సత్యశోధన/నాల్గవభాగం/11. ఇంగ్లీషువారితో గాఢ పరిచయం

వికీసోర్స్ నుండి

11. ఇంగ్లీషు వారితో గాఢ పరిచయం

ఈ ప్రకరణం వ్రాస్తున్నప్పుడు “సత్యశోధన” అను నా ఈ గ్రంథ రచనకు గల కారణాలను, సందర్భాలను పాఠకులకు తెలియజేయడం అవసరమని భావిస్తున్నాను. ఈ కథ వ్రాసే సమయంలో నా దగ్గర ప్లాను అంటూ ఏమీ లేదు. ఎదురుగా పుస్తకాలు గాని, డైరీలు గాని, ఇతర పత్రాలు గాని పెట్టుకొని నేను ఈ ప్రకరణాలు వ్రాయలేదు. అంతరంగం చూపిన మార్గంలో వ్రాస్తున్నానని చెప్పగలను. నాలో సాగుతున్న క్రియను, అంతర్యామి యొక్క క్రియ అని అనవచ్చునో లేదో నిశ్చయంగా చెప్పలేను. కాని ఒక విషయం మాత్రం నిజం. ఎన్నో సంవత్సరాలనుండి నేను చేస్తున్న అతి పెద్ద పనిని అతి చిన్న పనిని పరిగణింపతగిన కార్యాలనన్నింటిని జాగ్రత్తగా పరిశీలించిన పిమ్మట అవన్నీ అంతర్యామి ప్రేరణవల్లనే జరిగాయని చెప్పగలను.

అంతర్యామిని నేను చూడలేదు. తెలుసుకోలేదు. ప్రపంచమంతటికీ భగవంతుని యెడ గల శ్రద్ధనే నేను కూడా శ్రద్ధగా మలుచుకున్నాను. ఆ శ్రద్ధ తొలగించుటకు వీలులేనిది. అందువల్ల శ్రద్ధగా దాన్ని గుర్తించడం మానుకొని దానిని అనుభవ రూపంలో గుర్తిస్తున్నాను. అయినా ఈ విధంగా అనుభవరూపంలో దాన్ని పరిచయం చేయడం కూడా సత్యం మీద పడుతున్న దెబ్బ అనే గ్రహించాలి. అసలు శుద్ధ రూపంలో దాన్ని పరిచయం చేయగల శబ్దాలు నా దగ్గర లేవని చెప్పడమే మంచిదని భావిస్తున్నాను.

కంటికి కనబడని అంతర్యామికి వశవర్తినై నేను ఈ కథ వ్రాస్తున్నానని నా విశ్వాసం. వెనుకటి ప్రకరణం ప్రారంభించినప్పుడు ‘ఇంగ్లీషు వారితో పరిచయం’ అని శీర్షిక పెట్టాను. కాని ప్రకరణం వ్రాస్తున్నప్పుడు ఈ పరిచయాల్ని వివరించే ముందు “పావనస్మృతి” ని గురించి వ్రాయాలని అనుకొని ఆ ప్రకరణం వ్రాశాను. దాన్ని వ్రాసిన తరువాత మొదటి శీర్షికను మార్చవలసి వచ్చింది.

ఇప్పుడు ఈ ప్రకరణం వ్రాస్తున్నప్పుడు మరో ధర్మసంకటం వచ్చిపడింది. ఇంగ్లీషు వారిని పరిచయం చేస్తున్నప్పుడు ఏమి చెప్పాలి, ఏమి చెప్పకూడదు. అను మహత్తరమైన ప్రశ్న ఉదయించింది. విషయం చెప్పకపోయినా సత్యానికి దెబ్బతగులుతుంది. అసలు ఈ కథ వ్రాయవలసిన అవసరమే లేదేమో. ఇట్టి స్థితిలో అప్రస్తుతమైన వివాదాన్ని పరిష్కరించేందుకు పూనుకోవడం కష్టం గదా!

చరిత్ర రూపంలో ఆత్మకథ అపూర్ణం. అందుకు సంబంధించిన ఇబ్బందుల్ని ఇప్పుడు నేను బాగా అర్థం చేసుకోగలుగుతున్నాను. ‘సత్యశోధన’ యను ఈ ఆత్మకథలో నాకు జ్ఞాపకం వున్న విషయాలన్నింటిని వ్రాయడం లేదని నాకు తెలుసు. సత్యాన్ని దర్శింప చేయుటకు నేను ఎంత వ్రాయాలో ఎవరికి తెలుసు? ఒకే మార్గాన నడిచే అసంపూర్ణ ఆధారాలకు న్యాయ మందిరంలో ఎంత విలువ కట్టబడుతుందో మరి? వ్రాసిన ప్రకరణలను గురించి తీరికగా వున్న వ్యక్తి ఎవరైనా నాతో తర్కానికి దిగితే నా ఈ ప్రకరణాలపై ఎంత వెలుగు ప్రసరింపచేస్తాడోగదా! అతడు విమర్శకుని దృష్టితో దీన్ని అన్వేషించి ఎటువంటి డొల్లు విషయాలు బయటపెట్టి ప్రపంచాన్ని నవ్విస్తాడో కదా? తాను కూడా ఉబ్బి తబ్బిబ్బు అవుతాడో కదా!

ఈ విధంగా ఆలోచించడం ప్రారంభించినప్పుడు ఈ ప్రకరణాలు వ్రాయడం ఆపివేయడమే మంచిదని అనిపిస్తూ ఉంటుంది. కాని ప్రారంభించిన కార్యం అవినీతిమయమని స్పష్టంగా గోచరించనంతవరకు దాన్ని ఆపివేయకూడదు కదా! అందువల్ల అంతర్యామి నన్ను ఆపివేయమని ఆదేశించనంతవరకు ప్రకరణలు వ్రాస్తూ ఉండాలనే నిర్ణయానికి వచ్చాను.

ఈ కథ టీకాకారుల్ని తృప్తి పరచడం కోసం వ్రాయడం లేదు. ఇది సత్యశోధనకు సంబంధించిన ఒక ప్రయోగం. దీనివల్ల అనుచరులకు కొంత ఊరట కలుగుతుందను భావం కూడా ఈ రచన మూలంలో పనిచేస్తున్నది. దీని ఆరంభం కూడా వారి తృప్తి కోసమే జరిగింది. స్వామీ ఆనంద్, జయరామదాసులు నా వెంటపడి యుండకపోతే బహుశ ఈ కథ ఆరంభమై ఉండేది కాదు. అందువల్ల ఈ కథారచనలో ఏమైనా దోషాలు దొర్లితే అందుకు వారు కూడా భాగస్వాములే.

ఇక నేను శీర్షికకు వస్తాను. నేను హిందూ దేశస్తుల్ని గుమాస్తాలుగా ఇంట్లో పెట్టుకున్నట్లుగానే, ఇంగ్లీషు వాళ్ళను కూడా పెట్టుకోసాగాను. నా ఈ చర్య నా వెంట వుండే వారందరికీ పొసగేది కాదు. అయినా పట్టుబట్టి వారిని నా యింట్లో ఉంచాను. అందరినీ వుంచి నేను తెలివిగలపని చేశానని గట్టిగా చెప్పలేను. కొందరి విషయంలో చేదు అనుభవాలు కూడా కలిగాయి. అయితే ఇట్టి అనుభవాలు దేశవాసులవల్ల మరియు విదేశీయులవల్ల కలిగాయి. చేదు అనుభవాలు కలిగినందుకు నాకు పశ్చాత్తాపం కలుగలేదు. చేదు అనుభవాలు కలుగుతూ వున్నా మిత్రులకు అసౌకర్యం కలుగుతుందని తెలిసి కూడా కష్టాలు పడవలసి వస్తుందని భావించే నా అలవాటును మార్చుకోలేదు. ఉదారస్వభావంతో మిత్రులు సహించారు కూడా. క్రొత్త క్రొత్త మనుష్యుల వెంట వుండటం వల్ల, అట్టి సంబంధాల వల్ల అనుచరులకు విచారం కలిగింది. అప్పుడు వారి వారి దోషాలు వివరించి చెప్పడానికి నేను సంకోచించలేదు. ఆస్తికులగు మనుష్యులు తమలో గల భగవంతుణ్ణి సర్వులలో చూడగలిగి, అందరితోను నిర్లిప్తంగా వుండగల శక్తిని అలవర్చుకొని వుండాలని నా అభిప్రాయం. ఎక్కడ వెతకకుండా అవకాశాలు లభిస్తాయో, అక్కడ వాటికి దూరంగా పారిపోకుండా క్రొత్త క్రొత్త సంబంధాలు ఏర్పరుచుకున్నప్పుడు, అలా చేస్తూ రాగద్వేషాలకు దూరంగా వుండగలిగినప్పుడు శక్తిని వికసింపచేసుకోగలుగుతాము.

బోయర్లకు బ్రిటీష్‌వారికి యుద్ధం ప్రారంభమైనప్పుడు నా ఇల్లు పూర్తిగా నిండిపోయి వున్నప్పటికీ జోహన్సుబర్గు నుండి వచ్చిన ఇద్దరు ఇంగ్లీషు వారికి నా ఇంట్లో బస ఏర్పాటు చేశాను. ఇద్దరూ థియాసాఫిస్టులు. ఒకని పేరు కిచన్. ఆయనను గురించి ముందు కూడా పేర్కొనడం జరుగుతుంది. ఈ మిత్రుల సహవాసం కూడా నా ధర్మపత్నిని బాగా ఏడిపించింది. నా మూలాన ఆమె ఏడ్వవలసిన సందర్భాలు అనేకసార్లు ఏర్పడ్డాయి. ఏవిధమైన పర్దాగాని, అరమరికలు గాని లేకుండా ఇంగ్లీషువారికి బస ఏర్పాటు చేయడం ఇదే మొదటిసారి. ఇది క్రొత్త అనుభవం. ఇంగ్లాండులో నేను వాళ్ళ ఇళ్ళలో వున్నమాట నిజం. అయితే వారి విధానానికి, ప్రవర్తనకు లోబడి నేను వున్నాను. ఆ నా నివాసం హోటలు నివాసం వంటిది. కాని ఈ వ్యవహారం అలాంటిది కాదు. పూర్తిగా అందుకు విరుద్ధం. ఈ మిత్రులు నా కుటుంబసభ్యులుగా వున్నారు. వాళ్ళు భారతీయ అలవాట్లను, నడవడిని అనుసరించారు. ఇంట్లోను, బయటకూడా వ్యవహారమంతా ఆంగ్లేయుల పద్ధతిలోనే ఉన్నాయి. ఈ మిత్రుల్ని మాతోబాటు మా ఇంట్లో వుంచినప్పుడు ఎన్నో ఇబ్బందులు కలిగిన విషయం నాకు జ్ఞాపకం వున్నది. కాని వారిద్దరు మా కుటుంబ సభ్యులందరితో పూర్తిగా కలిసిపోయారని చెప్పగలను. జోహన్సుబర్గులో ఈ సంబంధాలు డర్బనును మించిపోయాయి.