వరాహపురాణము (నంది మల్లయ, ఘంట సింగయ)

వికీసోర్స్ నుండి

ఉపోద్ఘాతము

ఈవరాహపురాణము నంది మల్లయ్య ఘంట సింగయ్య యనుకవిద్వయముచే రచియింపఁబడినది. వీ రిరువురిలో నేభాగ మెవ్వరు రచియించిరో తెలిసికొనుట యసాధ్యము. అక్కడక్కడ కవిత్రయమువారిప్రయోగములకు విరుద్ధము లైన ప్రయోగములు కానఁబడుచున్నను, మొత్తముమీఁద నీకవులకవిత్వము మిక్కిలి రమ్యమయి రసవంతమయి రసికజనహృదయాహ్లాదకరముగా నున్నది. హరిభట్టకృత మైనవరాహపురాణమునకంటె నిది సర్వవిధముల శ్లాఘ్యతరమయినదిగా నున్నదనుటకు సందేహము లేదు. కవు లీగ్రంథమును కృష్ణదేవరాయలతండ్రి యగునరసింహదేవరాయని కంకితము చేసిరి. అందుచేత వీరు పదునేనవశతాబ్దముయొక్క కడపటిభాగమునం దుండినవారయినట్టు స్పష్టముగాఁ దెలియవచ్చుచున్నది.

ఈపుస్తకము నొకప్రతి నిచ్చటి ప్రాచ్యలిఖితపుస్తకభండాగారమునుండి వ్రాయించి తెప్పించి రెండుసంవత్సరములక్రిందట నేను రాజమహేంద్రవరము వెళ్ళినప్పుడు నామిత్రులైన బ్రహ్మశ్రీ మ- రా- శ్రీ సత్యవోలు లక్ష్మీపతి గారు సరిచేసి ముద్రించుటకయి నాచేతి కిచ్చిరి. ఆప్రతి సమగ్రమైనదే యైనను బహుస్థలములయందు పద్యములు విడువఁబడి ముద్రణయోగ్యము కాకుండెను. ఇట్లుండఁగా నా మిత్రులైన బ్రహ్మశ్రీ మ- రా- శ్రీ మానవల్లి రామకృష్ణయ్యగారు సెలవుదినములలో నైజాము రాజ్యమునకుఁ బోయియుండినప్పు డచ్చటి గద్వాలసంస్థానమునుండి మఱియొకప్రతిని దెచ్చి నా కిచ్చిరి. ఈప్రతియు శుద్ధమైనది కాకపోయినను మొదటిదానికంటె మేలైనదయి గ్రంథపాతములు లేనిదిగా నుండెను. ఈసాయమునకయి వారికి నాకృతజ్ఞత నిందుమూలమునఁ దెలియఁబఱుచుచున్నాను. ఈరెండుప్రతులను సాయపఱుచుకొని నాచేతనైన ట్లొకవిధముగా సవరించి శ్రీలక్ష్మీపతిగారినిమిత్తమయి యీపుస్తకమును ముద్రించుటకు మెయినెలలోఁ బ్రారంభించితిని. నే నీనెలలో రాజమహేంద్రవరమునకుఁ బోవ నిశ్చయించుకొన్నందున, నేను బుస్తకమును ముగించి మఱి పోవఁదలఁచి యత్యంతశీఘ్రముగా నీపుస్తకమును ముద్రాంకిత మొనర్చినాఁడను. ఇందు నాయజ్ఞానమువలనను ప్రమాదమువలనను తప్పులు పెక్కులు పడియుండవచ్చును. అట్టివి కనఁబడినచో సుధీజనులు మన్నించి నా కవి తెలుపుదురు గాక! నాయొద్దనున్నప్రతితోనే యనంతకవికృత మైనభోజరాజీయమును నేను ముద్రింపఁ దలఁచియుండఁగా బ్రహ్మశ్రీ మానవల్లి రామకృష్ణయ్యగారు పూర్వోక్తసంస్థానమునుండియే తెచ్చి మఱియొకప్రతిని నా కిచ్చియున్నారు. ఈపుస్తకమునుగూడ శీఘ్రకాలములోనే ముద్రింపించెదను.

చెన్నపురి,

కందుకూరి- వీరేశలింగము.

23- 7- 1904.