సత్యశోధన/నాల్గవభాగం/20. మొదటి రాత్రి

వికీసోర్స్ నుండి

20. మొదటి రాత్రి

ఫినిక్సులో ఇండియన్ ఒపీనియన్ పత్రిక ప్రథమ ప్రతిని వెలువరించడం కష్టమైంది. రెండు జాగ్రత్తలు పడియుండకపోతే ఒక వారం సంచిక వెలువడియుండేది కాదు లేక ఆలస్యంగా వెలువడియుండేది. ఈ సంస్థలో ఇంజను సాయంతో నడిచే మిషన్లు ఏర్పాటు చేయడం నాకు ఇష్టం లేదు. వ్యవసాయం చేతులతో చేస్తున్నప్పుడు ముద్రణా కార్యక్రమం కూడా చేతులతో నడిచే మిషన్లతో సాగించడం మంచిదని భావించాను. అయితే అది కష్టమని ఆ తరువాత తెలిసింది. దానితో అక్కడికి ఆయిలు ఇంజను తీసుకువెళ్ళాం. ఈ ఆయిలు ఇంజను దగా చేస్తే ముద్రణ సాగించేందుకు మరో పరికరం సిద్ధం చేసి వుంచుకోవడం అవసరమని వెస్ట్‌కు చెప్పాను. అతడు చేతితో త్రిప్పితే తిరిగే చక్రం ఒకటి సిద్ధం చేశాడు. దానితో ముద్రణ యంత్రం నడిచే ఏర్పాటు చేశాడు. మా పత్రిక దినపత్రిక ఆకారంలో ఉన్నది. పెద్దమిషను పాడైతే వెంటనే దాన్ని బాగు చేసే ఏర్పాటు మా దగ్గర లేదు. అందువల్ల పత్రిక ఆగిపోయే పరిస్థితి ఏర్పడింది. ఈ ఇబ్బంది నుండి తప్పించుకునేందుకై పత్రిక ఆకారాన్ని వారపత్రిక రూపంలోకి మార్చాం. కాలితో ట్రెడిల్ నడిపి కొన్ని పేజీలైనా ముద్రించవచ్చునని భావించాం. ఆరంభపు రోజుల్లో ఇండియన్ ఒపీనియన్ పత్రిక వెలువడే రోజు రాత్రి అంతా జాగరణ చేయాల్సి వచ్చింది. కాగితం సరిచేయడం, దాన్ని అమర్చడం మొదలగు పనులు అంతా కలిసి చేసేవాళ్ళం. రాత్రి 12 గంటలకు పనిపూర్తి అయ్యేది. అయితే ఫినిక్సులో ఆ మొదటి రాత్రి మరిచిపోవడానికి వీలులేనిది. ఫారం మిషను మీద ఎక్కించాం. అప్పుడు ఇంజన్ ససేమిరా నడవనని భీష్మించింది. ఇంజనీరును పిలిపించాం. ఆయన, వెస్ట్ ఎంతో శ్రమ పడ్డారు. కాని ఇంజను మాత్రం నడవలేదు. అందరూ చింతాక్రాంతులైనారు. చివరికి వెస్ట్ నిరాశపడి పోయాడు. కన్నీరు కారుస్తూ నా దగ్గరకు వచ్చాడు. “ఇక మిషను ఇవాళ నడవదు. ఈ వారం సమయానికి మనం పత్రికను ప్రచురించలేము” అని అన్నాడు.

“అయితే ఏం చేస్తాం! కన్నీరు కార్చవలసిన అవసరం ఏముంది? ఇంకా ఏమైనా ప్రయత్నం చేయవలసి ఉంటే చేద్దాం. సరే కాని మీరు సిద్ధం చేసిన చక్రం సగతి ఏమిటి?” అని అడిగాను. “ఆ చక్రం నడవడానికి జనం కావాలి. అంతమంది మన దగ్గర లేరు. మా వల్ల ఆ చక్రం నడవదు. వంతులవారీగా నలుగురు నలుగురు చొప్పున జనం కావాలి. మేమంతా బాగా అలిసిపోయాం” అని అన్నాడు వెస్ట్.

అప్పటికి వడ్రంగుల పని ఇంకా పూర్తికాలేదు. అందువల్ల వాళ్ళు వెళ్ళిపోలేదు. ముద్రణాలయంలోనే వారంతా నిద్రపోతున్నారు. వారిని చూపించి ఈ మేస్త్రీ లంతా వున్నారుగదా! వీరి సాయం పొందవచ్చుగదా! ఈ రాత్రి మనమంతా అఖండ జాగరణం చేద్దాం. అదే మంచిదని నా అభిప్రాయం అని అన్నాను. “మేస్త్రీలను మేల్కొలపాలన్నా, వారి చేత పనిచేయించాలన్నా నాకు ధైర్యం చాలడంలేదు. అలసిపోయిన వాళ్ళకు కూడా పని చేయమని ఎలా చెప్పడం? ఆ పని నేను చేస్తాను” అని అన్నాను. “అయితే పని పూర్తి కావచ్చు”. నేను మేస్త్రీలను మేల్కొలిపాను. సాయం చేయమని కోరాను. వారిని బ్రతిమలాడవలసిన అవసరం కలుగలేదు. “ఇలాంటి కష్టసమయంలో ఆదుకోకపోతే మేము మనుష్యలం ఎలా అవుతాం? మీరు విశ్రాంతి తీసుకోండి. మేము చక్రం త్రిప్పుతాం మాకు అది పెద్ద పనికాదు” అని వాళ్ళు అన్నారు.

ముద్రణ చేసే కార్యకర్తలు సిద్ధంగా ఉన్నారు. అంతా పనిచేస్తూ కీర్తనలు పాడటం ప్రారంభించారు. చక్రం త్రిప్పడానికి మేస్త్రీలకు సాయపడ్డాం. వంతులవారీగా వాళ్ళు చక్రం త్రిప్పసాగారు. పని అయిపోతూ ఉన్నది. తెల్లవారింది. ఏడో గంట కొట్టారు. ఇంకా పని మిగిలి ఉండటం గమనించాను. వెస్ట్‌వైపు చూచి ఏమండీ ఇంజనీరును మేల్కొలపకూడదా? పగటిపూట బాగు చేస్తే ఇంజను నడుస్తుందేమో, పని సమయానికి పూర్తి అవుతుంది కదా! అని అన్నాను.

వెస్ట్ వెంటనే వెళ్ళి ఇంజనీరును మేల్కొలిపాడు. అతడు ఇంజను వున్న చోటకు వెళ్ళాడు. మీట నొక్కేసరికి ఇంజను పనిచేయడం ప్రారంభించింది. ప్రెస్సు అంతా సంతోషపు నినాదాలతో మార్మోగింది. “ఏమిటిది? ఇంజను రాత్రి నడవనంది కదా! మరి ఇప్పుడు మీటనొక్కగానే ఏమీ తెలియనట్లు ఠపీమని ఎలా నడిచింది?” ఈ ప్రశ్నలకు వెస్ట్, ఇంజనీరు సమాధానం ఇచ్చేందుకు ప్రయత్నించారు. “ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పడం కష్టం. మిషన్లకు కూడా మన మాదిరిగా విశ్రాంతి అవసరం అయివుండవచ్చు. అప్పుడప్పుడు అవి ఇలా వ్యవహరిస్తూ వుండటం కద్దు” అని అన్నారు.

“ఇంజను మనందరికీ మంచి పరీక్ష పెట్టింది. మనమంతా కష్టపడ్డాం సమయానికి అది నడవడం మన నిజమైన శ్రమకు శుభప్రదమైన ఫలితం అయివుండవచ్చు” అని అన్నాను. సమయానికి పత్రిక స్టేషను చేరుకుంది. అంతా నిశ్చింతగా శ్వాస పీల్చారు. పత్రిక సమయానికి వెలువడుతుందనే భావం జనానికి కలిగింది. ఫినిక్సులో కాయకష్టం చేయాలనే వాతావరణం నెలకొన్నది. ఒక పర్యాయం ఇంజనును నడపడం మాని, చక్రం త్రిప్పి ముద్రణా కార్యక్రమం సాగించిన రోజులు కూడా వున్నాయి. అవి నైతికంగా ఫినిక్సు చరిత్రలో ఉన్నతమైన రోజులని నా అభిప్రాయం.