శశికళ/అవతరణము

వికీసోర్స్ నుండి

అవతరణము

నీలి మిను పవళింపు
నిదురించు నీ సొంపు

                తేలిపోతూ దిగెను
                వేల లే వెలిగేను.

తొంగలించే వయసు
నింగినం తా ఒలసె

                బంగారు మంచాన
                పవళించె నీ సొగసు.

తెలికొండపై గంగ
తేలి వాలిన రీతి

                తెలివినా తలపుగిరి
                తేలివాలితి నాతి

నిత్య వికసిత దేహ
నృత్య విలసిత హస !

                నిదురించు నిను కోరి
                పదము మొదలిడినాను.

జన్మ జన్మల రాణి
తన్మయుడనే జాణ

                మేలుకొలుపులు నిన్ను
                జాలిగా పిలిచె నటె.

అల నల్ల నాడించి
అరవిచ్చె నీ కనులు

             దరిసినది నీ సొగసు
             విరిసినది నా మనసు.

విరుచుకొను నీ మేను
వికసించు కల్పకము

            ఆత్రమై ఆశతో
            చిత్రమై దరినేను.

వాలు చూపుల చూచి
మేలుకొనె నీ వలపు

            తొలిపొద్దు కిరణమై
            చెంగలువ అరుణమై.

జాళువా పాన్పుదిగి
బాల వయ్యారమై

            మ్రోల నిలిచితి వటే
            మోకరిల్లితి నేను

ఎవ రెవరి హృదయాలు
ఏమి కాంతించెనో

           ఎవ రెవరి భావాలు
           ఏమి కాంక్షించెనో !