సత్యశోధన/మూడవభాగం/5. పిల్లల చదువు

వికీసోర్స్ నుండి

5. పిల్లల చదువు

1897 వ సంవత్సరం జనవరి నెల్లో డర్బనులో దిగాను. అప్పుడు నాతో మా ముగ్గురు పిల్లలు కూడా వున్నారు. ఒకడు నా మేనల్లుడు. వాడికి పదేండ్ల వయస్సు. మిగిలిన యిద్దరూ నా కుమారులు. పెద్దవాడికి తొమ్మిదేండ్లు, చిన్నవాడికి అయిదేండ్లు. వీళ్ళకు చదువెట్లా అన్న సమస్య బయలుదేరింది.

నా పిల్లల్ని తెల్లవారి బడికి పంపగలను. అందుకు బాగా శ్రమపడాలి. నా పిల్లలకు మాత్రమే అట్టి వీలు కలుగుతుంది. కాని యితర భారతీయుల పిల్లలకు అట్టి వీలు దొరకదు. భారతీయ బాలుర కోసం మిషన్ వాళ్లు పెట్టిన బడులు వున్నాయి. కాని అందలి శిక్ష దీక్షలు బాగుండనందున నా పిల్లల్ని అక్కడికి పంపదలుచుకోలేదు. గుజరాతీ భాషలో బోధన కావాలంటే ఎలా సాధ్యం? ఇంగ్లీషు భాషలో అయితే వీలు వున్నది. ఎంతో కష్టం మీద వచ్చీరాని అరవంలోగాని లేక హిందీలోగాని పిల్లల చదువుకు వీలున్నది. కానీ యీవిషయంలో ఎదురైన అభ్యంతరాల్ని తొలగించలేక పోయాను. పిల్లలకు నేను చదువు చెబుదామని ప్రయత్నించాను. కాని అది నియమంగా సాగలేదు. అనుకూలమైన గుజరాతీ ఉపాధ్యాయుడెవ్వడూ దొరకలేదు.

నాకేమీ తోచలేదు. “నా ఉద్దేశ్యాల ప్రకారం పిల్లలకు విద్యగరపే ఆంగ్ల భాషా బోధకుడు ఒకరు కావాలి” అని పత్రికల్లో ప్రకటన చేశాను. ఆ ఉపాధ్యాయుడు నియమబద్ధంగా పిల్లలకు పాఠం చెబుతాడనీ, తీరిక దొరికినప్పుడు నేను కొంత చెప్పవచ్చునని భావించాను. నెలకు ఏడు పౌండ్ల జీతంమీద ఒక ఆంగ్ల వనిత పాఠం చెప్పడానికి అంగీకరించింది. యీ విధంగా పిల్లల చదువు ప్రారంభమైంది.

నేను పిల్లలతో గుజరాతీలోనే మాట్లాడుతూ వుండేవాణ్ణి. దానితో వాళ్ళకు కొద్దిగా గుజరాతీ భాషతో పరిచయం ఏర్పడింది. వాళ్ళను వెంటనే ఇండియాకు పంపాలనే ఉద్దేశ్యం నాకు లేదు. చిన్నపిల్లల్ని తల్లి దండ్రులకు దూరంగా వుంచకూడదను విషయం అప్పటికే నాకు బోధపడింది. మంచి ఏర్పాట్లుగల గృహాల్లో పిల్లలకు విద్య అప్రయత్నంగా అబ్బినట్లు, హాస్టల్లో ఉంచి చదివిస్తే అబ్బదు. ఆ కారణం వల్ల వాళ్ళు చాలాకాలం నాదగ్గరే వున్నారు. నా మేనల్లుణ్ణి, పెద్దకుమారుణ్ణి కొన్ని నెలల పాటు ఇండియాలో వసతి గృహాలు కల స్కూళ్లకు పంపించాను. కాని వాళ్ళను వెంటనే అక్కడనుండి తిరిగి తీసుకువచ్చాను. ఈడు వచ్చాక మా పెద్ద కుమారుడు తనంతటతాను అహమ్మదాబాదు హైస్కూల్‌లో చదవ తలచి దక్షిణ - ఆఫ్రికా వదిలి వెళ్ళిపోయాడు. నా మేనల్లుడు నేను చెప్పే చదువుకు తృప్తిపడి నాదగ్గరే వున్నట్లు గుర్తు. దురదృష్టవశాత్తు అతడు కొన్నాళ్ళు జబ్బుపడి నడియౌవనంలోనే యీ లోకాన్ని వీడి వెళ్ళిపోయాడు. మిగిలిన నా ముగ్గురు పిల్లలు బడికి వెళ్లలేదు. సత్యాగ్రహ సమయంలో నేను స్థాపించిన పాఠశాలలో మాత్రమే వాళ్ళు నియమబద్ధంగా కొంచెం చదువుకున్నారు.

నా ఈ ప్రయోగాలన్నీ అపూర్ణాలే. వారికి విద్య బోధించుటకు కావలసినంత సమయం నాకు దొరకలేదు. ఇంకా అనేక ఆటంకాల వల్ల వాళ్లకు అవసరమైనంత శిక్షణ నేను గరపలేకపోయాను. ఈ విషయంలో వారి అసంతృప్తికి నేను కొద్దో గొప్పో గురికాక తప్పలేదు. ఎప్పుడైనా వారి ఎదుట ఎవరైనా మేము బి.ఏ. మేము ఎం.ఏ అని చెబుతూ వుంటే మేము కనీసం మెట్రిక్యులేషన్ అయినా ప్యాసుకాలేకపోతిమే అను భావం నా పిల్లల ముఖాన కనబడుతూ వుంటుంది. వాళ్ళు ఏమనుకున్నా, తల్లి దండ్రుల సహవాసం వల్ల కలిగే అనుభవజ్ఞానం వారికి కలిగిందని చెప్పగలను. స్వాతంత్ర్య సముపార్జనా పాఠం వాళ్ళు బాగా నేర్చుకున్నారని నా అభిప్రాయం. వాళ్ళ అభిరుచి ప్రకారం వాళ్ళను స్కూలుకు పంపించి యుంటే యిట్టి జ్ఞానంవారికి కలిగి యుండేది కాదు. వీళ్లను ఇంగ్లాండుకు పంపించో, లేక దక్షిణ-ఆఫ్రికాలో ఉంచో చదివించి కృత్రిమ శిక్షణ గరిపించియుంటే వీరి విషయమై నేను యీనాడు వున్నంత నిశ్చింతంగా వుండలేకపోయేవాణ్ణి. వాళ్ళు రుజూజీవితం అంటే ఏమిటో, త్యాగం అంటే ఏమిటో గ్రహించలేకపోయేవాళ్ళు. వారి కృత్రిమ చదువులు నేను చేస్తున్న దేశారాధనా కార్యక్రమానికి అడ్డంకులుగా పరిణమించి యుండేవి.

మొత్తంమీద నేననుకున్నంతగాను, వాళ్లు అనుకున్నంతగాను భాషా జ్ఞానం వాళ్లకు లభించకపోయినా, బాగా యోచిస్తే వారి విషయంలో నా ధర్మాన్ని శక్తివంచన లేకుండా నిర్వర్తించాననే భావిస్తున్నాను. ఆ విషయమై నేను పశ్చాత్తాపపడటంలేదు. ఈనాడు నా పెద్ద కుమారునియందు చింతించవలసిన ఏ దోషాలు నేను చూస్తున్నానో, అవి అశిక్షితాలు, అమూర్తాలునగు నా ప్రథమ జీవితాంశాల ప్రతిధ్వనులని మాటిమాటికి నాకు అనిపిస్తూ వున్నది. నా ఆ ప్రథమ జీవితాంశం ఒక మాదిరి మూర్ఛాకాలం లేక వైభవకాలం. అప్పటి వయస్సు ననుసరించి అది అటువంటిది కాదని మా పెద్ద పిల్లవాడి ఊహ. నా జీవితంలో అదే రాజమార్గమనీ, తరువాత నాలో వచ్చిన మార్పులన్నీ వివేకమను పేరట మోహరాహిత్యం వల్ల నాలో కలిగాయని అతడి విశ్వాసం. ఆ విధంగా నా ప్రథమ జీవితమే రాజమార్గమనీ, తరువాత కలిగిన మార్పులు సూక్ష్మాభిమానవకృతాలనీ, అజ్ఞానజనితాలనీ అతడు ఎందుకు భావించ కూడదు? కొందరు మిత్రులు నాతో యీ విషయమై వాదించారు కూడా. నీ కుమారులు బారిష్టరులైతే వచ్చిన నష్టం ఏమిటి? వారిరెక్కలు విరగ గొట్టే అధికారం మీకెవరిచ్చారు? వాళ్లను వాళ్ల యిష్ట ప్రకారం పోనీయకుండా యిలా అడ్డు పడటం ఏమిటి? యిదీ మిత్రుల తర్కం.

అయితే యీ ప్రశ్నల్లో నాకు విశేషం కనబడలేదు. అనేక మంది విద్యార్థుల్ని గురించి నాకు తెలుసు. యితర బాలుర విషయమై కూడా యిట్టి ప్రయోగం చేసి చూచాను లేక అందుకు సహకరించాను. ఫలితాన్ని కూడా చూచాను. ఆ పిల్లలు, మా పిల్లలు యిప్పుడు ఒకే ఈడులో వున్నారు. వారు మానవత్వం విషయంలో నా పిల్లలకంటే మించలేదని చెప్పగలను. వారి దగ్గర నా పిల్లలు నేర్చుకోవలసింది ఏమీ లేదని నా అభిప్రాయం. నా యీ ప్రయోగాల ప్రయోజనాన్ని గురించి నిర్ణయించవలసింది భవిష్యత్తే. మనుష్యజాతి అభివృద్ధిని పరిశీలించే శోధకుడు గృహ శిక్షణకు, స్కూలు శిక్షణకు గల భేదాన్ని తెలుసుకోవాలని, తల్లిదండ్రుల జీవితంలో కలిగే పరివర్తనల ప్రభావం పిల్లల పై ఏవిధంగా పడుతుందో గమనించాలని భావించి యీ వివరం యిక్కడ తెలియచేశాను.

ఈ నా ప్రకరణానికి మరో ఉద్దేశ్యం కూడా వున్నది. సత్యారాధకుడు ఎంతవరకు సత్యారాధన చేయగలడో తెలుసుకోవాలనేది కూడా ఒక ఉద్దేశ్యం. స్వతంత్రతా దేవిని ఉపాసించే వాడిని. ఆ దేవి ఎంత బలిదానం కోరుతుందో తెలియజేయడం మరో ఉద్దేశ్యం. ఆత్మ గౌరవాన్ని త్యజించివేసి, యితర పిల్లలకు అలభ్యమైన విద్యను నా పిల్లలకు గరపి, నేను తృప్తి పడియుంటే వారికి వాఙ్మయ జ్ఞానం బాగా కలిగించి యుండేవాణ్ణే. కాని స్వాతంత్ర్యాన్ని గురించి, ఆత్మాభిమానాన్ని గురించి ఈనాడు వారికి కలిగిన జ్ఞానం అప్పుడు కలిగి యుండేదికాదు. స్వాతంత్ర్యం గొప్పదా లేక పాండిత్యం గొప్పదా అని ఎవరైనా ప్రశ్నిస్తే పాండిత్యం కన్న స్వాతంత్ర్యమే వెయ్యి రెట్లు మిన్నయని అనకుండా ఎవరైనా ఉండగలరా?

1920వ సంవత్సరంలో యిప్పటి స్కూళ్లు, కాలేజీలు స్వాతంత్ర్యానికి ఘాతుకాలు గనుక వాటిని విడిచి పెట్టమని బాలురకు ఉద్భోదించాను. అక్షరజ్ఞానం కోసం బంధితులై, గులాములై పడియుండేకంటే, స్వాతంత్ర్యం కోసం నిరక్షరులై యుండి రాళ్లను పగులగొట్టి బ్రతకడం మేలని ఉద్ఘోషించాను. దీనివల్ల నా ఉద్దేశ్యం ఏమిటో అందరికీ బోధపడియుంటుందని భావిస్తున్నాను.