మొల్ల రామాయణము/సుందరకాండము/హనుమంతుఁడు లంకలో సీతకై కలయ వెదుకుట

వికీసోర్స్ నుండి

హనుమంతుఁడు లంకలో సీతకై కలయ వెదుకుట[మార్చు]

ఉ. మేడలు, రచ్చకొట్టములు, మిద్దెలు, మంచెలు, నాటకూటముల్‌
మాడువు, లంగళుల్‌, దనుజ మందిరముల్‌, పుర గోపురావళుల్‌,
వాడలు, దేవ గేహములు, వప్ర చయంబులు, వేశ వాటికల్‌,
గోడలు, నాదిగాఁగఁ గపి కుంజరుఁ డప్పుడు చొచ్చి చూచుచున్‌. 28
క. మఱువులు, సందులు, గొందులు,
నిరవులుఁ, జొరరాని చోట్లు, నేకాంతంపుం
దెరువులు, నంతఃపురములు
నెరవునఁ గపి కుంజరుండు వెదకం జొచ్చెన్‌. 29
ఆ. గాలి లీల, శీతకర కాంతి విఖ్యాతి,
ధూమ రేఖ రీతిఁ దూఱి చొచ్చి
యసుర మందిరముల నక్కడ నిక్కడఁ
గలయఁ దిరిగి వెదకెఁ గపివరుండు. 30
వ. ఇట్లు తిరిగి తిరిగి వెదకుచుఁ దన మనంబున 31
క. మాయా బలుండు రాక్షస
నాయకుఁ డిటఁ బట్టి తెచ్చినాఁ డతని మహా
కాయము నుగ్రాకృతిఁ గని
తోయలి తన తనువు నెచటఁ దొఁఱగెనొ యకటా! 32
మ. అటుగా కీతఁడె యన్య దేశమున నా యబ్జాక్షిఁ బెట్టించెనో?
ఘట యంత్ర స్థితి వార్ధి మధ్యమునఁ దాఁ గ్రౌర్యంబునన్‌ దాఁచెనో?
పటు బాహాబలశక్తి నాకభువన ప్రాగ్దేశమం దుంచెనో?
చటులోగ్రాకృతి రాము బాణములకున్‌ శంకించి యెందుంచెనో? 33
వ. అని యీ గతి వితర్కించి, 34
ఉ. త్రుంతు విధాత జందెములు, ధూర్జటి శైలము వ్రత్తు విష్ణు సే
వింతు, గ్రహంబులం దిరుగవేయుదుఁ, బూర్ణపయోధు లేడుఁ గా
రింతు, నుడు వ్రజంబులను లెక్కలు పెట్టుదు, భూతలంబు గ్ర
క్కింతు, నహీంద్ర లోకమును గీడ్పడఁ జేయుదు సాహసంబునన్‌. 35
ఉ. కొట్టుదు నింద్రుఁ, బావకుని గుండెలు వ్రత్తుఁ, గృతాంతుఁ జెండుదున్‌
బట్టుదు దైత్యునిన్‌, వరుణు మానముఁ గొందును, గాలిఁదూలఁగా
దట్టుదుఁ, గిన్నరేశ్వరుని ప్రాణము కల్గుదు, శూలిఁ ద్రోలుదున్‌
జట్టలు ద్రుంతు రావణుని, సారస లోచనఁ జూపకుండినన్‌. 36
క. ఈ మాడ్కిఁ జేయ దేవ
స్తోమమ్ములు చంద్ర వదనఁ జూపెద రొండెన్‌
ఏమిటికిఁ గీడు తగదని
రాముఁడు వల దనుచు మరలి రమ్మను నొండెన్‌. 37
వ. అని యనేక ప్రకారంబుల నాలోచించుచు నొక్క గోపురం
బారోహించె నా సమయంబున. 38
క. పావని కనుగొనె నప్పుడు
పావన విఖ్యాత సుగుణ భావోపేతన్‌
సేవిత దనుజ వ్రాతన్‌
భూవనితాజాత, నిత్య పూతన్‌, సీతన్‌. 39
వ. ఆ రామం జూచి, శ్రీరామచంద్రుని దేవిని గాఁ దలంపుచు, న
గ్గోపురంబునుండి డిగ్గి, సూక్ష్మ రూపంబుఁ గైకొని, శింశుపా
వృక్షం బారోహించి యందు. 40
సీ. పతిఁ బాసినట్టి యాపదలకంటెఁ బలుమాఱు-వివిధ మాయలచేత వేఁగి వేఁగి,
వీర దానవ కోటి వికృత వేషంబులు-కనుగొని చిత్తంబు క్రాఁగి క్రాఁగి,
తన దిక్కు లేమికైఁ దల్లడిల్లుచు నాత్మ-లోపల మిక్కిలి లోఁగి లోఁగి,
కర్ణ కఠోరంబుగా నాడు మాటలఁ-దొరఁగెడి కన్నీటఁ దోఁగి తోఁగి,
ఆ. రాముఁ దలఁచుకొంచు, రామునిఁ బేర్కొంచు-రామ! రామ! యనుచు రమణి పలుకఁ
గపివరుండు సూచి కామినీ రత్నంబు-సీత యనుచుఁ బొంగెఁ జిత్తమందు. 41
వ. అట్టి సమయంబున రావణాసురుండు సీతాపహృత హృదయుండై
పన్నీట మజ్జనం బాడి, దివ్యాంబరంబులు గట్టుకొని, కర్పూర
సమ్మిళితంబైన శ్రీగంధంబు నెఱ పూఁత పూసి, పారిజాత పుష్పంబులు
ముడిచి, మువ్వంపుఁ దావి నివ్వటిల్లెడు జవ్వాది మెత్తి, దశ
శిరంబులయందును రత్న మకుటంబులు ధరించి, మణి మండితంబు
లగు కుండలములు పూని, భాను ప్రభా విలసితంబులగు
పతకంబులును, ముక్తాహారంబులును, భుజకీర్తులును, బాహుపురులును,
నంగుళీయంబులును, నవరత్న స్థగితంబగు నొడ్డాణంబును
నమరించి, చంద్రహాస హస్తుండై, కందర్ప విలాస సుందరుండగుచుఁ
గిన్నరకింపురుష గంధర్వామరోరగ సిద్ధవిద్యాధరాంగన
లుభయ పార్శ్వంబుల నాలవట్టంబులు పట్టి, మౌక్తిక
ఛత్రంబులును, దాళవృంతంబులును, వింజామరంబులును ధరించి
రాఁ గొందఱు కర దీపికా సహస్రంబులు గైకొని ముందఱఁ
బిఱుంద నేతేర, నశోకారామంబునకుఁ జనుదెంచె, నప్పుడు
గంధవాతూలంబునం దూలు పుష్పలతయునుం బోలె వడవడ
వడంకుచుఁ, దన సుందరాంగంబులు, హస్తోరు వస్త్ర కేశంబుల,
మాటియుఁ, గప్పియు, నడంచియు, నివురు గప్పిన నిప్పు చందంబున,
ధూళి ధూసరంబగు రత్నంబు కైవడి, మేఘచ్ఛన్నంబగు
చంద్ర బింబంబు డంబున, నిత్తడి పొదిగిన కుందనంపు శలాక
లాగున, మాఱుపడియున్న జానకిని గదిసి, 42