హంసవింశతి/పదునాఱవ రాత్రి కథ

వికీసోర్స్ నుండి

పదునాఱవ రాత్రి కథ

జాలరిబిత్తరి తైర్థికునిఁ గూడుట

మ. పొగడం జొప్పడు సౌరసేనజగతిన్ బుణ్యోపలబ్దం బనే
నగరం బొక్కటి యందుఁగాఁపుర ముదీర్ఘప్రౌఢితోనుండు భ
ద్రగుణాపేతుఁడు సూతవంశజుఁడు కుద్దాలాభిధానంబునన్
దగఁ బెంపొందినవాఁడు రూపజితకందర్పుండు భామామణీ! 179

తే. రాజ నలరాజ రతిరాజ రామరాజ
రాజ రాజాత్మ జామర్త్యరాజజ వన
రాజ రాజిత రేఖా విరాజమాన
సౌష్టవాకార సంపత్తి జరగు నతఁడు. 180

క. తరణి జని తరణి ధరణీ
తరుణీ రమణీయ వేణిఁ దత నిర్ఘరిణీ
వర రమణీమణి శ్రిత జన
దురితాటవ్యరణి సుగుణ ధోరణి యమునన్. 181

పడవలు, వలలు, జలచరములు

తే. ఈదుకొయ్యలు తెప్పలు నీఁదుకాయ
లరడ లరికోళ్లు పడవలు తరులు పుట్లు
చేపడవ లోడ లాదిగాఁ జెలఁగునట్టి
యంబుతరణంబులకు నెల్ల నధిపుఁడతఁడు. 182

క. ఆకర్ణదఘ్న పుణ్యక
థాకథన లలిత హృదయుఁ డసమాన యశుం
డా కర్ణధారుఁ డంహతి
ధీకర్ణుఁడు ధీవరకుల దేవుం డరయన్. 187

తే. కొడమ తిఱ్ఱడ్డకొడమ ద్రొబ్బుడు పటంబు
చాప యెత్తెల గూడయు జల్లిగూడ
లుంట గాలంబు తెరదీము లుసురుగాల
మొసుకు గొరకు పుణుకు సొక్కు లెసఁగుచుండు. 184

క. మెడవల సన్నపువల త్రో
పుడువల డొంకవల మింట ముక్కిడివల దాఁ
టుడువల సింగిత మనుకువ
లెడవల కుండెవల లాదు లెసఁగెడి వలలున్. 185

సీ. నీరు కుమ్మరపుర్వు నీరీఁగె తలకప్ప
తెలిదమ్మ కరివేల పొలికె నత్త
గుల్ల చుట్టుడుగుల్ల కురిమింద నాచుడు
గవ్వ మురుండము కాకిచిప్ప
యెఱగుల్ల నులిగుల్ల పురుగు గోచురుగప్ప
కప్ప కత్తరి యెండ్రకాయ జెలగ
గులకరింతయు నీరుగట్టు శంఖనఖంబు
పలుకాసి నసిమిరి బంగపురువు
తే. పెలుక నిర్లూత కోఁచు తాబేలు పిడక
మొసలి శింశుమారము పెద్దమొసలి నీరు
పాప నీరేన్గు నీర్బలి ప్రాచి పురువు
లాడి కొఱగాని జంతువు లన్ని విడిచి. 186

సీ. కొరద దాసరికొయ్య కొఱ్ఱమీ నులస ము
చ్చంగి బేడిస జెల్ల చాఱమీను
వాలుగ ముకుదొమ్మ వల్లికతట్ట పు
త్తడికాసు పూమీను కడిసెలంబు
పక్కె చిత్తర నీరుపాపెర మలుగు మీ
నరుజు నిల్లెపుఁజేప యాకుజెల్ల

తే. మిసి కల్లురుజు నడమీను తొల్లిక ఱాతి
గొరక మాపురమును గుంటముక్కు
తే. మోరపక్కెర దొందును గూరముక్కు
పుల్లురుజు గెజ్జె గెండయు బొమ్మడాయ
యల్లె దమ్ముప్పుచేఁపయు గొల్లదొందు
పరిగె రొయ్యాదియగు మీలఁ బట్టునతఁడు. 187

క. కులనాయకపుం జాలరి
కులనాయక తాంబుతరణ కోటీశత్వం
బులు జారి క్రియాశాసన
మలవడఁ గుద్దాలుఁ డందఱౌనన మెలఁగున్. 188

తే. మేలు బలువాలుగలనేలు మిసిమి గ్రాలు
కన్నుగవడాలు మరునాలుకరణిఁ బోలు
మురిపెముల పోలు కలదొక్క ముద్దరాలు
వాని యిల్లాలు దొమ్మరవాని డోలు. 189

తే. దాని నామంబు తగు భద్రసేన యనఁగ
రూపయౌవన గరిమ నారూఢికెక్కి
యీడు జోడును సరిసాటి యెందులేక
విఱ్ఱవీఁగుచు నుండు నా విద్రుమోష్ఠి. 190

సీ. జడ చిల్వ యాస్యంబు శశి నొసల్ నెల బొమల్
ధనువు లక్షులు తొవల్ నాస గంధ
ఫలి చెవుల్ శ్రీల్ దంతములు మొల్ల లధరంబు
తలిరు చెక్కిళ్ళద్దములు గళంబు
జిగిశంఖ మంగుళుల్ పగడాలు కరము ల
బ్జములు కక్షములు భోగములు భుజము
లు లతలు గుబ్బలద్రులు వళులూర్ములా
వాల్నాభి గుహ కౌను బయలు కటిల



తే. తొడ లనంట్లు మోఁకాళ్లు బిరడలు పిక్క
లు శరథులు గుల్భము లరడలు ప్రపదములు
కూర్మములు గోఱ లుడు లడుగులు మహోత్ప
లములు వెన్ పల్కయై యొప్పు లలన కెపుడు. 191

క. కెంపా? వాతెర జిగిబిగి
శంపా? నునుమేను, మోముసౌ రిందుని మేల్
సొంపా? బలభిన్మణి ఘృణి
గుంపా? కుంతలవిభూతి కోమలి కెన్నన్. 192

సీ. సారంగ సారంగ సారంగములఁ గేరు
గమనంబు కనుదోయి కచభరంబు
సారాజ్జ సారాబ్జ సారాబ్జముల నేలు
వదనంబు కంఠంబు పదయుగంబు
పున్నాగ పున్నాగ పున్నాగములఁ బోలుఁ
దీరైన నాభి నూఁగారు నడుము
తారక తారక తారకమ్ముల మీఱు
దంతముల్ నఖములు దరహసములు
తే. వడిఁ బ్రవాళ ప్రవాళ ప్రవాళగతి న
దల్చు భుజములు వేళ్లు నెత్తావి మోవి
రమ్యతర చక్ర చక్ర చక్రములఁ దెగడు
ముదిత జఘనంబు చనుగవ ముణుఁగు లరయ. 193

క. మబ్బులు గ్రమ్మెడి క్రొమ్ముడి
జొబ్బిల్లెడి తేనెమోవి సొబగౌ మొగమున్
సిబ్బెంపు గబ్బి గుబ్బలు
నిబ్బరమౌ పిఱుఁదు తొడలనిగ్గు చెలంగున్. 194



సి. మృగధర బింబంబు మెలఁత నెమ్మోము మృ
గంబు కన్దోయి ధరంబు లుదుటు
గబ్బిసిబ్బెపుఁ జనుగుబ్బలు బింబంబు
తావి చక్కెరలొల్కు మోవి ఠీవి
సుమచాపబాణంబు లమరు పాదమ్ములు
సుమములు నవ్వు చాపములు బొమలు
బాణముల్ క్రొవ్వాఁడి రాణించు వాల్చూపు
లళులు నిద్దపుఁ గుటిలాలకమ్ము
తే. లమృతద రమావిహారమ్ము లలరుకురులు
నమృతములు పల్కులు దరమ్ము రమణిగళము
మావికెంపు చివుళ్లు సమ్యక్కరములు
హారములు దంతపంక్తి సోయగము లరయ. 195

ఆ. భ్రమరకములఁ బోలు భ్రమరకముల డాలు
పృథు లకుచము లొఱయుఁ బృథుల కుచము
లతనుభామఁ గేరు నతను భామాకృతి
యలరుఁ గొమ్మఁ దెగడు నలరుఁగొమ్మ. 196

శా. ఆ రాజన్ముఖ మా వినీలచికురం బా చెక్కుటద్దంబు లా
శ్రీరమ్యాధర మా భుజాలతిక లా సిబ్బెంపుఁ జన్గుబ్బజో
డా రోమావళి పొంక మా నడల యొయ్యారంబు వీక్షింప న
మ్మారుండైనను దాని సంగతికిఁ బ్రేమన్ బంటు గాకుండునే! 197

తే. అదియు జవ్వన ముదయించినది మొదలుగ
సంగమాపేక్ష తల కెక్కి చారిఁ దివురు
నంత నుపకాంత సంగతి యబ్బేనేని
యాకసము తూఁటు వొడుచుకయైనఁ జనును. 198

సీ. కలికి చొకాటంపు బెళుకుచూపుల ముద్దు
కనుబొమల్ జంకించుకొనెడు హొయలు



కలయిక మాటలఁ గరఁగించు చెలువంబు
లాస పుట్టఁగ నవ్వునట్టి నేర్పు
తేలించి చేతులు ద్రిప్పెడు పొంకంబు
హర్షించి తాను చుక్కనెడు సొబగు
చిన్నెల పసఁజూపి సన్నఁ జేసెడి తీరు
ముక్కుపై వ్రేలిడి చొక్కు వగలు
తే. వలుఁద గుబ్బలఁ బయ్యెద వైచు ఠీవి
నఱకు మెట్టెలు రొదలిన నడుచు సొగసు
విను త్రిలోకము లందుండు వెలఁదు లందుఁ
గానఁబడ దెన్నటికి నైనఁ గమలగంధి! 199

తే. అదియుఁ గ్రొవ్వున వీఁడువాఁడనక చొచ్చి
టెక్కు గలవాని చూపు సొంపెక్కువాని
బలము గలవాని రతులఁ బేర్వడిన వానిఁ
గనిన విడువదు వానితోఁ గలిసి కాని. 200

వ. ఇట్లు ప్రతిదినప్రవర్ధమానానూనమోహాతిరేకంబున నన్యమానవవితానమీనకేతనాయోధనాధీనమానసాంభోజయై యయ్యంభోజనయన విజృంభించి మెలంగుచున్న యవసరంబున. 201

చ. ఒకఁడు కిరాతదేశమున నుండెడు కోమటి పోలిసెట్టి పు
త్రకుఁడు హిరణ్యనామకుఁడు తండ్రి యదల్చిన నల్కతో సఖి
ప్రకరము గొల్వఁగా సుకృతపాటవ మొప్ప మహానదుల్ నిధుల్
సకలముఁ జూడఁగోరి చనె సత్వరయానమునన్ ముదంబునన్. 202

వ. ఇట్లు చని చని. 203

పుణ్యక్షేత్ర తీర్థ విశేషములు

ఆ. బదరికా గుహేక్షు కదళికా చంపక
నహుష దేవదారు నైమిశములు
దండకావనంబుఁ దనరు వింధ్యాటవి
యాది యగు మహావనాళు లరసి. 204

సీసమాలిక.
గంగ సరస్వతి కాళింది గౌతమి
చిత్రోత్పల విశాల శీత చంద్ర
భాగ కావేరి విపాశ సితాలక
శీతలవాహినీ సింధు సరయు
గిరి యిరావతి గండకి దశార్ణ కృష్ణవే
జిక శంబమాల దేవిక తృణఘ్ని
బహుళ విశాఖిని బ్రహ్మభాగ సురాప
వాలుకా వాహిని వర్ధమాన
శోకావధూత పినాకిని ఋభు తామ్ర
పర్ణి పలని తామ్రవతి వితద్రు
నర్మద బాహుద నంద చిత్రిత యుత్స
లావతి కపిల మాల్యవతి త్రిదివ
లక్షణ హరిణిక లాంగలిని త్రిసామ
ద్యుమతి కుముద్వతి తుంగభద్ర
ఋషిత జితావగ ఋజ్వభద్ర సునంది
భృగువర గండకి భీమరథి మ
హాజల గోమతి హంసావళీశ్వర
గండక హరిగండక శతభద్ర
బ్రహ్మగండిక నీల పద్మావ తీశావ
తి హిరణ్య శాఖావతి హిమ క్రౌంచ

హరితల మానస హంసకంబు సుమేఘ
సౌభద్ర కౌశిక చక్రధార
శ్యామ మహోత్కట సోమ మహా వక్ర
శౌక్లి పాశావతి చంద్రమత్త
పంచగం ధ్యరుణ ప్రభాంజని వల్లవ
వజ్రవాలుక శూక వరుణ వక్ర
పంచ మహామాయి ఫల్గుణి సురకర్తృ
ష ధనుష్మతి వితస్త చంద్రవక్ర
స్కందావతి సమూల చక్షు కదంబక
పుండరీక పయోష్ఠి భూత పాద
కూట వైఘయుఁ జిత్రకూట వేదవతి న
క్రవతి వేగవతి వేత్రవతి గర్భ
వతి యింద్రనందియుఁ గృతమాల కృష్ణ పా
ద జయంత వంద శ్యాత్రాఖ్య శుక్తి
మతి హరిధృతి సువర్ణతటి మణిప్రభ
ప్లక్ష కుజల పిప్పల శుచి సింధు
వర్ణ కాశ్యపి మణికర్ణిక మందాకి
ని మలప్రహారి సానుమతి క్షీర
కౌమోదకీ సఖీస్వామిక కరతాల
వేదత్రయి మయూఖ విలయ విదిత
భవనాశనియు సర్వ పాపహ కిటికక్ష
ప్రోద వేదస్వ జంబూక కుంభ
కరణి త్రిసంధ్యయు గాయత్రి ఋషికుల్వ
ప్రభ విష్ణువు వికూట రత్న కృష్ణ
తోయ పాపఘ్ని విద్యుత దౌర్గ్య సర్వద
వైర్ణ దృష్టి ద్యుతి వందవార
శీఘ్రోదయుఁ బ్రణీత చెయ్యేఱు గుండ్లక
మ్మయుఁ గుందు మొదలుగా మహిఁ దనర్చు



తే. పుణ్యకూలంకషాబృందముల నమంద
వికస దరవింద గంధిల విమల కమల
ఝర వరంబుల నురుభక్తి జలక మాడి
సకల దానాది సత్క్రియల్ సలిపెనంత. 205

తే. శార్ఙ్గకోటి గదాకోటి శంఖకోటి
చక్రకోటి సరఃకోటి చంద్రకోటి
సిద్ధకోటి మహాకోటి చిత్రకోటి
పుణ్యకోటి ధనుష్కోటి ముక్తి కోటి. 206

తే. పద్మసరసి మంద్రసరసి బ్రహ్మసరసి
శుభ్రసరసి మహాసర సభ్రసరసి
గృధ్రసర సిందుసరసిని క్షీరసరసి
మానససరసి నన్నిఁట స్నానమాడె. 207

సీ. స్వామి పుష్కరిణిలో స్నానంబు గావించి
శశి పుష్కరిణి నీళ్లు చల్లు లాడి
చంద్ర పుష్కరిణిలో జలకంబు ఘటియించి
సోమ పుష్కరిణిలోఁ జొచ్చి పొరలి
గుహ పుష్కరిణి నీఁత కొమరొప్ప నొనరించి
యమృత పుష్కరిణి నాడి వెడలి
నిత్య పుష్కరిణిలో నీళ్లాడి చిత్రపు
ష్కరిణిలొ స్నాతకక్రమముఁ జూపి
తే. శంఖ పుష్కరిణిని గ్రుంకి చక్ర పుష్క
రిణి మునిఁగి దేవతా పుష్కరిణిఁ దొలంచి
క్షీర పుష్కరిణిని దూకి సేతు పుష్క
[1]రణిని మజ్జన మాడి సరాళముగను. 208



సీసమాలిక.
మత్స్య కూర్మ వరాహ మాండవ్య నరసింహ
రామ పరశురామ రామ వామ
న మహేంద్ర చక్ర గో నారద శంఖ పాం
డవ శార్ఙ్గి పక్ష్యగస్త్య విజయ జయ
కపిల వసిష్ఠ మార్కండేయ భృగు జహ్ను
వాయు మునిబ్రహ్మ వరుణ విష్ణు
ధర్మ పరాశర దామోదర కపింజ
ల శుక కౌండిన్య గాలవ హిరణ్య
వసు కృష్ణ శాండిల్య వజ్ర కౌశిక ధనం
జయ ముక్తి దేవర్షి శర్వ పిప్ప
ల సరస్వతీ ముద్గల భరత పర్వత
పరమ కాశ్యప శేష పంచగోప
రైధ్య భరద్వాజ శైభ్య తుంబురు గౌత
మ జటిల భార్గవ మాధవ గురు
బాభ్రవ్య పుణ్య గోపాల ముకుంద త్రి
విక్రమ సౌర గోవింద మోక్ష
కుల్యాచ్యుతామృత గోమద సుర కృప
నారాయణ మను జనార్ధన హరి
వైకుంఠ కేశవ వాసుదేవ పతంజ
లి విరజ ధన్వంతరి కురు భోగ
సావన శ్రీధర పావన ప్రద్యుమ్ను
పురుషో త్తమ పరమ పురుష సిద్ధ
పాతకనాశన పాపహారి ణ్యురు
విమల భాస్కర మధు కమల సోమ
ఆ. నామధేయములను భూమిలో సార్థత్రి
కోటి తీర్థములను మేటి వనఁగఁ

దనరు నట్టి నూట యెనిమిది తీర్థాల
స్నానదాన విధులు సలిపె నంత. 209

క. తిరుకొళము నూయి కోడును
జెఱువు మడువు లొండు కుంట చెలమ పడియ కో
నెఱు బుగ్గ వాఁగు దొనతల
పరి గుండము కాల్వ డిగ్గి బావి దొరువులన్. 210

సీ. సంకల్పములు సెప్ప సాగు బ్రాహ్మణు లుండ
భైరవార్ఘ్యం బిచ్చి భక్తితోడ
స్నానంబు గావించి సంచి మాత్రము దక్కఁ
గల ధనమెల్ల బాపల కొసంగి
కపిలగోఘృతములు క్రముకపర్ణంబులు
గుడుములు ఫలములు గుగ్గిళులును
గానుకల్ వత్తుల కట్టలు పూలస
రాలు గైకొని మోదరసము చిల్క
తే. నార్ధ్రవస్త్రంబు లంగంబు లంట వడఁకి
కొనుచు నమ్రత నడుగడుగునకుఁ బెద్ద
మాట "గోవింద" యనుచును నూట యెనిమి
ది తిరుపతులలో స్వాములఁ దెలియఁజూడ. 211

వ. తరించి మఱియుఁ జని చని. 212

మంజులగతి రగడ.
శ్రీవైకుంఠ క్షేత్రంబునఁ దగు
వాసుదేవునకు వందన మొనరిచి
యామోదస్థలి యందలి సంక
ర్షణునకుఁ గర్ణాచ్ఛాదనముల నిడి

సరవిఁ బ్రమోదస్థలమునఁ జెలఁగిన
ప్రద్యుమ్నునకును బ్రణతి యొనర్చుచు
సమ్మోదాఖ్యస్థలమున నుండెడు
ననిరుద్ధునకు సమారాధన మని
సత్యలోకమున సతత మ్మెనసిన
విష్ణువునకు గోవిందలు సల్పుచు
సూర్యమండలిని సొంపుగఁ బ్రబలిన
పద్మాక్షునకుఁ బ్రపత్తి వహింపుచు
క్షీరాబ్దిస్థలి శేషశయనునకు
హస్త స్వస్తిక మనుబంధింపుచు
శ్వేతద్వీప క్షితిఁ బ్రభవించిన
తారక హరికిని దండము లొసఁగుచు
రమణ బదరికారణ్యం బందలి
నారాయణునకు నమ్రత లొసఁగుచు
నైమిశ పుణ్యవనంబును బొందిన
హరికిని మంగళహారతు లెత్తుచుఁ
దనరు హరిక్షేత్రంబున నెలకొను .
సాలగ్రామస్వామి గణింపుచుఁ
బొసఁగ నయోధ్యాపురిలోఁ జెలఁగెడు
రఘునాయకునకుఁ బ్రణిపాతము లని
మధురాపురిలో మహిమలఁ జెందిన
బాలకృష్ణునకుఁ బ్రాణాచారము
మాయాస్థలిలో మధుసూదనునకు
నిరతం బల్లో నేరే ళ్లనుకొని
కాశీస్థలి భోగశయానునకును
నమరఁగ నూర్థ్వశయంబుఁ జొనుపుచును
దలఁప నవంతీస్థలిలో నవనీ
పతిదేవునకును బ్రాంజలు లిడుచును
ద్వారవతిన్ యాదవకుల భర్తకు

దాళహస్తములు దప్పక కొట్టుచు
వజ్రపురిని దావలమై చిక్కిన
గోపప్రియునకు గొబ్బిళ్లనుచును
వసతిగ బృందావనమున నిలిచిన
నందాత్మజునకు నతులొప్పించుచు
నలరఁ గాళియ హ్రదతలమునఁ గల
గోవిందునకును గొండీ లెన్నుచు
గోవర్ధనమునఁ గొలువై కన్పడు
గోపవేషునకుఁ గొణిగె లొనర్చుచుఁ
దనరు భక్తమోచనము భవఘ్న
స్వామికి హస్తస్తంభనఁ బట్టుచు
మహిమ వెలయ గోమతపర్వతమునఁ
జేరిన శౌరికి సేవలటంచును
రమ్యహరిద్వారమునఁ బ్రసన్నుం
డైన జగత్పతి కభివాదనమని
చాలఁ బ్రయాగ స్థానమ్మునఁ గల
మాధవునకు సన్మానకరంబులు
గయలో సాక్షాత్కారమునొందు గ
దాధరునకు జోతలు చెల్లింపుచు
గంగోదధి సంగస్థలిఁ జెలఁగిన
శ్రీవిష్ణువునకు జేజేలనుచును
జిత్రకూటమున సేమంబందిన
రాఘవునకు నేత్రనిమీలన మని
నందిగ్రామమునను జెలువొందిన
రాక్షసఘ్నుఁడగు రామున కెఱఁగుచు
సరవిఁ బ్రభాస్థలసంచారుండగు
విశ్వరూపునకు వినతులు సేయుచు
శ్రీకూర్మస్థలిఁ జేకొను కూర్మ
స్వామికిఁ బుష్పాంజలు లర్పించుచు

నీలాచలమున నెలకొను పురుషో
త్తమునకు హణిగెలు దండిగఁ జేర్చుచు
సింహాచలమునఁ జెందిన నరసిం
హాకారునకు జొహారులు నెఱపుచుఁ
దులసీవనమునఁ దులకించు గదా
ధరునకు నర్చలు తఱచుగఁ గఱపుచుఁ
గృత శౌచస్థలిఁ గేళిక లొందెడి
పాపఘ్నునకు సపర్యలు సలుపుచు
శ్వేతాద్రిస్థల సింహలోచనున
కెలమిని గేకిస లిచ్చుచు భక్తిని
ధర్మపుర క్షేత్రము యోగానం
దస్వరూపునకు దాస్యము సలుపుచు
శ్రీకాకుళమున సిస్తుగఁ దోచిన
యాంధ్రనాయకున కర్చన మనుచును
ఘనత నహోబల గరుడాద్రి వీర
ణ్యాసుర వధునకు నలిజోబిళ్లని
పాండురంగమునఁ బాటిలు విఠ్ఠల
దేవునకు సదా దిగ్విజయములని
వేంకటగిరిపై వెలసిన తిరువేం
గడ ముడయానులఁగని కానుక లిడి
యాదవ పర్వత మందలి నారా
యణునకు జయజయ లావర్తింపుచు
ఘటికాచలమునఁ గల్గు నృసింహునిఁ
గృపణత్వంబునఁ గీర్తన నడుపుచు
వారణగిరిపై వరదస్వామికి
బిడికిలింతలని పెంపుగ నుడువుచుఁ
గాంచీపురిలోఁ గమలాక్షునకును
మోదము తోడుత ముకుళితకరమని
యొప్పుననుండు యథోక్తస్థలము య

థోక్తకారునకు దోయిలిఁ దీర్పుచుఁ
బరమస్థలిలోఁ బరమేశ్వరునకుఁ
గర మర్థింపుచుఁ గన్నుల మ్రొక్కుచుఁ
బాండవ భూస్థలిఁ బాండవదూతకు
వలగొను బాహులు వైపుగఁ దీర్చుచు
విక్రమస్థలిఁ ద్రివిక్రమ హరికిని
సారెకు సారెకు సాగుబళా యని
కామాళికిలో గణుతికి నెక్కిన
శ్రీనృసింహునకుఁ జేతుల మొగుపని
యష్టభుజస్థలి నష్టభుజునకును
జిత్తము రంజిలఁ జిన్ని పువ్వులని
ప్రవాళస్థలినిఁ బ్రవాళవర్ణునకు
నమర నమోనమ యని వర్ణింపుచు
దీపాళస్థలి దీపాభునకును
మోహముతోడ నమోవాకంబని
రాజిలు గృధ్రసరస్తీరస్థలి
గలుగు విజయరాఘవునకు శరణని
రసికత వీక్షారణ్యశయానుని
వీరరాఘవుని వేఁడుకొందునని
తోతాద్రిస్థలిఁ దుంగళయాన
స్వామికి నిత్యోత్సవములఁ బనిగొని
యలరు గజస్థలమందు గజార్తి
ఘ్నునకు శయద్వయిఁ గోలాటంబని
బలిపురమందున బలియు మహాబల
దేవున కిదిగో తిరువారాధన
భక్తసారమునఁ బ్రబలు జగత్పతి
కిని సంధించిన గిడిగిళ్ళో యని
యైంద్రస్థలమున నవతారముఁ గొను
దేవదేవునకు ధృతహృత్ఫుటములు

గోప పురస్థలి గోపదేవునకు
నెలమిఁ బ్రదక్షిణ మేఁగెద గొబ్బున
శ్రీ ముష్టి స్థలిఁ జెలఁగు వరాహ
స్వామికిఁ జేర్చెదఁ జంకలఁ జేతులు
మహితస్థలమున మసలక పొదలెడు
పద్మాక్షునకును బడువాటులు వడి
శ్రీరంగస్థలి శేషశయనుఁ డగు
రంగస్వామికి రహి మ్రొక్కెదనని
శ్రీరామస్థలి సీతాప్రియునకు
మానక యెపుడు నమస్కారము లని
శ్రీనివాసమను క్షేత్రంబునఁ గల
పూర్ణమూర్తి కిదె పొరిఁ బూజింపని
స్వర్ణమందిర సువర్ణస్వామికి
గేరుచు జరిపెద గిడిగిళ్లనుచును
వ్యాఘ్రపురస్థలి యందు మహాబా
హుస్వామికిఁ గేలొసఁగెద హితముగ
నాకాశనగరమం దనువొందెడు
హరిమూర్తికి నిదె యప్పాల్ దిరిగెదఁ
బరఁగ నుత్పలాపతగ స్థానం
బందలి శౌరికి నారాధన మని
మణికూటస్థలి మలయు మణి ప్రభు
పెరుమాళ్లకుఁ గడుఁ బింపిళ్లాడుచు
విష్ణుపురంబున విలసిల్లు మహా
విష్ణుస్వామికి వెన్నెల కోళ్ళని
భక్తస్థానము భక్తిప్రదునకుఁ
బొసఁగఁగఁ జేసెదఁ బొర్లు దండములు
శ్వేతవరాహ క్షేత్రంబందలి
శాంతమూర్తికిని సంసర్గంబులు
నగ్నిపురస్థలి యందు మురద్విషు

నకు నొనరింతుఁ బ్రణామము లూకొని
భార్గవతలమున భరతస్వామికిఁ
గీలించెద లంకెగఁ గేల్ముడతలు
వైకుంఠపురీవాసుండై తగు
మాధవునకును నమస్కృతిఁ బేర్కొని
పురుషోత్తమమునఁ బొల్పగు భక్తస
ఖస్వామికి నిజకైంకర్యం బని
చక్రతీర్థసంచారి సుదర్శన
దేవున్ మదిఁ బ్రార్థించెద ననుచును
గుంభకోణమున గొనకొని కదలని
శార్ఙ్గధరు నుపాసనఁ జేసెద నని
భూతస్థానము పురంబు నెలవగు
శార్ఙ్గస్వామికిఁ జాఁగు బడికెలని
యరయఁ గపిస్థలమందలి దంతా
వళవరదునకు నివాళికరము లని
చైత్రకూటమున సరసతఁ గొల్వగు
గోవిందునకును గొల్పుడు చేతులు
నుత్తమతలమున నుత్తమహరికిని
ఘనతరభక్తిని గైలాటము లని
శ్వేతగ్రావక్షేత్రంబునఁ గల
పద్మలోచనునిఁ బ్రస్తుతి సేయుచుఁ
బార్థస్థలమున బాగుగ నుండు ప
రబ్రహ్మమునకు రామురాము లని
కృష్ణకోటి యను క్షేత్రములోని మ
ధుద్విషునకున్ను నిదె తొంగలిపాట్లని
నందపురీభవనం బందు మహా
నందునకును శరణార్జి ఘటింపుచు
వృషపురస్థలిని విడియు విపాశ్రయ

దేవుని కిదిగో దీవెన కోళ్లని
కడఁక సంగమ గ్రామంబందలి
సంగమమూ ర్తికి సాఁగిలింత లని
తనరు శరణ్యస్థలము శరణ్య
స్వామికి నిదె కై రపుఁ జెయ్యని
చెన్నగు సింహక్షేత్ర మహాసం
హస్వరూపునకు హస్తార్పణ మని
మణిమంటపమున మల్లరి సామికి
పొందించెద గోవింద లటంచును
నిబిడస్థలిలో నిబిడాకార
స్వామికి మతిఁ గైచాపు లొసంగుచు
ధానుష్కస్థలిఁ దలకొను జగతీ
శ్వరునకుఁ బెట్టెద సరిటెంకణ మని
మాహురమందసమానత విడిసిన
కాలమేఘునకుఁ గైమోడుపు లని
చక్కని మధురాస్థానంబునఁ గల
సౌందరరాజస్వామికి మేలని
యనిశంబును వృషభాద్రిని యళఘరి
పేరిటి హరికిని బేడిస లెన్నుచు
వరగుణస్థలవ్యాపకుఁ డగు నా
థస్వామిని మది ధ్యాన మొనర్చుచుఁ
గుళికస్థలమునఁ గూర్చున్న రమా
సఖుని మంత్రపుష్పము లిడి వేఁడుచు
గోష్ఠిపురస్థలి గోష్ఠిపురస్వా
మికి నర్పించెద మేలుకొల్పు లని
దర్భసంస్తరస్థలి శయనించిన
దాశరథికి నతితతు లొనరించుచు
ధన్వి మంగళక తలమున నెలకొను



శౌరికిఁ దగు పరిచర్య లొనర్చుచు
భ్రమరస్థలమునఁ బరఁగు బలాఢ్య
స్వామి సలామని సత్కర మెత్తుచు
ధరణిఁ గురంగస్థల మందలి పూ
స్వామి నవారణమునఁ గొల్చుచు
నవని పటస్థల మందలి విష్ణు
శ్రీమూర్తికి నిదె చెంగనలో యని
ముద్రనదీస్థలి శోభిలుచుండెడు
నచ్యుతునకును శిరో౽వనతుల నిడి
యంత ననంతశయన మందుండెడు
పద్మనాభునకుఁ బాణిమోడ్పు లని
ధృతి నూటెనిమిది తిరుపతులందుల
నవతారంబుల నలరఁగ వెలయుచుఁ
గృపతో మము రక్షించెడు స్వామికి
సలుపుదుఁ బదివేల్ సాష్టాంగంబులు. 213

వ. అని ప్రపత్తిపూర్వకంబుగా నష్టోత్తరశతతిరుపతులు సేవించి, యంత. 214

సీసమాలిక.
అభిషేకవల్లి మోహనవల్లి విద్రుమ
వల్లి చంపకవల్లి వజ్రవల్లి
మకరందవల్లి కోమలవల్లి మాణిక్య
వల్లి చందనవల్లి వచనవల్లి
జంబూరవల్లి కాసారవల్లి వసంత
వల్లి శోభనవల్లి వసుధవల్లి
మరకతవల్లి నిర్మలవల్లి మౌక్తిక
వల్లి కస్తూరివల్లి గంధ
వల్లి విభ్రమవల్లి వర్తులవల్లి వ

రహవల్లి నిక్షేపరాజవల్లి
యంబుజవల్లి విహారవల్లి వినోద
వల్లి నిత్యోత్సవవల్లి చిత్ర
వల్లి మనోహరవల్లి కేతకివల్లి
సారంగవల్లి కర్పూరవల్లి
కల్యాణవల్లి శృంగారవల్లి మనోజ్ఞ
వల్లి మాయకవల్లి స్వచ్ఛవల్లి
సౌభాగ్యపల్లి కేసరవల్లి మాధుర్య
మాలతీవల్లి సామ్రాజ్యవల్లి
మంజులవల్లి సంభ్రమవల్లి శుకపల్లి
నర్తితవల్లి యానందవల్లి
కేయూరవల్లి కోకిలవల్లి సుందర
వల్లి సుమంగళవల్లి మదన
వల్లి సరసవల్లి వైభవవల్లి కి
సలవల్లి రుచివల్లి చారువల్లి
కౌతుకవల్లి శర్కరవల్లి వికసిత
వల్లి మండనవల్లి పరమవల్లి
హసనవ ల్ల్యమృతవల్లి యనురాగవల్లి కు
సుమవల్లి సుఖవల్లి శుభ్రవల్లి
చంచలవల్లి భూషణవల్లి సుకుమార
వల్లి వనజవల్లి వామవల్లి
రంగవ ల్ల్యకలంకరత్నవల్లియు శ్యామ
వల్లి కుండలవల్లి వకుళవల్లి
విచికిలవల్లియు వేదవల్లియుఁ బెరుం
దేవివల్లియు భూమిదేవివల్లి
యలమేలుమంగ తాయారును బీబి నాం
చారు శ్రీరంగ నాంచారు తాయి
కొమరొందు శ్రీచూడికుడుత నాంచారమ్మ
చెలువొందుచుండెడు శ్రీపిరాట్ట

నందగు పేళ్ళఁ జెన్నొందు దయాన్విత
సీతాభిధానలక్ష్మీస్వరూప
తే. ములను నూటెన్మిది తిరుపతుల వసించు
విష్ణుమూర్తులతోఁ గూడి వివిధగతుల
ననుపమవిహారముల మించు
నమ్మవార్ల పాదపంకజముల కతిభక్తి మొక్కి. 215

సీ. వారక పొయిఘాళువారులఁ గొనియాడి
వఱలు పూదత్తాళువార్లఁ గొలిచి
ధీరత బేయాళువారల దర్శించి
పెరియాళువారల పేరుఁ దలఁచి
నమ్మాళువారల నెమ్మదిలో నిల్పి
తిరుమంగయాళ్వార్లఁ దెలియఁ జూచి
తిరుముషి యాళ్వార్లఁ బరికించి మఱి తొండ
రడిపొడి యాళ్వార్ల కడిమిఁ బొగడి
తే. వేడ్కఁ గులశేఖరాళ్వార్ల వినుతిఁ జేసి
మఱి తిరుప్పాణియాళ్వార్ల మఱుఁగుఁ జెంది
మధురకవి యాళువారుల మాట లెన్ని
నాథముని యాళువార్లకు నతులొనర్చి. 216

క. సాక్షా ద్వైకుంఠం బిదె
వీక్షింపుం డనుచుఁ జూపు విధిని బ్రపతిన్
నిక్షేపించి సుమేరుస
దృక్షంబుగ నున్న వైనతేయునిఁ గొలిచెన్. 217

సీ. మత్స్యావతార! నమస్తే మహాకూర్మ
దేహ! నమస్తే వరాహవర! న

మస్తే నృసింహ! నమస్తే వటో! నమ
స్తే భృగుకుల నమస్తే దశరథ
తనయ! నమస్తే౽ర్కతనయా విభేదనో
ద్దండ దోర్దండ ప్రచండ విక్ర
మక్రమోదగ్ర! నమస్తే బలానుసం
భవ! నమస్తే బుద్ధ భవ్య రూప
తే. ధర! నమః కల్కి వేష సుందర! నమో౽స్తు
శక్రముఖ దిక్పతి పయోజజాత రుద్ర
సిద్ధ సాధ్యాది నుత! నమస్తే యటంచు
వివిధ విష్ణుస్థలములు సేవించి వేడ్క. 218

వ. తదనంతరంబ శ్రీశైల ఝిల్లి చక్రేశ్వర మూకాంబికా కోటీశ్వర గోకర్ణ కేదార హాటకేశ్వర జంబుకేశ్వర బ్రహ్మేశ్వర పుండరీక పంచనదీశ్వ రారుణ గిరీశ్వర జటానాథ వైద్యనాథ గౌరీనాథ రామేశ్వర శంకరనారాయణ సుబ్రహ్మణ్య స్థలాద్యధీశ్వరులగు నీశ్వరులను సేవించి వెండియు మహీమండలిం గల పుణ్యస్థలవిశేషంబులం జూచుచు సంచలించు నయ్యవసరంబున. 218

శా. సర్వ ద్వీపవతీ ప్రపూరిత పయస్సంబంధ ధారాధరా
ఖర్వధ్వాన భయోత్పతిష్ణు బిసభుగ్రాజీవ కూర్మదికం
బుర్వీంద్రాయుధ పాత భగ్నకుబిలవ్యూహక్షరద్వాః పత
త్తర్వశ్మ క్షుభితాహిలోక మగుచున్ దర్పించె వర్షంబిలన్. 220

సీ. నేళనెళ ధ్వనులతో ఫెళఫెళ మను గర్జి
తములు కర్ణక్షోభదములు గాఁగ
ధళధళ ద్యుతులతో మిలమిల ల్గల మించు
లక్ష బలౌద్ధత్య మడఁచుచుండ

ఘళఘళార్భటులతో ఫళఫళారను వాన
ధార్తరాష్ట్రాది మహార్తి నింపఁ
జిటచిటారవముతోఁ దటతట వడగండ్లు
యువరాజ ముఖులను నొదుగఁజేయ
తే. విజయ విఖ్యాతి నమ్మహావృష్టి సమర
మమర వరధర్మవిలసనం బనిలజాత
ఖేలనము కృష్ణ ఘనయుక్తి చాలఁ గలిగి
యవని జనములు వినుతింప నతిశయించె. 221

క. ఆయెడ సఖు లొకఁ డొక్కఁడు
కూయిడి జతఁగూడ కెడసి కునుకుపరువులం
బోయిరి చెంగటి యూరుల
కా యూరవ్యుఁడు హిరణ్యుఁ డట్లతిగతితోన్. 222

తే. వడఁకు చట భద్రసేన యావాసమునకుఁ
బోయి “నేను ప్రవాసి నో పుణ్యురాల!
తడిసితిని వర్షధారలఁ దాళఁజాల
నేర్పెఱఁగ నిందు రానిమ్ము! నిద్రఁ జెంద.” 223

క. అని వేఁడిన వైదేశికు
ఘనకరుణాదృష్టిఁ జూచి కామిని, “పడుకొ”
మ్మని ముంగలి చావిడిఁ జూ
పిన హా లక్ష్మీ యటంచుఁ బేర్కొని యచటన్. 224

చ. తడిసిన వస్త్రముల్ విడిచి తాళ్లపయిన్ వెస నాఱవేసి, “యో
పడఁతుక ! నీదు పెద్దలకుఁ బల్కఁగ శక్యముగాని పుణ్య మ
య్యెడు నిట కగ్నిఁ దెచ్చి సెగ యించుక చూపు” మటంచు వేఁడఁగాఁ
దొడివడి యట్లొనర్చి యల తొయ్యలి యాతని రూపసంపదల్. 225



తే. మంట వెలుఁగున వేమాఱు మనసు దూలఁ
దళుకు దెలివాలుగన్నుల బెళుకుఁ జూచి
"యెప్పు డే గ్రామ మందుండు దేమి పనికి
నెచటి కేఁగెదు నీదు పేరేమి? చెపుమ! 226

క. అనిన సఖి కనియె “నుండుదు
ననిశంబు కిరాతదేశమందు, హిరణ్యుం
డనఁదగుఁ దన పేరిలఁ బు
ణ్యనదీనిధులెల్లఁ జూచి యరిగెదఁ బురికిన్. 227

చ. అని వచియించు తైర్థికున కా వనజాయతపత్రనేత్ర యి
ట్లను “నవయౌవనంబున రతాస్థఁ దొలంగి కులాబ్జగంధిపైఁ
గనికర మింతలేక తిరుగన్ మనసొగెనటోయి! నీకు?" నా
విని “నిజమౌను నీ పలుకు వేయననేల? వివాహహీనుఁడన్. 228

తే. ఆలి కే నంగలార్చుచు నన్యసతులఁ
జూచి గ్రుక్కిళ్లు మ్రింగుచు సుఖములేని
కతన యాత్రం జరెంచెడి కతయె కాని
మనసు సంభోగవాంఛల మరగి తిరుగు." 229

చ. అను పరదేశికుం గని మహాదరణంబున లేచి కౌఁగిఁటన్
నునుజిగి గబ్బిసిబ్బెపుఁ జనుంగవ నాటఁగఁ జేర్చి మోహముం
జినుకఁగ మోవినొక్కి మరుచివ్వకుఁ దార్చిన వాఁడు పేర్చుచుం
డిన తమిచేతఁ దద్రతికి దీవి సమున్ముఖుఁడై ముదంబునన్. 230

తే. గుబ్బలను నట్టు లూఁతఁగాఁ గొని మనోజ
కేళికావార్ధి లోపల నోలలాడు
చుండె నవ్వేళ దాని నాథుండు వచ్చి
“యెవరువా?" రని ఘర్షించి హెచ్చరింప. 231



క. ఆ సమయంబున నెటువలె
భాసురమతి బొంకవలయుఁ బలుకంగఁగదే!
యో సుదతీ! యని యడిగిన
నాసఖి యిది తెలియదనుచు నటుమొగ మయినన్. 232

తే. హంస హేమావతికి నిట్టులనియె వేడ్కఁ
దెలియకుండిన నేమాయెఁ దెలిసికొనుము
వింటివా? పతి ఘర్షింప విటుఁడు వడఁక
వెఱవకు మటంచుఁ జెలి వాని వెన్నుఁజఱచి. 233

ఉ. కీలెలుఁగున్ ఘటించి పరికింపక పండుక యుండి పల్కె “యా
త్రాలసదుర్విచారులము రాత్రి జనించిన నేఁడు తావకీ
నాలయమందు మేమిదె సుఖాప్తిని సుప్తియొనర్చి రేపుషః
కాలమునందుఁ బోయెదము కారుణికోత్తమ! పండనీయవే!" 234

తే. అనిన “మంచిది” యని లోని కరిగె నాథుఁ
డరిగినది చూచి సఖి లేచి యంతలోనఁ
బంటితో నీళ్లు పట్టుక యింటిలోకిఁ
బోయి “యేడుంటి వీసరి ప్రొద్దు దనుక? 235

క. ఒక్కతెనె గ్రుక్కు మిక్కని
దిక్కెడసిన రీతినుండి తెరువరు లేవరో
యిక్కడకుఁ బండ వచ్చిన
నక్కట! ప్రాణమ్ములుండె నధిపా!” యనినన్. 236

ఆ. నిండినింటిలోన నీకేల భీతిల్ల
గోల! యూరఁ బొద్దు గ్రుంకలే ద
టంచుఁ గౌఁగిలించి యనుమాన మొందక
యోర్చుతో సుఖాప్తి నుండెఁ జెలియ! 237

శా. ఈ లీలన్ వెస బొంక నేర్చిన నృపత్యేకాగ్రచూడామణీ
కేళీసంభ్రమచిత్తవృతి సురతక్రీడాచమత్కారచ
ర్యాలాలిత్యకథాప్రయత్నమున కత్యాసక్తి తోఁ బొమ్ము లే
దా, లోలాంబక! యూరకుండు మని కాదంబేంద్రుఁ డిట్లాడఁగన్. 238

చ. తెలతెలవాఱ వచ్చుట సతీమణి యప్పుడు చూచి కేళికా
నిలయముఁ జేరనేగి ధరణీధవుపైఁ దమి మీఱ నుండె నా
చెలి యనుచుం బురోహితుఁడు సెప్పిన నాత్మ జనించు వేడ్క
నా నల నరపాలమౌళి తదనంతరగాథ వచింపుమా! యనన్. 239

[2]శా. రక్ష శ్శిక్షక రక్ష యక్షయ నృపాధ్యక్షా సదాక్షేమ కృ
ద్వక్షా రక్షిత శుభ్రపక్ష హయదార్ధక్ష్మాఖ్య మద్రారి స
రక్షా యన్యనిలాక్షరాక్షస జలాధ్యక్షాగ్ని వాయుః క్షపా
తృక్షేక్షార్భక పద్మరక్షక రమాధ్యక్షారవిందేక్షణా. 240

పాదభ్రమకకందము.
రామానుత తను మారా
ధీ మదవనధీ వర రవ ధీ నను దమ ధీ
తామస జయ యజ సమతా
నామగతాఘ నయతత యనఘతా గమనా. 241

[3]మణిగణనికరవృత్తము.
హరిహయ పరిణాభ్యదయవ భరణా
హరిహయ హరిణాభ్యదమ విభరణా

నరవర విగమన నవినుత చరణా
నరవర విగమన నవిమల కిరణా. 248

గద్యము.
ఇది శ్రీ మత్కౌండిన్యస గోత్ర పవిత్రాయ్యలరాజాన్వయ సుధావార్ధి
పూర్ణిమా చంద్ర నిస్సహాయ కవిత్వ నిర్మాణ చాతుర్య నిస్తంద్ర
శ్రీరామనామ పారాయణ నారాయణామాత్య ప్రణీతంబైన
హంసవింశతి యను మహా ప్రబంధమునందుఁ
జతుర్థాశ్వాసము.

  1. పుష్కరణి తప్పు : పుష్కరిణి ఒప్పు
  2. ఈ పద్యము వ్రాయసగాండ్ర చేతులలోఁ బడి చెడి యిట్లున్నది.
  3. ఈ పద్యపు పూర్వార్ధమున ఛందోభంగము