సత్యశోధన/రెండవభాగం/16. రేపు ఏం జరుగుతుందో ఎవరికి తెలుసు?

వికీసోర్స్ నుండి

16. రేపు ఏం జరుగుతుందో ఎవరికి తెలుసు ?

అబ్దుల్లా సేఠ్‌గారి కేసు పరిష్కారం అయింది. ఇక నాకు ప్రిటోరియాతో ఏం పని? దర్బనుకు వెళ్లి ఇంటికి ప్రయాణం అవుదామనే ప్రయత్నం ప్రారంభించాను. కాని అబ్దుల్లా సేఠ్ వీడ్కోలు విందు చేయకుండా నన్ను విడిచి పెడతాడా? నన్ను గౌరవించేందుకూ ఆయన సిడెన్ హోములో ఒక విందు ఏర్పాడు చేశాడు.

ఆ రోజంతా విందుతో కాలక్షేపం చేయాలని నిర్ణయం. నా దగ్గర కొన్ని వార్తా పత్రికలు వున్నాయి. వాటిని తిరగవేస్తూ కూర్చున్నాను. ఒక పత్రికలో ఒక మూల “ఇండియన్ ఫ్రాంచైజ్” అను శీర్షికతో కొన్ని వాక్యాలు నా కంటబడ్డాయి. నేటాల్ శాసన సభలో సభ్యుల్ని ఎన్నుకొనుటకు భారతీయులకు హక్కు లేకుండా చేసేందుకు ఒక బిల్లును గురించి చర్చలు సాగుతున్నాయి. ఈ కొద్ది వాక్యాలు ఆ చర్చకు సంబంధించినవే. నాకు ఆ చట్టాన్ని గురించి ఏమీ తెలియదు. విందుకు వచ్చిన అతిథులెవ్వరికీ తెలియదు. దాన్ని గురించి అబ్దుల్లా సేఠ్‌తో ప్రస్తావించాను. “ఈ వ్యవహారాలు మాకేం తెలుస్తాయి? వ్యాపారానికి సంబంధించినవైతే మాకు తెలుస్తాయి. అరెంజి ఫ్రీస్టేటులో మా వ్యాపారమంతా నీట కలసిన విషయం నీకు తెలుసు. ఆ విషయమై మేము కొంత కలకలం రేపాము. కాని ఏం లాభం? చదువురాదు గనుక మేము అసమర్ధులం. బజారు ధరలు తెలుసుకోవడానికి మాత్రం మేము పత్రికలు చదువుతాము. చట్టాల గొడవ మాకేం తెలుస్తుంది? ఆ తెల్ల వకీళ్లే మాకు కండ్లు, చెవులూను” అని అబ్దుల్లా సేఠ్ అన్నాడు. భారతీయ క్రైస్తవులను గురించి వివరంగా అబ్దుల్లా సేఠ్ చెబుతూ “వారా? వారికి మేమంటే అలుసు. వారంటే నిజానికి మాకూ అలుసే. క్రైస్తవులు కనుక వారు తెల్లవారికి బానిసలు. ఆ తెల్లఫాదరీలు ప్రభుత్వానికి బానిసలు” అని అన్నాడు. వారి మాటలు నా కండ్లు తెరిచాయి. ఈ శాఖ మనకు సంబంధించింది. వారూ మనమూ ఒకటే అని తెలియజేయడం అవసరం అని అనిపించింది. ఏసు మతానికి యిదా అర్థం? వారి మతం మార్చుకున్నంత మాత్రాన భారతీయులు కాక విదేశీయులైపోతారా?

అయితే నేను మన దేశానికి రాబోతూ వున్నాను. అందువల్ల నా ఈ అభిప్రాయం వారికి చెప్పలేదు. అబ్దుల్లా సేఠ్‌గారితో “ఈ బిల్లు శాసనం అయితే మనవాళ్ల కష్టాలకు అంతే వుండదు. ఇది భారతీయులకు ప్రధమ ఉచ్చాటన మంత్రం. మన ఆత్మగౌరవానికి వేరు పురుగు” అని చెప్పాను. “కావచ్చును. కాని ఫ్రాంచైజుకు మూలం ఏమిటో చెబుతాను. మాకు మొదటిదాన్ని గురించి ఏమీ తెలియదు. ఎస్కాంబీగారిని మీరు ఎరుగుదురు కదా! అతడు మనకు పెద్ద వకీలు. ధీరుడు. అతడే మొదట ఈ విషయం మా బుర్రల కెక్కించాడు. అప్పుడు ఏం జరిగిందో తెలుసా? ఎంస్కాంబీ పెద్ద యోధుడుకూడా. అయనకు మరియు వారుద్ ఇంజనీరుకు మధ్య పడేది కాదు. అందువల్ల ఆ ఇంజనీయరు తన వోట్లన్ని పుచ్చుకొని ఎన్నికల్లో ఎక్కడ ఓడిస్తాడో అని ఎస్కాంబీ దిగులు పడ్డాడు. అప్పుడాయన ఆ విషయం మాకు చెప్పాడు. ఆయన ప్రోత్సాహంతో మేమంతా మా పేర్లు ఓటర్ల జాబితాలో చేర్చాము. ఎన్నికల్లో ఎస్కాంబీ గారికి మా ఓట్లు యిచ్చాం. అంతేగాని మా ఓట్లకు మేమే విలువ ఇవ్వడం లేదు. యిది స్పష్టం. అయితే మీ మాటలు మాకు అర్ధం అవుతాయి. మీ సలహా ఏమిటో చెప్పండి” అని అబ్దుల్లా సేఠ్ అన్నాడు. ఇతర అతిధులంతా మా మాటలు శ్రద్ధగా విన్నారు. వారిలో ఒకరు అందుకొని “ఏమండీ మీరు ఈ స్టీమరుకు బయలుదేరకండి. ఒకటి రెండుమాసాలు యిక్కడే వుండిపోండి. మీరు ఎలా చెబితే అలా చేస్తాం” అని అన్నాడు. “నిజం నిజం! అబ్దుల్లా సేఠ్! మీరు గాంధీ భాయిని ఆపివేయండి” అని మిగతా వారంతా గట్టిగా అన్నారు.

అబ్దుల్లా సేఠ్ మంచి ఇనుభవజ్ఞుడు. “ఇక గాంధీని ఆపగల అధికారం నాకు లేదు. ఇప్పుడు నాకెంత అధికారం వుందో మీకూ అంతే అధికారం వుంది. మీరు చెబుతున్నదంతా సత్యం. మనమంతా కలసి వారిని ఆపుదాం. కాని ఆయన బారిస్టరు. వీరి ఫీజు మాటేమిటి?” అని అన్నాడు. ఫీజు మాట ఎత్తేసరికి నాకు మనస్సు చివుక్కుమంది. నేను వెంటనే “సేఠ్‌గారూ! దీనికీ ఫీజుకూ సంబంధం లేదు. ప్రజాసేవకు ఫీజా? అసలు నేను వుంటే ప్రజా సేవకుడిగానే వుంటాను. వీరందరితో నాకు యిదివరకు పరిచయం లేదు. వీరంతా నాకు సాయం చేస్తారనే నమ్ముకం మీకు వుంటే నేను ఒక్క మాసం యిక్కడ వుంటాను. కాని ఒక్కమాట. మీరు నాకేమి యివ్వనవసరం లేదు. అయితే మనం చేయదలచుకున్న పనికి కొంత మూలధనం అవసరం. టెలిగ్రాములు పంపాల్సి వస్తుంది. అక్కడికి ఇక్కడికీ తిరగవలసిపస్తుంది. ఆయా వకీళ్ళతో సంప్రదింపులు జరపవలసి వస్తుంది. నాకు మీ “లా” రాదు కనుక కొన్ని ‘లా’ గ్రంధాలు నాకు కావాలి. అందుకు ధనం అవసరమవుతుంది. యీ పనికి ఒక్క మనిషి సరిపోడు, పలువురి సాయం కావాలి” అని అన్నాను. నా మాటలు వారందరినీ ప్రభావితం చేశాయి. “అల్లా దయవల్ల ధనం దానంతట అదే సమకూరుతుంది. జనం కావలసినంత మందిమి వున్నాం. మీరు మాత్రం “వుండిపోతాను, అని అనండి. చాలు” అని ఒక్కసారిగా అంతా అన్నారు. నాకు వీడ్కోలు యివ్వడానికి వచ్చిన అతిధి బృందం కార్యనిర్వాహక బృందం అయింది. తొందరగా విందు ముగించి ఇళ్ళకు వెళదామని అన్నాను. నేను నా మనస్సులో యిక ముందు చేయవలసిన సమరానికి రేఖలు గీచుకున్నాను. వోటరు జాబితాలలో చేరియున్నవారి పేర్లను తెలుసుకున్నాను. మరో నెలరోజులపాటు అక్కడ వుండటానికి నిశ్చయించు కున్నాను.

ఈ విధంగా భగవంతుడు దక్షిణ ఆఫ్రికాలో నా జీవితానికి పునాది వేసి ఆత్మ సన్మాన సంగ్రామానికి నాంది పలికాడు.