సంపూర్ణ నీతిచంద్రిక/నక్క కపటపు మాటలచే వంచింపబడిన లేడి కథ

వికీసోర్స్ నుండి

నక్క కపటపు మాటలచే వంచింపబడిన లేడి కథ

మగధ దేశమున జంపావతి యను నడవియొకటి గలదు. అచట జిరకాలమునుండియు నొక లేడియు, నొక కాకమును మిగుల స్నేహముతో నివసించుచుండెను. ఆలేడి చక్కగా బలిసి యడవిలో హాయిగా తిరుగుచుండగా నొక జంబుకము చూచి యిట్లాలోచించెను.

"ఆహా! యీలేడి మిక్కిలి బలిసియున్నది. దీని మాంసము నాకెట్లు లభించును." దీనికి నమ్మకము గలిగించి ప్రయత్నించి చూచెదను." అని తలచి యాజింకను సమీ పించి "చెలికాడా! సేమమా?" యని యడిగెను. దాని కాజింక "నీవెవ్వడ" వని ప్రశ్నించెను.

"నేను సుబుద్ధియను పేరుగల జంబుకమను . కారణాంతరములచేత నాచుట్టము లందఱు నన్ను విడిచి పోయిరి. నేను మృతునివలె నిచట నొంటరిగా వసించుచున్నాను. స్నేహపాత్రుడవగు నిన్ను జూడగనే బంధువులనడుమ జేరినటులున్నది. నీతో జెలిమిచేసి కూడియుండ దలచుచున్నాను." అని యాజంబుకము సమాధాన మీయగా "సరే, అట్లే కానిమ్ము." అని దానిని లేడి సాయంకాలము తన నివాస స్థానమునకు దోడుకొనిపోయెను.

అచట సంపెంగచెట్టుకొమ్మమీద నిలిచియున్న కాకి తన చెలికాడగు జింకను చూచి "యీ రెండవవా డెవ్వడని యడిగెను. "నాస్నేహము గోరివచ్చిన సుబుద్ధియను జంబుకోత్తము" డని లేడి చెప్పగా విని, కాక మిట్లనియెను.

"సఖుడా! ఆకస్మికముగా వచ్చినవారిని నమ్మి చెలిమి సేయదగదు. కులము, శీలము నెఱుగనిదే యెవ్వరికి జోటీయ దగదు. మార్జాలమునకు జోటిచ్చిన దోషము చేత బూర్వము జరద్గవమను నొక గ్రద్ద మరణము నొందెను. నీ కా కథ వివరించెదను వినుము" అని కాకి యిట్లు చెప్పదొడగెను.