హరివంశము/పూర్వభాగము-నవమాశ్వాసము

వికీసోర్స్ నుండి

శ్రీరస్తు

హరివంశము

పూర్వభాగము - నవమాశ్వాసము

     [1]సాధకసుచరిత్రా
     నైసర్గికసుజనతాభినందితగో త్రా
     వాసవ[2]సుతసమజైత్రా
     దేసటివేమా సమస్తధీరలలామా.1
వ. అక్కథకుండు శౌనకాదిమహామునులకుం జెప్పె నవ్విధంబున నక్రూరుం డరిగిన
     యనంతరంబ.2
క. ఆలానవిముక్తములై, కేళిం గాంక్షించి కడఁగు ఖేలన్మదశుం
     డాలములువోలి యదుశా, ర్దూలు రిరువురుం బురప్రతోళీగతు లై.3
వ. సర్వపదార్థజ్ఞానంబున నత్యంత ప్రగల్బు లయ్యును మనుష్యభావంబుకతన నప్రగ
     ల్భులకరణిం దత్పురసౌందర్యంబు లాశ్చర్యరసాయత్తంబు లగుచిత్తంబులతోడం
     జూచుచుం జనుదెంచుసమయంబునం బౌరు లాబాలవృద్ధనరనారీకంబుగా వారి
     నాలోకించు కౌతూహలంబునం గ్రందుకొని యచ్చెరువందుచుం దమలోన.4
సీ. గోపవేషోజ్జ్వలు లీపురుషశ్రేష్ఠు లెందుండి వచ్చిరో యిందులోన
     నీనవాంబుదవర్ణుఁ డింతయొప్పునె రాజసుతు లనేకులఁ దొల్లి చూడ మెట్లు
     గలదె యీచందంబు చెలు వెవ్వరికి నృపోద్భవులకా నోపుదు రవయవముల
     తీరును వ్రేఁకని తేజంబు గడిఁదియై పొలుపారుదర్పంబుఁ బొల్చెఁ జూడ
తే. వీరి నిద్దఱఁ గాంచిన భూరిపుణ్యు, లయ్య లేవంశమునవారొ యమ్మ లెట్టి
     నోమునోచినకులవర్ధనులొ యిచటికి, [3]వీరువచ్చినపని యేమివిధమొ తలఁప.5
క. మనకంసమహీపతి యి, య్యనఘులఁ గనుఁగొనియె నేని నపుడ నిజశ్రీ
     కనురూపాధికృతులఁగా, నొనరింపక యున్నె కడుసముత్సుకత మెయిన్.6
వ. అనుచుండం గాంతాజనంబులు దైత్యాంతకుం జూచి [4]మన్మథమదోద్రేకంబునం
     బొదలు నుత్సేకంబు వెలయ నంతర్గతంబున.7
చ. మనసిజతుల్యరూపుఁడు కుమారజనోత్తముఁ డిప్పు డీపురిన్
     వనితలమానముల్ గొనఁగవచ్చినవాఁ డనునన మేటికిన్

     గనుఁగొనినంతమాత్రన విఖండితశీలత నొంది రెల్లభా
     మినులును సోయగంబు లుపమింపఁగ నిట్టివి యెందుఁ గల్గునే.8
క. తగిలినచూడ్కులు మగుడం, దిగువఁగ లే మైతి మేమి తెఱఁగో యింకీ
     [5]సుగుణత తనుపుచు నెనసిన, పగిది మనోభావ[6]మోహపఙ్క్తులు గొనియెన్.9
మ. అని యెవ్వా రెచటం గనుంగొనిరి వా రచ్చోన కందర్పమో
     హన బాణంబుల కగ్గమై వికచనేత్రాంశుచ్ఛటాలోల[7]నీ
     లనవేందీవరపత్త్రతోరణలతాలంకారత ల్వీథినెం
     దును బర్వం బరతంత్రలైరి వెసఁ దద్రూపాతిసంగంబునన్.10
వ. సమానవయస్కు లగు పౌరకుమారు లక్కుమారులం గని యుత్సుకభావంబులు
     దిగువం దగిలి తోడన వేడుకం జని రిట్లు మధురాపురంబునకు నాక్షణంబున నిజ
     వీక్షణక్షోభం బొనరించుచు నయ్యదుకుంజరు లొయ్యనఁ బరిక్రమించి ముందట.11
తే. పలుదెఱంగుల మడుఁగుఁజీరలు పొలుపుగ, మడిచి మూటగఁగట్టి యింపడరఁ గొనుచు
     నరుగురజకుని రంగకారాఖ్యుఁ గాంచి, రపుడు వాని నుద్దేశించి యచ్యుతుండు.12
క. ఏమి మెడవాల! యే మీ, భూమీశ్వరు నర్థిఁ గానఁ బోయెదము సభా
     భూమికిఁ జనియేడువారికి, శ్రీ మేటిల్లంగ మంచిచీరలు వలయున్.13
వ. కావున నీచేతి మంచిమడుఁగులు మా కిచ్చి లెస్సవాఁడ వగు మనిన వాఁడు
     గోపించి.14
తే. అడవిలో గొల్లమందలయందుఁ బెరిఁగి, నారు లౌకికం బేమియు నేర రెఱుఁగఁ
     గంసనరనాయకుఁడు వేడ్కఁ గట్టుచీర, లడుగునంతటివారె మీ రకట యిట్లు.15
క. నానాదేశంబుల ధర, ణీనాథులు కట్నమిచ్చి నెఱిఁ బుత్తేరం
     గా నెందును బహుమూల్యము, లై నెఱసినయట్టి వివి జనాధిపుమెచ్చుల్.16
క. ప్రేలరులై వెడయఱపుల, నాలిగొనక పొండు తొలఁగి యనవుఁడు నాదు
     శ్శీలుమెడమీఁదఁ గృష్ణుఁడు, [8]వే లీలం గత్తి పెట్టి వ్రేసెం గినుకన్.17
వ. ఇట్లు వేసిన.18
తే. ఉసుఱు సిరియును నొల్ల కిట్లొఱటుఁజాకి, యాదిదేవునిదెస వినయంబు దక్కి
     యిహపరమ్ములు లేక [9]యి ట్లేగె భగ్న, కంఠుఁడై నేలపైఁ గూలి కాలుఁ గూడ.19
వ. వాని యాండ్రెందఱేనిం దలలు వీడం బఱతెంచి యఱచుచు రాచనగరికిం జెప్పఁ
     బోయిరి పరమపురుషుం డాచీరలకట్ట విడిచి కనకభంగపిశంగంబు లైన పరిధానం
     బులు దాను గట్టుకొని కువలయశ్యామంబు లైనవి రామున కిచ్చి తక్కిన చీర
     లక్కడం జూడవచ్చిన వేడుకకాండ్రకు వెఱవక కట్టుకొం డని కొన్ని యిచ్చి

     కొన్ని చించి నలుదెసలం బాఱవైచి యన్నీచు కొంపయుఁ జిచ్చువైచి నీఱు చేసి
     యట కడచి మాలకరివాడ సొచ్చి యందు.20
క. గుణకుఁ డనుమాల్యకారుని, గుణవంతుని నెదురఁ గాంచి గోవిందుఁ డతి
     ప్రణయమున నడిగె సమ్య, గ్గుణబంధము లయిన సురభికుసుమచయంబుల్.21
వ. వాఁడును వినయసంభ్రమప్రమోదంబులు ముప్పిరిగొన నిప్పురుషులు ధరణికిం
     గ్రీడార్థం బరుగుదెంచిన సిద్ధులొండె యక్షులొండెం గావలయు నక్షతప్రభావు
     లన్యు లెవ్వ రనుచు నెదుర్కొని మ్రొక్కి యక్కజంబు లగు ప్రసూనదామం
     బులు సమర్పించి దేవరసొమ్ము దేవర కిచ్చుట యేమి చోద్యంబు లని వినయంబులు
     పలికినం గైకొని యప్పువ్వు లన్నకు వలయునన్ని యొసంగి వనజనయనుండు
     దానును.22
క. కొప్పునఁ దురిమియు నెంతయు, నొప్పుమిగుల నఱుత వైచియును బాహువులన్
     ముప్పిరిగొనంగఁ జుట్టియు, నప్పు డపూర్వంపులీల యలవడఁ దాల్చెన్.23
వ. ఇట్లు మాలాకారుని మాల్యంబులు మాంగల్యంబులుగా ననుగ్రహించి వానికి
     మెచ్చి యవ్విభుండు.24
మ. [10]నిను మత్సంశ్రయ యైనలక్ష్మి కరుణ న్వీక్షించి యుష్మదృహం
     బు ననంతోజ్జ్వలహేమరత్నతతి నాపూర్ణంబుఁ గావించు నీ
     తనయు ల్మన్మలు లోనుగా వరుస సంతానం బవిచ్ఛిన్నమై
     ధనవంతం బగు మత్ప్రసాదమునఁ దథ్యం బింత పుణ్యాత్మకా.25
వ. మదీయపూజావిధాయి వగుటం జేసి యక్షయం బగు మోక్షంబును భవదధీనం
     బయ్యెడు ననియె నప్పుష్పలావుండును దేవుం డిచ్చిన వరంబు మహాప్రసాదం బని
     వినయావనతశాలి యగు మౌళిం బరిగ్రహించె నవ్వసుదేవసూను లిద్దఱు నట
     రాజమార్గంబునం జనిచని.26

శ్రీకృష్ణుడు కుబ్జ యనుకంసదాసి ననుగ్రహించి సురూపం జేయుట

క. అనుపమసుగంధివిస్ఫుర, దనులేపనభాజనంబు హస్తంబునఁ గై
     కొని చనుదానిఁ జపలలో, చన నొక్కెడఁ గుబ్జఁ గనిరి సమదవయస్కన్.27
వ. కృష్ణుం డక్కామినిముసుంగు వుచ్చి వదనంబునం జూడ్కి నిలిపి యియ్యనులేపనం
     బెవ్వరికిం గొనిపోయెద వనిన నది వినయంబున నతని కి ట్లనియె.28
మ. కలపం బెవ్వరు గూర్చి తెచ్చినను నిక్కం బొల్లఁ [11]డెల్లప్పుడున్
     జలకంబాడి మదాగమంబు మదిలోన న్వార్చుఁ గంసుండు రా
     జెలమి న్నెచ్చిన[12]గట్టువా లిది యనన్ హృద్యక్రియావిద్యఁ బే
     శలనై యుండుదు నేను బోయెదఁ దదిచ్ఛాపూర్తి గావింపఁగన్.29

వ. నిన్నుం బొడగని నామనంబు ప్రియం బందిన నింతయుం జెప్పితి దడయరా దిది
     జననాథుమజ్జనసమయం బనినం బురుషోత్తముండు.30
తే. ఏము పరదేశిమల్లుల మీనృపాలు, రాష్ట్రమును రాజ్యమును జూచి రమ్యమైన
     వింటిపండువు గొనియాడువేడ్క నిట్టు, లరుగుదెంచినారము సరోజాయతాక్షి.31
వ. నిన్ను నీవ పొగడుకొంటి మాకు నూరక మెచ్చవచ్చునె నీచేతిగందం బిచ్చినం
     బూసికొని మఱి మెచ్చెదము మెచ్చి పోయి రాజరంగంబున మెఱసి నీవారమై
     యుండుట యొప్పదె యనిన నవ్వుచుం గుబ్జ యబ్జనాభుం జూచి మేలుగాక
     యట్లైన నిదె కైకొను మని యయ్యంగరాగంబు ననురాగంబుతో నిచ్చినం గొని
     యతం డగ్రజునకుం దొలుత సమర్పించి తానును వలసినవన్నువ[13] యలందికొని
     యనులిప్తశేషంబు తోడిదారకుల కిచ్చె నంత.32
శా. స్థూలస్థానకముల్ భుజాగ్రముల సంశోభిల్ల వక్షస్స్థల
     వ్యాలేపం బతిసాంద్రమై మెఱయ ఫాలాంతర్లలామంబులున్
     మేలీలల్ [14]వదనంబు లిద్దఱును సమ్మిశ్రేంద్రచాపద్యుతి
     శ్రీలం గ్రాలు[15]సితాసితాభ్రములపేర్మిం బొంది రుత్సేకమున్.33
వ. అప్పు డకుబ్జప్రభావుం డగు నప్పురాణకుబ్జుం డాకుబ్జరూపత్వం బపనయింపం
     దలంచి.34
క. తనచరణాగ్రంబున న, వ్వనితపదాగ్రములు దొక్కి వలనొప్పఁగ నొ
     య్యన [16]జుట్టవ్రేలదానివ, దన మింపుగ నెత్తె సంచితస్మిత మలరన్.35
వ. ఇ ట్లెత్తుటయు.36
తే. వంకయొత్తినమన్మథువాలురమ్ముఁ, బోలెఁ జక్కనై యెలమేను పొలుపు మిగిలెఁ
     గుబ్జ కసదునెన్నడుమును గురుకుచద్వ, యంబుఁ జదరపు వెన్నును నభినవముగ.37
క. తనుఁ దాన చూచి యయ్యం, గన యద్భుతకౌతుకములు గడలుకొనంగా
     వనరుహలోచను వదనము, గనుఁగొనెఁ జిఱునవ్వుతోడి గరువపుఁ జూడ్కిన్.38
వ. తనమనంబున నక్కుమారుమీఁదఁ దళుకొత్తు చిత్తజోన్మేషంబు బయలుపఱిచి
     నాకు నుపకారంబు చేసిన యిట్టి మహిమగలవాఁడవు నాయింటికి విజయంబు చేసి
     నన్నుం గృతార్థం జేయవలదె యూరక త్రోచిపోవం జూచిన నేను బోనిచ్చు
     దానం గా నని మెల్లన నిజపాణిపల్లవంబున నతనికరంబు దెమల్చిన.39
క. పని చాలఁ గలదు కమలా, నన క్రమ్మఱ వత్తు నీవు నాసొ మ్మని య
     వ్వనిత విడిపించుకొని తా, నును బలుఁడును నగుచు నతిమనోహరలీలన్.40
వ. మనంబులం బొంగారుకడంకయు బింకంబును జేష్టితంబుల నంకురింపనీక యెల్ల
     విధంబులం గొల్లతనంబ తెల్లం బై తోఁపఁ దెంపుతోడి కినుక నకంపితగమను లై

     యనేక నరనారకోపాయనసహస్రంబు లజస్రంబు లై క్రందుకొను కరి
     తురగస్యందనసుందరవస్తువిస్తారంబుల నత్యుదారం బగు కంసమందిరద్వారంబు
     ప్రవేశించి.41
ఉ. చేరి నరేంద్రు లర్చనలు సేయఁగఁ గింకరలక్షరక్షితం
     బై రమణీయకాంచనమహామణినిర్మిత మైన యాయుధా
     గారము గాంచి భోజవిభుకార్ముక మెయ్యది చూచువేడ్కచే
     దూరము వచ్చినార మని దోహల మేర్పడఁ బల్కి రచ్చటన్.42
వ. రక్షకులు సూపఁ దక్షకాహిదేహదండంబు చాడ్పునఁ బ్రచండం బగు కార్ము
     కంబు చూచి రంతఁ గృష్ణుండు.43
తే. దీని నెక్కిడ దివిజులు దానవులునుఁ, జాల రని చెప్ప విందు మాశ్చర్యభూత
     మెవ్విధమొ చూత మని లీల నేకకరము, నంద కైకొని యపుడు సజ్యముగఁ జేసి.44

శ్రీకృష్ణుడు కంసునాయుధాగారంబు చేరి కంసశరాసనధ్వంసంబు చేయుట

మ.జను లెల్ల న్వెఱగంది చూడఁగఁ బటుజ్యానాదపూర్వంబుగా
     నొనరించెం బరిపూర్ణముష్టిఁ బిడిపట్టొక్కింత నిశ్చింతుఁ డై
     యనయంబున్ సడలించి విల్లు విఱిచెన్ [17]హర్యశ్వహస్తాయుధా
     [18]హననధ్వస్తమహీధ్రమస్తకకరోరాఘోష ఘోరంబుగన్.45
వ. ఇట్లు ధూర్జటి ధనుర్ధండదళనోద్దాముం డైన రాముండునుం బోలె రామావర
     జుండు భోజశరాసనంబు శకలంబులు గావించి తాను గానివాఁడునుంబోలె సందడి
     లోన సురిగి యన్నమున్నుగా నల్లన సముల్లసితగమనంబున శస్త్రాగారంబు వెలు
     వడియె నంతఁ దదీయరక్షుకు లొండొరులం గడవ నంతపురంబునకుం జని జనపతిం
     గని యంగంబులు వడంక నెలుంగులుం గుత్తుకలం దగుల ని ట్లనిరి.46
సీ. అవధరింపుము దేవ యాశ్చర్య మొక్కటి మనవిల్లు పూజించు మందిరంబు
     లోనికి నిద్దఱు లోకాధికం బగు తేజంబుగలవారు దేవనిభులు
     నవయావనులు మనోజ్ఞవిచిత్రగంధమాల్యాలంకృతాంగులు నీలపీత
     వసనులు దివినుండి వసుధపై కుట్టిపడ్డట్టు లెవ్వరు వీర లని యెఱుంగ
తే. నేరకుండ నేతెంచిరి వారిలోనఁ, దెల్లడామరఱేకుల ట్లుల్లసిల్లు
     కన్నుదోయి నొప్పారేడు కఱ్ఱియాతఁ, డొకఁడు వెసఁబుచ్చుకొనియె వి ల్లొక్కకేల.47
చ. కొన నితఁ డెవ్వఁ డిచ్చటికిఁ గొంకక యేటికి వచ్చె నేల యి
     య్యనుపమకార్ముకం బిట రయంబునఁ గేల ధరించె నంచు నే
     మనయము విస్మయంబు పడునంతటిలోఁ దిగిచె న్నరేంద్ర భ
     ల్లన విఱుఁగంగఁ జెప్పఁ దడ వయ్యెడు చెప్పెడుమాత్రయింతయున్.48

క. ఆబెడిదపుమ్రోఁతకుఁ గా, దే బమ్మెరపోయి దేవ దేవరనగరన్
     వే బెండుపడిరి మొగముల, పై బెగ్గలికంబు దేఱఁ బరిజను లెల్లన్.49
తే. కట్లుఁ గంబంబు విఱుచునుగ్రంపుగజము, నట్టు లవ్విల్లు విఱిచి యయ్యక్కజుండు
     పవనుచందంబుగతిఁ బట్టుపడకతూఱి, పోయెఁ దోడియాతఁడుఁ దాను భూపసింహ.50
క. అని విలువిఱుచుట సెప్పఁగఁ, దనవీఁ పటు విఱిగినట్లు తల్లడ మెసఁగన్
     జనపతి వారల నటపోఁ, బనిచి విషాదోరుచింతఁ బడి యాకులుఁడై.51
వ. అంతకుమున్న రామకేశవులం గానుపించుకొనునప్పటికి నాయితంబులు సేయించిన
     ప్రేక్షాగారంబులు వీక్షించువాఁ డయి వెలువడియె నవియును రాజునకు నమా
     త్యులకు భూపతులకు బాంధవులకు భృత్యులకుఁ బౌరశ్రేణులకు విలాసినులకు
     మఱియుం దగినవారి కెల్లను వేర్వేఱ కావించిన తమగంబుల దృఢరమ్యరచనంబు
     లగుమహాస్తంభంబుల నున్నతంబు లగునుపరిగృహంబులను సుఖారోహణంబు
     లగుసుసంఘటితసోపానమార్గంబుల నతివిశాలంబు లగువలభిముఖంబులఁ బ్రత్య
     గ్రకల్పితంబు లగువిచిత్రశిల్పంబుల నాలోకనీయంబు లగువితానయవనికాతో
     రణప్రముఖంబుల నలంకృతంబు లై యుల్లసిల్ల ననేకపురుషరక్షితం బై యపార
     వస్తుభరితం బై యామోదికుసుమపరికీర్ణస్థలం బై యభిరూపధూపవాసితం బై
     భాసిల్లునట్టిరంగంబు గనుంగొని.52
క. అతఁ డఖిలకర్మకరులకు, వితతంబుగ వలయుభంగి వినియోగంబుల్
     ప్రతిభ యెసఁగఁ బనిచి సము, ద్యతమతియై మగుడఁ జొచ్చె నంతఃపురమున్.53
వ. అచ్చటనుండి చాణూరముష్టికు లనుమల్లవరులఁ బ్రసిద్ధసత్త్వులం బిలిపించి
     యి ట్లనియె.54
ఉ. మల్లుతనంబునన్ భువనమండలివీరపతాక [19]మీకయై
     చెల్లుఁ బ్రియంబుతోడ ననుఁ జేరినకోలెను నే నొనర్చు మే
     లెల్లను మీ రెఱుంగుదుర యింతటఁ బ్రత్యుపకారకాంక్ష సం
     ధిల్లెన యేని నాపలుకు దెల్లముగా వినుఁ డేకచిత్తతన్.55
మ. బలుఁడుం గృష్ణుఁడు నాఁగఁ జెప్పఁబడుగోపాలార్భకు ల్గానన
     స్థలిలోఁ [20]గారెఱుకుందనంబునన యిందాఁకం బ్రవర్తిల్లినా
     రలఘుస్థైర్యము ధైర్యమున్ మొదలుగా [21]నయ్యైభటౌచిత్యముల్
     గలయం దైన నెఱుంగ రెంతయును మౌష్కర్యంబు శీలించుటన్.56
శా. ఈరంగంబున వారు మీకు నెదురై యేమేనిఁ జెయ్దంబుమైఁ
     జేరం జూతురు మీరు గైకొనమితోఁ జేపట్టి పాలార్చుచున్
     గారింపన్ వల దొక్కపూఁపునన యాఘాతించి నాకున్ మహో
     దారం బైనశుభం బొనర్పుఁడు భవత్ప్రఖ్యాతి నిండారఁగాన్.57

క. అని యి ట్లెంతయు సన్మా, నన మొప్పారంగఁ దమ్ము నరపతి ప్రార్థిం
     చినఁ బ్రార్థనీయబాహా, ఘను లగువా రతనియెదుర ఘటితాంజలు లై.58
చ. పలుకులు వేయు నేమిటికిఁ బార్ధివకుంజర యిట్టినీవు మా
     కొలఁది యెఱింగి పంచెదవు గోపకిశోరులు మాకు నగ్గమై
     యెలసినయప్డ పైఁబడుదు మించుక సైచి పెనంగ నోపినన్
     నిలువక బీఱువోయినను నీవ కనుంగొనఁ గూల్తు మిద్దరన్.59
క. ఇది యొకపనిగా దేవర, మదిలోఁ జింతింపవలదు మా కెదురుగ నీ
     యుదధివృతధాత్రి మల్లుల, వెదకియుఁ గానము భుజింపు విశ్వశ్రీలన్.60
వ. వార లిట్లనిన సంప్రీతుండై యతండు వారికి రంగభూమి యందుఁ బేర్కొనం గల
     తమగంబులు సూప నాజ్ఞాపించి నేటికి నిజగృహంబుల కరుగుం డనినం బెలుచన
     బాహువు లాస్ఫాలించి సింహనాదంబు చేసి మ్రొక్కి వీడ్కొనీివారు యథేష్ట
     గమనం బొనర్చిరి తదనంతరంబ కంసుండు గజారోహణనిపుణుం డగు [22]మహా
     మాత్రు రావించి యి ట్లనియె.61
క. నిను నెంతయు నాప్తునిఁగా, మనమున నే విశ్వసింతు [23]మంత్రివర తగం
     బని సాలఁ గలిగె నిప్పుడు, వినవలసినతెఱఁగు వినుము విస్పష్టముగాన్.62
ఉ. గొల్లలలోపలం బెరిఁగి గొల్లతనంబ యెఱింగి యెంతయుం
     బ్రల్లదు లైనవారు గడుఁ బాతకు లావసుదేవుపుత్రకుల్
     బల్లిదు లిప్పు డిచ్చటికిఁ బన్నుగ వచ్చినవారు వారికిన్
     మల్లులఁ బంచితిం గఠినమర్దనశౌండులఁ గీడొనర్పఁగాన్.63
వ. నీవును సన్నద్ధుండ వై యారామకృష్ణులు సనుదెంచు సమయంబునకు ముందట.64
మ. పెలుచం గుంజరరాజము న్గువలయాపీడంబుఁ గ్రోధానలా
     కులఘోరాక్షము గండమండలపరిశుభ్యన్మదస్రోతమున్
     బలవద్వీరవిదారణప్రకటితాభ్యాసంబు నాసన్నమై
     యెలయన్ రాజగృహంబువాకిటికి రాని మ్మోపి యీవేకువన్.65
తే. ఖలుల విగతాయుధుల వారిఁ గనినయపుడ, వారణము గొల్పుమీ వరవాయి గొనక
     జమునిపట్టినచెరగాక సడలిపోవ, వచ్చునే దానియెదుర నెవ్వారికైన.66
ఉ. ఏనుఁగుచేతఁ జిక్కి యొకయింతయుఁ జేయఁగలేక ధాత్రిపైఁ
     బీనుఁగులై వెసంబడినబిడ్డల నవ్వసుదేవుఁ డెంతయున్
     దీనతఁ గాంచి తాను దనదేవియు వెండి నశింతు రాఫ్తులై
     వానికిఁ బూనివచ్చుయదువర్యులు ద్రుంగుదు రొయ్య నందఱున్.67
క. నీనేరుపొండె మల్లుల, పూనికయొండె నిటుపగఱఁ బొరిపుచ్చిన నే
     నీనిఖలజగము యదుగణ, హీనముగాఁ జేసి యొకఁడ నేలుదు నెమ్మిన్.68

తే. యదుకులోద్వహుఁ డనికాదె యాదియంద, తండ్రిఁ దొఱఁగితిఁ బిదప యాదవుల నెల్లఁ
     గృష్ణుదెసఁ బక్షపాతులై కెరలు డెఱిఁగి, నమ్మ కెడసేసి తొలఁగి యున్నాఁడ నిపుడు.69

కంసుం డేకాంతంబున మహామాత్యునితోఁ దనజన్మప్రకారంబు చెప్పుట

క. విను మొక్కరహస్యం బే, ననఘా యీయుగ్రసేనునాత్మకు జనియిం
     చినవాఁడఁ గాను మానుష, జని కిట్టు లమానుషంపుశక్తి గలుగునే.70
వ. అది యె ట్లనిన నాతోడ నారదమహాముని యేకాంతంబునం జెప్పినది చెప్పెద
     మాతల్లి రజస్వలయై యుండి యొక్కనాఁడు యమునాతీరంబునం బ్రసిద్ధ బగుసు
     యామునశైలంబున నఖిలయదువృష్ణిభోజాంధకులుం గాంతాసహితు లై విహ
     రించుచుండం దానును నెచ్చెలువలతోడంగూడ నరిగి యనేకవిధవినోదంబులఁ
     జరియించెం దత్సమయంబు మేఘారంభదివసంబు లగుటం జేసి.71
సీ. కడిమిఁ బూఁదేనియ కడుపారఁగొని మ్రోసి తిరుగు లేదేఁటుల తెరలికయును
     నెసకంపుటుఱుములయింపునఁ జెలఁగి యాడెడుపురినెమళులకడఁక సొంపుఁ
     బరువంపుఁ జినుకులపసఁ క్రొవ్వుగొని తేలగిలఁబడువానకోయిలలయొప్పు
     నెలపచ్చికలు దమయిచ్చఁ గైకొని యాముకవిసి త్రుళ్లెడిలేటిగములపెల్లుఁ
తే. గొడిసెవిరులకమ్మదనంబు గొఱలి కొండ, సెలలజాఱుతుంపర మోచి మెలఁగుచున్న
     గాడ్పుమురిపంబు నెందును గలిగి యెల్ల, వారిమనసులు వేడ్కల మూరిఁబోయె.72
క. అత్తఱిఁ జిత్తము రాగా, యత్తంబై పతిఁ దలంచి యమ్మానిని యు
     ద్వృత్తమదనకేళీరుచి, గ్రొత్తగ నెలయుటయు నధికకుతుకము నొందెన్.73
వ. అమ్మనస్విని మనోవృత్తం బెఱింగి యొక్కదానవుండు గ్రక్కున నుగ్రసేన
     రూపంబు ధరియించి చేరం జనుదెంచి.74
క. నీవును జెలులును నాటల, కీవసుధాధరముమీఁది కేతెంచుట యే
     నావల నెఱింగి వచ్చితి, భావంబున సైపలేక పంకజవదనా.75
వ. నన్నుఁ జరితార్థుం జేయు మని తదీయమనోరథానురూపంబు లగుచేష్టితంబులం
     బ్రవర్తిల్లిన యనంతరంబ పతిభావానుకూల యగునప్పుణ్యశీల నిజభర్తవలనం
     బూర్వానుభవంబుచందంబు వానియందుఁ గానక శంకించి [24]తలంకి యాకళంకి-
     తాచారుం గనుంగొని.76
మ. అకటా నిక్కము నీవు నాపతివి గా వన్యుండ వీరూపుమై
     యకలంకం బగుమచ్చరిత్రమున కన్యాయంబు గావించి తిం

     తకు శంకింపక యెత్తికొన్న విగళద్ధర్ముండ వెవ్వాఁడ వే
     టికి నిప్పాపము సేసి తుత్తమవధూటీదూషణం బర్హమే.77
తే. ఇంకఁ జుట్టలు నన్నేమి యెన్నువారొ, కులమునకుఁ బాయపడి యిట్లు కులటనైతి
     నీవు నల్పాయుషుండవై నీచ పోదు, నరకమునకుఁ బరస్త్రీవినాశి వగుట.78
చ. అనవుడు నాతఁ డిట్లనియె నంగన సౌంభపురీవిభుండ నే
     ననఘుఁడ ద్రామిళుం డనుమహాదనుజాగ్రణి నీ విటేల దు
     ర్మనుజుని భర్తగాఁ దగిలి మానిని పండితమానితావిధం
     బెనయఁగఁ బల్కె దిప్డు తగ వించుకతప్పినచొప్పు సెప్పుమా.79
క. అభిమానవతులు ముగ్ధలు, నభిజాతలు నైన మగనియాండ్రుర కారే
     వ్యభిచారమునన తనయుల, నిభనిభులం గనిరి ము న్ననేకులు నతివా.80
తే. వారికంటెను నీ వెటువలన నెక్కు, డేల [25]యిబ్బీదమాటల నిట్లు నన్ను
     రేఁచె దేనిచ్చువరము సంప్రీతిఁ గొనుము, పుత్రు జగదేకవీరునిఁ బొలఁతి కనుము.81
వ. వాఁడు గంసుం డనుపేరం గృతరిపుధ్వంసుం డై భువనావతంసం బగువిభవ
     ప్రశంసం బరఁగం గలవాఁ డనినఁ గోపించి యప్పతివ్రత వాని కి ట్లనియె.82
మ. నను నీ వక్కట యిమ్మెయిం జెఱచి యెన్నం బెద్దగాఁ గీర్తిగ
     న్న నుతాచారలఁ దొంటిపుణ్యసతుల గర్హించె దీలోక మె
     ల్లను నాత్మీయపతివ్రతాగుణసముల్లాసంబునం దాల్చునం
     గనల న్మున్వినవే యరుంధతిమొదల్గా నెందఱో యిమ్మహిన్.83
వ. నీవిచ్చు వరంబు గాల్చుకొనుము వ్రతవినాశనుండ వైననీదుర్బీజంబున నుద్భ
     వించుసుతుండు నాకు నభిమతుండు గాఁడు మదీయభర్తయన్వయంబునంద
     యొక్క పుణ్యపురుషుండు పరాక్రమసమర్థుం డయి జనియించి వానికి మృత్యు
     వయ్యెడు ననిన నయ్యసురపతి నిజేచ్ఛం జనియె మాతల్లి మగుడ నగరంబున
     కరుగుదెంచె నివ్విషంబున జాతుండ నై.84
చ. జనకునిఁ గన్నఁ గిన్పడుదు సభ్యుల బంధులఁ గాంచినం గడున్
     గనలుదుఁ దల్లిదిక్కునను గౌరవబుద్ధి యొకింత లేదు నా
     కనయము నట్టితండ్రి నిగళాభినియంత్రితుఁ జేసి రాజ్యముం
     గొని యనిరుద్ధవీధినధికుం డన నిట్టిఁడనై తి నుధ్ధతిన్.85
వ. ఆ గొల్లపడుచుల నిద్దఱం దునిమివైచి తక్కిన చుట్టంబులఁ బిలుకుమార్చెద నిది
     నిశ్చయంబు నీవు దడయక యంకుశప్రాసతోమరంబులు ధరియించి నా చెప్పిన
     పనియందుఁ దాత్పర్యంబు వాటింపు మని మహామాత్రు వీడుకొలిపె నంత
     రాత్రియగుటయుం గంసుండు యథోచితవర్తనంబున నుండె రామకేశవులు
     నుచితప్రదేశంబునఁ దజ్జిఘాంసావేగజాగరణం బొనర్చరి తదనంతరంబ.86

ఉ. కంసునిబాధలం బడుజగంబుల కింతటవేగుఁగాక త
     ద్వంశము వేగ వేగుటయుఁ దా నొడఁగూడదె యన్గతిం దమో
     ధ్వంస మొనర్చి శౌరి కనుదమ్ములు తమ్ములచాయ నవ్వఁగా
     హంసుఁడు ప్రాచ్యపర్వతశిఖాగ్రవతంసత నొందె నొప్పుగాన్.87

కంసుండు సపరివారుం డై రంగస్థలంబున నుండి రామకృష్ణుల రావించుట

వ. పురంబున నెల్లవారును, గైసేసి రాజశాసనంబున రామకృష్ణులపరాక్రమం
     బాలోకించు కౌతుకంబున నుల్లంబులు పల్లవింపం జనుదెంచి నిజోచితంబు లగు
     మంచప్రకరంబు లెక్కి చూచుచుండిరి రాజును సమస్తపరిజనంబులతోడ నుత్తుంగ
     కనకాసనసనాథం బైనమంచకస్థలంబున నాసీనుం డై ధవళాంబరంబులు ముక్తా
     మయభూషణంబులు వెలిగొడుగులు వింజామరంబులు విలాసినీనివహసితాపాంగ
     రోచులు నొక్క తెలువై పొలుపారం జంద్రోదయోద్దామసౌందర్యంబు నభిన
     యించుచుండె విచిత్రంబు లగు తెలిచీర లిరుదెసల నుల్లసిల్ల నమ్మేటితమగంబులు
     బలుఱెక్కలతోడి పెద్దకొండలకైవడిం గనుపట్ట నంతఃపురజనంబులును జగతీ
     విభుని యిరుగెలంకులను వెనుకదిక్కునను మెఱయు మంచలపై నుండి గవాక్ష
     ప్రసారితంబు లగునిరీక్షణంబుల నయ్యుత్సవం బభినందించిరి. దివంబున
     నుండి దేవేంద్రుండు దేవగణసమేతుం డై జీమూతమాతంగంబుమీఁద నొప్పారి
     నారదప్రముఖమునివరులను దిలీపప్రభృతిపూర్వభూపతులును సిద్ధయోగిసము
     త్కరంబులుం గొల్వఁ గంసధ్వంసనావధి యగురిపువధకల్యాణంబు గనుంగొను
     వాఁడై యరుదెంచి యంబరకలంబు బహువిమానసుందరంబు గావించె నంత.88
క. కచ్చించి మల్లులిద్దఱు, మచ్చరమున లావు మెఱయ మత్తకరులు రెం
     డిచ్చఁ జనుదెంచుచాడ్పున, నచ్చటి కేతెంచి నిలిచి రధిపతియెదురన్.89
క. శూరుఁ డగుమహామాత్రుఁడు, వారక మదతీవ్రదుష్టవారణము నృప
     ద్వారమున నిలిపి యాడవ, దారకుల న్వార్చియుండెఁ దద్దయుఁ గడఁకన్.90
వ. ఆ సమయంబున.91
చ. అడవులనుండి వచ్చిరఁట యద్భుతశౌర్యులు రామకృష్ణు లి
     క్కడికి న రేశ్వరుండు గడుఁగౌతుకియై పిలుపించెఁ దోడి తెం
     డెడమడు వేల యింక నఖిలేచ్ఛలుఁ జేకుఱు నంచుఁ గంచుకుల్
     బడిబడిఁ బాఱుతెంచి తమభావ మెలర్పఁగఁ బల్కి పిల్వఁగన్.92
క. ఒకసంభ్రమమును లేక, య్యకలంకాత్మకులు తొంటియట్టుల మూర్తుల్
     వికృతిరహిత లయి జనదృ, క్చకోరకముల కభినవేందుసదృశత నమరన్.93
వ. రంగద్వారంబు సేరి రప్పుడు బోరనం జెలంగువాదిత్రంబుల విచిత్రధ్వానంబులును
     బ్రేక్షకవ్రాతంబుల కౌతూహలాలాపఘోషంబులు దివంబున దివ్యదుందుభినిన
     దంబును దదంతరంగంబులకు సముత్సాహతరంగంబులు సమధికోత్తుంగంబులు

     గావించె నట్టిసంకులంబున నక్కడనున్న మహామాత్రుండు గోత్రగిరిగురుక్రోడంబుఁ
     గువలయాపీడంబుఁ గువలయాపీడజన్ము లగుయదువంశజన్ముల మీఁదం గొల్పిన.94
చ. కని దనుజారి యగ్రజుమొగంబునఁ జూడ్కులు నిల్పి నవ్వుచున్
     మనల వధింపఁ గోరి కొఱమాలినయేనికదున్న నొక్కటిం
     బనిచినవాఁడు తద్దయును బాలిశబుద్ధి గదే కృతాంతదం
     తనికటసంప్రవర్తి యగుతన్నును గానఁడు కంసుఁ డక్కటా.95
వ. నీవు నన్ను నవధరించి చూచుచుండు మని యెదురు నడిచె నాలోన.96
సీ. చటులోగ్రశీకరచ్ఛటలు పెల్లుగఁ గాలదండప్రచండమై తొండ మమర
     నళికులఝంకారములు రేఁగ మదజలోత్కటములై యందంద కటము లదరఁ
     గనదగ్నికణసముత్కరములఁ బెంచి యత్యుగ్రారుణేక్షణద్యుతులు నిగుడఁ
     జలి చామరశిఖాశాత్కారములతోడఁ దగుకర్ణతాడనధ్వనులు పర్వ
తే. మొగము క్రోధమయంబుగ బిగిసి మేను, వొంగఁ బచపాతభుగ్నమై భువి చలింప
     దీర్ఘదంతకాండంబు లుద్వృత్తిఁ జూపఁ, గదిసె నేనుంగు లోకభీకరము గాఁగ.97
వ. కృష్ణుండును దానితోడిసమరంబు నెపంబుగాఁ దనభుజబలంబు సూపఱకుఁ
     జూపుటకై కొండొకదడవు వినోదింపం దలంచి తలపడి తొలుతఁ దదీయం బగు
     కరతాడనంబు (దృఢకఠినం బైన) నిజవక్షస్స్థలంబునఁ గైకొని యెగసి కొమ్ములు
     ద్రొక్కి నిలుచుండి యంతలోనన దక్షిణచరణం బట్లయుండ నపరాంఘ్రిపాతం
     బునం గుంభస్థలంబు నొప్పించి యుఱికి వీఁపు మెట్టి యమ్మహాగజంబు దన్ను
     వ్రేయుటకుఁ బెడమరనెత్తిన హస్తంబు గేలఁ గుదియించుచు నొక్కదిక్కున దిగు
     వకు లంఘించి పిడికిళ్లం బ్రక్కలు నొగిల్చిన నది దిరుగుటయుం గాళ్లసందున
     సురిఁగి వెనుకం దోఁకవట్టి గరుడండు గిరికందరవిలీనంబగు భుజంగంబు నాకర్షించు
     కరణిం దిగిచి దిర్దిరం ద్రిప్పిన మొగతప్పి కొమ్ము లూఁతగా నక్కరటి
     యుక్కఱి మ్రొగ్గియు దిగ్గన [26]సంబళించికొని లేచి నిలిచి క్రోధంబు మదధారల
     గడలు కొనం బుష్కరసీత్కారంబులతో నందంద బృంహితంబులు సౌధ
     గహ్వరంబులం బ్రతిశబ్దజనకంబులుగా నాధోరణప్రయత్నంబునం బ్రగుణితసంరం
     భంబై యంభోజనాభుపైఁ గ్రమ్మఱం గవిసి తొండంబున వ్రేసియుఁ గొమ్ములం
     జీరియు మారిమసంగినట్లు విజృంభించినం జీరికిం గొనక యతండు తద్వధంబొన
     రించువాఁడై యాక్షణంబ.98

శ్రీకృష్ణుఁడు కువలయాపీడం బను నేనుంగును బీనుంగుఁ జేయుట

తే. ఎగసి చరణపాతంబున మొగము దాఁచి, బిగిసి యొకదంతదండంబు బిట్టు వెఱికి
     నిలిచి వజ్రివజ్రంబున నలఘునగము, వ్రేయుచాడ్పున దానన వ్రేసె శిరము.99
క. హరినఖరక్షితిఁ బోలెడు, హరికరగతదంతబహువిధాఘాతములన్
     బొరిఁబొరిఁ బెల్లుగ నొఱలుచుఁ, గరి విణ్మూత్రములు దొరుఁగఁగా నిల మ్రొగ్గెన్.100

తే. హస్తిఁ గూలిచి యాలోన హస్తిపకుని, తలయు నొక్కవ్రేటునన వ్రయ్యలుగ నడిచి
     రెండుపీనుంగులు ధరిత్రితలమున, వికృతతరము లై యుండఁ గావించెఁ బ్రభుఁడు.101
వ. ఇట్లు కువలయాపీడంబు నిహతం బైనం గని యంబకతలంబున నున్న దివిజసిద్ధ
     గంధర్వప్రముఖులు మహామునిపూర్వకంబుగాఁ బూర్వజోపేతుం డగు నయ్యు
     పేంద్రు ననేకవిధంబులం బ్రస్తుతించుచుఁ బ్రమోదభతు లయిరి దేవకీసుతుం
     డును సింహనాదంబు నేసి సింహచంక్రమణంబున ననర్గళగమనుం డై రంగస్థలంబు
     సొచ్చె నట్టియెడ.102
సీ. కువలయాపీడంబు కొమ్ములపోటుల రుధిరంబు తన్మదస్రుతుల బెరసి
     కస్తూరికామిశ్రకాశ్మీరచర్చికాలలితమై భుజము లలంకరింపఁ
     గరములనున్న యాకరినాథురదనదండంబు కాలాభ్రతటస్థమైన
     దుర్ధరోత్పాతకేతువుఁబోలె భయదంబుగా నతిరౌద్రప్రకారుఁ డగుచు
తే. వచ్చుగోవిందు విక్రమవ్యాప్తభువనుఁ, బ్రజ్వలజ్జ్వలనార్కవిభాసిమూర్తి
     నఖిలదైత్యదానవదుర్జయాత్ము నాత్మ, కాలమృత్యువుఁ గంసుండు గనియె నెదుర.103
క. రంగస్థితజనములు వెఱ, నంగంబులు వడఁకఁ జూచి రవ్వభు నితఁ డి
     బ్భంగిఁ గవిసె నిక్కడి కే, భంగ మగునొ యెట్టు లగునొ పాకం బనుచున్.104
వ. అంత నధికక్రోధంబున నుగ్రలోచనుం డగుచు నుగ్రసేనసూనుండు.105
మ. ఘనుఁ జాణూరుఁ డనం ద్రిలోకములఁ బ్రఖ్యాతు న్మహామల్లు న
     వ్వనజాతేక్షణుతోడి బాహుసమరవ్యాసక్తికిం బంచె రా
     ముని మార్పెట్టి పెనంగ జెట్టిబిరుదున్ ముష్టిప్రకారైకలో
     చనదృష్టోద్యము ముష్టికాఖ్యు వెస నాజ్ఞాపించె సాటోపతన్.106
[27]వ. ఇవ్విధంబునం బంపువడి యంధ్రకోసలదేశీయు లగునమ్మల్లు లిద్దఱు నమ్మహావీరుల
     మార్కొనం గడంగి రందులోనఁ జాణూరుండు.107
సీ. అనిమిషేభంబుల నెనిమిదింటిని గూడఁ బెనఁచి మానిసిఁ జేయ బెలసె నొక్కొ
     ప్రళయానలార్కులపస యంతయుమ నావహించి ప్రోవిడఁగ దీపించె నొక్కొ
     పవమాను లందఱ పరమార్థవిధము రూపప్రౌఢి గైకొని ప్రబలె నొక్కొ
     గోత్రాచలంబువీఁకునఁ బట్టుకదలి సర్వావయవస్ఫూర్తి నడరె నొక్కొ
తే. యనఁగలావువేఁడిమి యురయంబుమూర్తి, పెనుపు నఖలాద్భుతంబులై పిక్కటిల్లఁ
     దాన జగజెట్టియై వెండి తనకు నెందు, మాఱుమల్లులు లేకుండ మలసినాఁడు.108
క. తన కప్పుడు నృపకార్యం, బునఁ గలపోరామియెల్ల మోచుటకతనన్
     ఘనసత్త్వశౌర్యములు సూ, ప నవశ్యం బగుటఁ బ్రకట[28]బాహాబలుఁడై.{float right|109}}
వ. ఘోరసన్నాహంబునం జనుదెంచి వారిజోదరుం జూచి యాక్షేపరూకాక్షరం
     బుగా ని ట్లనియె.110

ఆ. పసులఁ గాచి గొల్లపడుచుల వెఱపించి, బిరు దితండ యనఁగఁ బేర్చి తిరిగి
     తట్లు గాదు నాకు నగ్గమై తిదె నేఁడు, దాయ యెందుఁ దప్పిపోయె దింక.111
క. పొరిపుచ్చెద నిప్పుడ యి, న్నరపతియును సభయు మెచ్చ నాచే జముకిం
     కరవర్గము గైకొనుఁగా, కరుదుగఁ గ్రొత్తచెఱ యెలమి నర్భక నిన్నున్.112
క. అనుటయు హరి కోపము నగ, వును బెరసినలోచనాంశువులరక్తత గం
     సుని ప్రళయసంధ్యయై యెం, దును బర్వఁగఁ జూచెఁ గఠినదుర్భరఫణితిన్.113
వ. చాణూరమల్లుతో నల్లన యి ట్లనియె.114
చ. నిను నిఖితార్థకారియుగ నెమ్మది నమ్మినవాఁడు కంసుఁ డె
     య్యనువున గ్రుస్సిపోక బలమంతయుఁ జూపుదుగాక రిత్త ర
     జ్జన బనిదీఱునే వెడఁగ చండితనంబున నీవు గన్నయీ
     యనుపమకీర్తి కింతట సమాప్తి యొనర్పఁగఁ జూప వచ్చితిన్.115
సీ. కడుఁబెద్ద క్రొవ్విన కాళియుతలలెల్ల జదియంగఁ ద్రొక్కినపదతలములు
     దుష్టాత్త్ముఁ డైనయరిష్టుని మెడపట్టి పొరిపోవ విఱిచినభుజయుగంబుఁ
     బిసితాశి యగు కేశిఁ బ్రేవులు వెడలంగఁ గడిమిమై దిగిచిన ఖరనఖములు
     నవినీతిఁ [29]జెనకినకువలయాపీడంబు [30]మోరఁ బగిల్చిన ముష్టిబలుపు
తే. నెఱుఁగ వెఱిఁగిన నిటు నేల యేపు మిగిలి, యెదురు నడతెంతువే నీవు నీక్షణంబ
     విఱిచి ప్రోవుపెట్టెదఁ జూచి వెఱుయు వెఱఁగు, పాటు గదిరి నీయేలిక బ్రమసిపడఁగ.116
వ. అని పలికి పెలుచన భుజస్ఫాలనంబు సేసి కడంగం జాణూరుండును దారుణా
     కారుం డై కవిసె నప్పుడు రంగంబంతయు నిశ్శబ్దం బై చూచుచుండె న య్యిరు
     వుర సుపలక్షించి యాదవులు దమలో ని ట్లనిరి.117
క. శైలనిభుఁడు చాణూరుఁడు, బాలుఁడు కృష్ణుండు వీరిబాహాయుద్ధం
     బాలోకింపఁగ నసదృశ, హేలం బిది యెఱుఁగవలదె యిచ్చటిపెద్దల్.118
వ. మల్లులతోఁ బెనంగువారికిం గాలజ్ఞులై సహాయులై చుట్లనుండి సలిలసేచనాద్యుప
     చారంబులఁ బరిశ్రమాపనయం బొనర్పవలయు బలంబునకుం గ్రియకు నంతరంబు
     నిరూపింపవలయు నిలుపం దగుతఱి యెఱింగి నిలుపవలయు నిది వేడుక పెనకువ
     గాని వీరికిం దమలోన రోషమాత్సర్యాదు లింతకుమున్ను లేవు గావున.119
తే. ఇంతటన మెచ్చి వీరి నుర్వీశ్వరుండు, పసదనం బిచ్చి మాన్చుట పాడి యింకఁ
     బలుకుతెంపును గడఁకయుఁ బంతమునకు, నొదవఁ గైకొన రిదె యెందు [31]నుచితపరత.120
క. అనుమాటలు విని వారికి, వనజోదరుఁ డిట్టు లనియె వలవదు మీ కి
     య్యనువున మును ప్రతిభటుతో, నను నిటు పోరించి చూచినం బగ దీఱున్.121
క. మనసుపదిలంబు గడిమియు, ఘనసత్త్వము శ్రమము పెంపు కల్మియు జయమున్
     బొనరించురంగయోధికిఁ, బనిగలదే యొడ్డుఁ బొడవు బ్రాయము నరయన్.122

తే. పగయ పాటించి వీనిఁ జంపంగఁ దలఁచి, యేను గదిసితి మెచ్చింతు నిట్టు లున్న
     యిందఱును జూడుఁ డూరక యిట్టునట్టు, ననక లావును విక్రమవ్యాప్తి వెరవు.123
వ. [32]కరూశదేశంబునం బ్రభవించి చాణూరుం డనఁ బ్రసిద్ధుం డైనవీనిచేతఁ బెక్కండ్రు
     మల్లులు [33]సిక్కిరి వీనిం బడవైచి యసాధారణం బగుయశంబుఁ బొందెద ననియె
     నిట్లు భాషించి యప్పురుషభూషణుండు విద్వేషిం దలపడినం బెనకువ బెట్టిదం
     బై చెల్లె నంత.124

శ్రీకృష్ణుఁడు చాణూరుం డనుమల్లునితోఁ బోరి వానిం జంపుట

తే. సకలవిజ్ఞాననిధి యగుశౌరి పేర్చి, యహితుచేతఁ జిరాభ్యస్త యైనవిద్య
     కగ్గలంబుగఁ దాను నభ్యస్తవిద్యుఁ, డయ్యుఁ జూపె విచిత్రమార్గాంతరముల.125
క. తిగుచుట త్రోచుట క్రుంగుట, నెగయుకు యెదుఁగుట తొలంగి నిలుచుట సరిగా
     నగధరుఁగునుఁ జాణూరుఁడు, దగిలి తిరుగువిధము లద్భుతము లై యొప్పెన్.126
తే. మూఁపు లొండొంటిఁ దాఁకించు మ్రోత పెల్లుఁ, దలయుఁ దలయును సంధించునులివు పెంపుఁ
     బటుమిధోముష్టిపాతనిర్భరరవంబుఁ, గలసి వజ్రనిర్ఘోషానుకారి యయ్యె.127
క. అఱచేతం బెడగేలన్, జఱిచియుఁ గూర్పరకఠోరజానునిహతులన్
     బఱచియు వారు సముద్ధతిఁ, బఱివోవక పోరి రలఘుపాటవదృఢతన్.128
తే. తఱిమి మెడలంటఁ బట్టుట తమక మొప్ప, దంతనఖరవిదారణదారుణముగఁ
     గడఁకగల్గుట దొడగాళ్లు లడఁచిత్రోచు, టిరువురందును నుగ్రమై యెసఁగెఁ జూడ.129
వ. ఇన్నిచందంబులం జాణూరుకంటె నతిశయంబు చూపుచుఁ గృష్ణుం డప్పటప్పటికి
     సభాసదుల మెప్పించుచుండ నొండొండ మేలు మే లను నెలుంగులు రంగవలభిఁ
     బ్రతిశబ్దద్విగుణితంబు లయ్యెఁ దదనంతరంబ మొగంబునఁ గోపంబు చెమట
     తోడం జేవుఱింపఁగఁ గంసుండు చేసన్న నామ్రోఁత యుడిపి మృదంగాదివాదిత్ర
     నాదంబులను వారించె నవ్వారిజేక్షణురణం బంతరిక్షంబున నంతర్దానగతు లై
     కనుంగొను ననిమిషుల ఋషుల సాధువాదనినాదంబులును గంధర్వకరతాడన
     తరంగితంబు లగుమృదంగనినదంబులుం జాణూరభంజనంబున జగంబులం గావు
     మనుసిద్ధవిద్యాధరాదుల జయజయశబ్దపూర్వప్రార్థనావచోవిరావంబులు నవా
     ర్యంబు లై యుల్లసిల్లె నంత.130
ఉ. చూపఱకోర్కె నిండ రిపుశూరతకుం జనవిచ్చి కొంతసేఁ
     పాపగిదిన్ భుజాసమర మచ్చెరు వారఁగ నిర్వహించి యా
     గోపభటుం డొకింత యెడఁ గోపముఁ గైకొని వైరిసత్త్వవి
     ద్యాపటురూఢి యెంతయును దక్కువగా నొనరించె వ్రేన్మిడిన్.131

వ. అప్పుడ రంగస్థలమంచకప్రకరం బెల్ల నల్లలనాడం బుడమి వడంకె జనంబుల
     చూడ్కులు విన్నఁదనంబు నొందె దెసలు మండెఁ గంసోత్తంసంబునం బ్రధాన
     రత్నంబు భ్రష్టం బై పడియె మఱియుఁ బెక్కుదుర్నిమి త్తంబులు దోఁచె న ట్లతి
     పరిక్షీణప్రాణుం డైనచాణూరుం బొదివి యయ్యదుకుమారవీరుండు ఘోర
     ముష్టిం దన్మస్తకంబు నడుకొనం బొడిచి యెగసి మ్రోకాల నురంబు దాటించె
     నట్టిబెట్టిదంపుఁజేతవలన గ్రుడ్లు వెలికుఱికి పండ్లు దెఱచి నోర ముక్కున నెత్తు
     రులు వెడలి వాఁడు కులిశపాతభగ్నం బైనశైలశృంగంబుభంగిం బడి వికృ
     తంబుగా నొఱలుచు విగతజీవుం డయ్యె నటమున్న.132
క. బలుఁడును ముష్టికుతోడం, దలపడి యమ్మైన పెనఁగి దారుణముష్టిం
     దల గ్రుంగఁబొడిచి వానిం, బొలియించెం గృష్ణసదృశభుజచేష్టితుఁ డై.133
వ. ఇవ్వెధంబున జాణూరముష్టికుల వధియించి రంగతలం బంతయుం దార యై రామ
     కృష్ణు లిద్దఱుం గ్రోధసంరక్తలోచనంబులఁ గంసుదెసఁ గనుంగొనునప్పు డప్పూఁ
     పునకుఁ గంసక్రౌర్యంబునకు నందగోపాదు లగుఘోషజనంబు లందఱుం దల్ల
    డంబుల నందంద మేనులు వడంక నొక్కదెస సుడిగి మునిగి యుండిరి. తక్కిన
     వారునుఁ బుల్లపడి చూచుచుండి రంతఁ134
సీ. మును గన్ననాఁడ [34]దవ్వునఁ బాఱవైచినపట్టిఁ గ్రమ్మఱ గన్నభంగిఁ గనియు
     నంతకప్రతిరూపుఁ డైనచాణూరుదోర్బలము వితర్కించి బ్రదుకు సమ్మ
     కురుబాష్ప[35]నేత్రయై యుసుఱు తల్లడిలంగ నున్నదేవకి యెట్టు లుగ్రభంగిఁ
     బగతునిఁ బరిమార్చి బలితుఁ డై తనకు మా ఱెందును లేక యుదీర్ణతేజ
తే. మమర వెలుఁగునాకృష్ణు లోకాభిరామ, మూర్తిఁ గనుఁగొని వాత్సల్యముగ్ధహృదయ
     యగుచుఁ జన్నులు చేఁపంగ హర్షశీత, లాశ్రువులు కన్నుఁగొనల నిండార నలరె.135
మ. వసుదేవుండును బుత్రు నూర్జితభుజావష్టంభసంభావనా
     రసికుం బాతితశాత్రవుం బ్రముదితభ్రాత్రన్వితుం జూచుచున్
     వెస నానందరసానుభూతివలనన్ సిద్ధుండ పోలెన్ జరా
     వ్యసనం బేమియు లేక యత్తఱిఁ గుమారాకారుఁ డయ్యెన్ మదిన్.136
ఉ. కంసునికొల్వువా రయినకామిను లెల్లను గృష్ణమూర్తి యా
     శంసదలిర్ప ఱెప్పలిడఁ జాలక చూడ్కులు గొల్పుచున్ సభన్
     గంసునియున్కియున్ బహుముఖంబులమల్లులపోరుఁ దద్రిపు
     ధ్వంసము లోనుగా నొకవిధంబు నెఱుంగర త మ్మెఱుంగమిన్.137
వ. అట్టియెడల బ్రతిభటనిపాతనంబున నాతతోత్సాహు లై యాహవక్రియాదోహ
     లం బెక్క నుక్కుమీరి మాఱులేక మలయుచు విలయకాలశిఖి(శిఖా)సంకాశు

     లగు నాజితకాశులం గని యుగ్రసేనసూనుం డుగ్రంబైన యాగ్రహంబునం
     బొమలు ముడివడఁ జెమట మొగంబున ముంపఁ గంపంబు సర్వాంగీణం బై
     యొలయం బెలయు నుచ్ఛ్వాసమారుతంబునం బ్రేరితం బైనట్లు పేర్చిన యుల్లం
     బునఁ బేర్చు క్రోధానలంబు పెనుమంటలపగిది నిగురు నాలోహితలోచన
     రోచులు రంగప్రదేశంబెల్లం బ్రదీప్తంబు సేయ నలుదిశలు నాలోకించి నిజకింకర
     గణంబుఁ బిలిచి యాగొల్పడుచుల నిద్దరం దిగిచికొనిపోయి నగరి వెడలం
     ద్రోవుఁడు నందగోపునిం బట్టి బెట్టిదంబుగాఁ బెక్కుసంకిలియలం బెట్టుండు తక్కిన
     గోషకులను దలలుగోసి వైవుండు నారాజ్యంబున గొల్లం డెవ్వండు మెలంగిన
     మ్రుచ్చులు వడు పాట్లం బఱుచునది గొల్లకుం గల సొమ్ము లన్నియుం బుచ్చి
     కొనునది నాకు నెగ్గొనర్ప వేచియున్న యన్నీచుం గుటిలస్వభావు వసుదేవు
     ముదుసలివారికిం దగని ఘోరక్రూరదండంబున దండితుం జేయుం డని యాజ్ఞా
     పించిన.138
తే. తలఁకి యున్నవా రున్నచోఁ దలలు [36]గట్టి, కొనిరి మఱి ప్రాణములు గుత్తుగుత్తనంగ
     జనని శోకంబు గ్రమ్మఱఁ గన్నుఁ బొదువ, దేవకీదేవి మూర్ఛావిధేయ యయ్యె.139

శ్రీకృష్ణుఁడు కంసునిఁ బుడమిం బడవైచి విగతప్రాణునిఁ జేయుట

చ. కలఁగెడుతల్లిదండ్రులును గారియఁ బొందెడుబంధువర్గమున్
     సొలయుసభాజనావళులఁ జూచి విపక్షపశూపహారసం
     కలనము గ్రోధదేవతకు గ్రక్కునఁ జేయఁ దలంచి రూఢగ
     ర్వలసితబాహుదుస్సహుఁడు వైరిసమాప్తి యొనర్చుతెంపునన్.140
చ. కరిపతి యున్నశైలకటకంబునకుం బటువేగచండమై
     హరిపతి దాఁటునట్లు హరి యారిపుఁ డున్నయుదగ్రసౌధమం
     దిరవలభీతటంబునకుఁ దీవ్రత నుప్పరవీథి దాటి ని
     ర్భరపవనప్రకంపవిచరన్నవనీలవలాహకాకృతిన్.141
తే. రంగమధ్యంబునందుండి రాజుదెసకు, నుఱుకు కృష్ణువేగస్ఫూర్తి యొక్కరుండు
     గానలేకున్కిఁ గనుమాయ కరణియయ్యెఁ, గంసుముందర నిలుచుండఁ గనిరి మరల.142
క. భువిమీఁదఁ గృష్ణుఁ డుండఁగ, దివి వేఱొకకృష్ణుఁ డుప్పతిల్లిపడుటగా
     దివిజారి తలఁచి తలఁకున, నవయవములు సడలఁ బ్రచలితాసనుఁ డయ్యెన్.143
వ. ఆలోన నయ్యదువీరుండు.144
సీ. మణులు [37]రాలఁగఁ జారుమకుటంబు వడ దన్ని వడివెండ్రుకలు వట్టి వ్రాలఁ దిగిచి
     నడుతల యందంద పిడికిట మెదడును గలగంగఁ బొడిచి మ్రోఁకాల నురము
     దాఁకింప నొక్కచేతయఁ జేయలేక నిశ్చేష్టుఁ డై రోజు నిర్జీవుఁ బెలుచ
     హారముల్ ద్రెవ్వఁ గర్ణావతంసము లూడ నత్తఱి నుత్తరీయంబు వీడ

తే. నోర ముక్కునఁ జెవులను ఘోరరుధిర, మొలుక గ్రుడ్డులు వెలుపలి కుఱుక మేడ
     డిగ్గఁ ద్రోచి తోడన డిగ్గి స్రగ్గఁ గేల, గ్రుమ్మె నుసుఱుపోవంగ సక్రొధలీల.145
వ. ఇట్టి బెట్టిదంపుఁజెయిదంబున విగతప్రాణుం డైన కంసుని శరీరంబు రంగద్వారంబునఁ
     బరిఘాకారంబుగా నడ్డంబు దిగిచి కృష్ణుండు కంసుసోదరుం డగు సునాము దెసం
     జూచునంతకుమున్న ప్రలంబాంతకుం డెంతయు రయంబున నద్దురాత్ముం బొదివి.146
క. గొదగొని సారంగంబుం, బొదివినసింగంబుపగిది భూరిబలము పెం
     పొదవంగఁ జేరి చెండా, డి దురాలోకక్రియాపటిష్ఠత మెఱసెన్.147
వ. అప్పు డప్పుణ్యపురుషులమీఁదం ద్రిదశకరవిముక్తం బగు కుసుమవర్షంబు గురిసె
     దివంబున దేవదుందుభులు మొరసె మునుల యాశీర్వాదనినాదంబులును సిద్ధుల
     జయవచోనినాదంబులునుం బెరసి మేదురంబు లై వీతెంచెఁ బ్రత్యర్థిభంజన
     పారీణుం డైన యాపద్మనాభుండు గ్రక్కునం జను పెంచి కంసదళనకఠోరంబు లగు
     కరంబులఁ దండ్రిచరణగ్రహణం బొనర్చిన నతండు గాఢంబుగాఁ గౌఁగిలించి
     దీవించెఁ దల్లికి మ్రొక్కిన నుద్గతనవక్షీరమసృణస్తనం బగు నురంబునఁ గొడుకుం
     గడు బిగియం గదియించి శరంబు మూర్కొనియె నవ్విభుండు మఱియును.148
తే. ఉగ్రసేనునిఁ గని మ్రొక్కి యోలినఖిల, [38]వంశవృద్ధులకును మ్రొక్కి వారు దనకు
     నిచ్చుదీవనల్ గైకొని యింపుమిగులు, వాక్యముల నందఱను హర్షవనధిఁ దేల్చె.149
వ. తదనంతరంబ సకలజనంబులం బోవం బనిచి యగ్రజుండునుం దానును జనక
     మందిరంబున కరిగె బృందారకమునిసిద్ధగంధర్వాదులు గోవిందు విక్రమవర్ణనా
     పూర్ణమనోరథు లగుచు సురపథంబున నుండి నిజస్థానంబులకుఁ జని రంత.150
తే. దితిసుతాంతకు చేఁ జిక్కి దిక్కు లేని, పీనుఁగై రంగవాటంబు పెద్దబయలఁ
     బడిన యక్కంసుకడకుఁ దద్భార్య లెల్ల, నరుగుదెంచిరి వెస నంతిపురము వెడలి.151
వ. అప్పుడు.152
సీ. కరతాడనములఁ జన్గవలపై లత్తుక చట్టలుచఱిచినచాడ్పు దోఁపఁ
     దెగి రాలుహారమౌక్తికములు నశ్రుబిందువు లేర్పఱుపరాకఁ దొందడింపఁ
     నెండెడువాతెఱ నెసఁగుతాంబూలరక్తిమ శోకవహ్ని గ్రక్కెడు తెఱఁగుగఁ
     దూలెడుపయ్యెద దుఃఖాంబునిధిలోని కడలుచందంబునఁ గడలుకొనఁగ
తే. వీడి వెన్నుల వ్రేలేడివేణు లోలి, బెలసి కాలాహినిభములై సొలపుఁ జూపఁ
     బొదువుమూర్ఛల డెందంబు లుదిలకొలుప, [39]నలఁతకొలఁదికి మిగిలె నయ్యంగనలకు.153
క. అందఱుఁ బతిపైఁ బడి పెను, గ్రందుగ నఖిలాంగకములుఁ గనుగొని గౌఁగి
     ళ్లం దొడరఁగ ని ట్లని యా, క్రందన మొనరించి రధికకరుణధ్వనులన్.154
సీ. నృపగంధహస్తివై నీవన్యనృపగంధ మించుకంతయు సైప కింతదాఁక
     సార్వకాలికమదగస్ఫారవిశృంఖలలీల వర్తింపంగఁ గాలుఁ డాత్మఁ

     జల మె త్తి గోకులసంభూత మగుకృష్ణవీరపింహముఁ దెచ్చి విడిచె నీకు
     జేష్టింప లేవైతి చిక్కితి మడిసితి నీపోక లరిది వర్ణింప నధిప
తే. యార్తకరిణీసమాన[40]దురంతదశకు, భోజనంబుల మైతిమి రాజ మమ్ము
     నరయఁదగదె నీమన్నన యకట యెందు, పోయేఁ జెప్పలేవైతివి పోవునపుడు.155

కంసభార్యలు మృతుండయిన పెనిమిటిం బేర్కొని విలాపంబు సేయుట

క. మామీద నీమనంబునఁ, బ్రేమము లేకుండుఁగాక ప్రియబాంధవమి
     త్రామాత్యులు లేరే వా, రేమి [41]గొఱఁతచేసి రెడసి యేఁగితి దివికిన్.156
తే. చిదిమి వై చిననెత్తమ్మిఁ జెనసి వాడి, వందినది నీముఖంబు వివర్ణతార
     కంబులై యొప్పు సెడినవి కన్ను లిట్టి్, శూన్యభావ మే మెమ్మెయిఁ జూతు మనఘ.157
ఉ. ఆరమణీయకుండలము లక్కట యెక్కడఁ బోయె నెంతయున్
     గారవ మేది కర్ణములు గండతలంబుల నంటికొన్న వా
     చారుకిరీట మె ట్లొఱగి స్రగ్గె నరేంద్రత లేదె నీకు నా
     భూరిభుజాంతరాభరణము ల్దెగి యిమ్మెయి ధూళి బ్రుంగెనే.158
మ. దివిజానీకముతోడఁ గూడ ననిలో దేవాధిపున్ విక్రమ
     వ్యవహారంబునకుం దొలంగ నిడి తా వార్ధీశుగేహంబునం
     దు వెలుంగొందుసమస్తవస్తుమణిసందోహంబుఁ జూరాడి తిం
     తవెసం గూల్చెనె మర్త్యుఁ డొక్కరుఁ డమర్త్యప్రాయు నిన్నుం దుదిన్.159
ఉ. వాసవుఁ డల్గి నీభువికి వర్షము మాన్చిన నీవు నవ్వి బా
     ణాసనముక్తదివ్యవిశిఖావలి నంబుదకోటి వ్రచ్చి ధా
     రాసలిలప్లవం బఖిలరంజకమై యొలయంగఁ జేయవే
     నీసరి యెవ్వఁ డిప్టు విధి నిర్దయుఁ డైన వశంబె యెద్దియున్.160
తే. నేలనాలుగుచెఱఁగుల నృపులు నీకు, నధికనమ్రులై తమసొమ్ము లంతవట్టు
     నిచ్చి బ్రతికిరి నీశౌర్య మేల యిట్లు, గోపబాలుని చేఁ జిక్కె భూపసింహ.161
ఉ. చాలెడువాఁడ వెన్నఁడును జావునుఁ జేటును బొంద వంచు నీ
     ప్రాలకుఁ దోయిలొగ్గు టది భాగ్యఫలంబుగ నేము నమ్మి సౌ
     ఖ్యాలసలీల నుండ నది యంతయు బొంకుగఁ జేసి తాండ్రనున్
     వాలినపేర్మి యేది విధవాదశఁ బొందఁగఁ జేఁత పాడియే.162
క. సురపురి మధురకు నెక్కుడె, సురకాంతలు మాకు దొరయె సురభంజన నీ
     వరుగుట యొప్పనిపని వే, మరలుము మామాట వినుము మముఁ గావఁదగున్.163
తే. అకట మీతల్లి ముదుసలి యగ్గలముగఁ, గలదు నీమీఁద నర్మిలి యలఘుచరిత
     యింక నీయమయలమట కేది గుఱుతు, గురుజనప్రీతి సేయమి గుణమె నీకు.164

క. హానాథ హామహారిపు, హానికరణధుర్యశౌర్య హా నిజవంశై
     కానందప్రద యనదల, మైనారము మావిలాప మాలింపఁ గదే.165
క. అని యయ్యింతులు బహువిధ, మునఁ బలవింపంగ దుఃఖమోహాకుల యై
     చనుదెంచెఁ గంసమాత వ, దన మెండఁగఁ గన్ను లశ్రుతతుల మునుంగన్.166
ఉ, నాతనయుండు గంసుఁడు వినమ్రసురాసుమర్త్యలోకుఁ డు
     ద్గీతపరాక్రముం డెచటఁ గీడ్వడి వ్రాలినవాఁడు సూపరే
     యాతని నంచు వచ్చి కమలానన గాంచె యుగాంతశాంతకం
     జాతహితుండ పోలె నవసన్నత నొందిన యమ్మహీవిభున్.167
క. కని పైఁబడి కోడండ్రురు, దనచుట్టును బొదివి యేడ్వఁ దద్దయు శోకం
     బున నంకతలంబునఁ బు, త్రునితలఁ గదియించి యెలుఁగు దొట్రువడంగన్.168
వ. ఇ ట్లని విలాపంబు చేసి.169
సీ. సంసారసుఖములు సర్వంబు సుత సులభంబు లై యుండఁ జిత్తంబులోన
     నొకటియుఁ గైకొన కూర్ధ్వగతికి నీవు కొడుక యిమ్మెయి వేగపడుట దగవె
     తల్లితోఁ జెప్పవు తండ్రిఁ జింతింపవు భామలఁ దలఁపవు బంధుకోటి
     నొల్లవు భృత్యుల నూహింప వూరక సురిగితి విది రాజసుతులవిధమె
తే. యకట వీరవ్రతస్థుండ వై జగమునఁ, బేరుకొన్నవాఁడవు యదువీరుచేతఁ
     గోలుపోయెన నీపేర్మి గోము దక్కి, యెందుఁ జేరుదు రింక నీయేలుజనులు.170
ఉ. రావణతుల్యశౌర్య నిను రామసమానుఁడు గాక యన్యుఁ డీ
     త్రోవలఁ బుచ్చఁగాఁ గలఁడె దుర్దమవృష్ణికులోద్భవుం డొకం
     డీవిపులోర్వి యోమ గలఁ డిం కని చెప్పిరి గాదె మున్న కా
     లావధివేదు లైనబుధు లాతఁడ యీతఁడు పల్కు లేటికిన్.171
వ. అనుచు నమ్మగువ యప్పుడ చనుదెంచి దీనానుం డైననిజవల్లభు నుగ్రసేను
     నుద్దేశించి.172
క. నీపుత్రునిఁ జూచితె ధర, ణీపాలక వజ్రపాతనిహతాద్రిక్రియన్
     రూపఱి వీరశయనసం, ప్రాపితుఁ డైనాఁడు కృష్ణబాహుస్ఫూర్తిన్.173
వ. ఇతనికిం గాలోచితంబు లయినసంస్కారంబు లొనరింప వలవదె రాజ్యంబులు
     వీరభోజ్యంబులు గావున రాజు కృష్ణుండ నీవు పోయి యవ్వీరునిం గని వైరం
     బులు మరణాంతంబులు మనంబునఁ గంసాపరాధంబులకు రోషింపక తదుత్తర
     క్రియలకు ననుమతింపవలయు నని విజ్ఞాపింపు మనియె నంతఁ గంసపతనావసానం
     బగుహరిపరాక్రమకార్యప్రస్థానం బనుసంధించి కృతకార్యుండ పోలె దివసకరుం
     డపరగిరియవలి కరిగె నట్టియెడ.174

సీ. కంసభామినులయాక్రందనధ్వని వీను లందునఁ జిత్తంబునందుఁ గరుణ
     యంకురింపఁగఁ గృష్ణుఁ డఖిలయాదవులమధ్యమున నశ్రువులు నేత్రముల నించి
     యకట యే నధికబాల్యమున సైపక యిట్లు సదిభామినీసహస్రములఁ దీవ్ర
     వైధవ్యశోకదుర్వారవారిధిలోన ముంచితిఁ గంసుని మొఱకడములు
తే. దలఁవచ్చినఁ జంపక తొలఁగ వెవ్వఁ, డాత్మజనకుని నుగ్రబంధాభితప్తుఁ
     జేసి లోకులు నిందింప సిద్ధరాజ్య, విభవ [42]మొక్కఁడు గొన్నాఁడె వీఁడు దక్క.175
క. పాపిదెసఁ గరుణసేయుట, పాపం బని చెప్ప విందుఁ బ్రకటితధర్మ
     వ్యాపారుఁ డైనపురుషునిఁ, జేపట్టుదు రమరులును బ్రసిద్ధప్రీతిన్.176

ఉగ్రసేనుఁడు కంసునకు నగ్నిసంస్కారంబు సేయుటకుఁ గృష్ణుననుజ్ఞ నొందుట

వ. ధర్మహీనుం డగు నిద్దురాత్ము వధియించుట సర్వలోకసమ్మతంబుగా మున్న
     యెఱింగి ప్రవర్తించితి నిటమీఁదఁ గర్తవ్యం బెయ్యది గల దది యెల్ల నెఱుం
     గుదు నన్నియుఁ గొఱంతపడకుండ నిర్వహించెద నని పలుకుచుండ నుగ్రసేనుండు
     శిని ప్రభృతు లగు యదువృద్ధులు పొదివికొని చనుదేరం జనుదెంచి జనార్దను
     ముందట నవనతాననుం డై యశ్రులు దొఱుఁగఁ గొంతసేఁ పూరకుండి యనంత
     రంబ గద్గదకంఠుం డగుచు నతని కి ట్లనియె.177
సీ. అన్న కుమార నీయద్భుతక్రోధాగ్ని కాహుతిఁ జేసి తుగ్రారివీరు
     విక్రమఖ్యాతి వెలయించి తెందును దివ్యమాహాత్మ్యంబు దేటపఱిచి
     తహితసామంతుల నడలించి తఖిలయాదవవంశమునకు నుత్సవ మొనర్చి
     తార్యుల మిత్రుల నాత్మీయపక్షంబు గావించి తెసఁగితి గౌరవమున
తే. రాజ్య మింతయు నీసొమ్ము రాజ వీవు, గుడువఁ గట్టను బెట్టనుఁ గొఱఁత లేక
     యేనుఁగుల గుఱ్ఱముల నెక్కి యెల్లవారుఁ, గొలువ సాధురక్షకుఁడవై కొఱలు మింక.178
క. జితశాత్రవుఁడవు గావున, మతిలోఁ బగదలఁప కనఘ మాబోటులకున్
     గతివై యార్తశరణ్యుం, డితఁ డనఁగా నునికి నీకు నెంతయు నొప్పున్.179
వ. భవదీయక్రోధాగ్నిదగ్ధుం డైన కంసునకుం బ్రేతకార్యం బిప్పుడు కర్తవ్యంబు
     నీవు దీనికి ననుజ్ఞ యిచ్చి పనిచిన నాలుగోడండ్రు, నేను నవ్విధంబు నడపి తోయ
     ప్రదానమాత్రంబు సేసి ఋణమోక్షణంబు నొందెద నటమీఁద జటావల్కలా
     జినధారణం బొనర్చి కాఱడవి సొచ్చి మృగంబులకు నెచ్చెలినై చరింపంగల
     వాఁడ నిదియ నిశ్చయం బనిన విని గోవిందుండు.180
తే. అధిప నీ వింత న న్నిప్పు డడుగ నేల, కాని కార్యంబు సెప్పెద పూని నీవు
     కంసునికిఁ బశ్చిమాధ్వరకార్యసరణు, లకట నడపంగ వలదంటినయ్య యేను.181
వ. ఇంక నొక్కటి యుగ్గడించెదఁ జిత్తగింపుము.182

సీ. రాజ్యంబు పనిలేదు రాజధనంబుపై నాసయుఁ జొరదు నాయాత్మఁ గంసుఁ
     దునుముటయును నర్థదోహలంబునఁ గాదు వంశపాంసనుఁడును వసుధ కెల్లఁ
     గంటకుండును గాన గ్రక్కున నాతని నిట్లు సేసితి లోకహితము గోరి
     యెవ్వారలకు లేని యెసకంపుఁగీర్తి శాశ్వత మయ్యె నింతియ చాలు నాకు
తే. నింక నెప్పటియట్టుల యేను బోయి, యాలకదుపులలోన గోపాలకోటిఁ
     గూడి యాడుచు నట వన్యకుంజరంబు, రీతిఁ గోరినట్టుల విహరించువాఁడ.183
క. మది నది వేఱొకతెఱఁగై, యెదిరికి మెచ్చినదిగాఁగ నిట్లాడుటఁ గా
     దుదితయశా నీవొక్కటి, మదీయవిజ్ఞాపనక్రమము విను మింకన్.184
శా. నీసౌమ్మై పెనుపొందు రాజ్యము దగ న్నీ కీక నీచాత్ముఁ డై
     నీసూనుం డెడ నాక్రమించికొనియె న్నిర్వ్యాజభంగిం దుదిన్
     దోసం బేమియు లేక యంతయును నిన్నుం జేరెఁ గైకొ మ్మనా
     యాసప్రక్రియ నిఫ్డు పొందు మభిషేకానందకల్యాణమున్.185
తే. ఏను గెలిచిన సిరి నీకు నిచ్చుచున్న, వాఁడ నామీఁదఁ బ్రియమును వత్సలతయుఁ
     గలిగెనేనిఁ ద్రోవక చేయవలయు నాదు, ప్రార్థనంబు సర్వాన్వయప్రభుఁడ వీవు.186
క. అనుటయు నుత్తర మేమియు, నన కతిలజ్జావినమ్ర మగువదనముతోఁ
     బెను పమర నున్నయాతని, ననఘుం డాక్షణమ సర్వయదుమధ్యమునన్.187
వ. భద్రాసనంబున నునిచి సముచితంబుగ నభిషేకించె నివ్విధంబున నభిషిక్తుం డై
     యనంతరంబ యయ్యుగ్రసేనుండు.188
చ. హరియును సర్వబాంధవులు నర్హపురోహితభూసురేంద్రులుం
     బురజనులున్ సమేతులుగఁ బుత్రుల కిద్దఱకున్ సమస్తసం
     స్కరణములన్ యథోక్తములుగా నొనరించి కృతార్థుఁడయ్యె ని
     ప్పరుసునఁ గంసుఁ డొందెఁ బితృభావితలోకము నాత్తసత్క్రియన్.189
వ. వాసుదేవుండును నుగ్రసేను రాజుం జేసి సర్వరాజ్యంబునకుం బ్రవర్తకుండు
     దానై యఖిలనియోగంబులు (నభియోగంబులు)గాఁ బ్రయోగించి మధురా
     పురంబు తొల్లింటికంటెను విభవబంధురంబుఁ గావించి ముదంబున నుండి
     యొక్కనాఁ డగ్రజుతో విచారించి.190
మ. జననం బాదిగ నాలలోఁ బెరిగి సంస్కారంబు నాచారమున్
     ఘనవిద్యాగ్రహణంబు లేక యడవిం గారెర్కుచందంబునన్
     జనఁగాఁ గాలము వోయె నింక వలదే సమ్యగ్గురూపాసనం
     బున నాసర్వము గైకొనంగ నియమాభ్యుత్సాహసంపన్నతన్.191
వ. అవ్విధంబు బంధుజనంబుల కెఱింగించి యిద్దఱుం గూడి యవంతిపురనివాసి యై
     యున్న కాశ్యపుం డగు సాందీపనుం డను మహాద్విజునిపాలికిం జని యాత్మీయంబు

     లగుగోత్రనామంబు లెఱింగించి గురుత్వంబునకుం బ్రార్థించిన సంప్రాప్తసమ్మతుం
     డై యతండు వారిం బ్రియశిష్యులంగాఁ బరిగ్రహించి సంస్కారపూర్వకం
     బగుసకలకళాకలాపంబు నొసంగిన.<192

శ్రీకృష్ణబలరాములు సాందీపునియొద్ద సకలవిద్యాభ్యాసంబు సేయుట

సీ. అతిలోకధీగుణోదాత్తులై యన్నయుఁ దమ్ముండు నోలి వేదములు నాల్గు
     నంగంబు లాఱును నఱువదినాలుగుదినములఁ జదివిరి దననుధర్మ
     శాస్త్ర తర్కన్యాయసరణియు గణితగాంధర్వలేఖ్యములు గంధర్వదంతి
     రథశిక్షలును వాసరములు పండ్రెంటను నెఱిఁగిరి సాంగమై వఱలునస్త్ర
తే. నిగమ మేఁబదినాళుల నెఱయఁ గఱచి, రిట్టినిత్యప్రకాశసమిద్ధమహిమ
     సూచి నరరూపధరు లైనసూర్యచంద్రు, లని తలంచె వారల గురుఁ డాత్మలోన.193
వ. మఱియుఁ దదీయప్రభావం బెఱుంగం గోరి తచ్చరితం బరయునెడఁ బర్వకాలం
     బునఁ బార్వతీపతి నతిరహస్యాభ్యర్చనంబుల భజియింప నమ్మహాదేవుం డమ్మహాను
     భావులచేయు సపర్యలు సాక్షాద్భావంబునం గైకొనం గనుంగొని యతండు వీరు
     సామాన్యపురుషులు గా రెయ్యదియే నొక్కదివ్యాంశంబున జనియించినవారు
     వీరిచేత నెంతలెంతలు పను లైనను నగు నని నిశ్చయించె నంత నభ్యస్తసకల
     విద్యుం డై కృష్ణుం డగ్రజసహితంబుగా నాచార్యునకు నమస్కరించి.194
క. ధన్యుల మైతిమి మీకృప, మాన్యగుణోదార నీవు మము నొకయర్థం
     బన్యూనంబుగ నడుగు మ, నన్యసులభ మైన దద్ది యైనను వేడ్కన్.195
చ. అనిన గురుండు నా కనఘ యాత్మజుఁ డొక్కఁడు వానిఁ దీర్థసే
     వనసమయంబునఁ లవణవారిధిలోఁ దిమియొక్కఁ డుగ్రమై
     కొనిచనియెన్ దదాది యగుఘోరపుశోకము వహ్నియై మదిం
     గనలుచు నుండు నక్కొడుకు గ్రమ్మఱిఁ గల్లెడునట్లు సేయవే.196
వ. అ ట్లయిన మాకులం బెల్ల నుద్ధరించినవాడ వై గురుదక్షిణాప్రదులలోన నగ్రగ
     ణన గనియెద వనిన నల్లకాక యని కృష్ణుండు రాముచేత ననుజ్ఞాతుం డై శితాసి
     శరసమేతం బగుబాణాసనంబు [43]గైకొని సముద్రుకడకుం బోయి.197
తే. మహితయగుఁడు సాందీపని మాగురుండు, సుతునిఁ గోల్పోయె నీయందు సూపు మాకుఁ
     దద్విఘాతకుఁ డగు ద్రోహిఁ దడయ కనిన, జలధి సాకారుఁ డై కరంబులు మొగిడ్చి.198
క. పంచజనుం డనుదైత్యుఁ డు, దంచితతిమిరూపధారి యై గురుపుత్రున్
     వంచన హరించి మ్రింగెను, గ్రంచఱ నొప్పింతు వాని ఘనభుజ నీకున్.199

మ. అని యుత్తుంగతరంగహస్తములఁ గ్రూరారాతిఁ దీరస్థలం
     బునకుం దెచ్చిన నవ్విభుండు ప్రసభస్ఫూర్జత్కృపాణాహతిన్
     దనుజున్ వ్రచ్చి గతాసు భూసురసుతుం దత్కుక్షిలోఁ గాన కా
     ఘనసత్త్వంబు శరీరజం బయినశంఖం బొప్పుతో నుండినన్.200
వ. అప్పుణ్యవస్తువుం బ్రియంపడి పుచ్చుకొని తనకుం జిందం బగు నని పరిగ్రహించె
     నద్దేవుం డొనర్చిన నామంబునఁ బంచజనజనితం బగుట నది పాంచజన్యం బన
     నమరాసురమనుష్యలోకంబులఁ బ్రసిద్ధినొందె ననంతరంబ యతండు.201
క. చచ్చినపిమ్మట నెటువో, వచ్చు జముఁడ కాక యెల్లవారికి గతి యే
     నచ్చట నతనిం బట్టఁగ, నచ్చుపడెడిఁ గర్జమెల్ల నని కడుఁ గడఁకన్.202
వ. దక్షిణదిశకుం జని దక్షిణాధీశ్వరుపురంబు సొచ్చి యాసనస్థుం డైనయాసూర్య
     సూనుం గని రోషసంరక్తలోచనుండై నీ వస్మదాచార్యుం డైనసాందీపనికొడుకుం
     దెచ్చినవాఁడవు క్రమ్మఱ రమ్మన నతని నొప్పింపు మొప్పింపక యొప్పనిపనికిం
     జొచ్చితేని నెచ్చటు సొచ్చియు బ్రదుకనేర్చినవాఁడవు గావులు మ్మనిన వడంకుచు
     లేచి నిలిచి విరచితాంజలి యై వైవస్వతుండు.203
తే. పూని సర్వజంతువులను బుణ్యపాప, గతులఁ బుచ్చుట కొకటికే కర్త నేను
     బ్రాణహరణంబు మృత్యువుపని మహాత్మ, తెచ్చె గురుసుతు మృత్యువు దెల్ల మింత.204
వ. దీని నవధరించి నన్ను రక్షింపు మనిన నప్పరమేశ్వరుండు.205
శా. ఏమీ మద్గురుపుత్రుఁ దెచ్చుటయ కా కిబ్భంగినేఁ గ్రుమ్మరం
     గా మాదుఃఖ మొకింతయుం గోన కహంకారంబు పూరించెనే
     వామాచారుఁడు మృత్యు వన్ ఖలుఁడు సావం గోరెఁ గా కేమి యు
     ద్దామక్రోధకృశాను నింకఁ బనుతుం దన్మూలసందాహిగాన్.206
వ. అని పలికి సజ్యం బగుశరాసనంబు దృఢముష్టి నమర్చి విశిష్టం బగుదివ్యబాణంబు
     గైకొనిన నమ్మహానుభావు భవ్యవిభూతికి భీతిం బొంది యత్యంతరయంబున
     మృత్యువు తద్గురుకుమారుం బునరాత్తశరీరుం జేసి తెచ్చి.207
క. వినయగ భీరతలోపలఁ, దనతప్పంతయు నడంగఁ దనుజదమనుచెం
     త నివేదించినఁ దగఁ గై, కొని విభుఁ డనుమోద మాత్మఁ గూరఁగ మరలన్.208

శ్రీకృష్ణుఁడు సాందీపనికి మృతపుత్రుని గురుదక్షిణగాఁ దెచ్చియిచ్చుట

వ. అట్టి మహాప్రభావం బనుసంధించి.209
చ. చిరమృతుఁడై యమక్షయముఁ జెందినవిప్రసుతుండు క్రమ్మఱన్
     సురుచిరపూర్వదేహపరిశోభితుఁ డయ్యె నశక్య మప్రత
     ర్క్యరచన మద్భుతం బసుకరం బొరులెవ్వరి కిట్టిచేఁత యం
     చురుఫణితి న్నుతించె హరి నోలిన సర్వసురాసురాళియున్.210

వ. ఇట్లు క్రమంబున సముద్రదండధరమృత్యువుల సాధించి పాంచజన్యపూర్వకం
     బుగా గురుపుత్రుం బడసి యరుగుదెంచి యా జగద్గురుడు గురువునకు సమర్పించిన.211
శా. తా నాశ్చర్యరసంబులో మునిఁగి గాత్రం బాత్తరోమాంచమై
     యానందాశ్రులతోడ భూసురవరుం డాత్మోద్భవుం గేశవున్
     శ్రీ నిండారఁగ నొక్కకౌఁగిటన యర్థిం జేర్చే యాశీర్వచో
     దానాభ్యర్చితుఁ జేసె వేవిధుల నాత్రైలోక్యసంపూజితున్.212
క. గురుదక్షిణ యిమ్మెయిఁ గడు, నరుదారఁగ నొసఁగి కృష్ణుఁ డన్నయుఁ దానున్
     గురునొద్ద వెండియు గదా, పరిఘాద్యాయుధకళానుభవతత్పరతన్.213
వ. కతిపయదివసంబులు వసియించి యమ్మహాత్ము వీడ్కొని మధురాపురంబునకుం జను
     దెంచె నిట్లు సకలవిద్యాభ్యాసపారీణు లైన వారిరాకకుఁ బురంబు సర్వాలంకార
     సమేతంబు గావించి.214
సీ. వారువంబుల మేటితేరులఁ బొలుపారు నేనుంగులను నెక్కి వేనవేలు
     భంగులఁ గైసేసి బాంధవు లయ్యుగ్రసేనుండు మున్నుగాఁ జెన్ను మిగుల
     మాన్యపురోహితమంత్రిసామంతసీమంతినీపౌరసమస్తభృత్య
     సూతమాగధవందివైతాళికానేకజనసంకులస్ఫూర్తి సంఘటించి
తే. శంఖదుందుభినిస్సాణసరసగాన, నర్తకోత్సవసంభృతానందలీల
     నెదురుకొని తోడి తెచ్చి [44]రయ్యిద్ధయశులఁ, బ్రియము లొండొండ నిండారి బయలువెడల.215
శా. ఉల్లంబుల్ వికసిల్ల మందపవనుం డుద్గంధియై వీచె వ
     ర్తిల్లెన్ భానుఁడు మేఘముక్తవిసరద్దీప్తిప్రతానంబుతో
     నుల్లాసంబు వహించె వహ్నులు విధూమోద్యచ్ఛిఖాశ్రేణి శో
     భిల్లెం బెల్లుగ వాసుదేవుని పురాభిప్రాప్తివేళం దగన్.216
ఉ. ఆతతరాగవేగమున నచ్యుతుచేత సనాథమై వికా
     సాతిశయం బెలర నెలరారె సమస్తపురంధ్రిపూరుష
     వ్రాతము గోగజాశ్వము లవారణఁ బ్రస్ఫుటచేష్టలం [45]బ్రమో
     దాతతహర్షముం దెలిపె నప్పురి యప్పరమోత్సవంబునన్.217
క. లలితాయతనంబులలో, నలఘుసమభ్యర్చనముల నంది తనరువే
     ల్పులప్రతిమలును బ్రసన్నత, కలిమి యెఱింగించె భద్రకాంతిశ్రీలన్.218
క. దీనుఁడు వికలుఁడు జడుఁ డవ, మానితుఁ డాతురుఁడు లేఁడు మధురాపురి నే
     మానవుఁడును గృతయుగసమ, యానుకృతిం బొలిచెఁ దత్సమయ ముజ్జ్వలమై.219
వ. అట్టియవసరంబున.220

క. ఇరుగెలఁకుల మణికాంచన, విరచితహర్మ్యముల నుండి వెలఁదులు ప్రీతిం
     బురుషోత్తముఁ జూచిరి వి, స్ఫురితకుతూహలము లుల్లములఁ దళుకొత్తన్.221
తే. కామినీనేత్రరోచులు గడళులొత్తి, వెల్లువై మీఁదఁ గవియంగ విభుఁడు మెఱసె
     మరగి బృందావనంబునఁ దిరుగునాఁడు, యమునలో నీఁది యాడెడునట్ల పోలె.222
వ. అప్పు డప్పుణ్యాంగనాజనంబులు దమలోన.223
సీ. వ్రేతలు గరగగంగ వేడుకఁ బిల్లఁగ్రో లెనయఁ జేర్చినదె యీయనుఁగుమోవి
     మానంబు వీఁటిఁబో మసఁగి వ్రేతలఁ జిక్కువఱచినయదియె యీకఱటిచూపు
     నింపారువ్రేతల యీఁతకు మిక్కిలి లోఁతైనయదియె యీలేఁతనవ్వు
     వేలసంఖ్యలు గలవ్రేతలచనుదోయి బిగియనొత్తినదె యీపేరురంబు
తే. పూని యితని దేవర యనిరేనిఁ గాక, సోలి చక్కనివాఁ డని చూచిరేనిఁ
     గడఁగి తివుట లుల్లంబులఁ గ్రందుకొనఁగ, నెట్టి[46]యీలువుటాండ్రును నెగ్గుపడరె.224
వ. అనుచుండం బుండరీకాక్షుండు పూర్వజపూర్వకంబుగా వసుదేవుని సదనంబున
     కరిగి తల్లికిం దండ్రికి నమస్కరించి తదాశీర్వచనంబుల నభినందితుం డై విద్యా
     భ్యాసప్రకారంబు సకలంబును బంధుజనమధ్యంబున నెఱింగించి సుఖం బుండె నని
     జనమేజయజనపతికి వైశంపాయనమునివరుండు వివరించిన విష్ణుచరితాత్మకం బగు
     వాఙ్మయం బతిప్రవ్యక్తంబుగ.225
మ. [47]చరితానేకసమీకసాగర సమస్తక్షాత్రజైత్రోద్యమ
     త్వరితానేకరథాశ్వహస్తిసుభటోద్యత్సైన్య దైన్యక్రమా
     చరితానేకసమర్థపార్థివమహాసౌహార్ధనిర్దోషతా
     స్ఫురితానేకగుణౌఘనిర్మలయశఃప్రోత్ఫుల్లదిఙ్మండలా.226
క. నారీరమణరమాత్మజ, నారాయణసదృశ వీరనారాయణ నా
     నారణనర్తితనారద, నారాచక్షుభ్యదన్యసంవరసైన్యా.227
మాలిని. అహితజనకఠోరా యన్నమాంబాకుమారా
     విహితధరణిరక్షా వీరశృంగారదక్షా
     మహితసుజనలోకా మాననీయప్రతీకా
     రహితదురితసంగా రాయవేశ్యాభుజంగా.228
గద్యము. ఇది శ్రీశంకరస్వామిసంయమీశ్వరచరణసరోరుహధ్యానానందసౌందర్య
     ధుర్య శ్రీ సూర్యసుకవిసంభవ శంభుదాసలక్షణాభిధేయ యెఱ్ఱయనామధేయ
     ప్రణీతం బైన హరివంశంబునం బూర్వభాగంబు సర్వంబు నవమాశ్వాసము.

  1. సాధకచారిత్రా; సంయుత నిజమిత్రా.
  2. సమగుణ. (పూ. ము.)
  3. వీర లేతెంచు
  4. సుమనో
  5. సుగుణతనువున చుబుకచుం, బగతి; సుగుణతనువున బకళిలన్, తగిలి.
  6. లోహ
  7. లీల
  8. లీలంగా
  9. యి ట్లెరగి
  10. విను
  11. బూలార్చుడున్
  12. గట్టివాకిది; గట్టువారివి.
  13. వన్నియ
  14. వసనంబువన్నె నవ (పూ. ము.)
  15. చరా
  16. జుత్తి
  17. హర్యశ్వునస్థ్యాయుధా, హననధ్వస్త.
  18. ననవిధ్వస్తమహేంద్రమస్తకవితానప్రౌఢ ఘోరంబుగన్.
  19. లీనమై
  20. గ్రాలెడు కుందనంబునన
  21. నాయోధనౌచిత్యముల్
  22. మహామాత్యు
  23. సుత్తిపర
  24. చింతించి
  25. ప్రబ్బిడిమాటల (పూ. ము.)
  26. నంబుడింపక
  27. ఈ మల్లులను గూర్చి మూలమున నీ క్రిందివిధము గాఁ గలదు. శ్లో. ఆంధ్రమల్లంచ నికృతిం
    ముష్టికంచ మహాబలం. ఆధ్యా. 87. శ్లో.
  28. బాహాధికుఁడై
  29. జేరిన
  30. మొఱవెట్టఁగూల్చిన ముష్టిబలుపు
  31. ఉచితపరుల
  32. చారుకం బనుప్రదేశంబున
  33. గ్రుస్సిరి (బ్రౌను పాఠము)
  34. తప్పున
  35. కంఠివై
  36. గుట్టి, కొనిరి నఱిబ్రాణములు
  37. జారఁగ
  38. వంశ్యులకుఁ బ్రణమిల్లిన
  39. నలఁతకొలఁదికి మీరె నయ్యతివగమికి
  40. దుష్కీర్తు
  41. గొఱంత చేసి రీడితవిధికిన్
  42. విభవముఁ గొనువాఁడు గలఁడె.
  43. ధరియించి
  44. రయ్యిద్దఱను బ్రియంబులందంద నిండారి యలపులెడల
  45. బ్రమాణాతిగ
  46. పొలఁతులు మరువైన సేవపడరె
  47. తరితానేకసమీరసాగర సమిద్ధక్షాత్ర