శ్రీకృష్ణుడు చూపిన మార్గము/అధ్యాయము 25

వికీసోర్స్ నుండి


సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ
అహం త్వా సర్వపాపేభ్యో మోక్షయిష్యామి మాశుచః


తక్కిన యెల్లధర్మములను విడిచిపెట్టి నన్నే శరణు పొందుము. ఎల్లపాపముల నుండియు నేను నిన్ను విడిపించెదను. దుఃఖింపకుము. 18-66


(25)

అంతయు నొకటి

(గీత: అధ్యాయములు 5, 6, 8, 13, 18)


మనస్సును అరకట్టి చేయు కర్మములను భగవంతుని కర్పణముగా చేయుచు వచ్చిన యెడల, జీవలోకమంతయు నొక్కటేయను జ్ఞానప్రకాశమును పొందకలుగును. తానని ఒరులని భేదము విడిచి యెల్ల ప్రాణులును పరమాత్మయందు నిలుచు మనోభావమును పొందుటే గీతలో చేయబడిన ఉపదేశము. ఆత్మను అజ్ఞానమనునది చుట్టుకొని జ్ఞానజ్యోతిని మరుగుపరచును. ఈ అజ్ఞానమును పోగొట్టి ఆత్మలో జ్ఞాన ప్రకాశమును ఉదయించునట్లు చేసుకొన్నయెడల ఆమార్గమును పట్టినవాని కంటికి, విద్యయు, కళలును, శీలమును గలిగిన పండితుడును, దేనినినేర్వని యొక పామరుడును ఒక్కటిగనే తోచును. అనగా ఈఇద్దరిలోను ఆతడు వాసుదేవుని చూచును. మనుష్యులలో శ్రేష్టుడు, నీచుడు అనువ్యత్యాసము తొలగిపోవును. ప్రాణులఅంగవ్యత్యాసములుకూడ జ్ఞానమునొందినవాని కంటికి వ్యత్యాసముగతోపవు. ఎద్దు, ఏనుగ, కుక్క, కుక్కనుతినువాడు, విద్యావినయములు గల బ్రాహ్మణుడు, వీరిలో అవయవములకూర్పు మొదలగు సకల వ్యత్యాసములు అతని దృష్టిలో తొలగి అంతయు నొక్కటిగా తోచును.


జ్ఞానేన తు తదజ్ఞానం యేషాం నాశిత మాత్మనః
తేషా మాదిత్యవ ద్జ్ఞానం ప్రకాశయతి తత్పరం.


అజ్ఞానము ఆత్మజ్ఞానముచే నడచినవారి జ్ఞానము సూర్యునివలె ప్రకాశించి పరమాత్మను చూపించును. 5-16


విద్యా వినయసంపన్నే బ్రాహ్మణే గవి హస్తిని
శునిచైవ శ్వపాకే చ పండితా స్సమదర్శినః.


విద్యయు వినయమును గల బ్రాహ్మణుని, గోవును, ఏనుగును, కుక్కను, కుక్కను తినువానిని, జ్ఞానమునొందిన వారు సమదృష్టితో చూతురు. 5-18


యధా భూతపృథగ్భావ మేకస్థ మనుపశ్యతి
తత ఏవ చ విస్తారం బ్రహ్మ సంపద్య తే తదా.

పలువిధములైన ప్రాణులు ఒక్కటే యాధారముపై

నెలకొనియున్న వనుటను తెలిసినయెడల అప్పుడా జ్ఞానఫలముగ ఎల్లయెడల విస్తరించిన బ్రహ్మమును చూచును. 13-31


సర్వభూతేషు యేనైకం భావ మవ్యయ మీక్ష తే
అవిభక్తం విభక్తేషు తజ్జ్ఞానం విద్ధి సాత్త్వికం.


వేరుగనున్న యెల్లప్రాణులను వేరులేనట్టియు, ఒక్కటే వస్తువుగ చూచు జ్ఞానము సాత్త్విక జ్ఞానమనియు తెలియుము. 18-20


సర్వభూతస్థ మాత్మానం సర్వభూతాని చా౽త్మ ని
ఈక్ష తే యోగయుక్తాత్మా సర్వత్రసమదర్శనః.


యోగమార్గమున నిలిచిన వాడెల్లెడల సమదృష్టి కలవాడై యెల్లప్రాణులందును తనప్రాణము చేరియుండుటను, తనలో నెల్లప్రాణులునుండుటయు చూచును. 6-29


యో మాం పశ్యతి సర్వత్ర సర్వం చ మయి పశ్యతి
త స్యాహం నప్రణశ్యామి స చ మే న ప్రణశ్యతి.


ఎవడు ఎల్లయెడల నన్నుచూచునో, ఎవడన్నిటిని నా యందే చూచునో, వానికినేను ఎప్పుడును లేకుండ నుండను. నాకును వాడొకప్పుడును లేకుండనుండడు. 6-30


సర్వభూతస్థితం యో మాం భజ త్యేకత్వ మాస్థితః
సర్వథా వర్తమానో ౽పి స యోగీ మయి వర్తతే.

ఏకత్త్వమందు నెలకొనియున్నవాడై, యెల్లప్రాణుల

యందునున్న, నన్ను తెలిసినవాడు ఏపని చేయబోయినను

యోగియగును. నామార్గమున నడచినవాడగును.

6-31


గీతలో మనోనిగ్రహమును గూర్చియు, జ్ఞానోదయమును గూర్చియు, చెప్పబడిన యుపదేశములు, వ్యర్ధముగనో, పుస్తకమునకు, భూషణముగనో లేక చదివి మననముచేసి కాలము గడుపుటకో చెప్పబడినవికావు. నిజముగ సాధారణ జనులు, పురుషులును, స్త్రీలును, దానిలో చెప్పినట్లు జీవితమును నడపవలెనను నుద్దేశముతో నుపదేశింపబడినవి. వేదాంతపాండిత్యమును చూపి, సంతోషపడుటకు వ్రాసినవి కావు. వయసు ముదిరిన వారికిని చిన్నవయసువారికిని లౌకిక విషయములలో తగులుకొన్నవారికిని, ఏదశయందున్నవారి కైనను, ఫలకారులుగ చేయబడిన యుపదేశములు ఎల్ల కాలములకును చెప్పబడినవి. ఒకప్రత్యేక సందర్భమునకు మాత్రము చెప్పిన యుపదేశములు కావు.


తక్కిన మతగ్రంథములవలె గీతయు శాశ్వతధర్మము నుపదేశించు ఒక గ్రంథమైనను దానిని వ్రాసినకాలమున ఎట్టి జీవితపరిస్థితుల నందరనుసరించి వచ్చిరో, యాకాలమున సంఘ సంప్రదాయక్రమమేమైయుండెనో, స్మరణయందుంచు కొన్నయెడల నుపదేశింపబడు సత్య తత్త్వమును గ్రహింప వచ్చును. తరువాతకాలముననుండిన కొన్ని సాంప్రదాయములు ఆకాలమున లేవనుదానిని మరచిపోగూడదు. జాతివ్యత్యాసములు విడిచి యంధరును నొకజాతిగా నుండవలెనను ఉద్యమమునకును, అస్పృశ్యతను రూపుమాపి హరిజనులను తక్కినవారితో సమానముగా చేయవలయునను ఉద్యమమునకును ఆధారముగా శ్లోకములను వ్రాసిచూపుటకై భగవద్గీత వ్రాయబడలేదు. అట్లాధారముగా వ్రాసిచెప్పిన గీతలో శ్లోకములు లేనేలేవనునది చాలవేలసంవత్సరములకుపూర్వము వ్రాయబడిన యొకగ్రంథమునుగూర్చి నిశ్చయమైన ఆక్షేపణ కాజాలదు.


అయినను ఇట్టిసమత్వములనుగూర్చిన యుద్దేశములకు కూడ కావలసినన్ని ప్రమాణములు గీతలో నున్నవనుదానిని గమనింపవలెను. ఎల్లజనసంఘములందును, పనులను చేయు విధము ముఖ్యమైన యంశము. ఇది జాతిక్రమముగ అనగా నాయాజాతి నాయాక్రమముండవచ్చును. ఆయా కుటుంబము లాయాపనుల కనియు నుండవచ్చును. లేదా పుట్టుకను లెక్కింపక వేరువిధముగా నుండవచ్చును. ఏమార్గము ననుసరించినను గీతవాక్యముల తత్త్వము తుదివరకు నన్వయించును. ఈపని శ్రేష్టమైనది, ఇదిమంచిది, దీనిని చేయుదును, నొక నియమితముగ నొక పనివలదుఅని యెవ్వరును చెప్పగూడదు. ఇది గీతోద్దేశము. సంఘజీవనమున కావశ్యకమైన పనులలో ఇట్టిభేదము నెంచుటకు వీలులేదు. ఇది సర్వకాలములకును, సర్వసంఘపద్ధతికిని అన్వయించును. ప్రాచీనకాలమందలి వర్ణ సంస్థ రష్యాలో నడచుచు వచ్చుచున్న సామ్యవాదపద్ధతికిని సమానముగ నన్వయించును. నిప్పులో పొగయున్నట్లు లోకములో చేయగూడిన యెల్లపనులందును దోషము కనబడును. ఏపనినైనను పవిత్రము చేయగల యొక భావనగలదు. తనకు లాభమునో, సుఖమునో వెదుకక, సంఘజీవనమునకు మేలు చేయుదునను మనోభావమది. అదియే సకలకల్మషమును పోగొట్టగల గంగాతీర్థము. ఇదియే గీతావాక్యపు ముఖ్యాంశము. ఆకాలమున జాతి క్రమముగ పని విభజింపబడియుండుటవలన మంచి ముఖ్యతత్త్వమును స్పష్టముచేసి, యుపదేశము వ్రాయ బడియున్నది. అయినను నీతత్త్వము పని నేవిధముగ విభాగముచేసినను నన్వయించును. ఉన్నగోడమీద చిత్రము వ్రాయబడును. పటమును గమనింపవలెనేగాని గోడకూర్పు కాదు గమనింపవలసినవిషయము. ఆకాలమున నాచారము లోనున్న పద్ధతులను రూఢిగనున్న సంఘరచనాక్రమమును మనస్సున నుంచుకొని, యేయుత్తమ సమత్వతత్త్వము బోధింపబడినదో, యాతత్త్వమును బాగుగ తెలియవలయును.


స్వే స్వే కర్మ ణ్యభిరతః సంసిద్ధిం లభ తే నరః
స్వకర్మ నిరత స్సిద్ధిం యథా విందతితచ్ఛృణు.

తనతనపనియందాసక్తిగల మనుష్యుడు సిద్ధినొందును.

తనతనకార్యమునందాసక్తిగలవాడు సిద్ధిపొందుమార్గమెట్లుండునో వినుము. 18-45


యతః ప్రవృ త్తి ర్భూతానాం యేన సర్వ మిదంతతమ్
స్వకర్మణా త మభ్యర్చ్య సిద్ధిం విందతి మానవః.


ప్రాణుల కెల్ల బుట్టుక దేనినుండికలుగునో యేపరమాత్మునినుండి సమస్తములు వ్యాపించియున్నవో, యట్టి పరమాత్మను పూజించుటవలన మనుష్యుడు సిద్ధిపొందును. 18-46


శ్రేయాన్ స్వధర్మో విగుణః పరధర్మా త్స్వనుష్ఠితాత్
స్వభావనియతం కర్మకుర్వ న్నా౽౽ప్నోతి కిల్బిషం.


ఇతరులధర్మమును బాగుగ చేయుటకంటెను, గుణము తక్కువయైనదైనను తన ధర్మమును నిర్వర్తించుట శ్రేయస్కరము. తన స్వభావమువలన నేర్పడినపనిని చేసినయెడల నాపనిలో నుండు సహజమైన దోషము నెవ్వడును పొందడు. 18-47


సహజం కర్మ కౌంతేయ సదోష మపి న త్య జేత్
సర్వారంభా హి దోషేణధూమేనాగ్ని దివా౽౽వృతాః


తనతో బుట్టిన కర్మము దోషముతోగూడియున్నను దానిని విడువగూడదు, అగ్నిని పొగ యావరించినట్లు సమస్త

కార్యములు దోషసంపర్కము కలిగియుండును. 18-48


అసక్త బుద్ధి స్సర్వత్ర జితాత్మా విగత స్పృహః
నైష్కర్మ్యసిద్ధిం పరమాం సన్న్యాసే నాధిగచ్ఛతి.


సర్వవిషయములయందునుమమకారము లేక తన్ను తా గెలచి, కామమును విడిచి నిలిచినయెడల నాత్యాగ దృష్టివలన కర్మలేని పరమసిద్ధిని పొందును. 18-49


లోకములోకనబడు దృశ్యముల వివిధవ్యత్యాసములకు వెనుక మరుగుపడి యడగియున్న పరతత్త్వమును చింతింపవలెను. పుట్టుక, చావు, వ్యక్తమును, అవ్యక్తము నెరుగదు. పిల్లలకు పగలును రాత్రియు నెట్లో లోకము వ్యక్తమగుటయు, నాశమును అట్లే. బ్రహ్మ కన్ను మూయుటయు తెరుచుట యునే నాశము సృష్టియు అగును. జ్ఞానోదయము నొందిన మనుష్యుని యింద్రియములకు గోచరమగు నెల్లవిషయములును మనస్సును భావములునుచేయు నెల్లపనులును, పరవస్తువు రూపములేయగును. అనేకకోట్ల దృశ్యములును ఒక్కటిగనేకనబడును. యోగమున కంతమిదే.


అవ్యక్తా ద్వ్యక్తయ స్సర్వాః ప్రభవ న్త్యహరాగమే
రాత్య్రాగమే ప్రలీయంతే తత్రైవావ్యక్త సంజ్ఞికే.


పగలయినంతనే యవ్యక్తమునుండి రూపములు బయలుదేరును. రాత్రిరాగానే యాయవ్యక్తమునందే యవి

మరుగుపడును. 8-18


భూతగ్రామ స్సఏవాయం భూత్వా భూత్వా ప్రలీయతే
రాత్య్రాయాగమే౽వశః పార్థ ప్రభవ త్యహరాగమే.


ఆభౌతికప్రపంచము తిరిగి తిరిగి తనవశము లేకయే రాత్రి యగుటతోడనే యడగిపోవుచున్నది, పగలురాగానే మరల పుట్టుచున్నది. 8-19


పర స్తస్మా త్తు భావో౽న్యో౽వ్యక్తో౽వ్యక్తా త్సనాతనః
యస్స సర్వేషు భూతేషు నశ్యత్సు నవినశ్యతి.


అవ్యక్తముకంటె నవ్యక్తముగ, దానికిపైనున్న మార్పులేని తత్త్వ మొకటి యున్నది. ఎల్లప్రాణులును నశించినను, అది నశింపదు. 8-20


పురుష స్స పరః పార్థ భక్త్యా లభ్య స్త్వనన్యయా
యస్యాంతస్థాని భూతాని యేన సర్వ మిదం తతమ్


వేరుతత్త్వమున ప్రవర్తింపని భక్తితో నా పరమపురుషుని పొందవచ్చును. వానిలోనే యెల్లభూతములును నెలకొనియున్నవి. అతడీ లోకమందంతటను వ్యాపించి నిలిచియున్నాడు. 8-22


కవిం పురాణ మనుశాసితార
మనోరణీయాంస మనుస్మరేద్యః
సర్వస్య ధాతార మచిన్త్యరూప
మాదిత్యవర్ణం తమసః పరస్తాత్.

గొప్పజ్ఞానిని, పురాతనుని, అనుశాసకుని, అణువులో

నణువైన పరవస్తువును, ఎల్లవానిని ధరించువానిని, ఎన్నుటకు వీలులేని రూపముగలవానిని, సూర్యుని ప్రకాశముగలిగి, చీకటి నతిక్రమించి నిలుచువానిని, ఎవడు ధ్యానించుచుండునో, 8-9


ప్రయాణకాలే మనసాచలేన
భక్త్యాయుక్తో యోగబలేన చైవ
భ్రువోర్మధ్యే ప్రాణ మావేశ్య సమ్యక్
స తం పరం పురుష ముపైతి దివ్యం.


అతడు మరణకాలమున జంచలముకాని మనస్సుతో కనుబొమలమధ్యమున ప్రాణమును నిలుపుకొని, యోగబలముచేతను, భక్తిచేతను, ఆదివ్యపరమపురుషునిపొందును. 8-10


సర్వద్వారాణి సంయమ్య మనో హృది నిరుధ్య చ
మూర్థ్న్యాధాయాత్మనఃప్రాణమాస్థితో యోగధారణామ్.


ఎల్లద్వారములను బాగుగమూసి, మనస్సును హృదయములోనే నిరోధించి, తనప్రాణమును తలపైభాగమున నిలిపి, యోగస్థానమును ధరించి, 8-12


ఓ మిత్యే కాక్షరం బ్రహ్మ వ్యాహరన్ మామనుస్మరన్
యః ప్రయాతి త్యజన్ దేహం సయాతి పరమాం గతిం.

'ఓమ్‌' అను శ్రేష్ఠమైన యేకాక్షరవేదమును జపించుకొని,

నన్ను స్మరించువాడయి, దేహమును విడుచువాడు పరమగతిని పొందును. 8-13


అనన్యచేతాస్సతతం యో మాం స్మరతి నిత్యశః
త స్యాహం సులభః పార్థ నిత్యయుక్తస్య యోగినః


వేరుతలపునువిడిచి, నన్నెల్లదినములందు, నెప్పుడును స్మరించు నిత్యయోగికి నేను సులభముగ దొరుకుదును. 8-14


వేదేషు యజ్ఞేషు తపస్సు చైవ
దానేషు యత్పుణ్యఫలం ప్రదిష్టం
అత్యేతి తత్సర్వ మిదం విదిత్వా
యోగీ పరం స్థాన ముపైతి చాద్యమ్.


దీనిని తెలిసినయోగి యజ్ఞములచేతను, తపస్సులచేతను, దానములచేతను, పొందదగినదిగా వేదములందు చెప్పబడు నాదిస్థానమయిన పరమపదమును పొందును. 8-28


చనిపోవునపుడుకూడ మనస్సును స్థిరపరుచుకొని, భగవంతుని ధ్యానించి, ప్రాణమును విడిచినయెడల పరగతిని పొందవచ్చునని పైని 9, 10, 12, 13 శ్లోకములలో చెప్పబడినది. సనాతనమైన తత్త్వము, దీనితత్త్వ మెట్టిదనిన:-


(1) ఎట్టిజీవితము గడపువానికైనను గతియున్నది. ఒకధర్మము నాచరింపకయే, ఒక పుణ్యతీర్థమునందు మునుగ కయే, 'పలుగొప్పపాపములను చేసితినే' అవకాశము లేకుండగనే మరణమువచ్చినదే', అని ఇట్లు దుఃఖపడనక్కరలేదు. ప్రాణమునువిడుచు సమయమందైనను భగవంతునియందు మనఃపూర్వకముగ భక్తిచూపినయెడల అదియేసద్గతినిచ్చును. ధైర్యముతోను భక్తితోను మరణము నెదురుకొనవలెను.


(2) మరణకాలమునగూడ పలుసంగములను మనస్సున నుంచుకొని ప్రాణమును విడువ నిష్టములేక దుఃఖపడుట, ప్రాణమును విడుచుటకు మార్గముకాదు. భగవంతుని ధ్యానముచేసికొని ప్రాణమును విడుచుటే మంచిదనునది రెండవది.


(3) మరణమెప్పుడువచ్చునో చెప్పవీలులేదు. ఏతరుణమందైనను మరణము రావచ్చును. కాబట్టి మరణకాలమున ఈవిధముగ మనస్సును నిరోధించి, భగవంతుని ధ్యానింపవలయుననియు, ఎల్లకాలమును ఇట్లుండవలయుననియు అనునది మూడవది.


(26)

అద్వైతము, కర్మ యోగము.


ఈసందర్భమున నొకప్రశ్న పుట్టును. అద్వైతమును గూర్చి గురువుమూలముగా నుపదేశమునొందక యాసిద్ధాం