శ్రీ గీతామృత తరంగిణి/శ్రీ గీతా మాహాత్మ్యము

వికీసోర్స్ నుండి

ధరోవాచ :
భగవన్ పరమేశాన భక్తి రవ్యభిచారిణీ ।
ప్రారబ్ధం భుజ్యమానస్య కథం భవతి హే ప్రభో ॥

భూదేవి వాక్యము:
ఓ భగవాన్ ! పరాత్పరా ! ఐహిక జీవనమున ప్రారబ్ధ కర్మలో మునిగియున్న మానవుని యందు అచంచల భక్తి యెట్లు ఉదయించగలదు ? ప్రభూ ! 1


శ్రీ విష్ణు రువాచ:
ప్రారబ్ధం భుజ్యమానోఽపి గీతా భ్యాసరత స్సదా ।
స ముక్తస్స సుఖీ లోకే కర్మణా నోపలిప్యతే. ॥

శ్రీ విష్ణువు వాక్యము:
ప్రాపంచిక కార్యములలో పాల్గొనుచున్నను , నియమబద్ధముగ గీతాధ్యయనము చేయువాఁడు ముక్తు డగును . అతఁడు ప్రపంచమున నానంద మనుభవించును . కర్మలతనిని బంధింప నేరవు . 2


మహాపాపాది పాపాని గీతాధ్యానం కరోతి చేత్ ।
క్వచిత్స్పర్శం న కుర్వన్తి నలినీదల మమ్బువత్ ॥

తామరాకును నీ రెట్లు స్పృశింప జాలదో గీతాధ్యానరతుని మహా పాపములు కూడ అంటనేరవు . 3


గీతాయాః పుస్తకం యత్రయత్ర పాఠః ప్రవర్త తే ।
తత్ర సర్వాణి తీర్థాని ప్రయాగాదీని తత్రవై ॥

గీతాగ్రంథము ఎచ్చట నుండునో , ఎచ్చట దాని పఠనము జరుగునో అచ్చట ప్రయాగాది సర్వపుణ్య తీర్థములును ఉండును. 4


సర్వే దేవాశ్చ ఋషయో యోగినః పన్నగాశ్చ యే ।
గోపాల గోపికా వాపి నారదోద్ధవ పార్షదైః ।
సహాయో జాయతే శీఘ్రం యత్ర గీతా ప్రవర్తతే ॥

ఎచ్చట గీతాపారాయణ జరుగుచుండునో , అచట సర్వ దేవతలు , ఋషులు , యోగులు , నాగులు , గోపాలురు , గోపికలు , భగవంతుని సాంగత్యములో ఉండు నారదుఁడు , ఉద్ధవాదులు వచ్చి శీఘ్రముగ సహాయ మొనర్తురు . 5


యత్ర గీతావిచారశ్చ పఠనం పాఠనం శ్రుతమ్ ।
తత్రాహం నిశ్చితం పృథ్వి నివసామి సదై వహి ॥

ఓ భూ దేవీ ! ఎచ్చట గీతా విచారణ , ఫఠనము , శ్రవణము , బోధ , ధ్యానము జరుగుచుండునో అచ్చట నే నెల్లప్పుడును తప్పక నివసించు చుందును. 6


గీతాశ్రయోఽహం తిష్ఠామి గీతామే చోత్తమంగృహమ్ ।
గీతాజ్ఞాన ముపాశ్రిత్య త్రీన్లోకాన్పాలయామ్యహమ్ ॥

నేను గీతయందు వసింతును . గీత నా అత్యుత్తమ నివాసమందిరము . గీతాజ్ఞానము నాధారముగ చేసికొనియే ముల్లోకములను నేను పాలించుచున్నాను.7


గీతా మే పరమా విద్యా బ్రహ్మరూపా న సంశయః ।
అర్ధమాత్రాక్షరా నిత్యా స్వానిర్వాచ్య పదాత్మికా ॥

గీత నాయొక్క పరమవిద్య . అది బ్రహ్మ స్వరూపము . ఇందు సంశయము లేదు . అది శాశ్వతము . ప్రణవము యొక్క నాల్గవపాదమగు అర్థమాత్రా స్వరూపము , నాశన రహితమును అనిర్వచనీయమును అయియున్నది. 8


చిదానన్దేన కృష్ణేన ప్రోక్తేన స్వముఖతోఽర్జునమ్ ।
వేదత్రయీ పరానన్దా తత్వార్థ జ్ఞాన మంజసా ॥

గీతను సర్వజ్ఞ్డుడు సచ్చిదానంద మూర్తి యునగు శ్రీ కృష్ణపరమాత్మ స్వయముగ తన నోటితో ముఖాముఖి అర్జునునకు చెప్పెను. అది మూడు వేదముల సారము , దాని నాశ్రయించువారి కది పరమార్థ జ్ఞానము నందజేయును . అది పరమానంద స్వరూపమై విలసిల్లును. 9


యోఽష్టాదశ జపే న్నిత్యం నరో నిశ్చలమానసః।
జ్ఞానసిద్ధిం స లభతే తతో యాతి పరం పదమ్ ॥

నిర్మలము, నిశ్చలమునగు మనస్సుతో అనుదినము గీత పదునెనిమిది అధ్యాయములు పారాయణ చేయువాడు జ్ఞాన సిద్ధి నొంది అత్యుత్తమ స్థితిని ( మోక్షమును ) పొందును .10


పాఠేఽ సమర్థః సంపూర్ణే తతోఽర్థం పాఠ మాచరేత్ ।
తదా గోదానజం పుణ్యం లభతే నాత్ర సంశయః ॥

పూర్తి పారాయణము సంభవము కాని యెడల , సగభాగమైనను చదివిన యెడల గోదానము వలన కలుగు పుణ్యము లభించును . ఇందెట్టి సంశయమును లేదు .11


త్రిభాగం పఠమానస్తు గఙ్గా స్నానఫలం లభేత్ ।
ఛడంశం జపమానస్తు సోమయాగఫలం లభేత్ ॥

నిత్యము గీతలో మూడవ భాగము పారాయణ చేయువానికి పవిత్ర గంగా స్నానము వలన కలుగు పుణ్యమును , ఆరవవంతు పఠించువానికి సోమయాగ ఫలమును ప్రాప్తించును .12


ఏకాధ్యాయం తు యో నిత్యం పఠతే భక్తి సంయుతః ।
రుద్రలోక మవాప్నోతి గణో భూత్వా వసేచ్చిరమ్ ॥

ఎవడు గీతలో ఒక అధ్యాయము నిశ్చల భక్తితో నిత్యము పారాయణ చేయునో , అతడు రుద్రలోకమును పొంది రుద్రగణములలో నొకడుగ పెక్కు సంవత్సరము లచట నివసించును .13


అధ్యాయం శ్లోకపాదం వా నిత్యం యః పఠతే నరః ।
స యాతి నరతాం యావన్మన్వంతరం వసున్ధరే ॥

ఓ భూదేవీ ! ఒక అధ్యాయము కాని , ఒక శ్లోక పాదముకాని అనుదినము పారాయణ చేయువాడు మన్వంతరము వరకు మానవ జన్మనే పొందును . ( మన్వంతర మనగా 71 మహాయుగములు లేక 30,84,48,000 సంవత్సరములు ). 14


గీతాయాః శ్లోక దశకం సప్త పఞ్చ చతుష్టయమ్ ।
ద్వౌత్రీ నేకం తదర్ధం వా శ్లోకానాం యః పఠేన్నరః ॥
చన్ద్రలోక మవాప్నోతి వర్షాణా మయుతం ధ్రువమ్ ।
గీతాపాఠసమాయుక్తో మృతో మానుషతాంవ్రజేత్ ॥

ప్రతిదినము ఏ మనుజుడు పది , ఏడు , ఐదు , నాలుగు , మూడు , రెండు శ్లోకములు , ఒకటి లేదా సగము శ్లోకము పఠించినను చంద్ర లోకమును పొంది అచట పదివేల సంవత్సరములు నివసించును . గీతను ప్రతి దినము పఠించు నభ్యాసములో నున్నవాఁడు చనిపోయిన పిదప మరుజన్మలో మానవుడై పుట్టును . 15,16


గీతాభ్యాసం పునః కృత్వా లభతే ముక్తి ము త్తమామ్ ।
గీతే త్యుచ్చారసంయుక్తో మ్రియమాణో గతిం లభేత్ ॥

ఇట్లాతఁడు మానవుడై జన్మించి గీతను మఱల మఱల పారాయణ చేయుచు ఉత్తమ మగు మోక్షము నొందును . " గీతా గీతా " అని మరణ కాలమున ఉచ్చరించువాఁడు సద్గతిని పొందును . 17


గీతార్థ శ్రవణాసక్తో మహాపాపయుతోఽపివా ।
వైకుణ్ఠం సమవాప్నోతి విష్ణునా సహ మోదతే ॥

మహాపాపాత్ముడైనను గీతార్థమును విను నాసక్తి గలవాఁడు విష్ణు లోకమునకుఁ బోయి , విష్ణుదేవునితో నానందము ననుభవించు చుండును . 18


గీతార్థం ధ్యాయతే నిత్యం కృత్వా కర్మాణిభూరిశః ।
జీవన్ముక్తః స విజ్ఞేయో దేహాన్తే పరమం పదం ॥

గీతార్థమును నిత్యమును చింతన చేయువాడు ఎన్ని కర్మల నాచరించినను , దేహాంతరమున పరమ ధామము నొందును . మఱియు అతఁడు జీవించి యుండగనే జీవన్ముక్తుడని చెప్పబడును .19


మల నిర్మోచనం పుంసాం జలస్నానం దినే దినే ।
సకృద్గీతామ్భసి స్నానం సంసార మల మోచనమ్ ॥

దైనందిన స్నానము మనుజుల శరీరమున గల మాలిన్యమును పోగొట్టి శుభ్రపఱచును - ఒక్కసారి గీతా పవిత్రోదకములందు స్నానము చేసిననే సంసార కాలుష్యమంతయు పోయి పునీతులగుదురు .20


గీతామాశ్రిత్య బహవో భూభుజో జనకాదయః ।
నిర్ధూతకల్మషా లోకే గీతా యాతాః పరమం పదమ్ ॥

గీతను ఆశ్రయించి యీ లోకమున జనక మహారాజు మున్నగు రాజు లెందఱో పునీతులై అత్యున్నత గతిని , మోక్షమును పొందిరి . అట్లు గీత కీర్తింప బడుచున్నది . 21


యే శృణ్వన్తి పఠన్త్యేన గీతాశాస్త్ర మహర్నిశమ్ ।
న తే వై మానుషా జ్ఞోయా దేవా ఏవ న సంశయః ॥

అహర్నిశములందు గీతా మహా శాస్త్రమును శ్రవణము , పఠనము చేయు వారిని మానవ మాత్రులని తలవకుము . వారు దేవతా స్వరూపులే . 22


జ్ఞానా జ్ఞాన కృతం నిత్య మిన్ద్రియై ర్జనితం చ యత్ ।
తత్సర్వం నాశ మాయాతి గీతా పాఠేన తత్క్షణమ్ ॥

నిరంతర గీతాపఠనము వలన , తెలిసి కాని , తెలియక కాని ఇంద్రియముల ద్వారా లేక మరెట్టివైనా చేసిన పాపము లన్నియు తక్షణమే నశించిపోవును . 23


ధిక్ తస్యజ్ఞాన మాచారం వ్రతం చేష్టాం తపోయశః ।
గీతార్థ పఠనం నాస్తి నాధమ స్తత్పరో జనః ॥

గీతాపఠనాసక్తి లేనివాని విద్య , ప్రవర్తన , నియమములు , ఆచారములు , వ్యవహారములు , తపస్సు , యశస్సునకును ధిక్కారమగు గాక ! అట్టివాడు నిజముగ అధముడే . 24


సంసార సాగరం ఘోరం తర్తు మిచ్ఛతి యో జనః ।
గీతా నావం సమారూహ్యం పారం యాతి సుఖేన సః ॥

భయంకరమగు సంసార మహా సాగరమును దాటిపోవ నెంచువాడు గీత అను నావ నెక్కి సులువుగ ఆవలియొడ్డు చేరగలుగును .25


గీతా యాః పఠనం కృత్వా మాహాత్మ్యం నైవ యః పఠేత్ ।
వృథాపాఠో భ వేత్తస్య శ్రమ యేవ హ్యుదాహృతః ॥

గీతను పఠించిన పిదప ఎవఁడు గీతా మాహాత్మ్యమును పఠింపడో వానికి ఫలితమేమియు లేక శ్రమయే మిగులును . అనగా పరిపూర్ణ విశ్వాసముతో గీతను , దాని మాహాత్మ్యమును గూడ పఠించువానికి సత్ఫలితములు తప్పక కలుగునని భావము . 26


ఏతన్మా హాత్మ్య సంయుక్తం గీతాభ్యాసం కరోతి యః ।
స తత్ఫల మవాప్నోతి దుర్లభాం గతి మాప్నుయాత్ ॥

ఈ మాహాత్మ్యముతో బాటు ఎవఁడు గీతను అధ్యయనము చేయునో , అత డుదహరించిన ఫలమును పొంది అన్యధా దుర్లభమైన సద్గతిని ( మోక్షమును ) పొందగలడు . 27


సూత ఉవాచ :
మాహాత్మ్య మే తద్గీతాయాః మయాప్రోక్తం సనాతనమ్ ।
గీతా న్తేచ పఠేద్యస్తు యదుక్తం తత్ఫలమ్ లభేత్ ॥

సూతుల వాక్యము :
ఓ శౌనకాది మహర్షులారా ! నాచే వివరింపబడిన యీ గీతా మహాత్మ్య ప్రశస్తి గీతాధ్యయనము చివర చదువవలెను . అప్పుడు అందు చెప్పబడిన ఫలితములు తప్పక కైవసమగును .


ఓం తత్ సత్ ఇతి శ్రీ వరాహ పురాణే
శ్రీ గీతా మాహాత్మ్యమ్ సంపూర్ణమ్.

ఓం తత్ సత్ ఇట్లు శ్రీ వరాహ పురాణ మందలి
శ్రీ గీతా మహాత్మ్యము సంపూర్ణము.

ఓం శాంతిః శాంతిః శాంతిః


శ్రీ గీతామృత తరంగిణి
అర్జునవిషాద యోగము | సాంఖ్య యోగము | కర్మ యోగము | జ్ఞాన యోగము | కర్మసన్యాస యోగము | ఆత్మసంయమ యోగము | జ్ఞానవిజ్ఞాన యోగము | అక్షరపరబ్రహ్మ యోగము | రాజవిద్యారాజగుహ్య యోగము | విభూతి యోగము | విశ్వరూపసందర్శన యోగము | భక్తి యోగము | క్షేత్రక్షేత్రజ్ఞవిభాగ యోగము | గుణత్రయవిభాగ యోగము | పురుషోత్తమప్రాప్తి యోగము | దైవాసురసంపద్విభాగ యోగము | శ్రద్దాత్రయవిభాగ యోగము | మోక్షసన్యాస యోగము