రాణీ సంయుక్త/పండ్రెండవ ప్రకరణము

వికీసోర్స్ నుండి

పండ్రెండవ ప్రకరణము

పైప్రకరణమున వచించిన వృత్తాంతములు జరుగుకాలమందే మధురాపురమున కెగువ రెండామడల దూరమందలి కాళిందీతీర ప్రదేశము లతిభయంకర యుద్దమున కావాసములై యుండెను. ఆ ప్రదేశములందు సుమారు ముప్పదివేల సైన్యముతో నెప్పుడు సమయము దొరుకునా యెప్పుడార్యావర్తమును మ్రింగివేయుదునా యని కుతుబుద్దీ నను మహమ్మదీయ సేనానాయకుఁడు గాచుకొని యుండెను. ఆ ప్రదేశముయమున కొండలగుండ బ్రవహించు చున్నందున నడుమ గొన్ని కొండలు ద్వీపకల్పములుగ మారియుండెను. ఎప్పుడుబట్టిన నపుడు శత్రులు బ్రవేశించుటకు సులభముకానట్టి ద్వీపకల్పముగనున్న నొక కొండపై ముప్పదివేల సైన్య ముండుటకు దగినంతవిశాలమగు నా వరణముగట్టించి కుతుబుద్దీనందు నివసించి యుండెను. ఈ యావరణమునకు దక్షిణపు పార్శ్వమున మాత్రమొక గొప్ప బలిష్టమగు ద్వారము కలదు. శత్రువు లెవరైన లోపలబ్రవేశింప నెంచినచో నది నీది దక్షిణపు వాకిటఁ బోవలయుఁగాని వేరొండు మార్గములేదు. ఆవరణపుగోడ నాగజెముడు మొదలగు ముండ్ల దుబ్బులచే నిర్మింపఁబడి నాలుగు గజముల యెత్తు గలిగియుండెను. దక్షిణ మందలి ద్వారముమాత్ర మడుసుతోఁ గట్టఁబడి యుండెను. అచట శూరులగు భటులనేకులు గావలియుందురు. మఱియు నావరణము లోపల గంచెకొక గజమెత్తుగ నుండునట్లు మట్టి బురుజుల నందందు గట్టించి వాటిపై ఫిరంగులఁ బెట్టించి యనేక సిపాయిల గావలియుంచి యుందురు. ఈ కట్టుదిట్టములవలన సైన్యమంతయు నొక బలిష్టమగు దుర్గమున నున్నట్లే యుండెను. వెండియు. సైన్యమునకు వలసిన యాహార సామగ్రుల లోనఁ జేర్చుకొనుటకును దమవారి ననాయాసముగ దాటించుకొనుటకును వీలుగనుండునట్లు తేలికగు ననేక పెద్ద పెద్ద వృక్షముల నరికించి తెప్పించి తెప్పలుగట్టించి నీటద్రోయించి వాటిపై ననేక భటుల గావలియుంచి యుందురు. ప్రతి తెప్పయు రెండువందల టన్నుల భారమును మోయ గలిగినదిగా నుండెను. దూరమందున్న గొప్ప గొప్ప గ్రామముల కనిచి భటులచేత గావలసిన సామగ్రులఁ దెప్పించుకొనుచు వేగులవారి వలన నార్యావర్త యరాజుల తెఱంగుఁ దెలియుచు నతిజాగరూకుఁడై, యెప్పటివార్త లప్పుడు సుల్తానుగారి కెఱుక పరచుచు రణమునకై గుతుబుద్దీను వేచియుండెను. అట్టి తరుణమున నొకనాటి నిశీధమున రెండుగంటలవేళ నార్యసైన్యములు కొన్ని నదియందుదిగి నిశ్శబ్దముగఁ దీరము జేరవచ్చుచుండెను. అదివరకా స్థలమున మ్లేచ్చులు రెండునెలలనుండి విడిసియుండ నే తొందరలును గలుగక పోవుటచే నేనాపతి హాయిగ ద్రాగి పరుండెను. తక్కుంగల సైన్యభటులును దమతమ శస్త్రాస్త్రముల నెక్కడి వక్కడఁ బారవైచి నిద్రపరవశులై యుండిరి. తెప్పలపైఁ గావలిగాచువారు సహిత మొకరిద్ఱఱి నన్నిటికి గావలిఁబెట్టి తాము లోపలజేరి పరుండియుండిరి. ఆ యొకఱిద్దఱును నదీతీరమున నొక యిసుకతిన్నెపై బరుండి “చల్లగాలికి హాయిగ నిదురవోయిరి. బురుజులన్నియు భటవిహీనములై నిద్దురబోవుచుండెను. అట్టి సమయమున పైననార్యసైన్యములు నదీతీరమున బారులుదీరి నిలిచియుండ గొందఱు భటులు నది నీది మ్లేచ్చులున్న వైపుజేరి యట నిదురించియున్న నిద్దఱ దీర్ఘనిద్రాసౌఖ్య మనుభవింపుడని నీటఁబారవైచి తమ్మునాటంక పఱచువా రొక్కరును గానరానందునఁ దెప్పల నవతలకుఁ గొంపోయి తమ సేనాభటుల నెక్కించుకొని వచ్చి మహ్మదీయుల ప్రాకారము చుట్టు జేర్చుచుండిరి. ఆర్యసేనాపతి దాని ద్వారమును గనిపెట్టి సేనయందు మూడవవంతు దక్షిణమును ముట్టడింపపంపి తక్కిన నైన్యమును దక్కిన మూడు పార్శ్వముల ముట్టడింప నాజ్ఞాపించెను. మఱియు బయటనుండి మహ్మదీయులకు సహాయమొనర్ప వచ్చినవారి నడ్డగించుటకుగాను మరికొంత సైన్యము నవతలి తీరముననే యుంచెను. ఏర్పరుచుకొన్న ప్రకార మెక్కడివా రక్కడ జేరియున్న పిదప సేనాపతి సంజ్ఞ నొనర్ప నార్యభటులందఱు నొక్క పర్యాయముగఁ తుపాకుల మ్రోయించి దక్షిణద్వారపు ముట్టడిని బ్రారంభించిరి. తుపాకుల మ్రోతలకు లోపలివారెల్లరు భయభ్రాంతచిత్తులై లేచి తమతమ యాయుధములఁ దుపాకులఁబూని ద్వారముకడకేగిరి. బురుజులపై సుండవలసిన వారును మేల్కని నిద్రకండ్లతో మెట్లెక్కబోయి పడుచు నతిప్రయత్నము మీదఁ బైకిచేరి బందూకులతో నార్యసేనలఁ గాల్వసాగిరి. బురుజులపైనుండి వచ్చు బందూకుల వ్రేటుల కనేకులు నీటంబడి కొట్టుకొని పోవు చుండిరి. ఎటులైనను లోపలవారి నుక్కడించుకోరిక నార్యులు శత్రువుల వ్రేటులకు లక్ష్యముసేయక తమవారలు కుప్పలుగు గూలుచున్నను ధైర్యమువీడక సాహసముతో మ్లేచ్చులపై నగ్నివర్షము గురిపించుచు మహా ఘోరమున యుద్దమొనరించు చుండిరి. లోపలివారు ప్రయోగించు బందూకుల గుండ్లన్నియు యమునంబడి మహా భయంకరముగ శబ్దించుచుండెను. ఆవరణము లోపలఁ జేరుటకై దక్షిణమందలి వారలును హోరాహోరిగ. బోరాడుచుండిరి. ఈ తరుణమందే మహమ్మదీయుల కొఱకు సామానుబండ్లు కొన్నివచ్చి యవతలిగట్టు జేరెను, అక్కడినున్నవారు వచ్చినవారి ననాయాసముగ నోడించి బండ్ల నన్నింటి తమ వశము గావించుకొనిరి. ఈ ప్రకారము మూడు దినములవర కతిఘోరముగఁ బోరాడుచుండ లోపలివారల కాహార పదార్థములు తక్కువగుటచే వారందఱు భీతినొంద సాగిరి. అట్లయ్యును రెండుమూడు దినములవరకు మ్లేచ్చులు పరాక్రమముతోడనే పోరుచుండిరి. ఎట్లును బయటివస్తువులు లోపలికివచ్చు మార్గము లేనందున దమ కపజయము గలుగుననియే కుతుబుద్దీన్ దలవయుండెను. మఱిరెండు దినములకు రణసంరంభము వలనను క్షుద్బాధవలనను సైన్యములో మూడు వంతులు నష్టమయ్యెను. ఆ సమయమందే రాజపురుషుండొకడు మరికొంత సేనతో నార్యులకుఁ దోడ్పడవచ్చి హెచ్చరికఁ గలుగజేసెను. రాజదర్శనమువల్ల నుప్పొంగి యార్యసేనాగరము విజృంభించి పనిజేయసాగెను. ఎట్టకేలకు దక్షిణమందలివారు ద్వారమును నాశనముజేసి లోపలబ్రవేశించి మ్లేచ్ఛుల ధ్వంసము జేయజొచ్చిరి. తనవారంద రిట్లు మృతినొందుచుండుట వీక్షించి యిక నాలస్యమొనరించిన ప్రాణాపాయము గలుగునని కుతుబుద్దీన్ శత్రువుల కంటబడకుండఁ దప్పించుకొని పరువెత్తెను. హెచ్చరిక గలుగజేయువారు కానరానందున మ్లేచ్చులును జెల్లాచెదరై యిష్టమువచ్చినట్లు పరువెత్తసాగిరి. కొందఱు కంచెలం బడి మడసిరి. మఱికొందఱు బయటికేతెంచి యట కాచుకొని యున్న ఆర్యుల వాతఁబడి చచ్చిరి. కొంత సేపగునప్పటికి శతుసైన్యము నాశనమై యెదిరించువారు లేకపోవుటచే యుద్దమాపుదల చేయబడెను. మూడువేల మహమ్మదీయ భటులు ఖైదీలుగఁ బట్టుకొనబడిరి. శత్రువుల తుపాకులు, నాయుధములు, దక్కిన యుద్ధసామగ్రులన్నియు నార్యుల పాలఁబడెను. ఇట్టి మహా విజయముతో నా జయచంద్రుఁడు తన సైన్యముం గూడుకొని నిజరాజధానికిఁ బయనమైపోయెను.