Jump to content

సాధించెనా

వికీసోర్స్ నుండి

సాధించెనే ఓ మనసా ॥ సాధించెనే॥


బోధించిన సన్మార్గ వచనముల

బొంకుజేసి తాబట్టిన పట్టు ॥సాధించెనే॥


సమయానికి తగు మాటలాడెనే

దేవకీ వసుదేవుల నేగించినటు ॥సమయానికి॥


రంగేశుడు సద్గంగా జనకుడు,

సంగీత సంప్రదాయకుడు, ॥సమయానికి॥


గోపీజన మనోరథ మొసంగలేకనే

గేలియు జేసేవాడు ॥సమయానికి॥


వనితల సదా సొక్కజేయుచును

మ్రొక్క జేసే పరమాత్ము డదియుగాక,

యశోదతనయుడంచు ముదంబునను

ముద్దుబెట్ట నవ్వుచుండు హరి ॥సమయానికి॥


పరమ భక్తవత్సలుడు

సగుణపారావారుండా జన్మ మ

నఘ డీ కలిబాధల దీర్చువా డనుచు

నే హృదంబుజమున జూచుచుండగ ॥సమయానికి॥


హరే! రామచంద్ర రఘుకులేశ మృదుసుభాష

శేషశయన పరనారీ సోదరాజ విరాజ తురగ రాజ

రాజనుత నిరామయాప ఘన సరసీరుహదళాక్ష

యనుచు వేడుకొన్నను తా బ్రోవకను ॥సమయానికి॥


శ్రీ వేంకటేశ సుప్రకాశ సర్వోన్నత సజ్జసమానస

నికేతన కనకాంబరధర లసన్మకుట కుండల విరాజిత

హరేయనుచు నే పొగడగా త్యాగరాజగేయుడు

మానవేంద్రుడయిన రామచంద్రుడు ॥సమయానికి॥


సమయానికి తగుమాటలాడెనె సద్భక్తులనడతలిట్లనెనే

అమరికగా నా పూజ కొనెనే అలుగవద్దనెనే

విముఖులతో జేరబోకుమనెనే, వెతగల్గిన తాళుకొమ్మనెనే

దమశమాది సుఖదాయకుడగు

శ్రీ త్యాగరాజ సుతుడు చెంతరాకనే ॥సాధించెనే॥