హరివంశము/ఉత్తరభాగము - పంచమాశ్వాసము

వికీసోర్స్ నుండి

శ్రీరస్తు

హరివంశము

ఉత్తరభాగము - పంచమాశ్వాసము

     మత్కవితాగర్విత
     ధీమద్ గ్రామావళీప్రతిష్ఠితవిభవ
     స్తోమ రిపుభీమ గోమటి
     వేమ సుజనసార్వభౌమ విక్రమరామా.1
వ. అక్కథకుండు శౌనకాదిమహామునులకుం జెప్పె న ట్లివ్విధంబునం గళత్రపుత్ర
     పౌత్రవిశేషంబుల నతిమానుషం బైన త్రైలోక్యదుర్జయపరాక్రమంబున నద్భుత
     క్రమం బైన ధనధాన్యసైన్యదుర్గపరికరంబున నధికదుర్భరం బై పరఁగు మాధవు
     మాహాత్మ్యంబున కచ్చెరువంది యచ్చతురంతమహీమండలంబునం గల మహా
     మండలేశ్వరు లెల్లఁ దత్సంపదలు సూడ వేడుకపడుడెందంబులం దమకంబు లొదవు
     చుండ నుండి రిట్లుండి యొక్కసమయంబున సుయోధనుండు నిజాధ్వరంబునకు
     రావింపఁ గరినగరంబునకు వచ్చి తదనుష్ఠానం బవసానంబు నొందిన యనంతరంబ.2

దుర్యోధనాదిరాజులు శ్రీకృష్ణుని దర్శించుట

క. అందుండి దూతముఖమున, నందఱు సందర్శనేచ్ఛ నచ్యుతునకు నిం
     పొంద నెఱిఁగింపఁగా విని, మందరధరుఁ డగ్గలంపుమన్నన వెలయన్.3
ఉ. రం డని మాఱుదూత ననురాగముగాఁ బనుపంగ వచ్చి రొం
     డొండ రథద్విపాశ్వసుభటోచ్చయచండచమూసహస్రముల్
     చండమయూఖమండలవిలంఘివిశృంఖలభూరజస్సము
     చ్చండసముద్ధతి న్నడువ శౌరిపురంబున కొక్కయుమ్మడిన్.4
వ. ఇట్లు దుర్యోధనాదు లగు ధృతరాష్ట్రనందనులు నూర్వురుం దద్వశవర్తు లగు
     దొరలును బాండవు లేవురుం దదీయబాంధవు లగు ధృష్టద్యుమ్నప్రముఖులుం
     బాండ్యచోళకాళింగులును మొదలుగా నఖిలమహీపతులు పదునెనిమిదియక్షో
     హిణులతోడ నేతెంచి రైవతకప్రాంతంబున నద్దెసం బెక్కుయోజనంబుల పఱపున
     బలంబులు విడియించి వేర్వేఱ సవరణలు చిందంబులు మెఱయ నెఱసియున్నంత.5
మ. బలదేవుండును సత్యకప్రభుఁడుఁ బ్రద్యుమ్నుండునున్ లోనుగా
     బలుపై తో నడువన్ రథేభతురగప్రస్ఫీతసైన్యంబుతో
     బలవచ్చక్రగదాసిసాధనము లొప్పం పెద్దతే రెక్కి యు
     జ్జ్వలవేషంబున శార్ఙ్గి వెల్వడియెఁ దత్సంభావనాభ్యర్థి యై.6

చ. వెలువడిపోయి సర్వపృథివీపతులుం దనుఁ జేరరాఁగ వా
     రలఁ దగుభంగులం గని పురస్క్రియ లోలిన యెల్లవారి క
     గ్గలపుఁ బ్రియంబుతో నడపి గౌరవ మొప్పఁగ వారు సుట్టునుం
     బలసి భజింపఁ జంద్రుఁ డుడుపఙ్క్తులలోఁ జెలువొందుచాడ్పునన్.7
తే. అధికముగ నొప్పి కొలువుండి యధిక భాష, ణములఁ దన్మానసముల కానంద మొసఁగి
     వరుస వివిధమహానర్ఘ్యవస్త్రకోటి, గణన మిగులంగ వారికిఁ గట్ట నిచ్చి.8
క. నావారు నేను ధనమును, మీవారము మీధనంబు, మీమదికిఁ బ్రియం
     బోవీరులార! యడుగుం, డేవైనను దెచ్చియిత్తు నెచ్చటివైనన్.9
క. అని పలికి వారినెయ్యము, దనరఁ బలుకుసదృశహృద్యతమవాక్యములం
     దనమన మలరఁగ గోష్ఠికి, బనుపడి యేపారి యచటఁ బ్రభుఁ డున్నతఱిన్.10
చ. కదలనిక్రొమ్మెఱుంగుపొడ గల్గిన శారదనీరదం బొకో
     యిది యని సంశయించుచు మహీపతు లెల్లను మీఁదు చూడఁగా
     నొదవుపిశంగజూటమును నుజ్జ్వలదేహ మెలర్పఁ దోఁచె నా
     రదుఁడు ముకుందుసద్గుణపరంపర వీణ గదల్చి పాడుచున్.11
వ. తదనంతరంబ సంపూర్ణసుధాకరుండు వసుధాతలంబునకు నవతరించువిధంబున
     దివిజపథంబుననుండి యారాజసమూహంబునడిమికి నవతీర్ణుండై యందఱచేత
     ససంభ్రమసముజ్ఞానంబుల నంజలివిరచనంబులఁ బూజ్యమానుం డగుచు మాధవుం
     గనుంగొని సకలజనశ్రోత్రసుందరం బగుచందంబు గలయెలుంగున గలయం
     గనుంగొని.12
క. అమరులు లోనగుజనములు, [1]నమితాద్భుతకీర్తితో మహాధన్యుడవో
     కమలాక్షు నీవు నీతో, సము లెవ్వరు నిక్కమునకుఁ జర్చింపంగన్.13
తే. అనిన నవ్వుచు నవ్విభుఁ డతనితోడ, ననఘ యద్భుతాత్మకుఁడ నత్యంతధన్య
     తముఁడ నగుదు నే నొకఁడన విమలదక్షి, ణాభ్యుపేతసద్భావన యమరునేని.14
ఉ. నావిని నారదుండు యదునాయక నాచనుదెంచునట్టి కా
     ర్యావధి సిద్ధ మయ్యెఁ బ్రియ మందితిఁ జెచ్చెరఁ బోయి వచ్చెద
     న్నీవును నీమహీవిభులు నిర్భరహర్షము నొందుచుండుఁ డి
     చ్ఛావిహితానులాపసరసస్థితి సౌహృదగోష్ఠి నిచ్చటన్.15
సీ. అని గమనోద్యుక్తుఁ డగుమునీశ్వరుఁ జూచి జననాథు లాజనార్దనునితోడ
     నిమ్మహాతుఁడు వచ్చి యిప్పుడు నిన్ను నుద్దేశించి పలికినతెఱఁగు నితని
     కిపుడు ప్రత్యుత్తర మిచ్చిన విధమును గూఢార్థమైనది గోరి యితఁడు
     నింతన సంతోష మెంతయుఁ గని పోవఁ గడఁగెడుఁ దెలియంగఁ గడిఁది మాకు
తే. నిట్టి యీదివ్యసంకేత మేర్పరించి, తెలుపు తెలుపంగఁ దగునేని జలజనాభ
     యనినఁ గృష్ణుండు మీకు నియ్యతివరుండ, దీని నెఱిఁగించు ననుటయు దేవమునియు.16

నారదుఁడు శ్రీకృష్ణునిప్రభావంబు రాజులకెల్లం దెలియఁజేయుట

వ. వాసుదేవునిశాసనంబు గైకొని నిలిచి సమ్యగ్విహితాసనంబున నాసీనుండై యా
     సర్వమహీపతుల నాలోకించి యి ట్లనియె.17
క. వినుఁ డేను గంగలోపల, ననుపమనియమమునఁ ద్రిషవణాకలితస్నా
     ననిరూఢి నుండి యొకనాఁ, డినుఁ డుదయించుతఱిఁ జోద్య మెంతయు మిగులన్.18
తే. క్రోశమాత్రము పఱపైనకూర్మ మొకటి, శైలకటకంబుచాడ్పున జలధి వెడలి
     దరికి నొయ్య నేతెరఁగ దానిదేహ, మేను జేనంటి నవ్వుచు నిట్టు లంటి.19
క. అక్కజపుమేనితో ని, ట్లొక్కఁడవును శంక లేనియుల్ల మలర నీ
     విక్కడ మెలఁగెదు ధన్యత, నెక్కొని నీయంద నిలిచె నిజము జలచరా.20
చ. చిదియవు కొండ పైఁబడినఁ జీమ చిటుక్కనినం గరంబులుం
     బదములుఁ దోకయుం దలయు బల్వగుపూన్కి నడం తొకింతయుం
     గదలక నిల్చి యొయ్య సురుఁగంబడి పోవఁగ నేర్తు లాగుమై
     నుదకములోని కిట్టితెఱఁ గున్నదియే పెరసత్త్వకోటికిన్.21
చ. అన విని కూర్మ మిట్లను మహాపురుషా ననుఁ జూచి యద్భుతం
     బన నిది యెంత నాదగుకృతార్థత యేటిది మత్సమంబులై
     పెనుపవు సత్త్వము ల్గొలఁది పెట్టఁగరానివి లోఁజరింప సొం
     పెనసినగంగ గాక భువి యెందు మహాద్భుతయుం గృతార్థయున్.22
క. నావుఁడు జాహ్నవిఁ బేర్కొని, నీనద్భుతధన్యభావనిరుపమ వంటి
     న్నావాక్యమునకుఁ గృప న, ద్దేవియుఁ బొడసూపి నవ్వుదేరెడుచూడ్కిన్.23
వ. నన్ను నాలోకించి యన్నా నాతెఱఁ గది యెంత యే నేమి ధన్యురాల నాపాటి
     యేఱులు కొలఁదికి మిగిలినవి యెందునుం జొచ్చి తనయంద యడంగం బొంగారు
     తరంగంబులు నింగిముట్ట నెట్టివారికి నున్నరూ పెఱుంగరాక యున్నమున్నీరి
     నందుగాక యనుటయు.24
క. ఏను సముద్రునిఁ గానం, గా నరిగి భవద్విధంబు గడునాశ్చర్యం
     బోనీరధి ధన్యుఁడనం, గా నన్యుఁడు నిన్నుఁ బోలఁ గలఁడే యనినన్.25
మ. అతఁ డొక్కించుక నవ్వి నన్గుఱిచి ట్లాశ్చర్యతాధన్యతా
     మతికిం గారణ మేమి యుర్వివెలిగా మా కిమ్మెయి న్నేఁడు సు
     స్థితి కీధాత్రియ ధాత్రి గాదె త్రిజగజ్జీవాలికిం గాన న
     ద్భుతయున్ ధన్యయు నివ్వసుంధరయకా బుద్ధిం దలం పొప్పగున్.26
తే. అనిన నగుఁగాక యని కౌతుకాతిశయము, తోడ నద్దేవి నేను సంస్తుతులఁ దెలచి
     యరిది యెంతయు ధన్యవు ధరణి వైతి, లోకధారణంబున నీవు లోకజనని.27
మ. క్షమ నీయంద ప్రతిష్ఠఁ బొందినది నిక్కం బెవ్వరున్ లేరు నీ
     సము లస్నం బొడసూపి నిల్చి హసితాస్యం బొప్ప భూదేవి సం

     యమిలోకోత్తర [2]మామఃస్థితికి గోత్రాదుల్ మహాసత్త్వతా
     సముదీర్ణాత్ములు హేతుభూతములు తత్సంధార్య నే నెప్పుడున్.28
ఉ. వీరలయందుఁ గానఁబడు వేయువిధంబుల నద్భుతంబు లిం
     పారఁ బ్రదేశభేదమున నంతరముల్ జనులం దొనర్చి నా
     మేరలు దారయై నిలిచి మెచ్చగు పెంపున నుల్లసిల్లుచు
     న్నా రటుగానఁ గీర్తన యొనర్చుట కర్హులు వీరు నావుడున్.29
క. కులగిరులఁ జూచి యద్భుత, ములు మీచందములు ధన్యమూర్తులు హేమా
     దులకు బహురత్నములకును, లలితఖనులు మీరు భువనలాలితమహిముల్.30
వ. అన నప్పర్వతంబు లయ్యా యిట్లనకు మే మెవ్వరము విశ్వంబునకు నాధారంబు
     పితామహుం డున్నవాఁడు తదీయసృష్టిపరమాణువు లగు మాదృశులకుఁ
     బ్రశంస యెంతదవ్వు పరమాద్భుతంబు నధికధన్యంబు నగు మహాభూతం బతండ
     పొ మ్మనుటయుం గమలగర్భుపాలికిం బోయి ప్రణతుండనై కరంబులు మొగిచి.31
మ. అతిమాత్రాద్భుతధన్యదేవుఁడవు నీ వన్యుండు నీతోడితు
     ల్యత కిం దెవ్వఁడు దేవదైత్యనరతిర్యక్సంచయస్థావర
     ప్రతతిన్ లీలమెయిం దలంపునన యుత్పాదింతు నిన్నాద్యదే
     వతగాఁ జూచుట గాదె చూపు మునిగీర్వాణార్చితాంఘ్రిద్వయా.32
క. అనిన నుదరిపడి యతఁ డి, ట్లను నద్భుతధన్యపదము లాడకు నాది
     క్కున నాకంటెఁ గలవు విను, మనఘా యత్యద్భుతములు నతిధన్యములున్.33
వ. అట్టి ప్రభావంబులు గలయవి వేదంబులు సూవె నాకును సత్కారార్హంబులు
     లోకతారకంబులు ఋగ్యజుస్సామంబు లస్మద్బుద్ధిబలంబు నుపబృంహితంబు సేయు
     ననినఁ దచ్చోదితుండ నై వేదంబుల నారాధించి సాక్షాత్కారంబు నొందించి.34
తే. ధర్మములు విప్రులకును నాధారభూత, మైనమీపేర్మిచే లోకయాత్ర నడచు
     నద్భుతాతులు ధన్యులు నరయ మీర, బ్రహ్మవాక్యంబు తెఱఁ గిది భవ్యులార.35
క. అనవుడు వేదములు తపో, ధనవర యాశ్చర్యధనదశ కర్హులమే
     యనుపమమహత్త్వకవితము, లనంతములు యజ్ఞములు సమగ్రోదయముల్.36
వ. ఏము గల్గుటయెల్లను యజ్ఞార్థంబ యజ్ఞంబులు లేనినాఁడు మాకలిమియు నిరర్థ
     కంబ మాకుం బరమపరాయణంబులు యజ్ఞంబుల కా నెఱుంగు మనిన నేనును
     యజ్ఞంబులం బ్రత్యక్షంబు గావించి.37
క. దేవతలు మొదలుగాఁగల, యీవిశ్వము తృప్తినొంది యెసఁగుట యరయన్
     మీవలనఁ గాదె యద్భుత, మేవిధి మీవిధము ధన్య మెంతయు నెందున్.38
వ. అగ్నిష్టోమాదిసంజ్ఞలం బరఁగి భోగైశ్వర్యస్థితికిఁ గారణంబు లై మీర లొప్పెద
     రిప్పరమప్రభుత్వం బే మని కొనియాడుదు ననిన నాతో నధ్వరంబు లి ట్లనియె.39
క. మాకాత్మ విష్ణుఁ డాతఁడు, గైకొని నడపంగఁ జెడక కలుగు నిరుపమో

     త్సేకం బగ్నియు హవియు, ననాకులమంత్రశుభతతులు వడఁతు మునీం ద్రా.40
వ. ఇట్లగుటం జేసి యాశ్చర్యధన్యశబ్దంబులు రెంటికి వాచ్యుం డమ్మహాపురుషుం డని
     చెప్పిన నధ్వరంబుల పలుకులు విని యిచ్చటికిం జనుదెంచి యే నిప్పరమేశ్వరుం
     గని మున్ను కూర్మప్రభృతులతోడం బరంపరామార్గంబునం బలికిన యట్ల పలికిన
     నిద్దేవుండు తాన యజ్ఞమయుండ నగుదు నయ్యజ్ఞంబును సంపూర్ణదక్షిణతోడం
     గూడినం గాని యస్మదాత్మకంబు గానేర దని యానతిచ్చె నవ్వాక్యసమాప్తి
     యితనియందఁ గన్నవాఁడ నై సంతోషించి యిక్కడఁ దడయ నొండుపని
     లేదుగా పోయి వచ్చెద నంటి నని సవిస్తరోపన్యాసం బొనర్చి నారదుండు.41
క. ఆ రాజన్యులు దన్నును, గౌరవమునఁ బూజసేయఁగా వీడ్కొని య
     న్నారాయణుచేతను స, త్కారము గని చనియె గగనగతి నాత్మేచ్ఛన్.42
వ. తదనంతరంబ.43
మ. నరనాథోత్తము లెల్ల విస్మయనిమగ్నస్వాంతు లై సంయమీ
     శ్వరుఁ డి ట్లొప్పుగఁ బల్కి తెల్పునె జగద్వంద్యుండు గోవిందుసు
     స్థిరమాహాత్మ్యవిశేష మిట్టి దగునే జిష్ణుండు గృష్ణుండు శ్రీ
     కరుఁ డీదృగ్విభవుండుగా నెఱిఁగినం గల్యాణముల్ బ్రాఁతియే.44
తే. మనము నిర్దోషమతులమై మంటి మనుచు, నమ్మహాతేజునకు వినయమున మ్రొక్కి
     [3]భక్తి గీర్తించి రంతఁ దత్ప్రభుత కాత్మ, నలరి కొంద ఱెంతేనియు నద టడంగి.45
క. ఇదియు నదియు నేటిది యని, మదిఁ గొందఱు మత్సరంబు మానక మానో
     న్మదమానసులై యుండిరి, సదోషయగుబుద్ధివినయసంగతి యీమిన్.46
వ. వారలు సముచితసల్లాపానంతరంబ ప్రియపూర్వకంబుగా నద్దేవు వీడ్కొని నిజ
     దేశంబులకుం జనిరి జలజోదరుండు సమస్తబంధుజనసమేతంబుగాఁ బురప్రవేశం
     బొనర్చి సుఖం బుండె నని చెప్పిన జనమేజయుండు వైశంపాయనున కి ట్లనియె.47
శా. మాపెద్దల్ హరిసంశ్రయంబునన మున్ మన్నారు దత్కీర్తనా
     లాపప్రీతిఁ గృతార్థజన్ములము తెల్లం బేము న ట్లౌట మా
     కేపారన్ భువనద్వయంబున ధ్రువం బిష్టార్థసంప్రాప్తి యై
     [4]పాపం బేజనుఁ జెంద దొండొకఁడు దాఁ బ్రత్యూహ మీపేర్మికిన్.48
చ. మునివర యుష్మదీడితసముజ్జ్వలవిష్ణుకథాసుధారసం
     బనయముఁ గ్రోలి క్రోలి యిటు లాత్మ యొకింతయుఁ దృప్తి బొంద దిం
     కను వివరింపవే లసదగణ్యగుణౌఘవిచింత్యుఁ డమ్మహా
     త్మునిచరితంబు లుద్ధత విమోహతమోహరణప్రవీణముల్.49

అర్జునుఁడు ధర్మరాజునకు శ్రీకృష్ణుని ప్రభావంబు చెప్పుట

వ. అనిన వైశంపాయనుం డమనుజనాయకున కి ట్లను భీష్ముఁడు శరతల్పగతుం డై
     ధర్మనందనునకు ననేకపుణ్యకథాకథనం బొనర్చు సమయంబునం బ్రసంగాధీనం బై

     ధనంజయుండు మాధవుమాహాత్మ్యంబునకుం బ్రత్యక్షపరిజ్ఞానం బైనది యెఱిం
     గించె నవ్విధంబు వినుము.50
క. మునిపతులును జననాథులు, ననేకు లతికౌతుకప్రయత్నంబులతో
     వినుచుండఁ గృష్ణసఖుఁ డి, ట్లనియె నిజాగ్రజున కధికసాదరవినతిన్.51
మ. ఒకనాఁ డేను భవన్నియోగమున సర్వోర్వీశ యాత్మప్రమో
     దకలీలం జని వృష్ణివంశతిలకుం ద్రైలోక్యవంద్యున్ హరిన్
     సకలేశుం గని యాదవప్రతతిచే సత్కారముల్ గాంచి త
     త్ప్రకటావాసమునన్ వసించితి మనోరాగావహప్రక్రియన్.52
తే. ద్వారకాపురి మరిగి యెంతయును గాల, మిట్టు లుండఁగ నొకతఱి నెసఁగు పేర్మి
     నచ్యుతుండు దీక్షితుం డయ్యె నధ్వరార్ధ, మనుపమద్విజముఖ్యసాహాయ్య మమర.53
క. యజ్ఞమును యజ్ఞకర్తయు, యజ్ఞఫలప్రదుఁడు నైనహరి యొప్పారెన్
     యజ్ఞసమయమునఁ బ్రాక్తన, యజ్ఞాకరులకును గీర్తి యతిశయ మొందన్.54
సీ. పశువులు యూపసంబద్ధంబులై యొప్పఁ ద్రేతాగ్నిచయ మొప్పె దీప్తముగను
     నధ్వర్యువిహితక్రియావళి యలరారె హోతృప్రవర్తితాహుతులు వెలయ
     నుద్గాత యొనరింప నుదితసామోదితప్రస్తుతు లమరులు ప్రస్తుతింప
     విధికలాపంబులు వీక్షించుబహుసదస్యుల జాగరూకత సొంపుమిగుల
తే. భక్ష్యభోజ్యాదితర్పణభవ్యవస్తువితతి లోకైకసులభసంప్రీతిఁ దనర
     భువనసంపూజనీయమై పొలుపు మిగిలె, యదుకులాబ్ధిచంద్రునిసమిద్ధాధ్వరంబు.55
వ. అమ్మహాయజనసమయంబున జానపదుం డగుభూసురుం డొక్కరుం డరుగు దెంచి
     దీక్షాస్థానంబున నాసీనుం డైనవాసుదేవుసమ్ముఖంబున నిలిచి దీనాననుం డగుచు
     ని ట్లనియె.56
శా. దేవా విన్నప మస్మదీయసతి యర్థిం బుత్రులం గానఁ దో
     డ్తో వారిం బ్రసవక్షణంబునన యెందో యెవ్వఁడో కొంచు వే
     పోవున్ మువ్వుర నివ్విధంబునన కోల్పోఁ బాలిదై నొంచె న
     ద్దైవం బిఫ్డు చతుర్థగర్భ మిటమీఁదం బ్రొద్దు లాచూలికిన్.57
క. నీవు సకలజగతీర, క్షావిధి కధికారి వట్లు గావునఁ బ్రభుతన్
     గావుము గర్భస్థార్భకుఁ, గావింపు మభీతిదానకరణము కరుణన్.58
క. ఏధర్మము గాచిన ప్రభుఁ, డాధర్మమునందు నాలుగవునంశము ని
     ర్బాధముగఁ బొందుఁ దెలియని, దే ధర్మధురీణ యివ్విధి భవన్మతికిన్.59
వ. అనిన వాసుదేవుం డవ్వసుమతీదేవున కి ట్లనియె.60
ఆ. కావవయ్య యనినఁ గరుణ నెవ్వరినైనఁ, గాచు టపరిహార్యకార్య మెందు
     నెలసి విప్రజాతియెడరు సయ్యనఁ బాయఁ, జేయవలయు నేమి చెప్ప ననఘ.61
క. ఈవిధము వినినయప్పుడ, వేవే కడఁగంగఁ దగవు విడు మిప్పుడు దీ

     క్షావిధి నున్నాఁడం గ్రియ, యేవిధమో యనువిచార మంతయుఁ బొడమెన్.62
వ. ఏమి సేయుదు నని చింతించునమ్మహాత్మునితో నేను సవినయంబుగ.63
క. ననుఁ బంపుము భూమిసురేం, ద్రునియాపద యపనయించి రూఢిగ నీనే
     మ్మనమునకు సంప్రమోదం, బొనరించెద నంటి ననిన నొయ్యన నగుచున్.64
వ. అద్దేవుండు నీకు నిప్పని యొనర్ప శక్యంబె యనుటయు నొక్కింతసిగ్గునం దల
     వాంచినం జూచి యైన నేమి యొక్కొండవ చనవలవదు రామప్రద్యుమ్నులు
     దక్కఁ దక్కినయదువీరుల సాత్యకి మొదలుగాఁ దోడ్కొని సైన్యంబుల గొని
     చను మని వీడ్కొలిపిన.65

అర్జునుఁడు బ్రాహ్మణకుమారుని రక్షింపఁబోవుట

మహాస్రగ్ధర. గజవాజిస్యందనౌఘోత్కటసుభటసమగ్రస్ఫురద్భూరిఘోర
     ధ్వజినీసన్నాహ మొప్పం దరతరమ మహాధన్యులై యోధు లిద్ధ
     ధ్వజరాజీరమ్యలీలల్ దనర నకువ నుద్యద్రథస్థుండనై యా
     ద్విజవంశేశుండు మున్నై తెరువిడఁ జనితిం దీవ్రయానోగ్రభంగిన్.66
వ. ఇ ట్లరిగి తదీయగ్రామంబు నేరి తన్మధ్యంబున నఖిలయదువీరసమేతంబుగా విడిసి
     సైన్యంబుల నూరిచుట్టును విడియించి యందఱమును విశ్రాంతవాహనులమై
     యున్నంత.67
చ. ఖరకరుఁ డున్నదిక్కున సృగాలఖగావలి రూక్షఘోర[5]దు
     స్తరముగఁ గూయఁ జొచ్చె ఘనసంధ్య యకాలమునం దలిర్చె నం
     బరమున భానుఁ డెంతయుఁ బ్రభారహితత్వము నొందె నుల్క భీ
     కరముగ మ్రోయుచుం బడియె గాఢపరాభవభంగిఁ దెల్పుచున్.68
క. అంతయుఁ గనుఁగొని యే మ, త్యంతసముత్సాహ మమర నాయితపడి యు
     న్నంత ధరణీసురోత్తమ, కాంతకు నయ్యెం బ్రసూతికాలం బనఘా.69
వ. అతండును మా కవ్విధం బెఱింగించె దదీయసూతికాసదనంబు మహారథులు
     సజ్యశరాసను లై రక్షించి రట నర్ధరాత్రసమయంబున.70
సీ. బ్రాహ్మణికడుపులోపలనుండి వెలువడినప్పుడ చెలఁగి యందంద యేడ్చు
     బాలకు నేడ్పు లేర్పడ వింటి మంతన పొరిఁబొరి నదె పోయెఁ బోయెఁ జెడితి
     మనుచు నాక్రందించునంగనాజనులయార్తధ్వను లొకట నుద్గతము లయ్యె
     నాలోన వీ తెంచె నర్భకురుదితంబు పలుమాఱు మఱియు నంబరతలమున
తే. నేను మొదలుగ నొండొండ యొసఁగునంప [6]వెల్లివఱపితి మావియద్వీథి కలయఁ
     గాన మొక్కని నెందుఁదాఁకదు దగులదు, ఱిచ్చవడి నిల్చితిమి వెఱ ముచ్చముడిఁగి.71
క. ముదుసళ్లు[7]ను ముత్తవ్వలు, మొదలుగ మముఁ బెక్కుచందముల మర్మంబుల్
     గదలఁగఁ బొడిచిరి మాటలఁ, బదపడి చనుదెంచి రోషపరుషాకృతి యై.72

వ. భూదేవుండు నన్ను నధిక్షేపించి యి ట్లనియె.73
ఉ. నిక్కము బంటవై యపుడు నీరజనాభునిముందటం గడున్
     మిక్కిలి మాటలాడి యిటు మేకొని వచ్చితి కార్యభార మీ
     వక్కట నీవశంబె భువనైకధురీణుఁడు దానవాంతకుం
     డెక్కటి చేయుసేఁత యిటు లెందఱఁ గూర్చియుఁ జేయ నర్జునా.74
క. పురుషోత్తముతో నెప్పుడుఁ, బురుడీతం డండ్రు పోలఁబోవునె నీకున్
     హరికి వీను హస్తిమశకాం, తర మెన్నఁడు రజ్జు లింకఁ దక్కుము కుమతీ.75
తే. కావ నోపుదు నని వచ్చి కావవై తి, ధర్మరక్ష సేయనివాఁడు ధర్మహాని
     యందుఁ జతురంశభాగియ ట్లగుట నీకుఁ, జెందెఁ బాపంబు నేమియుఁ జెప్పనేల.76
క. మోఘము నీగాండీవము, మోఘము దోర్బలము శరము మోఘము నీకున్
     లాఘవము బలిసే నాత్మ, శ్లాఘ కడిచిపడక చనుము చక్కఁగ మగుడన్.77
వ. అని పలికి క్రమ్మఱిఁ గృష్ణుపాలి కరిగె నమ్మహీదేవుపిఱుందన యేమును ససై
     న్యులమై లజ్జాశోకభరంబుల నవనతాననుండ నైన నన్నుం గనుంగొని నారాయ
     ణుండు దీని కింత యేల వేఱొకటి గల దది పిదప నెఱింగించెద సంతాపంబు
     వలవ దని యాశ్వాసించి దారుకుం బిలిచి తేరాయితంబు సేయు మనిన నతండు
     శైబ్యసుగ్రీవమేఘపుష్పవలాహకంబు లనునాల్గుతురంగంబులం గట్టి గరుడ
     ధ్వజం బెత్తి దివ్యం బగురథంబు దెచ్చినం జూచి.78
క. ననుఁ బ్రియమున సారథ్యం, బునకు నియోగించి విప్రపూర్వంబుగ నె
     మ్మన మలర నెక్కి రభసం, బునఁ జనఁగాఁ దొడఁగె నర్థపునిదిక్కునకున్.79
క. ఓలి నరణ్యములు మహా, శైలంబులు నదులుఁ గడచి చని కనియెఁ బ్రభుం
     డాలోలవీచివిస్ఫుట, వేలావాచాలమైన విపులార్ణవమున్.80
మ. తనయాకారముతోడ సాగరుఁడు మోదంబార నర్ఘ్యంబు వే
     గొని గోవిందునిఁ గాంచి యానతశిరస్కుండై మహాభాగ యే
     పని యేఁ జేయుదు నానతి మ్మనినఁ దత్ప్రత్యాహృతం బైనపూ
     జనముల్ గైకొని యాదరం బెసఁగ నాసర్వేశ్వరుం డంబుధిన్.81
వ. ఆత్మీయరథంబునకు ననర్గళం బగుమార్గంబిడు మనుటయు నాసముద్రుండు కృతాం
     జలియై దేవా దేవర నాయందు లబ్ధగమనుండ వైతివేసి నన్యులుం దమలావునఁ
     దెరువుకొనఁ గడఁగుదురు నీవు నన్ను నలంఘ్యసలిలుంగా బ్రతిష్ఠించి తవ్వి
     ధంబునకు విపరీతంబుగా నవధరింపఁ దగునే యనుటయు నతండు.82
మ. విను నాచేసినచేఁత [8]చేయఁగలఁడే వేఱొక్కరుం డేల యి
     ట్లన విప్రార్థము నస్మదర్థమును జేయంజాలు దెబ్భంగి నీ

     కనఘా యొండువిచారముల్ వలదు తోయస్తంభముం జేయు మేఁ
     జనఁగా నెప్పటియట్లయై నిలువు నైజస్ఫూర్తి శోభిల్లఁగాన్.83
వ. అని యారత్నాకరు నొడంబఱిచి కడచి యుత్తరకురుభూముల నతిక్రమించి
     గంధమాదనశైలంబున కరుగునమ్మాధవుం గానవచ్చి జయంతంబు వైజయంతంబు
     నీలంబు శ్వేతంబు ఇంద్రకూటంబు కైలాసంబు ననుపర్వతంబు లాఱును మహా
     మేరువుం బురస్కరించికొని యనేకధాతుచిత్రితంబు లగునిజగాత్రంబు లుల్లసిల్ల
     నిలిచి పనియేమి యానతిచ్చి మముం బనుపు మనుటయుఁ బరమపురుషుండు.84
క. మద్రథవేగంబునకును, భద్రం బగుమార్గ మిచ్చి పాయుఁ డనిన న
     య్యద్రులు నొదుఁగుటయును నస, ముద్రగతిం జనియె ముదితమూర్తిఁబ్రభుండున్.85
తే. మేఘసంఘాతములలోన మిహిరమండ, లంబు సనుభంగిఁ బృథులశైలములనడుమఁ
     దగులువడ కేఁగువిష్ణురథంబు సూచి, మ్రొక్కి వినుతించె ననిమిషమునిగణములు.86
క. అటపోవఁ బోవఁగా వెలుఁ, గెటుపోయెనొ పోయెఁ బోయి యేపారెడు చీఁ
     కటిఁ జొరబడితిమి గడుసం, కట మగు పెనురొంపి సొచ్చుకరణి నరేంద్రా.87
తే. అవులఁ దాఁటిపోవనురాక యద్రికరణిఁ, గఠిన మై యాఁగె నపు డంధకారపటల
     మెంతయును భీతిఁ బొందితి నేను రథ్య, ములును రథ మీడ్వఁగా లేక ముచ్చముడిఁగె.88
క. అంత నసురమర్దియు దు, ర్దాంతసుదర్శనకరాళధారాహతి నా
     సంతమసమంతయును నిం, తింతలుతునియలుగ నడిచి యెడలించి వెసన్.89
క. చననిమ్ము రథం బని ననుఁ, బనుచుటయును గొంకు దేఱి పఱిపితిఁ దే రెం
     దును దాఁకుదగులు లే క, య్యనుపమహరు లద్భుతంబులై లీలఁ జనన్.90
వ. ఇట్లు కొలఁది కానరానిదవ్వు కొండొకవడి నరిగి యగ్రభాగంబున.91
చ. అలఘుసహస్రభానుతుహినాంశుకృశానులు వేనవేలుల
     క్షలు దమలోపలం గదిసి గట్టిగఁ బ్రోవయి యున్నచాడ్పునం
     జెలువయి దివ్యదృష్టులకుఁ జెందను జేరను రానియద్భుతో
     జ్జ్వలదురతిక్రమోగ్రవిభవం బగుతేజము గంటి మేర్పడన్.92
క. కన్నంతన గోవిందుఁడు, నన్నును బ్రాహ్మణునిఁ జూచి నవ్వుచు రథమున్
     గ్రన్నన డిగి చని చొచ్చె స, మున్నతతద్దీప్తికూటముం జోద్యముగాన్.93
క. ఎక్కడి వెలుఁ గిది యివ్విభుఁ, డొక్కఁడ యిట సొచ్చి నెట్లొకో తెఱఁ గనుచున్
     వెక్కసపడియెడుమా కతఁ, డొక్కముహూర్తమున మగుడ నొయ్యనఁ దోచెన్.94

శ్రీకృష్ణుఁడు బ్రాహ్మణునకు మృతపుత్రదానంబు చేసి పంపుట

చ. మును చనియున్న బాలకులు మువ్వురుఁ దత్క్షణజాతుఁ డొక్కఁ డి
     ట్లొనరు మహీసురేంద్ర సుతు లొక్కొటి నల్వురఁ దెచ్చి యిచ్చెఁ ద
     జ్జనకున కమ్మహాత్ముఁ డతిసమ్మదవిస్మయవారిరాశిలో
     మునింగితి నమ్మహాద్విజుఁడు మున్నుఁగ నేను నృపాలపుంగవా.95
క. మముం దోడ్కొని యరదము, గ్రమన మును సన్న తెరువు గైకొని మగుడన్
     నెమ్మన మలరఁగఁ నాత్మపురమున కేతేంచె విభుఁడు రమ్యస్ఫూర్తిన్ 96
వ. ఇవ్విధంబున నమ్మహాకార్యం బర్ధదివసంబులోనన సమాప్తం బగునట్లుగాఁ జను
     దెంచి యవ్విప్రవరునకు సత్కారపూర్వం బగుభోజనంబు సంఘటించి యభిమత
     ధనధాన్యంబులఁ దృప్తిఁ గావించి యతని వీడ్కొలిపి యనుతరంబ మున్ను సమా
     రబ్ధం బైనయధ్వరంబును సమాప్తి నొందించి యొక్కనాఁడు.97
సీ. స్నాతుఁడై త్రైలోక్యచక్షు నంబుజమిత్రు నర్ఘ్యార్పణాదిసమర్చనమున
     భావించి మధ్యభూదేవసహస్రంబునకు నభీష్టాన్నదానం బొనర్చి
     యేను సాత్యకి యాదిగా నర్హు లగువారిఁ దనబంతి నిడికొని దనుజమథనుఁ
     డంచితాహారకృత్యమునఁ బ్రమోదించి విలసితాలం కారములు దలిర్పఁ
తే. గొలువుకూటంబునకు వచ్చి యెలమి నగ్ర, పీఠమున నుండి యేము సంప్రీతితోడ
     బలసియుండ విచిత్రసంభాషణముల, నలరుచుండఁగఁ దగఁ బ్రసంగాంతరమున.98
వ. ఏ నవ్విప్రబాలకులపోక కేమి కారణం బెవ్వఁడు గొనిపోయి రెక్కడ నుండి రని
     యడిగితి నడిగిన నద్దేవుండు నా కి ట్లనియె.99
మ. వినుమా విశ్వచరాచరంబులకు నావివిర్భావదుర్భావముల్
     పొనరింపం బ్రభుఁడైనయాద్యుఁడు మహాభూతంబు భూతేశ్వరుం
     డనిరూప్యాకృతి యప్రమేయవిభవుం డద్వంద్వుఁ డస్పందుఁ డెం
     దును దానై తనరారుతత్త్వము జగద్గుర్యుం డహార్యోన్నతిన్.100
క. ప్రకృతి యనఁ బురుషుఁ డనఁగా, సకలమునకు నాశ్రయంబు సాంఖ్యులకును యో
     గికులంబునకును గమ్యం, బొకఁడై చనుచోటు శశ్వదుదితుఁడు బుద్ధిన్.101
క. ఘోరతమఃపారమున ను, దారంబై తోఁచుపరమధామము సంసా
     రోరురుజకు దివ్యౌషధ, మారబ్ధసవిద్ధకర్మ మగుధర్మ మిలన్.102
వ. అట్టిపరమేశ్వరుండు మదీయదర్శనం బపేక్షించి కృష్ణుఁడు బ్రాహ్మణప్రయోజనం
     బనుష్ఠేయం బగునేని సర్వంబు నుజ్జగించి యెల్లభంగులం జనుదెంచు నిదియ
     యుపాయం బని విప్రబాలకుల నుద్భవకాలంబులయంద కొనిపోవుచు వచ్చె
     నేను నడుమ నడ్డపడిన సముద్రంబు సంస్తంభించి పర్వతంబులయం దంతరంబులు

     వడసి యంధతమసపాటనం బొనర్చి పోయి యప్పరమబ్రహ్మంబు దర్శించి మద్దర్శ
     నంబునఁ దదీయకృతార్థతయు నాపాదించి యాత్మీయప్రభావంబున నతిదీర్ఘం
     బగుమార్గం బల్పకాలంబునన రథగమనాగమనంబుల విలంఘించితి నిది నీయడి
     గినవిధంబునకు వివరింపవలసిన తెఱంగు.103
సీ. పరమేశ్వరుఁడు పరబ్రహ్మంబు పరమాత్మ యనఁ బేరుకొనినయయ్యాదిపురుషుఁ
     డరయఁగ నేన కా కన్యుఁ డున్నాఁడె యంభోధులు గిరులును భువనములును
     దెసలు గాలంబును దెల్లంబు నన్న కా నెఱుఁగుము సృజియింతు నీజగంబు
     పాలింతు హరియింతు నాలుగు శ్రుతులును మఖములు ప్రణవాదిమంత్రములును
తే. మననయమములు మేదినీమారుతాంబు, వహ్నివియదిందుభానుజీవంబు లనఁగ
     వెలయు మామకస్థూలమూర్తులు పరాయ, ణంబు మత్తేజ మఖిలంబునకుఁ గిరీటి.104
క. శ్రుతిశాస్త్రవిధిమథనసం, భృత మగునవనీతముగను బేశలబుద్ధుల్
     మతులం గైకొండ్రు మదూ, ర్జితవిజ్ఞానంబు నిత్యసిద్ధికి ననఘా.105
క. విను బ్రహ్మము బ్రాహ్మణులును, ననుపమసత్యంబు నిత్య మగుతపమును నే
     నొనరించితి లోకస్థితి, కనంతధర్మగతి హేతువై యఖిలంబున్.106
తే. నీవు నాకుఁ బ్రియుండవు నిర్మలుడవు, గాన నతిగోప్య మగుతత్ప్రకార మిట్లు
     తెలియఁ జెప్పితి దీనిన తలఁపు మిది [9]జ, పంబునం దున్నభావంబుఁ బాండుతనయ.107
వ. అనిన నమ్మహాపురుషుభాషితంబులు భక్తిభరితహృదయుండ నై యాకర్ణించి యా
     పూర్ణం బగుమనోరథంబునం బ్రధితహృదయసమ్మోదంబు నొందితి నివ్విధంబున
     గోవిందుమాహాత్మ్యంబు దృష్టంబును శ్రుతంబు నయ్యె నని యర్జునుండు సెప్పినం
     బాండవాగ్రజుం డద్భుతానందంబులకుఁ బాత్రం బయ్యె ననిన విని జనమేజ
     యుండు వైశంపాయనున కి ట్లనియె.108
చ. హరి రజతాద్రి కేఁగి త్రిపురాసురమర్దనుఁ గాంచె నచ్చటన్
     సురలు మునీంద్రులుం దగిలి చూచిరి శంకరకేశవాత్మక
     స్ఫురదురుతత్త్వయుగ్మ మని పూర్వులు సెప్పఁగ విందు నేను వి
     స్తరముగఁ జెప్పఁగా వలయుఁ దద్విధ మంతయుఁ బ్రాజ్ఞపూజితా.109
క. అనుటయు వైశంపాయనుఁ, డనఘా లెస్సకథ యడిగి తచ్యుతవృషవాం
     ఛననామథామ మాత్మం, గొనియాడి కథింతు నీదుకోరిక యలరన్.110
క. హరి! హరి! నీరూపము ద, త్పరమార్ధం బెఱిఁగి చెప్పఁ, బ్రాజ్ఞులు లో రె
     వ్వరికిని దమతమతోఁచిన, తెరువులఁ దెలుపుదురు బుధులు ధీమంతులకున్.111
క. అనధీతున కతపస్వికి, ననుపాసకునకు [10]నకృపున కకృతాత్మునకున్
     జన దీవిజ్ఞానము నిగ, మనిరూప్యరహస్య మగుట మతిమత్ప్రవరా.112

క. విను వారలకుం జెప్పిన, ఘనబోధనులకు నశేషకామ్యస్వర్గా
     ద్యనుపమశుభంబు లిచ్చును, మునిసేవిత మిక్కథాసముచ్చయు మెందున్.113
వ. నీపు గౌరవాన్వయపావనుండవు గావున నర్హుండవు వినుము వాసుదేవుండు దేవా
     రాతుల నరకుండు తుదగా నందఱం దునిమి యశేషహితం బొనర్చి యిచ్ఛాను
     రూపంబు లగుకేళీకలాపంబుల నలరుచుండ నొక్కనాఁడు పుణ్యరజనీసమయంబున
     రుక్మిణిశయ్యాతలంబునం బ్రీతుండై యెద్దే నొక్కవరం బడుగు మనిన నాయమ
     యి ట్లనియె.114

రుక్మిణీదేవి శ్రీకృష్ణునితోఁ దనకుఁ గల సంతానాపేక్ష యెఱింగించుట

క. తనయులఁ బ్రద్యుమ్నాదులఁ, గనియుఁ దనియ దాత్మ కొడుకుగములను నానా
     ధనధాన్యములం దనిపిన, జనములు లేరందు రది నిజంబు మనోజ్ఞ.115
వ. అ ట్లగుట రూపసియు బలియుండును విద్యావినతుండును శ్రీమంతుండును నై
     తేజంబున నిన్నుఁబోలుపుత్రు నింక నొక్కనిఁ గోరెద ననిన నల్లన నవ్వి యవ్విభుండు.116
క. విను మఖిలలోకసుఖములు, ననంతములు పుత్రవంతు లగుపుణ్యులకున్
     దనయవిహీనులు దుఃఖులు, తనూజలాభంబు పరమధన మని రార్యుల్.117
తే. పతియ చూవె భామినియందుఁ బట్టి యనఁగఁ, బుట్టుఁ బదియవునెలఁ బుత్రభూతిఁ దనియు
     వాని కింద్రుఁడుఁ దలకు నెవ్వారలకును, వెఱవఁ డాత్మజోపేతుఁడు మెఱుఁగుఁబోఁడి.118
క. నీవడిగినట్టిపుత్రుని, నీవచ్చు లతాంగి తొల్లి హిమగిరిఁ దప మేఁ
     గావించి కంటి నుత్తము, భావునిఁ బ్రద్యుమ్నుఁ దొలుతపట్టి నుదారున్.119
వ. తపంబునకు నసాధ్యం బైనది లేదు. అవ్విధంబునన యింకను శంకరారాధనంబు
     సేసి కొడుకు బడసెద నేను వోయి రజతాచలంబున నచలకన్యాసమేతు నాభూతే
     శ్వరుం దపస్సన్నిధి నునిచి తపంబును బ్రహ్మచర్యంబును నస్ఖలితంబులుగా నడుప
     జగన్నథుండు ప్రసన్నుండై యెల్లవిధంబుల నస్మన్మనోరథంబు నొసంగు నాది
     దేవుండు నజమహేంద్రాదివంద్యుండు నగునయ్యిందుశేఖరు దర్శించి నమస్క
     రింపం గనుట యొక్కటియును నడుమ బదరీవనంబున ననవరతతపోనియమ
     వ్రతసిద్ధులు నఖిలసిద్ధాంతదర్శనులు జీవన్ముక్తులు నగుమునీంద్రుల నభినందింప
     గనుట యొక్కటియుఁ బరమేశ్వరుండు నామీఁదఁ గలపక్షపాతంబు నార
     దాది యోగివరులకుఁ దెలిపి తదనురూపంబు లగుదివ్యాలాపంబు లనుగ్రహింప
     నాకర్ణింపం గనుట యొక్కటియుఁ గాఁ బెక్కుకల్యాణంబులు సిద్ధించుఁ దడయక
     కైలాసయాత్ర యొనర్చెద ననియె నమ్మాటలకు నమ్మానినియును సమ్మదాతిశ
     యంబు నొందెఁ.120

సీ. తన వినిర్మలబుద్ధిఁ దనరునుద్యోగంబుతోన ప్రాభౌతికద్యుతులు వెలయఁ
     దనయుత్సహించినపనికి దవ్వగువిఘ్నతమముతోడన తిమిరములు తొలఁగఁ
     దనమనోరథములఁ దలకొను రాగసంతతితోడఁ బూర్వసంతతియు వెలయఁ
     దనమనంబునఁ బేర్చుఘనవికాసంబుతోడన పంకజోల్లాసమును దలిర్ప
తే. నమరుశర్వరివిరతియం దద్యుతుండు, తన[11]యుదర్కోదయంబుచందమున మెఱయ
     నుజ్జ్వలార్కోదయంబున నుచితనియమ, జాలమంతయుఁ బాటించి [12]లీల నరిగి.121
క. గోవులు బసిండిప్రోవులు, దేవతలంబోలు ధరణిదేవతలకు సం
     భావనతో నిచ్చి భువన, భావనుఁ డనుజీవకోటి పరివృతి నొప్పన్.122
వ. ఆస్థానమండపంబునకుఁ జనుదెంచి సింహాసనోపరితలంబున సింహంబు శిఖరిశిఖరో
     పరిభాగం బలంకరించుకరణి నలంకరించి.123
సీ. బలభద్రదేవునిఁ బిలువుఁడు సాత్యకిఁ దోట్తెండు గృతవర్మఁ దోడుకొనుచు
     రండు సారణు వేగ రాఁ బంపుఁ డిపు డుగ్రసేనుని విజయము చేయు మనుఁడు
[13]బ్రతుకెల్ల దనబుద్ధి ప్రాప కా నమరులు దననీతి కలరఁగఁ దనమహత్త్వ
     మెసఁగ యదుశ్రేణి కెక్కటికొనియాట కెల్లయై తనరార నెందుఁ బరఁగు
తే. నుద్ధవాచార్యు [14]నార్యు ననుధ్ధతోక్తి, ధుర్యు రాబంపుఁ డని వేఁడఁ గార్యకరులఁ
     బనుప వాఁడును నట్ల చేసిన నశేష, వృష్ణివీరావళియు వచ్చె విష్ణునాజ్ఞ.124
వ. ఇట్లు వచ్చి మహనీయసభాభవనంబున నందఱు నుచితప్రదేశంబుల నుండి తన
     ముఖకమలంబుమీఁదం జూడ్కిగములు ప్రోడతుమ్మెదపదువులఁగాఁ జేయుచు
     నుల్లసిల్ల నుత్ఫుల్లవదనుం డగుచు నంబుధిసదనుండు వారల కి ట్లనియె.125

శ్రీకృష్ణుఁడు బలభద్రాదులకుఁ దనకైలాసయాత్ర దెలియఁ జేయుట

చ. వినుఁడు యదుప్రవీరు లతివిశ్రుత మైనమదీయవిక్రమం
     బనయము బాలభావమున యంతటినుండియుఁ గల్గి యెట్టిబ
     ల్పను లొనరించెనో యది దలంపఁగఁ దెల్లముకాదె మీకుఁ బూ
     తన పడు టాదిగా నరకదైత్యునికూలుట యంతిమంబుగాన్.126
శా. ఇంకొక్కండు గలండు నాకుఁ బగతుం డీమూఁడులోకంబులం
     గింకం దా నొకరుండు గెల్పుకడిమిం గీ ర్తింపఁబడ్డాఁడు సా
     హంకారుండు నిరంకుశప్రసభరోషారంభుఁ డత్యంతని
     శ్శంకస్వాంతుఁ డనంతవిశ్రమకళాశౌండుండు పౌండ్రుం డనన్.127
క. వానికిఁ దలంకుదు నెప్పుడు, నే నవ్వీరుఁడును నన్ను నెడఁ గైకొనఁ డ
     మ్మానఘనుఁ గూల్చునంతకు, నానెమ్మన మెద్దియుం గొనదు విజయముగాన్.128

సీ. నాకు నిప్పుడు నాకనాయకవంద్యుఁ బినాకి ననాథైకనాథు నభవు
     దర్శింపఁ గైలాసధరణీధరమునకుఁ దడయక పోవంగఁ దగినకార్య
     మొకటి గల్గినయది యుద్యోగ మెలరారఁ బోయిన వినుఁ డేను వోవఁ దడవ
     ఘనుఁడు రంధ్రాన్వేషి గావునఁ బౌండ్రుఁ డేతెంచి యీపురి నిరోధించుఁ గడిమి
తే. జగతి యదుహీనఁగాఁ జేయఁ[15]జాలువాఁడు, వాఁడు గావున మీరు నావచ్చునంత
     దాఁక రేయునుఁ బగలు నుద్యమ మెలర్పఁ, గావలయు ననాలస్యకలనఁ బురము.129
[16]
ఉ. ద్వారములందు రక్ష సువిధానముగా నొనరించి ముద్ర లే
     కేరిని వెల్వడం జొరఁగ నీక యనేకరథాశ్వదంతిమ
     ద్ధారణసైన్యసన్యహనదర్పితు లై వివిధాయుధప్రభల్
     ఘోరనిరూఢి నెల్లదెసలుం బొదువం దగనుండుఁ డిమ్ములన్.130
ఆ. వేఁట దోఁట యనుచు వీడు వెల్వడి పోవ, వలదు చరులఁ బనిచి వైరితెరుపు
     లరసి గెలుచువెరవు లన్నియుఁ దలపోసి, విక్రమంబు గారవించు టొప్పు.131
వ. అనిపలికి సాత్యకి నాలోకించి నీవు ధనుర్వేదంబునఁ బారీణుండవు సమరధురీణుండవు
     నీవలన నిన్నగరంబు లబ్ధరక్షణంబు గావలయు నఖిలయాదవశ్రీయును నీకు
     నిల్లడవెట్టితి ననిన నతండు దేవా నీయాజ్ఞాబలంబును బలదేవుసాహాయ్యకంబును
     నాకుం గలుగ నెయ్యవియు నసాధ్యంబులు గలవే శక్రయమవరుణకుబేరపురస్సరు
     లై సుర లరుగుదెంచిన జయింతుఁ బౌండ్రుం డెంతవాఁ డవధరించెదవ కాదె
     నిశ్చింతం బగునంతఃకరణంబుతోడ నరిగి యభిమతంబు సాధించి దేవర మగుడ
     విచ్చేయు మనుటయు నాగోవర్ధనోద్ధరణుం డుద్ధవు నుపలక్షించి.132
మ. విబుధాచార్యునియంతవాఁడవు మహావిఖ్యాతనీతిస్థితిం
     బ్రబలంబై భవదీయధీబలము సెప్పం జిట్ట లీ విశ్వముం
     గబళింపంగ సమర్థ [17]మిట్టి నను నిక్కం బేను గార్యంబుపొం
     దు బుధోత్తంసమ తెల్పఁ జొచ్చి మదిలోఁ దూఁగాడెదన్ సిగ్గునన్.133
వ. అయిననుం జెప్పవలసియున్నది యదువీరులు కేవలవీరవ్రతశౌండులు పాండిత్య
     నిత్యుండ వైననీవు వీరలవిక్రమోద్ధతి యనుద్ధతనీతిపేశల యగునట్లుగా నడుపు
     మనిన నతండు.134
క. నామీఁదికరుణ గాదే, యీమెయిఁ బెద్దఱిక మిచ్చి యి ట్లాడుట నీ
     వేమనుజుఁ దెసఁ బ్రసన్నుఁడ, వామనుజుఁడ చూవె ధన్యుఁ డఖిలమునందున్.135
మ. త్రిజగత్సంభవసుస్థితిప్రశమముల్ దేవా భవత్కార్యముల్
     నిజ మామ్నాయములుం దదీయవిధులు న్నీకై ప్రవర్తిల్లు సా
     ధుజనత్రాణము దుష్టదండనము నీదుర్దాంతవిక్రాంతికిన్
     భజనీయంబులు బ్రహ్మవేదులు నినుం బాటింతు రాత్మేశుగాన్.136

క. నీకుఁ బరిభవము గలదే, లోకోత్తర యరయ భక్తలోకములకు లో
     నై కాదె యిట్లు వలికెదు, మాకొలఁదులమతులు దివ్యమతి జొన్పుటకున్.137
వ. దేవర యెంతటివానింగా నవధరించితి వంతటివాఁడనై సర్వోపాయంబులఁ
     బ్రసారభాజనం బయ్యెద ననియె నయ్యాదిదేవుండు బలదేవున కభిముఖుండై
     మహాత్మా నీవు మహాసత్వుండవు మహావిక్రమోద్దీపితుండవు నీపరిపాలనంబున
బ్రతుకు మాకు లోకంబులచేతియపహాసంబు వాటిల్లకుండెడుతెఱం గెయ్యది
     యయ్యనువు దలంపులోనం గదియింపుము.138
క. అని పలికి యతనిసాదర, సునిశ్చితార్థవచనములచొప్పునకు మనం
     బున నెమ్మిఁ బొంది మాధవుఁ, డనంతరమ యుగ్రసేనుఁ డాదిగ వరుసన్.139
వ. యదువృద్ధుల నందఱుఁ బ్రత్యేకంబ సంభావించి వీడ్కొని గమనోన్ముఖుండై
     గరుడునిం దలంచినం దత్క్షణంబ.140
సీ. సర్వపథీనుఁడై చనుపతంగుఁడు గలఁడో కాక యనయ నన్యుఁడు జగమున
     నెఱకలు వడసి యెయ్యేడఁ బ్రవర్తిల్లెడుమేర గాంచెనొ కాక మేరుశిఖరి
     యంబరశ్యామిక యంబుధిపొగరుగా బ్రమసి యెక్కెనొ కాక బాడబాగ్ని
     హైమమై పరగు బ్రహ్మాండంబు పక్వమై తగఁ బుట్టెనో కాక ఖగ మొకండు
తే. వైనతేయుఁడు నీదృశవ్యాప్తి దీప్తు, డాతఁడో కాక యితఁ డని యఖిలజనులు
     బహువిధానుమానారంభపరతఁ జూడ, నరుగుదెంచెఁ బక్షిప్రభుఁ డభ్రవీథి.141
వ. ఇట్లు చనుదెంచి మహీతలంబున కవతరించి ముందటఁ బ్రణతుండును బ్రాంజ
     లియఁ బ్రశంసావచనవాచాలుండు నై యున్నం గనుంగొని.142
క. తనమూర్తియ వేఱొకఁడై , దనునావిహగేంద్రు, నింద్రసము సమధికపా
     వన మగుపాణిపయోరుహ, మున నంటి రథాంగపాణి ముదము దలిర్పన్.143
వ. సౌమ్యచతురుండవై చనుదెంచితే యనుపలుకు పలికి.144

శ్రీకృష్ణుఁడు కైలాసంబునకుఁ బుత్రార్థియై పోవుట

క. శైలాత్మజాసహాయుని, ఫాలాంబకు నఖిలభువనపతి దర్శింపన్
     గైలాసాద్రికి నేఁగెద, నీలా గెఱిఁగింపు మాకు నిరుపమభక్తిన్.145
వ. అని యానతిచ్చిన నయ్యిచ్చ కనురూపంబుగాఁ గొలుపుమాటలు ప్రకటించు
     నయ్యుదంచితదేహు బంధురస్కంధం బారోహించి రోహణశృంగసంగతం
     బగు నీలాంబుదంబు ననుకరించి యాదవుల నందఱ నిలువుం డని పూర్వోత్తర
     దిశాభిముఖుం డగుటయు.146
క. పతిచిత్త మెఱిఁగి యెఱకలు, విశతంబుగఁ బఱపి విహగవిభుఁడు నెగసె న
     ద్భుతముగఁ దనయఖిలబలో, ద్ధతిఁ జూపుటకుం దలంపు దళుకొత్తంగన్.147

వ. ఎగసి క్రమంబున సిద్ధవిద్యాధరసేవ్యంబు లగు మార్గంబుల ననర్గళప్రకారం బగు
     సంచారంబు గైకొని.148
సీ. తోరంపుటూర్పులతోడఁ బాతాళముఁ దాఁకంగ సాగరౌఘములు గలఁగ
     [18]వికటంపుటెఱకలవిసరున నుప్పొంగుతుప్పర డెందంబు దూ పడంగ
     బలితంపుజంఘల పెలుచనితాఁకున నమరయానములు తుత్తుమురు గాఁగ
     నుగ్రంపుఁజూపుల నొడలికెంపుల దిక్కు లన్నింట నెఱసంజ లావహింప
తే. బఱచునురవడిఁ బొడమునిబ్బరపుమ్రోఁత, కొండ[19]గొబలెల్లఁ జొచ్చి యొండొండ పెరుగఁ
     గమ్రతనుకాంతిపూరంబు గడలుకొనఁగ, హరి వహించి నభంబున గరుడుఁ డరిగె.149
శా. ఆదేవు న్గరుడాధిరోహణవిహారాభిన్నసద్భావు స
     ర్వాదిత్యోత్తమసంయమీప్రవరు లంతంతం గనుంగొంచు నా
     హ్లాదంబుల్ హృదయంబులం బొదల భవ్యస్తోత్రవాచాలు రై
     రోదస్యంతరమంతయు న్నినిచి రారూఢాత్మఘోషంబునన్.150
వ. వార లందఱు నతిభక్తిసంసక్తులై తన్ను ననువర్తింప నప్పుణ్యకీర్తనుం డటఁ జని
     తొల్లి నరనారాయణసమాహ్వయం బగు నాత్మీయమూర్తిద్వయంబునకు ననేక
     సహస్రసంవత్సరంబులు తపోనుష్ఠానంబునకు నధిష్ఠానం బై నిరంతరోత్తుంగ
     గంగాతరంగంబులం బొదలు శీకరంబులం బునరుక్తఫలోత్కరంబు లగు తరు
     నికరంబుల నలంకృతం బై వృత్రవధాదిపాతకంబులం బాపికొనం బాకశాసనా
     దులకును శరణ్యంబు లగు పుణ్యప్రదేశంబులు తనయంద తనరుటం ద్రిజగదేక
     పరాయణం బై బాదరాయణాదులు నాదరంబుతోడం జిరసమాహితబుద్ధు
     లగుచు సిద్ధులు గోరి నిలువం దగు విభవంబున నద్భుతం బై పద్మప్రభవాదులు
     వేదోక్తవిధానంబుల వివిధాధ్వరంబులు విదితంబులుగాఁ జెల్లించి యెల్లచోట్లను
     హాటకరత్నమయరూపంబు లగు యూపంబుల నలంకృతంబు గావింపం బొదలు
     పెంపున నకంపనకల్యాణం బై వెలసి నిఖిలపావనం బగు బదరీవనంబు ప్రవేశించి
     సాయాహ్నసమయంబునం దదీయమధ్యంబునందు.151
సీ. తరువిటపాసక్తధౌతవల్కలపఙ్క్తి కమనీయతోరణకల్పనముగ
     హూయమానంబు లై యొండొండ వెలిఁగెడు త్రేతాగ్ను లభినవదీపములుగ
     దుగ్ధపానంబులఁ ద్రుళ్లుపెయ్యనోరినురువులు సితపుష్పవిరచనలుగఁ
     గోరి నీడంబులు సేరెడిఖగములవాసితంబులు జయధ్వానములుగఁ
తే. దనసమాగమోత్సవమునఁ దగినశుభము, లప్రయత్నసిద్ధములుగ నతిశయిల్లు
     మునిజనాశ్రమరేఖ లవ్వనజనాభుఁ, డర్థిఁ దఱిసి యందొకరమ్యమైనచోట.152

స. సుపర్ణస్కంధావతీర్ణుం డై మున్ను దన్నుం గొలిచి చనుదెంచిన దేవతలు
     మునులుం బరివేష్టింప నున్నయవసరంబున.153
సీ. వ్యాసభరద్వాజవాల్మీకిగౌతమకాశ్యపజాబాలికణ్వపులహ
     యాజ్ఞవల్క్యాత్రి రైభ్యాంగిరోభృగుపరాశరధూమ్రగాలవశంఖలిఖిత
     హరితసంవర్తకహయశిరశ్శౌనకభద్ర[20]కక్షీవద్విభాండకోగ్ర
     బకదాల్బ్యకౌశికాపస్తంబమాండవ్యమంకణరోమశమందపాల
తే. కఠకలాపరోహితకామకాయనాది, మునులు చిరతపోనిర్మలమూర్తు లాఢ్యు
     లరుగుదెంచి కాంచిరి పరమాత్ము నభవు, నాదిదేవు నచ్యుతుఁ గృష్ణు నధికభక్తి.154
తే. కాంచి యర్ఘ్యపాద్యము లిచ్చి గౌరవమునఁ, బ్రణతు లై మోడ్పుఁజేతు లొప్పంగ నిలిచి
     చిత్తములు హర్షరసమునఁ జిగురులొత్త, నంగములు పులకలప్రోవులై యెలర్ప.155
ఉ. ఈయెడకుం బ్రసన్నమతి నిందఱఁ గైకొని దేవ నీవు వి
     చ్చేయుటఁ జేసి మానియమశీలత యుత్తమసిద్ధిఁ బొందె నే
     మేయది సేయువారము మహేశ్వర సత్కృప నానతిమ్ము ని
     శ్రేయసదాయి గాదె సవిశేషభవత్ప్రియకర్మ మెమ్మెయిన్.156
వ. అనినఁ బరమపురుషుం డందఱఁ బ్రసాదదృష్టిదానంబున సమ్మానించి సర్వంబును
     సువిహితంబ యని వేఱువేఱ కుశలంబు లడిగి వారల ప్రతివచనసంవిధానంబున
     నానందంబు నొంది సముచితానుష్ఠానంబు పిమ్మట నమ్మునుల కావించు విందులు
     గైకొని బృందారకమునిబృందసహితుం డై నిశాసమయసమీహితంబు లగు
     శయ్యాస్థానంబులం బ్రమోదించె నిట్లు పుణ్యనివాసంబున వసియించి యన్నారా
     యణుండు.157
క. తనపూర్వతపస్స్థానం, బని యనురాగమున బదరి యంతయుఁ జూడన్
     మనమునఁ దలపోసి యొకండును మధ్యేరాత్రమునఁ [21]గడుం గుతుకమునన్.158
వ. అచ్చోటు వాసి యిచ్చం జని గంగయుత్తరతీరంబు దొడంగి.159
సీ. పంచాగ్నిమధ్యతపస్కులు గొందఱు సలిలాధివాసనిశ్చలులు గొంద
     ఱాబద్ధతరులతాధ్యానులు గొందఱు నిరశనవ్రతసమన్వితులు గొంద
     [22]ఱమితనిరంతరయజనులు గొందఱు ప్రాణసంయమనైకపరులు గొంద
     ఱేకాంతికత్వనిశ్శోకులు గొందఱు జసయజ్ఞవిధివిచక్షణులు గొంద
తే. ఱగుచు జటిలముండితనగ్ను లాదిగా న, నేకరూపతపోనిష్ఠ లెసఁగ నొప్పు
     మునులనెలవులు ప్రీతిఁ గన్గొనుచు వివిధ, కాననాభ్యంతరంబులఁ గలయ మెలఁగి.160

శా. సిద్ధోద్బాసీతశృంగపంక్తులు సమానీడోల్లసత్కిన్నరీ
     బద్ధానేకవిచిత్రగానసుతలప్రస్థంబులున్ యోగిస
     న్నద్ధానందసమాధిరమ్యగుహలున్ గంధర్వవీణాధ్వనీ
     శ్రద్ధాముగ్ధమృగంబులుం గలమహా[23]శైలస్థలుల్ చూచుచున్.161
వ. పెద్దయుంబ్రొద్దు విహరించి యొక్కమనోహరప్రదేశంబున నాసీనుండై.162

శ్రీకృష్ణుఁడు బదరీవనంబున సమాధియోగంబున నుండుట

తే. అపరరాత్రంబు భవ్యసమాధివేళ, యగుట నప్పుడు తనయంతరంగమునకు
     నొలయ సుప్రసాదంబున యోగనిష్ఠ, [24]చే యలంతియై యింపారఁ జేరుటయును.163
సీ. స్వస్తికాసనము నిశ్చలముగా బంధించి తనువుఁ గంథరయు మస్తకము సరిగ
     చక్కనై నిలువ నాసాశిఖరంబున నరమోడ్పుచూడ్కి యేకాగ్రసరణి
     నిలిపి మూలాధారనిర్గతనిర్గుణదోషంబు షడ్గ్రంధిదళనకారి
     యై పోయి పరమాంబరామృతబింబంబు గరపంగఁ దోడన తొరఁగుసోనఁ
తే. దడిసి తన్మయానందతం ద్రాళువగుచు, నొకఁడు నెఱుఁగనిసామరస్యోదయమున
     నలర నెంతయు నొప్పె నయ్యాదిసిద్ధుఁ, డఖిలసిద్ధులు వనసిద్ధి యభినుతింప.164
వ. ఇవ్విధంబున నప్పరమేశ్వరుండు పరప్రణిధానంబునఁ దన్నుఁ దాన యనుసంధించి
     సంధుక్షితసంవిజ్జ్యోతి యగు చేతోవృత్తి నున్నసమయంబున నవ్వనంబునందు.165
క. మృగయాకలకల మొక్కటి, దిగంతములు మ్రోయ నుప్పతిల్లిన నాలో
     జగతీశ హరే విష్ణో, నిగమస్తుత యను నెలుంగు నెఱి వీతెంచెన్.166
సీ. అవ్విధంబున కాత్మ నద్భుతం బందెడు హరి యున్నయెడ కిందు నందు మునుఁగఁ
     బఱతెంచె నొఱలుచుఁ బటుబాణవిద్ధంబు లగుబెబ్బులులు పందు లాదియైన
     మృగములు వెనుకన యగణేయసారమేయావళు లేతెంచె నడవియెల్ల
     నొక్కవెలుంగకా నొప్పెడు వేనవేల్ దివియలతోడఁ దోతెంచి రంతఁ
తే. జాపహస్తులు తఱచుగాఁ జపలవికృత, రూపు లైనపిశాచు లాటోపదీప్తు
     [25]లోలి మాంసఖాదసముఁ గీలాలపాన, ముల నొనర్చుచు నార్చుచు బొబ్బలిడుచు.167
క. శిశువులఁ జంకల నిడుకొని, కృశకర్కశరోమరాజికృష్ణశరీరుల్
     రశనాయితాంత్రవల్లులు, పిశాచికలు వొడమి రెలమిఁ బ్రియులపిఱుందన్.168
వ. ఇ ట్లనేకసహస్రసంఖ్యులు నరుగుదెంచిన వారికి నందఱకు నగ్రణులై యిద్దఱు
     మహాపిశాచులు ధూమ్రకపిలకేశంబులు గల మస్తకంబులును వెలి కుఱికిన
     గ్రుడ్లతోడికపిలకన్నులతుదలు మురిసినయంపతునుక లెడలం జిక్కి మిక్కుటం బై
     తెలుపుమీఱినయొఱవపండ్లును శంఖనిభంబు లగుకర్ణంబులు నిర్మాంసంబులగును
     రంబులు వీఁపుల నంటికొనినకడుపులు కుఱుచచేతులు నస్థిస్నాయుమయంబు లైన

     యూరుజంఘాద్వయంబులు వక్రాంగుళులును వికటచరణంబులునై యేకలంబులం
     గ్రుచ్చుట కాభీలంబు లగుశూలంబులు కేలంద్రిప్పుచు నుప్పరం బెగసి నడయాడు
     చుం బోరుచు వీఱిఁడిమాటలతోడం బెలుచఁ బెనంగుహాసంబులఁ బెరసి వెలయ
     హరినామసంకీర్తనంబులు గీర్తనీయాద్భుతరసంబు నుత్పాదింపం దమలోన.169
సీ. నాలుగుమొగములవేలుపుమొదలుగా నెవ్వనికడ నుదయించె జగము
     లెవ్వనికతమున నీవిశ్వమును ననపేతసుస్థితి గాంచి యెసక మెసఁగు
     నంతకాలంబున నంతయు నెవ్వనియొనరించుమాయలో నడఁగి మడఁగు
     నిష్కలం బమృతంబు నిర్వాణ మజ మని సాటింతు రెవ్వని బ్రహ్మవేదు
తే. లమ్మహాదేవు హరి సరోజాయతాక్షుఁ, గంసమర్దను నెచ్చోటఁ గాంతు మెట్లు
     గాంతు మెప్పుడు గాంతు మేకాంతికత్వ, సులభు నయ్యాదవేశునిఁ జూడఁగనుట.170
క. అక్కట తొలుబామున నే, మొక్కట నేకరణి పాప మొవరించితిమో
     యిక్కష్టపిశాచభవము, నెక్కొని యిట్లధికదుఃఖనీరధిఁ ద్రోచెన్.171
మ. అనిశంబు న్నరమాంసరక్తతతి యాహారంబుగాఁ గొంచు నే
     పునఁ బ్రాణిప్రకరంబు పీడనములం బొందించుచుం బుణ్యపుం
     బనికిం దవ్వుగఁ బాయుచున్ మెలఁగఁగా బా మిమ్మెయిం బోయె నేఁ
     డును నుల్లంబున నొల్లఁబా టొలసె నెట్లుం బూని యిమ్మేనికిన్.172
క. ఇది యట్టిద సంసారము, మొదలు తుదియు నొక్కరూప మోహం బెచ్చో
     వదలదు తృష్ణయు నెన్నఁడు, ముియదు సదువులను నిట్ల మును గని రార్యుల్.173
వ. ఎ ట్లనిన బాల్యంబునఁ గేవలం బగునజ్ఞానంబును యావనంబున విషయాభిలాషం
     బును వార్ధకంబున జరావ్యాధిపీడనంబును నాత్మహితం బొనర్పనీక జన్మంబు
     నిరర్థకంబు గావించి పుచ్చు నంతిమసమయంబున నప్పటియాపదయును నరక
     దుఃఖస్వర్గసుఖంబులయందలిపరతంత్రతయుఁ గ్రమ్మఱం బాటిల్లెడుగర్భవాసా
     యానంబును నత్యంతమోహమయంబు నగు సర్వజగన్నివాసుం డగువాసుదేవుం
     డొక్కరుండ యిక్కలుషంబునకుం బరమౌషధం బప్పరమాత్ముసందర్శనం బవ
     శ్యంబు సిద్ధించునట్టి వెరవు దలపోసి యెఱుంగవలసి యున్నది యని యిట్లు
     బహువిధంబుల నుగ్గడించుచుఁ జనుదెంచి ముందట.174
క. కని రానీలవలాహక, సనాభితను నాభికమలసంజనితజనితజగ
     జ్జనకు[26]నిఁ గలుషవినిర్మో, చనలోచనుఁ బూర్ణచంద్రుఁ జంద్రాస్యు హరిన్.175

ఘంటాకర్ణుఁడు శ్రీృకృష్ణునిం గని సంభాషించుట

మ. గని డాయం జనుదెంచి యెవ్వఁడవు నిక్కం బివ్వనాభ్యంతర
     మ్మున నొక్కండవు కోమలాంగుఁడవు [27]సన్మూర్తిన్ మహాఘోరస

     త్త్వనికాయంబులలోన నేమిపనికై వర్తిల్లె దుత్ఫుల్లలో
     చనుఁ డావిష్ణునిమూర్తితో నెనయు నీసన్తూర్తి యూహింపఁగన్.176
క. దేవుఁడవో దనుజుఁడనో, దేవేంద్రప్రముఖముఖ్యదిగధీశులలో
     నీ నొకఁడవొ పరమధ్యా, నావేశితచిత్తుఁ డున్నయట్లై తరయన్.177
వ. ఇంతయు నెఱింగింపు మని యడిగిన నప్పిశాచనాయకులం గనుంగొని యా
     జగన్నాయకుండు.178
తే. క్షత్రియుఁడ నేను యదువంశసంభవుండ, దుష్టమర్దనసుజనసంతోషణముల
యందుఁ జాలెడువాఁడ ఫాలాక్షుఁ గాన, నరుగుచున్నాఁడఁ గైలాసగిరికి నిపుడు.179
వ. ఇది నాతెఱంగు మీ రెవ్వ రివ్వనంబు సాధు లగుతపోధనులకు నియతనివాసం
     బాసురచరితులకు జొరఁదగినయది దిందుల మృగంబులును హింసకు
     విషయంబులు గావు ఘోరం బగుమాంసాహారంబులు మరిగి శునకసంబాధం బగు
     మృగయానురోధంబున మెలంగెడుమిమ్ము నేను సైరింప ననిన నద్దేవువచనంబులు
     విని యయ్యిరువురయందు నుత్తుంగదేహుండును దీర్ఘబాహుండు నగువాఁ డొ
     క్కరుం డి ట్లనియె.180
తే. ఆదిదేవు జగన్నాథు నచలు విష్ణుఁ, గృష్ణు నతిభ క్తిఁ దొలుత సంకీర్తనమునఁ
     దెలచి నీవు న న్నడిగినతెఱఁగు దెలియ, వినుము సెప్పెద నవధానవృత్తితోడ.181
వ. ఏను ఘంటాకర్ణుం డనుపిశాచనాయకుండఁ గుబేరకింకరుండ భయంకరకృత్యం
     బుల మృత్యువున కెనయగుదు నీతండు నాయనుజుండు మత్సమానవీర్యుం డవా
     ర్యం బగునిమ్మహాసైన్యం బస్మదీయం బిప్పుడు ప్రవర్తిల్లెడు మృగయావిహారం
     బును విష్ణుపూజాప్రకారంబ కా సమర్పింతుఁ గావున దీని హింస యన రాదు
     మఱియు నొక్కటి గల దెయ్యది యనిన.182
మ. చరమాంభోధితరంగముల్ దనమహాసాలాంఘ్రిమూలంబు వి
     స్ఫురదమ్లాననవీనఫేనకుసుమంబు [28]ల్సేర్చి యర్చింపఁగా
     నరుదై ద్వారవతీసమాఖ్య నఖిలవ్యాఖ్యాతమై యొప్పున
     ప్పురి మత్స్వామినివాస మప్పురి మహిన్ భూషించు నత్యున్నతిన్.183
క. అం దున్నవాఁడు నిత్యా, నందుఁడు వసుదేవుకూర్మినందనుఁడు మహా
     నందకహస్తుఁడు ద్రిజగ, చ్ఛందుండు ముకుందుఁ డార్తశరణుం డెందున్.184
మ. భువనోత్పాదనరక్షణప్రశమనంబుల్ సంతతస్ఫూర్తి నా
     త్మవిధేయంబులు గావునన్ సురపరిత్రాణార్థమై వచ్చి యా
     దవుఁ డైనాఁ డతనిన్ వినమ్రవరున్ దర్శింపఁగాఁ గోరి యు
     త్సవకల్పంబుగ నిందఱం గొని సముత్సాహంబుతో నేఁగెదన్.185
మ. అజుఁ బుట్టించి తదీయవిద్య యు నదాద్యం బైనయామ్నాయముల్
     నిజరూపం బెఱిఁగించి యిచ్చి మఖముల్ నిర్మించి తద్ధర్మముల్

     ఋజుమార్గం బగుశిష్టవర్గమునకు హృద్యంబుగాఁ జూపిన
     ట్టిజగద్దేశికుఁ [29]గానఁగాఁ జనుటకంటెం గల్గునే కార్యముల్.186
మ. స్థితికాలంబున దుగ్ధసాగరములో దీపాహిభోగంబు భా
     సితతల్పంబుగ యోగసుప్తిరతుఁ డై శ్రీదేవిపాచాంబుజ
     ద్వితయం బంకతలంబుపై నిడి ప్రమోదింపం బ్రమోదించున
     చ్యుతుఁ డీయుర్వికి వచ్చినాఁడు సనదే చూడంగఁ గ్రీడానరున్.187
మ. లయవేళం జతురబ్ధులన్ భువనసంప్లావంబు గావించి యెం
     తయు నాత్మోదరగుప్తమై యొదుఁగఁగాఁ దా నిచ్చ మాయావటా
     శ్రయకేళిం బసిపాపఁ డై యలరి శశ్వత్సంయమిధ్యాసస
     త్క్రియలం బొందెడు దేవు బాహ్యకరణిన్ దృష్టింపఁగా నొప్పదే.188
మ. భృగువంశోద్భవుఁ డైనయాదిమునికిం బ్రేమ న్మహా[30]కుక్షిలో
     జగదండం బఖిలంబు నిచ్చి మగుడ సర్వంబు నవ్విప్రుఁడుం
     దగఁ జూడంగ [31]వెలార్చి సృష్టిరచనాతంత్రంబు యంత్రింప బు
     ద్ధిగరిష్ఠాత్ములఁ బంచె నేవరదుఁ డాదేవేశునిం జూచెదన్.189
శా. వేదాధ్యాయులు గానలేరు నియమా[32]వేశవ్రతు ల్గానలే
     ర్వేదాంతజ్ఞులు గానలేరు బహుసంవిత్తర్కకార్కశ్యసం
     వాదుల్ గానఁగలేరు భక్తి వెలిగా భక్త్యేకసం[33]ప్రాప్తునే
     మాదేవున్ హరుఁ గానఁబోయెదము భాగ్యారంభ మెట్లో తుదిన్.190
వ. ఇదె యస్మదీయం బగుమనోవ్యవసాయం బిమ్మధ్యరాత్రంబు మాబోఁటివారు
     మలఁగెడుకాలంబు నీవు మనుష్యుండ విచ్చోట నొక్కండవు నుండుట కార్యంబు
     గాదు వేఱొక్కయెడకుఁ దొలంగి పొమ్ము మాకు నొక్కింత నియమంబు గల
     దని పలికి యమ్మహాపిశాచుండు పూర్వకల్పితం బైనమాంసం బెంతయేనియు
     భక్షించి బహుళం బగురక్తంబు గ్రోలి వెనుక వచ్చిన పిశాచగణంబులం బోవం
     బనిచి వనజోదరునకుఁ జేరువ యగుతత్ప్రదేశంబునన సమతలంబునం గుశసంచ
     యం బాసనంబుగా నమర్చి కూర్చుండి తనకేల నున్నప్రేవులు బర్యంకంబు దృఢం
     బుగా నమర్చి.191

ఘంటాకర్ణుఁడు శ్రీకృష్ణు నుద్దేశించి నిజనియమం బనుష్ఠించుట

క. పెక్కుభవంబులఁ గూర్చిన, నిక్కపుఁబుణ్యమున కపుడు నిర్భరపాకం
     బెక్కినభక్తిని హరిపైఁ, జిక్కినచిత్తంబు దనకుఁ జేదోడుపడన్.192
వ. కృతాంజలియై సర్వాంగంబులు పులక సంఫుల్లంబులుగా నానందజలకణకలితంబు
     లగునయనంబు లెలరార ఉద్[34]గాత్రం బగు గాత్రంబుతోడం దొలుత భగవన్మం
     త్రంబు సమగ్రతంత్రంబుగా గదియించి యనంతరంబ యి ట్లని యనుస్మరించె.193

సీ. సర్వజగత్కర్మసాక్షి నక్షరుఁ బుండరీకాక్షు గోవిందు శ్రీకళత్రు
     వాసుదేవుని భక్తవత్సలు శ్రీవత్సవక్షు నధోక్షజు వనజనాభు
     నే నిన్నుఁ గీర్తింతు నిట్టికీర్తనమున వగరద ముకుంద నిర్వాణరూప
     నాచిత్త మేకీడునకుఁ జే వలంతిగా కేప్రొద్దు నీయంద యెలయుఁగాత
తే. నీచకర్మదూషిత యిప్పిశాచవీర, తనువు దైత్యారి నీచక్రధారఁ ద్రెస్సి
     వెండియును బుట్టువుల నొందకుండవలయు, బ్రహ్మభూయంబు నా కిమ్ము పరమపురుష.194
మ. జననంబుల్ మఱి కల్గెనేనియును నాజన్మంబులం దెల్ల
     మన మీశాన భవన్మనోజ్ఞపదపద్మధ్యానతాత్పర్యముం
     గనుఁగా కంచితకల్పభూరుహము నీకారుణ్య మానమ్రులం
     దనఁగా విందు మదీయవాంఛ దగుఁ జేయన్ దేవ నీ కెమ్మెయిన్.195
చ. కుటిలపిశాచజన్ముఁ డతిఘోరచరిత్రుఁడు వీని కేల యిం
     తటఁ గరుణింపఁ నంచుఁ గృపదప్పకుమీ నినుఁ దప్ప నొండు ది
     క్కట నిట కోర నంత్యదశయందును నామది యట్ల చేయుమీ
     పటుతరకాలపాశముల పాల్పడఁజాలఁ జుమీ జనార్దనా.196
సీ. ఎన్నిజన్మములనో యియ్యింద్రియంబులు నాచేతఁ జిక్కక నీచవిధికిఁ
     దిగువంగఁ దిగువంగఁ దగిలి పోయినమానసముచెయ్ది నిప్పాపజన్మ మొలసె
     నీజన్మమునయందు నివి గ్రమ్మఱఁగ గాసి[35]సేయఁగ నున్నవి జిక్కుపడిన
     నేమి సేసియుఁ గొఱయేమి పరద్రవ్యపరదారపరివాదపరిహరణము
తే. నాకు నీవిచ్చువరముగా నాథ వినుము, నాదుశ్రోత్రాదివర్గంబు నలిననాభ
     యంబరాదిభూతములయం [36]దదిమి యవియు, నిన్నుఁ గలపి న న్నానందనిష్ఠ మనుపు.197
తే. నీకు మ్రొక్కెద [37]నున్నిద్ర నీరజాక్ష, నీకు మ్రొక్కెద ధర్మప్రణీతదక్ష
     నీకు మ్రొక్కెద నిశ్ళోకనిగమరూప, నీకు మ్రొక్కెద నిర్వాణనిత్యదీప.198
వ. అని పలికి మహాభాగుం డగు నబ్భాగవతుండు.199
తే. బాహ్యగతి మాని మగిడినభావ మచ్యు, తైకసంశ్రయంబునఁ గంప మేది నిలిచి
     గాలి దాఁకనిదీవియకరణి వెలుఁగ, నుండెఁ బరమానుసంధానయుక్తిఁ దగిలి.200
వ. ఇత్తెఱంగున నుత్తమధ్యాననిష్ఠుం డైన యాగుణగరిష్ఠుని నిలుకడ యంతయుం
     జూచి సంతసిల్లి యుత్ఫుల్లవిలోచనుం డగుచుఁ బద్మలోచనుండు తనయాత్మగతం
     బున నతని సుకృతకారణంబులు దలపోసి వీఁడు ధననాథునకు ననుంగుబంటగుట
     నమ్మహాదేవసఖువలనం బరమజ్ఞానంబు వడసి పూర్వపుణ్యవాసనానురూపంబుగాఁ
     బొడమిన భక్తికిం బ్రోదిగా ననవరతంబును గృష్ణ కేశవ వాసుదేవ జనార్దనాది
     నామంబులు గీర్తించుచు మృగంబుల వధియించుతఱిఁ దన్మాంసఖాదనం బొన
     రించునెడఁ దదీయరుధిరపానంబు సేయునప్పుడు సర్వావస్థలయందును సమ

     కరణంబులు నాయందు సమర్పితంబులు గావించుఁ గావున నవ్విశిష్టకర్మంబ
     పక్వం బై యిట్టిపదం బొదవె వీనిం గృతార్థుం జేయుదు నని నిశ్చయించి.201
క. ఆతతభక్తిసముజ్జ్వల, చేతోదర్పణమునందు సిద్ధంబుగ వి
     ఖ్యాతప్రతిబింబముక్రియ[38]ఁ, బ్రీతిం దనదివ్యమూర్తి వెలయించెఁ గృపన్.202
వ. అట్టి సాక్షాత్కారంబు సంభవించిన నతండు.203
మ. జలజిం జక్రి గృపాణి గార్ముకి గదిన్ సంవీతపీతాంబరున్
     విలసత్కౌ స్తుభవక్షుఁ గుండలవిభావిద్యోతవక్త్రాంబుజున్
     జలదశ్యామశరీరుఁ జారుమకుటస్రగ్గంధమూర్ధు న్నిరా
     కులతార్క్ష్యాంసవిభాసితుం గనియె నాగోవిందు నంతర్గతిన్.204
వ. తదీయమాహాత్మ్యంబును దన బుద్ధిగోచరంబుగా నధిగమించె నిట్లు దేవదేవునిఁ
     బ్రత్యక్షంబుగాఁ గనిన తెఱంగున నంతరంగదర్శనంబున నెఱింగి.205
క. అరమోడ్చినకన్నులు సుస్థిర మగునాసనము నచలదేహంబును న
     ప్పరుసునన యుండఁగా ని, ర్భరసమ్మోదానుభవవిభాసితుఁ డగుచున్.206
మ. హరి నాత్మేశ్వరు విశ్వరక్షకుఁ ద్రిలోకారాధ్యు నిమ్మాడ్కి నే
     నరుదందం దఁగఁ గంటి నెందును గృతార్థారంభ మిక్కార్య మిం
     కరయంగా నొకఁ డెద్ది నీచపుఁ బిజాచావేశముం బాసితి
     న్బరమానందవిధాయి సిద్ధపదముం బ్రాప్యంబ నా కిమ్మెయిన్.207
క. నాయనుజుఁడు ననిశము నా, రాయణచరణాబ్జచింత నాసక్తుఁడ వాఁ
     డాయనువునఁ బరమేశ్వర, సాయుజ్యము పడయుఁ గాత సముపాగతితోన్.208
వ. అని తలంచుచు మున్ను నియమింపఁబడిన శ్రోణపవనంబు నొయ్యన వదల విడిచి
     యోగాసనంబు సడలి శరీరసన్నాహం బెడలి కన్నులు విచ్చి ముందట.209
క. తనయంతఃకరణంబున, వినుతం బగుభక్తియోగవిశదాలోకం
     బునఁ గానఁబడినతెఱఁగున, దనరినయదునాథుఁ గనియెఁ దనబాహ్యమునన్.210
క. ఏపగిదిఁ దలఁచుభక్తుం, డాపగిదిన తోఁచు నీశుఁ డనుపల్కు నిజం
     బై పొలుపుగ నమ్మెయిఁ బొడ, సూపిన పరమాత్ముఁ గృష్ణుఁ జూచి ముదమునన్.211

ఘంటాకర్ణుఁడు శ్రీకృష్ణమూర్తిం బొడగని స్తుతించుట

వ. ఘంటాకర్ణుండు సముత్థితుం డై సమ్మదాట్టహాసంబుతో నర్తనంబు సేసి.212
క. హరిఁ గంటిఁ గృష్ణుఁ గంటిం, పరమేశ్వరుఁ గంటి భక్తభయహరుఁ గంటిం
     బురుషోత్తముఁ డచ్యుతుఁ డీ, శ్వరుఁ డభవుఁడు వీఁడే వీఁడె సమ్ముఖుఁ డయ్యెన్.213
తే. ఏను భక్తితో మనసున నెంతయేని, మరగి వెదకంగఁ దోఁచినమాడ్కి రూపు
     వెలుపలను దోఁచె నీతనివెనుక నింకఁ, దగిలి విడువక బంటనై నెగడువాఁడ.214

క. ఆశార్ఙ్గధన్వుఁ డీతం, డాశంఖసుదర్శనాబ్జహస్తుఁ డితం డా
     పేశలనవజలధరసం, కాశశరీరుండు నలఘుకరుణుఁడు బుద్ధిన్.215
తే. పసిఁడిబొమ్మ నీలపురాతిపలకఁ జెంది, యున్నతెఱంగున బేరురం బొందె లక్ష్మి
     నెఱసి బెరయంగఁ బాలమున్నీటినడుమఁ, బవ్వళించునిత్యానందబావుఁ డితఁడు.216
క. లోకంబుల సృజియించును నాకలితముగాఁగఁ బ్రోచి యన్నియుఁ బిదపన్
     లోకడుపున నడఁగించుమ, హాకర్మరుఁ డితఁ డచింతితాత్ముఁడు మహిమన్.217
సీ. మధుకైటభాసురమథనుఁడై లయసుప్తి నిద్రించి దంష్ట్రియై భద్ర దంష్ట్ర
     నిల యె త్తి కూర్మ మై యలఘుశైలము మోచి నరసింహుడై దైత్యునురము వ్రచ్చి
     కుబ్జుఁడై మూఁడడుగుల మూడుజగములు గొలిచి భార్గవుఁడునై కుతలపతులఁ
     దునుమాడి దశరథతనయుఁడై రావణుఁ బరిమార్చి [39]రోహిణిపట్టి యనఁగ
తే. నొప్పు నన్నయుఁ దానునై యుర్వి నిపుడు, దేవకీసూనుఁడై యున్న దేవదేవుఁ
     డితఁడు పూతనాప్రాణపాయితఁ దలిర్చెఁ, బురిటిపాపఁడై యొప్పారు పరువమునను.218
క. బోరగిలఁగ నించుకయును, నేరనినాఁ డడరిపోవ నెట్టనఁ ద్రోచెం
     గ్రూరశకటంబు చరణాం, భోరుహతలమున నితం డపూర్వపుశక్తిన్.219
తే. ముద్దులాఁడయి వ్రేఁతల మొజంఱఁగి పాలు, వెన్నలును దాఁపరింపంగఁ దన్నుఁ బట్టి
     తల్లి రోలితో దామెనత్రాటఁ గట్ట, నీతఁడ కాఁడె మద్దులు గూల్చి యేపుసూపె.220
క. కాళిందిలోనఁ దిరిగెడు, కాళియనాగంబుఁ గిట్టి కట్టలుక విష
     జ్వాలలు గ్రక్కఁగఁ ద్రొక్కఁడె, నోలి నితఁడు తత్ఫణంబు లొక్కొట [40]నలియన్.221
క. గోవర్ధనపర్వతమును, గోవులకై యెత్తె నితఁడు గొడుగుగ మరి యా
     దేవేంద్రు నంతవానిన్, సావజ్ఞతం జూడఁడే [41]పదానతుఁడైనన్.222
క. తనయౌవనంబు గోపీ, స్తనభరభోగమున భవము చరితార్థముగా
     ననుపముఁ డితఁడు బృందా, వనమునఁ గ్రీడించె గోషవర్గము గొలువన్.223
క. వృషభాకారంబున దు, ర్విషహతురంగాకృతిని ధరించినదేవ
     ద్విషుల నని ద్రుంచె సర్వం, కషబలుఁ డీతండకాఁడె ఘనగోష్ఠమునన్.224
క. ఈ దేవుఁడు యమునాజల, మాదర్శము గాఁగఁ జూపె నక్రూరున క
     య్యాదితనువు గ్రమ్మఱఁ ద, ద్భేదత యాయొడలియంద వెలయించె లలిన్.225
తే. రజకుఁ బొరిగొని కొనియఁ జీరలు సుగంధ, పుష్పదాయికి నొసఁగె నద్భుతవిభూతి
     గంధకారిక కప్సరోంగనలకంటే, నిచ్చె నెక్కుడుసౌందర్య మవ్విభుండు.226
క. బాణాసనంబు విఱిచిన, పాణిన గజకుంభతలము పగిలించి వెసన్
     జాణూరువీఁపు విఱిచె ధు, రీణభుజుం డీయశోగరిష్ఠుఁడు కడఁకన్.227

సీ. కంసకురంగవిధ్వంసనకేసరి మాగధతృణమహామారుతుండు
     యవనజీవితసముద్ధరణకృతాంతుండు రుక్మిమానద్రుమ[42]ధ్రువపరశువు
     మురపాశక ర్తనోన్ముద్రలవిత్రంబు నరకతమిస్రసంహరణహేళి
     యదితిదుఃఖోచ్ఛేదనావంధ్యధర్మంబు సత్యామనోరథాశ్చర్యదాత
తే. యీతఁ డీస్వామి నిటుఁగంటి నేమిభంగి, నెంత సుకృతినో యేను జన్మాంతరమున
     నెట్లు గదియుదు కానిక కేమి యిత్తు, నితని కే మని భాషింతు నీతనితోడ.228
క. జయ గోవింద జనార్దన, జయ మాధవ కృష్ణ వరద సర్వజ్ఞ హరీ
     జయవిజయసఖ జగన్మయ, జయ నారాయణ ముకుంద జయ చక్రధరా.229
తే. ఇదె నమస్కార మంజలి యిదె మహాత్మ, యిదె సమస్తాంగసన్నతి యీశ్వరేశ
     యిదె శరణ్యంబ శరణంబ యెపుడు గోరు, తలఁపు రక్షించు జగదేకధర్మి నన్ను.230
వ. అని యివ్విధంబులం బ్రశంసానురూపంబు లగువాక్కలాపంబులు విస్తరించి
     మఱియును వికృతంబుగా నర్తించి శూలప్రోతం బైనశవంబు నొక్కటిఁ బుచ్చి
     ఖడ్గంబున రెండువ్రయ్యలుగాఁ జీరి శౌరముందట సమర్పించి సలిలంబున సంప్రో
     క్షించి ఖడ్గంబు దొలఁగఁబెట్టి చేతులు మొగిడ్చి.231
మ. ఇదె భూదేవశవంబు పావనము నీ కే భక్తి నర్పించెదన్
     విదితం బెక్కుడు సర్వవర్ణములకున్ విప్రాళి యట్లౌట నిం
     పు దలిర్పంగ మదర్పణంబు త్రిజగత్పూజ్య భుజింపం దగున్
     సదయాత్ముల్ నతు లైనయాశ్రితులయర్చల్ గొండ్రు నిశ్శంకతన్.232
వ. అనిన నతండు తదీయం బగుపిశాచభావబీభత్సంబు సూచి వీనికి మద్భక్తియుక్తి
     యెంతగలిగియు నైసర్గికదోషంబు నిడువఁ డిబ్భంగి నీచజాతియందును భక్తపక్ష
     పాతంబు గలుగుటఁ జేసి కృపసేయవలసి యున్నయది యెట్లైన నేమి యేను నా
     దైనదయాళుత్వంబు నెఱపెదఁగాక యని విచారించి యతనిం గనుంగొని.233
క. పీనుఁగు నంటరు మాదృశు, లై నెగడెడుపెద్దవార లందును జూడం
     గాను మహామానోన్నత! యీనీచపుఁ బూజనంబు హేయము నాకున్.234
మ. సకలప్రాణిసముచ్చయంబునకు నర్చ్యం బగ్రగణ్యంబు వి
     ప్రకులం బక్కట యేఁ దినం దగునె ఘోరం బైనహింసాదరం
     బొకసామాన్యపిశాచజాతులకుఁ గా కోహో యనర్హంబు నీ
     కకలంకాత్మున కిట్టిచేత మహనీయారంభ మెబ్భంగులన్.235
మ. అనిశంబున్ హృదయంబునందు నను నభ్యాసీనుఁ గావించి యెం
     దును మత్పుణ్యగుణావళి వినుతి కుద్యోగించుచున్ జన్మ మీ

     ట్లనఘా పుచ్చితి నీవు గావునఁ బ్రమోదాత్ముండ నైతిం గృపం
     [43]గని నీ కిత్తు నమర్త్యతుల్య మగునాకం బెందుఁ గీర్త్యంబుగాన్.236
వ. అని యానతిచ్చి వరదవరేణ్యుం డగు నాసర్వలోకశరణ్యుం డప్పుణ్యుదేహంబు
     మోదావహం బగు తన దివ్యపాణిపయోరుహంబున సంస్పర్శనంబు సేసిన.237

ఘంటాకర్ణుఁడు పిశాచదేహంబు వదలి పుణ్యలోకంబునకుం బోవుట

తే. పరుసవేది సోఁకుటయును బరుషలోహ, మధికశుద్ధసువర్ణ మైనట్టిపోల్కి
     నతని కేలుదామర సోఁకి యాక్షణంబ, [44]యాపిశాచరూపము మాని యద్భుతముగ.238
చ. అమరులు సిద్ధు లాదిమును లాదిగ దివ్యతపంబు భవ్యయో
     గముఁ దగ నిర్వహించియును గానఁగ నేరని యట్టి దివ్యరూ
     పము ధరియించె సర్వగుణభాసిగ నాతఁడు చారుగంధవ
     స్త్రమహితభూషణావళులు తత్సదృశోదయలీలఁ బొల్పుగాన్.239
క. అది యట్టిద యచ్యుతుఁ దన, హృదయంబునఁ దాల్చుసుకృతి కెచ్చోటను నె
     య్యదియును బ్రాఁతియె యణిమా, ద్యుదితపదము లతనిచేత నున్నవి గావే.240
వ. ఇట్లు సిద్ధత్వంబు నొంది సిద్ధపూర్వాంగుం డైన యనంగుభంగి నంగీకృతాద్భుత
     దేహుం డైన మేఘవాహువిధంబున నక్షయతనులాభాతిశయుం డైన తారాద
     యితుచందంబున నానందమయశరీరుం డైనయయ్యుదారుదెస నాలోకించి యా
     లోకేశ్వరుండు.241
మ. త్రిదివం బెంతటిదాఁక నేలు నెలమిన్ దేవేంద్రుఁ డందాఁక స
     మ్మద మొప్పారఁ దదీయమిత్రపదవిన్ ధన్యుండ వై యుండు త
     త్పదవిచ్ఛేదము పిమ్మటం బ్రకటమత్సాయుజ్యసంప్రాప్తి నీ
     కొదవున్ వేల్పులకైన నంద దది నీవొక్కండవుం డక్కఁగాన్.242
క. వరముగ నిచ్చితి నీకున్, గురుత్వదశ మింతకంటెఁ గోరిక మదిలోఁ
     దిరముగఁ గలిగిన నడుగుము, సురాసురప్రముఖులకు నసులభమ యేనిన్.243
వ. అనిన ఘంటాకర్ణుం డుదీర్ణపూర్ణుం డగుచు నీలవర్ణునకు సాష్టాంగప్రణతుం డై
     లేచి నిలుచుండి మొగిచిన కేలు ఫాలంబునం గదియించి.244
ఉ. దేవర సుప్రసాదశుభదృష్టిసుధావిసరంబు నాపయిన్
     వావిరి వెల్లిగొల్పితి మనంబున కింకొకవెల్తి గల్గునే
     దేవకులేశ యైనను మదీయమనీష నితాంతభక్తి నే
     త్రోవల నెమ్మెయిం దొలఁగఁ ద్రొక్కక నిన్ భజియింపఁ జేయవే.245
వ. అనిన నవ్వరం బట్ల యొసంగి వాసు దేవుం డతని వీడ్కొలిపె నాసిద్ధుండును సిద్ధ
     గతి నరిగె నని.246

క. అభిమన్యుపౌత్రునకు వా, గ్విభవసమర్ధుఁడు ముకుందవృత్తంబు ముని
     ప్రభుఁ డగు వైశంపాయనుఁ, డభయుఁడు వినుపించె నట్టి నఖిలముఁ దెలియన్.247
మ. భుజగేంద్రాయితభూరిభూభరణవిస్ఫూర్జద్భుజ శ్రీభుజ
     త్యజితా(?)నేకనరేంద్రవర్గ(?)మతిమత్సంభావ్యసర్గా మహా
     భుజగారిధ్వజతత్వబోధన యశోభూయిష్ఠ తేజోధనా
     భుజగాకల్పక కల్పభూజమహితా పూజోల్లసద్భాసితా.(?)248
క. రత్నాకరనాయక గుణ, రత్నోజ్జ్వలరెడ్డిమల్ల రాజితశశ్వ
     ద్యత్నాంతర్ద్వీపాంతర, రత్నాలంకృత సమస్తరాజ్యరమాంగా.249
మాలిని. నయవినయసమర్థా నైజసంవిత్కృతార్థా
     జయవిభవధురీణా సాధురక్షాత్మప్రాణా
     హయహృదయవిధిజ్ఞా హాపితాన్యాధిపాజ్ఞా
     గయనృగునలతుల్యా గాఢకల్యాణకల్యా.250
గద్యము. ఇది శ్రీశంకరస్వామిసంయమీశ్వరచరణసరోరుహధ్యానానందసౌందర్య
     ధుర్య శ్రీ సూర్యసుకవిసంభవ శంభుదాసలక్షణాభిధేయ యెఱ్ఱయనామ
     ధేయప్రణీతం బైన హరివంశంబున నుత్తరభాగంబునందుఁ బంచమాశ్వాసము.

  1. నమితోద్భవమూర్తి యగు
  2. నాదుస్థితికి
  3. భక్తి గీర్తించి రందఱఁ బ్రభుతనాత్మ నలరి, కొండ్రింతయును స్రుక్కి రద టడంగి.
  4. పాపంబున్ మముఁ జెంద దొంద దొకఁడున్.
  5. విస్వరముల
  6. నెల్లి వఱసియు వస్త్రముల్ వెలయఁజేసి
  7. మంతనంబులు
  8. యన్ బ్రభువిఁకన్; సేయ ప్రభుఁడే.
  9. య, భజన మిందు
  10. మఱియు న
  11. యుదర్కోదయంబు
  12. చాల నలరె
  13. మాకునుఁ దనబుద్ధి ప్రాప కా నమరులు
  14. నాసన: నాచార్యు.
  15. దగిన
  16. జూచితిన్
  17. బుద్ధి
  18. వికటంపుటెరకల విసరునుప్పొంగుడుబ్బున నబ్జభాండంబు బూరటిలఁగ
  19. గుహ
  20. కటీసద్
  21. గుతుకమున నంతన్
  22. ఱార్త
  23. శైలంబులన్
  24. సెలతియై యొప్ప యింపారిఁ జేయుటయును
  25. లొలయ
  26. నకలుషు
  27. సమ్మార్ఛన్
  28. ల్దెచ్చి
  29. గృష్ణు నీశ్వరునికంటెన్
  30. మూర్తితో
  31. వెలార్చె నట్టి
  32. వేశోద్యతు
  33. ప్రార్థ్యు
  34. ంగ్రాంతం బగు
  35. సేయుచునున్నవి
  36. దరమియేయు
  37. నోకృష్ణ
  38. నేతర తద్దివ్యమూర్తి నెలయించె
  39. రేవతిపతి యనంగ
  40. జదియన్
  41. సదా
  42. ధృత
  43. గను నీ కిచ్చెద గరతుల్యమగుపాఠం బెందు
  44. యప్పిశాచభావము మాని