రాణీ సంయుక్త/ఏడవ ప్రకరణము

వికీసోర్స్ నుండి

ఏడవ ప్రకరణము

పూర్వకాలమున నార్యావర్తమునందు ఢిల్లీనగరము తరువాత నంత ప్రసిద్ధికెక్కిన పట్టణము గన్యాకుబ్జనగరము. దీనినే యిప్పుడు "కనూజ్" యని వాడుచున్నారు. పండ్రెండవ శతాబ్దమునననగా మనచరిత్రకాలమున జయచంద్రుడనురాజు దానిఁ బాలించుచుండెను. ఇతడు సద్గుణవంతుడే కాని యొక్క దుర్గుణము మాత్రము కలిగియుండెను. ఆదుర్గుణమేదన దనప్రాణము మీదికి వచ్చుచున్నను లెక్కగొనక ముందువెన్క లరయక మంచిచెడ్డల విచారింపక తాబట్టిన మూర్ఖపు బట్టును నెగ్గించు కొనుట. అనేక సద్గుణగణ చంద్రతారావిరాజితుడయ్యు మౌర్ఖ్యమను ఘోరజీమూతసంఛన్నుండై మనదేశము నన్యులపాలబడ వైచిన దీమహాత్ముడే. ఇతడు రాజ్యముసేయు కాలమున డిల్లీని దీపసింహుని వంశస్థుడగు జీవనసింహుడు పరిపాలించుచుండెను. జయచంద్ర జీవనసింహులిరువురు మైత్రిగలిగియుండి పరదేశములవారి నార్యావర్తము ద్రొక్కకుండ జేయుచువచ్చిరి. ఇటులుండ జీవనసింహుడు కారణములేకయే తన సేననంతయు హిమాలయా ప్రాంతములకనుప చౌహాణవైరాట్ వంశస్థుడగు పృథ్వీరాజు తన సేనతో నాకస్మికముగ డిల్లీపై దండెత్తి యారాజును నోడించి రాజ్యమును తనవశము చేసుకొనెను. ఈసంగతి జయచంద్రుడు తెలుసుకొని తన మిత్రుని జంపెననియు సామంతు డగువాడు చక్రవర్తి యయ్యెననియుఁ బృథివీరాజుపై గోపము నసూయనుబూని నాటినుండియు నతని చక్రవర్తిపదభ్రష్టుని జేయ గనుపెట్టుకొనియుండెను. చదువరులారా! మన యార్యావర్త మన్యులపాలగుట కివిరోధమే కారణము. మనదేశమున బాల్య వివాహములు సహగమనములు మొదలగునవి ప్రబలుట కీజయచంద్రుని మూర్ఖత్వమే కారణము. వేయేల? మనకుగల స్వాతంత్ర్యముల నన్నిటి నేటగలిపి యిట్టి యస్వాతంత్ర్యపు బ్రతుకు గలుగ జేసినదీ జయచంద్రునిఁ బట్టిన యసూయయే. పృధ్వీరాజుపై విరోధము నీర్ష్యయు వహింపక తనమూర్ఖపుబట్టును మానియుండిన యెడల మనమిట్టి దురవస్థకు వచ్చి యుండము. పూజనీయమై మునిజన నేవ్యమానమై విదేశీయ గణ్యమై ధనధాన్యరాసుల కాగారమై మహోన్నత పదవి యందుండిన నీయార్యావర్తము భ్రష్టముగావించి వదలిన మూడుడీ జయచంద్రుడేయని నొక్కి వక్కాణింపనగుమ. పై ప్రకరణమున సాధోపరి తలంబున విహరించి గృహారామమున కేగఁదలచిన కన్యక యీ జయచంద్రుని కూతురు. ఈమెయే మన కథానాయిక యగు “సంయుక్త" అట్లిరువురు, కన్నియలు గృహారామమున కేగ వెడలి యంతస్థునుండి సంయుక్త శయనమందిరములోనికి దిగిరి. ఈ గది విశాలమై చదరముగ నుండెను. ఆ భాగమునఁ దెల్ల పట్టుతానులతో చాందినీ యమర్పబడి యుండెను. క్రింద దలవరుసగ స్థాపించబడిన పటికంపురాలపై ముఖ్మల్‌మెత్త పరుపబడి యుండెను. చాందినీకి మూరెడు క్రిందుగ జిత్ర విచిత్రములగు గులోబులు, పెద్ద పెద్ద పాదరసపుబుడ్లు, మెఱపు దీపములుంచుట కనువగు నద్దపు గిన్నెలు వ్రేలాడుచుండెను. గోడలలోపలి భాగమంతయు నిర్మలనుగు నద్దముల కూర్పు గలిగి యుండెను. ఇవిగాక నానాదేశముల చిత్రపటముల నక్కడక్కడ వ్రేలాడ దీసియుంచిరి. మెత్తపై స్వదేశ పరదేశ నిర్మితములగు చలువరాల కుర్చీలు వట్రువబల్లలు, సోఫాలనేకములు అలంకరింపబడియుండెను. మందిరము నడిమి భాగమునఁ దూగు టుయ్యెలలును, వానిమధ్య హంసతూలికా తల్పమును నుండెను . ఈ ప్రాసాదము నాల్గువైపుల విశాలములగు కవాటములు గలిగి యుండెను. కవాటములనుండి బయటికేగ పిట్టగోడలచే నావృతమైన గొప్ప హర్మ్యోపరితలము గన్పించును. అందు బారులుగ దీర్పబడిన పలురకముల పూలచెట్ల తొట్లును వానిమధ్య భాగమున దీవెలతో దట్టముగ నల్లుకొనిపోయి లతాగృహమువలె నుండు చలువ పందిరియుఁ జూపరుల కాహ్లాదము గొలుపు చుండును. వారిరువురు గొంతవడి చలువ పందిరి వద్దఁ దిరిగి యక్కడనుండి క్రింది యంతస్థునకు దిగసాగిరి. ఈ క్రింది నికేతనము సంయుక్త ధరించునట్టి యమూల్యములగు వస్త్రాభరణ మందనములు గలిగి పై ప్రాసాదమున కెంతమాత్రము దీసిపోవకుండెను. అందుఁబ్రవేశింపకయే వారిద్దఱు దానికింది యంతస్థునకు దిగనారంభించిరి. ఇది సంయుక్త దేహపరిశ్రమఁ జేయునట్టిగది. ఎల్లప్పుడు ధరించునట్టి వస్త్రములుగాక యస్త్రవిద్య నలవరచుకొను తరి బ్రత్యేకముగ దాల్చునట్టి యుడుపు లనేకము లక్కడక్కడ వ్రేలాడు చుండెను. గోడలకొక వైపునఁ దళతళలాడు గత్తులును మఱియొక వైపున బందూకులు మొదలగునవి తగిలించి యుంచిరి. మొదట బేర్కొన్న ప్రాసాదమునకుంబలె దీని ముందు నొక విశాలమగు బహిరంగ ప్రదేశము గలదు. సంయుక్త దన చెలితో నందుఁ బ్రవేశించి వయ్యాళికేగునప్పుడు మామూలుగ ధరించునట్టి చేతికత్తినొక దానిఁగైకొని క్రింద యంతస్థునకు దిగసాగెను. ఈ క్రింది యంతస్థు సంయుక్త విద్యాభ్యాస మొనరించుకొను హర్మ్యము, వరుసలుగ దీర్పబడి బీరువాలు లెక్కింపనలవికాని గ్రంథరాజములఁ గూడుకొని యుండెను. సంయుక్త పుస్తకాగారముఁ బ్రవేశింపకయే దాని క్రింది యంతస్థునకు దిగి యట నిద్రాపరవశలై యున్న దాసీనికరంబుల కెఱుకరాకుండ మెల్లన నడుగు లిడుచు గ్రిందికిదిగి యటనుండి తోటలోనికిఁ బోవు తలుపు దెఱచుకొని వనములోని కేగి విరియఁబూచిన వెన్నెలలో మఱింత మనోహరములుగ నున్న బొండుమల్లియల విలా  నంబున కానందమందుచు నటకుఁ గొంచెము దూరముననున్న మాధవీలతా మంటపములోని కేగి యక్కడ నుండి వెడలి యుత్తరపు దిశనున్న లవలీలతో మంటపము బ్రవేశించి యా చేరువనున్న కప్పురంపు దిన్నెల యామోదమున కామోద మందుచు పిమ్మట బ్రాగ్దిశయందలి నవమల్లికా లతామంటపము జేరి యా ప్రాంతములనున్న సంపెంగ వనమునుండి వచ్చు కమ్మతావులకు సమ్ముదమంది యావలఁగడచి చలువరాలచే నిర్మింపబడి నిండు వెన్నెలలో నిగనిగలాడుచున్న కేళాకూళింజేరి జలయంత్రముల విడువ నించుకసేపటికి నీరునిండి వెల్లువయై పార దొడగెను . కొంతతడవు దానిగట్టుపై గూరుచుండి మృగములున్న వైపునకేగఁ దరలిరి. ఈ మృగశాల తోటయం దుత్తరమున నున్నది. తూర్పువైపు గోడనుండి పడమటికడ్డముగ వలయొకటి గట్టఁబడి యుండును. వలదాటి లోపలికిఁబోవ వరుసలుదీరియున్న శాలలనేకములు కాన్పించును. అందు మొదటి వరుసయందు సింహవ్యాఘ్రాది జంతువులును, రెండవవరుసయందు బలురకముల కోతిజాతులును, వాటికావల నానావిధ పక్షులును, తదనంతర మనేక సర్పజాతులును వేరువేరు శాలలయందుంచబడి యుండెను. ఇందు బ్రతిశాల కెదుట నంతఃపురస్త్రీలు గూరుచుండి జంతువుల చేష్టలు వీక్షించుటకై మంటపములు కట్టబడియున్నవి. ప్రతిమంటపములో దూగుటుయ్యెలలు, సోఫొలమర్పబడి యుండెను. తోటయందన్ని భాగములను మంటపములందును జంద్రకాంతులఁ గ్రిందుపఱుప జాలు విద్యుద్దీపములు పెట్టుటకనువగు సన్నని గొట్టము లడు గడుగున బెట్టబడియున్నవి. వెన్నెల దినములలో మంటపము లందలి దీపముల మాత్రమే వెలిగించుచుందురు. మఱియు నా యావరణమందు నాలుగువైపుల స్ఫటికశిలా వినిర్మితములగు కేళాకూళులు గలవు. ఇవి చిన్న చిన్న సోపానముల నొప్పి పూలవృక్షముల తొట్లచే గడు మనోహరముగ నుండును. ఈ నాల్గింటిలోపల దూర్పుపక్క నున్నది దట్టముగ దీగేలతో నల్లుకొని మనుష్యులు దాగియున్నను నగుపడకుండ జేయుచుండును. అట్టి యావరణమం దా యిరువురు గన్నియలు ప్రవేశించి మొదటిశాలల వరుసదాటి రెండవ శ్రేణియందలి కోతుల చేష్టల దర్శింపఁగోరి యొక మండపమునజేరి యొక సోఫాపై నాసీనులై వాటితోఁ జమత్కారముగ ముచ్చటించుచు నాడుకొనుచుండిరి. ఆ తరుణమున దీర్ఘ కాయుండగు నల్లని మానవుడొకడు పుట్టి గోచిని బెట్టుకొని శరీరమునిండ యాముదము కారుచుండఁ దీక్షణమగు మూరెడుపొడుగు గుదియ నొకదానిని చేతబట్టుకొని చూచువారలకు బ్రత్యక్ష యముఁడోయను భయము గలిగించుచు దూరుపు ప్రక్కనున్న కేళాకూళి మాటునకేగెను. తన యాకార వేషములతోఁ దులదూగగల మఱియొకని నటఁ గలసికొని యా మనుజుఁ డిట్లు మాటలాడసాగెను.

మొదటివాడు : అరే! వచ్చినటున్న దే ?

ద్వితీయుడు : ఆ: ఇన్ని దినములకు మన కష్టము లీడేరు సమయము వచ్చినది. ప్రధముడు : అందులో నవతె రాజుకూతురు?

ద్వితీయుడు : అదియేమో నాకు తెలియదు.

ప్రధ : మఱేమి చేయుదము?

ద్వితీ : వారి మాటలవలనఁ గనుగొందము. నీ వించుక తాళియుండుము.

అనవాఁడేమియుఁ బలుకక నిలచియుండెను. అత్తరి సంయుక్త వదన మించుక వాడియుండుట దీపముల వెలుతురున గనుగొని మంజరి యిట్లనియె.

మంజరి : నెచ్చెలీ ! ఇప్పటికి రెండు గంటలు కావచ్చినవి. నీ కింకను నిద్రవచ్చుటలేదా ? నిద్రలేమి దేహమున "కెట్టి యనారోగ్యము కలుగునో యెఱుగవా? సకలమెఱిగిన విద్యావతివి. రాకొమారితవు నీవే యిట్లొనరించుచున్న నిఁక మా బోంట్లకు బుద్దులు గఱపువారెవరు ?

అన నదివరకె కొంచెము నిద్రవచ్చుచుండుట వలన మబ్బుమాటలతో సంయుక్త " చెలీ ! ఈ దినమున నాకేమో యారాటముగ నున్నదే. నా కోర్కె నెరవేర్చుదునని వచించి పోయిన నా గురువుగారి వార్త యించుకైనఁ దెలియలేదుగదా? అందుచే మఱింత పరితాపము కలుగుచున్నద"ని వచింపుచు నట్లే సోఫాపై బరుండి నిదురవోయేను. మంజరియు వనవిహారముచే బడలిక జెంది నిద్రించిన సంయుక్త నప్పుడే మేల్కొలు పుట కిచ్చగింపక యొక గడియవెనుక మేల్కొ ల్పెదనని యనుకొనుచు నట్లే తానును నిదుర వోయెను. ఇక్కడ వీరిట్లు నిద్రించుట గాంచి దాగియున్న యిరువురు నిశ్శబ్దముగ నీ మంటపములోని కేతెంచి వారల మాటలవలన రాకుమారికం గుర్తిడుకొని యుండిరిగాన నామె పరుండియున్న సోఫానెత్తుకొని తా మదివఱకె తెఱచియుంచుకొన్న ద్వారములదాటి తమ దారిం బోయిరి.