రాణీ సంయుక్త/మొదటి ప్రకరణము

వికీసోర్స్ నుండి

రాణీ సంయుక్త

మొదటి ప్రకరణము

మారమి యెనిమిదివందల సంవత్సరముల క్రిందట ఢిల్లీ పట్టణమునకును గన్యాకుబ్జనగరమునకును నడుమనున్న యమునా గంగా ప్రాంత కాంతార ప్రదేశంబు లొకనాటి సాయంకాలమునఁ జూపరుల కపరిమితానందభయ దాయకములగు రంగస్థలములై యుండెను. మూర్ఖమతులగునో ఆర్యావర్తవాసులారా ! మదోన్మత్తులై, సత్యవిద్యావిదూరులై, కుమతాచారములం బట్టువడి, యైకమత్యాభావమున మెలంగుచు, మాతృభూమియగు నార్యావర్తముపై నించుకైన నభిమానముంచక, పరస్పర ద్వేషంబుల జనింపఁజేసికొని దుష్కృత్యములఁ గావింప సమకట్టితిరి కాపున నందఱకు బుద్ధివచ్చునటుల మీపై దాడివెడలఁ బరరాజునొకని బ్రోత్సాహపఱచెదనని కోపారుణితలోచనుండై యవనదేశమున కేగుచున్నాడోయన రవి పడమటి సమద్రమునఁ గ్రుంకు చుండెను. అట్టి సంధ్యాకాలమందు యమునానదికిం గొంచెము దూరములోనున్న మధురానగరమున కొకమైలు క్రిందుగా నది కొక ఫర్లాంగు యెడములోఁ గొన్ని బండ్లు నడచిపోవుచుండెను. బండ్లన్నియు నెద్దులు మోయగలిగినన్ని సరకు బస్తాలతో నింపఁబడి, వర్షము వచ్చిననుఁ దడియకుండుటకై యరచేతి మందములగు పెద్ద పెద్ద మైనపు గుడ్డలతోఁ గప్పఁబడి త్రాళ్ళచే బిగింపఁబడి యుండెను. ప్రతిబండి యొక్క పైభాగమునఁ దుపాకులఁ ద్రాళ్ళయందుదోపి నడుమునఁ గట్టుకొనియున్న బారుకత్తులు క్రిందికి వేలాడుచుండ నిద్దఱిద్దఱు సిపాయిలు పడియుండిరి. బండ్లవారంద ఱాసాయంకాలమున కుత్తుకనిండ ద్రాగిన సారాయి 'మైకమువలన నొడలు మఱచి తలలు వ్రాల్చు కొనిపోవ నూగులాడుచు మిట్టపల్లములుగా నున్న నేలపై నడచుచుండుటచే బండ్లదరిపడునపుడెల్ల దామును నదరిపడి లేచి యెడ్లనదలించుచుఁ దోలుకొని పోవుచుండిరి. పైభాగమునఁ బడియున్న సిపాయిలు సహితము వారితో సమానమగు నవస్థయం దుండుటచే, వారును దమకు మెలఁకువగల్గినపు డంతయు బండ్ల వారల నదలించుచుండిరి. రౌతు మెత్తనివాఁడైన గుఱ్ఱమొంటి కాలితో నడచుననురీతి వారందఱు నట్టిస్థితియందుండ నెద్దులెట్లు నడచుచుండినదియుఁ జదువరులే యూహింపఁగలరు. బండివాడు కోలతో దెబ్బఁదీసినపుడెల్ల రెండుమూఁ డడుగులు ముందుకు లాగుచు మిట్టవచ్చిన వెంటనే యాగిపోవుచుండెను, ఆగి పచ్చికమేత కాశపడి తమ యిష్టమువచ్చినట్లెల్లలాగికొని పోవుచుండెను. కావున బండ్లన్నియు సిపాయి లేర్పఱచుకొన్న మార్గముఁదప్పి యీవలావలఁ జెదరి నిలచియుండెను.

ఆ తరుణమునఁ దూర్పుదిక్కున నించుక మబ్బుపట్టి చల్లని వాయువులు వీవనారంభించెను. మేఘములు క్రమక్రమముగా వృద్ధియగుచున్నఁ గొలఁది గాలియు మిక్కుటమగు చుండెను. పరోపకారార్థము ఘనులుసల్పు కార్యములకు విఘ్నములు సంభవించుచుండుట ప్రస్తుతకాలమందుఁగూడ సహజమే యైయున్నదిగదా ! రానురాను గాలి ప్రబలమై మహాసత్వములగు వృక్షముల నల్లలనాడించుచుఁ దన ప్రకంపననామమును సార్థకఁ బఱచుకొనుచుండెను, అమితమగు నెండవేడిమివలనఁ గాలి యనేక జంతుసంచారములచే ద్రసరేణువులుగమారిన భూభాగమందలి ధూళియంతయు, ఝంఝానిల వశంబున నేలనంట వ్రాలి యూగులాడు తీగెలయొక్క రాపిళ్ళమూలమునఁ బైకిలేచి ప్రబలమగుచున్న జలదసంఘమును మఱింత దట్టముఁ జేయుచుండెను? పండి నేలరాలి యెండిపోయి యున్న యాకులన్నియు గాలిచేఁ గొట్టుకొనిపోవునపుడుఁ బుట్టు గలగలయను రొదలును, వెదురుమ్రాకు లొండొంటి తోడ నొరసికొని యుఱ్ఱూతలూగుతరిఁ గలుగు కిఱ్ఱుమను రావములును, నతి దీర్ఘములై చువ్వలంబలె మింటినంటఁ బెరిగిన వృక్షజాతులఁ జుమ్మను శబ్దములును, బవనవేగమునకు నిలువంజాలక విరిగి నేలంగూలు వివిధతరు శాఖాసమూహంబుల ఫెళఫెళారావములును, గాలితాకుడు వలన నత్యున్నతములుగలేచి నురుగులు, గట్టఁ దీరములం గొట్టుకొను యమునాతరంగముల యార్భాటములును, యెండవేడిమివలనఁ దాపంబతిశయింప నుమ్మలికనొంది యాకస్మికముగఁ బొడమినట్టి మేఘములఁగాంచి యాహ్లాదమున గాలిచేఁ బింఛములు విరియ నాడు నెమలుల క్రేంకారములును, వర్షధారలకాశించి కాచుకొనియున్న చాత కపోతంబుల సంతోషారావములునుఁ, గమలాగారసంఘముల స్వచ్ఛందసంచారముల సల్పు పరమహంసలమగు మేము విషధరుండగు వీనింజూడ నోపమని మలంగిపోవుచున్న వనమే ఘోధయమునకు వెఱచి యమునయందలి శతపత్రంబులనృత్యంబుఁ జాలించి యాకసమున కెగయు రాయంచల సందడులును, వనతలంబు నెల్లెడలఁ బ్రతిధ్వనులుపుట్ట బొబ్బలిడు శార్దూలాది క్రూరమృగ భయంకర ధ్వానములునుఁ, దమతమ నెలవులఁ జేరంజను నానావిధ పతంగకుల కలకలంబులును, నేకమై యరణ్యమంతయు నల్లకల్లోలమగుచుండెను. ఎవరుగాని తమలోఁదాము కలహించుకొని యైకమత్యవిహీనులై మెలఁగుటచే నట్టివారలెంత బలవంతులైనను దుదకు మొదలంట నాశనమగుదురని లోకమునకంతయు నెఱుకపఱచు చున్నవియోయనఁ గ్రక్కిరిసి యొండొంటితోడఁ బెనవైచుకఁ బోయిన వృక్షజాలములు తప్పఁ దక్కిన గొప్ప గొప్ప మహీరుహములు సహితము వాయువునకులోనై కూకుడు వేళ్ళతోఁ గూడఁ బెల్లగిలి నేలఁ గూలుచుండెను. పరులెందఱెన్నిగతుల నాటంక పఱచుచున్నను ఘనులు దాముపూనిన కార్యముల విడనాడక సల్పుచునే యుండి, యవితీరిన వెంటనే యత్యుత్సాహమున నెరవేర్చి గెలుపుఁ గొందురనురీతి, దుమ్మెగిరిపోవునట్లు గాలివీచుచున్న సమయమందే చినుకులును నారంభమై గాలి యడగినతోడనే వర్షమెక్కువగా సాగెను. క్రమక్రమముగ వృద్దియై సంవర్తకాల ఘనాఘనముల చందంబున వాఁగులు వాఱఁ గురియఁగడఁగెను. మేఘుఁడు దారాప్రవాహ పూర్వకంబుగఁ గాళిందీకన్యకకు మౌక్తికముల సమర్పించు చున్నాడో యనఁ బలువిధములగు మల్లెలు జాజులతోడం గూడిన లతా వితతులు వాఁగులవెంటఁ గొట్టుకొనిపోయి యమునయందుఁ జేరుచుండెను, ఆర్యావర్తమునకిఁక ముందురాఁబోవు దుర్దశలం దలంచి పంచమహా భూతంబులు జాలింబడి కాలువలుగట్ట విలపించుచున్నవియోయన ధారలత్యంతములై జోరున వర్షము కురియుచుండెను.

అట్లు గడియలకొలఁది నాకసము చిల్లిపడినట్లుఁ, గడవలతోఁ గ్రుమ్మరించినగతి వానకురియుచుండ హాలారసపానమత్తులై శరీరము లెఱుఁగక పడియున్న పైసిపాయిలును, బండ్లవారలును సగము తడిసినపిదపఁ గలిగిన చలివలనఁ దెలివినొంది నలుదిక్కులఁ బరికించు నప్పటికి దిశలగుపడని యంత దట్టముగ వర్షము కురియుచుండెను. అందుల కాశ్చర్యమగ్ను లై బండ్లనొక మహావృక్షముక్రింద నాపి యందఱును వాటి యడుగుభాగమునకుఁ జేరిరి. అనంతర మించుకసేపున కావర్ష సంరంభమడఁగి జల్లుపడుచుండ బయటికేతెంచి చూచి తాము దారితప్పి వేరొకచోట నుండుటఁ దెలిసికొనిరి. అందుల కొక సిఫాయి కోపోద్దీపితుఁడై తన లాఠీకఱ్ఱఁ జేఁబూని బండ్లవారి నందఱిఁ జావఁదన్న మొదలుపెట్టెను. మఱికొందఱా సిపాయిని శాంతఁబఱచి యావలకుఁ గొంపోయి బండ్లుకట్టుఁడని యాజ్ఞాపింప వారలు " అయ్యా ! నేఁడు వర్షము మిక్కుటముగఁ గురిసినందున నేలయంతయు నానియున్నది. కాన బండ్లు నడువఁజాలవు. మరల రేపు నాలుగుగంటలకేఁదప్ప యిప్పుడు కట్టుటకు వలనుపడదవి " విన్నవించుకొనిరి. అందులకు సిపాయిలును సమ్మతించి నాలుగు గంటకవేళ భోజనములు చేసికొనియే బయలుదేరిరి. కొన నా రాత్రి యింతవర్షములో వేరొక చోటికిఁబోవ నేటికని యా వృక్షముక్రిందనే మఱునాటి వరకునుండ నిశ్చయించుకొనిరి. చలి యమితముగ నుండుటచే బండ్లవారలచేఁ దడిసిన యెండుకట్టెలఁ దెప్పించి ప్రోవు వేయించి తామువెంట గొనితెచ్చిన యాముదముఁబోసి మంటఁజేసిరి, ఆముదపుఁ బ్రభావమున నా కట్టె లెగాదిగ మండుచుండ నందఱు దానిచుట్టుఁజేరి చలికాచుకొనసాగిరి. కొందరు వర్షము కురియుచుండ బండ్లయడుగునఁ గూరుచున్నప్పుడు మీదఁబడిన మంటిజల్లులఁ గడుగుకొన దుస్తులఁదీసి లంగోటీల బిగించుకొని నదికేగ బయలు వెడలిరి.