వల్లభాయి పటేల్/అహమ్మదాబాదు మునిసిపాలిటీ అధ్యక్షత

వికీసోర్స్ నుండి

మును గమనించి ప్రభుత్వమును హెచ్చరించెను. ప్రభుత్వము వల్లభాయి మాటను మొదటఁ బెడచెవిని బెట్టెను. ఆయన యొక మాసమురోజు లక్కడ మకాముపెట్టి ప్రజ లా పన్నీయకుండ సత్యాగ్రహము చేయించెను. చిట్టచివరకుఁ బ్రభుత్వము వారు హోంమెంబరును విచారణకుఁ బంపించిరి. ఆయన శిక్షార్థము పన్ను విధించుట యక్రమమని రిపోర్టు వ్రాసెను. ఈ విధముగఁ బటేలు బోర్సదులోకూడఁ దన విజయ పతాకను బ్రతిష్ఠించెను.

అహమ్మదాబాదు మునిసిపాలిటీ అధ్యక్షత

స్థానిక సంఘములలోఁ బ్రవేశించ వచ్చునని కాంగ్రెసు తీర్మానించినది. తదనుగుణముగాఁ గాంగ్రెసు ప్రముఖ నాయకులు వానిలోఁ బ్రవేశించిరి. చిత్తరంజనదాసు, విఠల్ భాయి పటేలులు వరుసగాఁ గలకత్తా, బొంబాయి కార్పొరేషనులకు మేయరులైరి. రాజేంద్రబాబు పాట్నాకు, జవహరులాల్ నెహ్రూ అలహాబాదుకు, వల్లభాయి యహమ్మదాబాదుకు మ్యునిసిపల్ అధ్యక్షులైరి. కాని వా రెక్కువకాల మీ పరిపాలనలోఁ బాల్గొనఁజాలక విడచిపెట్టవలసినవారైరి. వల్లభాయి మాత్ర మట్లు వదలిపెట్టలేదు. ఆయన దేనిలోఁ బ్రవేశించినను సగము సగముపనులు చేయఁడు. (1924 మొ|| 1928 వఱకు నైదు సంవత్సరము లహమ్మదాబాదు పురపాలక సంఘమున కధ్యక్షత వహించి యెన్నో మార్పులు చేసెను. నగర పారిశుద్ధ్యమును బెంపొందింపఁ జేయుటయేగాక, ప్రయిమరీ పాఠశాలల యుపా ధ్యాయులలో దేశభక్తిని రేకెత్తించి, వారి ద్వారా పిల్లలకుఁ బ్రబోధము చేయించెను. మ్యునిసిపలు కమిషనరుకు నారోగ్య శాఖాధికారికి సింహస్వప్న మైనాఁడు. ఆ పట్టణము నతిసమర్థతలోఁ బాలించి దాని పెంపుకుఁ బెద్ద కృషిచేయుటయేగాక కాంగ్రెసు పతాక రంగులను లాంతరు స్తంభములకు వేయించెను. వేయేల? ఆనగరమును కాంగ్రెసు నగరము కావించెను.

పటే లధ్యక్షుఁడుగా నుండుటకు ముం దహమ్మదాబాదు కంటోన్మెంటు మునిసిపాలిటీకి నీటి పన్నిచ్చెడిదికాదు. పటే లధ్యక్షుఁడైన తరువాతఁ 'బన్ని చ్చెదరా, నీళ్ళు బందు చేయనా' యని తాఖీదు పంపినాడు. అంతట గలెక్టరు 'మీతో మాట్లాడవలయును. ఎన్నింటికి వచ్చెద'రని కబురు చేసెను. దానికిఁ బటే లిట్లు సమాధానము పంపెను. 'మీతో మాట్లాడవలసినపని నా కేమియు లేదు. నాతో మాట్లాడవలసిన యవసర మున్నచో నా యాఫీసుకు వచ్చి మాట్లాడవచ్చును.' అంతట విధిలేక కలెక్ట రాయన యాఫీసుకు వచ్చి నీళ్ళు వదలి పెట్టవలసినదిగాఁ గోరెను. పన్నీ యనిదే నీరు వదలుటకు వీలు లేదని పటేలు పట్టుపట్టెను. కంటోన్మెంటు నీటి పన్నిచ్చు నాచారము లేదని కలెక్టరు వివరించెను. అట్లయినచో నీ పూటనుండి నీరు బందు చేయుచున్నానని పటేలు బెదరించెను. కలెక్టరు గవర్న మెంటుకు వ్రాసి యా పన్ను చెల్లించెను. ఈ విధముగాఁ బటే లిక్కడ విజయదుందుభిని మ్రోగించెను.