రసికజనమనోభిరామము/ప్రథమాశ్వాసము

వికీసోర్స్ నుండి

శ్రీరస్తు

ఓం నమః కామేశ్వర్యై

రసికజనమనోభిరామము

పీఠిక


మీఱం దనపెండ్లివేళ నొడలం జెన్నారుభూషామణి
స్తోమంబుం బొడగాంచి శైలసుత చేతోవీధి గంపింపఁ ద
ద్భామారత్నముకొప్పు బర్హ మని యప్పాము ల్దల ల్వంప న
త్యామోదంబున నవ్వుశంభుఁ డిడు మా కశ్రాంతసౌఖ్యోన్నతుల్.

1


సీ.

చిన్నారిజాబిల్లి సేసక్రొవ్వెదపువ్వు, మెట్టరాచబిడారు పుట్టినిల్లు
మగనిసామేను హేమపుటోలగపుమిద్దె, కలుములజవరాలు చెలిమిబోటి
తెఱగంటికల్కిముద్దియ లూడిగపుఁజెలు, ల్కడిఁదిబొబ్బమెకంబు కత్తలాని
యాముటేనుఁగుమోముసామి ముద్దులపట్టి, బక్కరవిరిబోఁడి సవతిమిన్న


తే.

గాఁగ జగములు గడితంపుఁగని రంపు, పెంపు రాణింప నెపుడుఁ బాలింపుచుండు
సర్వమంగళ మాకు నఖర్వసర్వ, మంగళావాప్తి నొడఁగూర్చి మనుచుఁ గాత.

2


చ.

పొలుపుగ గొల్లక్రొందలిరుఁబోఁడులకుల్కుమిటారిగుబ్బిగు
బ్బలు బలువెన్నముద్ద లని భావమునం దలపోసి డాసి కం
చెల వెడలించి మాటిని జేతుల నొక్కుచు హొంతకారి యై
యలఁతిగ నవ్వువెన్నుఁడు దయామతి మాకుఁ బ్రసన్నుఁ డయ్యెడిన్.

3


మ.

దివిషద్రాజముఖీలలామఫలకోత్కీర్ణస్ఫురత్కుంకుమ
ద్రవలాక్షారుణితాంఘ్రిపద్మ యగుచు న్రాణించునప్పద్మభూ
భువనోత్కృష్టమహాప్రబంధఘటనాపూజ్యైకసామ్రాజ్యవై
భవ మెల్లప్పుడు మా కొసంగు యనుకంపాలీలలం బ్రోవుతన్.

4


మ.

నలుమోము ల్దన కబ్బి యుండుటకు నానందంబుతో నోలిమైఁ
బలుకుందొయ్యలిచెక్కులుం బెదవియున్ ఫాలంబుఁ జుంబించి చే

తులవెంట న్వలిగబ్బిగుబ్బచనుబంతు ల్వట్టి క్రీడాకళా
కలన న్మించువిరించి మా కొసఁగు సాకల్యాయురారోగ్యముల్.

5


సీ.

అమరశిరఃకిరీటాంచలమణివిభా, నీరాజితాంఘ్రి యేసారసాక్షి
కుందేందుమందారచందనఘనసార, నీహారవర్ణ యేమోహనాంగి
హేమాబ్జకబళనోదామమత్తమరాళ, ఘోటకారోహ యేబోటిమిన్న
వరదండపుస్తకవల్ల శుకరాజ, రాజత్కరాబ్జ యేరాజవదన


తే.

యమ్మహావాణి పికవాణి యజునిరాణి, సైకతశ్రోణి మదచంచరీకవేణి
పరమకల్యాణి కిసలయపాణి మాకు, మంజువాగుంభన లొసంగి మనుచుఁ గాత.

6


మ.

ప్రమథాధీశశిరోగ్రభాగవిలసత్ప్రాలేయరుక్ఖండముం
బ్రమదం బొప్పఁగఁ జూచి మోదకముగా భావించి యంచత్కరా
గ్రము నే చాఁచి కడంకతోడఁ దివియం గామించి మే లెంచుదం
తిముఖుం డెప్పుడుఁ బ్రోచు మత్కృతి దయార్ద్రీభూతచిత్తంబునన్.

7


మ.

చిరభక్తిప్రతిభావిభాసితుఁడ నై చింతింతు నశ్రాంతముం
బరవాదిప్రమదద్విపేంద్రపటలీపంచాననశ్రేష్ఠు బం
ధురతేజోనిధి దెందులూరికులపాధో థోరాశిరాకానిశా
కరుని న్లింగయసద్గురూత్తముని సాక్షాచ్చంద్రచూడాకృతిన్.

8


సీ.

గురుతరకౌండిన్యగోత్రవిఖ్యాతుండు, బయ్యనామాత్యుఁ డేప్రభునితాత
నిరతాన్నదానవర్ణితయశస్సాంద్రుండు, తిమ్మనసచివుఁ డేధీరుతండ్రి
ఘనులు జగ్గనయు సింగనయు మంత్రియు నర, సనయును నేధన్యుననుజవరులు
తిమ్మయాఖ్యుఁడ నేఁ బ్రథితులు సింగనయు జ, గ్గనయు సూరనయు నేయనఘుసుతుల


తే.

మతులమతి రాజమాంబ యేయధిపుజనని, యతిపతివ్రత లక్ష్మి యేచతురురాణి
యట్టి శ్రీకూచిమంచివంశాబ్ధిచంద్రు, మజ్జనకు గంగనామాత్యు మదిఁ దలంతు.

9


మ.

తన రాక న్నుతి సేతు సేతుహిమవత్సంగాప్తశైలాంతరా
వనిభాగావిరతప్రసిద్ధకవివిద్వన్మాగమాఁద్రాదియా
చనకానీకనిరంతరప్రణుతభాస్వద్దానవిద్యాపరా
యణు భూభృజ్జనపూజ్యు మజ్జనకు గంగామాత్యచూడామణిన్.

10


చ.

మనమునఁ బ్రస్తుతింతు బుధమాన్యుల ధన్యుల జగ్గనార్య సిం
గన నరసప్రధానవిదితాఖ్యు ల మంత్రికులేంద్రముఖ్యులన్
ధనదసఖాంగ్రిభక్తిసముదంచితచిత్తుల సాధువృత్తులన్

జనవినుతాన్నదానగుణసంతతభవ్యుల మతిపితృవ్యులన్.

11


మ.

కవిచూడామణుల న్మహాఘనుల వేడ్కం గొల్తు వల్మీకసం
భవు వ్యాసు న్జయదేవు భోజనృపతి నా్బాణు న్మయూరాహ్వయున్
శివభద్రార్యుని గాళిదాససుకవిన్ శ్రీహర్షుని న్మాఘు భా
రవిఁ జోరు న్భవభూతి మల్హణుని వాక్ప్రాచుర్యసంసిద్ధికిన్.

12


సీ.

బహుముఖవక్త యై పరఁగుకుండలినాథు, నఖిలకళాధాముఁ డైనసోముఁ
బరజయోన్నతి నెన్నఁబడువీరభద్రుని, సర్వజ్ఞతాగుణశాలి భీముఁ
జతురాస్యు వాగనుశాసను విబుధప్ర, కరముఖ్యు నమరేశుఁ బురుషసింహుఁ
డనఁ దగశ్రీనాథు ఘనమార్గవర్తియై, కరము వెలుంగుభాస్కరబుధేంద్రు


తే.

సతతలోకేశ్వరప్రపూజితనితాంత, రాజమానప్రభావుని రంగనాథు
మఱియు నాంధ్రకవిత్వనిర్మాణకుశలు, లగురుహాకవివర్యుల నభినుతింతు.

13


తే.

భంగమున దాఁగి పంకంబుపాల లోఁగి, సరసులకుఁ గాక యెఱుకలు సడల నెఱసు
లేఱుచు జడాశయంబుల నెపుడు మెలఁగు, కుకవినికురుంబముల లెక్కఁ గొనఁగ నేల.

14


సీ.

అన్యపదాదాపహరణప్రవీణులు, సమధికసుశ్లోకవిముఖమతులు
గురువు లఘువర్ణపరిశోధనాజ్ఞులు, సదమలసాధులక్షణరహితులు
చిరత ఘఃసుఖశ్రేయోవిదూరులు, ప్రతిపదాత్యంతకువాదరతులు
సంతతసమధికసమతప్రకంపితు, లతితరదుర్వృత్తయుతులు నైన


తే.

ధూర్తకవిరాజుల కొకింతఁ దొలఁగవలయు, నఖిలదిగ్దేశనృపసభాఖ్యాతపూత
భారతీలబ్ధకవితానిభాసమాన, సారసామ్రాజ్యఖని యైనసజ్జనుండు.

15


సీ.

బహుపురాణములు ప్రబంధము ల్లక్షణ, శాస్త్రము ల్వివిధకోశములు నాట
కము లలంకారశాస్త్రములును శోధించి, ప్రౌఢిమై నేతత్ప్రబంధ మే నొ
నర్చెద నిందులోన నొకించు కొక్కెడఁ, బరికింప నెఱసులు దొరలి యున్న
నెన్నిక సేయక హితకరుణామతిఁ, గనుఁగొని సారంబె కైకొనుండు


తే.

మంచితేనియ జనులు వేమఱు కడంక, నరసి వడపోసి యునిచిన నందులోన
నలుసు లొకకొన్ని యందందఁ గలుగకున్నె, భవ్యమతులార కవిబుధప్రవరులార.

16


సీ.

వళులయొప్పిదమున వఱలునాశయమృదు, పదవిభ్రమంబుల బాగు మీఱి
కలితచంపకమాలికాసుకాంతిశ్రీల, సరసిజముఖవికాసములఁ దనరి

మహితచమత్క్రియామధురవాగ్రచనల, శుభలక్షణారూఢి సొం పెసంగి
ప్రవిమలశృంగారభావగౌరవమునఁ, గన దలంకారవైఖరులఁ జెలఁగి


తే.

ప్రబలుమత్కావ్యకన్యకారత్న మఖిల, రసికజనసంతతమనోభిరామ మగుచు
నిండుకొనుఠీవి నిద్ధరామండలమున, నసదృశవిలాసలీలల నలరుఁ గాత.

17


వ.

అని నిఖిలదేవతాప్రణతియు గురుచరణస్మరణంబును బితృపితృవ్యస్తోత్రంబును బురా
తనమహాకవివర్ణనంబును గుకవినిరాకరణంబును నాధునికసుకవివిద్వత్ప్రార్థనంబునుం
గావించి యష్టాదశాధికవర్ణనాన్వితం బగునొక్కమహాప్రబంధంబు నొనర్పఁ బూని
యున్న సమయంబున.

18


సీ.

పరిపరిపీలుకర్బురపురక్షణనుఁ డ, గ్రగశాపటికజుహురాణవప్త
పరవిపిండీవృషపదకదంబుఁడు మహా, కులకశయాలీనగురుకలాపుఁ
ఉడద్రిదారకసముద్యద్విస్మయవిదారి, నాగప్రహధసమున్నతతురుంబుఁ
డవిరలచంద్రమయాగారగానుఁడు, రీక్షపానారతప్రియసచివుఁడు


తే.

భద్రఖింఛోళుఁ డాశ్రితశూద్రధరుఁడు, నిగమరథ్యామృగుఁడు పీఠనిగమకులుఁడు
పత్ప్రహారేట్సమాహ్వయప్రభుఁడు నాదు, స్వప్నమున నొక్కనాఁడు సాక్షాత్కరించె.

19


తే.

అట్లు సాక్షాత్కరించి మహాత్ముఁ డైన, పిఠాపురీకుక్కుటేశ్వరాభిఖ్యసాంబ
శివుఁడు నిస్తులకరుణార్ద్రచిత్తుఁ డగుచు, నింపు దళుకొత్త ననుఁ జూచి యిట్టు లనియె.

20


సీ.

ప్రతిభమై రుక్మిణీపరిణయంబును సింహ, శైలమాహాత్మ్యంబు నీల పెండ్లి
కథయును రాజశేఖరవిలాసంబును, నచ్చతెనుంగురామాయణంబు
సారంగధరనృపచరితంబు సాగర, సంగమాహాత్మ్యంబు రంగు మీఱు
సకలలక్షణసారసంగ్రహంబు నొనర్చి, కృతులు మాపేర నంకితము చేసి


తే.

నట్టిప్రోడవు నీ విపు • డలఘుమతివి, రహి నొనర్పఁగఁ బూనిన రసికజనమ
నోభిరామముఁ గృతి సేయు మలర మాకుఁ, దిమ్మకవిరాయ సకలసుధీవిధేయ.

21


క.

నరవరు లిడుమణిభూషా, కరితురగాందోళికాదిఘనవిభవము ల
స్థిరము లవేటికి నింకే, నిరవుగ నిహపర సుఖంబు లిడియెదఁ జుమ్మీ.

22


వ.

అని యాన తిచ్చి యప్పరమేశ్వరుం డంతర్హితుం డగుటయు నేను నమందానందకం

దళితహృదయారవిందుండ నై యమ్మహాదేవునకు నిమ్మహాప్రబంధంబుఁ గృతి సేయ
నిశ్చయించి.

23


సీ.

నిఖిలవిద్యాభ్యాసనిపుణుఁడు మత్సహో, దరుఁ డగుజగ్గసత్కవితనయులు
ఘనులు తిమ్మనయు సింగనయును లేఖక, పాఠకు లై కృతు ల్ప్రబలఁ జేయఁ
బేర్మిఁ గాంచినవాఁడఁ బీఠపురప్రాజ్య, రాజ్యాధిపత్యవిరాజమాన
భూరివైభవుఁడు నద్భుతపరాక్రముఁడును, దానకళాధురంధరుఁడు నైన


తే.

రావునీలాద్రిమాధవరాయనృపతి, చేతఁ గవిసార్వభౌమవిఖ్యాతబిరుద
మందినఘనుండఁ దిమ్మయాహ్వయుఁడ నేను, విమలతరభక్తి మదిలోన విస్తరిల్ల.

24

షష్ఠ్యంతములు

క.

శ్రీదునకు సకలముదిత, శ్రీదునకు నితాంతభృంగిరిటపటునటనా
మోదునకు నిగమసంస్తుత, పాదునకు హృతాఖిలాఘభవఖేదునకున్.

25


క.

భర్గునకు దళితపురభట, వరునకుఁ బ్రకీలితాపవర్గునకు లస
న్మార్గునకుఁ జిరకృపార్ద్ర, సర్గునకు నితాంతసుగుణసంసర్గునకున్.

26


క.

శంభునకు జితగజాసుర, దంభునకు సమస్తబుధవితానావనసం
రంభునకు దానవిద్యా, రంభునకుఁ బ్రహృష్టమౌనిరాడ్డింభునకున్.

27


క.

భీమునకు రజతభూధర, ధామునకు సుధాంశుకోటిధామునకు మహో
ద్దామునకు శ్రితజనావన, కామునకు హృతోగ్రపాతకస్తోమునకున్.

28


క.

శర్వునకు సతతముదితసు, పర్వునకు సమస్తభువనపావనలీలా
ఖర్వునకు దళితదుర్జన, గర్వునకు మహోక్షరాజగంధర్వునకున్.

29


క.

స్థాణునకు సతతపరిచిత, బాణునకు సరోరుహాక్షబాణునకు జగ
త్త్రాణునకు హృతకృతాంత, ప్ర్రాణున కతిసత్యవాక్యపరిమాణునకున్.

30


క.

భవునకు నిరుపమశుభవై, భవునకు సంఘటితసకలభవున కురుప్రా
భవునకుఁ గృతపరిపరిపరి, భవునకు భవునకు నిరస్తభారభవునకున్.

31


క.

రంగజ్జటాగ్రవిలస, ద్గంగాప్రాలేయఘృణికి ఘనవితరణి కు
త్తుంగగుణమణికిఁ గుక్కుట, లింగప్రభుమణికిఁ గుండలీకృతఫణికిన్.

32


ఆ.

అర్పణముగ నమ్మహాదేవుకృప నే న, నూనలీలఁ గూర్పఁ బూనినట్టి
రసికజనమనోభిరామం బనెడుకృతి, కిలఁ గథావిధాన మెట్టులనిన.

33

కథాప్రారంభము

క.

మును నారదమునివరునకు, మునుకొని పుణ్యేతిహాసములు నలువ దగన్
వినుపించుచుండి యొకకథ, యెనసిన కృపఁ దెలుపఁ బూని యిట్లని పలికెన్.

34


శా.

చంచత్కాంచనసౌధభాగలసితశ్యామాశుభాంగప్రభా
భ్యంచద్విభ్రమచంచలాభ్రమకచాభ్రభ్రాంతిలీలావల
త్కించిల్లాస్యకళావిలోలఫణిభుక్కేకారవాక్రాంత మై
కాంచెన్ బేర్మిఁ బురోత్తమం బొక టిలం గల్యాణనామంబునన్.

35


సీ.

ప్రాకారములడంబు పరిఘలచెలువంబు, వనములపెంపు జవ్వనులసొంపు
బావులఠీవి కప్రపుధూపములతావి, జగి లెలరంగు రచ్చలహొరంగు
గణికలయొప్పు బంగరుమాడువులవిప్పు, గోపురంబులమించు కోట్లసంచు
తేరులతీరు ముత్తెపుఁబందిరులసోరు, నగరులకల్మి యేనుఁగులబల్మి


తే.

కత్తలానులయేపు మేల్కట్లకోపు, మదురుగోడలమెఱపు వాల్మగలయొజఱపు
తలుపుగమిపీలు నిలువుటద్దములమేలు, దనర వెలుఁగొందు నాప్రోలు ధరణియందు.

36


మ.

పరిఘాంతర్విలసద్భుజంగయువతుల్ ప్రాకారశృంగాగ్రవి
స్ఫురదస్వప్నవధూమణీజనులకున్ శుభ్రారవిందంబు లం
పి రన న్మీఁదికి నేగు నంచ లమరీబింబోష్ఠు లింద్రోపలో
త్కరము ల్గ్రమ్మఱ వారి కంపి రన డిగ్గం బాఱుఁ దేఁటుల్ పురిన్.

37


శా.

తుండాగ్రంబులు చాఁచి యప్పురి మహోత్తుంగద్విపేంద్రంబు లు
ద్దండప్రక్రియఁ గ్రీడ సేయుచు వియద్గంగాసువర్ణాంబురు
క్కాండంబు ల్పెకలించుచో సుమపరాగంబు న్మది న్మేనులమ్
నిండం బంగరుకాఁడల ట్లలరు నున్నిద్రప్రభాలీలలన్.

38


తే.

అగము లుర్వీధరారాతి యాపనులకుఁ, దలఁ యప్పట్టణమునకు వలసి వచ్చి
డాఁగి యుండినఁ బౌరులు నాగము లని, క్రమ్మి యునిచిరి నాఁగనాగములుదనరు.

39
చ.

తలఁపఁగ దక్షిణోత్తరపదంబుల కుద్ధతి నేగి యాఱునా
ఱ్నెలలకుఁ గాని క్రమ్మఱఁగ నేరక యేలిక నేట ముంచు ని
చ్చలు నినుతేరిమావు లని సారెకుఁ గేరుచు దిక్కు లన్నియుం
గలయ నిమేషమాత్రమునఁ గన్గొని వే మఱలుం బురాశ్వముల్.

40


చ.

అనిలుఁడు లేడి నెక్కు జవ మారఁగ నప్పురిమేల్గుఱాలతోఁ
బని వడి పందెము ల్చఱచి పర్విడుచోటఁ గురంగ మెత్తి వై

చినచెలు వాయె నిప్పలుకు సిద్ధము గా దని యాడినం బ్రకం
పనునకుఁ గేలు సొట్ట యని పల్కుదురే కద లోకు లిద్ధరన్.

41


తే.

నాలుగును వేయి వక్త్రంబు లోలిఁ గలిగి, శ్రుతులు భాష్యంబు నడపుట ప్రతిభ యనుచు
విధిఫణీంద్రుల నిరసించి వేదశాస్త్ర, ములు వచింతు రొక్కొక్క రాప్రోలిద్విజులు.

42


సీ.

బుధవత్సలులు కళాపూర్ణులు పరచక్ర, హరణులు కువలయాహ్లాదకరులు
వసుసమన్వితులు సర్వజ్ఞశిరోమణుల్, శుభలక్షణులు పరిశుద్ధమతులు
సహజలక్ష్మీకులస్తమికతతమస్కులు, మండలప్రభులు సన్మార్గచరులు
మిత్రానుకూలురు గోతాభ్యుదయులు జై, వాతృకు లోషధీశ్వరులు సుప్ర


తే.

సన్నతాభాస్వరులు పంకజాతదళన, చతురు లతిశీతలప్రదర్శను లుదగ్ర
మోహనాకారరేఖాసముల్లసితులు, రాజు లలరుదు రప్పురరాజమునను.

43


తే.

తనకుఁ దొమ్మిదిపాఁతఱ ల్థనము గల ద, టంచు జక్కులఱేఁడు గర్వించుఁ గాని
లెక్క యిడరానిరొక్కంబు లీడు లేని, కొలుచుగల వెన్న నవ్వీటికోమటులకు.

44


క.

అద్రులు తేజంబున నమ, రాద్రులు దానమునఁ గాంచనాదులు ధృతి సౌ
భద్రులు బవరంబున బల, భద్రులు భుజశక్తి నందుఁ బరఁగెడుశూద్రుల్.

45


సీ.

తమగానములకు 'సంతసిలి పున్నాగము, ల్ప్రస్ఫుటభోగలోలతఁ జెలంగ
దమవిహారముల కెంతయు భూజనుల్ చొక్కి, సుమనోవికాసవిస్ఫూర్తి నలరఁ
దమముఖాంభోజగంధములకు సరసాళు, లుప్పొంగి మదబుద్ధిఁ గప్పుకొనఁగఁ
దమమణినూపురధ్వనులకుఁ బరమహం, సలు పోలి మానసాసక్తి దఱుమఁ


తే.

దమమృదూక్తిసుధారసధారలకు న, శేషబుధపుంగవులు చెంతఁ జేరి నిలువఁ
జెలువముల కెల్లఁ బుట్టిన నెలవు లనఁగ, మెఱయుదురు ప్రోలఁ బుణ్యభామినులు లీల.

46


చ.

అపరిమితానురాగమున నప్పురిలోని బొజుంగుమిన్న లె
ల్లపుడు దినాంతవేళల హొయ ల్మెఱయ న్విహరింతు రెంతయు
న్విపణిగృహాంతరాగ్రమణినిర్మితకాంచనసాలభంజికా
లపనకపోలచుంబనకళావివశీకృతహృత్సరోజు లై.

47


సీ.

చామల కెందు నీ సరసత గలదె తొ, య్యలి యన వరియింపు నిలిచి చూడు
పడఁతి ని న్నంటి వెల్వడము కోర్కె ఫలించె, నన రాజభోగమే యతిశయిల్లు
నారుగన్నను జిత్త మలరెడిఁజెలియన్న, మది కొప్పు గంటె వేమఱుఁ జెలంగుఁ

బలుకొఱ్ఱ చూపక నిలు మింతె యనిన న, వ్వలఁ గంది కైసైగ మెలఁపఁదగునె


తే.

యనుచుఁ దముఁ జేరి నెఱజాణతనము వెలయఁ, బలుకు నెలకోడెప్రాయంపుఁబాంథజనుల
కింపు దులకింప మాఱ్మాట లిడుచు నుండ్రు, శాలిపాలీవధూటు లాప్రోలఁ జాల.

48


సీ.

సరసిజంబులు సారెసారెకు నెనయించి, యంబుజంబులు ప్రియం బలరఁ జేర్చి
చంపకమాలిక ల్సొం పెసంగ నమర్చి, విచికిలస్తబకము ల్విస్తరించి
యుత్సలమాలిక లొ పుగాఁ బొసఁగించి, కడుసుకేసరము లక్కఱఁ బెనంచి
లలి వెలయు నుపజాతులు నాడెముగ నిల్సి, మఱియుఁ బే రగువనమంజరులును


తే.

గరము మెఱయించి సుకవులకరణిఁ బెక్కు, చందముల నీటుఁ జూపుచు సరసులను బ్ర
బంధలీలల నలరింత్రు పటువిలాస, భాజనములందుఁ బుష్పలావీజనములు.

49


శా.

వీట న్మాటి కనంగసంగరకళావిక్లాంతకాంతామణీ
కోటీపీనపయోధరాగ్రవితతాంకూరన్నిదాఘోదక
వ్యాటీకాపహృతిక్రియారభటిఁ బెంపారుం బ్రభాతంబులం
బాటీరాచలకూటనిర్గతజగత్ప్రాణార్భకవ్రాతముల్.

50


చ.

పనివడి పంటపైరులకు బాళిమెయిం జనుచిల్కమూఁకలం
బనులకుఁ గ్రమ్మఱం దఱిమివైచు నుదంచితశాలిపాలికా
స్తనకలశద్వయీనిహితసాంకవగంధమలిమ్లుచత్వభా
గనిలకిశోరవాడరము లనారతము న్నగరాంతికంబునన్.

51


క.

ఆనగరికి నధిపతి యై, యానగరిపుకరణి ఠీవి నలరుచు నుండన్
భూనుతుఁ డర్చిష్మంతుఁడు, నా నెసఁగు నృపాలవరుఁడు నయతత్పరుఁ డై.

52


క.

ఆరాజమణికుమారుఁడు, మారుఁడు సౌందర్యమునఁ గుమారుఁడు కడిమిజ్న్
సూరుఁడు తేజంబున ఫణి, హారుఁడు గరిమన్ ఋతుధ్వజాహ్వయుఁ డెన్నన్.

53


సీ.

కాశకాశాధిపాకాశధునీహార, నీహారకలశవార్నిధులఁ దెగడి
సోమసోమామరసామజతారకా, తారకాదంబబృందముల నవ్వి
చంద్రచంద్రాతపచంద్రశారద, శారదాంభోదకేసరుల నెన్ని
గోపగోపారదేందూపలసంతాన, సంతానఫేనవజ్రములఁ గోరి

తే.

మీఱి తనకీర్తి జగముల మెఱయ నలరె, నిఖిలభూభరణోదగ్రనిజభుజాగ్ర
జాగ్రదుగ్రమహామండలాగ్రదళిత, దుర్హృదుర్వీభుజుండు ఋతుధ్వజుండు.

54


సీ.

కమనీయకలధౌతకాంతుల నిరసించి, ద్విజరాజనిబిడదీధితుల నెంచి
జలజభవప్రభాసముదయంబు జయించి, యమరవిద్రుమశోభ నపహసించి
పణ్ముఖజనకభాస్వద్విభావళి మించి, హంసమండలదీప్తి నావరించి
చారుపయోజాతభూరిద్యుతులఁ గుంచి, మంగళసద్రుచిమహిమ వంచి


తే.

తనసమంచితకీర్తిప్రతాపములు ది, గంతరంబుల వెలయ నుదగ్రలీల
వఱలె నఖిలధరాధురావహనముదిత, కరికమఠకిరిగిరిహరీశ్వరుఁ డతండు.

55


సీ.

కువలయంబున కార్తి గూర్పనియినుఁడు చ, క్రావళి నొంచక యలరురాజు
గోత్రవైరము గూర్చుకొననియంద్రుఁడు పుణ్య, జనులఁ గాఱింపనిచక్రవర్తి
పక్షపాతము లేక పరఁగుచుండువిరాటు, పాడి దప్పనిప్రజాపరివృఢుండు
కుజనులపొందు చేకొననిధరాధిపుఁ, డుగ్రుఁ డై ప్రజఁ ద్రుంపకుండు నీశుఁ


తే.

డౌర యితఁ డని బుధజను లభినుతింపఁ, వఱలెఁ దేజఃకళావైభవప్రభావ
జవవచఃస్ఫూర్తి ధృతిమహైశ్వర్యములను, విపులగుణపాళి యమ్మహానృపతిమౌళి.

56


సీ.

చాంచల్య మబ్జలోచనలచూపులయంద, కుటిలత సతులముంగురులయంద
కాఠిన్య మింతులగబ్బిగుబ్బలయంద, లేమి లేములమధ్యసీమలంద
బంధము ల్చందనగంధులరతులంద, జడత ముద్దియలనెన్నడలయంద
చిక్కులు మత్తకాశినులహారములంద, పీడ చేడియలకెంబెదవులంద


తే.

కాని మఱి యెందు నేనియుఁ గలుగకుండ, ధరణిఁ బాలించె నఖిలభూధవకులేంద్ర
కోటికోటీరమణివిభాంకురవిరాజ, మానచరణాబ్జయుగళుఁ డమ్మనుజవిభుఁడు.

57


తే.

దరికిఁ జేరిన నరికోటి దరికిఁ జేరు, శరము పూనిన నహితాళి శరము పూనుఁ
గొమరు మీఱినయారాచకొమరుతోడ, సరియె శూరులు మనుజకేసరియ కాక.

58


వ.

అట్లు సమగ్రలీలావైభవోదగ్రుం డగునమ్మహీపాలాగ్రగణ్యుం డమందానందకందళి
తహృదయారవిందుం డగుచు నొక్కనాఁడు.

59


సీ.

పగడంపుగుండ్రకంబములు మేలికడాని, దూలముల్ జాబిలిఱాలమెట్లు
పులుఁగుఱాపచ్చబోదెలు తళ్కుమగమాని, కంపుగోడలు తమ్మికెంపువెడఁద
తలుపులు పటికంపుద్వారబంధంబులు, తెఱగంటి రాచఱాతిన్నియలును
వైడూర్యవలభిక ల్వాటంపుగోమేధి, కపుజలయంత్రముల్ కడిఁదిముత్తి


తే.

యంపునేఁతలు పుష్యరాగంపుజాల, కములు రవికాంతమణివలీకములు రజత

ఫలకములు గల్గి నాడెంపుఁబనులబల్హొ, రంగుల ననారతంబుఁ జెలంగి మఱియు.

60


సీ.

జాలవల్లికలు పచ్చలగద్దెపీఁట హొం, బట్టుతివాసీలు వట్టివేళ్ల
సురటీలు మేల్పైఁడికురిచీలు నెత్తంపు, పలక నిద్దాజరబాజుజీబు
చందువా ముత్యాలజాలీలు చికిలిక్రొ, మ్మించుటద్దము లెనమించుతగటు
బాలీసు రతనంపుకీలుబొమ్మలు చిటి, చాపలు వెడఁదవింజామరములు


తే.

తమ్మపడిగలు మంచిగందంపుఁగోళ్ల, చిఱుతముక్కాలిపీఁట రాచిలుకపంజ
రములు చిత్రంపుదివ్వెగంబములు గలిగి, జానుదులకించుకొల్వు హజారమునను.

61


తే.

రాజగురుబుధకనివసుధాజనులును, మిత్రజాహీనకేతువుల్ మెఱసి కొలువ
నెంతయును దేజ మెసఁగ ననంతపదవి, నయ్యినుఁడు నిండుకొలువున్న యవసరమున.

62


సీ.

గొఱకయీఁటెలు మేటికఱకునారసములు, వంకకత్తులు పెడవంకవిండ్లు
నడునెత్తిసికలు గీర్నామంబు లేకువారు, మెట్టులు క్రొవ్వాడి మెఱుఁగుసురెలు
కావిలాఁగులు నీలికాసెలు వాగురుల్, గుద్దుకత్తులు నల్లగొంగడీలు
నలువుమీఱినకారుములుచ యొడళ్లు జుం, జురుగడ్డములు బలుకుఱుచద్రుళ్లు


తే.

వలుదసొరకాయదిప్పలు తులసిపేర్లు, గండ్రగొడ్డండ్లు చిక్కము ల్దండికోఱ
మీసము ల్గల్గి కొండఱుమృగయు లెదుటఁ, జేరి పొడఁ గని మిగుల జోహారు లొసఁగి.

63


సీ.

పులిగోళ్లు గజదంతములు పిల్లిగడ్డలు, చారపప్పు వెడందచామరములు
పద్దువాడేగలు పావురాయలు నెమ్మి, పించెంపుఁగుంచెలు పికిలిచెండ్లు
బిత్తరంపుజవాదిపిల్లులు ముద్దులే, జింకకూనలు నవసంకుమదము
పచ్చకస్తురివీణె లచ్చంపుదేనె, గజనిమ్మపండ్లు ద్రాక్షాఫలములు


తే.

పనసపం డ్లీడపండ్లు కొమ్మనఁటిపండ్లు, కప్పురము దబ్బపండులు నిప్పపువు
మొదలుగాఁ గానుకలు బట్టి మ్రోల నిలిచి, పలికి రిట్లని కేల్మోడ్చి ప్రభునిగూర్చి.

64


క.

విను జియ్య పొలముపట్టునఁ, గనుఁగొన నబ్రముగ నీపు కారుమెకము లా
మున బెల్లు మీఱి మెలఁగుచు, జనులకు గడుబీ తొనర్పఁజాగెం బెలుచన్.

65


సీ.

కణుచు లీర్నాలుగుకాళ్లమెకంబులు, బెబ్బులుల్ తోఁడేళ్లు బొబ్బమెకము
లెలుఁగులు గొఱపోఁతు లేఁదులు మనుఁబోఁతు, లెనుపోఁతులును గోఁతు లేనుఁగులును
దువ్వులు రేఁచులు చివ్వంగు లడిఁదపు, మెకములు సవరము మెకము లిర్లు
పందులు నక్కలుఁ బలుబూతపిల్లులు, కుందేళ్లు దుప్పులు కొండగొఱియ


తే.

లాది యగుదొడ్డమెకము లబ్బబ్బ యడవి, నెందుఁ జూచిన నెడ లేక యేపు మీఱి
తిరుగుచున్నవి యిం కేమి తెలుపఁగలము, సామి యవ్వాల్మెకంబులచంద మిపుడు.

66

సీ.

కౌఁజులు పూరేళ్లు కన్నెలేళ్లు నెమళ్ళు, లావుక ల్దోరువా ల్లకుముకులును
గొక్కెరల్ కక్కెరల్ గువ్వలు వెలిసెలు, నేలనెమళ్లును బోలుగలును
గారుకోళ్లు పసిండికంటె లేట్రింతలు, పాలలు పరుజులు పావురాలు
పికిలిపిట్టలు గడ్డిపిట్టలు గోవలు, బంగరుపిచ్చుకల్ పసపుముద్ద


తే.

లాదిగాఁ గలపులుఁగు లయారె బిట్టు, నెట్టుకొని కోనలోఁ గనుపట్టి యున్న
వధిప వేఁటకు వేంచేయ నర్హ మిప్పు, డనుచుఁ బల్కిన వారల నాదరించి.

67


క.

మృగయావిహారలంపటుఁ, డగుచు నపుడె చదరు డిగ్గి యతిరయమున న
జ్జగతీరమణశిరోమణి, తగ నంతఃపురికిఁ జనినఁ దత్సమయమునన్.

68


చ.

తడయక యూడిగంపునెలఁతల్ నృపు డగ్గఱి మానికెంపుబ
ల్తొడవులు వుచ్చి క్రొందడపుదోవతి గట్టఁగ నిచ్చి పచ్చఱా
బెడఁగుఁగడానిజీనిపని పెం పగుముక్కలిపీఁటమీఁద సొం
పడర వసింపఁ జేసి వినయంబుఁ బ్రియం బిగరొత్త నత్తఱిన్.

69


సీ.

మురు వైనహురుమంజిముత్తియంపుసరంబు, లుదుటుగుబ్బలమీఁదఁ బొదివియాడఁ
గరముల రత్నకంకణములు గాజులు, ఘలుఘల్లు మని తాళగతులఁ జెలఁగ
సొంపారుగడితంపుసోగముంగురులు నె, న్నొసలిపై ముసరి పెంపెసలు గూయ
మహనీయతాటంకమణిగణద్యుతులు క్రొం, దళుకులేఁజెక్కుటద్దములఁ బొదలఁ


తే.

గౌను నర్తింప నూర్పులు గందళింప, నలఁతిచెమ్మట నెమ్మేన నంకురింపఁ
బసిఁడిగిన్నెయలోనిసంపంగినూనె, వనజముఖి యోర్తు దల యంటె మనుజపతికి.

70


సీ.

గమగమవలచుచొక్కపుఁగమ్మకస్తురి, నలుగిడె నొకమదనాగయాన
కలయ గంధామలకం బిడె నౌదలఁ, దలకొని యొకముద్దు కలికిమిన్న
దోరంపుఁబన్నీటఁ దొరలించి జలకంబు, లార్చె నొక్కసరోరుహాయతాక్షి
తడయక నెమ్మేను నిడుసోగపెన్నెరుల్, దడి యొత్తె నొక్క కాంతాలలామ


తే.

జిలుఁగునిద్దంపుమడుఁగువల్వలు ధరింప, నిడియె నొక్కమనోజ్ఞరాకేందువదన
సికను నెత్తావి క్రొత్తగొజ్జెంగసరులు, చుట్టె నొకనీలవేణి యాక్షోణిపతికి.

71


తే.

నిలువుటద్దంబు ముంగల నిల్పి మేలి, కమ్మకస్తూరిరేక చొక్కముగ నొసలఁ
దీర్పఁగాఁ జేసె నొకవధూతిలక మప్పు, డొఱపు రాణింప నానృపాలోత్తమునకు.

72


క.

అగరుసితాభ్రజవాదీ, మృగమదచందనహిమాంబుమిళితం బై సొం
పుగ వలచుమేలికలపము, జగతీపతిమేన నొక్కసకియ యలందెన్.

73


క.

జిలిబిలివలిలేగాడుపు, లెలయఁగఁ బూసురటి విసరె నిమ్ముగ నొకశై

వలకచ కరకంకణములు, ఘలుఘ ల్లని మెఱయ రాజకందర్పునకున్.

74


సీ.

పులుఁగురాపచ్చబల్చిలుకతాళియ నొక్క, సుదతి పేరురమునఁ గుదురుపఱచె
సొంపారునాణిముత్తెంపుఁజౌకటు లొక్క, కలకంఠకంఠి వీనుల నమర్చె
గాటంపునెఱమానికపుటుంగరము లొక్క, తలిరాకుఁబోఁడి యంగుళుల నునిచె
మురుగులు నపరంజిమురిడీగొలుసు లొక్క, విమలాంగి హస్తహద్మముల నిడియెఁ


తే.

బసిఁడికమ్మరుపట యొక్కకిసలయోష్ఠి, మొలను దవిలించి సరపిణిగొలుసు లొక్క
తెఱవ వెరవార గుఱుతుగ నఱుత నించెఁ, జెలువు దైవార నారాజశేఖరునకు.

75


తే.

హరువు మీఱెడిపసిఁడిపళ్లెరమునందు, రసరసాన్నము లిడి యొక్కరాజవదన
యింపుసొంపులు వెలయ భుజింపఁజేసె, మణిగృహంబున నారాజమణిని నిలిపి.

76


క.

ఎంగిలి వార్వఁగ నీ ళ్లిడె, బంగరునెఱగిండితోడఁ బరువడి నొకసా
రంగవిలోచన యానృప, పుంగవునకు మదిని గూర్మి పొంగారంగన్.

77


తే.

తావికపురంపుబాగాలు తగటుఁబండు, టాకులును మేలివలిముత్తియంపుఁ గ్రొత్త
సున్నమును గూర్చి యొకప్రోడ యన్ను మిన్న, యన్నరాధీశునకు విడెం బంది యిచ్చె.

78


క.

అంతట నానృపశేఖరుఁ, డంతఃపురి వెడలి వేడ్క లంతంత కెదన్
దొంతర లై పొదువఁగఁ గడు, వింతగ మొగసాలకడకు వేంచేసి తగన్.

79


సీ.

భేరులు కాహళు ల్పిల్లగ్రోవులు పెద్ద, బూరలు తుడుములు భోరుకలుగ
మణికేతనములు చామరములు ముత్యాల, గొడుగులు నరిగెలు గొఱలి తరలఁ
గరు లశ్వములు శతాంగములు వరూధినుల్, గడు నేలయీనినకరణి నడువఁ
గవులు గాయకులు మాగధులు వేశ్యలు నటుల్, పరిహాసకులు మ్రోల బలసి కొలువఁ


తే.

బసిఁడిబెత్తులవా రిరుదెసలఁ గ్రమ్మి, జతన దేవ పరాకు హెచ్చరిక యనుచుఁ
గరము వేడుకతో బరాబరు లొనర్ప, దొరలు ప్రెగడలు జనవరు ల్దోడ రాగ.

80


తే.

గడలు బాణా ల్పటాలు నగ్గలికఁ బూని, పరువడుల్ ద్రొక్కుకొనుచు నిబ్బరపుబీర
ములు గనంబడ సామరుల్ మ్రోలఁ జెలఁగి, సాదన లొనర్ప జట్లు హెచ్చరికఁ బెనఁగ.

81


తే.

వలలు బోనులు పెనుబల్లెములును ద్రుడ్లు, గండ్రగొడ్డండ్లు వాగురు ల్గడఁకఁ బూని
జాగిలంబుల డేగలఁ జాలఁ గొనుచు, మృగయు లొకకొంద ఱొకచెంతఁ దగిలి చనఁగ.

82

సీ.

తెలిహురుమంజిముత్తియపుఁజౌకటులక్రొం, దళతళల్ చెక్కుటద్దములఁ బొదలఁ
గలి రాచిలుక లెక్కల లెక్కగొననిసో, యగపుఁ జిచ్చలతాళి యఱుత మెఱయ
నవరత్నమయకంకణము లుంగరము లంగ, దము లాది యగుభూషణములు వెలుఁగఁ
జలువక్రొందగటంచుజిలుఁగుదుప్పటివలె, వాటు నెమ్మెయి వింతనీటు చూప


తే.

నిమ్ముగా మేల్పసిండితాయెతులు మొల్ల, విరిసరు ల్దట్టముగఁ జుట్టి వ్రేసినట్టి
యోరసిక మీఁదఁ బైచెంగు లునిచి కట్టి, నట్టిబురుసారుమాల్హొయ ల్బిట్టుదనర.

83


సీ.

తీరుగాఁ గొనగోర దిద్దిన నిడుదక, స్తురిరేక నొసల మేల్సొగసు లీన
మొలకట్టుకాసెలోపల బిగ్గఁ జెరివిన, బలుతమ్మికెంపులబాఁకు మెఱయ
దండగా మగరాలు దాపినబలితంపు, గండపెండెరము డాకాలఁ గ్రాలఁ
బస నించునిద్దంపుబవిరిగడ్డముసొంపు, రుచిరనీలోపలరుచులఁ దెగడఁ


తే.

గప్పురము సాంకవము మంచిగంద మగరు, గస్తురియుఁ జాఁదుఁ బన్నీటఁ గలపి యిడిన
కడిఁది మైపూఁతకలపంపుఁగమ్మతావు, లిమ్ముగా నెల్లదిక్కులఁ గ్రమ్మికొనఁగ.

84


సీ.

పసిఁడిపక్కెరజరబాజుమెత్తాముత్తి, యంపుజొంపములు చొక్కంపుఁగెంపు
టంకవన్నెలు గిల్కుటందియల్' జల్లులు, జిలుఁగుఁగ్రొందళుకుఁగుచ్చులతురాయి
చికిలికళ్లెము క్రొత్తముకమాలువాగె హెొ, రంగారుజరతారుటంగువారు
బిరుదుగంటలు గజ్జె లరిదిలకుంపటా, ద్రిప్పదండలు భూరిదివ్యమణులు


తే.

గలితశుభలక్షణము లురుగతులు గడిఁది, తేజు నందంబు జవమును దిటము గలిగి
రాణఁ దనరారు మేటిసామ్రాణి నెక్కి, హాళి దైవార నపుడు వాహ్యాళి వెడలె.

85


చ.

వెలువడి యోలిఁ బ్రోలి నడువీథి జనంబులుఁ బౌరకామినుల్
వలకొని మేలికప్రపునివాళు లొసంగుచుఁ బొంగి యొండొరుం
దలఁగఁగఁ ద్రోచి యానృపవతంసముఁ జూచి మదిం జెలంగుచున్
జిలిబిలిక్రొత్తముత్తియపుసేసలు చల్లిరి పెల్లు మీఱఁగన్.

86


చ.

జలధరవేణు లిందుమణిసౌధతలంబుల నిచ్చి మించుఁదీఁ
గల నిరసించు మైరుచులు గ్రాలఁగ ముత్తెపుసేసఁబ్రాలు భూ
తలపతిమీఁదఁ జల్లిరి ముదం బలరార ఘనాఘనంబు ల
గ్గలముగ నింగి నుండి వడగండ్లు పొరింబొరి రాల్చుకైవడిన్.

87


ఉ.

అన్నులమిన్న యోర్తు వసుధాధిపనందనుఁ జూడఁ గోరి వా
ల్గన్నులఁ గుంకుమంబు నొసల న్నవకజ్జలమున్ ధరించి లో
నెన్నఁగ రానితత్తరము హెచ్చఁగ నచ్చుగ రాజపద్ధతిన్

గ్రన్నన వచ్చె దానిఁ గని కామిను లందఱు నవ్వి రొక్కటన్.

88


క.

పడఁతుక యొక్కతె యపు డా, యొడయనిఁబొడ గనఁగ వచ్చె నొడ్డాణము వే
మెడ నిడి మొగపులతీఁగియ, నడుమున నిడి యలఁతివలపు నాటుకొనంగన్.

89


క.

వలఱేనిదెగడు నానృపు, చెలువము నలువారఁ జూచి చెలి యొక్కతె క్రొం
జిలిబిలివలపులఁ గులికెన్, జిలజిల మరునిల్లు పెల్లు చెమ్మగిలంగన్.

90


క.

వనజాక్షి యొకతె కరముల, ననబంతులఁ ద్రిప్పుకొనుచు నరపుంగవుఁ గ
న్గొనఁ జేరెఁ దనమిటారపుఁ, జనుగుబ్బలసౌరు దెలుపుచందము దోఁపన్.

91


సీ.

గురుతరవక్షోజకుంభసంభవగంధ, సిందూరరాగంబు చెన్ను మీఱఁ
గమనీయమేఖలాఘంటామహాఘళం, ఘళవిరావంబు లగ్గలికఁ జూపఁ
బ్రకటముఖభ్రమభ్రమరకానీకని, స్తులవినీలద్యుతు ల్దళముకొనఁగ
భూరిశోభాప్రకీరోరుశుండాదండ, విభ్రమం బభిరామవృత్తిఁ జెలఁగ


తే.

మందయానవిలాసంబు సందడింప, నతనుపట్టంపుటేనుఁగో యనఁగ నొక్క
కామినీమణి శృంగారగరిమ వెలయ, వచ్చెఁ జెచ్చెరఁ గుంభినీవరుని జూడ.

92


చ.

కులుకుమిటారిగబ్బిచనుగుబ్బలవ్రేఁగునఁ గౌనుఁదీఁగ కం
పిలి యసియాడ ముంగురులు బిట్టు మొగంబునఁ జిందులాడఁ గం
చెలముడి వీడఁ దత్తరపుఁజెయ్వుల నించుక నీవి యూడ వి
చ్చలవిడి జూడ వచ్చె నొకచంద్రనిభాస్య నృషాలమన్మథున్.

93


తే.

మీనలోచన యనుమాట మిథ్య గాక, యుండునట్టుగ నొక్కవేదండయాన
దండ దీయక నిల్చి యుద్దండలీల, ఱెప్ప వేయక యన్నేలఱేనిఁ జూచె.

94


తే.

అట్లు పురకామినీమణు లలమి చూడ, గాయకు ల్వాడ గణికాప్రకరము లాడ
బంట్లు వెన్నాడ నతులవైభవముతోడఁ, బురము వెలువడె రాజన్యపుంగవుండు.

95


క.

వెడలు తదంతికమున నొక, యెడ నెల్లర నిలువ నాజ్ఞ యిడి డెందమునం
గడలుకొనువేడ్కచే న, య్యొడయఁడు మృగయులును దాను నురుగతిఁ జనియెన్.

96


మ.

చని యాభూపవరుండు గాంచె నెదురన్ జంబీరనింబామ్లికా
పనసాశ్వత్థకపిత్థబిల్వబదరీభల్లాతకీకేతకీ
ఘనసారామలకర్ణికారవటమాకందార్జునాచ్ఛోటచం
దనమందారముఖాఖిలద్రునిచయాధారంబుఁ గాంతారమున్.

97


సీ.

ప్రత్యగ్రఫలవలద్రాక్షాలతాకీర్ణ, తరుణామ్రశాఖాకదంబకంబు
హిమవార్ఝరీప్రాంతసముదగ్రఘనసార, కదళీమహీరుహోద్గాఢతరము

పాటీరభూమిరుట్కోటరాంతర్లగ్న, ఫణిఫణామణివిభాభాసురంబు
పరిఫుల్లచంపక ప్రసవరజశ్ఛన్న, నికటసరస్తోయనిస్తులంబు


తే.

గంధవేదండమండల గండయుగళ, గళితదానాంబులహరికామిళితలలిత
పరిణతాస్తోకమాకందఫలరసప్ర, వాహమధుపూరవార మవ్వనము దనరె.

98


తే.

శల్యకదలిప్రియకశివాచమరకర్క్ష, కుంభరోహితనాగముల్ గొఱలు నందు
శల్యకదలిప్రియకశివాచమరకర్క్ష, కుంభరోహితనాగముల్ గొఱలు నందు.

99


సీ.

శక్రరంభాపారిజాతకైరావత, ఖ్యాత మై నాకలోకంబుకరణి
గాలవశాండిల్యకౌశికకపిలారి, వాస మై ధాతృనివాసమట్లు
వృషకుమారకశివాప్రియశివాపరికలి, తం బయి రజతభూధరముమాడ్కి
మదనసుపర్ణకమాధవలక్ష్మీస, నాథ మై వైకుంఠనగరిగరిమ


తే.

సంతతానంతనాగేంద్రసహిత మగుచు, విలసితం బగునలరసాతలముపోల్కి
నెసఁగు నక్కావనంబు మహీతలేశ, కుంజరున కాత్మఁబ్రమదంబు గూర్చె నపుడు.

100


తే.

భోగినీగాఢపరిరంభయోగమునఁ జె, లంగు నచ్చోటిమేటిభుజంగకోటి
పద్మినీభవ్యసంభోగపారవశ్య, లీలఁ బున్నాగనికరంబు గ్రాలు నందు.

101


క.

పరఁగె న్వనకరికిరికా, సరశరభతరక్షుఖడ్గశశవృకహరివా
నరగవయశల్యభలుక, హరిణవ్యాఘ్రాదిమృగకులాకుల మగుచున్.

102


వ.

ఇట్టివిచిత్రలీలావైభవంబులకుం దావకం బైనయక్కాననంబు ప్రవేశించి యానృపాల
శేఖరుండు.

103


క.

తమకమున మేల్సఠాణిన్, దుమికించుచు బరుగు వైచి దోర్బలవిభవం
బమర వనాంతరమునఁ బే, రిమి మెఱయఁగఁ గొంతతడవు ద్రిమ్మరుచుండెన్.

104


తే.

భటులు నటులనె నిర్భరార్భటులు నిగుడ, లగుడశరభల్లఘనసర్వలాత్రిశూల
పరశుకరవాలికాచ్ఛురీప్రముఖనిఖిల, సాధనము లూని యాఱేనిజంటఁ జనిరి.

105


తే.

పసిఁడిగొలుసులు జరతారుపట్టెలును, మేలిహొంబట్టుజూలును మెడల గొప్ప
వెండిమువ్వలు పొదలంగ గండుమీఱి, సాగె వేగఁ దుటారంపు జాగిలములు.

106


క.

మోరలు దివి కెత్తుచు భౌ, భౌరవములుఁ జెలంగె భషకము లపుడ
త్తారాపథ మంతయు నొక, తూరియె కబళింపఁ బూని తొడరె ననంగన్.

107


తే.

అపుడు గొందఱు మృగయు లయ్యడవిఁ దూఱి, ఘోరముగ నెల్లకడలఁ గగ్గోలు గాఁగ
గూఁత లిడి చోఁపుటయు మృగకులము గలఁగి, బయలు వెడలినఁ గాంచి యప్పార్థివుండు.

108


శా.

సారంగంబులఁ జెండి సింగముల నిస్సారంబుగాఁ ద్రుంచి భూ

దారవ్యాఘ్రతరక్షుఖడ్గశశగంధర్వంబుల న్గంధమా
ర్జారశ్వావిదనేకపర్క్షరురులన్ జక్కాడెఁ గుంతచ్ఛురీ
నారాచాసిగదాత్రిశూలముఖనానాదివ్యశస్త్రంబులన్.

109


సీ.

పులులమొత్తంబుల బోనులఁ జొరఁ దోలి, గండ్రగొడ్డ౦డ్లచేఁ జెండి చెండి
వలలలోఁ జిక్కి పోవఁగ లేనికుందేళ్లఁ, గదిసి పెన్గుదియలఁ జదిపి చదిపి
ఘుర్ఘురధ్వనులఁ బైకొనవచ్చుపందులఁ, గుఱుచబల్లెంబులఁ గుమ్మి కుమ్మి
బెదరి చెంగున దాఁటి చెదరి పాఱెడులేళ్లఁ, జెడుగువేపుల కెర చేసి చేసి


తే.

యసినికాతాంబకంబుల నచ్ఛభల్ల, శల్యశంబరహర్యక్షశరభగవయ
చమరసృమరాదికంబులఁ జంపి చంపి, వేఁట గావించి రా ఱేనివీరభటులు.

110


తే.

ఖడ్గముల ఖడ్గములఁ ద్రుంచి కడిమి నచ్చ, భల్లముల భల్లములఁ జంపి పెల్లు మీఱ
శల్యముల శల్యముల బిట్టు చదిపి పతికి, మోద మొసఁగిరి గొందఱు జోదు లపుడు.

111


సీ.

అదె కరి యిదె కిరి యదె హరి పోనీక, పొడు పొడుం డని బొబ్బ లిడెడువారు
పులిఁ గ్రమ్ముకొని పులిపులిగ నీఁటెలఁ గ్రుమ్మి, యేపుతో మగటిమిఁ జూపువారు
శరభావలుల ఘోరశరభావలు లెలర, నెలసి భూస్థలిఁ ద్రెళ్ల నేయువారు
సారంగముల మనసారంగఁ బైకొని, కొట్టి పెన్గుట్టలఁ బెట్టువారు


తే.

కొండగొఱియల దుప్పుల గండకముల, ఖండఖండంబులుగఁ బేర్మి నండగొనఁగఁ
జెండు బెం డాడి యుక్కునఁ జెలఁగువారు, నగుచుఁ గ్రీడించి రొకకొంద ఱధిపుమ్రోల.

112


సీ.

పసివట్టి తోఁకలు విసిరి తారుచుఁ జెవుల్, రికిరించుకొని దిశల్ రేసి చూచి
కొఱకొఱఁ బరువిడి మఱలి మోరలు చాఁచి, పొదలు దూఱుచుఁ జుట్టి పొంగువారి
గొదకొని నెమకుచు ఘుర్ఘురధ్వనులతోఁ, బైకొని వచ్చుబల్ పందిగమికి
మొగి చివ్వున మీఁది కెగసి కొంకులు గోశ, ములు మెడ ల్గలయాయములు విడంగఁ


తే.

గఱచి గీపెట్టునెడల నక్కజపులావు, లెలయఁ జీకొన నీడిచి యేపు చూపి
మృగయులకుఁ జాలఁబ్రమదంబు నిగుడఁజేసె, సరవి నయ్యెడ నాడెంపుజాగిలములు.

113


వ.

మఱియును.

114


సీ.

కౌఁజుపౌఁజులఁ బోవఁగానీక వాసియే, రణములఁ బఱపి శీఘ్రంబ తునిమి
పూరేళ్లపైఁ బెల్లుపొదలు చంచలపుడే, గలవైచి నెవ్వడి బిలుకుమార్చి
కన్నెలేడులమీఁద గాటంపుబీరంపుఁ, గణసరంబులఁ జొన్పి గం డడంచి

నేల నెమళ్ళపై నేలాపుడేగల, విడిచి యేపునఁ బీఁచ మడఁపఁ జేసి


తే.

పసపుముద్దయుఁ బాలయుఁ బచ్చఱెక్క, పసిడికంటెయుఁ బరజయుఁ బసులపోలి
గాఁడు ననువానిపై జలకట్టియలను, బంచి త్రుంచిరి కొందఱు బంటు లపుడు.

115


తే.

అట్లు దమకంబుచే వేఁట లాడి మృగమ, దంబుఁ జామరములు గజదంతములును
బిల్లిగడ్డలు పులిగోళ్లు పికిలిచెండు, నాదిగాఁ దెచ్చి యిచ్చి రయ్యవనిపతికి.

116


తే.

అంత నవ్వేఁట చాలించి యవనివిభుఁడు, సేన గొలువంగ నవ్వనిచెంత నొక్క
పటకుటీరంబు వేయించి పాయ కెదను, మించు వేడ్కలఁ దగ విశ్రమించి యుండె.

117


క.

అని వనజాసనుఁ డెఱిఁగిం, చిన విని సురమౌని ముదితచిత్తుం డైయా
తని నవ్వలికథ యెల్లను, వినిపింపు మటంచుఁ దివిరి వేఁడుకొనుటయున్.

118


మ.

పురుహూతాగ్ని పరేతరాట్పలభుగంభోధీశవాతార్థపాం
బర కేశాబ్జభవాచ్యుతాదికమహాబర్హిర్ముఖానీకభా
స్వరకార్తస్వరవిస్ఫురన్మకుటశశ్వత్పద్మరాగప్రభో
త్కరనీరాజితపాదపద్మయుగళా కాకోలభాస్వద్గళా.

119


క.

దృక్కర్ణకర్ణభూషణ, వాక్కాంతాకాంతముఖ్యవందిత మిహికా
రుక్కోటికోటిభాస్వర, కుక్కుటలింగాభిధాన కుతలనిధానా.

120


ఉత్సాహ.

పురవిభంగ ధరనిభాంగ భూశతాంగ శశివిభా
కరరథాంగ ముకుటగఁగ కరకురంగ సంహృత
స్ఫురదనంగ ధృతభుజంగ సుగుణసంగ మునిమనోం
బురుహభృంగ వృషతురంగ భువనమంగళప్రదా.

121


గద్యము.

ఇది శ్రీమత్కుక్కుటేశ్వరకరుణాకటాక్షనిరీక్షణసంలబ్ధసరసకవితాసామ్రా
జ్యధరంధర ఘనయశోబంధుర కౌండిన్యగోత్రపవిత్ర కూచిమంచిగంగనామాత్య
పుత్త్ర సకలసంస్కృతాంధ్రలక్షణకళాకౌశలాభిరామ తిమ్మకవిసార్వభౌమప్రణీతం
బయినరసికజనమనోభిరామం బనుశృంగారప్రబంధంబునందుఁ బ్రథమాశ్వాసము.