సత్యశోధన/మూడవభాగం/8. బ్రహ్మచర్యం - 2

వికీసోర్స్ నుండి

8. బ్రహ్మచర్యం - 2

ఎంతో చర్చించి, ఎంతో ఆలోచించి 1909వ సంవత్సరంలో నేను బ్రహ్మచర్య వ్రతం చేపట్టాను. వ్రతం ప్రారంభించేవరకు నా భార్యకు యీ విషయం చెప్పలేదు. వ్రత సమయంలో చెప్పి ఆమె అనుమతి తీసుకున్నాను. ఇందుకు ఆమె అభ్యంతరం తెలుపలేదు.

ఈ వ్రతానికి పూనుకోవడం చాలా కష్టం అయింది. వికారాల్ని అణుచుకోవడం తేలిక విషయం కాదు కదా! భార్య విషయంలో వికారం కలుగకుండ వుండటం సామాన్య విషయమా? అయినా తక్షణ కర్తవ్యంగా భావించి నా లక్ష్యం శుద్ధమైనది గనుక పరమాత్ముడు కరుణించి నాకు శక్తి సామర్థ్యాలు ప్రసాదించవలెనని ప్రార్ధించి యిందుకు పూనుకున్నాను. నేటికి 20 ఏళ్ళు గడిచాయి. ఇప్పుడు యీ వ్రతాన్ని గురించి యోచిస్తే నాకు ఆనందమేగాక ఆశ్చర్యం కూడా కలుగుతున్నది. నిగ్రహం అవసరమను భావం, తత్పరిపాలనమును గురించిన పట్టుదల 1901వ సంవత్సరంలో ప్రబలంగా వుండేది. ఇప్పుడు నాకు గల స్వాతంత్ర్యం, ఆనందం 1909వ సంవత్సరానికి పూర్వం వున్నట్లు గుర్తులేదు. ఆ సమయంలో నాకింకా వాంఛ తొలగలేదు. ఏ సమయంలోనైనా చ్యుతి కలుగవచ్చునని భయంగా వుండేది. ఇప్పుడు ఇట్టి స్థితిలేదు. వాంఛను అణుచుకోగలిగానను విశ్వాసం నాకు కలిగింది. బ్రహ్మచర్యం మహిమ రోజురోజుకు పెరిగిపోవడమేకాక, దాని అనుభవం నాకు కలుగసాగింది. ఫినిక్సు నందు బ్రహ్మచర్యవ్రతం ప్రారంభించాను. సైన్యాన్నుండి సెలవు పుచ్చుకొని ఫినిక్సు వెళ్లాను. అక్కడి నుండి వెంటనే జోహాన్సుబర్గు వెళ్లవలసి వచ్చింది. అక్కడే ఒక నెల లోపున సత్యాగ్రహ సమరానికి అంకురార్పణ జరిగింది. బ్రహ్మచర్య వ్రతమే నన్ను సత్యాగ్రహ సంగ్రామ ప్రారంభానికి పూనుకునేలా చేసిందని భావిస్తున్నాను. ముందు ఆలోచించుకొని నేను సత్యాగ్రహ సంగ్రామం ప్రారంభించలేదు, అనుకోకుండా అతి సహజంగా ప్రారంభమైంది. కాని దీనికి పూర్వం నేను చేసిన పనులు అనగా ఫినిక్సు వెళ్లడం, జోహాన్సుబర్గులో ఇంటి ఖర్చులు తగ్గించడం, బ్రహ్మచర్య వ్రతానికి పూనుకోవడం మొదలగునవి, సత్యాగ్రహ సంగ్రామం ప్రారంభించేందుకు దోహదం చేశాయని భావిస్తున్నాను. బ్రహ్మచర్యాన్ని సరిగా పాటించడం అంటే బ్రహ్మదర్శనం చేసుకోవడమేనన్నమాట. ఈ జ్ఞానం నాకు శాస్త్రాలు చదవడంవల్ల కలుగలేదు. నాకీ విషయం మెల్ల మెల్లగా అర్ధం కాసాగింది. తరువాత శాస్త్రాలు చదివాను. బ్రహ్మచర్య వ్రతధారణం వల్ల శరీర రక్షణ, బుద్ధి రక్షణ, ఆత్మ రక్షణ కలుగునను సంగతి బ్రహ్మచర్య వ్రతం ప్రారంభించిన తరువాత రోజురోజుకు అధికంగా అనుభవంలోకి రాసాగింది. ప్రారంభంలో బ్రహ్మచర్యవ్రతమంటే ఘోరతపశ్చర్యయని భావించేవాణ్ణి. కాని ప్రారంభించిన తరువాత యిప్పుడు ఎంతో రసమయంగాను, ఆనందమయంగాను వున్నది. యిప్పడు దీని బలం వల్లనే పనులు జరుగుతున్నాయి. దీని సౌందర్యం రోజురోజుకు అధికంగా పెరుగుతూ వున్నది.

ఈ వ్రతానికి పూనుకున్న తరువాత ఆనందం పొందుతున్నప్పటికీ దీని వేడి నాకు తగలలేదని భావించవద్దు. నేటితో నాకు యాభై ఆరేండ్లు నిండాయి. అయినా దీని కాఠిన్యం నాకు గోచరమవుతూనే వుంది. ఇది నిజంగా అసిధారావ్రతమే. ఎల్లప్పుడూ యీ విషయమై కడు జాగ్రత్తగా వుండటం అవసరం అని గ్రహించాను

బ్రహ్మచర్య వ్రతం సాఫీగా సాగాలంటే ముందు జిహ్వను వశంలో పెట్టుకోవాలి. నాలుకను జయించితే బ్రహ్మచర్య వ్రతానుష్ఠానం తేలిక అని అనుభవం వల్ల గ్రహించాను. అందుకుగాను భోజనంలో మార్పులు చేశాను. శాకాహార దృష్టితోగాక, బ్రహ్మచర్య దృష్టితో భోజనంలో మార్పుచేశాను. మితంగా తినడం. వీలైనంత వరకు వండని పదార్థం తినడం. అనగా స్వాభావికమైన భోజనం అవసరమని అనుభవం వల్ల తెలుసుకొన్నాను. బ్రహ్మచారికి అడవిలో పండిన పండ్లు సరియైన ఆహారమని ఆరేళ్ళు కృషిచేసి తెలుసుకున్నాను. పండ్లు తినే సమయంలో నాకు కలిగిన నిర్వికారభావం, సుఖం, పండ్లు తినడం మానివేసే మరో పదార్థం తిన్నప్పుడు కలుగలేదు. పండ్లు తింటూ వున్నప్పుడు బ్రహ్మచర్యం సులభమైంది. పాలు పుచ్చుకుంటూ వున్నప్పుడు ఆ వ్రతాన్ని పాలించడం కష్టమనిపించింది. పండ్లు తినడం మాని పాలు ఎందుకు త్రాగవలసి వచ్చిందో తరువాత తెలియజేస్తాను. బ్రహ్మచారికి పాలు పనికిరావని, అవి బ్రహ్మచర్యానికి విఘ్నకారకమని చెప్పక తప్పదు. అయితే బ్రహ్మచారికి పాలు నిషిద్ధమని భావించవద్దు. బ్రహ్మచర్యానికి ఆహార ప్రాముఖ్యం ఏపాటిది? ఎంత? ఈ విషయంలో. యింకా ప్రయోగాలు చేసి చూడటం అవసరం. పాలు ఎంతో జీర్ణకరం, స్నాయువర్ధకం. అలాంటి ఆహారం మరొకటి యింతవరకు లభించలేదు. అట్టిది మరొక్కటి వున్నదని ఏ వైద్యుడు, ఏ హకీము, ఏ డాక్టరు కూడా చెప్పలేదు. పాలు కామవికారం కలిగిస్తాయి. అయినా పైన తెలిపిన కారణం వల్ల పాలు త్యాజ్యమని కూడా అనలేను. ఆహార విధానం, ఆహార నియమం వలె ఉపవాసం కూడా ఒక బాహ్యోపచారమే. ఇంద్రియ సముదాయానికి రాక్షసబలం ఎక్కువ. నలు ప్రక్కల, పది దిక్కుల క్రింద, పైన కాపలా పెడితేగాని అది లొంగదు. కడుపు మాడిస్తే ఇంద్రియాలు దుర్భలం అవుతాయి. అయితే ఇచ్ఛాపూర్వకంగా చేసే ఉపవాసాలు ఇంద్రియ దమనానికి తోడ్పడతాయి. కావున ఉపవాసాలు చేసే వారిలో చాలామంది సఫలురు కావడంలేదు. ఉపవాసం చేస్తే సమస్తం లభ్యమవుతుందని వారు భావిస్తూ వుంటారు. బాహ్యోపవాసం చేస్తూ వుంటారేకాని మసస్సులో మాత్రం భోగాలన్నింటిని భోగిస్తూనే వుంటారు. ఉపవాసం పూర్తయిన తరువాత ఏమి తినాలో యోచించుకొని ఆ పదార్థాల రుచుల్ని గురించి ఉపవాస సమయంలో యోచిస్తూ వాటి రుచుల్ని ఆస్వాదిస్తూ వుంటారు. అయ్యో, నాలుక మీద సంయమం ఉండటంలేదు, జననేంద్రియం మీద సంయమం ఉండటంలేదు అని అంటూ వుంటారు. మనస్సు కూడా ఇంద్రియ సంయమనానికి తోడ్పడినప్పుడే ఉపవాసం వల్ల ప్రయోజనం కలుగుతుంది. అంటే అసలు మనస్సులో విషయ భోగాల యెడ వైరాగ్యం జనించడం అవసరం. విషయ వాసనలకు మూలం మనస్సు. అది వశంలో వుంటే ఉపవాసాది సాధనాలు ఎక్కువగా ఉపకరిస్తాయి. కానియెడల ఉపకరించవు. ఉపవాసాలు చేసినా మనిషి విషయాసక్తుడుగా ఉండవచ్చు కనుక మనస్సును అదుపులో పెట్టుకొని ఉపవాసం చేయాలి. అప్పుడది బ్రహ్మచర్యానికి అమితంగా తోడ్పడుతుంది.

బ్రహ్మచర్యం విషయంలో చాలా మంది విఫలత్వం పొందుతూ పున్నారు. ఆహార విహారాదుల విషయంలో వాళ్ళు, అబ్రహ్మచారులుగా వ్యవహరిస్తూ బ్రహ్మచర్యాన్ని రక్షించుకోవాలని భావిస్తూ వుంటారు. ఇది గ్రీష్మకాలంలో హేమంతాన్ని కోరడం వంటిది. స్వచ్ఛంద వర్తనుడి జీవితంలోను, సంయమం కలవాడి జీవితంలోను వ్యత్యాసం పుండాలి. ఇరువురికీ పైపైని సామ్యమే కాని లోలోన భేదం వుంటుంది. యిద్దరూ చూస్తూనే వుంటారు. కాని బ్రహ్మచారి పరమేశ్వరుణ్ణి చూస్తూ వుంటే భోగి నాటకాలు, సినిమాలు చూస్తూ వుంటాడు. ఇద్దరూ వింటూ వుంటారు. కాని బ్రహ్మచారి భజన గీతాల్ని, భక్తి గీతాల్ని వింటూ వుంటే భోగి విలాసగీతాన్ని వింటూ వుంటాడు. ఇద్దరూ జాగరణ చేస్తూ వుంటారు కాని బ్రహ్మచారి హృదయ మందిరంలో రాముడు ఆరాధింపబడితే, భోగి హృదయం నాట్యరంగంలో తేలి ఆడుతూ వుంటుంది. ఇద్దరూ భుజిస్తారు. కాని బ్రహ్మచారి శరీర రూపంలో నున్న తీర్థక్షేత్ర రక్షణ కోసం మాత్రమే భుజిస్తాడు. భోగి రుచులకోసం రకరకాల పదార్థాలు సేవించి ఉదరాన్ని దుర్గంధమయం చేస్తాడు. ఈ విధంగా ఇద్దరి ఆచార విచారాలలో భేదం వుంటుంది. రోజు రోజుకు ఇది పెరుగుతూ వుంటుందే కాని తరగదు.

బ్రహ్మచర్యం అంటే ఏమిటి? మనోవాక్కాయాలతో సర్వేంద్రియాలను నిగ్రహించడమన్నమాట. ఇందుకోసం పూర్వపు విషయవాసనలన్నిటిని త్యజించడం అవసరమని భావిస్తున్నాను. త్యాగక్షేత్రానికి ఎల్లలు లేనట్లే బ్రహ్మచర్య మహిమకు కూడా ఎల్లలు లేవు. యిట్టి బ్రహ్మచర్యం సులభంగా లభ్యమవుతుందని భావింపకూడదు. చాలామందికి యిది ఆదర్శం మాత్రమే. కాని ప్రయత్నశీలుడగు బ్రహ్మచారికి తన లోట్లు తెలుస్తూ వుంటాయి. తద్వారా తన హృదయ కుహరంలో దాగియున్న వికారాల్ని తొలగించుకుంటూ వుంటాడు. ప్రవృత్తుల్ని జయించనంతవరకు బ్రహ్మచర్యవ్రతం సఫలం కాదు. ప్రవృత్తులు, వృత్తులు ఎన్ని రకాలుగా వున్నా అవి వికారాలతో నిండి వుంటాయి. వాటిని వశపరుచు కోవడమంటే మనస్సును వశపరుచుకోవడమే. వాస్తవానికి మనస్సును నిగ్రహించడం, వాయువును నిగ్రహించడం కంటే కష్టం. అయితే మనస్సులో పరమేశ్వరుడు తిష్ఠవేస్తే వ్రతం అంతా సులభమే అవుతుంది. కాని ఆ మార్గాన చిక్కులు అధికంగా వుంటాయి. అయినా అది అసాధ్యమని అనుకోనక్కరలేదని నా అభిప్రాయం. అది పరమార్ధం. అట్టి పరమార్ధానికి గట్టి ప్రయత్నం అవసరం. అందుకు బాగా కృషిచేయాలి.

ఇట్టి బ్రహ్మచర్యం సులభంకాదని హిందూ దేశానికి తిరిగి వచ్చిన తరువాత తెలుసుకున్నాను. అంతవరకు ఫలహారాల వల్ల వికారాలు సమూలం నశించిపోతాయని, అందుకు యింత ప్రయత్నం చేయనవసరం లేదని భావించే వాణ్ణి. అది కేవలం మోహంలోపడి యుండుటయేయని తరువాత తెలిసుకో గలిగాను. అయితే అందుకు నేను చేసిన ప్రయత్నాలను గురించి తెలియజేయాలి కదా! అందుకు కొంత సమయం కావాలి. ఈ సందర్భంలో మరో విషయం చెప్పడం అవసరం. ఈశ్వర సాక్షాత్కారం కోసం నేను చెప్పిన బ్రహ్మచర్య వ్రతాన్ని అనుష్ఠించాలని భావించేవారు, తమ ప్రయత్నంతో బాటు పరమేశ్వరుని పై శ్రద్ధ వహించగలిగితే, నిరాశపడవలసిన అవసరం వుండదని గట్టిగా చెప్పవచ్చు.

విషయావినివర్తంతే నిరాహారస్యదేహినః
రసవర్జం రసో ప్యస్య పరం దృష్ట్వా నివర్తతే.
(గీత. 2వ అధ్యాయం. 59వ శ్లోకం)

ఆహారం మానివేసిన వాడికి విషయములు శాంతించును. కాని అందుండు అభిరుచి శాంతించదు. ఈశ్వర దర్శనం వల్లనే అట్టి అభిరుచి శమించును. కావున ఆత్మ దర్శనం కావలసిన వారికి రామనామం, రామకృప సాధనాలు అవసరం. నేను భారతదేశానికి వచ్చిన తరువాతనే ఈ విషయం తెలుసుకున్నాను. అది నాకు కలిగిన అనుభవం.