శ్రీ సాయిసచ్చరిత్రము /నలుబదియవ అధ్యాయము

వికీసోర్స్ నుండి
'శ్రీ సాయిసచ్చరిత్రము' (నలుబదియవ అధ్యాయము)



శ్రీ సాయిసచ్చరిత్రము నలుబదియవ అధ్యాయము బాబా కథలు 1. దేవుగారి యింటిలో ఉద్యాపనకు బాబా సన్యాసి వేషముతో మరి యిద్దరిని తోడ్కొని పోవుట. 2. హేమడ్‌పంతు ఇంటికి ఫోటో రూపములో పోవుట


ఈ యధ్యాయములో రెండు కథలు చెప్పుదుము 1. దహనులో బి.వి. దేవుగారింటికి వారి తల్లి యాచరించిన ఉద్యాపన వ్రతమునకు బాబా వెళ్ళుట. 2. బాంద్రాలోని హేమడ్‌పంతు ఇంటికి హొళీ పండుగనాడు భోజనమునకు పోవుట.

తొలిపలుకు

శ్రీసాయిసమర్థుడు పావనమూర్తి. తన భక్తుల కిహపరవిషయములందు తగిన సలహాల నిచ్చి జీవితపరమావధిని పొందునట్లు చేసి వారిని సంతోషపెట్టును. సాయి తన హస్తమును భక్తుల తలపై పెట్టి తమ శక్తులను వారిలోనికి పంపించి భేదభావమును నశింపజేసి, అప్రాప్యమును ప్రాప్తింపజేయును. వారు తమ భక్తుల యెడ భేదము లేక, తమకు నమస్కరించిన వారిని ఆదరములో అక్కునజేర్చుకొనెడి వారు. వర్షకాలములో నదులు కలియు సముద్రమువలె బాబా భక్తులతో కలసి తన శక్తిని స్థాయిని శిష్యులు కిచ్చును. దీనిని బట్టి, యెవరయితే భగవద్భక్తుల లీలలను పాడెదరో వారు భగవంతుని లీలలను పాడినవారికంటెగాని, యంతకంటె యెక్కువగాని దేవుని ప్రేమకు పాత్రులగుదురని తెలియవలెను. ఇక ఈ అధ్యాయములోని కథల వైపు మరలుదము.

దేవుగారింట ఉద్యాపనవ్రతము

దహనులో బి.వి. దేవుగారు మామలతదరుగా నుండెను. వారి తల్లి 25, 30 నోములు నోచెను. వాని ఉద్యాపన చేయవలసి యుండెను. ఈ కార్యములో 100,200 మంది బ్రాహ్మణులకు భోజనము పెట్టవలసియుండెను. ఈ శుభకార్యమునకు ముహూర్తము నిశ్చయమయ్యెను. దేవుగారు బాపూసాహెబు జోగ్‌గారి కొక లేఖ వ్రాసిరి. అందులో బాబా ఈ శుభకార్యమునకు దయ చేయ వలయుననియు, వారు రాకున్నచో అసంతృప్తికరముగా నుండుననియు వ్రాసెను. జోగ్ ఆ యుత్తరము చదివి బాబాకు వినిపించెను. మనఃపూర్వకమయిన విజ్ఞాపనను విని బాబా యిట్లనియె. "నన్నే గుర్తుంచుకొనువారిని నేను మరువను. నాకు బండిగాని, టాంగాగాని, రైలుగాని, విమానముగాని యవసరము లేదు. నన్ను ప్రేమతో బిలుచువారి యొద్దకు నేను పరిగెత్తిపోయి ప్రత్యక్షమయ్యెదను. అతనికి సంతోషమున జవాబు వ్రాయుము. నీవు, నేను, ఇంకొకరు సంతర్పణకు వచ్చెదమని వ్రాయుము." జోగ్ బాబా చెప్పినది దేవునకు వ్రాసెను. దేవుగా రెంతో సంతసించిరి. కాని బాబా రహతా, రుయీ, నీమగాం దాటి ప్రత్యక్షముగా ఎక్కడికి పోరని అయనకు తెలియును. బాబాకు అశక్యమైనదేమియు లేదు. వారు సర్వాంతర్యామి యగుటచే హఠత్తుగా నేరూపమున నయిన వచ్చి, తమ వాగ్దనమును పాలించవచ్చు ననుకొనెను.

ఉద్యాపనకు కొద్దిరోజులు ముందుగా, బెంగాలీ దుస్తులను ధరించిన సన్యాసి యొకడు గోసంరక్షణకయి సేవనేయుచు దహను స్టేషన్ మాస్టరు వద్దకు చందాలు వసూలుచేయు మిషతో వచ్చెను. స్టేషన్ మాస్టరు , సన్యాసిని ఊరి లోనికి పోయి మామలతదారుని కలిసికొని వారి సహయముతో చందాలు వసూలు చేయుమనెను. అంతలో మామలతదారే యచ్చటికి వచ్చెను. స్టేషనుమాస్టరు సన్యాసిని దేవుగారికి పరిచయమొనర్చెను. ఇద్దరు ప్లాటఫారమ్ మీద కూర్చుండి మాట్లాడిరి. దేవు, ఊరిలో నేదో మరొక చందా పట్టి రావుసాహెబు నరొత్తమ శెట్టి నడుపుచుండుటచే, నింకొకటి యిప్పుడే తయారు చేయుట బాగుండదని చెప్పి 2 లేదా 4 మాసముల పిమ్మట రమ్మనెను. ఈ మాటలు విని సన్యాసి యచటనుండి పోయెను. ఒక నెల పిమ్మట యా సన్యాసి యొక టాంగాలో వచ్చి 10 గంటలకు దేవుగారి యింటిముందర అగెను. చందాల కొరకు వచ్చెనేమోయని దేవు అనుకొనెను. ఉద్యాపనము కావలసిన పనులలో దేవుగారు నిమగ్నులై యుండుట జూచి, తాను చందాలకొరకు రాలేదనియు భోజనమునకై వచ్చితినను సన్యాసి చెప్పెను. అందుకు దేవు "మంచిది! చాల మంచిది! మీకు స్వాగతము. ఈ గృహము మీదే!" యనెను. అప్పుడు సన్యాసి "ఇద్దరు కుఱ్ఱవాళ్ళు నాతో నున్నారు" అనెను. దేవు "మంచిది, వారితో కూడ రండు!" అనెను. ఇంకా రెండుగంటల కాలపరిమితి యుండుటచే, వారికొరకు ఎచ్చటికి పంపవలెనని యడిగెను. సన్యాసి ఎవరిని బంపనవసరము లేదనియు తామే స్వయముగా వచ్చెదమనియు చెప్పెను. సరిగా 12 గంటలకు ముగ్గురు వచ్చి సంతర్పణలో భోజనము చేసిన పిమ్మట వెడలి పోయిరి.

ఉద్యాపన పూర్తికాగానే దేవుగారు బాపూసాహెబు జోగుకు ఉత్తరము వ్రాసెను. అందులో బాబా తన మాట తప్పెనని వ్రాసెను. జోగు ఉత్తరము తీసికొని బాబా వద్దకు వెళ్ళెను. దాని తెరువకమునుపే బాబా యిట్లనెను. "హా! వాగ్దానము చేసి, దగా చేసితి ననుచున్నాడు. ఇద్దరుతో కూడ నేను సంతర్పణకు హాజరయితిని. కాని నన్ను పోల్చు కొనలేకపోయెనని వ్రాయుము. అట్టివాడు నన్ను పిలుచునేల? సన్యాసి చందాల కొరకు వచ్చెనని యనుకొనెను. అతని సంశయమును తొలగించుటకే మరిద్దరితో వచ్చెదనంటిని. ముగ్గురు సరిగా భోజనము వేళకు వచ్చి యారగించలేదా? నా మాట నిలబెట్టుకొనుటకు ప్రాణములనైన విడిచెదను. నా మాటలు నేనెప్పుడు పొల్లు చేయను." ఈ జవాబు జోగ్ హృదయములో నానందము కలుగజేసెను. బాబా సమాధానమంతయు దేవుగారికి వ్రాసెను. దాని చదువగనే దేవుకు అనందబాష్పములు దొరలెను. అనవసరముగా బాబాను నిందించినందులకు పశ్చాత్తపపడెను. సన్యాసి మొదటి రాకచే తానేట్లు మోసపోయెనో; సన్యాసి చందాలకు వచ్చుట, మరిద్దరితో కలసి భోజనమునకు వచ్చెదనను మాటలు తాను గ్రహించలేక మోసపోవుట - మొదలైనవి అతనికి అశ్చర్యము కలుగజేసెను.

భక్తులు పూర్ణముగా సద్గురువును శరణు వేడినచో, వారు తమ భక్తుల యిండ్లలో శుభకార్యములను సవ్యముగా నెరవేరునట్లు జూచెదరు అనునది యీ కథవల్ల సృష్టపడుచున్నది.

హేమడ్‌పంతు ఇంట హొళీ పండుగ భోజనము

ఇక బాబా తన ఫోటో రూపమున సాక్షాత్కరించి భక్తుని కోరిక నెరవేర్చున మరొక కథను చెప్పెదము.

1917వ సంవత్సరము హొళీ పండుగనాడు వేకువఝామున హేమడ్‌పంతుకొక దృశ్యము కనిపించెను. చక్కని దుస్తులు ధరించిన సన్యాసివలె బాబా కాన్పించి, నిద్రనుండి లేపి ఆనాడు భోజనమునకు వారింటికి వచ్చెదనని చెప్పెను. ఇట్లు తనను నిద్రనుంచి లేపినది కూడ కలలోని భాగమే. నిజముగా లేచి చూచుసరికి సన్యాసిగాని, బాబాగని కనిపించలేదు. స్వప్నము బాగుగా గుర్తుకు దెచ్చుకొనగా, సన్యాసి చెప్పిన ప్రతిమాట జ్ఞాపకమునకు వచ్చెను. బాబాగారి సహవాసము ఏడు సంవత్సరములనుండి యున్నప్పటికి, బాబా ధ్యానము నెల్లప్పుడు చేయుచున్నప్పటికి, బాబా తన యింటికి వచ్చి భోజనము చేయునని అతడనుకొనలేదు. బాబా మాటలకు మిగుల సంతసించి తన భార్యవద్దకు బోయి ఒక సన్యాసి భోజనమునకు వచ్చునుగాన, కొంచెము బియ్యము ఎక్కువ పోయవలెనని చెప్పెను. అది హొళీ పండుగదినము. వచ్చువారెవరని ఎక్కడనుంచి వచ్చుచున్నారని యామె యడిగెను. అమె నానవసరముగా పెడదారి పట్టించక అమె యింకొక విధముగా భావింపకుండునట్లు, జరిగినది జరిగినట్లుగా చెప్ప నెంచి, తాను గాంచిన స్వప్నమును తెలియజేసెను. శిరిడీలో మంచి మంచి పిండివంటలు విడిచి బాబా తనవంటివారింటికి బాంద్రాకు వచ్చునాయని, యామెకు సంశయము కలిగెను. అందులకు హేమడ్‌పంతు బాబా స్వయముగా రాకపోవచ్చు, కాని ఎవరినైన బంపవచ్చును. కనుక కొంచెము బియ్యము ఎక్కువ పోసినచో నష్టము లేదనెను.

మధ్యాహ్నభోజనమునకై ప్రయత్నము లన్నియు చేసిరి. మిట్ట మధ్యాహ్నమునకు సర్వము సిద్దమయ్యెను. హొళీ పూజ ముగిసెను. విస్తళ్ళు వేసిరి, ముగ్గులు పెట్టిరి. భోజనమునకు రెండు పంక్తులు తీర్చిరి. రెండింటిమధ్య నొక పీట బాబాకొర కమర్చిరి. గృహములోని వారందరు కొడుకులు, మనుమలు, కుమార్తెలు, అల్లుండ్రు మొదలగువారందరు వచ్చి వారి వారి స్థలముల నలంకరించిరి. వండిన పదార్థములు వడ్డించిరి. అందరు అతిథి కొరకు కనిపెట్టుకొని యుండిరి. 12 గంటలు దాటినప్పటికి ఎవరు రాలేదు. తలుపు వేసి గొండ్లెము పెట్టిరి. అన్నశుద్ది యయ్యెను. అనగా నెయ్యి వడ్డించిరి. భోజనము ప్రారంభించుట కిది యొక గుర్తు. అగ్నిహొత్రునకు శ్రీకృష్ణునకు నైవేద్యము సమర్పించిరి. అందరు భోజనము ప్రారంభింపబోవుచుండగా, మేడ మెట్లుపై చప్పుడు వినిపించెను. హేమడ్‌పంతు వెంటనే పోయి తలుపు తీయగా ఇద్దరు మనుష్యులచట నుండిరి. ఒకరు అలీమహమ్మద్ వేరొకరు మౌలానా ఇస్ముముజాపర్. ఈ యిరువురు వడ్డన మంతయు పూర్తియై అందరును భోజనము చేయుటకు సిద్దముగా నుండుటను గమనించి హేమడ్‌పంతును క్షేమించుమని కోరి యిట్లు చెప్పిరి. "భోజన స్థలము విడిచి పెట్టి మా వద్దకు పరుగెత్తుకొని వచ్చితివి. తక్కినవారు నీకొరకు చూచుచున్నారు. కావున, ఇదిగో నీ వస్తువును నీవు తీసికొనుము. ఆ తరువాత తీరుబడిగా వృత్తాంత మంతయు దెలిపెదము." ఆట్లునుచు తన చంకలోనుంచి ఒక పాత వార్తపత్రికలో కట్టిన పటమును విప్పి టేబిల్‌పైన బెట్టిరి. హేమడ్‌పంతు కాగితము విప్పి చూచుసరికి అందులో పెద్దది యగు చక్కని సాయిబాబా పటముండెను. అతడు మిగుల అశ్చర్యపడెను. అతని మనస్సు కరిగెను. కండ్లనుండి నీరు కారెను. శరీరము గగుర్పాటు చెందెను. అతడు వంగి పటములో నున్న బాబా పాదములకు నమస్కరించెను. బాబా యీ విధముగా తానలీలచే అశీర్వదించెనని యనుకొనెను. గొప్ప యాసక్తితో నీకా పటమెట్లు వచ్చెనని అలీమహమ్మద్‌ను అడిగెను. అతడా పటమొక యంగడిలో కొంటిననియు, దానికి సంబంధించిన వివరములన్నియు తరువాత తెలియజేసెద ననెను. తక్కినవారు భోజనమునకు కనిపెట్టుకొని యుండుటచే త్వరగా పోమ్మని యనెను. హేమడ్‌పంతు వారికి అభినందనలు తెల్పి భోజనశాలలోనికి బోయెను. అ పటము బాబా కొరకు వేసి పీటపయి బెట్టి వండిన పదార్థలన్నియు వడ్డించి, నైవేద్యము పెట్టినపిమ్మట అందరు భుజించి సకాలమున పూర్తి చేసిరి. పటములో నున్న బాబా యొక్క చక్కని రూపును జూచి యందరు అమితానందభరితులయిరి. ఇదంతయు నెట్లు జరిగెనని యాశ్చర్యపడిరి.

ఈ విధముగా బాబా హేమడ్‌పంతుకు స్వప్నములో జెప్పిన మాటలను నెరవేర్చి తన వాగ్దానము పాలించుకొనెను. ఆ ఫోటో వివరములు అనగా నది అలీమహమ్మదు కెట్లు దొరికెను? అతడెందుకు తెచ్చెను. దానిని హేమడ్‌పంతు కెందుకిచ్చెను? అనునవి వచ్చే అధ్యాయములో చెప్పుకొందము.


శ్రీ సాయినాథాయ నమః నలుబదియవ అధ్యాయము సంపూర్ణము

సమర్ద సద్గురు శ్రీసాయినాథార్పణమస్తు శుభం భవతు