హేమలత/నాల్గవ ప్రకరణము

వికీసోర్స్ నుండి

నాల్గవ ప్రకరణము

మదనసింగు పాలిగ్రామమును విడిచిపోయిన తరువాత హేమలత కొన్ని దినములవఱకు మునుపటివలె నన్నపానాదులపై నిష్టము నిలుపక బెంగఁగొని చిక్కియుండెను. కాని ప్రాఁత బడిన వెనుక యధాస్థితి కామె మరలవచ్చి సుఖముగా నుండినను రాజకుమారుని యందమును మృదు మధుర భాషణంబులును మఱవక యెల్లప్పుడు తలంచుకొనుచుండెను. నారాయణసింగు మదనసింగు తననిమిత్త మెన్నఁడు వర్తమానమంపునో యెన్నఁడు తాము తురుష్క రాజ్యపు సరిహద్దులఁ బాసి చిత్తూరు రాజ్యమున సుఖముగా నుందుమో యని యెదురుచూచుచు నామార్గమున బోవు బాటసారులనెల్లఁ బరీక్షించి యడుగచు దినమొక యేఁడుగ గడుపుచుండెను. మౌలవికిని, నారాయణసింగునకు స్నేహము నానాటి కధికమైనందునఁ బ్రజలు వారిమైత్రికి మిగులనానందించుచుండిరి. నారాయణసింగునకును మనుమరాలిని రహిమాను ఖాను యొక్క దౌర్జన్యములం జూచినకొలది భయ మధిక మగుచుండెను. ఖానుసాహేబునకు హేమలత యందనురాగము క్రమక్రమముగ నభివృద్ధి సెంద రాజకన్య మ్లేచ్ఛనాయకుని హృదయమునం దెల్లప్పుడు నుండసాగెను. బలాత్కారముగ నామెను బట్టి తెప్పించి తన యంతఃపురమున బంధించి సఫలమనోరథుఁ డగుట ఖానునకు సులభమే కాని యందున నేమికీడు మూడునో యనుభీతియు వారికాప్తుడైఁన మౌలవి కాగ్రహము వచ్చు ననుభయముమ వానిని బాధింపు చుండెను. మౌలవి సంపదలు లేక సామాన్య స్థితిలో నున్నను వాని విద్యాసంపదను బట్టియు, సత్ప్రవర్తనమును బట్టియు జనుల కాతని యెడ భయగౌరవములు గలిగియుండినవి. ధనము స్వీకరింపక దీనుల కుచితముగ నౌషధము లిచ్చుటఁ బట్టియు వయోవృద్ధుఁ డగుటం బట్టియు నారాయణసింగునందు జనులకు మిగుల గౌరవము గలదు. వారిరువుర కపకార మొనర్చినవారు ప్రజల కందఱకును విరోధులై యుందురు.

స్వామి కార్యమునం దప్రమత్తుడై నందుఁడు శక్తి వంచన లేక పాటు పడుచు నేవిధమున నైన హేమలతను దన యజమానునకు సమకూర్చవలెనని సకలప్రయత్నములఁ జేయుచు ముందుగ రాధతో స్నేహము చేసెను. ఈ రాధ కిపుడు రమారమి పదునారు సంవత్సరములుండును. దాని తల్లి భర్తను విసర్జించి లేచివచ్చి వ్యభిచార వృత్తి వలన జీవించి రాధ ఎనిమిది సంవత్సరముల వయస్సున్నప్పుడు మృతి నొందెను. అప్పటి నుండియు రాధ బ్రాహ్మణుల యిండ్లఁ బాచి పని జేసి బ్రతుకు చుండెను. అది యిప్పుడు గోవిందశాస్త్రి యను బ్రాహ్మణుని యింట నుండెను. ఆమె యుక్త వయస్కురాలైనవెనుక శాస్త్రి వివాహము చేయఁదలఁచెను. గాని రాధ తనతల్లి వృత్తి యందె ప్రవేశింప నిచ్చ గలదగుటచే శాస్త్రియుఁ దన యుద్యమమును మానుకొనెను. రాధ మిగుల సౌందర్యము గల శూద్రాంగన యగుటచే స్వల్ప కాలమున నామె గ్రామమున నున్న పడుచువాండ్ర కందఱకు బ్రాణ మిత్రురాలై యఱచేతి నిమ్మపండువలె నుండుటయే కాక యొక పర్యాయము ఖాను గారి హృదయమును గూడ నాకర్షించెను. ధనమును నధికారమును గల ఖానుమైత్రి యామె కిష్టమే కాని తనకన్న వస్త్రముల నిచ్చుచున్న హిందువున కాగ్రహము వచ్చునని యామె వెనుక దీయుచుండెను. నందుడు దాసీపుత్రుఁడే కనుక రాధతో సులభముగ స్నేహము జేసి తనస్వామి మనోరధమును దెలియపఱచి కార్యసాధ్యము జేయుమని ప్రార్థించెను. నందునిమాటఁ దీసి వైవలేక రాధ యందున కియ్యకొని బావాజీ మఠమున కనుదినమును బోయి హేమలతతో నేదోవంకఁ బెట్టి మాటలాడుచు నామె పరిచయమును సంపాదించెను. పరిచయ మయినది మెదలు హేమలత కామె పనిపాటలు చేయుచు వినోదకథలను జెప్పి యామెను నవ్వించుచు నుండెను గాని దుస్సహవాస మొనర్చుట కిష్టములేక రాధతోఁ దిన్నగా మన హేమలత మాటలాడ దయ్యెను. ఈ ప్రకారము మదనసింగు పాలి గ్రామమున నున్న కాలముననె రాధ రెండు సారులు హేమలత కొఱకు వచ్చి సింగును జూచి మోహించి యాతనితో మాటలాడఁ బ్రయత్నించిన దయ్యు నతఁడు ప్రత్యుత్తర మొఁసగ కుండుటచే మరలవలసిన దయ్యెను. రాధకు మదనసింగు నందుగల మోహ మతిశయింప దాసిగ నున్నతన యంతరమును రాజ పుత్రుండఁగు నతని యంతరమును నాలోచింపక యెట్లయిననతనిఁ దనవలలో వైచికొన వలయునని యామె యత్నింపుచుండెమ. హేమలతకు సింగునం దనురాగము గలదని యెఱిగి యామెయం దసూయ మనస్సున నిల్పి రహీమాన్ ఖానున కీమెను సమకూర్చునెడలఁ దనకు సవతి, నీమెయుండదని నమ్మి మదససింగునుదాను స్వాధీనపఱుచుకొనవచ్చునని నిశ్చయించెను. అందుకే “నేకక్రియాద్వ్యర్థకరీ” యని యామె ఖానున కపకార మొనర్చు నట్టును దన మనోరథము నీడేర్చుకొని నట్లును గూడ నగునని రాధ హేమలత మనస్సు విఱుచుటకై ప్రయత్నించి యప్పుడప్పుడును ఖాను యొక్క గుణ రూపముల నామెకడ వర్ణించుచుండెను. ఒకనాఁడు ఖాను యొక్క రూపాతి శయమును రాధ వర్ణింప గా శరీరమువడఁక హేమలత భయమంది యాతని ప్రసంగమును దనవద్ద నెన్నడును దేవద్దని యామెను గఠినముగా మంద లించెను. అప్పటినుండియు నీ దురాత్మురాలు ఖాను ప్రసంగములను మానుకొని నందునితో “నిఁక హేమలతపై ఖానున కాశ యుండఁ దగదు ఆమె కితనియందిష్టము లేదు. మదనసింగున కామె ప్రాణములలిచ్చు” నని చెప్పఁగా ఖానుతో నందుఁ డావార్త విన్నవించునపుడు వానికిఁ గలిగిన దుఃఖము వర్ణింపనలవి కాదయెనని యిట నేను వ్రాయనక్కఱ లేదు. కామోద్రేకమును విచారమును మల్లడిగొన మహమ్మదీయుఁడు హేమలత నెట్లయిన జేసికొని తీరవలయునని కృతనిశ్చయుడై నారాయణసింగునకు మౌలవికిని మిత్రభేదము గల్పింపఁ బ్రయత్నించెను. గాని యందుఁ గృతార్థుఁడు గానేరక పోయెను. అందుచేత, నందుఁడును, ఖానును, యితర సేవకులు దగు నుపాయమును వెదకు చుండిరి.

అది యిట్లుండ ఖానునకు హేమలతయందు దృఢమోహము దగుల్కొన్నదని జనులు చెప్పుకొనుటవలన కర్ణాకర్ణిని నారాయణసింగును మౌలవియు, హేమలతయు విని యేసమయమున నెట్టి యపాయము మూఁడు నోయని భయపడుచుండిరి. విదేశీయు లయిన వారిని రక్షించుట దనకు విధియని మౌలవి వారిక పాయము రాకుండగ నేమిచేయుదునా యని చింతింపుచుండెను. మదనసింగు వద్దనుంచి యిప్పటికి నాలుగైదు మాసమ్ములు గడచినను వర్తమాన మేదియు రానందున నతఁడు తమవిషయమయి మఱచినాఁడని వారాలోచించి నిరాశ పడి గతితోఁచక యుండిరి. తుదకు వారందఱు నాలోచించి వృద్ధుడు మనుమరాలును నక్కడకు నాలుగైదు క్రోసుల దూరముననున్న యలీఘరపురమునకుఁ బోవలెనని నిశ్చయించిరి. అందుచే మాలవి వారిని బ్రయాణముచేసి యాయూరందనకుఁ గల యిర్వురు ముఖ్య మిత్రులకు నుత్తరములు వ్రాసియిచ్చి సాధ్యమైనంత త్వరగఁ బ్రయాణమై పోవలసినదని చెప్పి వారితోఁ బోవుట కిర్వురు సేవకుల నేర్పఱచెను. ఆమధ్య హేమలతకు జ్వరమువచ్చుటచేఁ బ్రయాణ మాగిపోయెను. మౌలవియు నారాయణసింగుతో స్నేహముచేయుట తనకు నిష్టముగ నున్నందున ఖాను వానితో స్నేహము చాలింపవలసినదని యాయనకు వర్తమానమంపెను. మౌలవి దానిని లక్ష్యపెట్టనందున, గోపమతిశయింప వారి గర్వభంజన మొనర్చుటకుఁ గృతనిశ్చయుఁడై సమయమున కెదురుచూచుచు సాహేబు దినములఁ గడపుచుండెను. ఈ నడుమ హేమలత జ్వరమువలన మిగుల బాధనొందుచున్నందునను, నదియేయౌషధము చేతగు లొంగకున్నందునను వృద్ధుఁడు కొందఱి యోచన మీదఁనా గ్రామమునకు వచ్చియున్న గోసాయినిఁ బిలిపించి యాతనితోఁ దన మనుమరాలి వృత్తాంతముఁజెప్పెను. గోసాయిని జూచి హేమలత నమస్కరించి యెదుట నిలువ నతఁడామె నాశీర్వదించి యామె మొగమువంకఁ దేఱిపాఱజూచి ముసలివానిశరీరము నామూలాగ్రముగఁ బరీక్షించి మిగులనానందమునొంది తనయానంద సూచకముగఁ గొన్ని మాటల వచ్చుటకు యత్నించియు, బలవంతముగ దనసంతోషము నాపికొని ఆహా మీరిరువురునును జీవించియున్నారా? ఎన్ని దినములకు మీరగపడినారు. భగవదనుగ్రము మన పైఁ బూర్ణముగఁగలదు అని తనలో ననుకొని హేమలత నాడి పరీక్షించి కొంచెము దృష్టిదోషము తగిలినదని రక్షరేకు నొకదానినిచ్చి కంఠమునఁ గట్టుకొమ్మని చెప్పి యామె చేయి ముద్దువెట్టుకొని తరువాత వృద్ధునియొద్దకుఁబోయి యనేక వ్యవహారముల ముచ్చటించుచు నడుమ నిట్లనియె. “అయ్యా! తమసంగతి నంతను నేనెఱుఁగుదును. మీరు బ్రతికి యున్నారని నేనిదివఱ కెఱుగను. నేడు సుదినము అని గోసాయి పలుకగా వృద్ధుఁడు భయపడి నాయనా నీవెవరు? నాసంగతి బయలబెట్టకుము అని బతిమాలుకొనెను. గోసాయియు వృద్ధుని హస్తమును బట్టుకొని నేనెవ్వరయిన మీకెందుకు? నాసంగతి ముందుముందెఱుఁగఁగలరు. నాప్రాణములమీద మీకు నమ్మకముగలరేని మీరహస్యము నేను బయలుపఱుపనని ప్రమాణము చేయుచున్నాను భయపడకుఁడు. నేనింక నిటనుండరాదు” అని చెప్పి వారివలన సెలవుగైకొని గోసాయి యరిగెను. ఆ దినమున గోసాయి గోవిందశాస్త్రి యింట విందారగించి యా గ్రామమునే యుండెను.

ఆనాఁటి సాయంకాలమున పాలికోటలో నొక విధమయిన కళవళము పుట్టెను. అక్కడనుండి కన్నులార నది చూచినవారికే కాని యన్యులకుఁ దెలియదు. దీపములు పెట్టినతోడనే రహిమాను తాను సాధారణముగ యుద్ధరంగమునకుఁబోవు సమయములయందు దాను ధరించు వస్త్రములను, గవచమును, ఖడ్గమును ధరించుకొని తన యధికారము క్రిందనున్న రాజభటు లందరునట్లు కలహ సమయానుకూలమగు వేషముల ధరింపవలెనని యాజ్ఞాపించెను. అట్లు సర్వప్రయత్నములు జరిగించి రాజభటసమేతుఁడయి ముష్కరుఁడగు నాతురుష్కుఁడు రెండజాముల రాత్రియైన వెనుక గ్రామమంతయు నిశ్శబ్దముగ నున్నపుడు వృద్ధుఁడు నివాసము చేయుచున్న మఠమును జుట్టవైచి లోపలి వారిని పిలువుమని సేవకులలో నొకనిని నాజ్ఞాపించెను. అతఁడును బావాజీ అని పిలువ రోగపీడితులెవరో యాపదలో నుండి వచ్చినారని విసుగుగొనక తడవికొనుచు లేచివచ్చి తలుపుఁదీసెను. వెంటనే నిర్దయాత్ముఁడగు కఱకు తురక డెబ్బది సంవత్సరముల ప్రాయము కలిగి యశక్తుఁడయి నిరాధారుఁడయి గ్రుడ్డితనమునఁ గదలలేక యతి దీనుఁడయి కాలముఁబుచ్చుచున్న నారాయణసింగు చేయిపట్టుకొని కఠిన స్వరముతో నీదౌర్జన్యమును గుట్రలును విని నిన్నుఁ దక్షణమే పట్టికొని చెఱసాల యందుంచవలసినదని, చక్రవర్తిగారు మాకుత్తరువునంపినారు. అందుచేత నిదిగో నిన్నిపుడు పట్టికున్నాను” అని చెప్పి “ఱెక్కలు విఱచి కట్టుడు జాగ్రత్త”యని సేవకులతో నుడివెను. కర్ణశూలములవలెనున్న యాపలుకులు విని నిశ్చేష్టుఁడయి వృద్ధుఁడు నిలువఁబడి “అమ్మా! హేమలతా!” యని కేక వైచి “అయ్యయ్యో! నేనేమిచేసినాను. నావలననేమి యపరాధము వచ్చినది. చక్రవర్తి యుత్తరువు నేనెన్నఁడు నతిక్రమించలేదు. నన్ను బట్టికొనుట యన్యాయము. నన్ను విడువుఁడు, అని దీనస్వరముతో మనవి చేసికొనుచున్న వృద్ధుని మాటలను జెవినిడక రాజభటులు గట్టిగ బిగియఁదీసి ఱెక్కలు నొప్పి పెట్టునట్లు వెనుకకు విఱచికట్టిరి. నారాయణసింగు దీనాలాపముల నాలకించి రాజాథటులుగూడ దయగల వారయిరి. కాని మూర్తీభవించిన పాపదేవతయగు రహిమానుఖాను వాని విలాపమును చూచి, “ఓరీ. బద్మాష్ లుచ్చా! ముసలిదొంగ. నోరుమూసికొనుము, లేకున్న కొరడా దెబ్బలు తినెదవు. ఏమియునెఱుగని వానివలె నఱచెదవేమి! నీవు రాజపుత్రులను గలిసి చక్రవర్తి మీద గుట్రలు చేయుచున్నావు. మీయింట బసచేసిన మదనసింగుతో నీవు మాట్లాడిన రహస్యముల నేనెఱుఁగుదును. నాజరుజంగు నీ కుట్రలనెల్లఁ జక్రవర్తితోఁ, జెప్పినాఁడు. అందుచేత నాతఁడు నిన్నుఁ గారాగృహమున కంపుమని యాజ్ఞయొసఁగెను. నీ పాపము నీవే యనుభవింపుమని నిష్ఠురముగఁ బలుకఁ దనపై వచ్చిన యపవాదమునకును దురవస్థకును మిగులఁగుందుచు వృద్ధుఁడుండ నీకోలాహలమంతయు విని హేమలత దిగ్గున లేచి బంధింపఁబడియున్న పితామహుని గాలయమునివలె నెదుటనిల్చి యున్న రహిమానుఖానుని యమదూతలరీతిఁ దన పితామహుని బట్టికొనియున్న రాజభటులను జూచి వెఱగుపడి శరవేగముతో నతని కడకుఁబోయి దాదా! దాదా! యని కెవ్వుననఱచి, వానిని గౌఁగిలించికొని రోదనము చేయసాగెను. రాజసేవకులకు వెఱచియో యనునట్లు సహజగాంభీర్యమును ధైర్యమును నారాయణసింగును విడిపోవ మనుష్య స్వభావమునుబట్టి పొరలి పొరలివచ్చు దుఃఖమునాఁపలేక యితఁడు మనుమరాలిని గౌఁగిలించికొని స్త్రీవలె అమ్మా! నేను జెరసాలకుఁబోవుచున్నాను, అని పెద్ద పెట్టున నేడ్చెను. ఇట్లువాపోవు వారినిరువురనుజూచి దయాహీనుఁడగు రహిమానుఖాను విచారమును లేశము నొందక హేమలత సౌందర్యాదులనుగని యానందించుచు వారినివిడఁదీయ భటుల కాజ్ఞయొసఁగి ముసలివానిని లాగనారంభించెను. ఈనడుమ గ్రామమునమన్న వారందు నీకలకల ధ్వనులవలనకు, మిన్ను ముట్టుచున్న వారిరోదన ధ్వనులవలనను మేలుకొని, మఠమునఁ జుట్టుకొని యా విచిత్రమును జూచుచుండిరి. దుఃఖభారమున నిలువలేక తాతమెడకుఁ దనబాహులతికలను బెనవైచి గాఢాలింగనముఁ జేసికొని విలపించుచున్న హేమలతను విడఁదీయుట దుర్ఘటమని తలఁచి తురుష్కులు ముసలివానిని లాగుచుండ నందొకఁడు కొరడాలతో బాలిక చేతుల మీద రెండు దెబ్బలు కొట్టెను. ఆనొప్పిచే బాలిక కౌఁగిలింతవదలెను. వెంటనే రాజభటులు నారాయణసింగును గెంటుకొనిపోవుటఁజూని “అయ్యో! దాదా! దాదా! నేనెట్లు బ్రదుకఁగలను! నన్నెవరికప్పగించి పోవుచున్నావు! నాకెవరుదిక్కు! నన్నుఁ దీసికొనిపోవేమి! నేఁజచ్చి పోవుదును, నేనుండలేను. అయ్యో! మాటాడవేమి? దాదా, యని సకలజనుల హృదయములను. నీరైపోవునట్లఱచి మొదలు నఱకిన వృక్షము వలె నేలఁ మూర్ఛిల్లెను. ఆమె మూర్ఛిల్లిన వెనుక నారాయణసింగును రాజభటులు దీసికొనిపోవుటకు వలనుపడెను.

అంతట రహిమానుఖాను సేవకులలోఁగొందఱికాతనినప్పగించి, ఓరీ ముసలివానిని దీసికొనిపోయి కోటలోఁ జెఱలో నుంచుఁడు. నాకింకను బనియున్నది. నేనిప్పుడేవచ్చెదను అని వారలనంపి హేమలతయింటికి నిర్వురు సేవకుల గావలియుంచి తానావల వీధికిఁగొంచెము సాగిపోయెను. అచట నారాత్రి గుమిగూడిన గ్రామస్థులలో హేమలతానారాయణసింగుల దురవస్థఁ దలఁచి కంటఁదడిబెట్టనివారును మహమ్మదీయుని నిందింపనివారును లేరు. కాని యాయుధపాణులయియున్న రాజభటులకు వెఱచి యెవరును సాహసించి యాదురాత్ముల దౌర్జన్యమును మాన్పరయిరి. గారమూర్ఛపొంది హేమలత శరీరము నెఱుఁగక రెండుమూడుసారులు దాదా! దాదా! తెల్లవాఱినదిలెమ్ము అనియు, మదనసింగు, మదనసింగు అనియుఁ బలవరించి మరల మూర్ఛల్లెను. గ్రామస్థులు కావలియున్న రాజభటులకు వెఱచి యామెకు సహాయ మొసఁగకయె క్రమక్రమమున నొకరొక్కరుగఁబోవ నారంభింపఁ గొంత సేపటికి నెవ్వరును లేకపోయిరి. ముష్కర తురుష్కుడు సపరివారముగఁ బట్టణములో మహమ్మదీయుల నివాసముచేయు భాగమునకు బోయి యబ్దుల్ ఖరీమను మౌలవిగృహమును ముట్టడించి సుఖముగ నిద్రించుచున్న మౌలవిని బ్రక్కమీదనే పట్టికొని బంధించెను. అతని భార్యాపుత్రులు కర్తవ్యము నెఱుఁగక గొల్లున నేడ్వసాగిరి. ఆ వీధివారందరు వచ్చి ఖానును గారణమడిగిరి కాని మొదట నాతఁడు నిరుత్తరుఁడై తుదకిట్టు లనియె. ఈతడు మహమ్మదీయుఁడై యుండియు హిందువులతో స్నేహము చేయుచున్నాఁడు. కాఫరులతో నాలోచనల గల యీ పాపాత్ముఁడు సత్యమతస్థుఁ డగునా! అదిగాక రాజపుత్రులఁగలిసి చక్రవర్తిపైఁ గుట్రలుపన్నుచున్నాడు. మతవిరోధియు రాజద్రోహియునగు నీదురాత్మునిఁబట్టి బంధింపవలసినదని చక్రవర్తివద్దనుండి నాకు హుకుము వచ్చినది. అందుచేతఁ బట్టికొన్నాను. అని చెప్పి రెక్కలు వెనుకకు విఱియఁగట్టించి మౌలవిని జెఱకంపెను. కామాతురుడు నీర్ష్యాపీడితుఁడగుటచే రహిమానుఖానొక్కరాత్రి తనబల్వది రోధుల నిర్వురను బట్టుకొన్నందున కానందించుచు సఫలమనోరథుఁడయి వారి నిర్వురఁ జేరియొక గదిలోనుంచి తలుపులుమూయించి తాళములు వేయించెను. తరువాత గడియరాత్రియుండ నతఁడొంటరిగ బయలుదేఱి మఠమునకు వచ్చెను. అప్పుడు తానచట కావలియుంచిన సేవకులిద్దరును గాఢముగ నిద్రించుచుండిరి. హేమలత ప్రథమము మూర్ఛిల్లినచోట లేనందున రహిమానుఖాను గదిలోనికిఁబోయిచూచెను. అందును నామె గన్పడనందున నిల్లు నాలుగు ప్రక్కలను దొడ్లును ఖానుగారు స్వయముగ వెదకికొనిరిగాని హేమలత యగపడలేదు. ఆశాభంగమును దుఃఖమును బాధింప సాహేబొడలెరుఁగక నిద్రించు సేవకులను దన్ని నిద్రలేపి హేమలత యేదిరా? యని యడుగ వారును దిగులుపడి మాటలాడక చూడనారంభించిరి. వారిని వెంటఁబెట్టుకొని ఖాను కోటకుఁ బోయి తన మందిరమున శయనించిగ్రామమున బ్రాహ్మణ క్షత్రియవైశ్యశూద్రవివేచనము లేక ప్రతిగృహమును, మాలమాదిగగూడెములను, మహమ్మదీయులయిండ్లను, నూతులు, గోతులు, చెరువులు మొదలగువానిని వెదకించెను. కాని హేమలత యెందునుగాన బడదయ్యె. తుదకు నిరాశపడి కోపమెట్లును దీరక కావలియుండి పరాకున హేమలతను దాఁటిపోవనిచ్చిన సేవకులఁబిలిచి యం దత్యంతోపకారి యగు వానిని క్షమించి మేధకుఁడగు రెండవవానికి మరణదండన విధించెను. పాపము చిరకాలముదారులు కొట్టి కొట్టి మార్గస్థులఁజంపిచంపి దోషియైఖానునకాప్తుడైన గులామల్లికి నేఁడు మరణము తప్పదయ్యెను. వానిని వృక్షమునకుఁగట్టించి కత్తితో ఖాను తానేనరికివైచెను. అంతకును మనశ్శాంతిలేక పిచ్చివానివలె నటునిటుఁ దిరుగుచు గడ్డము నొకసారి సవరించుకొనుచుఁ గుళ్ళాయి నేలఁబాఱవైచుచు,సేవకులనెల్ల దిట్టుచుఁ జెఱసాలకడకుఁబోయి నారాయణసింగును మనుమరాలివిషయమై యడుగుచు వానిని సంహరించెదనని బెదరించుచు నన్నము ముట్టక సకలావస్థలఁ బొందుచు ఖాను విలపించుచుండెను. ఇది యిటుండ రాధ మరునాటి యుదయమున లేచి హేమలత గృహమునకు వచ్చి మఠమంతయు వెలవెలఁబాఱి చిన్నఁబో పుటయు బాలిక పెంచు రామచిలుక దిగులుపడియుండుటయు నామె యాడుకొనువస్తువులన్నియు నెక్కడివక్కడ నుఁడుటయు ముసలివాని మందులసంచియు వానినెన్నఁడును బాయని చేతి కఱ్ఱయు నటఁ బడియుండుటయుఁ జూచి కఠినచిత్తయయ్యు నామె స్త్రీజనస్వాభావికమగు విచారమును బొందకతప్పదయ్యెను. తరువాత రాధ గృహమునంతను వెదకి హేమలత మ్లేచ్ఛునిపాలఁబడి ముండునవని తన మనోరథ మీడేరునని సంతోషించి హేమలత వస్తువునన్నింటిని వెదకనారంభించెను. తనదగ్గఱనున్న మారుతాళములతో బోషాణముతీసి యందున్న సందుకాపెట్టెమూత తెరచి హేమలత యాభరణములను దొంగిలించి యందున్న రెండు కాగితములను దీసి చదువుకొన్నదగుటచే వానిని మెల్లఁగ జదువుకొని నగలకంటెవానికయి సంతోషించుచు నెవరును జూడకుండ రవికెలోఁబెట్టికాని పోయెను. అటు మదోన్మతుఁడై చిత్తవైకల్యముగలిగి ప్రవర్తించు రహిమానుఖానునకు నల్లాయుద్దీనుజక్రవర్తి యొద్దనుండి పరమానా యొకటివచ్చెను. చిత్తూరుదండయాత్రను గూర్చి ఖిల్లాదారులతో నెల్ల యోజింపవలసియున్నదని ఖానును జక్రవర్తి రమ్మనెను. నిరంకుశముగు చక్రవర్తి యుత్తరువు నతిక్రమింపఁ జాలక యొక వారములో ఢిల్లీకిఁబోవుచు, సింగును మౌలవిని విడువవలదని తనక్రింది యధికారితోఁ జెప్పి చనెను. గ్రామస్థులందఱును హేమలత బలవంతముగ మృతినొందెనని నిశ్చయించిరి.