శ్రీకృష్ణుడు చూపిన మార్గము/అనుబంధము 1

వికీసోర్స్ నుండి

అనుబంధము 1.

గీత: విశ్వమాత.

(గాంధి మహాత్ముడు.)

(గాంధిమహాత్ముడు కాశిలో విద్యార్థులకు హిందీభాషలో నిచ్చినయుపన్యాసమున కీక్రింది దనువాదము.)


జీవితములో కలుగుకష్టములనుండియు, మోహముల నుండియు తప్పించి సరియైనదారిచూపగల యొక మతగ్రంథ ముండుట యావశ్యకమని నాకుచిన్నతనములోనే తోచినది. వేదములను చదువుదమన్న కాశివంటి విద్యాస్థానములో పదునేను పదునారు సంవత్సరములైనను చాలకష్టపడవలెను. అప్పుడు నాకు వేదాభ్యాసము చేయుట కవకాశము చిక్కక పోయినది. కాబట్టి వేదములు నాకందరానివయినవి. కాని సమస్తశాస్త్రములు, ఉపనిషత్తులలోని సారమంతయుగీతలో నేడువందలశ్లోకములలో నిమిడియున్నదని నేనెక్కడనోచదివి యుంటిని. వెంటనే నిశ్చయము చేసికొంటిని. గీతను చదువుటకు ముందుగా సంస్కృతమును నేర్చుకొంటిని. నేడు గీత నాకు బైబిలు, ఖురానులవంటిది మాత్రము కాదు:- అది అంతకంటె ఉత్తమమైనది, అది నాకు తల్లి. నాకు దేహ మును ప్రసాదించిన తల్లి నాచిన్న నాడే గతించినది. కాని నాటినుండియు నీశాశ్వతమాత యామెలేనికొరతను సంపూర్ణముగా తొలగించి నాకండయై నిలిచినది. ఆమె ఎన్నడును మారలేదు. ఎన్నడును నాకు బాసటయై నిలువకయుండలేదు. కష్టములును, దుఃఖములును సంప్రాప్తించినప్పు డామెహృదయములో తలదాచుకొందును.


సాధారణజనులకు గీత చాల కష్టమైన గ్రంథమని యప్పుడప్పుడు వినుచుందుము. ఈ యాక్షేపణ నిరాధార మైనదని నాయభిప్రాయము. అఖండపాండిత్యమును సంపాదించిన కీర్తిశేషుడైన లోకమాన్యుడు గీతపై గొప్ప వివరణమును వ్రాసినాడు. అది యతనికి తన శేముషి నుపయోగించి గొప్ప సత్యములను గ్రహించుటకొక నిధానముగ నుండినది. అట్లని సాధారణమనుష్యుడు భయపడనక్కరలేదు. గీతలోని పదునెనిమిది యధ్యాయములను జదివి బోధపరుచుకొనుట నీకు కష్టమని తోచినయెడల దానిలోని మొదటిమూడధ్యాయములను మాత్రమే శ్రద్ధగ చదువవచ్చును. తక్కిన పదునే నధ్యాయములలోను వేర్వేరు దృక్పథములనుండి వివరముగా దెలుపబడినదంతయు సంగ్రహముగా నీ మూడధ్యాయములలో నిమిడియున్నది.


ఈ మూడధ్యాయములలోని ముఖ్యాంశము కూడ అక్కడక్కడ కొన్నిశ్లోకములలోమాత్రమే యర్థమంతయు నణగియున్నది. ఇదిగాక గీతలో మూడు ప్రత్యేకస్థలములలో వివిధ మతబోధనలను విడిచి భగవంతునే శరణు చొరవలెనని యుద్బోధ చేయుచున్నది. ఇందువలన గీతలో సూక్ష్మార్థము లున్నవనియు నర్థబోధ చాల చిక్కులతో కూడియున్నదనియు చేయు నాక్షేపణ కేవలము నిరాధార మైనదని తెలియగలదు.


గీత విశ్వమాత. ఆమె యెవ్వరిని దూరముగ నుండు మనదు. కోరినవారి కాద్వారము బాగుగ తెరిచియేఉన్నది. గీతను మనసా నాశ్రయించిన వాని కాశాభంగ మనునది లేదు. అత డూహింపరాని శాశ్వతానందమును శాంతిని అనుభవించును. సందేహపరునకును జ్ఞానపాండిత్యము గలవానికిని నాశాంతియు, నాయానందమును గలుగవు. అనన్య చిత్తులై, శ్రద్ధాపూర్ణులై, వినయసంపన్ను లైనవారికే యవి యబ్బును. అట్టి శ్రద్ధాభక్తివినయములతో గీత నారాధించిన వాడెవ్వడు నెన్నడును విఫలమనోరథుడు కాలేదు.


మనవిద్యార్థులు సాధారణముగా స్వల్పవిషయముల చేతనే కలత నొందుదురు. పరీక్షలో కృతార్థత కలుగలేదను చిన్నవిషయమునే వారమితమైన నిరాశను పొందుదురు. కంటికపజయముగ తోచినదానిని లక్ష్యపెట్టక వారు ప్రయత్నమును విడనాడకుండవలెనని గీత వారికి ధర్మబోధ చేయు పై మన కధికారము లేదనియు, జయాపజయములురెండును నొక్కటే యనియు నది బోధించుచున్నది. మనదేహమును మనస్సును నాత్మను మనధర్మమును నిర్వహించుటకు సంపూర్ణముగా వినియోగింపవలె ననియు, యదృచ్ఛాకామసంతృప్తులము కాగూడదనియు మనకోరికలను మనయధీనములో నుంచుకొనవలెననియు నది మనలను హెచ్చరించు చున్నది. సత్యాగ్రహినైన నాకది నిరంతరమును క్రొత్త పాఠములను నేర్పుచున్నదని చెప్పగలను. నేను భ్రమకు లోనై యున్నానని యెవరైన నాతో చెప్పినయెడల ఈభ్రమనే నాపరమ నిధానముగా భద్రపరచుకొందునని వారికి బదులుచెప్పుదును.


విద్యార్థులు తమ ప్రాతఃకాలకృత్యములను గీతాపఠనముతో నారంభింపవలెనని నే నుపదేశించుచున్నాను. నాకు తులసీదాసు ప్రియుడు. నే నతని భక్తుడను. కష్టసంకులమైన ప్రపంచమునకు రామనామమను మంత్రమును ప్రసాదించిన యామహాత్ముని నేను పూజించుచున్నాను. కాని, నేడు మీకు తులసీదాసునిగురించి చెప్పుటకు రాలేదు; మీరు గీత నభ్యసింపవలసినదని చెప్పుటకు వచ్చినాను. దానిలోని దోషములను కనుగొనవలెనని విమర్శదృష్టితో దానిని మీరు చదువ కూడదు. దానిని భక్తితోను, శ్రద్ధతోను చదువవలెను. అట్లభ్యసించినయెడల నది మీకోరికలనన్నిటి నీడేర్పకలదు. ఆమధురామృతము నొకసారి రుచిచూచినయెడల, దినదిన

(గమనిక :ఈ పుటలో పైనున్న మొదటి వాక్యభాగముతో , వెనుకటి పుటలోనున్న వాక్యముతో అన్వయము కుదురుటలేదు.) మునకును మీకు దానిమీద మక్కువ యెక్కువ కాగలదు. గీతాశ్లోకపఠనము కష్టములలో మీ కాధారము కాగలదు, దుఃఖములోను, ఏకాంతకారాగారవాసములోనుగూడ, మిమ్మోదార్పగలదు. ఈశ్వరాజ్ఞయై ప్రాణములను విడువవలసి నప్పూ డీ గీతాశ్లోకములను పెదవులతో స్మరించుచు విడిచిన యెడల బ్రహ్మనిర్వాణము సిద్ధింపగలదు. ఆ బ్రహ్మనిర్వాణ మన నేమో మీ యాచార్యులువారు బోధింపగలరు.

__________


అనుబంధము 2.

గీత: దివ్యఫలము.

(లోకమాన్య బాలగంగాధరతిలకు).


ప్రపంచవాఙ్మయమంతటిలోను గీతవంటి గ్రంథము లేదు. మిక్కిలి యుత్తమకాంతిగల వెలలేని రత్నము. అది దుఃఖాత్ములకు శాంతినిచ్చును; మనల నధ్యాత్మ విద్యా సంపన్నులను జేయును. వేయేల? సనాతన కాలగర్భమున నడగియున్న సత్యములను మనకు తెలుపగల గ్రంథ మొక్క గీత తప్ప, ప్రపంచభాషలలో దేనిలోను మరియొకటిలేదు.