసుగుణజాల! తెలుగుబాల!! 96

ఆకసమున మిత్రుడరుదెంచి నంతనే
సరసిలోని నళిని శిరసు నెత్తు
అమలమైన మైత్రి కవరోధములు లేవు
లలితసుగుణజాల! తెలుగుబాల!! 97

సాధుజనుల మానసము నారికేళంబు
పైన మిగులగట్టి, లోన మృదువు
బాలిశుల మనమ్ము బదరీఫలమ్మురా
లలితసుగుణజాల! తెలుగుబాల!! 98

మనసు, మధుకరంబు, మద్యంబు, మత్స్యంబు,
మదము, మర్కటంబు, మారుతంబు
చంచలంబు లివ్వి, సప్తమకారముల్
లలితసుగుణజాల! తెలుగుబాల!! 99

జనని, జన్మభూమి, జనకుండు, జాతీయ
కేతనంబు, జాహ్నవీతటంబు
పరమపావనములు పంచజకారముల్
లలితసుగుణజాల! తెలుగుబాల!! 100