రాజగోపాలవిలాసము/ప్రథమాశ్వాసము

వికీసోర్స్ నుండి

శ్రీరస్తు

శ్రీరాజగోపాలవిలాసము

అవతారిక - ఇష్టదేవతాస్తుతి

శ్రీలలితాంగియున్ ధరయుఁ జెంగటనే మెలఁగంగ నున్న గో
పాలుఁడ నన్నమాటకు నపారధనంబు లొసంగి రాజగో
పాలుని చేసె నీతఁ డని భావము లోపల నుబ్బు శౌరి హే
రాలపుభాగ్యముల్ విజయరాఘవశౌరికి నిచ్చుఁగావుతన్.

1


మ.

సొలపుంజూపుల నద్రికన్యక జటాజూటంబు వీక్షింపఁగా
బెళుకుం బేడిస లభ్రగంగఁ గని సాభిప్రాయలై పల్కు నె
చ్చెలులంగన్గొని మోమువంచు సతిఁ దా శృంగారభావంబులన్
వలగో నవ్వుచుఁ జూచు శంభుఁడు కృతిస్వామిం గృపం బ్రోవుతన్.

2


ఉ.

గందపుఁబూఁత రీతి పతి కంఠమునంగల కందుమాన్పెఁ దాఁ
గందలితాత్మకీర్తిరుచికందలిచే రఘునాథభూమిభృన్నం
దనుఁ డంచు నెంచి గిరినందన డెందమునందుఁ జాల నా
నందముఁ జెంది యట్టికృతినాయకు కీర్తులు బ్రోదిసేయుతన్.

3


మ.

చతురంభోధిపరీతభూవలయవాస్తవ్యావనీదేవతా
తతు లభ్యంజనభోజనాదులను మోదంబందఁగా బ్రహ్మసం
తతిఁ బాలించు నృపాలుఁ డీతఁడని నిత్యప్రీతుఁడై బ్రహ్మ మ
త్కుృతినాథున్ విభవాయురున్నతుల సత్కీర్తుల్ దగం బ్రోవుతన్.

4

ఉ.

ఒక్కొకవిద్యచే జగతి నొక్కఁడు రూఢివహించు టబ్బురం
బెక్కుడువిద్య లన్నియను నీతఁడె నేర్చి మదీయకీర్తులన్
దిక్కులనింపె నంచును మది న్ముదమందుచు స్వప్నలబ్ధయై
ముక్కువఁజేరు వాణి నృపమన్మథు మత్ కృతినాథుఁ బ్రోవుతన్.

5


ఉ.

అందనువందు క్రొమ్మెఱుగుటందమునం జరియింప నిందిరా
మందిర మంచు మించు నభిమానగృహం బొనరించి లౌల్యమున్
జెందకయుండఁ దావుకొనఁ జేసెను నన్నని లక్ష్మి సంపదల్
గ్రందు కొనంగ మా విజయరాఘవ శౌరినిఁ బ్రోచుఁగావుతన్.

6


చ.

ప్రణతుల కెల్ల విఘ్నములు బాయఁగఁ జేయుట మేలుఁ
గూర్చుటల్
గణన మొనర్చు నేర్చునను గల్ల మదాళులు మాటిమాటికిన్
రణసము సేయవించుఁ జతురత్వమునం దలయూఁచి మెచ్చునా
గణపతి యిచ్చుగాత కృతికర్త కశేషవిశేషవిద్యలన్.

7

సుకవిస్తుతి

ఆ.

అమరతటినిఁ దెచ్చు నల భగీరథు రీతిఁ
గవిత యవనియందు గలుగఁ జేయు
వామలూరు తనయు వర్ణించి మదిలోన
వ్యాసుఁ గాళిదాసు భానుఁ దలతు.

8


క.

నన్నన దిక్కన నెఱ్ఱన
సన్నుతిఁ గావించి వారి జాడల మెలఁగే
యన్నల శ్రీనాథాదుల
మన్ననతోఁ దలఁతు లోకమాన్యుల నెపుడున్.

9

కుకవినింద

క.

అందము చందము నెఱుఁగక
యందతుకులరచన సేసి యందుకె మది నా
నందముఁ జెందెడు కుకవులు
నిందార్హులు గాక వర్ణనీయు లే సభలన్?

10


వ.

అని యిష్ట దేవతావందనంబును సుకవిగుణానందనం
బును గుకవినిందనంబును గావించి యున్న సమయంబున.

11


సీ.

కర్ణాటజయరమాకంఠసూత్రమునకు
                 మంగళం బేమహామహుని శౌర్య
మాసేతుశీతాచలాంతరాంతర్వాణి
                 గణనీయ మేరాజు గుణగణంబు
విశ్వాసభాగ్విశ్వవిశ్వంభరాధీశ
                 పాలనం బేమహీపాలువశము
నిఖలకార్యాకార్యనర్ణయసరణికి
                 మనునీతు లేమేటిమాట నేర్పు


గీ.

లతఁడు హరిదంతదంతావళాతితరళ
కర్ణచామరబిరుదవిఖ్యాతసౌమ్య
కీర్తినర్తననుతిపరక్షితివరుండు
గరిమఁ జెలువొందు విజయరాఘవవిభుండు.

12


వ,

ఒక్కనాఁడు మక్కువమీఱ నంతఃపురాంతరనిరం
తరశుభవిభవాచరణనిపుణరమారమణీరమణీయతప
నీయ మలకర్ణి కాయమానంబును, విశృంఖలకనకశృంఖా
లాందోలితడోలికాచిరత్నరత్ననిర్యక్షనిర్యద్విభావిభా

వనీయబాలాతపాలోకనకౌతుకాలోలసవిధకాసారతీర
రంగద్రథాంగసంఘంబును, వలమానమలయపవమాన
కంపితసవిధవివిధశాఖశాఖాశిఖాగ్రజాగ్రత్కుసుమ
సముదయసముదయత్సౌరభలోభపరిభ్రమత్భ్రమర
ఝంకారానుకారిగాయనీగానతానమానమానితంబును,
కాంతనిశాకాంతకాంతజాలకాంతరాంతరనిరంత
రాగరుధూపధూమస్తోమవారిధరవారిధారాసారసం
దోహసందేహావహసుమనివహకాయమానవితాయ
మానపరిమళఝరీమిళదవిరళగళన్మధురసమధురరస
కణగణమ్ములవలన, తదీయపనితస్తనితభ్రమవిభ్రమావ
హోత్తాళతాళపరిజ్ఞానచాతుర్యధుర్యచంచలలోచనా
కరాంచలవాద్యమానమర్దలీరవసమ్మర్దంబువలన, నగణ్య
నిజలావణ్యకలాకలాపగ్రహణనిపుణగోషాయోషాతి
ప్రబంధసంబంధసమాహృతతదీయాననుకరణీయహృద్య
వంశవాద్యవిద్యావైశారద్యానవద్యచిరత్నరత్నపుత్రికా
వైచిత్రివలన, దేదీప్యమానమానవీయకనకారవిందబృంద
సక్తముక్తాహంససంసదంసలక్రేంకారశంకాకరణచణ
హరిణలోచనాచరణకణన్మంజుమంజీరపుంజశింజితమ్మువ
లన, తదంతర ప్రశంస్యలాస్యచికీర్షాహర్షాతిలోలలోలే
క్షణాప్రకర్షప్రసవవర్షకరణబహూకరణవిద్యాధర
విద్యాధరవారాంగనావారిమోహావహకుసుమవర్షిత
మాలాధరయంత్రయంత్రితకాంచనపాంచాలికాప్రపం
చంబువలన, పార్క్వభాగభాగాతిరమణీయతపనీయప్రతి
మాప్రతిమానకరకరరాజనమరకతభాజనదేదీప్య
మానమాణిక్యదీపశిఖాముఖానుషజ్యమానకజ్జలీరేఖాశ్లా

ఘావహమహనీయమహానిలదామదామంబువలన, ప్రతి
స్తంభసముత్తంభితశాతకుంభరంభాసంభారసుఖావనీయ
సుమసముదయసమయసముదయత్పరాగాభోగమనీషా
పోషకనటనానుకూలరంగోత్తరంగవికీర్యమాణకర్పూర
రజఃపూరంబువలన, నిగనిగిని తొగరా చలుపగోడల జా
ఉల జాలుకొను తెలినిగ్గు డాలను తేటనీటిజాలునం గందళిం
చిన పొందమ్ములకు కెందమ్ములకు గమనించ గమకించు
జక్కవకవల యందచందంబుల నరజాఱుపయ్యెదలం బొదలు
గులుకుమిటారి వలిగబ్బిగుబ్బలచేత బొందుపఱపుచు
రంగారు శృంగారకృత్యములకై మెలంగు నంగనాజనంబు
వలన, నందందు క్రందుకొను మందగమనల కందులేని
నెమ్మొగమ్ముల సోయగమ్ముల వింతగొంత యపలపించిన
యపరాధం బపనయింపఁ దదీయచరణపరిచరణాచరణమ్ము
నకై మగఱాతెగ రానెలవుల నెలకొన్న శశికాంతదర్పణ
ప్రతిబింబంబుల దంభంబునం గాచియున్నశశిబింబంబులతోటి
సయ్యాటంబున కొయ్యనొయ్యనం దారు తారకలతీరున
మీఱువిన్నాణంపుటాణిముత్తెంబుల రంగారు రంగవల్లికల
వలన, నవనవమ్ములగు మురమురరవమ్ములను బెడిదంపు
టురుముల యురవడిం బరువడి మొలచిన రత్నంపుమొలకల
జాజాలపాలికల పోలికం దనరం దనరు రోహణధరాధర
కంధరంబు పొందుపఱచు పైగోవ కెంపురాచెక్కడంబుల
డంబుల గొప్పటాకులం దీరిన చిత్తరువుల తీరువలకు, తొగ
రుచిగురాకుజొంపమ్మున సొంపులు సంపాదించు దీపకళాప్రతి
బింబతమయూఖరేఖల వలన, కురులు కూఁకటితోడం
గూడియుఁగూడని చిన్నారిపొన్నారిప్రాయంబునం బరులం

దృణప్రాయంబు సేసి పట్టంబు గట్టుకొన్న గట్టితనంబు చూచి
సహింపక మట్టుమీఱిన పాండ్యతుండీరకర్ణాటకరహాబాదు
లం బంపుల నంపి వెంపరలాడించి పెంపుగనిన నిజవిజయాంక
లేఖ్యంబులవలన, వలను గాంచి మించు నాకీర్ణశిశిరపన్నీరంబు
నాలిప్తకుంకుమపంకంబు నాపూర్ణపూర్ణకుంభంబు నాల
క్షితతోరణధోరణికంబు నాబద్ధజంబూనదాంబరంబు
నాలంబితచమరవాలంబు నాసంజితానర్ఘ్యసింహాసంబు
నాపాదితాష్టాపదపాదపీఠంబు నాస్తీర్ణవివిధవర్ణాస్తరణంబు
నాలక్షితశుభలక్షణంబునగు "విజయరాఘవవిలాసం" బను
భవనరాజంబునందు.

13


క.

ధాటీజీతవిమతాహృత
కోటీరమణీవిశేషగుంభితరుచులన్
కోటిరవిచంద్రనిభమగు
హాటకమయసింహపీఠికాంతరమందున్.

14


సీ.

మహనీయనవరత్నమయభూషణద్యుతుల్
                 భూనభోంతరములఁ బొదివి కొనఁగ
కాశ్మీరకస్తూరికాసంకుమదసాంద్ర
                 సౌరభవిభవంబు సందడింప
కటితటాభోగసంఘటితహాటకచిత్ర
                 వససదీప్తులు చుట్టు వలగొనంగ
పాదపీఠోపరిభాగసంపేశిత
                 పాదాంగదప్రభల్ పల్లవింప


గీ.

తారగంభీరరవము లుదారముగను
జతన సామి! పరాకు! హెచ్చరిక" యనుచు

హెగ్గడులు వేత్రములు పూని హెచ్చరింప
నిండుకొలువుండె యా మేదినీవిభుండు.

15


చ.

పడఁతి యొకర్తు గిండి, యొకబాల నిశాకరఫాలకుంచె, పా
వడ యొకవన్నెలాఁడి, యొకవారిరుహాయతనేత్ర వీజనం
బడపము భామ యొక్కతే, యొయారి యొకర్తు మణీకలాచికం
గడక వహించి చేరి సముఖంబునఁ జిత్త మెఱింగి కొల్వఁగన్.

16


గీ.

రత్నకంకణఘలఘలారవము గ్రమ్మఁ
గొమరుప్రాయంపు గొమ్మలు కుందనంపు
బొమ్మ లెలవంక బలవంక బొదివి చెంత
చామరంబులు వీవంగ సరసలీల.

17

శారదాధ్వజవర్ణన

సీ.

ఒక్కొక్కయెడఁ జీనిచక్కెరపానకం
                 బానిన ట్లాహ్లాద మావహిల్ల
నొక్కొక్కయెడఁ దావి నెక్కొన విరజాది
                 సరము లెత్తినరీతి పరిమళింప
నొక్కొక్కయెడఁ జల్వ లుప్పతిల్లఁగ మంద
                 మారుతంబులు మించు మహిమ చెలఁగ
నొక్కొక్కయెడ మేనఁ జొక్కు సంపాదించు
                 వెలఁది వెన్నెలతేఁటవిధము మించ


గీ.

కవిత రచియింప విజయరాఘవవిభుండె
నేర్చునని వాణి నర్తించు నేర్పుమీఱ
చామరానిలకందళచలిత మగుచుఁ
దనరుసభయందు నల శారదాధ్వజంబు.

18

సీ.

నవనవోల్లేఖననవనయోగ్యము గాని
                 పద్యంబు జనులకు హృద్యమగునె?
ఘనతరాలంకారకారణంబులు గాని
                 వాక్యవైఖరుల నెవ్వారు వినరు
శేషభాషితవాగ్విశేషాన్వితము గాని
                 పదము విద్వత్ప్రేమపదము గాదు
ఘనసారసారంబు గాని సందర్భంబు
                 లర్భకులైనను నాదరింప


గీ.

రంచు వివరించు చలచామరాంచదనిల
చలితచేలాంచలాగ్రహస్తంబుచేత
విజయరాఘవ మేదినీవిభుని సభను
తనదు మహిమంబుచే శారదాధ్వజంబు.

19

కైవారము

మ.

కలమంద్రోదితరత్నకంకణఝణత్కారంబు తోరంబుగాఁ
దలిరుందీవెలు చంచలించుగతి హస్తన్యాసముల్ మీఱఁగా
లలనల్ ‘పాండ్యనృపాలమండలవిభాళా!” యంచుఁ గైవారముల్
వలనొప్పన్ రచియించి రంత నుచితవ్యాపారపారీణతన్.

20

సభానాట్యవర్ణన

గీ

భరతసంగీతసాహితీప్రముఖవిద్య
లాకృతులు గన్నచందాన నబ్జముఖులు
సరసముక్తాతపత్రచామరము లలర
వివిధబిరుదాంకవాద్యముల్ వెలయనిల్వ.

21

సీ.

తీగెమెఱుంగులతీరున నిరుగడ
                 వరుస బంగారుపావడలు మెఱయ
పఱుపుగా వలగొన్న భానుమండలముల
                 హరువున నపరంజిహరిగె లమర
మొగిలుమొత్తంబులు మోహరించినరీతిఁ
                 బ్రమ్ము సాంబ్రాణిధూపమ్ము లలర
విద్యావిశేషముల్ వేఱ్వేఱ వివరించు
                 హవణికబిరుదవాద్యములు మొరయ


గీ.

వీరవేంకటరాయ పృథ్వీమహేంద్ర
దత్త బహువిధబిరుదముల్ దనరుచుండ
సముఖమున నిల్చి యాముద్దు 'చంద్రరేఖ'
వివిధవిద్యలు వినిపించె వింతయనఁగ.

22


సీ.

చౌపదకేలిక 'రూపవతీ'కాంత
                 శబ్దచూడామణి 'చంపకాఖ్య'
చెలువగు జక్కణి చెలువ 'మూర్తివధూటి'
                 కొరవు 'కోమలవల్లి' గురునితంబ
నవపదంబులు 'లోకనాయికా' లోలాక్షి
                 యలదేశి 'శశిరేఖి' కాబ్జనయన
దరుపదంబులు 'రత్నగిరి' నితంబినియును
                 పేరణి విధము 'భాగీరథి' యును


గీ.

మదనపదదూత్యనవరత్నమాలికాది
బహువిధాలక్ష్యనాట్యప్రపంచమెల్ల
ఘనత విలసిల్ల తక్కినకాంతలెల్ల
నభినయించిరి తనునేర్పు లతిశయిల్ల.

23

సీ.

వీణ వాయించెను శోణాధర యొకర్తె
                 కిన్నరఁ బలికించెను కన్నె యొకతె
చపలలోచన యోర్తు ద్విపదలు చదివెను
                 తత్ప్రసంగము చేసె తమణి యోర్తు
ముఖవీణచే నొక్కముదిత రాగము చేసె
                 కొమ్మ యొక్కతె పిల్లఁగ్రోవి యూఁదె
తంబురా మొరయించె ధవళాక్షి యొక్కర్తె
                 స్వరమండలము మీటె సఖి యొకర్తు


గీ.

యక్షగానంబు రావణహస్త ముడుకు
దండెమీటులు చెంగులు తాళములును
జోల సువ్వాల ధవళంబు లేల లమర
కొంద ఱతివలు వినిపించి రందముగను.

24


శా.

విద్యామూర్తిమ లాగులెత్తువిధముల్ విద్యాధరు ల్మెచ్చఁగా
విద్యుద్వల్లులు మింటనుండి విని యుర్విన్ డిగ్గి మేలైన యా
విద్యల్ తామును నభ్యసింప రమణీవేషంబుం బూనె నా
వాద్యంబుల్ మొఱయంగఁ దక్కినసతుల్ వర్తిల్లి రాలాగునన్.

25


గీ.

దండె మీటుచు భళిగాణ దండి యనఁగ
నొదుగు గమకంబు రక్తియుఁ బొదివికొనఁగ
స్థాయి రాగప్రబంధముల్ ఠాయములును
గీతముం బాడె నొకరాజకీరవాణి.

26


సీ.

ప్రస్తారసంఖ్యను పదుమూఁడు కోటులు
                 నలువదిరెండు లక్షలు పదేడు
వేలు నేళ్నూఱును వింశతియును నాఱు
                 వృత్తంబులందు నీవృత్తమునకు

నీవర్ణన సమస్య నీవు గూర్పు మటన్న
                 నావృత్తమున సమస్యను రచించి
యందుకు శ్లోకంబు లాశువుగాఁ జెప్పి
                 యవి తెనుంగునను పద్యములు చేసి


గీ.

ఇరువదాఱును ఛందంబు లెఱిఁగి యిట్లు
కవితఁ జెప్పినవార లీభువినిఁ గలరె?
యనుచు నందఱు వినుతింప ఘనతఁ గాంచె
కీర్తనీయగుణాలంబ 'కృష్ణమాంబ.'

27


గీ.

ఇటుల విద్యలు వినుచు సాహిత్యవిద్య
వినికి సేయఁగ ననుఁ జూచి వేడ్కతోడ
విజయరాఘవ మేదినీవిభుఁడు వల్కె
మధురమధురసమధురసామంబుఫణితి.

28

కవివంశవర్ణనము

సీ.

శ్రీవత్సగోత్రుండు శ్రీకర పాకనా
                 టార్వేల బంధుజనాతీశాయి
కాళియ మంత్రిపుంగవునకు గంగమాం
                 బకు నుదయించు తపఃఫలంబు
రణరంగగంధవారణ బిరుదాంకిత
                 స్వకులజ శ్రీకంఠ సచివమౌళి
పార్వతీపరిణయ ప్రముఖప్రబంధని
                 బంధధురంధరప్రౌఢఫణితి


గీ.

యైన చెంగల్వ వేంకటయ్యయును రావి
నూతల తిరుమలయ్య తనూజ కృష్ణ

మాంబ మును గన్ననిధి కాళహస్తి గిరిశ
కలితలలితోక్తి భారవి కాళసుకవి

29


సీ.

ఘటికాశతగ్రంథఘటనోత్కట నవీన
                 పాండిత్యగరిమలు భళి యనంగ
నోష్ఠ్యనిరోష్ఠ్యాదికోద్దామరసగర్భ
                 సందర్భ మౌనని సన్నుతింప
మాకందమంజరీమధుఝరీమాధుర్య
                 రచనావిశేష మౌరా యనంగ
పరిహృతేతరయుక్తి భాగనూతనకథా
                 చాతుర్యధుర్యత సంస్తుతింప


గీ.

అయ్యదినముల రామభద్రామ్మవారు
నేఁడు కృష్ణాజి కవితల నేర్పు మెఱసి
వినికి సేయుట లెల్ల మీఘనతఁ గాదె
కవివినుతచర్య! చెంగల్వ కాళనార్య!

30


ఉ.

భూనుతకీర్తులైన కవిపుంగవు లందఱు మెచ్చనిచ్చలున్
తేనియసోనలై, కసటు దేఱిన చక్కెరపానకంబు లై
వీనులవిందులై, రసికవేద్యములై యల వాగ్వధూటికిన్
గానుకలయ్యె జెంగలువ కాళకవీ! భవదీయకావ్యముల్.

31


మ.

పదియార్వన్నె పసిండికిన్ వలపు పైపైఁ జెందుచందంబునన్
చదురుల్ మీఱు భవత్ప్రబంధ మిల నిచ్చల్ దక్షిణద్వారకా
సదనాస్థానకథానుషంగములచే సంభావ్యమై మించే నేఁ
డది మా కంకిత మీ వొనర్పుమని యాహ్లాదంబు సంధిల్లఁగన్.

32

అలసహ్యజాతటి నగ్రహారంబులు
                 బహురేఖ మించు నుంబళిక యూళ్లు
బంగారువనుసుల పచ్చలపల్లకి
                 పసిఁడికొమ్ముల కట్లభద్రకరులు
పడివాగె తేజీలు బంగారుకాళాంజి
                 హడపంబు చామరల్ హంసకంబు
తరమైన చౌకట్లు తారహారంబులు
                 నంగుళీయాదిరాజర్హభూష


గీ.

లెలమి నపరంజిహరివాణములును గిండ్లు
పెట్టెలకొలది జాళెలు మట్టుమీఱి
నట్టి మైభోగపుం డచలాత్మ ఘనత
ననుగుణంబుగ దయచేసి యపుడు మఱియు.

33


క.

కేళాకూళుల సజ్జల
కేళీవనములను మించు గృహరాజంబున్
శ్రీ లెసఁగ నొసఁగి లోకులు
మేలని కొనియాడ కరుణ మీఱఁగ నంతన్.

34


గీ.

విందునకుఁ దాము గఱితలు వేడ్క వచ్చి
వరుససొమ్ములు తమయింటివారి కొసఁగి
యాత్మజులకెల్ల చతురంతయానములను
మహితభూషణములు బహుమతులు సేయ.

35


ఉ.

ఎంతటి భాగ్యశాలి యితఁ డెంతటి ధన్యుఁ డటంచు నెంచ శు
ద్ధాంతమునందు పాండ్యవసుధాధిపనందనలాదియైన యా
కాంతలు గొల్వ నన్ను సముఖంబునఁ గన్నులఁ గప్పుకొంచు న
త్యంతబహుకృతుల్ సలుపు నవ్విభువంశము సన్నుతించెదన్.

36

కృతిభర్తవంశము

సీ.

కూటదానవభద్రకుంజరంబుల మించు
                 మదగర్వశాఖల మట్టుపఱప
సంసారనైదాఘసమయాతపంబులు
                 మించి యెల్లెడ విజృంభించకుండ
భజనవైభవలోలసుజనమనోరథ
                 పూర్తికి నతిశయస్ఫూర్తి చూప
వందారు జనులకు వాంఛితంబులు గూర్చి
                 బిరుదంపుచిన్నెర పెరిమ నెఱప


గీ.

సంకుశచ్ఛత్రకలశధ్వజాంకనముల
వెలయ శ్రీహరి పాదారవిందమునను
సకలలోకైకనుతయైన జాహ్నవికిని
సహజ యైనట్టి నాల్గవజాతి దనరు.

37


క.

అందునొక కొంద ఱుదయం
బందిరి వసుధాసుధాంశు లంచితబాహా
కందళితతీవ్రతేజః
కందళదళితారిగర్వఘనశార్వరు లై.

38


ఉ.

వారలలోన కృష్ణజనవల్లభుఁ డెల్లరు మెచ్చ నిచ్చలున్
వారిధిమేఖలావలయవాసవుఁడై విలసిల్లి దీనమం
దారుఁ డటంచు యాచకు లుదారత సన్నుతి సేయ మీఱె నా
మేరువసుంధరాధిపులు మేర లెఱింగి తనున్ భజింపఁగన్.

39


క.

ఆకృష్ణ ధరావరునకు
శ్రీకృష్ణుఁడు తాన యవతరించెనొ యనఁగా

లోకోత్తరనయవినయవి
వేకోత్తరుఁడైన తిమ్మవిభుఁ డదయించెన్.

40


సీ.

తలఁపెల్ల వివరించి దాక్షిణ్య మనుబేమి
                 దుష్టనిగ్రహముల త్రోవ మెలఁగ
వీక్షణంబులు చల్వ వెదఁజల్లఁ గనుటేమి
                 విమతారి వరులపై వేఁడిసూప
మాటలు సత్యంబు మర్మంబు లనుటేమి
                 మానినీవంచనామహిమ మించ
ననవరతంబు దానాధికుఁ డనుటేమి
                 యరులచే ధనము తా నందికొనఁగ


గీ.

నిట్టి (వైచిత్రి తనయందె పుట్ట)గలిగి
యన్నిగుణముల వెన్నుండె యెన్ని చూడ
ననుచు జగమెల్ల గొనియాడ నతిశయిల్లె
ప్రథనజయహారి తిమ్మభూపాలమౌళి.

41


క.

శ్రితజననిధి కాతిమ్మ
క్షితితలనాథునకు ధరకు శ్రీసతి కెనయౌ
నతిచతురకు బయ్యాంబకు
వితరణకల్పకము చెవ్వవిభుఁ డుదయించెన్.

42


సీ.

శ్రీశైలమందునఁ జిరతరంబుగఁ గూర్చె
                 ప్రాకారసోపానపాళి వెలయ
వృద్ధాచలంబున విశ్రుతంబుగ నిల్పె
                 ప్రాసాదమండపగ్రామసమితి

నరుణాచలంబున నలవరించెను మించ
                 గోపురసంఘర్షణాపురములు
గోపర్వతమున నెక్కుడుగాఁగ సవరించె
                 పూజావిశేష మపూర్వ మనఁగఁ


గీ.

నతులమృష్టాన్నదానకన్యాప్రదాన
బహుతటాకనవారామపంక్తు లెలమి
ధరణి వెలయించెఁ దనమహోదారమహిమ
తిమ్మభూపాలు చెవ్వ ధాత్రీవిభుండు.

43


ఉ.

ఆచినచెవ్వయప్రభున కంచితికీర్తికి మూర్తిమాంబకున్
యాచకకల్పకంబు నిఖిలావనిపాలనధర్మమర్మవి
ద్యాచతురాస్యుఁ డచ్యుతధరాధిపుఁ డాత్మజుఁడై జనించెఁ దా
నాచతురార్ణవీవలయితావని భూభూజులెల్లఁ గొల్వఁగన్.

44


సీ.

శ్రీరంగపతికిని సింహాసనంబును
                 బ్రణవమయంబగు పసిఁడిసజ్జ
యష్టమప్రాకార మతులగోపురములు
                 రత్నాంగదకిరీటరాజ మభయ
హస్తమున్ జైత్రరథారోహణోత్సవం
                 బారామములును మృష్టాన్నశాల
లర్చకకోటికి నగ్రహారంబులు
                 వివిధనాట్యములు నైవేద్యములును


గీ.

దాన మర్పించి తత్సన్నిధానమందు
నతులముక్తాతులాపూరుషాదిదాన
వితతిఁ జేసెను జగమెల్ల వినుతి సేయ
చిన్న చెవ్వయ యచ్యుతక్షితివరుండు.

45

సీ.

ప్రాణభయంబునఁ బఱచి తల్లడమంది
                 భోగిరాజకులంబు పుట్టలరయ
దళముగా నొక్కట ధరణీభృతాళుల
                 శరవృష్టు లంతట జడిగొనంగ
మిఱుమిట్లు గొన దృష్ట్లు మిడిచి మన్నీలెల్ల
                 బెదరి చేబారలు పెట్టుచుండ
వలగొని దీధితుల్ వరలంగ దొరలెల్ల
                 నురుమని పిడుగంచు నులికిపడఁగ


గీ.

మెఱపు మెఱచిన చాడ్పున మేలిపసిఁడి
పక్కెరను మించు తేజిపై నెక్కి యేలు
చిన్న చెవ్వయ యచ్యుతక్షితివరుండు
సమరనిశ్శంకుఁడని జనుల్ సన్నుతింప.

46


సీ.

సింగముల్ గలవని చింతఁ జెందఁగ నేల
                 తనుమధ్యముల కోడి తలఁకియుండ
గజములు గలవని కళవళింపఁగ నేల
                 కుచకుంభముల కోడి కొంకుచుండ
చమరముల్ గలవని చలన మందఁగ నేల
                 నెఱివేణులకు నోడి వెఱచియుండ
పాములు గలవని భయముఁ జెందఁగ నేల
                 రోమరాజుల కోడి రోఁజుచుండ


గీ.

నద్రి కృత కాద్రికిని సాటి యనుచుఁ దెలిపి
వెఱపుఁ దీర్తురు తమతమ తెఱవలకును
చిన్న చెవ్వయ యచ్యుతక్షితితలేంద్రు
విజయధాటికిఁ బాఱిన వీరవరులు.

47

క.

ఆ యచ్యుతభూభుజునకు
నాయతశుభకీర్తి మూర్తమాంబకు జితరా
ధేయుఁడు రఘునాథధరా
నాయకుఁ డుదయించె నృపతినాయకమణియై.

48


సీ.

గణయంత్రంబులు బహువిధంబులు గాఁగ
                 సవరించినా రంచు చాలనుబ్బి
నేల యీనినరీతి నిఖిలసైన్యంబులు
                 పౌజు దీర్చెనటన్నఁ బ్రమదమంది
గంధగజంబులు గంధర్వరాజముల్
                 నడచెనటన్న నానందమంది
పాండ్యతుండీరేంద్రపారసీకాధిపు
                 లెదురుకొన్నారన ముదముఁ జెంది


గీ.

వీరలక్ష్మీకరగ్రహవిభ్రమమున
రణము పెండ్లిగ నడచి యౌరా యనంగ
చెలఁగి చూపుల విందులు సేసె నౌర!
నిత్యజయహారి రఘునాథనృపతి శౌరి.

49


సీ.

పాదముల్ దొట్రిలఁ బడిన రాజన్యులు
                 జలమానవుల సొంపు సవదరింపఁ
బఱవఁ జాలక మ్రొగ్గిపడిన మత్తేభముల్
                 కుంభినీధరముల కొమరుచూప
భటుల చేవడి జాఱిపడిన ఖడ్గంబులు
                 బెళుకు వాలుగమీల పెరిమనెఱప
నడవనోపక సోలిపడిన శత్రుస్త్రీలు
                 పవడంపుతీవెలప్రౌఢి మెఱయ

గీ.

సహ్యకన్యక జలరాశి చంద మొందె
పతుల యనుసృతి సతులకు పాడి యనఁగ
నచ్యుతేంద్రుని రఘునాథుఁ డనిని దీర్చి
యరుల పాళెంటు వెంపరలాడునపుడు.

50


సీ.

ఈటెలు సుడివడ నెంచి వ్రీలెనటంచు
                 కదలక యున్నట్టి ఘనత కతన
తురగముల్ గజములు త్రొక్కుత్రొక్కాడంగ
                 నదనని పైఁబడి నట్టివలన
చెదఱెఁ బాళెమటంచు చేరి చారులు దెల్ప
                 విని మెల్లమెల్లనె చనెడు కృపను
మొదలి మన్నీలె పాఱెదురు చూడుఁ డఁటన్న
                 నంటి వెన్నాడిన యట్టిమహిమ


గీ.

పాండ్యతుండీరచేరాంధ్రపతులు బ్రతికి
కాచెనని యెంచి ఘనముగాఁ గాన్కలిచ్చి
యచ్యుతేంద్రుని రఘునాథు ననుదినంబు
సేవ చేయుట లోకప్రసిద్ధి గాదె.

51


సీ.

ఆలానములఁ గట్టినట్టుల యుండెడు
                 వింధ్య సింహళ మదద్విరదములను
వాజిశాలలయందు వరుసగా నున్నట్టి
                 శక సింధు బాహ్లిక సైంధవముల
కోట్లసంఖ్యలకు నెక్కుడు వెలల్ గొన్నట్టి
                 బహురత్నకాంచనాభరణములను
మేదిని నడయాడు మెఱపుఁదీవెలరీతి
                 శృంగారవతులైన యంగనలను

గీ.

విడిచిపాఱుట కాన్క గావించి రనుచుఁ
గాచి విడిచెను పాడిల గాకమున్న
నచ్యుతేంద్రుని రఘునాథు నని నెదిర్చి
జీవములతోడ తమకోట చేరఁగలరె?

52


సీ.

కపురంపుతావులు ఘమ్మనఁ బుక్కిటి
                 వీడెంబు లోకయింత వెలికిఁ గ్రమ్మ
సొగసుగాఁ జుట్టిన సిగబొందులను బొందు
                 పఱచిన యరవిరిసరులు జాఱ
నందంబులౌ కొమ్ముగందంబు పట్టెలు
                 బిగిదప్పి యెడనెడఁ బేటులెత్త
వలివాటు వైచిన తెలిసాలు దుప్పటి
                 చెఱఁగులు నెఱదప్పి చెదఱియుండ


గీ.

నచ్యుతేంద్రుని రఘునాథు నని నెదిర్చి
పోటుగంటున నెత్తుటఁ బొరలుదొరలు
విజయలక్ష్ములు తముఁ బాయు విహమునను
చిగురుఁబాన్పునఁ బొరలెడు చెల్లు గనిరి.

53


స్ర.

ధట్టించెన్ వైరిధాత్రీధవులను రఘునాథక్షమాజాని హాళిన్
మెట్టించెన్ పాళియంబుల్ మెఱసి నరవరుల్ మెచ్చఁగా హెచ్చుధాటిన్
కట్టించెన్ సహ్యకన్యన్ కఠినరిపుశిరఃకాయపాషాణపంక్తిన్
పట్టించెన్ ధర్మదారల్ ప్రతిభటసుభటప్రాణరక్షాపరుండై.

54

గీ.

కృతులు మెచ్చంగఁ దగినసత్కుృతులు ధరకు
హారములనంగఁ దగు నగ్రహారములును
సకలదేవాలయప్రతిష్ఠలును నిఖిల
దానములుఁ జేసి రఘునాథధరణివిభుఁడు

55


గీ.

అట్టి మహిమకు నునికిపట్టయినయట్టి
ఘనున కచ్యుత రఘునాథమనుజపతికి
గరిమ మీఱ గళావతీకమలనయన
రాణఁ గనుపట్టె పట్టపురాణి యగుచు.

56


సీ.

పతిభక్త లతికలఁ బాదుకొల్పెడు పాదు
                 సద్గుణగణముల జన్మభూమి
బహుళసౌభాగ్యసంపదల కొటారంబు
                 ప్రాణేశుకరుణకుఁ బట్టుఁగొమ్మ
సవతులు కొనియాడు సత్కీర్తులకు ఠావు
                 పరిజనంబులపాలి భాగ్యరాశి
యాకారశుభలేఖ లలరెడు విభుఁబట్ల
                 సహజదయాపూరసారసరణి


గీ.

పాణి వారిజపాణి శర్వాణి దక్క
నితరసతులను సవతుగా నెన్నఁదరమె
మహిమ రఘునాథ జననాథ మదనరతికిఁ
జతురమతికిఁ గళావతీసతికి నెందు.

57


పంచచామరము.

కళావిలాసమాన్యలైన గౌళపాండ్యకన్యకల్
కళాచికాకరంకపాదుకల్ ధరించి కొల్వఁగా

కళాకళాకలాపబోధగౌరవాతిధన్యయౌ
కళావతీసతీలలామఁ గాంచె భాగ్యసంపదల్.

58


చ.

లలితపతివ్రతావ్రతకళావతి యైన కళావతీసతీ
కులమణియున్ మహీరమణకుంజరుఁడౌ రఘునాథమేదినీ
తలబలభేదియున్ గని రుదారుని యచ్యుతరామభద్రు దో
ర్బలజయభద్రుఁడౌ విజయరాఘవశౌరిని భాగ్యవైఖరిన్.

59


క.

వారలలో నగ్రజుఁ డసి
ధారాధారాధరాంబుధారలచేతన్
వారించు వైరిభూవర
వారిజదుర్వారగర్వవారము నెపుడున్.

60


మ.

నిలువెల్లం గరుణారసంబు పలుకుల్ నీతిప్రచారోన్నతుల్
తలఁపుల్ ధర్మము పుట్టినిండ్లు నడకల్ దాక్షిణ్యసంకేతముల్
కలరే యచ్యుత రామభద్ర ధరణీకందర్పునిం బోలఁగా
నిలలో భూతభవిష్యదద్యతన భూమీశుల్ విచారించినన్.

61

కృతిభర్త విజయరాఘవనాయకుఁడు

చ.

అతనికి సోదరుండు భువనావనతామరసోదరుండు సం
తతనిజకీర్తిధామసుమదామసువాసితదిక్సువాసినీ
వితతశిరోజచూర్ణరుచివిభ్రమవిభ్రమకృత్ప్రతాపుఁ డ
ప్రతిముఁ డజేయుఁడౌ విజయరాఘవుఁ డీమహి నేలు మేలనన్.

62


సీ.

పరగూఢతంత్రప్రబంధార్ధములు దెల్పు
                 వ్యాఖ్యాన మెవ్వని వచనరచన
నిఖిలశాత్రవభూతనిగ్రహం బొనరించు
                 మంత్రంబు లెవ్వాని మంత్రశక్తి

గంధాంధపరిపంథిగంధేభముల నిల్పు
                 నిగళంబు లెవ్వాని మగతనంబు
ప్రత్యర్థిపార్థివప్రతిమల నాడించు
                 సూత్రంబు లెవ్వాని సూక్ష్మబుద్ధి


గీ.

అతఁడు చెలువొందు విశ్వంభరాతిశాయి
విక్రమక్రమవిద్విషద్వీరకోటి
కుంభినీధరగుంభితకూటకోటి
కఠిననశతకోటి విజయరాఘవకిరీటి.

63


సీ.

గంధసింధురములఁ గవికోటికి నొసంగ
                 దక్కునే యీదిశాదంతులెల్ల?
భాషాధిపతినైనఁ బ్రజ్ఞచే నదలింపఁ
                 దొలఁగక శేషాహి నిలువఁగలదె?
యాఖేటవిహరణం బలవరించెడుపట్లఁ
                 దప్పునే యీకూటదంష్ట్రి యొకటి?
ధైర్యంబు హాటకాహార్యంబు నదలింపఁ
                 గులగులగాకున్నె కులధరములు?


గీ.

వీటి సాపాయమైన ప్రా పేటికనుచు
విజయరాఘవ మేదినీవిభుని మూపు
మహి వరించెను శాశ్వతమహిమ లెంచి
మేలుగలపట్ల కాంతలు మేలుపడరె?

64


సీ.

ప్రబలప్రభావనిర్భరదీప్తిపేరిటి
                 నెఱసంజ యంతట నెఱయుచుండ
కీర్తనీయసమగ్రకీర్తికందళులను
                 తారక లెల్లెడఁ దనరుచుండ

తురగఖురోద్ధూతధూళిపాళిక పేరి
                 గాఢాంధకారంబు గ్రమ్ముచుండ
బహువిధంబుల నేర్పు పరగంగ మెలఁగెడు
                 నసిలతల్ దూతిక లగుచునుండ


గీ.

విజయరాఘవ మేదినీవిభు నెమర్చు
వీరశృంగారు లైనట్టి విమతవరుల
కమర శరదిందుముఖులకు నమరె నౌర!
జారిణీజారసంగమసంభ్రమంబు.

65


సీ.

అవతంసములమీఁది యాస నెన్నటికైన
                 పల్లవంబులు గోరగిల్లవలదు
వేనలిఁ దుఱిమెడు వేడుకనైనను
                 చంపకమ్ముల చాయఁ జనఁగవలదు
తిలకంబు తీరుగాఁ దీర్చు కోరికనైన
                 జేగురుల్ గల దరుల్ చేరవలదు
కయి సేయు ముచ్చటకై పరాకుననైన
                 చుఱుకుఁ గెంపుల కనుల్ చూడవలదు


గీ.

విజయరాఘవవిభు మహావిభవ మిట్టి
మహిమతో నుండ మఱచియు మగువలార!
యపకృతులు సేసి యడవుల నడలఁ జేయ
వలవదను కొంద్రు మలయాద్రివనుల రిపులు.

66


సీ.

కుంభినీధరముల గుహలఁ జేరెదమన్న
                 కొదమసింగంబులు మెదలనీవు
వారాశిలోపల వసతి సేసెదమన్న
                 గండుమీ న్రాయిడి నుండరాదు

మడుఁగులలోపల నడఁగి యుండెదమన్న
                 మకరసంఘమ్ములు మనఁగ నీవు
మేరువు కవ్వల మెలఁగెద మన్నను
                 భానుచంద్రులు వెంటఁబడుదు రెపుడు


గీ.

నతని బిరుదంబు లెల్లెడ నాక్రమించె
నెచటి కేఁగెద మని కాన్క లిచ్చి రిపులు
విజయరాఘవ మేదినీవిభువతంసు
చరణపద్మంబులను జేరి శరణమండ్రు.

67


సీ.

చిలుకపోటున తేనె జిల్లునఁ జిమ్మెడు
                 కమ్మనిఫలము లాఁకటికి నొసఁగి
కప్రంపుటనఁటుల కదిసిన దీర్ఘికా
                 జలములచే దాహశాంతిఁ జేసి
వలిగాడ్పు చిఱుతసోఁకుల చేత నసియాడు
                 చిగురువీవనలచేఁ జెమట లడఁచి
కలువ రాచలువరా సెలవులు నెలకొన
                 నలరుఁబాన్పుల మేనియలఁతఁ దీర్చి


గీ.

తరుల దరులను విమతభూవరుల దాఁచి
కాచు నేరంబువో చుట్టుగట్టు వెఱచి
విజయరాఘవ మేదినీవిభుప్రతాప
మౌఁదలను దాల్చు పద్మరాగాళిపేర.

68


సీ.

గాటంపు సెలయేటికాల్వలు ప్రవహించు
                 నెలవు రేవుల దాఁటి మెలఁగు వెరవు
చీమ దూరఁగ రాని జీర్ణకాననముల
                 సంధిత్రోవలు గట్టి జరుగు వెరవు

చక్కఁజూడఁగ రాని శైలశృంగంబుల
                 పడఁతులవెంబడిఁ బ్రాకు వెరవు
కంపకోట ఘటించు కరణిఁ జుట్టుక యున్న
                 యీరంపు వెడసందు లేఁగు వెరవు


గీ.

మృగయ మును జూపి రక్షించె మీఁదెఱింగి
కాకయుండిన నచట చీకాకు పడమె
యనుచు ననుకొంద్రు సతులతో నద్రివనుల
విజయరాఘవ మేదినీవిభుని రిపులు.

69


సీ.

పర రాజధానుల బయలు గావించెను
                 వాహ్యాళి సవరించు వాహములకు
వైరిరాజన్యుల వనదుర్గముల నెల్లఁ
                 గడికొమ్ము గావించి కరటిఘటకు
చతురంబుధిపరీతజగతిఁ బాళెము చేసె
                 కని కొల్చు రిపు మహీకాంతలకును
శత్రుభూనాథుల శలభముల్ గావించె
                 దారుణబాహాప్రతాపశిఖికి


గీ.

జన్యశరణాగతారి రాజన్యకులము
సంచరిష్ణుజయస్తంభసమితిఁ జేసె
విజయరాఘవ మేదినీవిభుకిరీటి
యతిశయం బెన్న శేషాహికైనఁ దరమె?

70


సీ.

ఒకనాఁట నైదాఱు యోజనమ్ముల మేర
                 దాడిగాఁ జనివచ్చు దండితనము
నొకతేజిపైనుండి యొకతేజకిని వేగ
                 లంఘించునటువంటి లాఘవంబు

మావంతు కాల్మీరి మదహస్తి హత్తిన
                 నదలించి యెదిరించు నవఘళంబు
కదిసి సానాకత్తి గదిమి యెంతటివాని
                 మర్మముల్ తాకించు మగతనంబు


గీ.

చూడ మెందును శక సింధు శూరసేన
పాండ్య తుండీర కేరళ ప్రభులయందు
ననుచు దొరలెల్లఁ గొనియాడ ననుచు వేడ్క
విజయరాఘవ మేదినీవిభుఁడు వెలయు.

71

సాహిత్యరాయపెండేరవర్ణన

సీ.

నిర్యత్కవైడూర్యనిర్యత్తరళసూత్ర
                 పుంజంబు చామరస్ఫురణ చూప
పద్మరాగోన్మిషద్బాలాతపంబులు
                 వలిపె చెంగావిపావడలు నెఱప
వలయితమౌక్తికవలమానరుచిసొంపు
                 జగజంపుగోడల సవదరింప
విశ్రుతసింహళద్వీపనీలచ్ఛాయ
                 సామ్రాణిధూపంబు సంఘటింప


గీ.

వినతరాజన్యకోటీరవివిధరత్న
సమితి యీరీతి నుపచారసరణిఁ గూర్ప
విజయరాఘవ మేదనీవిభుని యంఘ్రి
నౌర! సాహిత్యరాయపెండార మమరు.

72

సీ.

మూర్ధముహుముహుర్ముకుళితాంజలిపుట
                 మూర్థాభిషిక్తసమూహ మలర
కటకటాహతటాంతగళితదానసుగంధి
                 గంధాంధసింధురఘటలు చెలఁగ
గంధవాహనగంధగతి విశేషోన్మేష
                 రాజదాజానేయరాజి దనర
పరవీరసప్తాంగహరణవేళావాప్త
                 బిరుదసంఘమ్ములు మురువు మించ


గీ.

తనదు మణులందు ప్రతిబింబదంభమునను
నిండుగొలువుండు వైఖరి నెగడుచుండ
విజయరాఘవ మేదినీవిభునియంఘ్రిరి
నౌర! సాహిత్యరాయపెండార మమరు.

73


సీ.

ఫణిరాజబహుముఖఫణితబాణితముల
                 మర్మంబు లాత్మీయమహిమఁబొగడ
తర్కకర్కశవాగ్వితర్కప్రభావంబు
                 నిజశక్తియుక్తి వర్ణింపుచుండ
నవ్యకావ్యవిశేషనాటితోన్మేషంబు
                 స్వకవైభవంబుల సన్నుతింప
లక్షితాలంకారలక్షణస్ఫురణంబు
                 లాత్మచాతుర్యధుర్యత నుతింప


గీ.

మధురమధురసశింజితమంజిమములఁ
దత్తదుచితోపచారముల్ తా నొనర్చి
విజయ రాఘవ మేదినీవిభుని యంఘ్రి
నౌర! సాహిత్యరాయపెండార మమరు.

74

సీ.

మానగ్రహగ్రస్తమహిపాలపాళికి
                 మంత్రవాదంబుల మహిమ మనఁగ
నత్యాహితప్రాప్తి నత్యాదరనృపాల
                 పంక్తికి నభయసంభాష లనఁగ
నిజనదగుణయూథనిరుపమఖ్యాతికి
                 బిరుదవాదమ్ముల పెరిమ మనఁగ
సకలవిద్యామర్మసందేహసరణికి
                 సిద్ధాంతవాక్యప్రసిద్ధి యనఁగ


గీ.

తనరు నాత్మచిరత్నరత్నప్రకర్ష
జాతనాదప్రకర్షంబుచేత మించి
విజయరాఘవ మేదినీవిభుని యంఘ్రి
నౌర! సాహిత్యరాయపెండార మమరు.

75


సీ.

మగరాల నిగరాల మొగపుల నిగనిగ
                 లభిషేకజలముల హవణుఁ గాఁగ
నందంద యందమౌ కుందనంపు మెఱుంగు
                 రంగైన కనకాంబరంబు గాఁగ
గుంపుకా నలజాతి గుజరాతి కెంపుల
                 విడి కుంకుమపుఁబూఁతవిధము గాఁగ
బవిరిగాఁ జెక్కిన బటువు ముత్తెపు డాలు
                 బొండుమల్లియ గుండు దండ గాఁగ


గీ.

నలరఁ గైసేసి యఖిలవిద్యానవద్య
సింహపీఠంబు నెక్కిన చెలువుమీఱ
విజయరాఘవ మేదినీవిభుని యంఘ్రి
నౌర! సాహిత్యరాయపెండార మమరు.

76

సీ.

చేరికొల్చినఁ గల్గు తారహారావళు
                 లనుమాట నిజమె పాండ్యక్షితీంద్ర!
కని కొల్చినను గల్గు కనకకోటీరంబు
                 లనుమాట నిజమె మద్రాధినాథ!
భక్తిఁ గొల్చిన గల్గు బాహుకేయూరంబు
                 లనుమాట నిజమె కొంగావనీశ!
నమ్మి గొల్చినఁ గల్గు నవరత్నకంబులు
                 ననుమాట నిజమె యాంధ్రాధినాథ!


గీ.

అనుచు మును మంత్రు లనుమాట లనువదింతు
రనుదినంబును శింజితవ్యాజమునను
విజయరాఘవ మేదినీవిభుని యంఘ్రి
గండపెండెంపుబొమ్మలై యుండుదొరలు.

77


సీ.

అందె సింగారించ నందిచ్చు నెపమున
                 ధవునిఁ గన్గొనియె మాళవవధూటి
కీలు పొందిక సేసి కీలించు నెపమున
                 భర్తఁ గన్గొనియె నేపాలబాల
పాదపీఠము నిల్పు పనినెపంబునఁ జేరి
                 మగనిఁ గన్గొనియెను మగధకాంత
చరణాంబురుహసేవ సవరించు నెపమున
                 విభుని గన్గొనియె సౌవీరతరుణి


గీ.

ఇట్లు కనుగొని యరికాంత లెలమిఁ జెంది
విజయరాఘవ మేదినీవిభుని యంఘ్రి
బిరుదుపెండెంపుబొమ్మకా ప్రియులఁ గాంచి
వగతు రాత్మల నిట్టూర్పు నిగుడనీక.

78

సీ.

శాలివాహనశకసంవత్సరములు వే
                 యేనూరు నేఁబదియేను వరుస
చనఁగ శ్రీముఖనామసంవత్సరంబున
                 శ్రావణశుద్ధపక్షమున ద్వాద
శిని సౌమ్యవాసరంబున దక్షిణద్వార
                 కను కృష్ణతీర్థమందు నియమమున
స్నానంబు గావించి సంకల్పపూర్వకము
                 గాను షోడశమహాదానములను


గీ.

ఘనత మీఱఁ గళావతీగర్భశుక్తి
మౌక్తికఫలంబు రఘునాథమహిపసుతుఁడు
విజయరాఘవ మేదినీవిభుఁ డొసంగె
వేదవేదాంతవిదులైన విప్రులకును.

79


సీ.

కాశికాపట్టణఘంటాపథంబుల
                 విప్రకోటులవల్ల వినుతిఁ గాంచి
రామేశ్వరస్థలరాజమార్గంబుల
                 బ్రహ్మసంఘము లెన్నఁ బ్రణుతి కెక్కి
ద్వారకాయతపురద్వారసీమలయందు
                 మహిసురల్ నుతియించ రహి వహించి
మధురాపురోత్తమమధ్యవీథులయందు
                 వసుధామరస్తుతి వన్నె మీఱి


గీ.

యలరు నీయన యనివారితాన్నదాన
మహిమ భూతభవిద్భావిమహిమహేంద్ర
ముఖుల కరుదని పొగడ దిఙ్ముఖములందు
ఘనతఁ జెలువొందు విజయరాఘవవిభుండు.

80

షష్ఠ్యంతములు

క.

ఏవంవిధగుణసౌరభ
భావితదిగ్యువతిచికురబంధున కతిసం
భావితబుధబంధున కా
ప్లావితమధురప్రబంధపదబంధునకున్.

81


క.

గంధాంధవిమతసింధుర
గంధప్రతిబంధఘర్మఘనతేజునకున్
బంధురతరామరాంధో
బంధురసాధిక్యవాక్యపదభోజునకున్.

82


క.

కుంభీనసరాట్కౌశల
కుంభీలకవాగ్విహారకోవిదమణికిన్
గుంభితమదజృంభణరిపు
కుంభీద్రస్తంభిశౌర్యగుణమతి సృణికిన్.

83


క.

ధాటీబహుధాటీకన
ఘోటీకోటీకఠోరఖరకుద్దాలో
త్పాటితరిపువక్షునకున్
హాటకగిరిధైర్యధుర్యహర్యక్షునకున్.

84


క.

పక్షాంతచంద్రవదనా
లక్షితరతిపతికి సుకృతలలితాకృతికిన్
దక్షిణభుజభుజగేశ్వర
రక్షితధరణికిని విజయరాఘవమణికిన్.

85


అభ్యుదయపరంపరాభివృద్ధిగా నా యొనర్పంబూనిన రాజ
గోపాలవిలాసంబను మహాప్రబంధంబునకుఁ గథాక్రమం
బెట్టిదనిన:-

86

కథారంభము

క.

నారాయణదివ్యకథా
పారాయణతత్పరుండు పరతత్త్వకళా
పారీణుఁడు శౌనకముని
సారవిచారునకు సూతసంయమి కనియెన్.

87


సీ.

హరికథాసుధ లాని యానంద మందితి
                 నాదేవు వసతిచే నతిశయించు
దక్షిణద్వారకాస్థలమహత్త్వం బిఁక
                 వినిపింపు వీనులవిందు గాఁగ
ననవుఁడు, సూతుఁ డిట్లను “శౌనకమునీంద్ర!
                 భక్తితో మున్న గోప్రళయమౌని
తపము చంపకవనాంతరమున సవరింప
                 హరి సుప్రన్నుఁడై యతఁడు వేఁడ


గీ.

బ్రేమ పదియాఱువేలగోపికలు గొలువ
గరిత లెనమండ్రు ననురాగగరిమఁ జెలఁగ
వివిధశృంగారరచనలు వెలయ నందు
మహిమతో నుండు మన్మథమన్మథుండు.

88


చ.

నెలకొను మించులో? మెలఁగ నేర్చిన రత్నపుఁగీలుబొమ్మలో?
కులుకులు మీఱు మారు సెలగోలలొ? పల్కెడు పూవుదీవెలో?
సొలపులు గన్న వెన్నెలలసోగలొ? నాఁ గనుకన్న ప్రాయపుం
జిలుకలకొల్కు లెల్ల తన చెంతలరా నెఱరాజసంబునన్.

89


శా.

కేళాకూళులచెంత, పుష్పితవనక్రీడానికుంజంబులన్
కేళీసౌధశిరోగృహాగ్రములచక్కిన్, పూర్ణపూగావళీ

పాళీవాసితసాంద్రచంద్రకదళీప్రాంతేందుకాంతస్థలిన్
లీలానిర్జితమన్మథుం డతఁడు హాళిం బెక్కుచందంబులన్.

90


గీ.

తమకమున నింతులెల్లను తమకతమకె
వలచెనని యెంచ నానందవార్థిఁ దేల్చి
యష్టవిధనాయికలలీల లలరఁగోరి
యష్టమహిషుల నలజాడ కనువుపఱచె.

91

స్వీయ రుక్మిణి

సీ.

మలయానిలమ్ములు మలయ ఘుమ్మన గ్రమ్ము
                 తావుల మావుల తావులందు,
పరిణతఫలగుచ్ఛపరిరక్షితంబులై
                 పఱపైన ద్రాక్షచప్పరమునందు
మగరాల నిగరాల మగఁటిమి గనుపించు
                 సరసిజాకరతీరసరణులందు
పొదలెడు గొజ్జంగిపొదరిండ్లపజ్జల
                 చలువరేరారాచచలువలందు


గీ.

నొకరి కొకరికిఁ దెలియక యుండునట్లు
చతుర లైనట్టి యల జలజాతముఖులు
సఖులతోఁ గూడి సరసప్రసంగలీలఁ
గోరికలు నిండఁ దనరాక గోరుచుండ.

92


ఉ.

ఒక్కొకదూతితోడ వినయోక్తులఁ గార్యము కూడునట్లుగా
నొక్కొకదూతితోడ సరసోక్తులఁ గోపముఁ దీరునట్లుగా
నొక్కొకదూతితోడ మధురోక్తుల మర్మము మీఱునట్లుగా
మక్కువతోడ నా యువతి మన్మథ మన్మథుఁ డన్నిరీతులన్.

93

గీ.

వరుసఁ దనరాక రాకేందువదనలకునుఁ
తెలుప నియమించి యొండొరుల్ దెలియకుండ
దూతికల నెల్ల బహుమతితోడ నపుడు
పంచె పంచేషులీలాప్రపంచరతుఁడు.

94


ఉ.

నేరము లెన్ని మున్ను రమణీమణి రుక్మిణి యెంత వేఁడినన్
దీఱని కిన్కతోడ నొకతీరున నున్నదటంచు నెంచి తా
మేరలు దప్పకుండ చెలి మేడకు నీరజనాభుఁ డేఁగి యా
చేరువ పొంచియుండ సరసీరుహలోచన యొంటిపాటునన్.

95


సీ.

పచ్చఱా రాచిల్కపనికోళ్లశిరముల
                 పైఁ బాదుకొన్నట్టి బటువు కెంపు
చెక్కడంబులడంబు చికిలి కంబంబుల
                 తుద నూకు బోదెలం గదిసియున్న
లోనదండెమ్ముల లో మలుచుట్టుఁగాఁ
                 బెనఁగొని మీఁదికిఁ గొనలుసాగి
విప్పుగా చందువచప్పరంబులయందు
                 హరువులు మీఱంగ నల్లికొన్న


గీ.

జాళువా కుందనపుఁదీవెచాలు పూచి
కలయ రాల్చిన యకరులగమి యనంగ
పజపు గల కుంకుమపుఁబూవు పఱపుఁ దనర
చవికటాకున మించు మంచముననుండి.

96


శా.

ఏలా? కొండెము వింటి, ప్రాణవిభుతో నేలా చలంబూనితిన్?
వేళల్ గా వలుగంగ నంచుఁ జెలియల్ వేమారు చాటింపఁగా
నేలా నే విననైతి? నిట్టివెతచే నేలాగు వేగింతు? నిం
కేలీలన్ విభు వేఁడుదాన నని యెంతే వంతఁ జింతింపుచున్.

97

గీ.

చెలులు గనకుండ నేర్పున చెలువవిభునిఁ
జిత్రపటమునఁ గస్తూరిచేత వ్రాసి
గబ్బిగుబ్బలతుదలు సోఁకంగఁ జేర్చి
పలికె నిట్లని తనయభిప్రాయమెల్ల.

98


మ.

'కలలోనైనను నీదు మాటలకు నౌఁగాదంచు మాఱాడుటల్
గలవో? వాడల వాడలం దిరిగి రాఁగా నీకు మెండొడ్డుటల్
గలవో? చూచినవార లందఱు నగంగా నిన్ని విన్నాణముల్
గలవో? మానవతీవిలాసమకరాంకా! యింక నేమందురా?

99


చ.

గఱిగఱి నంట తుంటవిలుకానిశరంబులు నాయురంబునన్
జుఱఁజుఱగాడ నీవు దయఁజూడక యుండుట లిప్పు డక్కటా!
చెఱుకునఁ బండు పండిన భుజింపఁ దలంపమి గాక ప్రాయపుం
దెఱలతోడ దాన్ని తరితీపులు చేసినవారిఁ గంటిమే?

100


చ.

వలఁగొను చింతతోడ నెలవంకఁ గనుంగొని యేఁ దలంకఁగాఁ
గలఁగకు మంచు మున్న బిగిఁగౌఁగిటఁ జేర్పుదు విప్పు డక్కటా!
కులుకుమెఱుంగుగబ్బివలిగుబ్బలపై నెలవంక లుంచి యేఁ
దలఁకుచు నుండ నీవు దయఁదప్పిన నేగతిఁ దాళనేర్తురా?

101


సీ.

ఏలాగు విహరింతు లీలాసరఃప్రాంత
                 కాంతనిశాకాంతకాంతసరణి?
నేలాగు సైరింతు నేలాతిసౌరభ
                 భ్రమజాతివిభ్రమభ్రమరగీతి?
నేలాగు వసియింతు నీలాశ్మకృతవేశ్మ
                                  జాలశీతలమరుజ్జాలకముల?
నేలాగు చెవిఁ జేర్తు లోలామ్రదళవలత్
                 కలకంఠకులకంఠకలరవంబు?

గీ.

నెటులఁ గనుఁగొందు నకట! పూర్ణేందుబింబ
సౌధరసపూరపరిధౌతసౌధయూథ
టంకముఖకౢప్తచిత్రవిటంకనీడ
చంచచాంచల్యవచ్చలచ్చంచువిహృతి.

102


మ.

కులుకుంజన్నులమీఁది హారములు చిక్కుల్ దీర్చు నందంబునన్
గిలిగింతల్ గొన వాఁడిగోరుమొనలన్ గీలించి లాలించి పై
వలఫుల్ ఱేఁచి మనంబులం గరఁచి చేవల్ మీట లోనైనయా
తలిరుంబోఁడులపట్ల నిన్ని వలవంతల్ చెల్లునా? వల్లభా!

103


చ.

చెలువుఁడ! నీవు నాఁ డచట చెక్కులపై కొనఁగోరఁ గస్తురిన్
వలపున మన్మథాంకములు వ్రాయుచు నేర్పున నాటనూఁదినన్
చెలులు కనుంగొనంగ జడచే నిను కొట్టిన యిట్టినేరముల్
తలపున నిల్ప నీవు దయఁదప్పిన నిప్పుడు తాళ నేర్తునే?

104


శా.

నేరం బేనె యొనర్చి మా చెలియతో నేర్పుల్ పచారింపఁగా
నేరా నీకని యెచ్చులున్ పలుక నేమీ నేరమై తోచునో?
రా రమ్మంచును బ్రేమతోడ ననుఁ జేరంబిల్చి లాలించ వీ
వేరా? రాజశశాంక! యింక నడురే యేలాగు వేగింతురా?

105


సీ.

తలఁచవైతివి గదా? కలధౌతమయసౌధ
                 కలితమన్మథకథాకథనుసరణ
లెన్నవైతివి గదా సన్నతపున్నాగ
                 పారావతారావపరిచయములు
చూడవైతివి గదా! క్రీడాగృహక్రీడ
                 గూఢగాఢనవోపగూహనములు
తెలియవైతివి గదా? దృఢమానమానస
                 ప్రమదార్థశపథసంభాషణములు

గీ.

కొదనునెల నెలవంకల కొదలు దీర్చు
నభినవనఖాంకములు గుబ్బలందు వెలయఁ
ఋణయబంధంబు వేఱైన పట్ల నిపుడు
మఱచుటే వింత తొల్లింటి మమత లెల్ల.

106


మ.

చనవుల్ మీఱఁగ మాటలాడుటలు బాసల్ చేసి నమ్మించుటల్
వినయంబుల్ ప్రణయానుబంధములు నీవే వేఱఁ గావింపఁగా
నిను నేఁ గోపముతోడ నేమనిన దానింబట్టి పాలార్తురా?
వనితామన్మథ! నేర్పు నేరములు లేవా? చూడ నెవ్వారికిన్!

107


మ.

అలుకల్ దీఱిచి ముద్దు పెట్టుకొని సయ్యాటంబునన్ శయ్యపై
కలపారావతకంఠనాళరవముల్ గల్పించి మెప్పించి నన్
పులకల్ జాదుకొనంగ నేలుకొను నేర్పుల్ సాక్షి నీయోర్పులున్
లలనామోహనపంచబాణ! యిఁక నేలా? చాలు సిగ్గయ్యెడిన్.

108


సీ.

గుబ్బలపై వాఁడికొనగోరు లుంచరా!
                 నెలవంకబింకంబు నిలుచుగాని
చక్కెరకేమ్మోవి చవిచూడ నీయరా!
                 చిగురుగుంపులసొంపు చెదఱుగాని
జెళుకుకెందళుకుచూపులచేత చూడరా!
                 కలువరేకులఢాక కదలుగాని
వలితేనెతేటలు చిలుక మాటాడరా!
                 చిలుకల గరువంబు చిటులుగాని


గీ.

ఎన్ని పలికితి నవి మది యెన్ని నీవు
దీనమందార! నన్ను నధీనఁ జేసి

మారు నదలించి యేలు వేమారు దయను
రాజవదనలతోడనా రాజసములు?

109


ఉ.

వాటములైన బంగరుకవాటములం గలయట్టి యందముల్
నీటున మీటు నీయురము నిండఁగ గుబ్బల నాని పల్మొనల్
నాటఁగ నొక్కి చొక్కి జతనంబుగ వాతెరతేనె యానకే
మాటలఁ దీరునా, యువతిమన్మథ? మన్మథతాపవేదనల్?'

110


గీ.

అనుచు నాథుని వేడుచున్నట్టివేళ
వనితచందంబుఁ దెలియంగ వచ్చినట్టి
యనుఁగునెచ్చెలి నెమ్మది హర్ష మంద
మందహాసంబుతోడ నమ్మగువ కనియె.

111


చ.

పలికిన మాఱుపల్కనని పంతములాడితి వింతమాత్రమా!
నిలిచిన వానిచెంతలనె నిల్వనటంటివె యొంటిపాటునం
గలికిరొ! నేఁడు చిత్రఫలకంబున నాభువనైకమోహనున్
సొలపున వ్రాసి వేఁడికొనఁజూచినఁ జూచినవారు నవ్వరే!

112


చ.

అన విని మానినీతిలక మప్పుడు నెచ్చెలితోడ నిట్లనున్
"వినుము లతాంగి! యేఁ గొలుచు వేలుపు వేఁడితిగాని నెమ్మదిం
గినుక దొఱంగ వల్లభునిఁ గీర్తన సేయఁగ నీవు వింటివా?"
యను సమయంబునందు దరహాసము మోమున నంకురింపఁగన్.

113


గీ.

మోహనాకారరేఖల మురువు గన్న
యాత్మవిభుఁ డంత తనచెంత కరుగుదేఱ
నవనతాననయై యున్న యతివఁ జూచి
హేతుగర్భంబుగాఁ జెలి యిట్టులనియె.

114

చ.

వలపులవింటివాని చెలువంబున గెల్చినయట్టి వేలుపుం
గలికిరొ! నేఁడు చిత్రఫలకంబున నేర్పున వ్రాసి యొంటిగాఁ
బలుమరు వేఁడుచున్న నట భాగ్యవశంబున సుప్రసన్నుఁడై
నిలిచెను వాఁడు నీయెదుట నేఁడు ఫలించెను గోర్కులన్నియున్.

115


క.

అని యొకపని నెపమున న
య్యనుఁగుంజెలి యవలి కేఁగ నవనతముఖియౌ
వనజాననఁ గనుఁగొని విభుఁ
డనునయపరుఁ డగుచుఁ బలికె నాదర మొప్పన్.

116


శా.

'నీలేందీవర దామధామముల సందేహంబు గల్పించు నీ
లీలాలోలకనీనికల్ సొలపు హాళిం జూప నన్ జూడవే?
ఏలే కోపము? లేటికే చలము? లిం కేలే వృథామౌనముల్
లోలా! పులకండముల్ గులుకుపల్కుల్ పల్కి లాలింపవే!

117


సీ.

కాంత! నీనిడువాలుకలికిచూపులుగాక
                 కలువలు తాపంబు నిలుపఁగలవె!
కొమ్మ! నీవలిగబ్బిగుబ్బచన్నులుగాక
                 యలరుగుత్తులు కాఁక నాఁచఁగలవె?
చిలుకలకొలికి! నీచిఱుతనవ్వులుగాక
                 రేయెండశిఖల వారింపఁగలవె?
ముద్దియ! నీ తేటముట్టు నెమ్మోము గా
                 కంబుజంబులు వేఁడి నడపఁగలవె!

గీ.

అంగనామణి! నీమోహనాంగములకు
నెన్న వీటికి నంతరం బెంత యనక
పోల్చి విరహాగ్ని వీటిచేఁ బోవుననెడు
నేర మెన్నక నన్ను మన్నింపవలయు.

118


చ.

సొలసిన నీవిలాసములఁ జొక్కినవేళలఁ బల్కరించి యేఁ
బలుకక యున్న వేఱొకనిపై మనసాయని యల్గి నీవె యేఁ
గలిగినఁ జూచి యంత బిగిగౌఁగిటఁ జేర్పుదు విప్పు డక్కటా!
కలికిమిటారి! ఏమిటికిఁగా వలరాయని కప్పగించెదే?'

119


గీ.

అనుచు మాధవుఁ డీరీతి యనునయింప
కోపసంతోషములు పెనఁగొనఁగఁజూచు
సొలపుఁజూపుల జాడలఁ జూచి వేడ్క
కౌఁగిటను జేర్చి రుక్మిణీకాంత నంత.

120


సీ.

కురులు నున్నఁగ దువ్వి విరులు పైగానరా
                 కుండ వంకఁగ గాసెకొప్పు వెట్టి
చెమట పావడ నొత్తి చెక్కునఁ గుంకుమ
                 బాగుగా వలరాచపడగ వ్రాసి
మెలిగొన్న హారముల్ మెల్లఁగ విడిపించి
                 కులుకుగుబ్బలమీఁద కుదురుకొల్పి
చెదరినతిలకంబు చిటులఁగ సారంగ
                 నాభిచే కొనఁగోర నాభిఁ దీర్చి


గీ.

కలయ నెమ్మేన నేర్పున గడమలందు
నందచందుబులను గళలంటి కరఁచి
యంగనామణిహృదయంబునందు నపుడు
పాదుకొను కోపమును 'లేదు బంతి' యనియె.

121

క.

కలగలుపు వలపు మక్కువ
జిలిబిలికందువుల మాట చిఱుసోఁకులచేఁ
జెలి గరఁచె కాంతుఁ డవియే
మలయజగంధికిని వశ్యమంత్రము లయ్యెన్.

122


ఉ.

చెక్కునఁ జెక్కుఁ జేర్పుచును చిన్నిమెఱుంగులమోవి
పల్కొనన్
నొక్కుచుఁ జొక్కుచున్ వలపు నూల్కొన నుల్లము పల్లవింపగా
కక్కసపుంబిసాళి వలిగబ్బిమిటారపుకోడెగుబ్బలం
జిక్కఁ గవుంగలించి మదిఁ జెందిన రాగముపెంపుసొంపునన్.

123


గీ.

గరఁగి కరఁగించి మిగుల వక్కరలు మీఱ
కజగొఱలు లేని చెయ్వుల నాదరించి
మోహనాకారుఁ డాజగన్మోహనాంగి
కాంక్షితంబుల సఫలముల్ గానొనర్చె.

124


చ.

అలఁతలు చూపు చూపుల యొయారములున్ వడఁ దేఱు మోములున్
మొలచిన ఘర్మవారికణముల్ బిగిఁదప్పిన చిత్రకంబులున్
పలచనయైన మేనికలపంబులు వేఱొకపొల్పుఁ దెల్పఁగా
నలరెను వారియందు సురతాంతవిలాసవిశేషవైఖరుల్.

125

ఆశ్వాసాంతము

శా.

భద్రశ్రీహరిణాదికారణయశఃపంచాస్య! పంచాస్యజి
ద్రౌద్రశ్రీనతరక్షకశ్వకృతిసంధాటీక! ధాటీకథా
భద్రాత్మీయభుజార్జితారిరమణీపాంచాల! పాంచాలభూ
మద్రక్షోణికరూశదేశముఖసీమాధార మాధారకా!

126

క.

మదనాగలసితసదనా!
సదనాంతరబోధనైకచతురిమవదనా!
వదనారదనుతకదనా!
కదనాదరరహితహృదయ! కాంతామదనా!

127


పం.

కఠారికాహఠాపతత్ప్రగల్భతాశఠారిరా
ట్కఠోరకంఠలుంఠనాలుఠత్సముత్కటప్రయు
క్కుఠారికఠోరచంద్రకోణనామభాగ్యభా
క్పిఠాపుఠాగడావజీరబృందబృందవందితా!

128


క.

భావానుభావ భావిత
భావజ! జాత్యశ్వకలితబహువిధధాటీ
దావనవల్గనవేష్టన
రేవంతక! 'ముద్దుచంద్రరేఖా'కాంతా!

129


గద్య.

ఇతి శ్రీమత్కాళహస్తీశ్వరకరుణాకటాక్షలబ్ధసిద్ధసార
స్వతనయ, చెంగల్వ వేంకటార్యతనయ, విజయరాఘవ
భూప్రసాదాసాదితవివిధరాజచిహ్నచిహ్నితభాగధేయ,
కాళయనామధేయ ప్రణీతంబైన రాజగోపాలవిలాసంబను
మహాప్రబంధంబునందుఁ బ్రథమాశ్వాసము.

130