వల్లభాయి పటేల్/బార్డోలీ సత్యాగ్రహము

వికీసోర్స్ నుండి

బాధితులకు సహాయము

1927 లోఁ బ్రళయము వచ్చినట్లు గుజరాతు వఱదల మయమైపోయెను. పటేలు పెక్కుమందివాలంటీర్లను సమీకరించి ధన ధాన్యాలను సంపాదించి, పీడితులకు బహువిధముల సహాయము చేసి ప్రజలవల్లనేగాక ప్రభుత్వమువారిచేఁగూడఁ బ్రశంసింపఁబడెను.

బార్డోలీ సత్యాగ్రహము

"భూమిని దున్ని యితరుల ప్రాణములను బోషించునట్టి సాధనములను గల్పించువారిని దిండి లేకుండ మాడ్చి చంపివేయునట్టి చావుకళ నిప్పటి రాజకీయవేత్తలు తమ యద్భుత రాజనీతిలోఁ గనిపెట్టిరి."

-"రూ సో"

వల్లభాయి కార్యక్రమ మంతయు స్థానికముగనే యుండెను. బార్డోలీ సత్యాగ్రహముకూడ స్థానికమేగాని దీని వల్లనే యాయనపేరు భారతదేశమందంతట విఖ్యాతమైనది. ఈ సందర్భములో నాయనకు మహాత్ముఁడు 'సర్దారు' అను బిరుదము నిచ్చెను.

అనేకులకు బిరుదు లీయఁబడినవికాని యాయనకంటె నర్హతతో బిరుద మార్జించినవా రరుదు. సర్దారు బార్డోలీలో నఖండవిజయము గాంచుట కాయనకు రైతుల యెడఁ గల యద్వితీయానురాగమే కారణము. యథార్థ భారత స్వరూపము గ్రామములోనే కాన్పించునని, వ్యయసాయదారుఁడు దానికిఁ గీలకమని, రైతుకు సంబంధములేని యే స్వాతంత్ర్యపథకమునకుఁ గాని, పనికిఁగాని యర్థమే లేదని, భారతజాతీయతత్త్వ ప్రథమసూత్రము తొలిగా మన దేశములో మహాత్ముఁడు ప్రవచించెను.

దీని నక్షరాల నములులోఁ బెట్టుటకుఁ దమ జీవితములను దారబోసిన వారిలో మగన్‌లాల్ గాంధి, వల్లభాయి, ఆచార్య రంగా లగ్రగణ్యులు. గురువు సూత్రమును సృష్టింపఁగా శిష్యులు దాని నాచరించు పద్ధతులు కనుఁగొని యందుకై తమ జీవితముల నర్పించిరి. అందులో వల్లభాయి రంగాలకు మఱొక సదుపాయముకూడఁ గలసివచ్చినది. వారు రైతుబిడ్డలు. ఇంతియుగాక వారిరువురు బాల్యములోఁ బొలాల యందుఁ బని చేసిన కృషీవలులు. అందుచేత నా భూపుత్రులతో వారికన్ని విధముల సంబంధముండుటచే నభిమాన మధికము.

అందుచేతనే 'యీ పృథివిలో దలయెత్తుకొని తిరుగ నర్హుఁడైనవాఁడున్న చో నతఁ డొకరైతే. అతఁ డుత్పత్తిదారుఁడు. ఇతరులందఱు పందికొక్కులవంటివా'రని పటేలనఁగలిగినాడు.

ఇఁక నసలు విషయమునకు వత్తము. 1927లో బార్డోలీలో రీసెటిల్మెంటు జరిగినది. దీనివల్లఁబన్ను నూటికి ముప్పది రూపాయలు పెరిగినది. ఇందువల్ల రైతాంగములోఁ జాల నసంతృప్తి పెరిగినది. అందుచేఁ గొంత తగ్గించిరి. కాని యంతటితో రైతులు తృప్తిపడలేదు. తమకు న్యాయము జరుగలేదని నిష్పాక్షికమైన కమిటీనివేసి విచారింపుఁడని రైతులు కోరిరి. కాని ప్రభుత్వము పెడచెవిని బెట్టినది. బార్డోలీ తాలూకా రైతుసభ జరిగినది. ఆసభలోఁ బన్నుల నిరాకరణమునకుఁ దీర్మానించుకొన్నారు. పటేలు సహాయమును గోరిరి. ఆయన వారితో "మీరు ప్రభుత్వమును ధిక్కరింపఁ బోవుచున్నారు. వా రధికబాధలు పెట్టెదరు. అనేక కష్టనష్టములకు గుఱికావలసివచ్చును. ఇవి యన్నియు నాలోచించుకొనవలసిన'దని రైతుల ప్రతినిధుల సభలోఁ జెప్పి (1928 ఫిబ్రవరి 4 వ తేది) యాలోచించుకొనుటకు వారి కెనిమిది రోజులు గడువిచ్చెను.

వా రాలోచించుకొని తమ ప్రధమ నిర్ణయమునే మఱలఁ జెప్పిరి. 1928 ఫిబ్రవరి 12 వ తేదిన తాలూకా రైతు సభ జరిగినది. రైతులందరు వచ్చి సత్యాగ్రహము చేయుటకే సమ్మతించిరి. అంతట నాయన తాలూకా యంతటను సంచారము చేసి వేలకొలది స్వచ్ఛంద సైనికులను జేర్చి చేయవలసిన యేర్పాట్లన్నిటిని జేసెను. ప్రతి గ్రామమునకు నొక నాయకుఁడు. తాలూకా యంతట నైదుగురు నాయకులు. వీ రందరకు సర్దారు సర్వసేనాని. సత్యాగ్రహకార్యాలయము స్థాపించి "సత్యాగ్రహ సమాచార్" అను దినపత్రికకూడఁ బ్రచురింప బడుచుండెను. ఆనాఁ డాయన యాజ్ఞ లేకుండఁ ప్రభుత్వాధి కారులకుఁ జిట్టెడుప్పుకూడ దొరుక లేదనిన నతిశయోక్తికాదు. బార్డోలీలో బ్రిటిషుప్రభుత్వము నశించిన దని టైమ్సుఆఫ్ ఇండియా ప్రతినిధి ప్రకటించెను.

ఫిబ్రవరి 12 వ తారీఖు పన్నులకు గడువు. కాని ప్రభుత్వపు బొక్కసమున కొక్క పైసగూడఁ బోలేదు. అంతట వారు జప్తులు చేయసాగిరి. దానికిని రైతాంగము లొంగలేదు. ప్రభుత్వమువా రొక కోమటిని బట్టుకొని పన్నీయవలసినదని ప్రతిబంధించిరి. లోకములో నందరికంటెఁ బిఱికివాఁడని యనుకొను నాయనకూడఁ గఱకుదనము చూపుటచే, వారు చీలదీసిపరిపాలించు సూత్రము ననుసరించి యొక మహమ్మదీయుని బట్టుకొనిరి. ఆయనయుఁ బైసగూడ నియ్యలేదు. పఠానులను దీసికొనివచ్చి యనేక దౌర్జన్యములను జేయించిరి. ఏమి చేయించినను బ్రయోజనము లేకపోయెను.

ఇట్లు వారు పెక్కు బాధలకు లోనగుటయేగాక బార్డోలీతాలూకాలోని 80 వేల రైతాంగము నిల్లు వాకిలి వదలి, బ్రిటిషుఇండియా దాటి, బరోడాసరిహద్దులకు వలస పోఁ జొచ్చిరి. 80 యేండ్లు వృద్ధురాలు పటేల్‌తల్లి వంట చేయుచుండఁగా దానిని బోరలద్రోసి రాళ్ళు రప్పలు వేసిరి. ప్రజల నహింసాపథమునుండి తప్పించుట కనేకవిధముల రెచ్చఁ గొట్టిరి. కాని ప్రజ లచంచలులై యహింసామార్గమునే యంటిపెట్టుకొని యుండుట ప్రపంచచరిత్రలో నపూర్వము. బార్డోలియే యహింసానీతికి నిలఁబడ గలిగినది. ఈసత్యాగ్రహ యుద్ధములో మహిళామణులలోఁ జెప్పరాని చైతన్యము గలిగినది. వారుకూడఁ గదనరంగములోఁ గాలుపెట్టిరి. బొంబాయినుండి సోదరి మీటుపెటిట్, శ్రీమతి సురాజ్ మెహతా ప్రభృతులిందులోఁ బ్రవేశించి నారీశక్తిని ప్రపంచమునకు బ్రదర్శింపఁ జేసిరి. ప్రభుత్వమువా రరెష్టులు, జప్తులు వేలములు రాక్షసకృత్యములు చేయసాగిరి. వేలు ఖరీదుచేయు సుక్షేత్రములు మిక్కిలి తక్కువ ఖరీదుకు వేలము పడఁ జొచ్చెను. తమ బిడ్డలకంటె నధికముగాఁ జూచుకొను రైతాం గపు పశుసంతానము, వారి హస్తములనుండి పరాయివారికిఁ బోవలసివచ్చెను. పఠానులు చేయు రాక్షసకృత్యములకుఁ బరిమితి లేకుండెను. ఏమైనప్పటికి రైతాంగపు స్త్రీ పురుషు లద్భుత ధైర్య శాంతములతో నన్నియు సహించుచుండిరి. ఆ బార్డోలీ దృశ్యములను జూచుటకుఁ బోయిన ప్రముఖులు సర్దారుయొక్క యద్భుత నిర్మాణనిపుణత్వమును, సంఘటనా శక్తిని ప్రజల త్యాగమార్గమును జూచి, విస్మయ చకితులైరి.

బార్డోలీ సత్యాగ్రహము యావద్భారత సమస్యగాఁ బరిగణింపబడి యన్నిప్రాంతములనుండి యన్నివిధముల సహాయము సమకూరసాగెను.

ప్రభుత్వమున కన్ని వైపులనుండి యొత్తిడి కలుగుటచేతఁ జివరకు రాజీబేరమునకు రాక తప్పలేదు. వై స్రాయి గవర్నరును బిలిపించుటయు గవర్నరు వల్లభాయికిఁ గబురుచేయుటయు జరిగినది. వల్లభాయి మఱి ముగ్గురు మిత్రులతోఁగూడ సూరత్ లో గవర్నరును గలసికొన్నాఁడు. కలసిమెలసి వారు మాట్లాడినారు, కాని కార్యకారి కాలేదు. శాసనసభాసభ్యులు కొందరు రాజీమార్గముచేయఁ బ్రయత్నించిరి. ఈ సందర్భములో శాసన సభాసభ్యుడగు రామచంద్రభట్టు పన్నులవిధానము పునర్విచారణ జరుగువఱకుఁ బెంపు జేసిన మొత్తము నొకచోటఁ బెట్టుటకు సూచనచేసెను. గవర్నరు దీని నంగీకరించెను. అంతట రాజీజరిగెను. ప్రభుత్వము తిరిగి పునర్విచారణ చేయుటకుఁ బ్రకటించెను. ఇట్లు ప్రకటించుటయేగాక ప్రభుత్వము వారు జప్తుచేసిన భూమిని రైతులకుఁ దిరిగి యిచ్చి యీ సందర్భములో నిర్భంధింపఁబడినవారి నందఱను విడుదల జేసిరి. బ్రిటిషుప్రభుత్వపు హయాములో నిట్టి విజయమున కిదియే ప్రథమము. ఈ బార్డోలీ విజయము భారతదేశపు రైతాంగములో నధికచైతన్యము కలుగఁజేసి యనేకోద్యమములకు మూలమైనది. సర్దారుపటేలు ఖ్యాతి యీ విజయముతో విశ్వవిఖ్యాతమైనది. ఈ సందర్భములో (1938 నవంబరు 51) కృష్ణాపత్రికాప్రధాన వ్యాసమునుపహరించుట సముచితమని తలఁచుచున్నాను.

బార్డోలీ కథ

"సత్యాగ్రహ సమరములో నెనిమిది సంవత్సరముల క్రిందట బార్డోలీతాలూకారైతులు చూపిన త్యాగసాహసములు చరిత్రాంకితము లైపోయినవి. ప్రపంచేతిహాసములో నట్టియుదంతము మఱియొకటి యున్నదో లేదో సంశయాస్పదము. రైతులకును వారి భూములకును గల సంబంధ మతినిగూఢము. ఏనాఁడు వారితాతలు ముత్తాతలు వానిని సంపాదించిపెట్టిరో! తరతరాలనుండి యనుభవించుచుండిన స్థిరాస్థు లవి. పంటలు పండినను బండకపోయినను వానినే కనిపెట్టుకొని, సంసారముల నెటులో పోషించుకొని వచ్చుచుండిరి. యజమానిపాదము పైని బడునప్పటికి, భూమి యానందముతోఁ బొంగునని పెద్దలు చెప్పుదురు. అట్లనుసృతముగా, వంశపరంపరగాఁ బ్రేమామృత ధారవలె వచ్చుచుండిన భూములను, బార్డోలీ రైతులు, దేశము కొఱకు, స్వరాజ్యముకొఱకు, వదలుకొని, తామును, బిల్లలను, నిరాధారులై, గ్రామభ్రష్టులై, యెట్లు చెట్లుచేమలు పట్టిరో - ఆ కథవంటి విషాదవృత్తాంతమును మఱియొకటి వినఁబోము.

బార్డోలీ తాలూకాలోఁ బ్రజలు వలదు వల దనుచున్నను బ్రభుత్వమువారు, సెటిల్మెంటుచేసి పన్నులను హెచ్చించిరి. వ్యవసాయకులు నేఁ డెంత నిష్ఫలకష్టజీవులో యెల్లరకును దెలియును. తమ మొఱల నెన్నోవిధముల నధికారులకు విన్నవించుకొనిరి. డెప్యుటేషన్లు పంపుకొనిరి. శాసనసభలోఁ బ్రతినిధులచేతఁ జెప్పించిరి. కాని యేమి చేసినను లాభములేక పోయినది. రైతు లెంతకాలము పస్తు నిండుకొని యుండఁ గలరు? భూములుకూడ నంత పన్నులభారమును మోయలేక క్రుంగిపోయినవి. కాని యధికారులకు దయరాలేదు. ఆ నిస్పృహలో, నా నైరాశ్యాంధకారములో, వారి పరితప్త హృదయములు దైవమునుగూర్చి యాక్రందించినవి. భగవంతు డార్తపరిత్రాత. దయాస్వరూపుఁడగు గాంధిమహాత్ముఁడు వారిముందుఁ బ్రత్యక్షమైనాడు. కాని వాని తరణోపాయములు సామాన్యములైనవి కావు. వానిది త్యాగపద్ధతి. అహింసా పూర్వకమైన తపశ్చరణము. పన్నుల నిరాకరించి దానివలనఁ గలుగుబాధల నన్నిటిని శాంతముతో, నిగ్రహముతో ననుభవించుటకుఁ బ్రతిజ్ఞ పూనవలయునని ప్రబోధించినాఁడు.

ఈ రైతు లెక్కువ చదువుకొనినవారుకారు. వట్టి పామరులు. సంసార తాపత్రయములలోఁ జిక్కుకొనిన నిరుపేదలు. వీ రట్టి త్యాగపథమునకుఁ బూనగలరా ? బ్రిటిషు అధికారులు ప్రచండశాసనులు. వారిది కేవలము పోలీసు రాజ్యము. సామ్రాజ్యమునంతను బిగించివేయఁగల బలాఢ్యులు వారు. అట్టి యధికారధూర్వహుల నీ బీదరైతు లెట్లెదుర్కొన గలరు? మహాత్ముఁ డతిగంభీరవిశ్వాసి - ప్రకృతిలో సర్వాంతర్యామి లేనిచోటు లేదు. ప్రతి యిసుక రేణువునందు నమూల్యమైన లోహములు దాగియున్నవి. ప్రతి మొక్కలో నోషధీ గుణము కలదు. ప్రతి నరునియందును సర్వశక్తిమంతుఁడు మెలఁగుచునే యున్నాఁడు. హృదయము ప్రబుద్ధము కావలయు గాని, చీకటినుండి వెలుఁగురాఁగలదు. దౌర్బల్యమునుండి శక్తి పుట్టఁగలదు. దుఃఖమునుండి యానందము ప్రవహింపఁగలదు. మహాత్ముని ప్రబోధముచే నీ బార్డోలీ సామాన్యపామరకర్షకులు మహావీరులుగ వెలసిరి. త్యాగపథమున నగ్రేసరులైరి. బార్డోలీ తాలూకా యంతయు యజ్ఞభూమియైనది. స్త్రీజనము కూడ బద్ధకటియై యీ రణరంగమున దుమికినది. పన్నుల నిరాకరణ మను నస్త్రమును సంధించిరి. అంతటితో నధికారులు వచ్చి పడిరి. బెదరించిరి. భేదోపాయము నవలంబించిరి. వారి పూరి గుడిసెలలోఁ జొఱఁబడి యన్నము వండుకొను కుండలను సయితము లాగుకొనిపోయిరి. పిల్లలకుఁ బాలుకూడ లేకుండ బశువులను దోలుకొని పోఁజొచ్చిరి. ఆబాలస్త్రీవృద్ధముగా నందర నిండ్లలోనుండి తఱిమివేసిరి. కాని రైతులు చలించలేదు. ఏమి వచ్చినను రానిమ్మని యట్లే నిలువఁబడిరి. సత్యాగ్రహమే వారి కవచము.

వారిలో బయలు దేరిన యేకీభావ మత్యద్భుతము. ఒక్క రైతుకూడఁ జీలిపోలేదు. గ్రామోద్యోగులు రాజీనామా లిచ్చిరి. జప్తు ఆస్తులను గొనిపోవుటకుఁ గూలీలుకూడ దొరక లేదు. ఎవరును బండ్లు కట్టరు. పశువులను దోలుకొని పోవు టకును నెవరును రారయ్యె. బయటనుండి పఠానులను దింపిరి. వీరు బహు కఠినులు. వీరి విగ్రహములే యతిభయంకరములు. వీరి దర్శనమాత్రముననే రైతులు బెదరిపోవుదు రని యధికారు లాశపడిరి. పోలీసువారు లాఠీలను బ్రయోగించిరి. మిలిటరీ పటాలములు ప్రదర్శింపఁబడినవి. కాని బార్డోలీలోఁ బ్రతి బాలుఁడును నొక్కొక్క ప్రహ్లాదునివలె హరినామ సంకీర్తనము చేయుచుండెను. స్త్రీలుసహితము కంటఁదడిపెట్ట లేదు. అలనాఁడు శ్రీరామచంద్రునితో నరణ్యావాసమున కరిగిన సీతా దేవివలెఁ బ్రతి స్త్రీ తన భర్తతోపాటుగ నింటిని వదలి, గ్రామమువదలి, రాజ్యమువదలి, బరోడా బయళ్ళలోఁ చెట్లక్రిందఁ గాపురము పెట్టెను. అది వర్షకాలము. కుంభవృష్టి కురియుచుండెను. బయళ్ళన్నియు జలమయము లయ్యెను. కాని యాదీను లట్లే, తడిబట్టలతో, నానీళ్ళలో నిలఁబడియుండిరేకాని, దిగులు పడ లేదు. ఆ యాత్మశక్తి ప్రదర్శనము నిరుపమానము. ఏ యొక పుణ్యాత్ముఁడో యిట్టి త్యాగశీలమును బ్రదర్శించవచ్చును. కాని యలనాఁడు శ్రీ గోపాలుని వేణుగానమునకు మూఁగిన గోబృందములవలె కుటుంబకుటుంబములుగా, గ్రామ గ్రామములుగా, నీ జానపదు లీ త్యాగభూముల కరుగుట దైవప్రేరితముగాక మఱియేమి?

అధికారులు విస్మయచిత్తులైరి. కాని వారిహృదయములు కరగలేదు. ఇంకను గఠినతరాస్త్రములను సంధించిరి. వారి భూములను వేలము వేయసాగిరి. కాని కొనువారేరి? దీనుల యుసురు కెవరు పాత్రులుకాగలరు? బయటనుండి ధనికులను రప్పించి, పదిరూపాయల పన్నుకొఱకు పదివేలుఖరీదు చేయుభూములను గొట్టివేసిరి. ధనికులుకూడ జంకినప్పుడు, పోలీసువారిపేరుననే కొట్టివేసిరి. కొన్నిభూములను బఠానులనే ఖామందులునుగఁజేసిరి. ఘోరము! అతిఘోరము ! అధికారు లీ దారుణ చర్యల నవలంబించినది కేవలము సర్కారు సొమ్మును రాఁబట్టుకొనుటకుఁగాదు. రైతుల వెన్నెముకలను విఱుగఁగొట్టుటకుఁ, దమ ప్రతిష్ఠను నిలువబెట్టుకొనుటకు, తమ శాసనాధికారప్రాబల్యమును బ్రదర్శించుటకు, నెట్టి క్రూర కార్యములకైనను నొడంబడిరి. ఆనాడు బార్డోలీ రైతు లట్టి యపూర్వ త్యాగసాహసములను జూపుచుండినప్పుడు, సిమ్లా కొండలుకూడఁ గదలిపోయినవి. ఒక్క తాలూకాలో నే పది గ్రామములవారో యిట్టి వీర్యాతిరేకమును జూపఁగలిగినప్పు డిక దేశములోని రైతుజనమంతయుఁ దలఁచుకొనిన ప్రభుత్వము లేమి కావలయును? బ్రిటిషుప్రభుత్వ మట్టుడికిన ట్లుడికి పోయెను. ఈ వృత్తాంతములను బత్రికలలోఁగూడఁ బ్రచురింపనియ్యలేదు. మహాదేవదేశాయి రచించిన "బార్డోలీ కథ"ను గవర్నమెంటువారు నిషేధించిరి.

ఆనాఁ డే నాయకు లీ బార్డోలీ వీరులను నడిపిరో, వారే నేఁడు ప్రభుత్వాధికారులైరి. సర్దారు వల్లభాయి కాంగ్రెసు మంత్రులకు సారథి. ఆనాఁ డీ దారుణచర్యలను సహించలేక, డిప్యూటీ కలెక్టరు పదవిని వదలివేసిన దేశాయిగా రిప్పుడు బొంబాయి ప్రభుత్వమునందు రివిన్యూమంత్రి. వీరికర్తవ్య మేమి? కాంగ్రెసును నమ్ముకొని నిరాధారులైపోయిన యా బార్డోలీ వీరుల నజ్ఞాతవాసమునుండియైనను రప్పించి వారి భూములను వారి కిప్పించుట భావ్యముకాదా? సామాన్యముగ యుద్ధానంత రము, గొప్ప ధైర్య పరాక్రమములను బ్రదర్శించిన సైనికులకుఁ బ్రభువులు పారితోషికము లిచ్చుట మరియాద. ఇప్పుడుబార్డోలీ రైతులు కోరుచున్న దట్టి బహుమతులుకాదు. తమ మడిమాన్యములను దమకుఁ దిరిగి యిప్పించఁగోరిరి. స్వరాజ్యము సిద్ధించిన పిమ్మట వారికిఁగలిగిన యన్యాయమును దొలగించెదమని కాంగ్రెసు ప్రముఖు లప్పుడు వాగ్దానములను జేసియుండిరి. కాంగ్రెసు ఆజ్ఞలను శిరసావహించి, కాంగ్రెసు కీర్తి గౌరవముల నెన్నిమడుంగులో హెచ్చించి చిరస్థాయిగాఁజేసిన, బార్డోలీవీరుల యాస్తులను దిరిగి వారికిప్పించుట కాంగ్రెసు మంత్రుల విధ్యుక్త ధర్మము. అప్పుడు దేశద్రోహులై, యమూల్యములైన భూముల నేరెండురూపాయలకో కొట్టించివైచుకొని భూస్వాములైనవారికి గుణపాఠముచెప్పుట యవశ్యకర్తవ్యము.

కాంగ్రెసు మంత్రులు ప్రభుత్వాధికారమును జేఁబట్టిన వెంటనే, యీ యపచారమును దొలగించుటెట్లని యాలోచనకుఁగడంగిరి. రివిన్యూ వేలములలో నన్యాయముగ గొనిన వారిచేత సౌమ్యమార్గములచే నా భూములను బార్డోలీ రైతుల కిప్పించుటకుఁ బూనుకొనిరి. ఏ కొలదిమందికోతక్క నెక్కువమంది కట్టి సంస్కారము కలుగలేదు. వారు తమ లీగల్ హక్కులచాటున నిలుచుండి శఠించిరి. బొంబాయి మంత్రు లీ లీగల్ చిక్కులను దొలఁగించుటకుఁ బ్రత్యేకముగ నొకబిల్లును దీసికొని రావలసిన యావశ్యకత యేర్పడినది. ఈ భూములకు గవర్నమెంటువారే కంపెన్సేషను నిచ్చుటకుఁగూడ నదికారమును బొందిరి. వేలములో నన్యాయముగ నీ భూముల నార్జించిన వారికిఁ దగిన ప్రతిఫల మిచ్చికూడ వారినుండి భూములను దిరిగి ప్రాతఖామందుల కిచ్చి వేసిరి. రైతులు తిరిగి తమ పిత్రార్జితములను బొందగలిగినందుల కానందభరితు లగుచున్నారు. కాంగ్రెసువారు తాము వెనుకఁజేసిన వాగ్దానములను జెల్లింపఁగల్గినందులకును సంతసింపవలసియున్నది. కాంగ్రెసుచేసిన శపధము నెగ్గితీరు నను విశ్వాసము ప్రజలలోఁ బ్రబలుట కవకాశముకలిగినది. ఇట్లే నాన్-కోఆపరేషనులో గ్రామోద్యోగిపదవులనుండి భ్రష్టులైనవారిని దిరిగి స్వపదస్థులుగఁ జేసినందులకు మద్రాసు ప్రభుత్వమువారును వంద్యులు. వెనుకటి ప్రభుత్వము వారొనర్చిన యపచారములను గాంగ్రెసు మంత్రులు తొలగింప సమకట్టినను, బొంబాయి, మద్రాసు గవర్నరు లడ్డుపడక, వారి కర్తవ్య పరిపాలనకుఁ దోడ్పడఁగల్గుట యెంతయుఁ బ్రశంసింపఁదగిన విషయము. నేటికి బార్డోలీ వీరుల కథ యిట్లు మంగళకరముగ ముగిసినందులకు దేవతలు హర్షించెదరు. సత్యాగ్రహమునం దెట్టి దివ్యశక్తికలదో యిప్పటికిఁ బూర్తిగ విశదమైనది."

భాషా సేవ

సాంఘిక వ్యవస్థనుబట్టి భాషాస్వరూప మేర్పడును. రాజకీయ చైతన్యమునుబట్టి ప్రజలకుఁ బ్రభుత్వమునకు గల పద్ధతులు, సంబోధనలు, మాఱుచుండును. ప్రజాస్వామికము పెరిగినకొలది ప్రజాస్వామికభాష బాగుగా నభివృద్ధి చెందును. ఇందులోఁ బూర్వయుగములోవలె యజమాని, బానిస లని, పాలక, పాలిత భేదము, హెచ్చు తగ్గులు, లేక సామాన్య ప్రతిపత్తి చూపఁబడును. ప్రతి రచయితకు నొక శైలియుండునట్లే యొక్కొక్క ప్రముఖున కాయన మనస్తత్త్వమును, భావమునుబట్టి భాషకూడ నుండును. సర్దార్ పటే లాత్మగౌరవముగలవ్యక్తి. పోటుమానిసి. కనుక నాయన స్వభావమునకుఁ దగిన భాష బార్డోలీలోఁ బ్రచారమైనది. ప్రజలలో నొక విధమైన ధైర్యము, పట్టుదల, యాత్మగౌరవము నధికమైనట్లుగానే, భాషావిషయములోఁగూడ నట్టి మార్పే కలిగినది.

సబర్మతీ తీరానఁగూర్చుండి గాంధీజీ, బార్డోలీ పొలములలోనుండి వల్లభాయి, యభివృద్ధిచేసిన గుజరాతీభాష సహజమైనదేగాక ధీరోదాత్తమైనది.

సాహిత్యము ప్రజల పరాక్రమప్రసాదము. "యథా భాషకస్మధా భాషా." భాషించువానినిబట్టియే భాషయుండును. సాహిత్యోన్నతి ప్రజల యున్నతిద్వారానే కలుగును. ఏ పండితులు, కవులు నభివృద్ధి చేయలేని భాషావృద్ధి బార్డోలీ కిసానులు చేసిరి.ఈ యభివృద్ధి కాదిపురుషుఁడు వల్లభాయి.

కాంగ్రెసులో

పటేల్‌కు 1916 లోనే గాంధీజీతోఁ బరిచయ మేర్పడినది. నాటినుండి యాయన ప్రజాసేవఁ బ్రారంభించెను. అందుచేతనే యాయన 1916లో లక్నోలో జరిగిన కాంగ్రెసుకుఁ బ్రతినిధిగా వెళ్లెను.

1918 - 19 - 21 - 22 సంవత్సరములలోఁ గాంగ్రెసుకుఁ సంయుక్త కార్యదర్శిగాఁ బనిచేసెను. 1921లో నహమ్మదాబాదులో జరిగిన కాంగ్రెసు కాయన యాహ్వానసంఘాధ్యక్షుఁ డయ్యెను. ఆ యుపన్యాస మతి సంగ్రహమైనది. ఆ కాంగ్రెసులో ననేక సంస్కరణములు జరిగెను. 1920 నాగపూరులోఁ గాంగ్రెసు జరిగినప్పుడు కుర్చీలు బల్లలు నేర్పాటుచేయఁబడుటచే నేడు వేలరూపాయలు ఖర్చయినవి. ఆపద్ధతి యహమ్మదాబాదులోఁ దీసివేయఁబడుటేగాక, రెండులక్షల రూపాయలతోఁ గాంగ్రెసుకొఱకు ఖద్దరుడేరా నిర్మింపఁబడెను.

1922 సంవత్సరములోఁ గాంగ్రెసులోఁ బరివర్తనవాదులు నపరివర్తనవాదు లని (Changers and No-Changers) రెండు పక్షము లేర్పడినవి. పరివర్తనవాదులపక్షమునఁ బ్రముఖులు చిత్తరంజన్‌దాసు, మోతిలాల్ నెహ్రూ, విఠల్‌భాయ్, శ్రీనివాస అయ్యంగార్ ప్రభృతులు. అపరివర్తనవాదుల పక్షమున రాజాజీ, సర్దారుపటేలు, రాజేంద్రప్రసాద్, దేశభక్త కొండా వెంకటప్పయ్య ప్రభృతులు ముఖ్యులు.

పరివర్తనవాదులగు స్వరాజ్యపక్షమువారు, శాసనసభా ప్రవేశమునకై కాంగ్రెసులోఁ దీర్మానము చేయఁబూనుకొన్నప్పుడు పటేల్‌ప్రభృతులు, శాసనసభాబహిష్కారమును, నిర్మాణకార్యక్రమమును సాగించుచు, మహాత్ముని మార్గముననే కాంగ్రెసును నడిపించుటకు బద్ధకంకణులై కాంగ్రెసులోను; దేశములోను, నధికకృషిఁజేసిరి.

1931లోఁ గరాచీలో జరిగిన కాంగ్రెసుసభ కాయన యధ్యక్షత వహించెను. ఆయన తన స్వభావానుగుణముగా, ముక్తసరిగా నుపన్యాస మిచ్చెను. తన కధ్యక్షపదవి యిచ్చిన గౌరవము, సామాన్యకృషీవలుఁడైన తనది కాదనెను. జాతీయ సమరమునం దెక్కువ పాల్గొన్న గుజరాతునకే యీ గౌరవము చెందునని కాంగ్రెసు సభ్యులవిధినిగూర్చి హెచ్చరించెను.

1935 లోఁ గాంగ్రెసు శాసనసభాప్రవేశ మంగీకరించుటచే నభ్యర్థులను నిర్ణయించుటకును, వారి నదుపాజ్ఞలలోఁ బెట్టుటకును, బార్లమెంటరీబో ర్డేర్పడెను. దానికిఁ బటేలు, రాజేంద్రప్రసాద్, ఆజాదు త్రిమూర్తులు నిర్ణయింపఁబడిరి. ఆ బోర్డు కధ్యక్షుఁడు పటే లగుటచేఁ గార్యభారమంతయు నాయనమీఁదనే పడెను.

ఆయన యారంభించిన పని మిక్కిలి పట్టుదలతోఁ జేయునని యందఱకుఁ దెలిసిన విషయమే. పటేలు భారతదేశ మంతటఁ బర్యటనజేసి “కాంగ్రెసుకు వోటిచ్చుట యనఁగా గాంధీజీ కిచ్చుట”యని ప్రజల కర్థమగునట్లు ప్రచారముచేసి, యభ్యర్థులను నిలిపెను.

కాంగ్రెసుకు వ్యతిరేకముగా దేశములో ననేకపక్షము లేర్పడెను. ప్రభుత్వమువారు పరోక్షముగా కాంగ్రెసు నోడించుటకు సర్వసన్నాహములు చేసిరి. ఎన్నికల సమయములో వివిధ పక్షముల గర్వోక్తులకు జవాబు చెప్పుచు “గాంగ్రెసు స్టీము రోలర్ బయలు దేరిన, దానిని వ్యతిరేకించు గంకరరాళ్లన్నియు నలిగి చూర్ణము కావలసినదే” యన్న పటేలుమాట యక్షరాల జరిగినది. ఎన్నికలలో గాంగ్రెసు కఖండ జయము కలిగినది. సంయుక్త ప్రాంతము, బీహారు, ఒరిస్సా, మధ్య రాష్ట్రాలు, బొంబాయి, మద్రాసు రాష్ట్రాలలో నధిక సంఖ్యాకులు కాంగ్రెసువా రగుటచేఁ గాంగ్రెసు మంత్రివర్గము లేర్పడినవి. సరిహద్దురాష్ట్రము, అస్సాములలోఁగూడఁ గాంగ్రెసు మిశ్రమంత్రివర్గముల నేర్పాటు జేసెను.

కాంగ్రెసీ ప్రాంతములలో శాసన సభా కార్యక్రమము నెఱవేర్చుటకుఁ బార్లమెంటరీ కమిటీ నొకదాని నేర్పాటు చేసెను. దీనికి వల్లభాయి యధ్యక్షుఁడు. ఈ హోదాలో నాయన కాంగ్రెసు మంత్రిమండలితో మిక్కిలిదక్షతతో వ్యవహరించెను.

పార్లమెంటరీబోర్డు కధ్యక్షుఁడుగా సర్దారు చూపిన శక్తి సాహసములు చరిత్రాత్మకమైనవి. ఎక్కడ నే కాంగ్రెసువాది నీతినిబంధనల నతిక్రమించెనని తెలిసినను నాతడు ప్రధాన మంత్రియైనను బ్రాథమిక సభ్యుఁడైనను జంకుగొంకులేక వెంటనే యాజ్ఞాపత్రము నందఁజేసి యాయరాచకము నంతమొందించుటలో నారితేఱినవాడని పటే లఖండఖ్యాతిఁగాంచినాఁడు.

బొంబాయి రాజధానిలో “నారిమన్” గొప్పనాయకుఁడు. సర్దారు కాయన ప్రాణస్నేహితుఁడు. అయినను నారిమ నెన్నికలలోఁ గాంగ్రెసుకు భిన్నముగాఁ బ్రవర్తించెనని తెలిసికొని యాయనను గాంగ్రెసునుండి వెడలఁగొట్టెను.

“డాక్టరు ఖరే” మధ్య రాష్ట్రములలోఁ బ్రధాన మంత్రిగాఁ గొంతకాలము పనిచేసినతర్వాతఁ బార్లమెంటరీ బోర్డుతో సంప్రదించకుండఁ దన యిష్టప్రకారము మంత్రులచేఁ రాజీనామా పెట్టించినప్పు డాయననుగూడఁ బటేలు పదవీచ్యుతుని జేసి కాంగ్రెసునుండి బహిష్కరించెను.

మన మాజీ ప్రధాని రాజాజీ, యూరపియన్ సెక్రటరీ పింఛను పుచ్చుకొని పోనున్న తరుణములో విందుఁజేయఁ బ్రయత్నించఁగా వల్లభాయి వల్లగాదని తంతి నంపి, యాపించెను.

సుభాషబాబు కాంగ్రెసుపాలసీకి భిన్నముగాఁ బ్రవర్తించినందుకు రెండు సంవత్సరము లాయనను డిబారు చేసెను.

కాంగ్రె సవలంబించిన పద్ధతికి వ్యతిరేకముగా రాజాజీ ప్రచారముప్రారంభించినప్పుడు శాసనసభ్యత్వమును వదలుకొనుమనియేగాక, కాంగ్రెసు నుండి తప్పుకొనవలసినదనియే తాఖీదు పంపెను. ఆప్రకారమే చక్రవర్తులవారు చేసిరి.

ఈ విధముగా వేయికండ్లతోఁ జూచుచుఁ గాంగ్రెసులోఁ గ్రమశిక్షణను గాపాడిన ఖ్యాతి యాయనకే యధికముగ చెల్లుబడియైనది.

స్వధర్మనిర్వహణలో మిత్రుఁడనిగాని, పెద్దయనిగాని తలఁచక, యాయనచూపిన కర్తవ్య నిర్వహణబుద్ధియే యాయన నధికునిగాఁ జేసినది. ఆయన ద్వంద్వాతీతుఁడై చేసిన సేవకుఁ గొందఱకుఁ గష్టము కలుగవచ్చును. కొందఱకు నష్టము కలుగవచ్చును. కాని కాంగ్రెసునుమాత్ర మాయన దుష్టాంగమును ఖండించి, శేషాంగమును గాపాడినట్లుగాఁ గాపాడినాఁడు. ఆయన యా విధముగ దారుణచర్య తీసుకొనక పోయినఁ గాంగ్రెసు శాసనసభాపక్షము, స్వరాక్ష్యపక్షమువలె ఛిన్న భిన్నమై నశించిపోయియుండును.

ప్రభుత్వ మీ కాంగ్రెసు సభ్యులను లోఁబఱచుకొనుట కెన్ని మాయోపాయములు పన్నినను వాని నన్నిటిని వేయికండ్లతోఁ జూచుచు నెప్పటికప్పుడు మెలకువతోఁ బటేలు సంచరించుటవలననే కాంగ్రెసు ప్రతిష్ఠ నిలచినది. వ్యతిరేకు లాయనను ఫాసిస్టని, కులక్ అని, డిక్టేటరని, యుక్కుమానిసి యని యెంత నిందించినను నాయన వాని నన్నిటి నోర్చి, కాంగ్రెసులోఁ గ్రమశిక్షణ యతిజాగృతితో నిలిపి కాంగ్రెసును గాపాడుటలో నధికఖ్యాతిఁ గాంచెను.

తాఖీదు లిచ్చుటతోనేతనపని పూర్తియైన దనితలంచు ఘటముకాదు పటేలు. తాను బూనినకార్యము, నెగ్గువఱకు నిరంతరప్రయత్నము చేయు నిరుపమాన కార్యదక్షుఁడు. బొంబాయిలో మద్యపాననిషేధోద్యమమునకు వ్యతిరేకముగాఁ గంట్రాక్టరులగు పార్సీలు మొదలగువారు పలుప్రయత్నములు చేయఁగా నచటఁ బ్రవేశించి మద్యపాననిషేధోద్యమము నమలుజరిపించి జయప్రదముగాఁజేసిన యాయన భగీరథప్రయత్నము భారతలోకమునకుఁ దెలియనిదికాదు.

అండమానురాజకీయబందీలు నిరశనవ్రత మవలంబించఁగా వారిని వదలిపెట్టుటకుఁ గేంద్రప్రభుత్వమున కిష్టములేక పోయినను, వారిని విడిచిపెట్టుటకు వీలులేకపోయినను మన కీ రాష్ట్రీయస్వాతంత్ర్య మెందుకని హెచ్చరించి, వారిని విడిచి పెట్టించిన స్వాతంత్ర్యప్రియుఁడు సర్దారు.

1945లోఁ గేంద్రశాసనసభాధ్యక్షపదవికిఁ గాంగ్రెసును మప్లంకరును నిలుపగా, ముస్లింలీగువారు, ప్రభుత్వము భుజాలు భుజాలు కలిపి పనిచేయఁగా నక్కడఁ బీఠముపెట్టి మప్లంకరును బీఠమెక్కించి ఢిల్లీకోటలో బాగావేసిన విజయసారథి - సర్దారు.

కాంగ్రెసులో నాయనపాత్ర యతిప్రముఖమైనది. క్రిప్సు రాయబారములో నేమి, యమాత్యత్రయదౌత్యములో నేమి, యాయన కాంగ్రెసు రాయబారిత్రయములో (నెహ్రూ, అజాద్) నొకఁడై కాంగ్రెసుప్రతిష్ఠకుఁ దగినట్లుగా నడపిన సంగతి సర్వజనవిదితము.

ఆయన కాంగ్రెసు వర్కింగుకమిటీ సభ్యుఁడేగాదు. కాంగ్రెసు సూత్రధారులలో నొకఁడేకాదు. గాంధీజీ తర్వాత కాంగ్రెసువిధాననిర్ణేతలలో నగ్రస్థానము వహించినవాఁడు.

అన్నదమ్ములు

కాంగ్రెసులోఁ బ్రఖ్యాతి గాంచిన నాయకులలో నన్నదమ్ములజంటలు కొన్నిగలవు. ఆలీసోదరులు, బోస్ సోదరులు, ఖాన్ సోదరులు, పటేల్ సోదరులు ప్రఖ్యాతులు.

ఆలీసోదరులలోఁ బెద్దన్నయ్యషౌకతాలీ భీమాకారుఁడు. ఆయన యాకారమే రాజద్రోహకర మైనదని యాయన యనుచుండెడివాఁడు. నిండుహృదయుఁడు. ఆయనతమ్ముఁడు మహమ్మదాలీ యఖండప్రతిభావంతుఁడు. ఆలీసోదరు లిరువురు మహాత్ముఁడు ఖిలాఫతుద్యమములో నేకీభవించిచేసిన స్నేహము ప్రచారము ప్రబోధము. చరిత్ర ప్రసిద్ధమైనవి. వారిరువురు వామనమూర్తియగు గాంధీమహాత్మున కంగరక్షకులై యను యాయులై, వర్తించిన విషయము విశదమే. అందులో మహమ్మదాలీ 1923లోఁ బ్రథమముగా నాంధ్రదేశమునఁ గాకినాడ కాంగ్రెసుసభ కధ్యక్షుఁడైనాఁడు. కాంగ్రెసధ్యక్షోపన్యాసములలోనికెల్ల నాయన యుపన్యాస మతిదీర్ఘమైనది. ఆ దీర్ఘ బాహువునకుఁ దగినట్లుగానే యది యున్నది.